శ్రీశైలంలోని మా ఇంటి ఎలాట్ మెంట్ ను రద్దు చేసినందున, కొన్ని ప్రయత్నాల తర్వాత 2007, మే 8 వ తేదీన మా ఇంటి నుండి బయటికి రావలసివచ్చింది.[సామాను అక్కడే ఉంచి, బయటకు వచ్చాము.] మే 5, 2007న దిగ్విజయ్ సింగ్ నుండి మాకు ఒక లేఖ వచ్చింది. రామోజీరావు చేత వేధింపబడుతున్నామనీ మేము సోనియాగాంధీకి వ్రాసిన లేఖ తనకు బదలాయించిందని, వాటిని తను నోట్ చేసుకున్నానని వ్రాసాడు. ఆ లేఖ తీసుకుని, 2007, మే 17 న ఢిల్లీలో అక్బర్ రోడ్ లోని ఏఐసిసి భవనానికి వెళ్ళి దిగ్విజయ్ సింగ్ ని కలిసాము. అతడు వై.యస్. కు మా సమస్య పరిష్కరించమని రికమండ్ చేస్తూ లేఖ వ్రాసి, మా చేతికే ఇచ్చాడు. మేం దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన లేఖ తీసుకుని, తిన్నగా, అప్పటికే ఢిల్లీ వచ్చి ఏపి భవన్ లో బస చేసిన అప్పటి సీ.ఎం. వై.యస్.ని కలిసాము. పావుగంటపాటు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి, సమస్య విన్న వై.యస్., "కేసు సంగతి తర్వాతమ్మా! ముందు ఉండటానికి రూం కావాలి కదా! దాని సంగతి ముందు చూద్దాం” అంటూ మరో వినతిపత్రం వ్రాసి ఇమ్మని అప్పటికప్పుడు వ్రాయించుకుని తీసుకున్నాడు. [అదో non-sense & red-tapistic administration అన్నది మాకు practical గా, తర్వాత అర్ధమయ్యింది]

తిరిగి మేం బసచేసిన పహార్ గంజ్ లోని హోటల్ కి వెళ్ళిపోయాము. నంద్యాల/గుంటూరు చేరాలంటే తిరుగురైలు టికెట్లు దాదాపు వారం తర్వాత గానీ దొరకలేదు. తత్కాల్ లో కూడా! అదే ఢిల్లీ వెళ్ళేటప్పుడు విజయవాడ నుండి తత్కాల్ లో ఒకరోజులో టిక్కెట్లు దొరికాయి. సరే, ఇటు నుండి అటు కంటే, అటు నుండి ఇటుకి రద్దీ ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాము. అయితే, రెండుమూడు రోజుల తర్వాత, మేం అక్కడ ఉండగానే…… శ్రీశైలం నుండి మా విద్యార్ధుల తండ్రీ, పోలీసు కానిస్టేబులూ అయిన వ్యక్తి, ఫోన్ చేసి దేవస్థానపు ఈఓ మా గదిని పంచనామా చేయనున్నారనీ, వెంటనే ఏదో ఒకటి చెయ్యమనీ చెప్పాడు. అదీ ఒకటి రెండు సార్లు. ఇదే సమాచారం మరో పేరెంటు కూడా చెప్పాడు. పంచనామా అంటే మా గదిలోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి తీసి బయట పారేస్తారని కూడా ఈ పోలీసు కానిస్టేబులూ అంతకు ముందు చెప్పాడు.

దీనికి ముందు ఇంకోసారి…… 2006, డిసెంబరు 16 [నాకు గుర్తుండి అదే తేదీ] న వై.యస్. శ్రీశైలం వచ్చాడు. మా ఇంటికి [చల్లా వెంకయ్య సత్రం మొదటి అంతస్తు] వినబడేంత, కనబడేంత దూరంలో, చెంచులక్ష్మీ గిరిజన మ్యూజియం వెనక అతడి బహిరంగ సభ జరుగుతోంది. ఆ సమయంలో మా సత్రంలో క్రింది అంతస్థులోని సెక్యూరిటీ గార్డు భార్య నన్ను బండబూతులు గంటపాటు ఏకధాటిగా, ఆకారణంగా తిట్టింది.

దాంతో కోపం వచ్చి అయినా వై.యస్.ని మేం కలవాలి. అప్పటికే ఎందుకు వేధిస్తున్నారో మాకు అర్ధమై ఉంటుందనీ, అంచేత మాదగ్గర ఏవేనా రహస్యాలుంటే చెబుతామని వాళ్ళ అంచనా. అలా జరిపించాలన్నది, మమ్మల్ని అలా డ్రైవ్ చెయ్యాలన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే మామీద వత్తిడి కలగచేయటం, సమస్యలు సృష్టించటం.

2006 డిసెంబరులో జరిగిన ఈ సంఘటనకీ, 2007 మేలో ఢిల్లీలో జరిగిన పైన వివరించిన సంఘటనకీ, సారూప్యత కనబడటంతో మాకు విషయం బాగానే అర్ధమయ్యింది. [అవే పది స్ట్రాటజీలు!] అప్పటికి మేం 2005 నుండి ప్రధానికి, సోనియాకీ, రాష్ట్రపతికి ఫిర్యాదులు పంపుతున్నా ఎవరూ స్పందించలేదు. అది తనకు Endorse చేయబడిందని దిగ్విజయ్ సింగ్ మాకు వ్రాసిన లేఖ అందింది.

దాన్ని ఆధారం చేసుకునే మేం 2007 మే 17న ఢిల్లీ చేరి, ఏఐసిసి కి వెళ్ళి అతణ్ణి కలిసాం. అక్కడి నుండి అతడిచ్చిన సిఫార్సు లేఖతో అప్పటి సీ.ఎం. వై.యస్.కి కలిసేందుకు హైదరాబాద్ రానవసరం లేకపోయింది. ఎందుకంటే ఆరోజు ’యాదృచ్చికంగా’ అతడూ ఢిల్లీకి వచ్చి ఏపి భవన్ లో ఉన్నాడు. మేం ఏఐసిసి భవనం నుండి నేరుగా ఏపిభవన్ వెళ్ళి అతణ్ణి కలిసాం. అతడు వెంటనే కేసును పరిష్కరించక పోయినా, ముందుగా మా గది కాన్సిల్ ని రికాల్ చేస్తానన్నాడు. ఆ పైన తిరుగుటిక్కెట్లు దొరక్క ఢిల్లీలోనే ఉండిపోయినప్పుడు ఫోన్లలో మా గది పంచనామా పేరిట వస్తువులు బయటకు గిరాటు వేస్తారనీ, ఏదో ఒకటి చేయమని ఒత్తిడి!

అప్పుడు మాకు ఉండే ఏకైక ప్రత్యామ్నాయం ఏమిటి? సోనియాని కలవటమే. అయితే…... ఈ పైపైకారణాలతో, రామోజీరావు వేధిస్తున్నాడంటూ ఎవరిని కలిసినా ఏమీ ప్రయోజనం ఉండదని అప్పటికే మాకు అర్ధం చేసారు. ‘ఇవి గాని ఇంకేమైనా సమాచారం లేదా జ్ఞానం’ మాకు ఉంటే దాన్ని నేరుగా సోనియాకి చెప్తే ప్రయోజనం ఉంటుంది. అప్పుడు ఈ వేధింపు నుండి రక్షణా ఉంటుంది. సౌకర్యవంతమైన బ్రతుకు ఉంటుంది. ఇది మాకు బాగా అర్ధం చేసారు. నిజానికి మేం ఎవరితో, ఎప్పుడు రాజకీయ చర్చలు చేయలేదు. సాధారణ చర్చలు మాత్రమే! మొదటి సారిగా రాజకీయ విషయాలు వ్రాయటం ఈ బ్లాగులోనే.

నిజానికి మా దగ్గర గండికోట రహస్యాలేవీ లేవు. ఒకవేళ మా చుట్టూ పీవీజీ గానీ ఏదైనా మ్యాజిక్ సర్కిల్ సృష్టించి ఉంటే…. దానికి మా బాధ్యత గానీ, ప్రమేయం గానీ ఏవీ లేవని కూడా అంతకు క్రితమే అంటే 2005, 2007 లలో ప్రధానికి, సోనియాకీ, రాష్ట్రపతికి పెట్టిన ఫిర్యాదు లేఖలలోనే వ్రాసి ఉన్నాము. వాటిని మీరు Coups on World అనే మా ఆంగ్ల బ్లాగులోని Ref. No. 1 to 27 లలో చూడగలరు. ఆ విధంగా “మా దగ్గర రహస్యాలేవీ లేవన్నా” మా వెంట బడటం మాత్రం మానలేదు. అదీ మాకు అర్ధమయ్యేటంతగా వెంట బడి వేధించటం అన్నమాట.

సోనియాని కలిసి, ఉన్న రహస్యాలు చెప్పు. లేదా వై.యస్.కి చెప్పు! ఎందుకంటే వై.యస్. రామోజీని మార్గదర్శి నెపాన కోర్టుగుమ్మాలు ఎక్కించి దించుతున్నాడు కదా! సోనియా, వై.యస్.కి పూర్తి మద్దతు ఇస్తుంది కాబట్టి, ఆ కుర్చీ వ్యక్తి కూడా దేశప్రయోజనాలని కాపాడేవ్యక్తే. వాళ్ళిద్దరూ రామోజీరావుకి వ్యతిరేకంగా, అతడి ఏజన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి నీదగ్గరున్న రహస్యాలు చెప్పు – ఇదీ ఒత్తిడి.

మాకు ఎంత తిక్క లేచేదంటే – నిజంగా వాళ్ళిద్దరూ రామోజీరావుకు వ్యతిరేకంగా, అతడి ఏజన్సీకి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలు కోసం పోరాడుతున్నట్లయితే, అంత పై పదవుల్లో ఉన్నవారికి తెలియనిదీ, తొక్కలోది మేం ఇవ్వగలదీ అయిన సమాచారం ఏముంటుంది? మేం After all సామాన్యులం. మాకు తెలిసిన విషయాలేవో, ప్రారంభం తెలిసిన వారికి ఎవరికైనా, జరుగుతున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మేం చెబితే బ్లాగు చదువరులకి అర్ధమైనట్లు….. ఎవరికైనా, పరిశీలిస్తే జరిగేది అర్ధమౌతుంది. ఇక మమ్మల్నెందుకు వేధించటం? ఇది ఇప్పటికీ మాకు అర్ధం కాని ప్రశ్నే!

పోనీ ఫిర్యాదు చేసినందుకు వేధిస్తున్నారనుకున్నా, మొదట నా తమ్ముళ్ళని చంద్రబాబు దరిచేర్చుకున్నప్పుడు మేం వారిని కలిసే అంత వరకూ వాళ్ళకి హవా నడిచింది. మేం వాళ్ళతో కట్ చేసుకున్న తరువాత క్రమంగా వాళ్ళ హవా తగ్గిపోయి, ఆర్ధికంగా కూడా ఇప్పుడు సామాన్య జీవితాలే! అలాగని చంద్రబాబు పూర్తిగా వదిలేయలేదు. సంబంధాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు మమ్మల్ని వేధించి, దరి చేర్చుకుంటే వాళ్ళకి వచ్చే లాభం ఏమిటి?

ఇదంతా ఏమీ లేదనేటట్లయితే, ఒక చిన్న రూమ్ విషయమై, ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ నుండి సిఫార్స్ లేఖ, సి.ఎం. అధికారం కంటే శ్రీశైలంలోని ఒక ఈవో ఎలా బలవంతుడు అయ్యాడు?

ఇక ఈ ఒత్తిడికి మేం లొంగనందున, మా మీద – ఆదాయానికి గండి కొట్టటం, ఖర్చులు పెరిగేలా చేయటం అన్న స్ట్రాటజీ ప్రయోగింపబడుతోంది. చివరికి ఆకలి దాకా తెస్తోంది. అయితే ఇది మాకు తొలి అనుభవం కాదు. గతంలో చాలాసార్లు తెలిసిందే! ప్రస్తుతం కూడా అదే స్థితి. ఉద్యోగప్రయత్నాలు, స్వంత వెంచర్ ప్రయత్నాలూ ఏవీ ఫలించని స్థితి.

ఇక్కడ ఓ విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందు చెప్పిందే అయినా మరోసారి చెబుతున్నాను. నేను ఈ బ్లాగుని ఏదో ప్రయోజనం ఆశించి వ్రాయటం లేదు. నిజం అందరికీ తెలియాలని వ్రాస్తున్నాను. అంతేగాని ఆత్మకథ చెప్పి ఆర్ధిక సాయం అడగటానికి వ్రాయటం లేదు.

ఎందుకంటే – హరికథ చెప్పి డబ్బులడగటం గౌరవప్రదం. ఆత్మకథ చెప్పి డబ్బులడగటం నీచం. దానికీ….. బస్టాండు లోనూ, రైల్వే స్టేషన్ లోనూ డబ్బులు పోయాయని చెప్పి సాయం అడగటానికీ, మా దృష్టిలో తేడా లేదు.

నా దృష్టిలో….. యుద్ధంలో శతృవుని మనకి చేతనైన దెబ్బ మనం కొట్టినప్పుడు, వాడికి చేతనైన దెబ్బ వాడూ మనల్ని కొడతాడు కదా! ఇదీ అంతే! నకిలీ కణిక వ్యవస్థ గురించీ, నెం.10 వర్గం గురించీ, అందులోని కీలక వ్యక్తుల కార్యకలాపాల గురించీ వ్రాస్తున్నాము. గూఢచారులకి వారి నిగూఢ పనితీరు ప్రాణం అయినప్పుడు, దాన్నిలా బహిరంగపరచటం అంటే చావుదెబ్బ తీయటం వంటిదే! అలాంటప్పుడు ఆర్ధికంగా మేం కార్నర్ అయ్యేస్థితికి లాగటం వాళ్ళు చేస్తారు. ‘ఇది యుద్ధం, అంతే!’ అనుకుంటాము.

కాబట్టే…..
ఏదైతే సత్యమని నమ్మి నడుస్తున్నామో ఆ సత్యాన్ని,
ఏదైతే ధర్మమని నమ్మి ఆచరించామో, ఆచరిస్తున్నామో ఆ ధర్మాన్ని,
ఏ భగవద్గీతనైతే నమ్మి సాధన చేస్తున్నామో ఆ గీతని, నిగ్గు పెట్టుకోదలుచుకునే మేమూ చూస్తున్నాము.

పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చేటప్పుడు ‘ధర్మోరక్షితి రక్షిత:’ అని వ్రాసాను. దాన్నే మనసా వాచా కర్మేణా విశ్వసించాను. ఆ రోజు గీత తెరిస్తే…. ‘హతోవా ప్రాప్యతే స్వర్గం’ అన్న శ్లోకం చదివాను. “ఛస్తే స్వర్గం, గెలిస్తే…. ఇక లేనిదేమిటి?" అనుకున్నాను. 1992 లో రామోజీరావు మీద ఫిర్యాదు చేయకముందు కూడా భగవద్గీతే నన్ను చాలాసార్లు రక్షించింది. గీతను, భగవంతుడిని నమ్మి చెడినది లేదని గీతే ఎన్నోసార్లు నాకు చూపించింది. ఎన్నో వేల సంవత్సరాల నుండీ మన పూర్వీకులు ఇదే బాటన నడిచారు.

అయితే…. ఇక్కడ, నాణెం ఎగరెస్తే…. బొమ్మ బొరుసూ గాకుండా, నాణెం నిలబడటంలాగా, పరిస్థితి అటు చావు ఇటు గెలుపూ కానిదీ….. 17 ఏళ్ళుగా శతృవుకి, మాకు మధ్య కొనసాగుతున్నదీ అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే….. యుద్ధంలో….. ’Instant result’ లాగా…… వెంటనే విజయమో, వీరస్వర్గమో వస్తుందనుకున్నాను. ఏదైనా సుదీర్ఘ యుద్ధం తర్వాతే వస్తుందన్నది అనుభవంతో నేర్చుకున్నాము.

ఇప్పుడు, ఈ స్థితిలో…… పరిస్థితి ఆకలి దాకా, పస్తుదాకా వచ్చినప్పుడు కూడా మా దృక్పధం ఇదే! ఏ స్థితిలోనయినా మా అభిప్రాయంలో మార్పులేదు. ‘చూద్దాం, దేవుడేం చేస్తాడో ’ అనుకుంటాము.

ఇక….. వారం క్రితం ఓ మిత్రుడిని కొంతమొత్తం డబ్బు అప్పు అడిగాం. వెంటనే స్పందించిన అతడు 20, నవంబరు శుక్రవారం, తన బ్యాంకు నుండి డబ్బుని నేను ఇచ్చిన బ్యాంకు ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా మొయిల్ ఇచ్చాడు. ఐదు రోజులు గడిచినా అది ఇంకా మా ఎకౌంట్ కి చేరలేదు. మా మిత్రుడు మొయిల్ కి గానీ, ఫోన్ కి గానీ స్పందించటం లేదు. అతడికేమైనా ఇబ్బంది కలిగిందేమో తెలియదు.

ఏది ఏమైనా ఎటువైపు నుండీ దమ్మిడీ రాని ఈ స్థితిలో……
మొన్నటి [Nov. 24, 2009] ఈనాడు పతాక శీర్షిక గమనించండి.
>>>కట్టబట్టే తంత్రం….. డబ్బుపట్టే మంత్రం….. సాక్షికి సమార్పయామి
మామూలుగా చూడటానికి, ఈనాడు వై.ఎస్. అవినీతిని ఎండగట్టినట్లే ఉంటుంది. అది ఒక కోణం…. మరో కోణం ఏమిటంటే, నీకు డబ్బు రావాలంటే ’ వెళ్ళి సాక్షికి నీ దగ్గరున్న సమాచారం సమర్పించుకో ’. గమనించి చూడండి! ఈ వార్తకు వేసిన క్యారికేచర్ లో జగన్, ఇతరులు కూర్చొని యజ్ఞం చేస్తున్నట్లు, హోమగుండంలో నెయ్యి వేస్తున్నట్లు ఉంది. అగ్ని సైతం ‘సాక్షి’ అన్న ఆకృతిలో ఉంది. మామూలుగా అయితే, ఈనాడు వ్యంగ్యంగా బొమ్మవేయదల్చుకుంటే అది మరోలా ఉంటుంది. ఫైళ్ళు, ప్రభుత్వ లైసెన్సులు వేస్తుంటే, అవినీతి సొమ్ము, అతడి అన్ని వ్యాపారసంస్థలుగా బయటకు వస్తున్నట్లుగానూ లేదా మరో రకంగానూ ఉంటుంది. పవిత్రయజ్ఞం చేస్తున్నట్లుగా మాత్రం ఉండదు. 17 ఏళ్ళుగా నడుస్తున్న ఈ యుద్దాన్ని మేం యజ్ఞంగా పోల్చుకోవటం మా మిత్రులలో కొందరికి తెలుసు.

అలాగే కర్నూలు సిటి ఎడిషన్ లో మధ్యపేజీలో సూక్తి చూడండి. ’ఎవరి పని వారు చేయకపోవటం వల్లే ఏ దేశమైనా వెనకబడుతుంది’. కాబట్టి మీపని మీరు చేయండి. రామోజీరావుకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్న గతించిన వై.యస్. కుమారుడు జగన్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరేముందో, ఇంకా మీకు ఏమేమి తెలుసో చెప్పండి. అలాగ్గాకుండా మీకు తెలిసిందంతా బ్లాగులో వ్రాస్తే దేశం వెనకబడిపోతుంది [!?] అదనంగా ఈ రోజుటి హాయ్ బుజ్జిలో పద్యాల వంటివి కూడా వస్తాయన్నమాట.

ఏ పద్యమంటే
>>>
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాత కన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!
అర్ధం:
ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కాని రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల కన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.

మరో విషయం ఏమిటంటే – మేం ఎప్పుడూ కూడా, ఎవరితోనూ, ఏ రాజకీయ చర్చలూ చేసేవాళ్ళం కాదు. 1992 నుండి 2008 లో ఈ బ్లాగు తెరిచే వరకూ కూడా, ఎవరైనా మాతో సమకాలీన రాజకీయాలు గురించి మాట్లాడినా మేం పెద్దగా స్పందించే వాళ్ళం కాదు. అయితే వసుంధరలో వ్యాసాలని, పిల్లల పెంపకం గురించో, బ్యూటీ, వంట చిట్కాల గురించో, ఎవరైనా చర్చిస్తే నేనూ ఆసక్తిగా మాట్లాడేదాన్ని. సహజంగా ఆధ్యాత్మికత ఉండటంతో ఆధ్యాత్మికం, అంతర్యామి వంటి శీర్షికలు ఏ పత్రికలలో కనబడినా చదివే వాళ్ళం. వాటి మీద కొద్దిగా మాట్లాడేవాళ్ళం.

మా విద్యార్ధుల తల్లిదండ్రులతో వసుంధర, చదువు, సుఖీభవ వంటి శీర్షికల గురించీ, అంతర్యామి గురించి వాటిల్లో ఏవైనా మంచి విషయాలు అనిపించినవి చదవమనీ, పరిశీలించమనీ చెప్పెవాళ్ళం. పిల్లల్ని ‘హాయ్ బుజ్జీ’ చదివించమని ప్రోత్సాహించేవాళ్ళం. మాకు, అప్పటికి మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం గురించి ఆలోచనే లేనందున, ఇదంతా యధాలాపంగా చేసేవాళ్ళం.

అయితే గతటపాలలో వివరించిన మా కుటుంబం మిత్రుడు ఖాసీం – గ్యాస్ సిలిండర్లు – స్నేహాల పునరుద్దరణ వంటి సంఘటనలు చాలానే జరగటంతో, ఆ విధంగా రామోజీరావు మాతో ఏం చెప్పదలుచుకున్నాడో మాకు అర్ధం అవ్వటం ప్రారంభించి చాలా ఏళ్ళు అయ్యింది. ఉదాహరణకి మీకు ఖాసీం Vs గ్యాస్ సిలిండర్ల గురించి చెప్పాను.

మరో ఉదాహరణగా నిన్నటి ఈనాడు పేపరులోని అంతర్యామిని పరిశీలించండి.

ఈ నెల [నవంబరు 2009] 18 వ తేదీన మా మిత్రుణ్ణి అప్పు అడగే ముందు వరకూ కూడా….. సొంత వెంచర్ ఎంసెట్ & స్పోకెన్ ఇంగ్లీషు ట్యూషన్ సెంటరు పెట్టాము. కరపత్రాల ఖర్చు దండగ తప్పితే, ఒక్క ఎంక్వయిరీ కూడా రాలేదు. అది ఇంకా బాలారిష్టాల దశలోనే ఉంది. 18 వ తేదీన మిత్రుణ్ణి అప్పు అడిగే ముందురోజు కూడా స్థానిక కాలేజీలో ప్రయత్నం చేసాము.

అలాంటిది అంతర్యామిలో పైవ్యాసం చదివాక మాకు అర్ధమయ్యేది ఏమిటంటే – ’అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్నట్లు – చెయ్యబోతే పని దొరకదు. అప్పు తీసుకోవటం తప్పుంటూ ’అంతర్యాము’లు చెబుతాయి. అంటే గదిలో బంధించబడిన పాముకి అన్ని తలుపులూ మూసి, ఏ ద్వారం తెరచి ఉంచబడిందో అటునుండి మాత్రమే పాము బయటకు రాగలిగేటట్లు, మాకు కూడా తెరచి ఉంచబడిన ద్వారం ఏమిటంటే, సాక్షి దగ్గరకీ, జగన్ దగ్గరికీ వెళ్ళి, వాళ్ళు ఆశిస్తున్నదేమిటో చెప్పటం. లేదా ఢిల్లీ వెళ్ళి సోనియాకి చెప్పటం.

నిజానికి మేం బ్లాగు తెరవక ముందు [తెలుగులో ‘అమ్మఒడి’, ఇంగ్లీషులో Coups On World], మాకున్న అవగాహన ఎంతో రామోజీరావుకి తెలియదు. అందుచేత అప్పట్లో అతడు మాట్లాడే తీరు ఇప్పటికి భిన్నంగా, చెప్పాలంటే కొంచెం తక్కువస్థాయిలో ఉండేది. అప్పట్లో మా అవగాహన స్థాయి ఎంతని అతడనుకున్నాడో ఆ స్థాయిలో అన్నమాట….. ఇప్పుడు బ్లాగు తెరిచాక, అందులో మా టపాలు చూశాక దాన్ని బట్టి అతడి భాష తీరు ఉందన్నమాట.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ చెబుతాను. మనం పైన, క్రింద రెండుసున్నాలని చూశామనుకొండి. పై సున్న వరకే చూసే వాళ్ళకి అది సున్న లాగే కనబడుతుంది. క్రింది సున్నాకి కనెక్షన్ కూడా కలిపి చూడగల వాళ్ళకీ, లేదా క్రింది సున్నాకీ, పై సున్నాకీ కనెక్షన్ ఎవరికైతే కనబడుతుందో వాళ్ళకి మొత్తం ‘8’ No. కనబడుతుంది. లేని వాళ్ళకి రెండు వేరువేరు సున్నాలుగా కనబడుతాయి. ఈనాడులో వచ్చే శీర్షికలో, వార్తాంశాల గురించి విశేషాలూ, వసుంధర టిప్స్, ఫోటోలూ అందరికీ మామూలుగా కనబడతాయి. అప్పటికి నడుస్తున్న రాజకీయ సాంఘీక సంఘటనలకి అనుగుణంగా ఉన్నట్లు కన్పిస్తాయి. సున్నాలు మాత్రమే కనబడినట్లు!

అదే మాకైతే….. మా చుట్టూ సంఘటనలూ, అప్పటికి మా దగ్గర ఉన్న పరిస్థితి, గతంలో జరిగిన సంఘటనల మాలిక….. వీటన్నిటికీ అనుసంధానమై, రామోజీరావు మాకు ఏం చెబుతున్నాడో అర్ధమౌతుంది. అది సామదాన బేధ దండోపాయాలైనా, మోసగించే ప్రయత్నాలైనా, ప్రలోభాలైనా లేక హెచ్చరికలైనా! మరో విశేషం ఏమిటంటే మేం అంతకు ముందు ఎవరితోనైనా అన్నమాటలు పేపర్లో కనబడతాయి. ఇప్పుడైతే అది మేం బ్లాగులో వ్రాసిన మాటలై ఉంటున్నాయి లెండి.

కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. 2003 లో, మా పాప శ్రీశైలంలో ఉన్నప్పుడు దేవస్థానం అడిటోరియంలో, స్కూలు వార్షికోత్సవం సందర్భంలో ఓ నాటకం వేసింది. దాంట్లో ఆ పాత్ర ఊతపదం ’ఆవునా, నిజమా అండి!’ అన్నది. ఆ తరువాత ’ఆవునా!’ అనే టైటిల్ తో సినిమా వచ్చింది. దానిని మా మిత్రుడు under line కూడా చేసాడు.

మేం గతసంవత్సరం, 2008 నవంబరులో ‘అమ్మఒడి’ బ్లాగుని తెరిచాం. తర్వాత చాలా సందర్భాల్లో ఈనాడులో కర్నూలు ఎడిషన్ లోనూ, ప్రధాన ఎడిషన్ లోనూ కూడా ’అమ్మఒడి’ అనే పదం పదే పదే ప్రయోగింపబడింది. చివరికి గణేశ్ నిమజ్జనానికి కూడా ‘అమ్మఒడి చేరిన గణపతి’ అంటూ.

తాజా ఉదాహరణ చెబుతాను. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య ఒకదశలో నడిచిన అంతర్గత పోరు గురించి వ్రాస్తూ….. రామోజీరావు, అతడి సోదర తుల్య సోనియా ‘అద్దాల మేడ’లో ఉన్నారని వ్రాసాను. నిన్నటి సాక్షిలో రామోజీ, చంద్రబాబులని సయామీ కవలలుగా చిత్రిస్తూ వేసిన కార్టూన్లతో కూడిన వార్తలో ‘మాది రాచబాట మాది అద్దాలమేడ’ అన్న వార్త శీర్షిక వచ్చింది. సాక్షి, ఈనాడులు పైకి కొట్టుకుంటున్నట్లు నటించినా, [రాజ రామోజీల యుద్ధం లాగా] అంతర్గతంగా అందరూ ఒకటేనన్నది నిజం. ఆ రకంగా కూడా సాక్షిని డీల్ చెయ్యమని చెబుతున్నాడన్న మాట.

మరో ఉదాహరణ చెప్పాలంటే, నవంబరు 14, 2009 తేదీన టీవీ 9, సిఇవో రవిప్రకాష్ గురించి టపాకాయ పేలుస్తూ, మేము ‘బార్టర్ సిస్టం ఇంకా అమలులోనే ఉన్నట్లుందని’ వ్రాసాము. Nov. 19, 09 వ తేదీన చంద్రబాబు, ‘వై.యస్. బార్టర్ పద్దతిని మళ్ళీ తీసుకొచ్చాడని’ అన్నాడు. అది ఈనాడులో 20 వ తేదీన ప్రచురింపబడింది. ‘అద్దాల మేడ, బార్టర్ పద్దతి’ వంటి మాటలకి నాకు పేటెంటు హక్కు ఉందని గానీ, లేదా ఆయా పదాలు జన బాహుళ్యంలో వాడుకలో లేనివని గానీ, నేను అనటం లేదు. అయితే ఒకటికి పది మాటలు మేం ఇతరులతో అనటం గానీ, బ్లాగులో వ్రాయటం గానీ చేసిన తర్వాత, ఈనాడు వ్రాయటం, రామోజీ అనుచరులు పలకటంలో ఒక శృతీ లయా ఉన్నాయని అంటున్నాను. అది కూడా పది సంఘటనలు పరిశీలించి అనటం లేదు. కొన్ని వేల సంఘటనలు పరిశీలించి అంటున్నాను.

ఇలా ఈనాడు రామోజీరావు మాతో మాట్లాడే తీరుని బట్టే, అతడి అనుచర శిబిరాల మధ్య అంతర్లీన భాషని కూడా అర్ధం చేసుకోగలిగాము. అదే మీకు చెప్పాము. మీకు చెప్పటానికి ముందు, చెప్పిన తరువాత ఆయా విషయాలు దృష్టాంతాలుగా ఆవిష్కరించబడినవి. గమనించండి.

ఇదంతా ఎవరు జరిపిస్తున్నారు?
ఇలా చూసినా మేము చదరంగం పటంలో పావులమే కదా?
నిమిత్తమాత్రులమే కదా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu