ప్రజల సువర్ణముఖిలో ఒక కోణం – ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు! రకరకాల ప్రైవేట్ టీవీ ఛానెళ్ళలో ‘డాన్స్ బేబీ డాన్స్’ వంటి నానారకాల కార్యక్రమాలు చూసి చాలామంది ఘోల్లుమంటున్నారు. ’ఇదెక్కడి విషసంస్కృతి రా బాబూ’ అని దిగ్ర్భాంతి పడుతున్నారు. చిన్నపిల్లలకి అర్ధనగ్న దుస్తులు వేసి, అసహ్యకర భంగిమలతో కూడిన సినిమా డాన్సులు చేయిస్తున్న ప్రైవేట్ టీవీ ఛానెళ్ళ కార్యక్రమ నిర్వాహకుల్ని, అందుకు ప్రోత్సహిస్తున్న కొందరు తల్లిదండ్రుల్ని చూసి నోరెళ్ళ బెడుతున్నారు.

ఇటువంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నామనో, ఆనందింపజేస్తున్నామనో, ఏకంగా ఉర్రూతలూగిస్తున్నామనో అంటున్న ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు ఇక ఎంత దూరం పోయారంటే నాట్యతారల, నటీమణుల స్వయంవరాలు [నాటకాలు, లేదా కేవలం నటనకోసం రూపొందించబడిన అంశాలకు ఆకర్షణ తగ్గిందేమో, నిజ జీవిత సంఘటనలు] వంటి కార్యక్రమాలతో టీవీ ఛానెళ్ళు అలరిస్తోన్నాయి. ఇటీవల రాఖీ సావంత్ అనే నాట్యతార, ఈ విధంగా వర పరీక్ష నిర్వహించి, వివాహ నిశ్చితార్ధం చేసుకోవటం ఓ ప్రైవేటు టీవీ ఛానెల్ కమర్షియల్ సీరియల్ కార్యక్రమంగా ప్రసారం చేసింది. సదరు వార్త గురించి వ్రాస్తూ, స్థానిక దినపత్రిక ‘తన వరుడి ప్రక్కన సిగ్గుల మొగ్గ అయిన రాఖీ సావంత్’ అంటూ వ్రాసింది. శరీరం మీద నామమాత్రపు దుస్తులు వేసుకుని, చుట్టూ వందలమంది చూస్తుండగా వక్షస్థలాన్ని, పృష్ఠ భాగాల్ని ఊపుతూ, కాళ్ళు ఎడంగా పెట్టి శృంగార భంగిమల్ని ప్రదర్శించిన సదరు నాట్యతార, - తరచూ ముద్ధు ఇతర ఆశ్లీల సంఘటనల వివాదాలతో సంచలన వార్తాంశంగా ఉండే ఈనర్తకమణికి, ’సిగ్గు’ అనే సున్నిత భావం తెలుసో లేదో ఎవరు చెప్పగలరు? ఆ భావాన్ని అనుభూతించిన సదరు శృంగార నాట్యతారకీ లేదా ఆమె ఆ భావాల్ని అనుభూతించిందని వ్రాసిన పత్రికా విలేఖరికీ, ఇంకా ప్రచురించిన పత్రికాధిపతులకి మాత్రమే తెలియాలి.

దాదాపు పాతిక, ముప్పై సంవత్సరాల క్రితం, భారత్ లోకి ప్రైవేట్ టీవీ ఛానెళ్ళూ, ఇతర ప్రైవేటు సమాచార వ్యవస్థలకి తలుపులు తెరవాల్సిందిగా నాటి భారతకేంద్రప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ, మీడియా – ప్రైవేటు ఛానెళ్ళు వస్తే ఎంత లాభదాయకమో, విదేశాలలో టీవీ ఛానెళ్ళ స్వేచ్ఛ గురించి ఉపమానాలతో మరీ వివరించింది. ఎప్పటి వార్తలు అప్పుడే తెలుస్తాయంది. పక్షపాతరహితంగా వార్తలు ప్రజలకి చేరతాయంది. ఇందిరాగాంధీ వంటి, నాటి భారతదేశ నాయకత్వం, తమకు అనుకూలంగా, వార్తలు ఆకాశవాణి, దూరదర్శన్ [అప్పటికి ఇది ఇంకా బాలారిష్టాల దశలోనే ఉంది] ల ద్వారా ప్రచారిస్తున్నది అని మీడియా హోరెత్తించింది. ప్రైవేటు ఛానెళ్ళు వస్తే ఇందిరాగాంధీ, వగైరాల గుట్టు, బండారం బయటపడతాయనే అందుకు అడ్డుకుంటున్నారని విమర్శించింది. ఇక ప్రజల వినోదాలకు, ఆహ్లాదాలకు ఆకాశమే హద్దని ఊరించింది.

అప్పట్లో అంతగా ’ప్రయోజనకారి’ అంటూ ఎలుగెత్తి, నాటి మీడియా ప్రశంసించిన, ప్రైవేటు టీవీ ఛానెళ్ళు ఎంతగా ప్రజాసేవ చేస్తున్నాయో, ఇప్పుడు మనకి స్పష్టంగా కన్పిస్తూనే ఉంది, అనుభవానికొస్తూనే ఉంది. ఎంత ’నిజాయితీ’గా ’నిష్పక్షపాతంగా’ వార్తలు ప్రచారిస్తున్నాయో కూడా తెలుస్తూనే ఉంది.

నిజానికి విదేశాల్లో, అప్పటికే వేళ్ళూనుకున్న ఈ ప్రైవేటు ఛానెళ్ళు, అక్కడి ప్రజా దృక్పధాల్ని, జీవన సరళిని, వారి వారి సంస్కృతీ సాంప్రదాయాల్ని ఎంతగా దిగజార్చాయో, భ్రష్ఠపరిచాయో అప్పటి మన పాలకులకి తెలుసు. దేశం పట్లా, మన సంస్కృతి పట్లా, జాతీయత పట్ల నిబద్ధత గలవారు కాబట్టే, తమ వ్యక్తిగత ప్రతిష్ఠని ఫణంగా పెట్టి మరీ వ్యతిరేకించారు. అందుకు ప్రతిఫలంగా మీడియా వారికి, వారి వ్యక్తిగత ఇమేజ్, అధికారాలు కాపాడుకునేందుకే ప్రైవేట్ సమాచార వ్యవస్థల్ని, టీవీల ఛానెళ్ళనీ అడ్డుకుంటున్నారని దుమ్మెత్తి పోసింది. [వాళ్ళే గనుకా స్వార్ధపరులైతే, వ్యక్తిగతానికి విలువనిచ్చేవారైతే – ప్రైవేట్ ఛానెళ్ళనీ ఆహ్వానిస్తే, ఆ ఛానెళ్ళ వారు వెనుక తట్టున డబ్బులిస్తారు కదా? తమకి అనుకూలంగా బాకా ఊదుతారు కదా? అలాంటప్పుడు అడ్డుకోవలసిన అవసరం ఎందుకుంటుంది?] ఇవేవీ తెలియని ప్రజలు మీడియా ఊదిన నాగ స్వరానికి అనుగుణంగా పడగలూపిన పాముల చందాన ఉండిపోయారు.

ఆ కర్మ ఫలాన్నే ఇప్పుడు అంతా అనుభవిస్తున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ఇది ప్రజల సువర్ణముఖి! ఇందులో మరో కోణం కూడా ఉంది. అనుభవిస్తే గానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. మూసిన గుప్పిట్లో ఏదో ఉందన్న కుతుహలం ఉంటుంది. అలాగే ’నిప్పు[తప్పు] ముట్టకురా కన్నా! కాలుతుంది…. బాధపడతావు’ అని పాతతరం అంటే తెలిసీ తెలియని యువతరం ’ఎంత చక్కగా ధగధగలాడుతూ, భగభగమంటూ, ఎంత ఆకర్షణీయంగా ఉందీ నిప్పు? నేను దాన్ని ఆనందిస్తానని’ దాని ఆకర్షణకు లోనై పట్టుకుంటుంది. చేసేది లేక పాతతరం చూస్తూ ఊరుకుందనుకోండి అప్పుడు మన యువతరానికి ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ’ తత్త్వం బోధపరుచుకుంటారు. పెద్దలు కూడా ‘అనుభవమైంది కదా తత్త్వం బోధపడిందా?’ అని చెప్తే అప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి భయపడతారు.

ఏది ఏమైనా…. తెలిసి చేసినా తెలియక చేసినా, చేసిన కర్మఫలం అనుభవించక తప్పదన్నది పెద్దల మాట సాక్షాత్తూ గీత కూడా మనకు ఇదే చెబుతుంది.

కేవలం కర్మ చేయటం మాత్రమే మనవంతనీ, కర్మఫలం భగవంతునిదని నమ్మి ఆచరించే కర్మయోగి తప్ప, ఇందుకు మరెవ్వరూ అతీతులు కారు. ఈ విషయాన్నీ జ్ఞానయోగంలోని క్రింది శ్లోకాలలో భగవద్గీత స్పష్టాతిస్పష్టంగా చెబుతుంది.

శ్లోకం:
స మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా
ఇతి మాం యో భిజానాతి కర్మభిర్న స బధ్యతే

భావం:
కర్మఫలం మీద ఆశలేనందువలన, కర్మలు నాకే మాత్రం అంటవు. ఈ తత్త్వంతో నన్నెరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు.

శ్లోకం:
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్

భావం:
ఇది తెలుసుకొని, ఎందరో ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మలనాచరించారు. కాబట్టి, పూర్వుల రీతిగానే నువ్వుగూడా కర్మలను ఆచరించు.

శ్లోకం:
కిం కర్మ కి మకర్మేతి కవయో ప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్ష్యసే2 శుభాత్

భావం:
ఏ కర్మలు చేయాలో, యే కర్మలు చేయకూడదో తెలుసుకోలేక, పండితులు సైతం భ్రమలలో చిక్కుకుంటున్నారు. ఏ కర్మతత్త్వాన్ని తెల్సుకుంటే ఆశుభాల నుండి నువ్వు ముక్తుడివవుతావో దాన్ని చెబుతాను విను.

శ్లోకం:
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః
ఆకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః

భావం:
కర్మ, అకర్మ, వికర్మ అనే మూడింటినీ క్షుణ్ణంగా తెల్సుకోవాలి. [ఎందుకంటే] కర్మగతి గాఢమైనది.

శ్లోకం:
కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్

భావం:
కర్మలలో అకర్మలను, అకర్మలలో కర్మలనూ దర్శించే వాడే – బుద్ధిమంతుడు. వాడు సర్వకర్మలనూ ఆచరించినట్లే లెఖ్ఖ.

శ్లోకం:
యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః

భావం:
ఎవడు ఫలాపేక్షారహితుడో, కర్తృత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో, వాడే పండితుడు.

శ్లోకం:
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః
కర్మ ణ్యభిప్రవృత్తో పి నైవ కించి త్క రోతి సః

భావం:
ఫలాపేక్షలేకుండా, నిత్యతృప్తుడూ, నిరాశ్రయుడూ అయిన వాడు కర్మలు చేసినా, చేయనట్లే సుమా!

శ్లోకం:
నిరాశీ ర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

భావం:
తృష్ణలేని వాడు, చిత్తాన్నీ ఇంద్రియాలనీ జయించిన వాడు, బ్రతుకు నిలిచేందుకు మాత్రమే వస్తుసామాగ్రిని సేకరించుకునేవాడు – పాపకూపంలో చిక్కుకోడు.

శ్లోకం:
యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ సిద్ధావ సిద్దౌచ కృత్వాపి న నిబధ్యతే

భావం:
తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, మాత్సర్యం లేనివాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమాన బుద్ధి గలవాడు – ఏ కర్మలను చేసినా బంధనాలలో చిక్కుకోడు.

[అప్పుడప్పుడు కొందరు బ్లాగు అజ్ఞాతలు మాతో ’జీవితంలో మేమేదీ సాధించలేదనీ, అనవసరంగా శ్రమపడుతున్నామనీ’ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అలాంటి వారికి మేం చెప్పే ఏకైక సమాధానం ఈ శ్లోకాలే.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

GOOD ONE

చాలా బాగా వివరించారు. టి.వి. ఛానల్సును చూడటం (వార్తలకోసం కూడా) మానివేసి చాలా కాలమయింది. భక్తి టి.వి, టి.టి.డి. టి.వి, సప్తగిరి లో కొన్నికర్యక్రమాలకు మాత్రమే అప్పుడప్పుడూ కంప్యూటరు ద్వారానే చూస్తున్నాను. చాలా భగవద్గీత శ్లోకాలు భావ సహితంగా పోస్టు చేసినందులకు నా ప్రత్యేక కృతజ్ఞతల నందుకోండి. పుణ్యభూమి లో చేరారా.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారు,
మీ వ్యాఖ్యకు నెనర్లు. పుణ్యభూమిలో చేరిపోయానండి. మా ఇంట్లోను డి.డి. తప్ప ఏవీ రావండి. కేబుల్ కనెక్షన్ కట్ చేయించి నాలుగు సంవత్సరాలయ్యింది. ఆ దెబ్బతో మా పాపకి పుస్తకపఠనం అలవాటయ్యింది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu