ముందుగా శ్రీల ప్రభుపాదుడి గురించి:

ఇతడి జనన వృత్తాంతం, సంవత్సరం, స్థలం, తల్లితండ్రుల వివరాలు ప్రచురించక పోయినా, మిగిలిన వివరాలు ఇప్పటికే మీడియా పలుసార్లు శ్లాఘిస్తూ ప్రచురించింది. అయితే మీడియా ఎప్పుడూ మచ్చుకైనా ప్రచురించని విషయాలు చాలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, 24 పరగణాల జిల్లాలో, నవద్వీప్ ప్రాంతంలో, మాయాపూర్ ఓ గ్రామం. గంగ ఒడ్డున ఉన్న చిన్నగ్రామం. అక్కడే ఇస్కాన్ ప్రధాన కేంద్రం ఉంది. అక్కడే చైతన్య ప్రభువు ప్రభోదించిన భక్తి సిద్ధాంతాన్ని ప్రజలలో పరివ్యాప్తి చేయడానికి స్థాపించబడిన శ్రీ గౌడీయ మఠము ఉంది. శ్రీల ప్రభుపాదుడి పుణ్యమాని, చీలికలూ పేలికలూ అన్నట్లుగా శాఖోపశాఖలుగా చీలిన గౌడీయ మఠపు చాలా శాఖలున్నదీ ఇక్కడే! చైతన్యుడి జన్మస్థలం ఇదే!

దీనికి పూర్వరంగం ఏమంటే, ‘గౌడీయమఠం’ అన్నది కృష్ణభక్తుడూ, భక్తి సిద్ధాంత కర్త అయిన చైతన్యప్రభువు అడుగుజాడలలో స్థాపించబడింది. మధురభక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రచారించిన చైతన్యుణ్ణి [క్రీ.శ. 1485 – 1533] భక్తులు శ్రీకృష్ణుని అవతారంగా కొలుస్తారు. తెల్లగా ఉంటాడు గనుక ఆయన్ని ‘గౌరాంగుడ’ని పిలిచేవారట. వేపచెట్టు క్రింద జన్మించాడని ‘నిమాయి’ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు రాధకి తన పట్ల గల గాఢానురక్తినీ, ప్రేమ పారవశ్యాన్ని, వేధించే విరహన్ని సైతం మధురంగా ఆస్వాదించగలిగిన రాధ మధురభక్తిని చూసి విస్మయపడ్డాడట. ఆ గాఢానురక్తినీ, మధుర భక్తినీ తాను ఆస్వాదించడానికీ, భక్తులకి మధురభక్తి మార్గాన్ని చూపడానికి, స్వయంగా శ్రీకృష్ణుడే చైతన్యుడై అవతరంచాడని భక్తులు నమ్ముతారు. మన అన్నమయ్య, త్యాగయ్యలాగా స్వయంగా కవీ, గాయకుడు అయిన చైతన్యప్రభువు వంగభాషలో ఎన్నో మధురభక్తి గీతాలు వ్రాసి ఆలపించాడు. ఆ కవితాత్మక సంగీత శృతిలో, ఆనాడు ఎందరో పండిత పామర జనులూ, స్త్రీపురుష బేధం లేకుండా కృష్ణభక్తి తత్త్వంలో మునిగి తేలారట.

భక్తి పారవశ్యంలో పాటలు పాడుతూ, చైతన్యుడు దక్షిణాపధాన్ని కూడా సందర్శించాడని అంటారు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల నరసింహాస్వామి గుడిమెట్ల దారిలో చైతన్యప్రభువు పాదముద్రలున్నట్లుగా చెబుతారు. అక్కడ చిన్నమందిరం కూడా ఉంది. చైతన్యప్రభువు భక్తి ఎంత పరవశంతో నిండి ఉండేదంటే, ఆ మత్తులో ఆయన బాహ్య స్పృహ తరచూ కోల్పోయే వాడట. ఓ సారి అలా పాడుకుంటూ [పూరీ క్షేత్రాన్ని దర్శించబోయినప్పుడు] సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. జాలరుల వలలకు చిక్కగా వాళ్ళు రక్షించారట. పూరీ క్షేత్రానికి వెళుతూ, అడవిదారిలో ఆయన, కృష్ణభక్తి సంకీర్తనం చేస్తూ వెళ్ళుంటే, అడవిలోని జంతువులన్నీ కౄరమృగాలూ, సాధు ప్రాణులతో సహా, జాతిబేధం మరచిపోయి కన్నీరు కారుస్తూ ఆయన వెంట అడవి చివరిదాకా వచ్చాయట. చైతన్యుని కృష్ణభక్తి సంకీర్తనం, వంగభాష రాని వారికి సైతం తన్మయుల్ని చేస్తుందన్నది మాత్రం నిజం.

గుంటూరులో నా చిన్నప్పుడు, మా ఇల్లు గుంటూరు వారి తోటలోని గౌడీయమఠం వీధిలోనే ఉండేది. గుడిలో సాయంత్రపు భజన, హారతి గంట మోగగానే పిల్లలందరం పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ సన్యసించిన పూజారులు ఉండేవారు. వాళ్ళని పిన్నవయస్సువారిని బ్రహ్మచారులనీ, కాస్త పెద్దవారిని [యతి] మహారాజ్ అనీ పిలుస్తారు. మేమైతే అందరినీ ’ప్రభూజీ’ అనే పిలిచివాళ్ళం. దక్షిణభారతదేశంలో శ్రీకృష్ణుడి మందిరాలకి అంతగా ఆదరణ ఉండదన్న సంకోచంతో గౌడీయమఠపు శాఖల్లో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ప్రతిమలతో సహా ప్రతిష్ఠించారు. ఓవైపు రాధకృష్ణులూ, వారి ప్రక్కన చైతన్యప్రభు ప్రతిమ ఉండేది. మా వీధిలోని, పేటలోని గృహిణులలో కొందరు ప్రతిరోజు సన్నజాజులతోనూ, మల్లెలూ, విరజాజులతోనూ సీతమ్మ రాధమ్మలకు పువ్వుల జడలు కుట్టేవారు. కృష్ణాష్టమి చాలా గొప్పగా నిర్వహించేవారు. ప్రతీరోజు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చైతన్యుడి విరచిత కృష్ణభక్తి సంకీర్తన ప్రభూజీలు చేసేవాళ్ళు. భక్తులంతా వాళ్ళని అనుసరించే వాళ్ళు. దాదాపు అర్ధగంటపాటు సాగేది. వంగభాషలో పాడుతున్నా, కొన్నాళ్ళకి మాకూ కంఠస్థం వచ్చాయి. ప్రభూజీలు మెడలో డోలు, హార్మోనియం వంటివి తగిలించుకునే వాళ్ళు. మాకు తాళాలు ఇచ్చేవాళ్ళు. పిల్లలకి తమ ముందు జాగా వదిలేవాళ్ళు.

మేమంతా భజన పతాక స్థితికి చేరినప్పుడు
“శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ గదాధర .... గౌర భక్త బృంద
హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరి బోలో హరిబోలో హరిబోలో హరిబోలో ” అంటూ

మేమంతా ముక్తకంఠంతో ఆరుస్తూ పాడేవాళ్ళం. ఎంతగట్టిగా పాడేవాళ్ళమో అంత వేగంగా గంతులేసే వాళ్ళం. ఎవరెంత గట్టిగా పాడితే, ఎవరెంత బాగా చిందేస్తే, వాళ్ళకి ప్రభూజీలు అంతెక్కువ ప్రసాదం పెట్టేవాళ్ళు. పులిహోర, చక్రపొంగలి, పాయసం, తీపి ఖాజాలు, గుగ్గిళ్ళు.... ఇలా చాలా రుచికరమైన ప్రసాదం పెట్టేవాళ్ళు. ’ప్రభు ప్రభు’ అంటూ దోసిళ్ళు పట్టి ప్రభూజీల వెంటపడటం ఇప్పటికి నాకు గుర్తే. వాళ్ళు నవ్వుతూ, ప్రేమగా మరికాస్త ప్రసాదం, రెండోసారి మూడోసారి కూడా పెట్టేవాళ్ళు. మొదట్లో ప్రసాదం కోసం గొంతెత్తి పాడి, చిందులేసినా తర్వాత్తర్వాత అందులో చాలా మజా ఉందని అర్ధమైంది. ఇప్పటికీ ఘంటసాల గొంతులో నారద పాత్రలకి పాడిన భక్తిగీతాలు విన్పించినా, మంగళం పల్లి గొంతులో రామదాసు కృతి వినిపించినా, నా ఊహలోంచి, రిబ్బన్లతో పైకి బిగించికట్టిన రెండుజడలతో, గౌను వేసుకున్న నా చిన్నప్పటి రూపం బయటికొచ్చి, భజన చేస్తూ గెంతులేస్తుండటాన్ని నేను తరచూ ఆస్వాదిస్తుంటాను. అది ఒక అపురూపమైన అనుభూతి. ఆ వరాన్నిచ్చింది గౌడీయమఠమే! ఇది నేను నాస్వంత సంగతులు చెప్పడానికి వ్రాయలేదు. స్వానుభవం పంచుకోవడానికి వ్రాస్తున్నాను. చిన్నవయస్సులో భక్తినాడి గట్టిపరచాలని రామకృష్ణ పరమహంస చెప్పిన వాక్కులోని నిజం నాకు స్వానుభవమని చెప్పడానికి వ్రాస్తున్నాను.

ఓసారి కృష్ణాష్టమి వేడుకల్లో మా వీధిలోని గౌడీయమఠం ప్రభూజీలు పిల్లలకి వక్తృత్వపోటీ పెట్టారు. శ్రీకృష్ణుడి గురించి మాట్లాడమన్నారు. నాకు ప్రధమ బహుమతి వచ్చింది. భగవద్గీత, చేతిలో ఇమిడేంత చిన్నపుస్తకం బహుమతిగా ఇచ్చారు. అది నా జీవితాన్నే మార్చేసింది. అదే తొలిసారి నాకు భగవద్గీత తెలియడం! ఇక ఎవరితో మాట్లాడినా గీత గురించే! అప్పుడు నాకు ఘంటసాల పాడిన గీత గురించి తెలిసింది. ఇక ఆ పుస్తకం, ఆ క్యాసెట్టు నాజీవితంలో ఓ భాగమైపోయాయి. ఇప్పటికీ, బుడుగు భాషలో చెప్పాలంటే “బోలెడు ఎక్కువగాక పోయినా, కుంచెం గానే అయినా” కర్మఫలాసక్తినీ, కర్తృత్వాహంకారాన్ని విడిచిపెట్టి ఏపనైనా చేయగలుగుతున్నానంటే అది గౌడీయమఠం పెట్టిన భిక్షే! ఆ విధంగా నాకూ, మా కుటుంబానికి గౌడీయమఠంతో విడదీయలేని అనుబంధం ఉంది. నా ఫ్యాక్టరీని 1989 లో నాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ ప్రారంభించే ముందు, గౌడీయమఠం ప్రభూజీల చేత పూజ, యజ్ఞం నిర్వహించి గృహప్రవేశం చేశాము.

ఆ అనుబంధంతోనే కోల్ కతా లోని గౌడీయమఠాన్ని, మాయాపూర్ లోని వారి ప్రధాన శాఖనీ సందర్శించాము. అక్కడ కొన్నిరోజులున్నాము కూడాను. ఈ నేపధ్యంలోనే మాయాపూర్ లోని ఇస్కాన్ ని కూడా సందర్శించాము. అక్కడా కొన్నిరోజులు బస చేశాము. ఇక అసలు విషయానికి వస్తాను.

గౌడీయమఠం వారికి దశాబ్ధాల క్రితం నుండీ భక్తులు వ్రాసిచ్చిన భూములున్నాయి. అపారమైన ఆస్థే అది. పూరీ జగన్నాధుడి క్షేత్రంలో జరిపే రధయాత్రకి అనుగుణంగా వారు అక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఊరందరికీ, విచ్చేసిన భక్తులందరికీ భోజనాలు పెడతారు. అందులోనే[బృందావనం శాఖలో] బ్రహ్మచారిగా చేరిన ప్రభుపాదుడు తదనంతరం విభేదాలతో బయటికొచ్చాడు.

సన్యాసులైనంత మాత్రనా అరిషడ్వర్గాలు వదలవు అన్నది నిజం. కౌపీన సంరక్షణార్ధం, సన్యాసి సంసారి అయిన కథ అందరికీ తెలిసిందే అయినా మరోసారి చెబుతాను.

అనగా అనగా…..

ఒకతనికి యవ్వనదశలో ఉండగానే వైరాగ్యం కలిగి సన్యసించాడట. గ్రామానికి దాపులనున్న అడవిలో, ఓ కుటీరం నిర్మించుకుని కాషాయాంబరధారియై జపతపాలతో జీవనం సాగిస్తున్నాడు. ప్రతీరోజు అతడి కౌపీనం [గోచీగా వాడే వస్త్రం] ఉతికి ఆరేస్తే, ఎలుక కొట్టిపోతోంది. అతడికి చిరాకు వేసింది. గ్రామానికి భిక్షకోసం వెళ్ళినప్పుడూ, గ్రామస్థులు తనకి భిక్ష ఇవ్వవచ్చినప్పుడూ అదే అంటే, ఎవరో పిల్లిని పెంచుకోమని సలహా ఇచ్చారు. సన్యాసి ఓ పిల్లి కూనని తెచ్చి పెంచడం మొదలుపెట్టాడు. ఎలుక బాధ పోయింది. దాంతో ఎంతో సంతోషించాడు. అయితే పిల్లి పాలకోసం అతని కాళ్ళుచుట్టుకి తిరుగుతోంది. గ్రామస్థులని పిల్లికూనకి పాలకోసం అర్ధించాడు. ఎవరో ఓ ఆవుని పెంచమని సలహా ఇచ్చారు. ఓ ధనికుడు ఆవుని దానంగానూ ఇచ్చాడు. సన్యాసి ఆవుని కుటీరానికి తోలుకొచ్చి మేపసాగాడు. జపతపాలు కోసం వెచ్చించాల్సిన సమయాన్ని గో పోషణ కోసం ఉపయోగించాల్సి వచ్చింది. ఆవుని పచ్చిక బయళ్ళలో మేపుకు రావటం, పేడ ఎత్తి గోశాల శుభ్రం చేయటం, పాలు పితికి కాచుకోవటం అన్నీ పనులే. దానితో ఎవరో పెళ్ళిచేసుకోమని సలహా ఇచ్చారట. సన్యాసి కాస్తా పెళ్ళి చేసుకుని సంసారి అయిపోయాడు. ఇంకెందుకు కుటీరం? అందుకే ఎంచక్కా తన స్వస్థలానికి తిరిగి వెళ్ళాడు శ్రీమతితో సహా!

ఈ కథ చెబుతూ పెద్దలు ’గోచి గుడ్డమీది వ్యామోహం సన్యాసిని సంసారిని చేసింది’ అంటారు.

అలాగే – గౌడీయమఠంలో ఉన్నది సన్యాసులే అయినా లోతుగా చూస్తే, వారిలోనూ, కొందరిలో ఈర్షాసూయలూ, ఆధిపత్యపోరాటాలు కూడా ఉన్నాయి. ఇది ఎక్కడైనా ఉంటాయనుకోండి. సరిగ్గా ఇలాంటి భావోద్రేకాలతోనే ప్రభుపాదుడు ఉండేవాడు. 1892 లో స్వామి వివేకానంద చికాగో మత మహాసభ ఉపన్యాసం తర్వాత సి.ఐ.ఏ. కన్ను ఇండియా మీద పడిందనీ, సి.ఐ.ఏ.ని భారత్ మీదకి ఉసిగొల్పడం అనువంశిక నకిలీ కణికుల పధకంలో భాగమనీ, ఇంతకు ముందు టపాలలో వ్రాసాను. ఆ రీత్యానే కాదు, స్వాతంత్ర సమరంలో సైతం, బహుముఖపాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యులు వంగరాష్ట్రీయులే గనుక నకిలీ కణిక వ్యవస్థ, వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరీ వంగప్రజల దృక్పధాన్ని విషపూరితం చేసింది, చేస్తూనే ఉంది. అందులో భాగంగానే, అది, గౌడీయమఠంపై గురిపెట్టింది. ఒక్క గౌడీయమఠం అనేకాదు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడల్లా పనిచేసింది.

కాబట్టే ఆధిపత్యపు పోరు నేపధ్యంలో వైషమ్యాలు రేపబడ్డాయి. అందులోంచి శ్రీల ప్రభుపాదుడు బయటికొచ్చాడు. చేతిలో సంచి, గొడుగుతో అమెరికా వెళ్ళాడు. అతడి ఉపన్యాసాలు అమెరికన్లని ఉర్రూతలూగించాయి. అక్కడే ఇస్కాన్[International Society for Krishna’s consciousness ] ను స్థాపించాడు. అయితే, తదనంతరం తనదీ గౌడీయమఠంలోని భాగమేనని, అందుచేత మఠపు ఈనాం భూములలోనూ, ఆస్థులలోనూ తనకీ అంటే తన సంస్థకీ వాటా రావాలనీ కోర్టులో కేసు వేసాడు. [ఈ విషయాన్ని మీడియా ఎప్పుడూ ప్రచారించదు] కుట్రలో తనపాత్ర, తాను సమర్ధంగానూ, రహస్యంగానూ పోషించే న్యాయవ్యవస్థ, న్యాయ స్థానం, కేసుని ఏళ్ళ తరబడి విచారించింది.

ఈ లోపున అమెరికా భక్తుల నుండి శ్రీల ప్రభుపాదుడికీ, అతడి ఇస్కాన్ కి తామరతంపరగా నిధులొచ్చిపడ్డాయి! మాయాపూర్ లో గౌడీయమఠపు ప్రధాన కేంద్రానికి కూతవేటు దూరంలో ఎకరాల కొద్దీ విశాల ప్రాంగణంతో ఇస్కాన్ గుడి కట్టబడింది. ఇటుప్రక్క, గౌడీయమఠం వారి ఆస్థులన్నీ కోర్టు నియంత్రణలోకి పోయాయి. సస్యశ్యామల క్షేత్రాలైన పొలాల నుండి రాబడి లేదు. తాత్కాలికంగా భక్తులిచ్చే చందాలతో మఠం నడపవలసి వచ్చింది. ఆ దశాబ్ధంలో చాలా సార్లు, అక్కడున్న బ్రహ్మచారులు [సన్యాసించిన వారు] పస్తులున్నారు. ఆకలికి తాళలేని వారిలో కొందరు, బయటకిపోయి ఇస్కాన్ లో చేరిపోయారు. కొందరు సన్యాసం వదిలేసి ఇంటికెళ్ళిపోయారు. సుదీర్ఘకాలపు న్యాయపోరాటం తర్వాత, తీర్పు శ్రీల ప్రభుపాదుడికి అనుకూలంగా వచ్చింది. గౌడీయమఠానికి, బ్రిటిషు వారి నుండి స్వాతంత్రం పొంది భారతదేశపు కేంద్రప్రభుత్వం ఏర్పడటానికి ముందు, దశాబ్ధాల క్రితం, దాతలూ, భక్తులూ దానంగా ఇచ్చిన ఆస్తులు పంపకం చేయబడ్డాయి.

ఆ ఉత్సాహంతో గౌడీయమఠంలో నుండి మరికొందరు బ్రహ్మచారులు, మహారాజ్ లు [జూనియర్ శ్రీల ప్రభుపాదులన్న మాట] పుట్టుకొచ్చారు. సీనియర్ శ్రీల ప్రభుపాదుడు తొక్కిన కోర్టుదారే తొక్కారు. వెరసి మాయాపూర్ లో గౌడీయమఠపు కొత్తకొత్తశాఖలు పుట్టుకొచ్చాయి. ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఈ లోపున ఇస్కాన్ ’ఇంతింతై.... ’ అన్న చందాన పెరిగింది. దేవాలయాల పేరిట, రిసార్టులు పుట్టడం ఇస్కాన్ తోనే ప్రారంభమయ్యింది. దేవాలయానికి తల్లిదండ్రుల వెంట వెళ్ళే చిన్నారులు ఆడుకోవడానికి జారుడు బల్లలూ, మారిగో రౌండ్ లతో కూడిన చిల్డ్రన్ పార్కులు అనుసంధానించబడిన అక్షరధామ్ లకు ఇస్కాన్ మార్గదర్శి అన్నమాట.

ఇక్కడో విషయం పరిశీలించండి. శ్రీల ప్రభుపాదుడు 1965 లో అమెరికా వెళ్ళాడు, కేవలం ఒక చేతి సంచి, గొడుగు, ఆరు డాలర్లకు సరిపడినంత భారతీయ రూపాయలు, పెట్టేల కొద్దీ పుస్తకాలతో! 1966 లో న్యూయార్కులోనే ఇస్కాన్ ను స్థాపించాడు. లక్షల కొద్దీ భక్తులు పుట్టుకొచ్చారు. మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళాలుగా ఇచ్చారు. అయినా శ్రీల ప్రభుపాదుడు, గౌడీయమఠపు ఆస్థుల గురించి కోర్టుకు వెళ్ళాడు. ఆస్థుల్ని కోర్టుల ద్వారా స్థంబింపచేశాడు. తనకూ, తన శిష్యకోటికీ పస్తులుండాల్సిన అగత్యం లేదు సరికదా, తన సంస్థ ఇస్కాన్ విదేశీ విరాళాలతో మూడుపువ్వులూ ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. తన పూర్వాశ్రమ సహసన్యాసులైన గౌడీయమఠవాసులు మాత్రం, ఆస్థులు కోర్టుద్వారా స్థంబింపబడి ‘పస్తులుంటున్నారు’. ఇంత దయామయ శ్రీల ప్రభుపాదుడు, ’ఇస్కాన్ చుట్టూ ఎవరూ ఆకలితో బాధపడకూడదు. వారికి కడుపునిండా అన్నం పెట్టండి’ అని వీధిబాలలని అక్కున చేర్చుకున్న శ్రీల ప్రభుపాదుడు, తన మాజీ సహ సన్యాసులని పస్తుల పాలెందుకు చేసినట్లు? తనకీ, తన సంస్థకీ ఏలోటూ లేదు. ‘పోనీ పాపం’ అనుకునైనా గౌడీయమఠాన్ని ఉపేక్షించలేదంటే అర్ధం ఏమిటి? అంతరార్ధం ఏమిటి? 'హిందూమతం మీద కుట్ర' తప్ప మరో కారణం, కాదంటే కాదు.

అసలు ఈ మధురభక్తికి ఆద్యుడు, చైతన్యుడి జన్మస్థలం మాయాపూర్ లో ఉన్నది. ఈ శ్రీల ప్రభుపాదుడి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుర చైతన్యుడి మధురభక్తి గురించి ఇంగ్లీషులో ప్రచారించమని కోరాడు. చైతన్యుడి మధురభక్తి సిద్ధాంతం మీద ఆధారపడి ఇస్కాన్ ఇన్ని ఆస్తులు సంపాదించింది. పదేహేడు సంవత్సరాల క్రితం మేము చైతన్యుడి జన్మస్థలం[నిమాయి] చూసినప్పుడు, ఏ ఆలనాపాలనా లేక బీదబీదగా ఉంది. ఇస్కాన్ డాబు, ధంబం, దర్భంతో వెలుగుపోతుంది. మరి శ్రీల ప్రభుపాదుడికి చైతన్యుడి జన్మస్థలం ఎలా పవిత్రం కాకుండా పోయింది?

అంతేకాదు, మీరు ఎప్పుడైనా మాయాపూర్ వెళ్తే పరిశీలించండి. ఇస్కాన్ లో రిసార్ట్ టూరిస్టుల విహార భక్తీ, ఇస్కాన్ పుణ్యనా శాఖోపశాఖలుగా చీలిపోయినా సరే, వివిధ గౌడీయమఠాలలో మధురభక్తి కన్పించి తీరుతుంది. రిసార్ట్ టూరిస్టులు గాకపోతే ఇస్కాన్ దేవాలయాలకు, పాశ్చాత్యులతో సరిసమానంగా భారతీయులు సైతం షార్ట్స్, స్లీవ్ లెస్ లతో రారు కదా?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

Very interesting analysis. "హిందూమతం మీద కుట్ర' తప్ప మరో కారణం, కాదంటే కాదు." ఎందుకు శ్రీల ప్రభు పాదుడికి అంత కుట్ర చేయవలసిన అవసరం? గౌడీయ మతం మీద అంటే వుందేమో ఆయనకు కోపం ,అంటే అంతటి పరిణితి పొదిన వ్యక్తి కి మనకు మల్లే కోపాలు కక్ష్యలు ఏమిటి అనేది ఇంకో ప్రశ్న, కాని హిందు మతం మీద ఎందుకు లాజిక్ అర్ధం కాలేదు? ఆయన నకిలి కణికుడంటారా? అసలు నకిలి కణికుడంటే? నేను మొన్నీ మధ్య ఇండియా కు వెళ్ళినప్పుడు స్వామి నారయణ్ టెంపుల్ కు వెళ్ళేను డిల్లి లో నా 15 ఏళ్ళ కొడుకు ఇలానే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమి చెప్పలో అర్ధం కాలేదు, నువ్వు కృష్ణు డి లీల లు చూపిస్తారు అన్నావు ఎక్కడ అమ్మ అంతా ఆ సెయింట్ గురించి 3D మూవీ వేసి చూపించటం దానికి మనం ఇంత టికెట్ పెట్టి వెళ్ళటం అని ఆశ్చర్యార్ధకం గా ప్రశ్నార్ధకం గా వాడు అడిగిన ప్రశ్నలకు ఏదో చెప్పేను కాని నాకే అవి సమాధానమనిపించలేదు. శ్రీశ్రీ గారన్నట్లు "ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం".

మంచి కుతూహలాన్ని కలిగిస్తున్నది మీ టపా. తిరుపతి లోని హతీరాం మఠం కూడా వీరిదేనా.

భావన గారు,

బహుశ మీరు క్రొత్తగా నాబ్లాగులోకి వచ్చి ఉంటారు. నకిలీ కణికుడంటే ఎవరో, హిందూమతం మీద కుట్ర ఏమిటో, ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుండి చేస్తున్నారో తెలియాలంటే – మీరు నా గత టపాలు చదవాల్సిఉంటుంది. సుదీర్ఘమైన విషయాన్ని, ఒక్కమాటలోనో, వాక్యంలోనో చెప్పటం సాధ్యం కాదు కదా? ఇక సన్యాసులకి ఈర్ష్యాసూయలుంటాయా అన్నారు. ఉంటాయండి! సన్యసించినంత తేలికగా అరిషడ్వర్గాలని వదిలించుకోవటం సాధ్యంకాదు. ఆధిపత్యపోరాటాలు, అసూయపూరిత నిందలు ఒక్క హిందూమఠాలలోనే ఏమిటి, క్రైస్తవ మిషనరీలలో సైతం ఉండటం చూశాను.
అదీగాక శ్రీల ప్రభుపాదుడిని పైముఖంగా, గౌడీయమఠపు ఆస్థులపై కోర్టువివాదాలని పైకారణంగానూ [over leaf reason] గానూ పెట్టుకుని ఇస్కాన్ ముసుగుమాటున దాగిన సి.ఐ.ఏ., హిందూమతపు నమ్మకాలని చేసిన ఎగతాళి, ఎకసెక్కం అది! ’పస్తులుండే స్థితిలో, ఏదీ నీ శ్రీకృష్ణుడొచ్చి నీకు అన్నం పెట్టాడా? కోర్టుకేసులు తొలిగించాడా? భక్తుల చేత విరాళాలు ఇప్పించాడా? నమ్ముకున్న నీదేవుడు నిన్ను కాపాడలేదేం? కాపాడేది దేవుడు కాదు, డబ్బు అధికారం!’ అన్న అవహేళన అది. ఇదే అవహేళనకి పన్నెండు సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించి, ప్రతీరోజూ చిత్రవిచిత్రపు శిక్షలకి గురిచేస్తూ కంచెర్ల గోపన్నని హైదరాబాద్ నవాబు తానీషా చేసాడు. అక్కడి నుండే తొలితరం నకిలీ కణికుడి బ్రతుకు ప్రారంభం అయ్యింది. తరతరాలుగా కొనసాగిన ఈ దాసీపుత్రుల వంశపు బ్రతుకు ఇప్పుడిప్పుడే క్లైమాక్స్ దిశలోకి ప్రయాణిస్తోంది.

*************
నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)గారు,
తిరుపతిలోని హాధీరాం మఠం ఇస్కాన్ వారిది కాదండి. బ్లాక్&వైట్ లో, ఎన్టీఆర్, సావిత్రి నటించిన ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’ సినిమా చూశారా? అందులో చిత్తూరు నాగయ్య నటించిన బావాజీ [బాలోజీ అని కూడా అంటారు] పాత్ర హాధీరాం. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడైన ఆయనపై నిందారోపణలు వస్తాయి. తన భక్తిని నిరూపించుకోవటానికి ఆయనని రాత్రి తెల్లవారేలోగా బండెడు చెరుకు తినవలసిందిగా నిర్ధేశిస్తారు, రాజు, ఇతర పూజారులు. అయితే చెరసాల గదిలో దుఃఖిస్తూ ప్రార్ధించిన తన భక్తుణ్ణి కాపాడాటానికి శ్రీ వెంకటేశ్వరుడు ఏనుగురూపంలో వచ్చి చెరుకంతా తినేస్తాడు. తలుపులు వేసి ఉన్న చెరసాల గదిలోకి, అందునా చిన్నద్వారంలో నుండి ఏనుగులోనికి ప్రవేశించడం అసంభవం. అదీగాక అంతలోనే ఏనుగు అంతర్ధానమైపోయింది. దాంతో ప్రజలూ, రాజూ, అందరూ ఆయన భక్తిని ప్రశంసిస్తారు. అప్పటి నుండి ఆయనకి హథీరాం స్వామిజీ అన్నపేరు వచ్చింది. భగవంతుణ్ణి ఎంతగా పూజిస్తారో, అంతగా భక్తుల్ని గౌరవించే వారు ఆనాటి హిందువులు. దాంతో రాజు, ఇతర ధనికులూ హాథీరాంస్వామిజీకి తిరుమలలో ఆశ్రమ[మఠం] స్థలాన్ని, చాలాచోట్ల సస్యశ్యామల క్షేత్రాలని కానుకగా ఇచ్చారు. అయితే ఇప్పుడు హాథీరాం మఠం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఆ మఠం క్రింద ఉన్న భూమి కోర్టు వ్యాజ్యాలలో ఉంది. గుంటూరులో కూడా ఈ మఠానికి భూములున్నాయి. కౌలుదారులకీ, మఠానికి మధ్య వివాదాలున్నాయి. జస్టిస్ వెంకటాచల్లయ్య కమీషన్ ఇలాంటి వాటిని విచారించి నివేదిక ఇచ్చిందని నా చిన్నతనంలో విన్నాను. తదుపరి ప్రభుత్వం దీనిమీద ఏ నిర్ణయాలు తీసుకుందో తెలియదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu