గత టపాలో వివరించినట్లుగా భర్త కష్టాలని పంచుకునేందుకు రాజ్యభోగాలు వదలి భర్తతో అడవులకు తరలిన సీతా దేవిని మరచిపోయిన ఆధునిక శ్రీమతులు కొందరు, భర్తలు ఓటమిలో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవటానికి వెనుకాడటం లేదు. ఉద్యోగంలో సస్పెండ్ అయినప్పుడో, వ్యాపారంలో కష్టాల పాలైనప్పుడో… వృత్తిలో అవకాశాలు పోగొట్టుకున్నప్పుడో… ప్రముఖల జీవితాల్లో కూడా ‘ఇలాంటి విడాకుల’ సంఘటనలని చూస్తూనే ఉన్నాం కదా!?

ఈ విధంగా సమాజంలో… ‘విడాకులు పెరిగిపోయిన, సర్ధుబాటు ధోరణి తరిగిపోయిన’ నేపధ్యం నేటిది. ఒకప్పుడు ఇతిహాసాలు మానసిక శాస్త్రవేత్త (సైకాలస్ట్, సైక్రియాట్రిస్ట్) ఇంకా ఫ్యామీలీ కన్సల్టంట్ ల పాత్రలని కూడా నిర్వహించేవి. పురాణాలు కాదు సుమా! పురాణాలలో ప్రకోపపూరితాలైన చాలా ప్రక్షిప్తాలు వచ్చి చేరాయి. హోటల్ కి వెళ్ళి, సాంబారులో తానే బొద్దింక వేసి యాగీ చేసే రేలంగి లాగా… నకిలీ కణిక వ్యవస్థ నిర్వహించిన స్ట్రాటజీ ఇది.

ఇతిహాస గాధలు, ప్రజలు తమ జీవన శైలిని రూపొందించుకునేందుకు తోడ్పడేవి. ఇప్పుడు మానసిక నిపుణులకు డబ్బు చెల్లించి, అప్పాయింట్ మెంట్ల కోసం వేచి ఉండి, గోడు వెళ్ళబోసుకుని, వాళ్ళు చెప్పింది నోరెళ్ళ బెట్టుకుని వింటున్నారు. వ్యాపార దృష్టితో చూసినా కూడా అపారమైన సంపాదనే! ఇతిహాసాలపై ప్రజల ఆదరణని తుడి చేస్తే ఇలాంటి ప్రయోజనాలు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

ఎందుకంటే – ఒక్క రాముణ్ణి, రాముడి కుటుంబాన్ని చూస్తేనే… ఎలా ఉండవచ్చో, ఎలా ఉండకూడదో అవగతమౌతుంది మరి!

మరోసారి రామాయణ గాధలోకి పరికిస్తే – శ్రీరామ వనవాసంలో సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వత ప్రాంతంలో నివసిస్తున్నారు. సీతారాములు అడవి తాలూకూ అందాల్నీ, ప్రశాంతతనీ ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరైన ఆ సతీపతులు పరస్పర సాన్నిహిత్యాన్నీ ఆస్వాదిస్తున్నారు. ఏకాంతాన్నీ, హడావుడి లేని విరామాన్నీ, తీరికదనాన్నీ ఆనందిస్తున్నారు.

రాజప్రాసాదంలో దొరకని అవకాశాలవి. మనసారా వాటిని ఆనందిస్తున్నారు. సీతారాములకి ‘తాము రాజభోగాలని కోల్పోయామనే దుగ్ధో, దుఃఖమో’ లేవు. ప్రకృతి ఒడిలో ప్రశాంతతనీ, సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఎక్కడ ఉంటే అక్కడే ఉన్న సానుకూలాంశాలని ఆనందిస్తూ గడిపారు.

ఇప్పుడు చాలామందికి అర్ధం కూడా కాని మానసిక స్థితి అది. ‘నగరాలని వదిలి, గ్రామాల్లో జీవితాన్నే భరించలేం’ అనుకునే వారికి రాజప్రాసాదాలని విడిచి అడవి ప్రశాంతతని సహించగలరా? హడావుడి జీవితంలో ప్రకృతి పరిశీలనా మరుగున పడిపోయింది, సహచరులతో సాన్నిహిత్య జీవితమూ కొరవడింది. బ్రతుకు పోరాటమే మొత్తం నిండిపోయింది.

నిజానికి మనం దేని కోసం పరుగులు పెడతామో ‘అది’ మనల్ని మరింత పరుగు పెట్టిస్తుందే తప్ప అందుబాటులోకి రాదు. అయితే ‘పనిచేయటం నావంతు. ఫలితం వచ్చేదే అయితే వస్తుంది. రానిదైతే నేనేం చేసినా రాదు. ఏ ఫలితమైనా దేవుడిచ్చేది’ అనుకుంటే… పరుగు తాలుకూ ఆయాసం ఉండదు. కృషి ఫలితం వొట్టిపోదు కూడా! ఇది నా స్వానుభవం! పరికించి చూస్తే ‘ఎవరికైనా ఇది జీవితంలో అనుభవాని కొచ్చేదే’ అనుకుంటాను.

ఒకప్పుడు బుద్దియోగాన్ని (అంటే ఫలితాన్ని ఆశించకుండా, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కర్మలనాచరించటం) ‘నిరాశావాదం’(పెసిమిజం) అని ప్రచారించారు. ‘ఫలితాన్ని ఆశించక పోవటమంటే, అసలు ఆ పని చేయటంలో ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుంది?’ అని ప్రశ్నించారు.

నిజానికి, ఆచరిస్తే… అందులో ప్రయోజనాలేమిటో, ప్రమాదాలేమిటో, మంచి చెడుగులేమిటో తెలుస్తాయి గానీ, శుష్క చర్చలతో ఒరిగేదేమిటి? ఒడ్డున నిలబడి, నీటిలో ఈదటం గురించి చర్చలు చేయటం వంటిదే అది!

నీటిలోకి దిగి ఈదితే గదా, సాధక బాధకాలేమిటో, లాభనష్టాలేమిటో తెలిసేది!?

ఇక, రామాయణంలో, భరతుడు… అడవుల్లో ఉన్న శ్రీరాముడిని చేర వచ్చినప్పుడు, అతడు తల్లి కైక వరాలతో తనకు సంక్రమించిన రాజ్యాన్ని తిరిగి శ్రీరామునికి అర్పించేందుకు వస్తున్నాడని తెలియక, శ్రీరాముడిపై దండయాత్రకి వస్తున్నాడనుకొని, లక్ష్మణుడు భరతుడిపై దాడి కుద్యుక్తుడై దురుసోక్తులు పలుకుతాడు. రాముడతడిని వారించి, క్రోధమెంత అనర్ధదాయకమో చెబుతాడు.

‘ఆవేశంలో కూడా అనరాని మాటలంటున్నావు. శాంతించు’ అంటూ వారిస్తాడు. మూల రామాయణంలో వాల్మీకి శ్లోకాల కంటే, ప్రజా బాహుళ్యంలో రాముడు ఇలా శాంతమూర్తిగా, ధీరగంభీరంగా ఉంటాడు. శోకమూర్తిగా మూర్ఛితుడిగా ఉండడు. ఈ విషయాన్ని హేటువాదులు ఇష్టాపూర్వకంగా మరిచిపోయారు.

ఇక రామభరతుల సంభాషణలోనూ, రామగుహుల సంభాషణలోనూ, శ్రీరాముడితో మునీశ్వరుల చర్చల్లోనూ ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. సీతాదేవితో మునిపత్నుల సంభాషణలు కూడా, ఎంతో ఆసక్తికరంగా జ్ఞానపూర్ణంగా ఉంటాయి.

నిజానికి, అనసూయా దేవి తదితర మునిపత్నులతో సీతాదేవి సంభాషణలోనే… ప్లాష్ బ్యాక్ గా… సీతాకళ్యాణం వర్ణింపబడుతుంది. సీత తన పెళ్ళి విశేషాలన్నీ చెప్పాక “అమ్మాయీ! శివధనుర్భింగం ఇత్యాది అన్ని విషయాలూ నాకు తెలిసినవే! అయినా, నీ నోటి నుండి వినాలని ముచ్చటపడి అడిగాను” అంటుంది, అత్రిమహాముని సతీమణి అనసూయ. ఆమె త్రిమూర్తులకే మాత!

ఆ విధంగా ఫ్లాష్ బ్యాక్ గా సీతారామ కళ్యాణ గాధ రామాయణంలో అరణ్యకాండలో వస్తుంది.

శ్రీరామ వనవాస కాలంలో, రామలక్ష్మణులు దండకారణ్యంలో ఉన్న ఖరదూషణులు, వాళ్ళ అనుచరులూ అయిన, పదివేల మందికి పైగా రాక్షసుల్ని సంహరిస్తారు. అసురుల సంఖ్యతో పోలిస్తే ఆ అరణ్యంలో ఉన్న సాధుజనులు, తాపసుల సంఖ్య స్వల్పం. అసురులు సృష్టిస్తున్న అలజడి అక్రమాలు అపారం.

అచ్చం, ఇప్పుడు మన దేశం నిండా అసంఖ్యాకంగా ఉన్న అవినీతిపరులు, వాళ్ళు సృష్టిస్తున్న అలజడులూ, అక్రమాల పరిస్థితి వంటిదే అది. అప్పటి తపోజనుల మాదిరిగానే ఇప్పుడూ, అవినీతి జోలికెళ్ళని నీతిపరుల సంఖ్య స్వల్పమే! అప్పటి రక్కసుల మాదిరిగానే, ఇప్పటి అవినీతి రక్కసుల అక్రమాలూ అపారమే కదా!

అలాంటి అసురులనీ, వారి అక్రమాలనీ అంత మొందించాడు రాముడు. ఇది గుర్తుకొచ్చినప్పుడు ‘ఇప్పుడూ అలాంటి రామలక్ష్మణులరుదెంచి ఈ అవినీతి పరుల పీడ వదిలిస్తే ఎంత బాగుణ్ణు!’ అనిపించడం ఖాయం.

అయితే… శ్రీమాన్ రంగనాయకమ్మలు మాత్రం, తెగ విషవాదనలు కురిపించారు సుమా! వాళ్ళపాటికి వాళ్ళు దండకారణ్యంలో ఉన్న ఖరదూషణాది అసురులు, అక్కడి స్థానికులట. వాళ్ళ జీవన శైలి వారిదట. వాళ్ళ సహజ ప్రవృత్తి ప్రకారం వాళ్ళున్నారట.

అనివార్యమై అరణ్యవాసం వచ్చిన రాముడు, తన కీర్తి కండూతి తీర్చుకోవటం కోసం, అస్తిత్వం కోసం, వాళ్ళని తనకున్న ఆధునిక ఆయుధ సాంకేతికతతో వాళ్ళని చంపాడట. రాక్షసులతో పోలిస్తేనట రాముడిది ఆధునిక ఆయుధ సాంకేతికత అట. అదే ‘రాక్షసులకి మాయా యుద్ధాల తెలుసు కదా!?’ అంటే… ‘అదంతా కల్పితాలనేస్తారు’ ఈ రచయితలు/త్రులు.

అలాంటి చోట… శ్రీరాముడంటూ, అతడిది ధర్మాచరణంటూ, తర్వాతి కాలం నాటి కవులూ గాయకులూ, రాముడికి గొప్పదనం అంటగట్టారట. ‘రాముడిది ధర్మాచరణ అయితే, బ్రిటీషు వాళ్ళదీ ధర్మాచరణే ననాలి’ అనేంత బలంగా వాదించారు, సదరు విష రచయితలూ/రచయిత్రులూ!

ఎందుకంటే – రాముడు ధనుస్కుబాణాల టెక్నాలజీతో ఆధిక్యత చూపినట్లే, యూరోపియన్లు, బ్రిటీషు వాళ్ళూ, ఈస్ట్ ఇండియా కంపెనీ గట్రాలు, తుపాకి టెక్నాలజీతో స్థానికులైన ఇండియన్ల మీద ఆధిక్యత సాధించారట. ఇదీ వాదన!

నకిలీ కణిక వ్యవస్థకి స్పష్టమైన తోడ్పాటు ఇది. అప్పటికి స్పష్టపడక పోయినా, ఇప్పుడు 70MM లో ఆవిష్కృతమైన, అవుతోన్న తోడ్పాటు ఇది! అందుకే – సదరు రచయితలూ/రచయిత్రులకు… మీడియా, ఎనలేని తోడ్పాటునిచ్చి, వారి విష వృక్ష రచనలకీ, ఉపన్యాసాలకీ… తిరుగులేని ప్రచారాన్ని ఇచ్చింది.

నిజానికి, శ్రీరాముడితో, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్… పోల్చదగినవా? శ్రీరాముడు తన కంటే బలమైన రాక్షసులతో పోరాడాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్ వాళ్ళలా… బక్కచిక్కిన వాళ్ళ మీదా, సామాన్య ప్రజల మీదా జులుం చూపెట్టలేదు. అందునా రాక్షసులకి మాయా యుద్ధం తెలియటమే కాదు, ఆనాటికి ఆధునాతన ఆయుధాలున్నాయి. శస్త్రాస్తా ప్రయోగాలు తెలుసు!

ఆ రాక్షసులు సాధుజనుల మీదా, తపస్సు చేసుకునే మునుల మీదా, సీత మీదా హింసకి పాల్పడ్డారు. అంతే గాక, శ్రీరాముడు రాక్షసుల మీదా, రాక్షసుల లంక మీదా గెలిచాక, వారి సంపదని అయోధ్యకి లూటీ చేసుకు పోలేదు, ఈస్టిండియా కంపెనీ, భారత్ లో చేసినట్లు… బ్రిటీషు వాళ్ళు, భారత్ తో సహా ప్రపంచమంతా చేసినట్లు!

పైగా… సదరు ఖర దూషణాది రాక్షసులకూ, దండకారణ్యం స్థానికం కాదు. వాళ్ళు అక్కడి స్థానికులూ కాదు. లంక నుండి, లంకేశ్వరుడి బలాధిక్యతతో విస్తరించిన వారే! ఇవన్నీ వదిలేసి, ఒక్కమాటతో చెప్పాలంటే మంచి వదిలేసి, మొత్తంగా రామాయణ భారతాల వంటి ఇతిహాసాల మీద దాడి చేయటమే పరమ కర్తవ్యంగా పని చేసారు సదరు రంగనాయకమ్మలు!

మొత్తంగా హిందూ మతాన్ని ధ్వంసం చేయటం అనే ‘అసైన్ మెంట్’ని ఇతోధికంగా నిర్వహించారు. కుట్రకు మద్దతుదారులే వీళ్ళంతా, తెలిసి చేసినా, తెలియక చేసినా వాళ్ళు చేసింది మాత్రం హిందూమతం మీద, భారతీయత మీదా కుట్రే!

రంగనాయకమ్మల గురించీ, ఇంకా అలాంటి ఇతర రచయితల గురించీ, వారి రచనలైన రామాయణ విషవృక్షాల వంటి విషతుల్య ప్రచురణల గురించీ, ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే – తమ కుట్ర పూరిత రచనలతో, హిందూ వ్యతిరేక చర్యలతో, వాళ్ళు… తెలుగు యువత నుండి, హిందూ ఇతిహాసాలని తుడిచేసారు.

ఇతర భాషల్లో ఇలాంటి అసైన్ మెంట్లని, మరెవరో రచయితలు/రచయిత్రులు నిర్వహించి ఉంటారు. తమిళ రంగనాయకమ్మలూ, కన్నడ రంగనాయకమ్మలూ, హిందీ రంగనాయకమ్మలూ గట్రాలన్న మాట.

ఇక ఇప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి… అంతగా ఆ అవసరమూ లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపుగా, ఇతిహాస గాధలని సమాజం నుండీ, యువతరం నుండీ తుడిచి వేసారు. ఇప్పుడు చాలామంది యువతీ యువకులకి, భారత రామాయణ గాధలు తెలియదు. ఆ మానవీయ విలువలూ తెలియవు. అయినా ఇంకా అప్పుడప్పుడు, ‘ద్రౌపది’ వంటి నవలల్నీ… అలాంటి రచనలు చేసే ‘మేథావులు’ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లకి నీరాజనాలనీ… చూస్తూనే ఉన్నాం కదా!

గతంలోని రంగనాయకమ్మలకి మచ్చుతునకలే (రెప్లికాలు) వర్తమానంలోని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్లు!

దీన్ని సోదాహరణంగా వివరించాలంటే – మరోసారి రామాయణ విషవృక్షపు కాలుష్యాన్ని పరిశీలించాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

14 comments:

Your posts are very nice Madam. I have been reading all your posts since 2 months. Great narration. Please keep continue these series.

బాగా రాసారు. అందుకే కదా విష వృక్షం రాసిన కొద్ది రోజులకే ఓ గ్యాస్ ఏక్సిడెంట్లో ఆవిడ, ఆవిడ భర్త కూడా మరణించారని విన్నాను. ప్రతీ వారికీ ఇది ఓ ఫ్యాషన్ అయిపోయింది్. నాకు తెలిసిన నాస్తికులు, అన్య మతస్థులు రహస్యంగా మన పద్దతులు, నమ్మకాలు పాటిస్తారు (పాప భీతితో) పైకి మాత్రం దేవుడి మీద (ముఖ్యంగా మన హిందూ దేవుళ్ళ మీద) అవాకులు, చవాకులు పేల్తుంటారు. అందుకే నా బ్లాగులో కూడా ఇలాంటి విషయలే రాస్తున్నాను వీలైతే చదవండి.

అజ్ఞాత గారు: మీ అభిమానానికి నెనర్లండి!

ఓలేటి గారు: మీరన్నది నిజమండి. పోతే ఒక పొరపాటు వ్రాసారు. మీరు రామాయణ విషవృక్షం రచయిత్రి రంగనాయకమ్మను మాదిరెడ్డి సులోచనగా పొరపాటు పడుతున్నారు. మాదిరెడ్డి సులోచన గారు గొప్ప సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి. ఆవిడ, ఆవిడ భర్త గ్యాస్ ఏక్సిడెంట్లో చనిపోయారు.

రంగనాయకమ్మ గతంలో ముప్పాళ్ళ రంగనాయకమ్మగా చలామణిలో ఉండేవారు. భర్తతో విడాకులు తీసుకున్నాక(?)ఆవిడ తన పేరు ముందు ముప్పాళ్ళ వాడకూడదని ప్రకటించుకున్నారు. విషవృక్ష రచన తరువాత రోజుల్లో ఆవిడకు మతిభ్రమించిందనీ, ప్రస్తుతం బాగానే ఉన్నదనీ చదివాను. సత్యాసత్యాలు తెలియదు. నెనర్లు!

ఆదిలక్షి గారు,
:: మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ::

యధాప్రకారం చక్కటి టపా, కృతజ్ఞతలు.

నా అభిపాయాలు.

$రంగనాయకమ్మల గురించీ ...వారి రచనలైన రామాయణ విషవృక్షాల ..గురించీ, ప్రత్యేకించి ఎందుకు... – తమ కుట్ర పూరిత రచనలతో, హిందూ వ్యతిరేక .. వాళ్ళు… తెలుగు యువత నుండి, హిందూ ఇతిహాసాలని తుడిచేసారు.

తెలుగు యువత నుండి హిందూ ఇతిహాసాలని తుడిచేసెంత దృశ్యం ఈ రంగనాయకమ్మల రచనలకి లేదు లెండి! మహా అయితే ఆవిడ తన తర౦లొ, తర్వాతి తరలో కొంత మందిని ప్రభావితం చేసిఉండవచ్చు. అలాంటి వాళ్ళలో కొంతమంది వయసుడిగిన ముదిమి రచనలు ఇప్పుడు చూస్తూనేవున్నాం. అలాగే ముందు తరానికి సృష్టించిన వాస్తవాలకి, చారిత్రాత్మక వాస్తవాలకి మద్య తేడా చెప్పేవారు లేక, పుస్తక పటనమే దిక్కైన రోజుల్లో కాయిన్కి ఒక వైపు ఉన్నదాన్ని మాత్త్రమే చూపించే విష విలయంలో చిక్కుకున్నారు. ఇప్పుడు కాలం మారింది, ఇంటర్నెట్ పరశురామాస్త్రంగా మారింది. వాదానికి ప్రతివాదాలు, నిజ నిరూపణలు మరియు దానికి కావాల్సిన ఆధారాలు బయటపడుతున్నాయి, ఈ ర.నా రచనలు బుంగ పాలవుతున్నాయి.

అలాగే ఈ తరం యువత ర.నా ల చెత్తలో ప్రతి దాన్నీ గుడ్డిగా నమ్మకుండా తమకు తాముగా నిజమేదో తెలుసుకుంటూఉన్నారు. నలుగురితో పంచుకుంటున్నారు. అందులో మీలాంటి పెద్దవాళ్ళ పాత్ర ఇతోదికమైనది.

$ఇతిహాస గాధలని సమాజం నుండీ, యువతరం నుండీ తుడిచి వేసారు. ఇప్పుడు చాలామంది యువతీ యువకులకి, భారత రామాయణ గాధలు తెలియదు. ఆ మానవీయ విలువలూ తెలియవు.

ఆ మానవీయ విలువలూ పాటించడం అన్నది కాస్త పక్కన బెడితే, ఈ అసంధిగ్ధత, భరించలేని వత్తిడులుసమతుల్యత లేని భయానక వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్న యువత భారత రామాయణాలాని ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ మానసిక వైద్యులు పట్టాభిరామ్ గారి నుంచి యండమూరి వరకు యువతకి చెప్తున్నది ఇదే. అతిత్వరలో ఈ విషవ్రుక్షాలు కూలిపోయి భారతరామాయణాలు రాజనీతి,మానసిక శాస్త్రాలుగా మరింత వెలుగొందుతాయని ణా ప్రగాఢ విశ్వాసం.

విషవృక్షంపై మీరు లేవనెత్తిన పాయింట్లు బావున్నాయి.

ద్రౌపది కి సాహిత్య అకాడెమీ బహుమతి విషయం చవకబారు రాజకీయానికి ప్రతీక.ఇది లాబీయింగ్ అని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఇలాంటి వాళ్ళు మన పౌరాణికపాత్రల గురించి రాయడం దౌర్భాగ్యం.

"అంతే గాక, శ్రీరాముడు రాక్షసుల మీదా, రాక్షసుల లంక మీదా గెలిచాక, వారి సంపదని అయోధ్యకి లూటీ చేసుకు పోలేదు, ఈస్టిండియా కంపెనీ, భారత్ లో చేసినట్లు… బ్రిటీషు వాళ్ళు, భారత్ తో సహా ప్రపంచమంతా చేసినట్లు!"

Excellent point.

"నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి". This person is a foreign spy. Put in place to rule over Hind** with the help minorities and anti-Hind** Caste Hind**.

How else it is possible for a single person to appoint PM, President, SC Judges, CM, Governor, Ministers etc.

సత్యేంద్ర గారు: ‘ఉల్లిపాయలకీ, సాక్ట్ మార్కెట్ కి మధ్య సంబంధం ఏమిటి?’ మంచి లింక్ ఇచ్చారండి. లింక్ ఇక్కడ ప్రచురిస్తున్నాను.
http://namastheandhra.com/newsdetails.asp?newsid=14697#

రాజేష్ గారు: మీ వ్యాఖ్య నాకు చాలా నచ్చిందండి. యువతరంలోని రోషం కూడా నచ్చింది. మీ(మా)ప్రగాఢ విశ్వాసం కూడా అదే! నిజమై తీరుతుంది. కాకపోతే భారత రామాయణాలు ఏమాత్రం తెలియని విద్యార్ధులని (ఇంటర్, డిగ్రీ కూడా) చాలామందిని చూసి ఉన్నాను. మీరన్నట్లు మెల్లిగా వాళ్ళయినా ఇతిహాసాల దగ్గరకి వచ్చి తీరతారు. నెనర్లు!

రవి గారు: నిజం చెప్పారు. నెనర్లండి.

అజ్ఞాత గారు: నా పాత టపాలలో వివరించానండి.అన్ని టపాలు ఒకేచోట లేదా అన్ని లేబుల్స్ ఒకే చోటలో చూడగలరు. నెనర్లు.

*నిజానికి, శ్రీరాముడితో, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్… పోల్చదగినవా? శ్రీరాముడు తన కంటే బలమైన రాక్షసులతో పోరాడాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్ వాళ్ళలా… బక్కచిక్కిన వాళ్ళ మీదా, సామాన్య ప్రజల మీదా జులుం చూపెట్టలేదు. *
రాముడు గురించి కాదు గాని ఆంగ్లేయుల గురించి ఒక అనుమానం. వాళ్లు జులుం చూపింది బక్క చిక్కిన మన సామాన్యుల మీద ? బక్క చిక్కిన వారిని ఏమి దోచుకుంటారు ఎవరైనా ? మనం అప్పటికే అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన వాళ్లమని , అత్యంత సంపన్నంగా సుభిక్షంగా మన దేశం వుండేది అని , ఈ అప్రాచ్యులు మనలని దొంగ తెలివితో దోచుకున్నారని కొన్ని కధనాలు కదండీ ?
మరొక అనుమానం ? మాదిరెడ్డి సులోచన : ఈవిడేనా రామాయణ విషవృక్షానికి వ్యతిరేకంగా కల్పవృక్షం రాసినది ?

వాళ్ళకి అనువుగా మలచుకొగలిగినవి, విషం చిమ్మే అవకాసాలు వచ్చినప్పుడు మన పురాణాలు, ఇతిహాసాలు నిజమని అని అందులొ ఉదాహరణలు ఇచ్చే వీళ్ళే అప్పుడప్పుడూ పొరబాటున అసలు రామాయణం లేదు..రాముడు లేడు అని కూడా అనేస్తూ ఉంటారు. ఈ నల్ల బ్రిటిషర్ల కుళ్ళు స్వాభావం ఎవరికి తెలీదు :-)
ఇక రంగనాయకమ్మ గురించి ఒకరు చెప్పాలటండీ... ఈ నెట్ లు గట్రా లేని రొజుల్లొ వీళ్ళు ఎంత చెప్తే అంతే కానీ.. ఈ రొజుల్లొ ఈ సమాచార విప్లవం వచ్చాక ఎవరు ఎలాంటి వారొ అందరికీ ఈజీ గా అర్ధం అవుతుంది. వాళ్ళు విషం కక్కాలని చూసే ప్రతిసారి...వాళ్ళకి తెలీకుండానానే మనల్ని ఒకటి చేస్తున్నారు. :-)

అన్నట్లు మీకు ఒక కధల పొటీలొ సెకండ్ ప్రైజ్ వచ్చింది అని ఎక్కడొ చూసాను...కొంచెం లింక్ ఇవ్వగరలరా :-)

విషవృక్షం సంగతి పక్కన పెడితే... మొన్నటి నవ్య మ్యాగజైన్లో రంగనాయకమ్మగారో విచిత్రవాదన లేవనెత్తారు. ఆ పత్రికలో వారానికొక రచయిత స్వగతం వేసి, వారికి నచ్చిన కథ వేస్తున్నారు. దీనిపై రంగనాయకమ్మగారి వాదన ఏంటంటే... ‘ఒకటి నచ్చిన కథయితే మిగతావన్నీ నచ్చని కథలనే కదా అర్థం, కాబట్టి ఆ మిగతా కథల ప్రచురణ ఆపేయాలి’. అది చదివాక... ఆవిడకు పిచ్చి బాగా ముదిరిందనిపించింది. రచయితలన్నాక రకరకాల ఇతివృత్తాల మీద రచనలు చేస్తారు. అందులో వాళ్ల మనసుకు నచ్చిన ఇతివృత్తం మీద రాసిన కథలు మిగతా వాటికంటే ఇంకొంచెం ఎక్కువ నచ్చవచ్చు. అంతమాత్రాన మిగతావి చెత్తకథలా అంటే ఇంక ఆవిడకు ఏం సమాధానం చెప్తాం?
రంగనాయకమ్మగారికి ఉన్న పెద్ద సమస్య(ఇది నా అనుకోలు మాత్రమే)... ప్రతిదాన్నీ తర్కం ప్రకారం ఆలోచించడం.
ఇలా అన్ని విషయాల్లోనూ మెదడుతో మాత్రమే ఆలోచిస్తే కష్టం. అప్పుడప్పుడూ మనసుతోనూ ఆలోచించాలి.
ఇవన్నీ చూశాక ఆవిడ మీద కోపం రావట్లేదు సరికదా జాలేస్తోంది.
ఇకపోతే... రామాయణ విషవృక్షం గురించి అంత బాధపడక్కర్లేదండీ. ఆ పుస్తకంతో ప్రభావితులైనవాళ్లు చాలా తక్కువమంది. ఈ విషయంలో మనమూ బాపుగారి దారిని అనుసరిస్తే బెటర్... ‘రామ రామ’ అని!!

కృష్ణ గారు:
బక్కచిక్కిన వాడి నుండి ఎవరైనా దోచుకోగలిగింది శ్రమేనండి. శ్రమ దోపిడి చేస్తున్న వాళ్ళే నాటి తెల్లతోలు దొంగలైనా, నేటి నల్ల తోలు దొంగలైనా! ఇకపోతే మాదిరెడ్డి సులోచన గారు నవలారచయిత్రి అండి. రామాయణ కల్పవృక్షం పద్యకావ్యం వ్రాసింది శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు.

మంచుగారు:
నిజమేనండి. వాళ్ళకి తెలియకుండానే మనల్ని ఒకటి చేస్తున్నారు. అందుకే ఏది జరిగినా మన మంచికే అన్నారేమో పెద్దలు! :)

సంపుటి e-పక్ష పత్రికలో సంక్రాంతి కథల పోటీలో మూడవ బహుమతి వచ్చిందండి. నా కథ ప్రచురింపబడినప్పుడు తెలియ జేస్తానండి. సంపుటి పత్రిక లింక్ సైడ్ బార్ లో ఉన్నదండి. గమనించగలరు.

బాలు గారు: భారతీయ ఇతిహాసాల మీద కుట్ర అనే ఈ టపాల మాలికలో నేను కుట్ర జరిగిన తీరునీ, దాని దుష్పలితాలనీ వివరించాలని ప్రయత్నిస్తున్నానండి. అంతే గానీ నాకు రంగనాయకమ్మ మీద గానీ, ఆమెలాంటి ఇతరుల మీద గానీ కసీ ద్వేషమూ లాంటివి లేవు. అలాగని ఆమె మీద నాకు దయా జాలీ కూడా లేవు. ఆమె చేసిన కర్మఫలం అనుభవిస్తూంది కాబోలు అనుకుంటాను. నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu