కనుచూపు మేర దాకా పరుచుకున్న పచ్చని పొలాలు, కంటి నిండా పరుచుకొని, చిన్నప్పుడు నాన్న చేతుల మధ్య భద్రంగా ఉన్నప్పుడు పొందిన ధైర్యాన్నీ, Protective feeling నీ గుర్తుకు తెస్తుంది.

ఎంత గొప్పగా ఉన్నా, rich గా, భారీగా ఉన్నా… ఏ ఆకాశ హర్మ్యాలూ, ఏ ఫ్లైఓవర్లూ, ఎనిమిది లైన్ల బిజీ జాతీయ రహదార్లూ కూడా… ఇలాంటి సహజ భావనలనీ, పసితనపు గురుతుల్నీ మన కివ్వలేవు.

ఈ సందర్భంలో, చిన్నప్పుడు చదువుకున్న చిన్న కథ ఒకటి చెబుతాను.

అనగా అనగా…

ఒకానొకప్పుడు భాగ్యపురం అనే రాజ్యం ఉండేది. నదీనదాలు, చెరువులూ దొరువులతో చక్కని నీటి వసతి కలిగి ఉండేది. రాజ్యం చుట్టూ అడవులూ కొండలూ ఉండటంతో, ఏటికేడాది, ఆయా ఋతువుల్లో చక్కని వర్షాలు పడేవి. భూమి సారవంతమైనదీ, ఆ రాజ్య ప్రజలు కష్టపడి పని చేసే తత్త్వం గలవాళ్ళూ కావటంతో పంటలు బాగా పండేవి. భాగ్యపురం సుసంపన్నంగా ఉండేది.

ప్రజలంతా కూడా ఏ లోటూ లేకుండా హాయిగా జీవించేవారు.

ఇలా ఉండగా… ఓ యేడాది భాగ్యపురంలో పైర్లు ఏపుగా పెరిగాయి. కోతల కాలం వచ్చింది.

ఓ రోజు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి…ఇద్దరూ అదృశ్య రూపంలో భూలోక విహారానికొచ్చారు. మాటల్లో వాళ్ళిద్దరికీ వివాదం ఏర్పడింది. తామిద్దరిలో

‘ఎవరు గొప్ప?

ఎవరిని జనులెక్కువగా ఇష్టపడతారు?

ఎవరినెక్కువగా ఆరాధిస్తారు?’ అని తర్కించుకోసాగారు.

‘నేనేంటే నేనని’ ఇద్దరూ వాదించుకున్నారు. అప్పటికప్పుడే వాస్తవం తేల్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆ దేవతలిద్దరూ భాగ్యపురం పొలాల్లో ఉన్నారు. కోతలైపోయి, కల్లాల్లో పంట నూర్పిడి చేసి, రాశులు పోసి ఉంది. ప్రజలు ధాన్యం సంచుల కెత్తుకుని ఇళ్ళకి పోతున్నారు.

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి…దారి కిరుప్రక్కలా బంగారు నాణాలు, రకరకాల ధాన్యమూ రాశులుగా ఉండేలా సృష్టించారు.

ఒక్కసారిగా ప్రజలు దారికి రెండుప్రక్కలా ఉన్న ధాన్యరాశులన్నీ, ధనరాశుల్నీ చూశారు. ఒక్క ఉదుటున తమ చేతుల్లోనూ, నెత్తి మీదనూ ఉన్న ధాన్యపు మూటల్ని పక్కన పారేసి, ధనరాశుల వైపు పరుగులు తీసారు.

ఆబగా అందినంత బంగారు నాణాల్ని మూట గట్టుకుని నెత్తికెత్తుకుని, ధాన్యపు రాశుల్ని తొక్కుకుంటూ, చిమ్ముకుంటూ, చిందులేసుకుంటూ, ఇళ్ళకి పోయారు.

‘చూశావా? జనులందరికీ నేనంటేనే ఎక్కువ ఇష్టం!’ అన్నట్లుగా ధాన్యలక్ష్మిని చూస్తూ కళ్ళెగరేసి నవ్వింది ధనలక్ష్మి. ఆ నవ్వులో విజయగర్వం తొంగి చూస్తోంది. ధాన్యలక్ష్మి కి చాలా బాధనిపించింది. వికలమైన మనస్సుతో అక్కడి నుండి నిష్క్రమించింది.

జనాలకి ఇదేం తెలియదు. ఎంతో ఆనందంగా, ఇంటికి చేర వేసుకున్న బంగారాన్ని చూసి మురిసిపోతూ, కబుర్లు చెప్పుకున్నారు. కాస్సేపలా ఆకలీ దప్పికా అన్నీ మరిచి పోయారు. ఎంత సేపుంటారు అలా?

ఆకలి వేసింది. అన్నం తిందామని ముద్ద ముడితే ఏముంది? మెతుకులన్నీ బంగారమై పోయాయి. బంగారు అన్నం మెతుకులు ఎంతందంగా మెరిసి పోతున్నాయో? కానీ ఏం లాభం? తినలేరు కదా? మళ్ళీ అన్నం వండుకుందామని బియ్యం ముట్టుకుంటే గింజలన్నీ గలగల్లాడుతూ బంగారమై పోయాయి. వంకాయ, బెండకాయ్, టమాటా, పచ్చి మిరపకాయ్… ఏది చూసినా బంగారమే!

కనీసం దాహం తీర్చుకుందామని నీరు, మజ్జిగ, ఏది తీసుకున్నా… అదంతా బంగారు ద్రవంగా ఉంది. అరటి పండు, మామిడి పండు…అన్నీ బంగారమే! జనాలకి ఏం చెయ్యాలో తోచలేదు.

ఆకలి, దాహం… నీరసం వచ్చేసింది. మెల్లిగా వాళ్ళకి తమ తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. ధాన్యలక్ష్మిని ధ్యానిస్తూ, క్షమించమని ప్రార్ధించారు.

ఆ తల్లి… దయార్ధ్ర హృదయంతో బిడ్డల తప్పుల్ని మన్నించి అన్నపానీయాలు అనుగ్రహించింది.

ప్రజలు, అవధులు తెలుసుకుని ఆనందించారు.

ఇదీ కథ!

చిన్నప్పుడు ఎక్కడో చదివిన కథ! ఆలోచిస్తే సత్యాన్ని మన బుర్రలకి ఇంకించగల కథ!

నిజంగా ఎంత ధనవంతులైనా, డబ్బూ బంగారం తినలేరు కదా!? పిజ్జా బర్గర్ లన్నా కూడా, అవీ పిండీ కూరగాయలూ, నూనె, మసాలాల వంటి సేంద్రియ పదార్ధాలతో తయారు చెయ్యాల్సిందే గానీ… కరెన్సీ నోట్లో, ఎటీఎం కార్డులతోనో తయారు చెయ్యరు కదా?

అందుకే భద్రాద్రి రామదాసు
“లక్షాధికారులైనా లవణామన్నమే గానీ
బంగారు కణికలు మింగ లేరనుచు మంచి
పలుకే బంగారమాయెనా… కోదండ రామా!”

అంటూ హృద్యంగా సత్యసంకీర్తన చేసాడు.

[ఇటీవల ఈనాడు వంటి దినపత్రికలు ఆదివారపు సంచికల్లో బంగారు తళుకులు అద్దిన చాక్ లెట్లూ, మిఠాయిలూ ఇప్పుడు ధనవంతులైన సెలబ్రిటీలు తింటోన్నారని తెగ రొదపెట్టేసాయి, ఇప్పటికీ అప్పుడప్పుడూ పెడుతూనే ఉన్నాయి.]

ఎంత సుసంపన్నులైనా, భాగ్యవంతమైన దేశాలైనా, ఎన్ని రంగాలలో అభివృద్ది చెందినా… నిర్లక్ష్యం చెయ్యకూడని రంగం వ్యవసాయం!

అలాంటి చోట… దాదాపు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో, వ్యవసాయం ఎంతగా నిర్లక్ష్యానికీ, అధోగతికి గురౌతోందో నేడు అందరికీ ప్రత్యక్షంగా తెలిసిందే!

మూకుమ్మడిగా…పచ్చని వ్యవసాయ భూముల్ని మెరకపోసి రాళ్ళు వేసి రాత్రికి రాత్రి ప్లాట్లుగా మార్చడం, బక్కచిక్కిన రైతుల్ని చావదన్ని మరీ, చక్కటి నీరుపారుదల ఉన్న పచ్చని పొలాలు లాక్కుని, సెజ్ లుగా మార్చడం… నిత్యకృత్యంగా చూస్తూనే ఉన్నాం!

పదవిలో ఉండగా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘వ్యవసాయం దండగా’ అన్నాడని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తుంటుంది. అది ‘అసత్యప్రచారం’ అని అతడూ ఎదురు దాడి చేస్తుంటాడు. ఈ వాద ప్రతివాదనల సంగతేమో గానీ, చంద్రబాబు నాయుడు ‘హైటెక్ ముఖ్యమంత్రి’ అనే బిరుదునీ, కిరిటాన్నీ తగిలించుకొని, ప్రపంచపు అంచుల దాకా పెట్టుబడుల సమీకరణ అనే పైకారణంతో ఉరుకులు పెట్టాడు గానీ, వ్యవసాయ రంగం మీద ఇసుమంత దృష్టి కూడా పెట్టలేదన్నది మాత్రం నిర్వివాదాంశం!

ఇక, మొన్నామధ్య, మన ఘన ప్రధాని మంత్రీ, ప్రసిద్ధ ఆర్ధికవేత్తా అయిన మన్మోహన్ సింగ్, కొద్ది రోజుల క్రితం పీఠమెక్కిన మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు… ‘ఈ రోజుల్లో వ్యవసాయం పూర్తిగా నష్టాలమయం అయ్యిందనీ, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదేననీ’ సెలవిచ్చారు.

రాజకీయ రంగం, కార్పోరేట్ రంగంతోనూ, నేర ప్రపంచంతోనూ మిళితమై, రైతు నడ్డి విరిచేస్తుంటే… ప్రపంచవ్యాప్తంగా నైనా, దేశవ్యాప్తంగా నైనా, రాష్ట్ర వ్యాప్తంగా నైనా వ్యవసాయం నష్టభరితం గాక లాభపూరితం ఎలా అవుతుంది?

పెదాలకీ, గోళ్ళకీ వేసుకునే రంగు దగ్గరి నుండీ తలకి రుద్దుకునే షాంపూల దాకా…

విత్తనాల దగ్గరి నుండీ కాలి చెప్పుల దాకా…

ప్రతీ ఉత్పత్తిదారుడూ, తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకోగలడు.

అందుక్కావలసిన అన్ని చట్టాలనీ ప్రభుత్వమే చేస్తుంది, అమలు బాధ్యతని కూడా చక్కాగా నిర్వహిస్తుంది.

ఏ దళారీ, మధ్యలో జోక్యం చేసుకోడు.

ఎటూ వినియోగదారుడు నోరుమూసుకుని కొనుక్కుంటాడను కొండి.

అలాగే…

నాడి పట్టుకు రోగం కనిపెట్టి చికిత్స చేసే వైద్యుడూ…

తగవులు పడితే దావాలు వేసి న్యాయం చేస్తాననే లాయరూ…

చదువులు చెప్పి బ్రతుకులు బాగు చేస్తాననే విద్యా సంస్థలూ…

అందరూ…

చివరికి పొలంలోకి దిగి, నాట్లు, కలుపులూ కోతలూ నిర్వహించే కూలీలతో సహా…

అందరూ…

తమ చాకిరికి తామే ధర నిర్ణయించుకుంటారు.

ఏ దళారీ, మధ్యలో జోక్యం చేసుకోడు.

అయితే

ఉత్పత్తి దారుడుగా రైతు, తాను ఉత్పత్తి చేసిన ధాన్యానికి ధర తాను నిర్ణయించుకోలేడు.

తన చాకిరికీ, తాను కార్చిన చెమటకీ, ధర తాను నిర్ణయించుకోలేడు.

అందుకోసమే ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అయినా వెనక తట్టున మిల్లర్లకీ, దళారీలకీ దన్నిస్తుంది.

మిల్లర్లూ, దళారీలు… కాకులూ గద్దల్లా రైతు కష్టాన్ని ఎగదన్నుకు పోకుండా, చట్టాల అమలుని మాత్రం చెయ్యదు. కంటి తుడుపుగా చట్టాలు మాత్రమే చేస్తుంది. అమలుని గాలి కొదిలేస్తుంది.

అలా రైతుని చావగొడితే గానీ… ఆనక వ్యవసాయాన్ని సైతం, కార్పోరేట్ సంస్థలకి అప్పు చెప్పేందుకు వీలు కాదు మరి!

ఇప్పుడు విదేశాలలో వ్యవసాయ ఉత్పత్తి గురించీ, అభివృద్ధి గురించీ చెబుతూ… మీడియా సంస్థలు…

‘ఫలానా దేశంలో ఫలానా ధాన్యం లేదా పంట దిగుబడి ఇన్ని మిలియన్ లేదా ట్రిలియన్ టన్నులనీ, అది ప్రపంచ ఉత్పత్తిలో ఇంత శాతం అనీ, గతంలో కంటే ఇంత శాతం వృద్ధి చెందిందనీ’ గణాంకాలని తేటతెల్లంగా ప్రచారం చేస్తాయి. పదే పదే ప్రచారిస్తాయి.

కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా, ఆయా దేశాల్లో వ్యవసాయం బక్క రైతులో దుక్కరైతులో… (ఎవరైతేనేం? వ్యక్తిగతంగా వ్యవసాయం చేసుకునే రైతులు) ఎక్కువ నిర్వహిస్తున్నారో, కార్పోరేట్ సంస్థలు ఎక్కువ నిర్వహిస్తున్నాయో చెప్పరు.

ఎందుకంటే… ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, వ్యవసాయ రంగంలో వేళ్ళూనుకొని ఉంది కార్పోరేట్ సంస్థలూ, పెద్ద పెద్ద పెట్టుబడి దారులూ! రష్యా బోల్ష్విక్ ల దగ్గరి నుండీ ఇప్పటికీ అదే చరిత్ర! అప్పుడప్పుడూ తిరుగుబాట్లూ జరిగినా, నామ రూపాలు మారిన అదే దోపిడి!

వ్యక్తిగతంగా వ్యవసాయం చేసుకు జీవించే రైతు కుటుంబాలని నలిపేసి, రైతుల నడ్డి విరిచేస్తే… ఆపైన కార్పోరేట్ వ్యవసాయానికి అడ్డంకు లుండవు కదా! చంద్రబాబు దగ్గరి నుండి మన్మోహన్ సింగ్ దాకా… పదవిలో కూర్చున్న నాయకులు చేసిందీ, చేస్తోందీ ఆ ‘కార్పోరేట్ సాయమే’.

కాబట్టే – ఎకరా రూపాయి నుండి వంద రూపాయలకి సెజ్ లని, కంపెనీలకీ కట్టబెట్టేసారు. ఎదురు తిరిగిన రైతులని చావగొట్టి రక్తం కళ్ళ చూసారు, చూస్తున్నారు. ఎన్ని సోంపేటలని ప్రత్యక్షంగా చూసాం కాదు?

భారత దేశ రాజ్యాంగంలో ఉటంకింపబడిన కార్మిక చట్టాలేవీ సెజ్ లలో వర్తించవు. అవి యాజమాన్య ఇష్టారాజ్యాలు! ఈ విషయం మీడియా ప్రజలకి చేరేంతగా ఎన్నడైనా ప్రచారించిందా? లేదు! ఎందుకంటే... వ్యవసాయ రంగం ద్వారా భారతదేశం మీద జరుగుతున్న కుట్రలో ప్రధానపాత్ర మీడియాదే గనక!

ఇంకా, గొప్పగా… విదేశాల్లో అవుల మందల్ని మన దేశంలో, మేకల మందల్నీ, గొర్రెల మందల్నీ పెంచినట్లుగా పెంచరనీ, విశాలమైన గడ్డి మైదానాల్లో వేల కొలదీ ఆవుల్ని మల్లేయడానికి హెలికాప్టర్లలో తిరిగే… పశుల కాపరులుంటారని ప్రచారిస్తుంది.

నిజం చెప్పాలంటే… ఆ విశాల క్షేత్రమూ ఆ పశువుల కాపరిది కాదు, వేల సంఖ్యలో పశువులూ అతనివి కాదు, వాటిని మళ్ళించడానికి అతడుపయోగించే హెలికాప్టరూ అతడిది కాదు. అతడొక ఉద్యోగి, అంతే! ఆ ఉద్యోగం ఊడిన మూడు నెలలకే బ్రతుకు రోడ్డున పడే చిరుద్యోగి!

మన దేశంలో రోడ్డు ప్రక్కనా, బీడు భూముల్లో రేగు కంపల్లో, తుమ్మ గుబురుల్లో జీవాల్ని (మేకల్నీ, గొర్రెల్నీ వాళ్ళలాగే పిలుస్తారు.) మేపుకునే పశుల కాపరి, హెలికాప్టర్ లో తిరగక పోవచ్చు.

టై కట్టుకుని మెడలో ఐడెంటిటీ కార్డు తగిలించుకోక పోవచ్చు.

రబ్బరు చెప్పులేసుకుని, ఓ చేతిలో కర్ర, భుజమ్మీద గొంగళీ, పట్టాచుట్టిన ప్లాస్టిక్ సీసాతోనో, మట్టి కుండ (తాబేటి బుర్ర అని పిలుస్తారు)తోనో మంచి నీళ్ళు తీసుకుని, చెట్లమ్మాటా, చేల గట్టమ్మటా జీవాల్ని మేపుకుంటూ బ్రతుకుతుండవచ్చు.

కానీ… అతడి మందలో యాభై మేకలున్నాయన్నా అతడు లక్షాధికారే! స్వతంత్రుడే! షిప్టు ప్రకారం డ్యూటికి పోనవసరం లేనివాడు, ఎవ్వరి ఆజ్ఞనూ పాటించ నవసరం లేదు. ఉద్యోగం ఊడుతుందన్న భయం లేదు.

విదేశాల్లో వ్యవసాయ కార్పోరేట్ సంస్థలకి ఇచ్చినట్లే ఈ పశువుల కాపరలకు కూడా భీమా సరిగా అందేటట్లు చూస్తే, వారూ మరింత ధనవంతులు కాగలరు. ఈ తేడాని మీడియా అసలు వివరించదు. అదీ దాని ప్రచార మాయాజాలం!

నిజానికి మన దేశంలో, ప్రాచీన కాలంలో వ్యవసాయం ఎలా ఉండేదీ అంటే… లాభాల రాశుల్ని ఎవరెస్టు శిఖరాల్లా కుప్ప పోసిందనలేం.

కానీ, రైతు సగర్వంగా, సంతృప్తిగా… వత్తిళ్ళూ ఆయాసాలూ, ఆత్మహత్యలూ లేకుండా… ‘తాను తిని పదిమందికి తిండిపెట్టే మారాజూ’లా ఉండేది. దైన్యంతో… తానే రాజకీయ నాయకుల ముందో, ప్రభుత్వాధికారుల ముందో, దళారీల ముందో, చేతులు ముకుళించుకు నిలబడి లేడు.


ఆనాటి వ్యవసాయం గురించి… నాటి సాహిత్యం, కళలు, చరిత్ర మనకి మరిన్ని ఆధారాలు చెబుతాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

ప్రజలను వ్యవసాయం నుండి దూరం చేయడానికే గదా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగాయి. Contract farming ( దీనినే కార్పొరేట్ వ్యవసాయం అంటున్నారు) పేరిట రైతులను వలలో వేసుకుని మీరు మట్టిపిసుక్కోనక్కరలేదు , మీతరపున మేమే వ్యవసాయం చేసి మిమ్మల్ని కోటీస్వరుల్ని చేశ్తామంటూ భూముల్ని తీసుకుని వ్యవసాయన్ చేస్తున్నాయి. పంజాబ్‌లో అముల్ కంపెనీ , ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున ఫెర్టిలైజెర్స్ వంటి సంస్థలు, ఇంకా అనేక ఎరువుల కంపెనీలు ఇప్పటికే ఈ రంగంలో ఉన్నాయి. కొంతకాలానికి భూములన్నీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిన తరువాత అప్పు ఆ కంపెనీలు తమ నిజస్వరూపాన్ని బయటపెడతాయి . అప్పటికి ఈ రైతులు వ్యవసాయం చేయడం మర్చిపోవడమో లేక తమ భూములలోనే కూలీలుగా చేరడమో జరుగుతుంది. ఇది పార్శ్వం మాత్రమే . మరో కోణంలో తాము (కార్పొరేట్ కంపెనీలు ) పండించిన పంటకు తామే ధర నిర్ణయిస్తామని ప్రభుత్వపై వత్తిడి తెస్తాయి . ఆ విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు తామే తమకు నచ్చిన ధరల్ను నిర్ణయించి ప్రజల్ను దోచుకుంటయి. రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేని ఈ ప్రభుత్వాలు అప్పుడు మాత్రం ఆనందంగా కంపెనీలకు వత్తాసు పలుకుతూ చట్టాలు చేసి పారేస్తాయి . తమ వ్యవసాయ భూముల్ని కంపెనీలకు కట్టబెట్టి ఆనక వ్యవసాయం చేయడం మర్చిపోయి అటు కూలీలుగా బ్రతకలేక ఇటు వ్యవసాయం చేసుకోలేక మట్టికొట్టుకుపోతాడు . రాష్ట్రంలో/దేశంలో నున్న వ్యవసాయ భూములన్నీ అప్పుడు నాలుగైదు కంపెనీల చేతుల్లోనే ఉంటాయి . అప్పుడు అవి ఆడింది ఆట పాడింది పాట. ఇప్పటికే రిలయన్స్ కంపెనీ తన Reliance Fresh కోసం కొన్ని లక్షల ఎకరాలను కొనుగోలు చేసిందని విన్నాం . వ్యవసాయ భూములన్ని వాళ్ళ చేతుల్లోకి పోయాక , ఆటు వ్యవసాయం చేయడం మర్చిపోయాక ప్రజలంతా ఆయా కంపెనీల పెట్టిన ధరలకు తిండిని కొన్నుక్కోవడమే .

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu