గత టపాలలో వివరించినట్లు, షేర్ల సహజ క్రయ విక్రయాల పరిమాణం చాలా తక్కువైపోయి చాలా రోజులే అయ్యింది. అది రోజు రోజుకీ మరింత తగ్గిపోతోంది.

కాబట్టే ఇన్ని మోసాలూ, అసత్య ప్రచారాలు! అది ఒక్క షేర్ మార్కెట్ విషయంలోనే కాదు, అన్ని రంగాల్లో అదే దోపిడి, అదే మోసం!

నిజానికి …ఒక మోసం జరిగిందంటే – మోసగించే వాడి తెలివి, కుత్సితం, కపటాల బాధ్యత ఎంతో, మోసగింపబడే వాడి అమాయకత్వం, అజ్ఞానం, అనవగాహన (కొన్ని సందర్భాల్లో ఆశ) ల బాధ్యత కూడా అంతే!

కాబట్టి – ఆలోచించవలసిన అవసరం, మోసాలని అర్ధం చేసుకోవలసిన అవసరం, సామాన్యులకి తప్పదు. లేకపోతే కరిమింగిన వెలగ పండు లాగా సంపాదించుకున్నది కరిగిపోతుంది. నిరంతరం శ్రమ దోపిడి, మేధో దోపిడి, సమస్త దోపిడికి గురౌతూ, మోసపోవటం కూడా జీవితంలో భాగమై, మొత్తంగా బ్రతుకు భారమౌతుంది.

పరిస్థితులు మరింత విషమించి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు… ఓ వైపు మోసగింపబడుతూ… మరో వైపు అవకాశం వస్తే తామూ మోసాలకు పాల్పడుతూ… వెరసి వైతరణిని భూలోకానికి, నిజ జీవితంలోనికి తెచ్చుకోవడ మౌతోంది. ఇదే గత టపాల్లో ‘చెంపదెబ్బలు’ అనే టపాలో ఉదాహరణలో చెప్పాను.
22. భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్ర – 2[చెంప దెబ్బలు] [Dec.11, 2008]
http://ammaodi.blogspot.com/2008/12/2_11.html

వాళ్ళ వ్యాపారం కోసం మీడియా, ప్రభుత్వాలు, కార్పోరేట్ కంపెనీలు ప్రజల జీవితాల్లో పరుగుని సృష్టిస్తే… అందరూ ఆ వేగంలో పడి కొట్టుకు పోతే… పరిస్థితి ఇక్కడికే చేరుతుంది. అదే ఇప్పుడు నిరూపించబడింది.

ఒక ఉదాహరణ చెబుతాను.

మనం ఓ ఉద్యాన వనాన్ని లేదా ధీమ్ పార్కుని చూడటానికి వెళ్ళామను కొండి. ప్రవేశ రుసుం తీసుకుని లోపల ప్రవేశించాం. పార్కు మూసేసే లోగా అన్నీ చూడాలని కుతుహల పడతాం. ఆ ఉబలాటం సహజమే! అది కాస్తా ఆతృత లోకి, ఆపైన పరుగులోకి పరిణమిస్తేనే కష్టం.

ఒకో అంశాన్ని పరిశీలిస్తూ, ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలనుకుంటాం. ఆనందాన్ని ప్రశాంతంగా ఉంటేనే పొందగలం. ప్రశాంతంగా చూడాలని, ఆనందించాలని మెల్లిగా తిరిగితే కొన్నిటినే చూడగలం, ఆనందించగలం. అలాక్కాదని పరుగులు పెడితే ఆయాసం మిగులుతుంది. మిగిలిన వేవీ చూడలేం. అంతేగాక చూసిన ఆనందం కూడా మిగలదు.

ఇదే పోలికని జీవితానికి అనువర్తిస్తే… పార్కు లాంటిదే జీవితం. ఇంకా టిక్కెట్ తీసుకుని పార్కులో ప్రవేశిస్తే… ఫలానా టైం లోపల అన్నీ చూచి రావాలని, రావచ్చని ఓ అంచనా ఉంటుంది. జన్మ ధరించి ఈ లోకంలోకి వచ్చాక ఎవరికీ తిరిగి తను ఎగ్జిట్ టైం ఏమిటో తెలియదు. కాబట్టి బ్రతికిన నాలుగు నాళ్ళలోనే మరికొన్ని ఆనందాలని అనుభవించాలనుకుంటాం. అది తప్పు కాదు కూడా! అయితే, అలాగని పరుగులెత్తితే వచ్చేది ఆనందం కాదు, ఆయాసం మాత్రమే!

కాబట్టే మన పెద్దలు ‘ఆలస్యం అమృతః విషం’ అనీ చెప్పారు, ‘నిదానమే ప్రధానమనీ’ చెప్పారు. ఏది ఎప్పుడు ఎంత వరకూ పాటించాలో తెలుసుకోగలగటమే విజ్ఞత. ఖచ్చితంగా చెప్పాలంటే జీవన కళ! (Art of Living అన్నమాట!)

దీన్నే స్పష్టంగా భగవద్గీత…

శ్లోకం:
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా

భావం:
మితాహార నిద్రా విహారాలు, మితనియత కర్మలూ, మితమైన మెలకువా కలిగి అభ్యాసం చేసే వాడికే – సర్వదుఃఖ నాశకమైన యీ యోగం సిద్దిస్తుంది.

నిజానికి భగవద్గీత కంటే గొప్ప పదార్ధ వాద గ్రంధం నాకు మరొకటి కనిపించదు.

మనం తినేందుకు అరటి పండ్లు ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కుళ్ళి, నీరు కారుతున్నవి ఎంచుకుంటామా? అవి తింటే రోగాలొస్తాయనీ, రుచిగా ఉండవనీ మనకి తెలుసు! కాబట్టి – తాజాగా ఉన్నవాటినీ, చక్కగా పండి నిగారింపుతో ఉన్నవాటినీ ఎంచుకుంటాం.

ఇప్పుడు తింటే మరికాస్సేపటికి అరిగిపోయే అరటిపండు విషయంలోనే అంత జాగ్రత్త తీసుకునేటప్పుడు అధమ పక్షం అరవై ఏళ్ళు, దీర్ఘాయువు అంటే నిండు నూరేళ్ళు ఉండే జీవితం విషయంలో, జీవానానందం, ఆస్వాదనల విషయంలో మరింకా ఎంత జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాలి?

అదే మనకి భగవద్గీత చెబుతుంది.

ఆనందంగా జీవించడమే జీవితానికి సార్ధకత, జీవిత లక్ష్యమూ అయినప్పుడూ, ఆ ఆనందానుభవం, ప్రత్యక్షంగా అల్పకాల ఆనందాన్నిచ్చి, పరోక్షంగా దీర్ఘకాల దుఃఖాన్నివ్వ కూడదు. అప్పుడది నష్టపు బేరమే!

ఉదాహరణకి ప్రొగతాగటం! అప్పటికి ఆనందాన్నిచ్చినా ఆనక క్యాన్సర్ నిచ్చినట్లు!

కాబట్టి జీవితంలో ఉత్తమమైన ఆనందాన్ని అందుకొమ్మంటుంది భగవద్గీత. అరగంటలో అరిగిపోయే అరటిపండు విషయంలోనే ఉత్తమమైన పండుని ఎంచుకునేటప్పుడు… ఇదీ అంతే గదా! కాబట్టి … తక్కువ ఆనందం కోసం ఎక్కువ ఆనందాన్ని పోగొట్టుకోవద్దంటుంది. అలా చూస్తే ‘గీత’ కంటే పదార్ధ వాదాన్ని ప్రతిపాదించగల గ్రంధం ఇంకేది?

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను.

ఇది శ్రీ రామనుజాచార్యుల వారి పేరిట ప్రసిద్ధిమైనది. నిజ సంఘటనగా పేర్కొనబడినది.

ప్రతీరోజూ కావేరినదిలో స్నానమాచరించి, రంగడి ఆలయానికి వెళ్ళే రామానుజాచార్యుల వారికి ఓ దృశ్యం కళ్ళబడేది.

రంగదాసు ఆ వూరిలో ప్రముఖ వ్యాపారి కుమారుడు. ధనికుడు. అతడు తన ప్రేయసి రంగనాయకి కి గొడుగు పట్టి, ఆమె వైపు ముఖం పెట్టి వెనకకు నడుస్తూ ప్రతీ రోజూ ఆలయానికి వస్తుంటాడు.

జనం అతణ్ణి చూసి నవ్వుతున్నా అతడవేవీ పట్టించుకోడు. ఓ రోజు రామానుజాచార్యుడు రంగదాసుని “నాయనా! ప్రతీ రోజూ ఈ యువతికి గొడుగు పట్టుకుని వస్తావెందుకు?” అని అడిగాడు.

రంగదాసు స్థిరంగా “స్వామీ! నాకు ఆమె సౌందర్యమంటే ఇష్టం. ఆమె ముఖ కమలం, అందులో కలువ రేకుల వంటి ఆమె కన్నులంటే మరీ మరీ ఇష్టం! ఎండకవి కందిపోయి, వడలి పోకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటాను” అన్నాడు.

“మరి వెనక్కి నడుస్తూ వస్తావేం?” ప్రశ్నించారు రామానుజాచార్యులు వారు.

“ఒక్కక్షణం కూడా ఆ సౌందర్యాన్ని చూడకుండా ఉండటం నాకిష్టం లేదు” ఠకీమని జవాబు చెప్పాడు రంగదాసు.

“జనం నిన్ను చూచి నవ్వుతున్నారు కదా?” నిశితంగా పరిశీలిస్తూ అన్నారు రామానుజులు.

“ఎవరేమను కుంటే నాకేమిటి? నా ఆనందమే నాకు ముఖ్యం” వెఱపులేని సమాధానం రంగదాసుది.

ఆ యువకుడిలో సమాజం పట్ల పట్టింపు లేనితనం, ఎవరేమనుకుంటారోననే వెఱపులేని తనం రామానుజుల కర్ధమయ్యింది.

రంగ దాసుతో “నాయనా! రంగనాయకి సౌందర్యం, నిశ్చయంగా గొప్పదే! అయితే ఆ చిన్నదానికి… కోపమో, అసూయో కలిగిందనుకో! అప్పుడా వదనం అంత అందంగా ఉండదు. ఆమెకి ఏ వ్యాధో వచ్చిందనుకో! ఆ కళ్ళు కాంతి కోల్పోతాయి. వార్ధక్యం మీద పడితే, ముఖం ముడతలు పడుతుంది. ఇంత ఆశాశ్వతమైన అందానికే ఇంతగా దాసుడవయ్యావు. శాశ్వత సౌందర్యాన్ని చూపిస్తాను, ఆరాధిస్తావా?” అన్నాడు.

“నిజంగా మీరు అంతటి సౌందర్యాన్ని చూపించాలే గానీ నిశ్చయంగా దాసుణ్ణవుతాను” అన్నాడు రంగదాసు.

అతణ్ణి వెంట బెట్టుకుని ఆలయంలోకి వెళ్ళారు రామానుజాచార్యులు. కమండలంలోని నీటితో కళ్ళు కడుక్కుని రంగనాధుడి విగ్రహాన్ని దర్శించమన్నాడు.

ఏ తీరుగా రామానుజుల వారు, రంగదాసుడికి విశ్వసౌందర్యాన్ని, విరాట్స్వరూపాన్ని చూపించగలిగారో తెలియదు గానీ, రంగదాసు ఆయన శిష్యుడిగా మారిపోయాడు. కాలక్రమంలో అతడే పద్మపాదుడిగా పేరు గాంచాడు.

ఇదీ కథ!

ఇందులో చెప్పినట్లుగా మన ఈ భౌతిక శరీరంతో ముడిపడిన ఆనందం తృణప్రాయం కాదు గానీ, శాశ్వతం కూడా కాదు. ఒక పురుషుడు స్త్రీని, లేదా ఒక స్త్రీ పురుషుణ్ణి, వారి అందమైన శరీరాన్ని చూచి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం కొన్ని రోజులకి తరిగి పోగలదు. అదే అందమైన మనస్సుని చూసి ప్రేమిస్తే… ఆ ప్రేమ, ఆనందం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది.

శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండే ఆనందం కన్నా, భౌతిక వస్తువులతో ముడిపడి ఉండే ఆనందం కన్నా మానసిక ఆనందం గొప్పది. ఆ దారిలో వెళ్తే ఆత్మానందాన్ని ఏదో నాటికి అందుకుంటాం. అది అత్యంత ఉత్తమమైనది. అలాంటి పరమానందాన్ని పొందాలంటే స్థిర బుద్దిని సాధించాలి. దాన్ని సాధించమనే , అందుకొమ్మనే, చెబుతుంది గీత! కాబట్టే గీత కంటే పదార్ధ వాదాన్ని చెప్పే గ్రంధం మరొకటి లేదనిపిస్తుంది.

ఎందుకంటే – గీత, భౌతిక వాదం కంటే భావవాదం గొప్పది గనుక మట్టి గొట్టుకు పొమ్మనదు. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ఇవ్వాలంటుంది. ధర్మబద్దంగా ద్రవ్య సంపాదన చెయ్యమంటుంది. అయితే ద్రవ్య సంపాదనే జీవితం అనుకోవద్దంటుంది.
మరోమాటలో చెప్పాలంటే… ధర్మకార్యాలు చెయ్యటానికి, జీవించటానికి డబ్బు (ద్రవ్యం) కావాలంటుంది. జీవితమే ‘డబ్బు’ అనదు.

ఎందుకంటే – సంపాదించిన ఆస్తిపాస్థులు ఇక్కడే మిగిలిపోతాయి. పుట్టుకతో తెచ్చుకున్న శరీరం, జీవించినంత కాలం మనతో పాటే పెరిగి మనకి ఆశ్రయం ఇచ్చిన శరీరం, ఇక్కడే మిగిలి పోతుంది. ‘మనం అనుభవించిన వాటి ముద్రలూ, భావనల వాసనలూ మాత్రం మనతోనే వస్తాయి’ అంటుంది గీత!

శ్లోకం:
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కా మతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్II

భావం:
గాలి సువాసనను తీసికొని పోయేటట్లుగా – దేహాధికారియైన జీవుడు క్రొత్త శరీరం పొందేటప్పుడు – వెనుకటి శరీరం నుంచి భావ పరంపరను తీసుకు పోతున్నాడు.

కాబట్టి కూడా, మంచి భావనలనీ, భావ పరంపరగా విలసిల్లే సంపదనీ సంపాదించు కొమ్మంటుంది. ‘చేసిన మంచి చెడని పదార్ధం’ అంటుంది. ‘ఆస్తులూ అప్పులూ వెంట రావు గానీ… మంచి చెడుగులు, పాపపుణ్యాలు వెంట వస్తా’యంటుంది. ‘కర్మఫలం మన వెంటే ఉంటుంది’ అంటుంది.

‘జన్మ సిద్ధాంతం నమ్మాలా, వద్దా?’ అని నేనిక్కడ చర్చించటం లేదు. నమ్మితే వచ్చే నష్టం లేదనీ, మీదు మిక్కిలి ఇప్పటి ఇహలోక జీవితంలో సైతం శాంతి సౌఖ్యాలు అనుభవింప వచ్చనీ నా వ్యక్తిగత నమ్మకం! నమ్మకాల విషయంలో వాదనలు అనవసరం అన్నది నా అనుభవం!

ఈ నేపధ్యంలో… కొందరు పుట్టుకతో కొన్ని లోపాలని తెచ్చుకుంటారు. అవీ పూర్వజన్మ వాసనేనేమో అనుకుంటాను. కొందరు పుట్టుకతోనే కొన్ని నైపుణ్యాలు, కళలూ తెచ్చుకుంటారు. అదీ పూర్వజన్మ పుణ్యమే అనుకుంటాను.

క్యారమ్స్ ఆట ఆడేటప్పుడు బోర్టుమీద కొన్ని ‘కాయిన్స్’ పెట్టి ఆడతాం. ఒకో ఆటలో పోగొట్టుకునే అవకాశం ఎంతో, గెలుచుకునే అవకాశమూ అంతే ఉంటుంది. జన్మలోనూ అంతేనేమో! ప్రతీ జన్మలోనూ పాపం, చెడు కర్మలు చేసుకునే అవకాశం ఎంతో, పుణ్యం, మంచి కర్మలూ చేసుకునే అవకాశం కూడా అంతే!

ఎవరేది చేసుకుంటారో అన్నది వాళ్ల మనస్సుని బట్టే ఉంటుంది. అందుకే గీత ‘నీ మనస్సే నీ మితృవు, నీ మనస్సే నీ శతృవు’ అంటుంది.

ఇక ఈ తత్త్వ చింతన [లేదా కొంతమంది భాషలో వేదాంతం] వదిలేసి… తిరిగి ఆర్ధికరంగం దగ్గరికి వస్తే…

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

excellent post

astrojoyd గారు: టపా మీకు నచ్చినందుకు నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu