ముందుగా ఓ చిన్న పోలికతో…

శ్రీశైలంలో పాఠశాల నడుపుతున్న రోజుల్లో… మేం మా విద్యార్ధుల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇస్తూ “మీరు రోజూ కొనిచ్చే చాక్లెట్లూ, ఐస్ క్రీం లే! కానీ పిల్లలు మీ మాట విన్నప్పుడు, డిసిప్లిక్డ్ గా ఉన్నప్పుడు, మరేదైనా మంచిగా చేసినప్పుడు, ఆ విషయాన్ని అండర్ లైన్ చేసి, బహుమతిగా ఇచ్చినట్లుగా ఆ చాక్లెట్ నీ, ఐస్ క్రీం నీ ఇవ్వండి. అలాగే పండక్కి మీరు కుట్టించే కొత్త డ్రస్ లే! ఎటూ తప్పకుండా మనం కొనిచ్చేవే అయినా సరే! టెస్ట్ ల్లో మార్కులు బాగా తెచ్చుకున్న దానికో, మరో అఛీవ్ మెంట్ కో లింకు వేసి, ‘అది చేసినందుకు ఇదీ గీప్ట్’ అని చెప్పి ఇవ్వండి. పిల్లలు మరింత ఉత్సాహంగా ఉంటారు, మీరు చెప్పినట్లు వింటారు” అని చెప్పేవాళ్ళం!

తెలంగాణా ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేత కోసం, మొన్న ప్రారంభమై, నిన్న ముగిసిన తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల నిరాహార దీక్షల్ని చూస్తే, సరిగ్గా పై సంఘటనే గుర్తుకు వచ్చింది.
దాని మీద సాగిదీయాల్సినంత సాగదీసాక, ఇక ఇప్పుడు, ఎటూ తాము కేసులు ఎత్తేయదలుచుకున్నారు. దాని గురించి అసెంబ్లీలో హోంమంత్రిణి ఓ ప్రకటనా చదివింది. అయితే దశల వారీగా అంటూ ఓ స్టార్ మార్క్ (షరతులు వర్తిస్తాయి అని అర్ధమన్న మాట.) పెట్టింది.

ఆ మొత్తం తతంగానికీ రాజకీయ నాటకీయత రంగరించి, కేకేలు వంటి వారు హిందీ, తెలుగు, ఇంగ్లీషు కలిపి కొట్టిన ఉపన్యాసాలతో నిరాహార దీక్షలూ (అంతగా అయితే ఐవీ ప్లూయిడ్లు ఉండనే ఉన్నాయి), ఆపైన హూంమంత్రిణి శిబిరానికి వచ్చి చేసిన ప్రకటనలు… ఆపైన దీక్షా విరమణలు!

మరీ నాసిగా లేవూ! చిన్నపిల్లాడి క్కూడా తెలిసి పోయేంత ‘చీప్’ గా ఉన్న నటనలూ, నాటకాలూ ఇవి! టీవీ సీరియళ్ళూ, సినిమాలూ, రాజకీయాలూ చూసి చూసి… ప్రజలు, ఇంతకంటే క్లిష్టమైన వ్యూహాలనే అర్ధం చేసుకోగల స్థాయికి ఎప్పుడో చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇంతకంటే నాణ్యత గల వ్యూహాలు దొరకలేదు కాబోలు!

బహుశః ’తమ నాటకాలు వ్యూహాలు జనాలకి అర్ధమైనా ఏం ఫర్వాలేదు. ఎన్ని నాటకాలు బహిరంగపడినా, ఎంతగా అవినీతి బయటపడినా, ఎంతగా తమ రెడ్ టేపిజం పచ్చిగా ప్రదర్శితమైనా… ప్రజలేం చెయ్యగలరు? కాబట్టి ప్రమాదమేమీ లేదు’ అనే ధీమా కాబోలు! ఎలాగూ మీడియాతో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు అన్న నమ్మకమూ కావచ్చు!

~~~~~~~

మరో పోలిక… ఇటీవల విడుదలైన ఖలేజా సినిమాలో హీరో, తన టాక్సీని రెండోసారి డాష్ కొట్టిన హీరోయిన్ తో వాదులాడే సన్నివేశంలో, కోపంగా చూస్తున్న హీరోయిన్ తో “నువ్వే గుద్దేసి, నువ్వే చూసేస్తే… ఇక మేమెందుకే ఇక్కడ?” అంటాడు.
అలాగే, కాంగ్రెస్ వాళ్ళూ ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వాళ్ళ పార్టీకి చెందిన ప్రధానమంత్రి, 2జీ స్పెక్ట్రం వ్యవహారంలో, మురళీ మనోహర్ జోషీ అధ్యక్షతన గల పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) ఎదుట హజరౌతానంటూ లేఖ వ్రాసాడట.

“మీ పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ మీద మీకే నమ్మకం లేదా? మరెందుకు ఒప్పుకోరూ?” అంటూ కాంగ్రెస్ వాదులు గోల పెడుతూనే ఉన్నారు. ఇంతలో మురళీ మనోహర్ జోషీ స్పందించేసాడు. అందులో ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనుకున్నారో ఏమో, ప్రతిపక్షాలు (భాజపాతో సహా) ‘ఠాఠ్’ అంటున్నాయి. ‘జేపీసీకి తప్ప మరి దేనికీ ఒప్పుకోం’ అంటున్నాయి.

ఈ నేపధ్యంలో… ప్రధానమంత్రి పీఏసీ ఎదుట హాజరౌతాననటం ఎంతో గొప్ప విషయమని, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు తెగ మెచ్చుకుంటున్నారు.

వాళ్ళే అవినీతి చేసేసి, వాళ్ళే జాయింట్ కమిటీలు జాతీయ కమిటీలు వేసేసుకుని, వాళ్ళే విచారణలు చేసేసుకుని, వాళ్ళే మెచ్చేసుకుంటే… ఇక ప్రజలున్నది ఎందుకు?

ఇలాంటి ‘డైలాగులు’ రాజకీయనాయకులకి రుచించవు.

వాళ్ళ దృష్టిలో… ‘తొక్కలో జనం! ఉల్లి ధరలు 50/- రూపాయలైనా, చింతపండు వంద రూపాయలైనా, కూరల ధరలు కనుచూపు మేరలో లేకపోయినా, తాము లక్షల కోట్ల రూపాయలు దండుకున్నా… ఏం చెయ్యగలరు?’

~~~~~

మరో పోలిక – ఇప్పుడంటే ఓ సినిమా హిట్టయితే ‘అది యూనిట్ విజయమనీ, దర్శకుడి ప్రతిభనీ, కథాబలమనీ’ అంటున్నారు. హీరో హీరోయిన్లు దర్శకుణ్ణి పొగిడితే, దర్శకుడు నటీనటులకీ, టెక్నీషీయన్లకీ ఆ క్రెడిట్ ఇస్తున్నారు.

అదే ఒకప్పుడైతే… సినిమా విజయం ‘మా గొప్ప అంటే మా గొప్పనే’ వాళ్ళు. ఒక్కోసారి ఆ విషయమై వివాదాలూ రేగేవి.
ఉదాహరణకి, 1990 – 92 ల నడుమ ‘గ్యాంగ్ లీడర్’ అని ఓ సినిమా వచ్చింది. చిరంజీవి, విజయశాంతి నాయకా నాయికలు ‘రఫ్ ఆడిస్తా’ ననే మాస్ డైలాగ్ ఆ సినిమాలోదే!

సినిమా విజయం తన మూలంగానేననీ, తాను మరికొంత ‘ఫ్రీ’గా నటించానని విజయశాంతి అన్నది. అంటే ‘స్వేచ్ఛ’గా నని సదరు నటి ఉద్దేశం. అప్పటికి బరితెగించిన నటన స్థాయి అది. ఇప్పుడది మరింత పెరిగి పోయిందనుకొండి. నిజానికి ఆ సినిమాలో ‘సగం బూతుల డైలాగులూ, పగా ప్రతీకారాల కథ’ గట్రా చాలా మసాలాలున్నాయి.

దరిమిలా… సినిమా విజయం గురించి ‘ఆ క్రెడిట్ ఎవరిది?’ అనే వివాదం చెలరేగింది. ఆ రకమైన పబ్లిసిటీ స్టంట్ల గురించి అప్పటికింతగా పబ్లిక్ కాలేదు లెండి.

ఏతావాతా, విషయం ఏమిటంటే – ఓ సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎవరికి దక్కుతుందో నని మిగిలిన వాళ్ళు ఆరాట పడితే… ఆ కామిడీ, సదరు సినిమా కామెడీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటికి ‘తెలంగాణా’ అంటూ ఓ ఊపు క్రియేట్ అయ్యింది. ఒకవేళ అది గానీ విజయవంతం అయితే…

‘ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కి పోతుందేమో’నని కాంగ్రెస్ వాళ్ళు,

‘గద్దర్ కి దక్కుతుందో ఏం పాడో’ అని కేసీఆర్ గట్రాలు,

‘కాంగ్రెస్ కి దక్కుతుందేమో’నని తెదేపా వాళ్ళు…

ఇలా అందరూ కలిసి క్రెడిట్ కోసం కాట్లాడు కుంటున్న కామెడీ అనుశృతంగా నడుస్తోంది.

మరో వైపు… రైతులు ఎడాపెడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇంతగా మండిపోతున్న నిత్యావసరాల ధరలూ, కూరగాయల ధరలూ, ఎవరికి లాభాలు పండిస్తున్నాయో, నల్ల బజారు నాయకులకీ, రాజకీయ నాయకులకీ తెలియాల్సిందే!

ఈ నేపధ్యంలో… రైతుల కోసం నిరాహార దీక్షలు చేసి, వాటి ప్రచారాలతో వై.ఎస్. జగనూ, చంద్రబాబు నాయుడూ గట్రాలందరూ బిజీ బిజీ!

‘రైతుల కోసం… క్రెడిట్ ఎవరికి పోతుందే ఏం ఖర్మో’ అనుకొని ఎవరికి వాళ్ళూ హడావుడి పడుతూ… జగన్ 48 గంటలు నిరాహార దీక్ష చేస్తే, ఐవీ ప్లూయిడ్ల సాయంతో చంద్రబాబు వారం పైబడి నిరాహార దీక్ష చేసాడు. ఆపైన 30 వ తేదీన గుంటూరులో రైతుల కోసం సభ పెట్టేస్తానన్నాడు.

‘ఓర్నాయనో!’ క్రెడిట్ అతడికి పోతుందేమోనని చిరంజీవి, హడావుడీగా గుంటూరు జిల్లా కెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని పరామర్శించి, ఇరవై వేలు ఆర్ధిక సాయం ‘ఆన్ ది స్పాట్’ అందించాడు.

ఈ రాజకీయ నాటకాలకి నిర్మాతా, దర్శకుడూ ఎవరో గానీ… ప్రస్తుతం రాజకీయ కామెడీ మాత్రం నడుస్తోంది. కాకపోతే… ఈ మొత్తం రచ్చలో రైతులూ, ప్రజలే సమిధలు!

‘ఏ నెపం అయితేనేం, మృతి చెందిన రైతుల కుటుంబాలకి చిరుసాయం అందుతోంది కదా?’ అనుకుంటే – అన్నదాత అంతగా బిచ్చగాడి స్థితికి దిగజారి పోయేంత దుస్థితి వచ్చాక అనుకోడానికేం మిగిలి ఉంది?

ఈ రాజకీయ నాయకులకే చిత్తశుద్ది ఉంటే దళారీల నుండి రైతుని కాపాడి, పండిన పంటకు లాభదాయకమైన ధరని అందేటట్లు చేస్తే అసలు రైతే అందర్నీ పోషిస్తాడు.

అబ్బా, అదెలా కుదురుతుంది?

ఈ దళారీలే లేకపోతే స్టాక్ మార్కెట్ ఎలా నిలబడుతుంది?

పైకి కనబడని బాదారాయణ సంబంధం అది!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

మీరిమరీనూ... దళారీలేమీ పేదలు కాదు 'హటావో' అనగానే హాం ఫట్ అయిపోవడానికి. వాళ్ళే అంచెలంచలుగా ముదిరి రాజకీయ వ్యవస్తలో భాగమౌతున్నారు, కొండకచో శాశిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకొక కామెడీ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మన దేశంలో ప్రభుత్వాఫీసుల్లో దళారీవ్యవస్థను (అదే... బ్రోకర్లను) ఎప్పుడో నిర్మూలించి పారేశామట.

nice post

దళారీలకీ స్టాక్-మార్కెట్‌కీ సంబంధమేమిటండీ?

Telangana issue lo naku konni doubts unnayi. Last year okesari AP and Karnataka lo sankhobham vachindi. rendu govts chala problems face chesayi. Deeni venuka IT industry ni chennai ki move cheyyalane kutra undemonani naku doubt ga undi. Alane jarigindi kooda. Last one year lo chennai lo cost of living 30% increase ayyindi. antaku mundu chennai lo cost of living takkuva ani andariki oka openion undedi. Ippudu anni city lu okkate ayipoyayi. almost 15 IT parks vachayi. AP n Karnataka lo godavala valla bangalore and Hyd ni neglect chesaru. idanta sonia, chidambaram and karunanidhi kalisi plan chesinattunnaru. As usual KCR vasoollu elagoo bagane unnayi. so KCR ki kooda labhame. Motham meeda .... as usual prajalu bakharalu.
Andaroo anukuntunattu SW engineer job antha cool job aithe kadu. bangalore lo nelaki kaneesam 25000 karchu avutundi. inka em migulutundi. Builders andaroo oka projrct lone settle ipodam ane uddesyam to apartment rate lu bhareega cheptunnaru.
prathi okkaroo tondaraga dabbu sampadinchali ane concept lone unnaru. ade anni anardalaki moolam.
ayina rajakeeya nayakulaki enduku antha dabbu avasaramo teliyadam ledu. Rojuki laksha roopayalu karchu pettina kooda 100 years * 365 days * 1 lakh = 365 crores chalu.
Elections lo panchedaniki, persoanl enjoyments ki, manduku ammayilaki, MLA lanu konedaniki etc... ki oka 2000 crores vesukunna kooda motham meeda 4 taralaki kalipi oka 6000 crores unte chalu.
Mari inka enduku ila vela kotlu kottestunnaru.

okavela world end aithe chandrudi meedaku velle daniki pani kostadani ala chestunnaremo??? ala aina kooda, intlo okka pani manishi kooda lekunda vallu ela brataka galaru. Ala kadani oka 100 mandini vallato patu teesukellina kooda....aa vanda mandi ikkada unnatte akkada undaru kada. Kanche chenu mesinattu aipotundi.

May god give Gnanodayam to our politicians and corporate leaders.

Indian Minerva గారు :)
~~~~~~
అజ్ఞాత గారు:
నెనర్లు!
~~~~~~~~

రాఘవ గారు: భారతీయత మీద ఆర్ధిక రంగం ద్వారా కుట్రలో వివరించానండి! నెనర్లు!
~~~~~~~~~
రాజేష్ గారు: మీ పరిశీలన సునిశితంగా ఉందండి. మీరు లేవనెత్తిన ప్రశ్నలూ సహేతుకంగా, సమాధానాలు ఆలోచించదగినవిగా ఉన్నాయి. నిజంగానే లక్షల, వేల కోట్ల రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారు అన్నది కుతూహలం రేపే విషయమే! ‘పరిస్థితులు మరింత స్పష్టపడితాయి, అన్ని విషయాలూ బయటికొస్తాయి’ అని ఆశిద్దాం. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu