ఈ షేర్ మార్కెట్ మాయాజాలం ఎంతగా మెలికలు తిరిగిన సందుగొందుల ప్రయాణమో గమనించాలంటే, ఇటీవల బ్రిటన్‌లో జరిగిన దిగువ ఉదంతాన్ని పరిశీలించండి.

>>> ఆంధ్రజ్యోతి, 3 అక్టోబరు, 2010
డెత్ బాండ్స్ మరణంతో వ్యాపారం
బ్రిటన్ భారీ కుంభకోణం

నేను పోయిన తరువాత ఎంత సొమ్ము నా వాళ్లకు వస్తే మాత్రం ఏం లాభం- అదేదో నా మరణానికి ముందే నాకు దక్కితే బెటర్ కదా అనుకునే బీమా పాలసీదారులతో జరిపిన మృత్యుబేహారుల వ్యాపారక్రీడ ఇది. అయితే మృత్యు అంచనాలు తప్పటంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. మరికొద్ది సంవత్సరాల్లో మరణిస్తారని అంచనాలు వేస్తే.. వారు సంవత్సరాల తరబడి బతికేయటంతో 'చావు తెలివితేటలు' వికటించాయి. ఫలితంగా ఈ మహామాయ జూదక్రీడలో చిక్కుకుపోయిన అనేక మంది కళ్లు తేలేయాల్సి వచ్చింది.

కాదేది వ్యాపారానికి అనర్హం.. ఎదుటివారి మృత్యువైనా సరే.. మనకు కలిసివస్తే అదే పదివేలు.. సరిగ్గా ఈ మార్కెట్ మంత్రాన్నే నమ్మిన కొందరు బ్రిటిష్ వ్యాపారులు తీరా అది కాస్తా తుస్సు మనడంతో బొక్కబోర్లాపడ్డారు. అమెరికన్ల మృత్యు పేటికలపై కలల సామ్రాజ్యాలను నిర్మించుకోవాలని వారు చేసిన ప్రయత్నం అనేక మంది జీవితాలనునాశనం చేసింది. మెరుగైన రాబడి-భద్రమైన జీవితం అంటూ మురిపించిన కీడాటా ఇన్వెస్ట్‌మెంట్స్ చివరకు చేతులెత్తేయడంతో కుప్పకూలిపోయారు. మృత్యుబాండ్ల పేరిట సాగిన ఈ వ్యాపార క్రీడ చివరకు బ్రిటీష్ ఇన్వెస్టర్ల పాలిటే మృత్యుపాశంగా మిగిలిపోయింది. బ్రిటన్ పర్సనల్ ఫైనాన్స్ ఇండస్ట్రీని అతలాకుతలం చేసి మూడు దశాబ్దాల్లో అతిపెద్ద కుంభకోణంగా ఖ్యాతి గడించింది. ముచ్చటగా మూడు కంపెనీలు ఆడిన ఈ కాస్ట్‌లీ గేమ్‌లో వేల కోట్ల రూపాయల మేర బ్రిటీషర్ల సంపదకు రెక్కలు వచ్చాయి.

మృత్యుబాండ్లు అంటే..
సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకున్న వారు మరణించిన తర్వాతే బెనిఫిట్స్ లభిస్తాయి. అదికూడా వారసులు మాత్రమే వీటిని అనుభవిస్తారు. బతికి ఉండగానే ఈ ప్రతిఫలాన్ని అనుభవించే అవకాశం లభిస్తే.. సరిగ్గా ఈ పాయింట్‌తోనే సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఒకటి అమెరికాలో పుట్టుకువచ్చింది. ఈ వ్యాపారం చేసే కంపెనీ మొదట అమెరికన్ల నుంచి పాలసీలను కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత పాలసీదారుడికి బదులు సొంతంగా ప్రీమియంలను బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. చివరకు పాలసీదారుడు మరణించిన తర్వాత వచ్చే బెనిఫిట్స్‌ను పొందుతుంది. ఇదీ టూకీగా ఈ కంపెనీల వ్యాపార రహస్యం. అయితే.. ఇందులోనే అసలైన కిటుకు ఒకటి దాగి ఉంది.

ఈ చెయిన్‌లో భాగంగా పాలసీదారుడికి చెల్లించేది నామమాత్రం కాగా కంపెనీలకు లభించే బెనిఫిట్స్ కొన్ని రెట్లు ఉంటాయి. అందుకే పాలసీలు అక్కర్లేదని భావించే ధనిక అమెరికన్లకు గేలం వేసే ఏజెంట్లకు భారీ కమిషన్లను ముట్టజెప్పడానికి ఈ కంపెనీలు వెనుకాడేవి కాదు. యుఎస్ సెకండరీ లైఫ్ మార్కెట్ లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనాలు వెలువడటంతో ఈ బిజినెస్ మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఈ పాలసీలను కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా సెకండరీ లైఫ్ కంపెనీలు సమకూర్చుకునేవి. ఇందుకోసం ఎంత వడ్డీని చెల్లించడానికైనా వెనుకాడకపోయేవి. బ్రిటన్ కుంభకోణంలో ఈ బాండ్లే కీలక పాత్ర పోషించాయి.

ఎలా జరిగింది..
బ్రిటీష్ చరిత్రలో బిగ్గెస్ట్ కుంభకోణంగా పరిగణిస్తున్న ఈ ట్రాజెడీలో ప్రధాన సూత్రధారులు కీడాటా అధిపతి స్టివార్ట్ ఫోర్డ్, కాగా మరొకరు ఎస్ఎల్ఎస్ అధిపతి ఎలియాస్. వీరిద్దరి నిర్వాకానికి అకౌటింగ్ దిగ్గజాలు, అంతర్జాతీయ ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థలు, రెగ్యులేటరీలు తలోచేయి వేశాయి. తద్వారా లైఫ్‌ను కాస్త ముందుగానే సెటిల్ చేసుకుందామని ప్రయత్నించిన బ్రిటీషర్ల కొంపలను కొల్లగొట్టాయి. రిస్కు ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్లలో గాకుండా అమెరికన్ డెత్‌బాండ్లలో పెట్టుబడి పెట్టి ఏటా 8 శాతం వడ్డీని చెల్లిస్తామని కీడాటా ప్రచారాన్ని చేసింది. ఏడేళ్ల తర్వాత చెల్లించే అసలు సొమ్ము కూడా భద్రంగా ఉంటుందని నమ్మబలికింది. లైఫ్ సెటిల్ పథకం పేరుతో కొన్నేళ్లలో రిటైర్ అయ్యే బ్రిటీషర్లకు గాలం వేసింది. ఇందుకోసం యుఎస్ కంపెనీ ఎస్ఎల్ఎస్ నుంచి డెత్‌బాండ్లను కొనుగోలు చేయడానికి 2005లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బాండ్లనే తిరిగి వేలాది మంది బ్రిటీషర్లకు విక్రయించింది. చివరకు ఈ బాండ్లు మెచ్యూరిటీ దశకు రావడం, అందులో చాలావరకూ డిఫాల్ట్ కావడంతో అసలు కథ బయటపడింది.

దారి మళ్లిన నిధులు..
ఎస్ఎల్ఎస్ డెత్‌బాండ్లను కీడాటా కొనడం, వాటిని విక్రయించడం.. కొంతకాలం వరకూ ఈ వ్యవహారం సాఫీగానే సాగిపోయింది. ఈ వ్యాపారంలో భారీ నిధులను కళ్లజూసిన ఎస్ఎల్ఎస్ అధిపతి ఎలియాస్ వాటిని దారి మళ్లించారు. ఈ నిధులతో మలేషియాలో డ్రాగన్ బ్లేజ్ పేరుతో ప్రీమియం క్లబ్లును నెలకొల్పడం, బ్రెజిల్‌లో ఆరు లక్షల ఎకరాల రెయిన్ ఫారెస్ట్‌ను కొనుగోలు చేశారు. ఈ అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి కీడాటాకు విక్రయించిన బాండ్లను గుంపగుత్తగా మరోసారి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన ఆర్థిక సంక్షోభంలో ఎలియాస్ భారీగా నష్టపోయారు. 2007లోనే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన కీడాటా అధిపతి స్టివార్ట్ ఫోర్డ్ ఎస్ఎల్ఎస్ నుంచి డెత్‌బాండ్లకు స్వస్తి పలికి తనే సొంతంగా లైఫ్‌మార్క్ పేరుతో యుఎస్ సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు.

లైఫ్‌మార్క్‌తో డెత్‌బాండ్లను జారీ చేయించి, వాటిని కీడాటాతో కొనిపించడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో ఎస్ఎల్ఎస్ విక్రయించిన బాండ్లు మెచ్యూరిటికి రావడం, అవి డిఫాల్ట్ కావడంతో మోసం బయటకు వచ్చింది. సరిగ్గా ఈ మధ్యకాలంలోనే ఎలియాస్ ఆల్కహాల్‌కు బానిసై మరణించడంతో ఇదంతా ఫోర్డ్ పీకకు చుట్టుకుంది. కనీసం లైఫ్‌మార్క్ ద్వారా లోటును భర్తీ చేద్దామని ప్రయత్నించినా.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం బతికిన అమెరికన్లతో కథ అడ్డం తిరిగింది. ఈ కారణంగా ప్రీమియం భారం పెరగడం, డెత్ బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో నిధుల సంక్షోభం తలెత్తింది.

చివరకు బ్రిటీష్ మార్కెట్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎ కన్నెర్ర చేయడం, కుంభకోణంలో భాగమైన అకౌటింగ్ సంస్థలు పక్షపాతంతో వ్యవహరించడంతో పరిస్థితి విషమించింది. చివరకు జీవితకాలం కష్టపడి పొదుపు చేసిన బ్రిటీషర్ల సొమ్ము కాస్తా ఆవిరైపోయింది. కీడాటా ఆస్తులను కరిగించి, లైఫ్‌మార్క్‌ను లిక్విడేట్ చేస్తే గానీ ఎంతో కొంత సొమ్ము లభిస్తుందని ఎఫ్ఎస్ఎ అంటోంది. అయితే.. లైఫ్‌మార్క్ యుఎస్ లిస్టెడ్ కంపెనీ కావడంతో సమస్య మొదటికి వచ్చింది. ఆరుగాలం కష్టించి కూడబెట్టుకున్న బ్రిటీషర్ల సొమ్ము కుంభకోణంలో చిక్కుకోవడం విషాదమైతే.. ఇప్పటికీ ఈ సొమ్ము వెనుకకు వస్తుందని వీరు ఆశపెట్టుకోవడం బాధ కలిగిస్తోంది.


Pasted from: http://www.andhrajyothy.com/businessNewsShow.asp?qry=2010/oct/3/business/3buss1&more=2010/oct/3/business/businessmain&date=10/3/2010


ఇక్కడ ‘అనుకున్నదొకటి, అయినది మరొకటి’ అన్నట్లుగా... పాలసీదార్లు దీర్ఘకాలం బ్రతకటంతో వ్యాపారం బెడిసి కొట్టింది. ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో, సదరు వ్యాపారవేత్త... వత్తిళ్ళు తట్టుకోలేక మద్యపాన వ్యసనుడై మరణించటంతో, విషయం బైటికి పొక్కింది.

‘కాదేదీ వ్యాపారానికనర్హం’ కాబట్టి - ఎంత అమానుష వ్యాపారమైనా పాశ్చాత్య దేశాలలో లిస్టింగ్ అవుతుంది. షేర్లు అమ్ముకుంటుంది. ప్రభుత్వం ఏ అభ్యంతరమూ చెప్పదు. మరి అది స్వేచ్ఛావిపణి కదా!

అలాంటి చోట.... ‘పాలసీదారులు సుదీర్ఘ కాలం బ్రతకటం మూలంగా కదా మనికి ఈ నష్టాలొస్తున్నాయి’ అనుకొని... మృత్యుబాండ్లు జారీ చేసిన సదరు కంపెనీ, తెరవెనుక, వయస్సు మీరిన తమ పాలసీదారులని ఎవరికీ అనుమానం రాకుండా చల్లగా కడతేర్చమని, ఏదో ఒక సంస్థకి కాంట్రాక్ట్‌కు నియమించినా ఆశ్చర్యం లేదు. కాదేదీ వ్యాపారానికనర్హం అనుకున్నాక, స్టార్ ఆసుపత్రులు, అలాంటి కాంట్రాక్టులు పుచ్చుకున్నా అనుకునేందుకేమీ లేదు.

నిజానికి, భారతీయ ఆధ్యాత్మికతలో ‘జాతస్య హి ధృవో మృత్యుః’ అనుకోవటం పరిపాటి. "చావు అనివార్యమైంది. ఆస్తిపాస్తులు వెంటరావు. ఆపదల్లో ఆదుకోగలిగిందీ కొంత మేరకే! ‘చేసిన కర్మము చెడని పదార్ధము’ కాబట్టి మంచిపనులు చేసుకో! మన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది" అనుకునే వాళ్ళు, ఒకప్పుడు, ఎక్కువమంది!

భారతీయత మీద నకిలీ కణికుల కుట్ర ప్రారంభమయ్యాక... క్రమంగా ఆధ్యాత్మికత కనుమరుగౌతూ వచ్చింది. "మంచి వాళ్ళకి రోజులు కావు, ఎప్పుడైనా చెడుకే గెలుపు. ఇవాళా రేపూ, అవినీతి పరులే అభివృద్ది చెందుతున్నారు" అనే ప్రచారం హోరెత్తి, ప్రజల జీవన విధానంలో, అవినీతి అంతర్భాగమైంది.

‘అక్రమార్కులకే మళ్ళీ పట్టం! నిన్న సస్పెన్షన్, ఈ రోజు పదోన్నతి! అవినీతిపరులకే అధికారం!’ గట్రా శీర్షికలతో... మీడియా దీన్ని ఇతోధికంగా, సుదీర్ఘ కాలంగా, చాపక్రింద నీరులా, నిరూపించుకుంటూ, నిర్వహించుకుంటూ వచ్చింది. ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటంలో ఇది ప్రధాన భాగం.

కాబట్టే...."నానా గడ్డీ కరిచి డబ్బు సంపాదించినా, మీడియా చేత సెలబ్రిటీలుగా కీర్తిపాటలు పాడించుకున్నా, చేసుకున్న కర్మకి దేవుడేసే శిక్ష వేస్తాడన్న" విషయాన్ని... మీడియా శక్తివంచన లేకుండా దాచేస్తుంది.

"మనం ఉన్నా, పోయినా..., మనం చేసుకున్న మంచిచెడులే మన పిల్లల్ని రక్షించినా, శిక్షించినా!" అనే నమ్మకాలతో ఎక్కువశాతం ప్రజలు నిజాయితీగా బ్రతుకుతున్న పరిస్థితి నుండి, ‘మనం పోయిన తరువాత మన పిల్లలకి డబ్బు అందివ్వాలనే’ తాపత్రయం నుండి ప్రారంభమై, ‘నేను పోయాకా ఎవరెట్టాపోతే నాకేం? నేను బ్రతికున్నంత కాలం బావుకుంటాను’ అనుకోవటం దాకా ప్రయాణించి నడుస్తున్నదే ప్రస్తుతం బ్రిటన్‌లో బయటపడిన జీవిత భీమా వ్యాపారం.

ఒకప్పుడు జీవిత భీమా వ్యాపారం, భారత్‌లో పరిచయం చేయబడినప్పుడు, అది ఆనాటి తరానికి జీర్ణం కావటానికి సమయం పట్టింది. దశాబ్దాల క్రితం... జీవిత భీమా ఏజంట్లు, పాలసీదారులని ఆకర్షించే ప్రయత్నాల మీద జోకులు, సెటైర్లు నడిచేవి. కొన్ని కథలు ప్రఖ్యాతి పొందాయి కూడా! రైల్లో ప్రయాణిస్తున్న కొత్తగా పెళ్ళైన జంటని పట్టుకుని... ఎల్‌ఐసీ ఏజంటు, "ఒక వేళ జరగరానిది జరిగి మీకేమైనా అయితే, మీ భార్య గతేమిటని" సుత్తి కొడుతుంటే సరికి, బెదిరిపోయిన నవ వధువు ఏడుపు లంకించుకొందనీ, అది చూసి వరుడూ కళ్ళునీళ్ళు పెట్టుకున్నాడనీ, కాస్సేపటికి రైలు బోగీ అంతా ఏడుపులతో మారు మ్రోగిందనీ...! ఇలా!

జీవిత భీమా వ్యాపారంలోకి స్వేచ్ఛ ప్రవేశిస్తే, చివరికి అది మృత్యు విశృంఖల వ్యాపారంగా మారుతుందనే స్పృహ ఉందో, లేక సెంటిమెంట్లు దాటలేదో, భారత్‌లో గత ప్రభుత్వాలు, జీవిత భీమా వ్యాపారంలోకి ప్రైవేటు సంస్థలని అనుమతించలేదు. ఈ 1 1/2 దశాబ్దంలోనే పలు జీవిత భీమా సంస్థలు ప్రవేశించాయి.

జీవిత భీమాలో, అసలు ప్రయోజనం లేదని నేను అనటం లేదు. అనుకోకుండా ఇంటికి అధారమైన వ్యక్తి మరణిస్తే, నడిసముద్రంలో నావలా అల్లాడే కుటుంబాన్ని, తెరచాపలా ఒడ్డుకి చేర్చే పాలసీలు ఉండటం, అవి వాస్తవంగా కుటుంబాన్ని ఆదుకోవటం కూడా చూసి ఉన్నాను. అయితే అలాంటి ప్రయోజనాలతో బాటుగా... జీవిత భీమా పాలసీలు తీసుకుని, నామినీగా తమ పేర్లు పెట్టుకుని, వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, భార్యల్ని ఎవరికీ అనుమానం రాకుండా కడ తేర్చటం వంటివి చేసిన, వైట్‌కాలర్ నేరగాళ్ళు గురించి కూడా గతంలో విన్నాం.

ఇదిగో, ఇప్పుడు, అమెరికా, లండన్ సాక్షిగా... అలాంటి వైట్‌కాలర్ దురాగతాల్ని చూస్తున్నాం. ‘అర్ధాంతరంగా తాను పోతే తన కుటుంబం గతేం కాను?’ అనుకున్న భయమూ, తమ వాళ్ళ మీద ప్రేమ+శ్రద్ధలతో ప్రారంభమైన, ప్రచారమైన జీవిత భీమా వ్యాపారం... చివరికి "ఆఁ తాను చచ్చాక ఎవరెట్లా పోతే తనకేం? భీమా సొమ్ము ఇప్పుడే చేతికందితే పోలా?" అనుకునే దగ్గరికి ప్రయాణించింది.

ఇది తొలిమెట్టు అమానుషం! అక్కడి నుండి వ్యాపార కంపెనీలు, పాలసీలను కొని, వాటిని మళ్ళీ లిస్టింగ్ చేసి, వాటాలు జనాలకమ్మడం, మరో అమానుషం. (సదరు కంపెనీ యజమాని, ఆ సొమ్మంతా పెట్టి జూదశాల తెరిచాడు. దాన్ని ఏ మాటతో, ఎంత అమానుషమనాలో చేతకాక మిన్నకుంటున్నాను.)

ఇంతగా ‘చావుల మీదా వ్యాపారమా?’ అని ప్రభుత్వమూ మందలించలేదు, నియంత్రించనూ లేదు. మరి అది స్వేచ్ఛా వ్యాపారం!

ఇందులో మనల్ని విభ్రాంతి పరిచే విషయం ఏమిటంటే - సదరు కంపెనీ నిర్వహించిన కోట్ల టర్నోవరు గల వ్యాపారంలో, ఒక వస్తువు ఉత్పత్తి చేయబడలేదు. ఒక ముడి సరుకు లేదు. కార్మికుల రూపేణా ఉపాధి అవకాశాలూ లేవు. కేవలం మనిషి ‘భావాల’ మీద జరిగిన కాగితపు వ్యాపారం అది.

ఒకప్పుడు మంచి పనులు చేసే వ్యక్తులున్న, దానధర్మాలు చేసే వ్యక్తులున్న సమాజంలో, ప్రక్కవాడి క్షేమం కోరుతూ బ్రతికే స్థితి నుండి, ఇప్పుడు కంపెనీ లాభాలు రావాలని కోరుకోవటం అంటే - పాలసీదారులు త్వరగా చనిపోయి కంపెనీకు లాభాలు రావాలి, తద్వారా తమకు[మృత్యుబాండ్లు కొన్నవారికి] ఆ లాభాలు పంచబడాలని కోరుకునే స్థితికి చేరటం! ఈ తీరుగా మానవ జాతి ఎక్కడికి ప్రయాణిస్తున్నట్లు!?

"ఎవ్వరికైనా చావు తప్పనిది. రాసిపెట్టి ఉన్నది జరగక తప్పదు" అనుకుంటూ జీవితాన్ని ఎదుర్కునే దగ్గర నుండి, మృత్యుభయం సృష్టించబడింది. అందులో నుండి ఓ భద్రత సృష్టించబడింది. దాన్నుండి... ఇతింతై అంతటా విస్తరించిన వ్యాపారం, ప్రపంచమంతా ఆక్రమించింది.

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

Great Analysis. Keep posting.

Thanks,

అజ్ఞాత గారు: నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu