దేశాన్ని ఆర్ధికాభివృద్ది బాటలో పయనించేలా చేయాలన్నా, ప్రజల జీవన స్థాయిని పెంచాలన్నా, ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి.

అసలు `ఒకదేశం ఆర్దికంగా అభివృద్ది చెందింది' అంటే - ఏ ప్రామాణికాలని బట్టి నిర్దారణ చేయాలి? ఓ దేశంలో ఉపయోగిస్తున్న నత్రికామ్లం, గంధకికామ్లాల పరిమాణాన్ని బట్టా, విద్యుత్తును బట్టా లేక ముడి చమురును బట్టా? ఏ వస్తువుల్ని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేసారో, దాన్ని బట్టా? ఏయే పంటలు ఎన్ని లక్షల టన్నుల పండించారో, దాన్ని బట్టా?

ఓ దేశపు తలసరి సబ్బు వినియోగాన్ని బట్టి కూడా అయా దేశ జనుల జీవన స్థాయిని లెక్కించడం, ఒకప్పుడు ఆచరణలో ఉండేది. ఒకవేళ ఆయా దేశీయులు దేశవాళీ సున్నిపిండి, షీకాయ, కుంకుళ్ళ వంటివి ఎక్కువగా వాడితే... వాళ్ళది అట్టడుగు జీవన స్థాయేనన్నమాట. వెరసి కార్పోరెటు కంపెనీల సబ్బుల వాడితేనే, ఆ దేశపు జన జీవన స్థాయి ఉత్తమంగా ఉన్నట్లు?

ఈ రకమైన ప్రామాణికాలకీ, ప్రస్తుతం... ఏయే దేశాల్లో ఎంతెంతమంది సంపన్నులున్నారో, ఆ జాబితాని బట్టి ఆయా దేశాలని గొప్పవిగా పరిగణించటానికీ తేడాలేదు. ఉదాహరణకి... అమెరికాలో 300మంది పైచిలుకు సంపన్నులుంటే, భారత్‌లో 60 మంది పైచిలుక సంపన్నులున్నారన్నట్లు?

అధికారిక లెక్కల్లోనే... రెండు దేశాల్లోనూ ఎందరు పేదలున్నారో, ఎందరు నిరుద్యోగులున్నారో... ఆ లెక్కలు మాత్రం సవ్యంగా బయటికి రావు. బయటికొచ్చేవన్నీ అరగొర సత్యాలే! అలాంటప్పుడు, సంపన్నుల సంఖ్యని బట్టి దేశాల గొప్పదనం లెక్కించటం ఎంత వరకూ సబబు?

ఈ నేపధ్యంలో... అసలొక దేశపు ఆర్దికాభివృద్దిని ఎలా లెక్కించేటట్లు? ఓ ప్రక్క ఆకాశహర్మ్యాలుంటే... మరోప్రక్క ఫ్లైఓవర్ల క్రింద పట్టాపరుచుకు పడుకునే అభాగ్యులుంటారు. ఎప్పుడు ఈ తారతమ్యం తగ్గుతుందో, ఎప్పుడు సమాజంలో... సంపదలతో తులతూగే వారి సంఖ్య కన్నా, కూడు గూడు విద్యా వైద్యాలకి కొదవలేని జనాభా సంఖ్యకు ప్రాధాన్యత పెరుగుతుందో, అప్పుడు అనుకోవచ్చునేమో... "ఈ దేశం అభివృద్ది చెందింది, చెందుతోంది" అని!

ఇలాంటి నేపధ్యంలో.. ఆర్దికాభివృద్ది గణాంకాలే పెద్ద కాకిలెక్కలైన చోట... అభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టే ప్రణాళికలకి, పధక రచనలకీ, వాస్తవంలో వాటి ఆచరణకీ మధ్య హస్తమశకాంతరం (ఏనుగుకీ దోమకీ ఉన్నంత వ్యత్యాసం) ఉంటుంది, నింగికీ నేలకీ మధ్య ఉన్నంత దూరం ఉంటుంది.

ఒక ఉదాహరణ గమనించండి. ఒకప్పుడు కాగితపు వినియోగాన్ని బట్టి, ఆ దేశపు అభివృద్ది లెక్కించవచ్చని వాదన కూడా ఉంది. పాశ్చాత్య దేశాలలో మరుగుదొడ్డిలో నీటికి బదులు కాగితాన్ని వాడే అలవాటు ఉంది. అటువంటప్పుడు అది ఏపాటి సరైన లెక్క?

ఇక, ప్రభుత్వం ఒక కాగితపు మిల్లుకు అనుమతి ఇచ్చిందనుకొండి. అది ప్రభుత్వరంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా! దాదాపుగా పేపరుమిల్లు అటవీ ప్రాంతంలోనే మంజూరవుతుంది. మిల్లురాక ముందు, అక్కడ చెప్పుకోదగినంత అడవి ఉంటుంది. మిల్లు ప్రారంభించే ముందే, మిల్లుకు, అందులోని కార్మికులు ఇతర సిబ్బంది ఆవాసాలకు ఎంత స్థలం కావాలో లెక్కలు గడతారు.

అది పోను, పరిసరాల్లో మిగిలిన అటవీ ప్రాంతాన్ని 20 భాగాలుగా విభజిస్తారు. తొలిభాగంలోని చెట్లు నరికి మిల్లుకు ముడిసరుకుగా తొలి సంవత్సరంలో వాడతారు. అప్పుడే చెట్లు కొట్టిన ప్రాంతంలో మళ్ళీ మొక్కలు నాటాలి. మిల్లు యాజమాన్యం, అటవీ శాఖ, ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మొక్కలు నాటటం, పెంపకానికి మిల్లు కొన్ని నిధుల్ని కేటాయిస్తుంది. సిబ్బందిని అటవీ శాఖ నియమిస్తుంది.

రెండో సంవత్సరం రెండోభాగం (2nd sector)లోని చెట్లు నరికి వాడుకుంటారు. అక్కడా మొక్కలు నాటి పెంచాలి. ఇలా... ఇరవై ఏళ్ళు తిరిగి, ఇరవయ్యో భాగంలోని చెట్లు నరికేటప్పటికి, తొలిభాగంలోకి మొక్కలు పెరిగి, చెట్లై, అడవి చిక్కదనం అలాగే ఉండాలి. ఇరవై ఒకటో ఏటికి తొలిభాగంలోని చెట్లు మిల్లు ముడి అవసరాలకు అందుబాటులోకి రావాలి.

అయితే... ఇందులో, చెట్లు నరకటం మాత్రమే జరుగుతుంది. మొక్కల పెంపకం, నిధుల ఖర్చు అన్నీ కాగితాల మీద మాత్రమే ఉంటాయి. వాస్తవంలో మిల్లు చుట్టూ కార్మికుల సిబ్బంది నివాసాల సమూహాలు విస్తరించి ఉంటాయి, అడవి మాత్రం అతిపల్చగా అయిపోయి, దాదాపు బోడిగుండులాంటి స్థలం... కనుచూపు మేరా విస్తరించి ఉంటుంది. ఢిల్లీ రైలు మార్గంలో సిరిపూర్-కాగజ్ నగర్ చుట్టు ప్రక్కల చూస్తే... ఇది పచ్చినిజమని ఎవరికైనా అర్ధమౌతుంది.

అటవీ సిబ్బంది సాక్షిగా, సహాయ సహకారాల చేయూతగా, మిల్లు సొమ్ము ఖర్చయిపోతుంది, ప్రభుత్వపు సొమ్మూ ఖర్చుయిపోతుంది. అడవి మాత్రం అయిపు లేకుండా పోతుంది. కార్మికులు, ఇతర సిబ్బంది, వంట చెఱకు దగ్గర నుండి, తమ సుదూర బంధుమిత్రులకు డ్రెస్సింగ్ టేబుళ్ళు, డైనింగు టేబుళ్ళు, మంచాలు, కొయ్య సోఫాల సెట్లూ బహుమతిగా పంపుతుంటారు.

ఎక్కడుంది తేడా? పధకంలో లోపం లేదు. ఆచరణలో మాత్రం, పైనుండి క్రింది వరకూ అంతా అవకతవకలే! అవినీతిలోనూ, అక్రమార్జనలోనూ పోటీపడుతూ మరీ, రాజకీయులూ, అధికారులూ, ఉద్యోగులూ, కార్మికులూ, కూలివాళ్ళు, సామాన్య ప్రజలూ... అందరూ... యధారీతి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, తలా కొంచెం, అడవిని ‘హాం ఫట్’ చేస్తారు.

"ఆఁ మనమొక్కరం మడిగట్టుకు కూర్చుంటే సరిపోతుందా?" అంటూ... అరుగుకబుర్లు కూడా చెబుతారు. నియంత్రించాల్సిన ప్రభుత్వానికీ, అటవీ సిబ్బందికీ కూడా, అవినీతి జాడ్యం ఉన్నప్పుడు జరిగేది ఇదే కదా!?

ఇక ఈ అవినీతికి అదనంగా, మావోయిస్టుల వంక మరొకటుంటుంది. ఆ మావోయిస్టులు, సైనికులనీ, పోలీసులనీ మట్టుబెడుతూ, ఆత్మరక్షణ చేసుకుంటూ, విరాళాలు సమకూర్చుకుని డంపుల్లో దాచుకుంటూ... ఇక్కడ ఆంధ్రా నుండి నేపాల్ దాకా అడవి కారిడార్ ఏర్పాటుచేసుకుంటారు. మన శతృదేశమైన చైనాతో సంబంధాలు కలిగిఉంటారు. అంతర్జాతీయంగా ఆల్‌ఖైదా, ఎల్టీటీతో సంబంధాలుంటాయి. కాశ్మీర్ అతివాదులకు మద్దతు పలుకుతుంటారు.

ఈ మావోయిస్టు సమస్యని చూపించి, అటవీ శాఖ మాత్రం, అడవిని హారతి కర్ఫూరంలా మాయం చేసేస్తుంటుంది. ఫారెస్ట్ రేంజర్లకి ఇబ్బంది కలిగించే నక్సల్స్ సమస్య, ఎర్రచందనం దగ్గర నుండి మామూలు కలప దాకా... స్మగ్లింగ్ చేసే ముఠాలకి, ఎందుకు ఇబ్బంది కలిగించదో, ఎవరికీ అర్ధం కాదు. బోడిగండైన అడవిని చూపించి, ఎర్రపార్టీలు, రాజకీయులు పేదలకు/గిరిజనులకు పొలాలు/స్థలాలు పంచాలని పట్టుబడ్తారు. మొన్నామధ్య ఓ రాజకీయ నాయకుడు, పనికి ఉపాధి హామీ పధకం క్రింద, ఏకంగా అడవిలో చెట్లు కొట్టించాడు. అదీ వాళ్ళ జ్ఞానం!

వెరసి నేను చెప్పదలుచుకున్నదేమిటంటే - ఈ దేశాన్ని నాశనం చేయటానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి గానీ, బాగు చేయటానికి రాజకీయ నాయకులకు గానీ, అధికారులకీ గానీ ఒక్క అవకాశమూ కనిపించటం లేదు. అదే స్థితి జనాలది కూడా. ఇదే, పెద్దగా ఆలోచించకుండానే తలా ఒక చేయి వేసి మరీ, ఈ దేశం మీద అమలుపరుస్తున్న కుట్ర.

[ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే - అమలు చేస్తున్న వాళ్ళకి తెలియకపోయినా, సదరు పధక రచన చేస్తున్నది మాత్రం ఒక వ్యవస్థ కావటం!]

మేము 1995లో, శ్రీశైలంలో ఉండగా... కొన్నిరోజులు అటవీ శాఖ అధ్వర్యంలో నడిచే ఎన్జీవో (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్)లో పనిచేశాము. ‘వన సంరక్షణ సమితి’ పేరుతో నడిచే ఆ సంస్థలు, గిరిజనుల భాగస్వామ్యంతో, అటవీ సంరక్షణకు తోడ్పడాలి. గిరిజనులకి ఆ విషయమై అవగాహన కలిగించడం ప్రధాన లక్ష్యం. ఆ సందర్భంలో హాజరైన సెమినార్‌లో, దగ్గరగా... ఆటవీ శాఖ అవినీతిని చూసి అదిరి పడ్డాము.

"తోటి వాళ్ళు (ఫలానా రేంజ్ వాళ్ళు) అంతలా సంపాదించుకుంటుంటే మాకు కొంచెమన్నా అవకాశం ఉండాలి కదా సార్?" అని రేంజర్లు, పైఅధికారిని సదరు సెమినార్‌లో, బహిరంగంగా, డిమాండింగ్‌గా అడిగేసారు.

అప్పట్లో ఓసారి... బైర్లూటి చెక్‌పోస్ట్ దగ్గర ఓ సంఘటన గమనించాము. చెక్‌పోస్ట్‌లో కాపాలాగా ఉన్న అటవీశాఖ ఉద్యోగి, ఏదో పనిమీద ఓ గంట ఎక్కడికో వెళ్ళాడు. అతడి పేరు గోపాల్. అతడు రాగానే, ఓ కట్టెలు కొట్టుకునే మహిళ "అయ్యో! గోపాలన్నా! నువ్వట్లా బోతివి. ఇట్లా గొక లారీ కొచ్చె! అయిదొందల రూపాయల మాల్‌బోయె గదన్నా!" అంది, లబలబలాడుతూ!

‘మినీ లారీడు చెక్కదుంగలు, అయిదొందలేమిటి?’ అని నాకు అర్ధం కాలేదు. తర్వాత వివరణలో అర్ధమైంది ఏమిటంటే "ఆ లారీని ఆపితే, చెక్‌పోస్టు సిబ్బందికి వొచ్చే ‘లంచం’ అయిదుదొందలు రూపాయలు. అది నష్టమైందే అన్న బాధని ఆ కట్టెలమ్ముకునే మహిళా, అటవీ ఉద్యోగీ పంచుకున్నారు. ఇలాంటి సమాచారం ఇచ్చినందుకు, పరస్పర ప్రతిఫలాలుంటాయి.

లారీలో దొంగ కలప పట్టుకుపోయే వాళ్ళని అడిగితే... ‘చెక్‌పోస్టుకి అయిదొందలు చొప్పున పంచుకుంటూ పోయిందే గాక, ఎక్కడి కక్కడ, పైనుండి క్రింది దాకా, నెలవారీ మామూళ్ళిస్తామండి. ఏతావాతా మాకు మిగిలేదెంత? ఏదో... అట్టట్లా సంపాదించుకునేదే మేమైనా!" అంటారు.

జీతం తీసుకునే అటవీ సిబ్బందికి "లారీకలప, ఎంత మేర అడవి నరికితే వస్తుంది?" అన్నధ్యాస ఉండదు. "పట్టుకుంటే ఎంత లంచం వొస్తుంది?" అన్న లెక్క ఉంటుంది. పైనుండి క్రింది దాకా ప్రభుత్వ శాఖల్లో (ఏదైనా ఒకటే) ప్రేరేపించబడిన అవినీతి ఇది! ‘యధారాజాః తధా ప్రజాః’ అన్నట్లుగా క్రింది స్థాయి పేదవాడి దాకా ఇంకిన అవినీతి దృక్పధం ఇది.

ఇక ఎలా మిగులుతుంది ఈ ధరిత్రి... ప్రశాంతంగా, పచ్చగా?

ఇక ఈ విషయం ప్రక్కన బెట్టి మళ్ళీ అటవీరంగం నుండి ఆర్ధిక రంగంవైపు దృష్టి మరలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

namaste madam
if this attitude of govt. employees continues , our india will collapse very soon.
may god save our nation.

మీతో ఏకీభవిస్తానండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu