భారతీయత మీదా, మానవత్వం మీదా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ సుదీర్ఘ కాలంగా అమలు పరచిన, పరుస్తోన్న కుట్రలో, ఆర్ధిక రంగం కీలకమైన వాటిల్లో ఒకటి.

అందునా... జీవితాలు దమ్మిడీలతో ముడిపడ్డాక, ఆర్దిక రంగం ద్వారా... ఎవరినైనా, దేనినైనా ప్రభావ పరచవచ్చు కదా! ఇందుకోసం నెత్తికెత్తుకున్న ఆర్దిక సిద్ధాంతాలన్నీ కాగితపు సత్యాలు, మిధ్యాపులులు!

అదెలాగో పరిశీలించాలంటే...

ద్రవ్యోల్పణపు లెక్కల్లో ఎన్ని లొసుగులున్నాయో ఇప్పటికే తేటతెల్లమయ్యింది. అది పెరిగినా తరిగినా... టీవీ వార్తల్లో చెప్పుకునేందుకు, వార్తా పత్రికల్లో వ్రాసుకునేందుకు తప్పితే, తిండితిప్పల కవసరమయ్యే నిత్యావసరాల ధరలూ, వేషభాషల కవసరమయ్యే దుస్తులూ చెప్పులూ గట్రాల ధరలూ, నీడా నిప్పుల కవసరమయ్యే సిమెంటు, ఇనుము ధరలూ, భవిష్యత్తు కవసరమయ్యే చదువూ సంధ్యల ఖర్చులూ.... అన్నీ పెరుగుతూనే ఉంటాయి.

సగటు మనిషి దైనందిక జీవితపు ఆదాయవ్యయాలకీ, ఈ ‘ద్రవ్యోల్పణం, వృద్దిరేటు, తలసరి ఆదాయాల’ లెక్కల డొక్కలకీ సంబంధమేమిటో సామాన్యుల బుర్రలకి ఛస్తే అర్ధం కాదు. అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించేంత తీరికా మిగలదు.

మన్మోహన్ సింగ్‌లకూ, మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలకూ, చిదంబరాలకూ, తత్సమాన ఆర్దిక ‘దిగ్గజాల’కు మాత్రమే అర్ధమౌతాయేమో!

ఇక మరో భ్రాంతి... వృద్ధిరేటు, అదే పారిశ్రామిక వృద్ధి రేటు! ఒక దేశపు పారిశ్రామిక వృద్దిరేటును లెక్కగట్టేటప్పుడు, నిర్ణీత కాలవ్యవధిలో (అంటే సంవత్సరానికి, లేదా త్రైమాసికం గట్రాలన్న మాట.) ‘ఏయే వస్తూత్పత్తి ఎంతెంత జరిగింది, ఎంతగా విక్రయ వినిమయాలు జరిగాయి’ అనే విషయాలు కూడా పరిగణిస్తారు.

అయితే, ఈ వృద్దిరేటు లెక్కింపుల్లో ఒక దేశపు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులని (అంటే రోగాలకు వాడే మందులు) కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక దేశంలో మందుల ఉత్పత్తి, విక్రయం, వాడకం ఎక్కువ అయ్యాయంటే, సదరు దేశంలో జనాలు... రోగాలు రొప్పులు వంటి ఈతి బాధలతో బ్రతుకీడుస్తున్నారనే కదా అర్ధం!? అప్పుడే కదా ఔషధాల ఉత్పత్తి, విక్రయం, వినిమయం పెరుగుతుంది!?

అంటే... ఓ ప్రక్క జనాలు రోగాలొచ్చి ఏడుస్తుంటే, వృద్దిరేటు పెరిగిందని ప్రభుత్వం చంకలు గుద్దుకోవటం కాదా ఇది? ఇదా వృద్ది రేటు? ఇదా దేశాభివృద్ది? ఇంతకంటే దగుల్బాజీ లెక్కలూ, ఆర్దిక సిద్ధాంతాలూ ఏముంటాయి? అందుకే వాటిని కాగితపు సత్యాలనీ, మిధ్యాపులులనీ అన్నాను.

ఇక తలసరి ఆదాయాల లెక్కలు చూస్తే... అదో దౌర్భాగ్యపు లెక్క.

ఉదాహరణకి, ఓ ఊళ్ళో వందమంది ప్రజలున్నారనుకొండి. అందులో 10 మందికి, సంవత్సరానికి, 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుందనుకొండి. మరో పదిమందికి, సంవత్సరానికి, లక్ష రూపాయల ఆదాయం వస్తుందనుకొండి. మిగిలిన 80 మందికి, సంవత్సరానికి, 24 వేల రూపాయల ఆదాయం వస్తుందను కొండి.

అప్పుడు మొత్తంగా... ఆ వూరిలోని వందమంది ఆదాయం ఎంత? (10x10లక్షలు)+(10x1లక్ష)+(80x24వేలు) = 100లక్షలు + 10లక్షలు + 19.20లక్షలు = 129.20 లక్షలు. సగటున ఒక్కొక్కరి ఆదాయం ఎంత? 1.292 లక్షల అంటే దాదాపు లక్షా ముఫై వేలన్న మాట! నిజానికి జనాభాలో 80% మందికి ఆ పైనున్న ముఫైవేల ఆదాయం కూడా ఉండదు.

ఆర్దిక గణాంకాలు మాత్రం, ఆ ఊరి తలసరి ఆదాయం, సంవత్సరానికి, లక్షా ముఫైవేలుగా లెక్కగడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని, అన్ని ప్రణాళికలూ రచిస్తుంది. అప్పుడు అంతిమ లాభం... వందమంది జనాభాలోని అధికాదాయ వర్గం 10% మందికీ, తగినంత ఆదాయం ఉన్న మరో 10% మందికీ లభిస్తుంది తప్ప, అధిక సంఖ్యలో ఉన్న 80% మంది సామాన్యులకి కాదు. వెరసి మట్టిగొట్టుకు పోయేది పేదలూ, సామాన్యులే!

కాబట్టే - మనం దశాబ్దాలుగా వింటున్న ‘ధనికులు మరింత ధనవంతులౌతున్నారు, పేదలు మరింత పేద వాళ్ళవుతున్నారు! అవే పడికట్టు మాటా పుట్టింది. అది సత్యమే అయినప్పటికీ, ఇప్పటికీ పరిష్కార బాట పట్టనిది కూడా ఇందుకే! మేడిపండులో పురుగుల్లాగా, ఆర్దిక సిద్ధాంతాల లెక్కల్లో ఇన్ని లొసుగులున్నప్పుడూ... సదరు లొసుగులన్నీ, ముఖేష్ అంబానీలకూ, రతన్ టాటాలకు, లక్ష్మీమిట్టళ్ళకూ, బజాజ్ లకూ, అజీం ప్రేమ్‌జీలకూ అనుకూలంగా ఉన్నప్పుడు... ఇదే కదా జరిగేది?

ఇది అచ్చంగా... ముంబై నగరంలో నారిమన్ పాయింట్‌నో, తాజ్ హోటళ్ళనో చూపించి, "ఇవిగో ఇంత ఆకాశ హర్మ్యాలున్నాయి. చూడండి ఇదెంత భాగ్యవంతమైన నగరమో" అన్నట్లుంటుంది. ముంబై నగరం చుట్టూ, నగరంలోనూ, మురికి వాడలెన్ని ఉన్నాయో ముంబై వాసులకి తెలుసు. బయటి నుండి వచ్చేవాళ్ళు, ప్రధాన రహదారుల్లో తిరిగి "ఆహా!ఓహో!" అనుకుంటే - కనిపించేది కాగితపు సత్యలే, మిధ్యాపులులే!

ఇంకా దీనికి మెరుగులద్దుతూ శ్రీమాన్ కేంద్ర మంత్రులూ, ప్రధానమంత్రి..."రాత్రికి రాత్రి ధరలు తగ్గించేందుకు మా చేతిలో మంత్రదండమేం లేదు" అంటారు. మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఇది అసాధారణమేమీ కాదు" అంటారు.

"ఫలానా ఫలానా సిద్ధాంతాల కారణంగా, లేదా ఫలానా దేశంలో ఫలానా పరిస్థితుల వల్ల, మనకిక్కడ ధరలు పెరుగుతున్నాయి" అంటారు. ఫలానా దేశంలో, ఫలానా ప్రకృతి వైపరీత్యం వల్ల, ఫలానా పంట దెబ్బతిని, మనకిక్కడ సదరు వస్తువుల ధరలు పెరిగినట్లయితే... మరి... మరో ఫలానా దేశంలో, మరో ఫలానా పంటేదో బాగా పండటం వల్ల, మనకిక్కడ ఆ ఫలానా వస్తువుల ధరలన్నా తగ్గాలి కదా?

పెరగటానికి పలు కారణాలు కన్పిస్తాయి గానీ, తగ్గడానికి తక్కువలో తక్కువగా... ఒక్క కారణమన్నా కనబడదు మరి! కనబడే... బ్లాక్ మార్కెట్‌ని అరికట్టడం, అక్రమ నిల్వలని, పరాయి దేశాలకు పోర్టుల సాక్షిగా దొంగరవాణాలని పట్టుకోవటం, మార్కెట్ నియంత్రణ వంటి చర్యల్ని మాత్రం... ఛస్తే తీసుకోరు. నల్లబజారు అమ్మకాలలో వాటాలు అవసరం మరి! మన నాయకులు ‘నిల్వలు సంమృద్దిగానే ఉన్నాయం’టారు, ధరలు మాత్రం దిగిరావు! మొన్నటి బియ్యం, పప్పుధాన్యాల దగ్గర నుండి, నిన్నటి రైతుల ఎరువుల దాకా... ఇదే వరుస.

కాబట్టే - సిమెంట్ ఇనుము ధరలు అందుబాటులో ఉన్నాయనుకొని ఇళ్ళ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా మొదలెట్టాక, సరిగ్గా సరైన సమయంలో సిమెంటు ఇనుముల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం, సిమెంటు సిండికెటు నుండి సూట్‌కేసులు తీసుకొని, మూగా చెవుడూ గుడ్డితనం పాటిస్తుంది.

అదే షేర్ మార్కెట్ పడిపోతుందనండి. ఎంత ఉలికి పాటు వస్తుందో! టపా టపా కార్పోరెట్ కంపెనీలకు అనుగుణంగా, అన్ని సవరింపులూ జరిగిపోతాయి. కాగితపు సంపద కరిగి ఆవిరై పోతుందనే కంగారు ఎంతగా కలవరం కలిగిస్తుందో?

షేర్ మార్కెట్ మాయాజాలాన్ని పరిశీలించే ముందు మరికొన్ని అంశాలు పరిశీలిద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

మీరు చెప్పింది నిజమే!
రాజకీయ నాయకులను గట్టిగా తంతే గాని బుద్ధి రాదు.

Hello Madam,

one interesting news:
on 28th Sep, night 12.30 there is a program called 'Ammaodi bhadramena?'( is ammaodi safe?)
which is a discussion program.
charcha antha pillala meeda jarige himsa karyakramala gurinchi..

is it coincidence that the program name and ur blog name are same?

సవ్వడి గారు: నెనర్లండి!

అజ్ఞాత గారు:
మా ఇంట్లో టీవీ ఉంది కానీ, డిష్ కనెక్షన్ లేదండి. తీయించేసి నాలుగు సంవత్సరాలపైనే అయ్యింది. అందుచేత మీరు చెప్పిన ‘అమ్మఒడి భద్రమేనా?’ చర్చా కార్యక్రమం నేను చూడలేదు. ఇంతకీ అది ఏ టీవీ ఛానెల్‌లో వచ్చింది? చర్చకు పెట్టిన పేరు సంగతేమో కానీ, అర్ధరాత్రి 12.30 గంటలకి ప్రసారం చేసిన ఆ కార్యక్రమం... అమ్మలకి గానీ, పిల్లలకి గానీ ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పండి? అటువంటప్పుడు అసలా టివీ నిర్వాహకులు ఆ నిర్వాకం ఎందుకు చేసినట్లో...? నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu