అది గూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్! విశాలమైన అవరణలో ఠీవిగా నిలబడిన బహుళ అంతస్థుల భవనం. ఆఫీసు గది ముందు అందంగా ఒదిగిన క్రోటన్ మొక్కలు.

గేటు ముందు బీఎండబ్యూ కారు ఆగింది. లోపలున్నది మంత్రి గారి సతీమణి! ఒక సెక్యూరిటీ గార్డు సెల్యూట్ చేసి గేటు తీస్తుండగానే, మరో గార్డు ఫోన్ లో ప్రిన్స్ పాల్ కి సమాచారం చేరేసాడు.

కారు పోర్టికోలో ఆగేసరికే ప్రిన్స్ పాల్, కరస్పాండెంట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎదురు వచ్చి ‘మేడమ్’ కి స్వాగతం చెప్పారు. ఆఫీసు గదిలో కూర్చున్నాక, అటెండరు కూల్ డ్రింకులందిస్తుండగా....

"మీరు వచ్చారేమిటి మేడం, కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళంగా...?" మృదువుగా నవ్వుతూ వినయంగా అన్నాడు కరస్పాండెంట్!

అది పైమాటేనని మంత్రి గారి సతీమణికీ తెలుసు. ఎందుకంటే - గూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో సిటీలోని ప్రముఖుల పిల్లలంతా చదువుతుంటారు. అసలు గూబ్లీ హిల్సే ప్రతిష్టాత్మక ప్రదేశం. అక్కడుండే వాళ్ళంతా విఐపీలే!

తాను ఫోన్ చేసినా కరస్పాండెంట్ రాడు. మహా అయితే ఏఓ ని పంపిస్తాడంతే! అందుకే అవేవీ పట్టించుకోలేదావిడ!

సూటిగా విషయంలోకి వచ్చేసింది.

"ఈ మధ్య మా వినోద్, దెయ్యాలున్నాయనీ, తాను చూసాననీ విపరీతంగా మాట్లాడుతున్నాడు. చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు" ఉపోద్ఘాతంగా అంది.

"అవును మేడం. క్లాసులో మిగితా పిల్లలు చెప్పగా మాకు తెలిసింది. తాను నిజంగా దెయ్యాన్ని చూసానంటున్నాడు. మేమూ కౌన్సిల్ చేసి చూశాము" రాబోయే పరిస్థితులకి సమాయత్త పడినట్లుగా అన్నాడు ప్రిన్స్ పాల్!

"నేను అడిగి చూశాను. మీ స్కూలు బిల్డింగ్ వెనకాల శ్మశానం ఉందట?"

"అవును మేడం. వెనకాల బండాపూర్ శ్మశానం ఉంది"

"ప్రతీరోజూ ఆ శ్మశానం లోకి గోడ దూకి, సంచితో దెయ్యం శ్మశానం మధ్యలో ఉన్న.... పాకో, గుడిసో, అందులోకి పోతున్నాడంటున్నాడు మావాడు. అదేమిటో కనుక్కోండి" అంది కూర్చో లోంచి పైకి లేస్తూ మంత్రిగారి సతీమణి!

"తప్పకుండా మేడం! అవసరమైతే పోలీసు కంప్లైయింట్ ఇస్తాం" హామీ ఇచ్చాడు కరస్పాండెంటు.

మంత్రిగారి భార్య అటు వెళ్ళటంతోనే, సెల్ తీసి బండాపూర్ ఇన్స్ సెక్టర్ కి ఫోన్ కొట్టాడు ప్రిన్స్ పాల్!

~~~~~~~~~~

సెక్రటేరియట్! సమతా బ్లాక్! ముఖ్యమంత్రి కార్యాలయం. మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

"ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఉద్యోగులకి జీతాలిచ్చేందుకు కూడా మన దగ్గర డబ్బులు లేవు. అర్జంటుగా డబ్బొచ్చే మార్గం చూడండి" ముఖ్యమంత్రి గొంతులో ఆదుర్దా!

"ఆర్టీసీ రేట్లు పెంచుదాం" రెవిన్యూమంత్రి అన్నాడు.

"ఇప్పటికే అక్యూపెన్సీ రేటు పడిపోయింది" రవాణా మంత్రి రిపోర్టు.

"అదీగాక... పెంచినా వెంటనే ఆదాయం రాదు. ప్రతిపక్షాల గొడవ, బందులూ గట్రా చల్లారి, పైకం వచ్చేసరికి రోజుల టైం పడుతుంది. అంత టైం మనకి లేదు. అర్జంటుగా డబ్బులొచ్చే దారి చూడండి" ముఖ్యమంత్రి పరిస్థితి విశదం చేసాడు.

"ఏ పన్నులు పెంచినా... వ్యతిరేకతలు తగ్గి, రాబడి వచ్చేసరికి కనీసం పక్షం రోజులన్నా పడుతుంది. అదీగాక ఆ వచ్చేది ఏమూలకు?" సాలోచనగా అన్నాడు పరిశ్రమల మంత్రి.

"నీటి పారుదల శాఖలో ప్రాజెక్టుల సొమ్ము లేదా?" మరో మంత్రి ఆరా!

"ఆ ఎక్కడ? ప్రతిపక్షాలు పత్రికలు కలిసి గోలే తప్పితే, నా శాఖలో అంత డబ్బేం కాల్వలు గట్టి ప్రవహించట్లేదు" ఇరిటేట్ అయ్యాడు ఇరిగేషన్ మంత్రి.

"నీ దగ్గర ఏమయినా మిగులుంటే సర్దుబాటు చేస్తావని అడగటమే" అన్నాడు మరో మంత్రి.

"ఆపండయ్యా మీ గోల!" ముఖ్యమంత్రి కలగ జేసుకున్నాడు.

"అర్జంటుగా కాసులు రాలాలంటే అబ్కారీ శాఖ సమకూర్చాల్సిందే!" విద్యుత్ మంత్రి విశ్లేషణ!

"ఇప్పటికే పెట్టగలిగినన్ని మద్యం షాపులూ, బెల్టు దుకాణాలూ పెట్టేసాం. పిల్లలకి పాలసీసా నోట్లో పెట్టి తాగించినట్లుగా, ప్రజలకి మందు సీసా పెట్టమని మా శాఖని ఆదేశించాను. లక్ష్యాలు నిర్ణయించి అదిలించాను కూడా! ఇంక ఆడవాళ్ళకి కూడా తాగిస్తే గానీ ఆదాయం బాగా పెరగదు! అంతకంటే ఇంకేం చెయ్యలేం" అబ్కారీ మంత్రి, తన నిస్సహాయతని వ్యక్తం చేశాడు.

"అయితే ఇంకేందుకు సినిమాలో ఆడవాళ్ళు మందు తాగటం ఫ్యాషన్ చేసి, తాగితే తప్పులేదని చెప్పిద్దాం!" అంది సినిమాట్రోగఫీ మంత్రి!

"ఏదో మార్గం చూడండి! అర్జంటుగా ఆదాయం పెరిగే ఏ ఆలోచన తట్టినా ఆచరణలో పెడదాం" సమావేశం ముగించాడు ముఖ్యమంత్రి.

~~~~~~~

బండాపూర్ పోలీసు స్టేషన్! ఎస్.ఐ. సుబ్బారాయుడు ఫైలులోకి చూస్తున్నాడు. ఇప్పటికి అది యాభై ఆరో కేసు. బండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ కేసులు ఎక్కువై పోయాయి. దొంగలు నగల జోలికో, ఇతర విలువైన వస్తువుల జోలికో పోవటం లేదు. డబ్బు మాత్రమే పోతోంది. వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. బీరువాల్లోనే కాదు పోపుల డబ్బాల్లో డబ్బులూ మాయమవుతున్నాయి.

కొత్త వాళ్ళు వచ్చిపోయిన దాఖలాలు లేవు. పోన్లే ‘అంతా... చిన్నా చితక మధ్య తరగతి ఇళ్ళల్లో చోరిలే కదా!’ అని ఇప్పటి దాకా నిర్లక్ష్యం వహించాడు.

అప్పుడే గుండు పగిలే వార్తొకటి మోసుకొచ్చింది సెల్ ఫోన్. ప్రక్కనే ఉన్న గూబ్లీ హిల్స్ లోని డబ్బున్న ఆసామీల ఇళ్ళల్లోనూ డబ్బు మాయ మౌతోందని, ఆ ఏరియా ఎస్.ఐ. ఇప్పుడే ఫోన్ చేసాడు.

ఏం చెయ్యాలో అర్దం గాక బుర్ర గోక్కున్నాడు సుబ్బారాయుడు.

~~~~~~~~

అబ్కారీ మంత్రి వెంకట స్వామి ఇల్లు. ఆఫీసు గదిలో కాగితాలు చూస్తున్నాడు మంత్రి గారి సెక్రటరీ సోమలింగం. హడావుడీగా గదిలోకి వచ్చాడు మంత్రి. ఠక్కున లేచి నిలుచున్నాడు సోమలింగం.

కుర్చీలో కూలబడి ఉస్సురన్నాడు వెంకట స్వామి.

"చూడు సోమలింగం! మా మనవడు వినోద్ స్కూల్లో దెయ్యాన్ని చూసాడని గోల చేస్తున్నాడు. కలవరింతలు. ఉలిక్కిపడటాలు. నిద్రకూడా సరిగ్గా పోవటం లేదు. జ్వరాన పడతాడేమోనని నా భార్య దిగులు పడుతోంది. వాళ్ళ స్కూలు వెనక శ్మశానంలోకి, ప్రతీ రోజూ ఎవడో గోడ దూకి పాకలోకి పోతున్నాడట. ‘వాడు కాటి కాపారి అయ్యిండచ్చు లేరా!’ అంటే.... ‘అయితే గేటు తాళం తీసుకు పోవచ్చుగా! గోడెందుకు దూకటం?’ అంటాడు.

‘ఏ పేకాట రాయిడో, తాగుబోతో అయ్యుండచ్చు!’ అంటే... ‘కంపెనీ లేకుండా ఒక్కడే ఎందుకెళతాడంటాడు?’ అబ్బబ్బ ఈ పిల్లల లాజిక్కుకి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు. అదెంటో కాస్త చూడు. ఆ గోడ దూకే వాణ్ణే పట్టుకొచ్చి, వాడి కాళ్ళ మడమలు వెనక్కి తిరిగి లేవని చూపిస్తే తప్ప, మన వాడు ఒప్పుకునేటట్లు లేడు" అన్నాడు ఆయాసపడుతూ!

అంతలోనే సెల్లు ఫోన్ ఖంగుమంది.

అవతల ముఖ్యమంత్రి. ఫోన్ లో మాట్లాడి పెట్టేస్తూ ఉస్సూరన్నాడు మంత్రి వెంకట స్వామి.

‘ఆదాయం పెంచు. ఆదాయం పెరిగే మార్గం ఆలోచించు’ అంటాడు ముఖ్యమంత్రి! అదేదో స్విచ్ఛ్ వేస్తే బల్పు వెలిగినట్లు అయిడియాలు వచ్చేస్తాయా?- విసుక్కుంటూ లోపలికెళ్ళాడు.

సెక్రటరీ సోమలింగం ఆలోచిస్తూ బయలు దేరాడు.

~~~~~~

రెండు రోజుల తర్వాత.....

అబ్కారీ మంత్రి ఆఫీసు! రయ్యిన ఉరుక్కుంటూ వచ్చాడు సోమలింగం. అతడి ముఖం వెలిగి పోతుంది.

"సార్! ప్రభుత్వ ఆదాయం తక్షణం పెరిగే మార్గం దొరికింది" రొప్పుతూ చెప్పాడు.

"ఏమిటి?" అరిచాడు మంత్రి.

మంత్రి చెవిలో గుసగుసలాడాడు సోమలింగం.

ఈసారి కెవ్వున అరిచాడు అబ్కారీ మంత్రి.

ఒక్క పరుగున ముఖ్యమంత్రి ఛాంబర్ చేరాడు. సుడిగాలిలా లోపలికి దూసుకుపోయాడు. అప్పటికి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాడు.

"సార్! తక్షణం ప్రభుత్వ ఆదాయం పెరిగే మార్గం దొరికింది" ఆనందంతో అరిచాడు. అతడి ముఖం, సెక్రటరీ సోమలింగం ముఖం కంటే రెట్టింపు సంతోషంతో వెలిగిపోతుంది.

"ఎలా?" ప్రశ్నార్దకంగా చూసాడు ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి చెవిలో గుసగుసలాడాడు అబ్కారీ మంత్రి వెంకట స్వామి.

"నిజంగా?" నమ్మలేనట్లు అడిగాడు ముఖ్యమంత్రి.

"నిజం సార్! ఒట్టు" అన్నాడు అబ్కారీ మంత్రి.

"అయితే వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని శ్మశానల దగ్గర మద్యం షాపులు పెట్టించెయ్!" ఓ వైపు అబ్కారీ మంత్రిని అభినందించి, ఆదేశిస్తూనే, ఫోన్ లో హోంమంత్రిని రమ్మన్నాడు.

ఆఘమేఘాల మీద పరుగెత్తుకు వచ్చింది హోంమినిస్టర్!

"చూడమ్మా! అన్ని పోలీసు స్టేషన్ లని, ఇక ముందు చోరీ కేసులు వస్తే, చూసీ చూడనట్లు ఊరుకొమ్మను" హోంమినిస్టర్ కి ఆర్డరు వేసాడు సీఎం.

"అలాగే సార్!" అర్ధం గాకపోయినా, అయోమయంగా ఉన్నా, అన్నిటికీ సరేననటమే హోం మినిస్టర్ కి వచ్చిన మంత్రం.

~~~~~~

ఆ తర్వాత, అనూహ్యంగా, రాష్ట్రంలో మద్యపు అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. మరిన్ని మద్యం షాపులు తెరుస్తూ ప్రభుత్వం పరుగులు పెడుతోంది. నిరుద్యోగ తాగుబోతులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. వచ్చిన డబ్బుల్తో మరికొన్ని ఆకర్షణీయమైన పేర్లతో సంక్షేమ పధకాలు ప్రకటించింది. అమలు చేసినా, చేయకపోయినా, ఆ పధకాల పేరిట పత్రికలకి పుల్ పేజీ ప్రకటన లిచ్చింది.

దాంతో పెరిగిన చోరీ కేసుల గురించి వ్రాయడం పత్రికలూ మరిచిపోయాయి. అంతా హ్యాపీ!

~~~~~~~

ఈ లోగా వెంకటస్వామి మనుమడు వినోద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడా పిల్లాడు దెయ్యాలున్నాయంటే నమ్మటం లేదు. నవ్వుతూ కొట్టిపారేస్తున్నాడు. ఆ సాయంత్రం టీ తాగేటప్పుడు అబ్కారీ మంత్రి వెంకట స్వామి సతీమణి, భర్తనడిగింది...."ఈ మధ్య మన వినోద్ దెయ్యం గియ్యం అనడం మానేసాడండి. మొన్నోరోజు సోమలింగం, మీరు తీసుకురమ్మన్నారని వినోద్ ని బయటికి తీసికెళ్ళాడు. అప్పటి నుండీ వినోద్, ఈ దెయ్యం గోల మానేసాడు. ఏం చేశారేమిటి?"

భార్య వైపు విజయగర్వంతో చూస్తూ "ఆ గోడ దూకుతున్నవాడు దెయ్యం కాదే పిచ్చి మొహమా? మన పాలిట పాడిగేదే! ఆ దెయ్యం అయిడియా చెప్పినందుకే... ముఖ్యమంత్రి కీ, మనకీ వందల కోట్లు ఆదాయం వచ్చింది?"

"అదెలాగో చెబుదురూ!" అంది మంత్రి గారి ఇల్లాలు.

"వినోద్ దెయ్యం దెయ్యం అన్నాడా! అదేదో కనుక్కోమని మన సెక్రటరీ సోమలింగానికి చెప్పాను. అతడెళ్ళి స్కూల్లోనూ, శ్మశానం దగ్గరా, పోలీసుల దగ్గరా ఆరా తీసాడు. బండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకేసులు పెరిగిపోయాయి. సోమలింగం ఆ ఏరియా ఎస్.ఐ.ని తీసుకొని, మాటేసి, బండాపూర్ శ్మశానంలో గోడ దూకే వాణ్ణి పట్టుకుని విచారిస్తే తేలిందేమిటో తెలుసా!" సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు చెప్పటం ఆపాడు.

"అబ్బా! చెబుదురూ!" అతృతగా అడిగింది అతడి భార్యామణి!

"బండాపూర్ శ్మశానం గేటు దూకేవాడు వట్టి తాగుబోతు. ఓ రోజు వాడు తాగేందుకు మందు సీసా, తినేందుకు చిప్సూ చీకులూ తీసుకొని, శ్మశానం గోడ దూకి, పాకలోకి పోయాడట. అంతే! బ్రాందీ వాసనకి, సమాధుల్లోంచి దెయ్యాలు బయటికి వచ్చి "మందు తాగి తాగి చచ్చిపోయాము. చచ్చినా మాకు మందు మీద మక్కువ పోలేదు. అందుకే ఇక్కడే దెయ్యాలై పడున్నాము. బ్రాందీ వాసనకి ప్రాణాలు లేచి వచ్చినట్లుంది. మాకూ పోయ్!" అన్నాయట. వీడు దడుచుకుంటే అవి ధైర్యం చెప్పి, ఆనక చీర్సు చెప్పాయట.

మర్నాటి నుండి వీడు, దెయ్యాలతో కలిసి కూర్చొని తాగటం షురూ అయ్యిందట. మందు తేవటానికి డబ్బులు లేవంటే దెయ్యాలే, తమ ఒకప్పటి ఇళ్ళల్లో దొంగతనాలు చేసి, డబ్బులు తెచ్చాయట. క్రమంగా ఎవరింట్లోబడితే వాళ్ళింట్లో చోరీ చేసి డబ్బు తెస్తున్నాయ్. వీడు మందు తెస్తున్నాడు.

సోమలింగం ఇదంతా ఎంక్వయిరీ చేసుకొచ్చాడు. ఇదంతా ముఖ్యమంత్రికి చెబితే ఎగిరి గంతేసాడు తెలుసా? ఆ రోజు నుండి, శ్మశానం దగ్గర స్పెషల్ కౌంటర్లు తెరిచాం. ఇహ చూస్కో! ఒకటే అమ్మకాలు! ఇబ్బడిముబ్బడిగా డబ్బు! దయ్యాలకి కంపెనీ ఇవ్వటానికి నిరుద్యోగ తాగుబోతు యువకులకు ఉద్యోగాలు, చిప్స్ చీకులు అమ్మటం ద్వారా బండి వాళ్ళకి ఉపాధి, స్పెషల్ కౌంటర్ల లో ఉద్యోగాలు! మన రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది" అన్నాడు ఒకింత గర్వంగా!

"మరి దయ్యాలు, డబ్బులు బదులుగా మందునే దొంగతనం చేయవచ్చు కదా?" అనుమానం తీరకా మంత్రి గారి సతీమణి.

"మందు దొంగతనం చేస్తే కొన్నాళ్ళకి ఆ షాపు మూతపడుతుంది కదా! అప్పుడు మందు దొరకటం కష్టం కదా, అంతేగాక మందు అమ్మే షాపు వాడు పచ్చగా ఉండాలని కూడా! అందుకని ఆ దయ్యాలు డబ్బులే దొంగతనం చేస్తున్నాయట!" అని భార్య అనుమానం తీర్చాడు.

"మరి చోరీ కేసులు ఎక్కువైతే గగ్గోలు కాదా?" బుగ్గలు నొక్కుకుంది భార్యమణి!

"పిచ్చిదానా! ఋజువులు దొరికినప్పుడు గదా కేసులు!? పత్రికలు నిలదీస్తే కదా గొడవ!?" ఫకాలున నవ్వాడు మంత్రి.

"నిజమే నండోయ్! మరి మన వినోద్...."

"ఏముంది! వినోద్ ని తీసికెళ్ళి ఆ తాగుబోతు వాడి కాళ్ళు చూపించాడు సోమలింగం. ‘దెయ్యానికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంటారు కదా! వీడు మనిషే! తాగటానికే శ్మశానం గోడ దూకుతున్నాడు’ అని చెప్పించాను. దాంతో అన్నీ సరై పోయాయి" అన్నాడు మంత్రి.

అతడి తెలివికి సంబరపడింది మంత్రి భార్య!

వెరసి, ‘ఈ ప్రభుత్వం... చచ్చే వరకే కాదు, చచ్చాక కూడా మద్యం తాగించగలదు’ అన్న విషయం రహస్యంగానే ఉండిపోయింది.

అంకితం: ప్రజలు తాగి చచ్చినా సరే, వ్యవస్థ నిర్వీర్యం అయినా సరే... ‘తాగితే తప్పేంలేదన్న’ కాంగ్రెస్ పాలిట యువరాజు రాహుల్ గాంధీకి, ప్రభుత్వ ఆదాయం పెరిగాలనుకునే నాయకులకూ, ప్రభుత్వాధికారులకూ ఈ కథ అంకితం!

9 comments:

Nice post.

మై డియర్ డియర్ అమ్మ ఒడి!

చితక్కొట్టేశారు!

నేనూ ఇలాంటి టపా ఒకటి వ్రాద్దామని ప్లాన్ చేశాను--ఇక వ్రాయను!

ఈ మధ్య ప్రతీ మాటా, అక్షరం, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ చదివిన టపా ఇదే!

ఇంకా ఇలాంటివి చా........లా వ్రాయండి!

శ్రీరాం గారు: నెనర్లండి!

కృష్ణశ్రీ గారు : నా టపా అంతగా నచ్చినందుకు చాలా చాలా సంతోషం!:)

brilliant

బాగా రాసారండీ.. మీరు రాసిన శైలి నాకు బాగా నచ్చింది..

చాలా బావుంది.

దెయ్యాల్ని కూడా పీక్కుని ఆదాయం పెంచుకునే ప్రభుత్వాన్ని బాగా చూపించారు..

చాలా బాగా చెప్పారు.

కొత్తపాళీ గారు: నెనర్లండి.

స్థితప్రజ్ఞుడు గారు: నా టపా, నా శైలి నచ్చినందుకు కృతజ్ఞతలండి!

harephala గారు: నెనర్లండి.

శ్రీలలిత గారు: ప్రభుత్వమే డబ్బు ఎలా వచ్చినా ఫర్వాలేదనుకునే స్థితిలో ఉండటం నిజంగా శోచనీయం. నెనర్లండి.

సత్యేంద్ర గారు: నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu