ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్దులకు, ఫిజిక్సులో మా గురువు గారు ఆర్.చలపతిరావు గారి పుస్తకం ఎంతో ఉపయుక్తమైనది. అందులోంచి ఒక ప్రశ్న- జవాబుని వివరించి, దాని అనువర్తనతో నా విశ్లేషణని కొనసాగిస్తాను.

ముందుగా ప్రశ్న:

ఒక త్రాగుబోతు రోడ్డుమీద ముక్కుసూటిగా నడుస్తున్నాడనుకొండి. అతడికి 18 మీటర్ల దూరంలో ఒక గొయ్యి ఉంది. మన వాడు తాగి ఊగుతూ నడుస్తున్నాడు. కానీ సరళ రేఖా మార్గంలోనే నడుస్తున్నాడు. ఎనిమిది అంగలు ముందుకేస్తే, ఆరు అంగలు వెనక్కి వేస్తున్నాడు. ఒకో అంగ ముందుకో వెనక్కో వెయ్యటానికి ఒకో సెకను పడుతుందను కొండి. అలాగే, ఒకో అంగ ఒక మీటరు అనుకొండి. ఎంత సమయంలో ఈ త్రాగుబోతు ఆ గొయ్యిలో పడతాడు?

జవాబు:
త్రాగుబోతు ముందుగా ఎనిమిది అడుగులు వెయ్యటానికి [మీటర్లు] 8 సెకనులు పడుతుంది. మళ్ళీ వెనక్కి ఆరు[మీటర్లు] అంగలు వెయ్యటానికి 6 సెకనులు పడుతుంది. వెరసి 14 సెకనులలో 2 మీటర్లు ప్రయాణిస్తాడు. అలాగే 10 మీటర్లు ప్రయాణించటానికి, 5x2=10m, గనుక 5 సార్లు ఇదే విధమైన విన్యాసాలు చేస్తాడు. కాబట్టి 5x14=70 సెకనులలో 10 మీటర్లు ప్రయాణిస్తాడు. ఆరోసారి, 8 మీటర్లు ముందుకు అంగలు వేస్తే, 18 మీటర్ల దూరంలోని గోతిలో నేరుగా పడిపోతాడు గనక, మరి వెనక్కి రాలేడు. అందుకు పట్టే 8 సెకనులని కలుపుకుంటే మొత్తంగా, 70+8=78 సెకనులలో, త్రాగుబోతు తూగుతూ పోయి, నేరుగా గోతిలో పడతాడు.

ఇక దీని అనువర్తన ఏమిటంటారా?

అధికారంలో నున్న ప్రభుత్వం[ఏదైనా సరే] ప్రజల మీదికి.... మద్యం, జూదం, రెడ్ టేపిజం వంటివి ప్రయోగించి.... ఉన్నత్తుల్ని, నిస్తేజితుల్నీ చేస్తోంది. ఆ విధంగా దుర్బలంగా ఉన్నా గానీ...

ప్రభుత్వం పెట్రో వడ్డనలు చేసినప్పుడూ
ధరలతో దవడలు వాచినప్పుడూ
మార్కుల అవకతవకలతో పిల్లల చదువులు చతికిలపడ్డప్పుడూ
ఆర్.ఆర్.బి., ఎపిపిఎస్సీ వంటి అవకతవకలు బయటపడినప్పుడూ
భోపాల్ గ్యాస్ ల వంటి కోర్టు తీర్పులు వెలువడ్డప్పుడూ
అవినీతి స్కాంలు బయటపడ్డప్పుడూ

లేచి, ఊగుతూనే అయినా, ఉద్రేకంగా, ప్రభుత్వం మీద ఖస్సుమంటున్నారు.

సరిగ్గా అప్పుడు... మీడియా, ప్రతిపక్షాలూ రంగంలోకి దిగుతున్నాయి. ప్రజల తరుపున తాము పోరాడుతున్నామంటూ సా....గ తీసి, ప్రజల ఖస్సుని కాస్తా తుస్సుమనిపిస్తున్నాయి.

దాంతో ఎనిమిదడుగులు ముందుకేసిన ప్రజలు ఆరడుగులు వెనక్కి వెయ్యక తప్పటం లేదు. మెల్లిగా ప్రజల ఆవేశం చల్లబడ్డాక.... పత్రికలూ, ప్రచారసాధనాలు, ప్రతిపక్షాలూ కూడా, మెల్లిగా సమస్యల్ని అటకెక్కించి, మళ్ళీ తమ స్వప్రయోజనాలు, తమ రాజకీయాలు చూసుకుంటున్నాయి.

ఆ విధంగా.... నేర్పుగా, అంచెలంచెలుగా, ప్రజల్ని వ్యూహాత్మకంగా తీసికెళ్ళి ‘అప్రతిఘటన’ అనే గోతిలో పడెయ్యాలన్నదే వీరందరి ఉమ్మడి లక్ష్యమన్నమాట. అప్రతిఘటన అనే గొయ్యి అంటే - అందులో పడిన వాళ్ళు ఇక దేన్నీ ప్రతిఘటించలేరు. అన్నిటినీ భరిస్తారు. ‘అదే ఆనందం’ అని మీడియా అంటే ‘అవును కామోసు’ అనుకుంటారు. పైపెచ్చు ‘అదే అభివృద్ది’ అంటూ వాదిస్తారు, నమ్ముతారు. ఎదురుతిరగటం అన్న ఊహే భరించలేరు.

ప్రతిఘటన అన్న స్థితిని మరిచి పోవటమే పెద్ద గొయ్యి! అందులో పడిన వాళ్ళు బ్రతుకుతున్నామనుకుంటారు కానీ, ఏనాడో జీవచ్ఛవాలు! అచ్చంగా జపాన్ వాళ్ళలాగా!

"ప్రజలంతట ప్రజలే ముందుకే పోతూన్నప్పుడు, అలా వదిలేస్తే మరింత ముందుగా గోతిలో పడతారు గదా? వాళ్ళకి కావలసింది అదే అయినప్పుడు, ఇక వెనక్కి లాగటం ఎందుకూ?" అని కొందరనుకుంటారు.

అలాగనుకుంటే అది ఖచ్చితంగా వారి అమాయత్వమే! ఎందుకంటే.... ప్రజలని యధేచ్ఛగా వదిలేస్తే, ప్రమాదాన్ని పసిగట్టి వెనక్కిపోవచ్చు. లేదా ముందుకెళ్ళనిస్తే.... గోతిలో పడవచ్చు, పడకపోవచ్చు. పడినా అమిత వేగంతో పోయి పడతారు. అంతేగాక ఆ వేగంలో తమనీ లాగేస్తారు. ఇంకేం మిగలదు. [అదీగాక, అంతిమంగా ఎవరయితే ప్రజలని అక్కడికి డ్రైవ్ చేస్తారో వారు దానికి బాధ్యులు కావలసి ఉంటుంది. ఆ నిందా మోయవలసి ఉంటుంది.]

ఇది ఊహాజనితం కాదు. అతిశయోక్తి కూడా కాదు. చారిత్రాత్మక దృష్టాంతం! కావాలంటే పరిశీలించండి.

1947 లో, మత ప్రాదిపదికన, అఖండ భారతదేశం.... పాకిస్తాన్, ఇండియాలుగా విడిపోయింది. ఆనాడు ముస్లిం ప్రజలు, అధికసంఖ్యలో, పాకిస్తాన్ కావాలనుకున్నారు. దేశంగా ఏర్పడ్డారు. ఆదే మతాభిమానం.... క్రమంగా మతోన్మాదంగా మారితే... ప్రజలూ, ప్రభుత్వాలూ కూడా పోయి ‘తాలిబానిజం’ అనే గొయ్యిలో పడ్డారు. మతం మత్తులో వేసిన అంగలు, ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆ గోతిలోకి లాక్కెళ్ళి పడవేసాయి.

ఇప్పుడు రోజూ పేలే కారు బాంబుల్ని, ఆత్మహుతి దాడుల్ని లెక్కపెట్టుకుంటూ, మృతుల సంఖ్యలతో నివేదికలు తయారు చేసుకుంటున్నారు.

ఈ సూత్రం మతానికే కాదు, మానవ మనస్తత్త్వంతో సహా, ఆర్దికాది అన్నిరంగాలకీ వర్తిస్తుంది.

అందుకే, అంత జాగ్రత్తగా.... మద్యం, జూదం, రెడ్ టేపిజం వంటివి ప్రయోగించేది!

అందుకే, అంత జాగ్రత్తగా.... పైకి ముందుకు నడుపుతున్నట్లే కనిపిస్తూ, ప్రజాగ్రహాన్ని చల్లార్చి వెనక్కి నడిపించేది!

పత్రికల ఉద్దేశం ప్రజల్ని ముందుకు నడపటమే అయితే, అది 1992 లో జరిగిన దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమంలా ఉంటుంది.

ప్రతిపక్షాల ఉద్దేశం ప్రజల్ని ముందుకు నడపటమే అయితే, అది 1992లో కూల్చిన బాబ్రీ మసీదులా ఉంటుంది.

కాబట్టే... డేల్ కార్నీకి తాత మాదిరిగా, లేదా వందమంది డేల్ కార్నీలంతగా.... ప్రభుత్వం.... పత్రికలూ, ప్రచార సాధనాలు, ప్రతిపక్షాలు, సంపూర్ణ మద్దతుతో ‘ప్రజల్ని గోతిలో పడెయ్యటం ఎలా?’ అన్న వ్యూహాన్ని పరమ జాగరూకతతో అమలు చేస్తోంది.

మొత్తంగా.... ప్రజాస్వామ్య పరంగా, చట్టబద్దంగా, ఉన్న చట్టాలకు మార్పులు చేర్పులు చేసుకుని, కొత్త చట్టాలు తెచ్చుకుని.... అధికారికంగా కొనసాగిస్తున్న దోపిడి! ఆద్యంతం చట్టబద్దమే! కోర్టుల కెక్కినా వాళ్ళే గెలుస్తారు. కోర్టులూ అందులో భాగమే కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

http://telugu.greatandhra.com/cinema/11-04-2010/39d_04_nin.php

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu