ప్రభుత్వ సంస్థలు తయారు చేసిన వస్తువులు.... నాణ్యమైనవి, సరసమైన ధరలకు లభించినప్పుడు, సహజంగానే ప్రజలు వాటిని కొనేందుకే ఇష్టపడతారు. [కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వారి మైసూర్ శాండిల్ సబ్బు, ఒకప్పుడు దాదాపు ఇంటింటా ఉపయోగింపబడటమే దీనికి సజీవ ఉదాహరణ.] అప్పుడు అనివార్యమై అయినా, ప్రైవేటు సంస్థలు.... అంతే నాణ్యమైన వస్తువులను, అంతకంటే [కనీసం అంతే] సరసమైన ధరకు అమ్మక తప్పదు.

ఆవిధంగా, ప్రైవేటు సంస్థలు వినియోగదారులని వ్యాపార దోపిడి చేయకుండా, ప్రజల నుండి అధిక లాభాలు గుంజకుండా నియంత్రింపవచ్చు. ఆ విధంగా ప్రజలు, సరసమైన ధరకు, నాణ్యమైన వస్తువులని ఆనందించగలుగుతారు. శ్రామికులు గానూ, వినియోగదారులు గానూ కూడా, ప్రజలు దోపిడికి గురికాకుండా నిరోధించవచ్చు.

ఈ ఆశయ సాధన కోసమే... ఆల్విన్ రిఫ్రిజిరేటర్లు, హెచ్.ఎం.టీ. వాచీల వంటి వస్తు తయారీ సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్థాపింపబడ్డాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ప్రభుత్వ పరంగానే స్థాపించబడినాయి. APIIDC, (Andhra Pradesh Industrial Infrastructure Development Corporation) వంటి సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు సహకరించి చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాల్సి ఉంది. పనితీరులో APIIDC, APSFC వంటి సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. [ఈ విషయమై, బ్యాటరీ తయారీ సంస్థను నడిపినందున, నేను స్వానుభవ పూర్వకంగా చెప్పగలను.]

ఆల్విన్ వంటి సంస్థలు మూతపడ్డాయి. ఇక మన్మోహన్ సింగ్ అనబడే ఈ గొప్ప ఆర్దికవేత్త, లాభాల బాటలో ఉన్న ప్రభుత్వసంస్థల్ని కూడా తెగ నమ్మిపారేసాడు. సిద్దాంతపరంగా అయితే.... ఆల్విన్, హెచ్.ఎమ్.టీ. వంటి సంస్థలు విజయవంతం కావాలి. మిశ్రమ ఆర్దిక వ్యవస్థా విజయవంతం కావాలి. అయితే వాస్తవంలో అవి విఫలమైనాయి. ఎందుకంటే - అమలు తీరులో గూఢచర్యం ‘రెడ్ టేపిజం, అవినీతి’ పేరుతో ప్రవేశించింది గనుక! ఆ వైఫల్యం వెనుక నకిలీ కణిక వ్యవస్థ ఉంది గనుక! పై ముసుగులో విదేశీ నిఘా సంస్థల్నో, కార్మిక సంఘాలనో, రాజకీయాలనో చూపింది గనక!

వివరంగా చెప్పాలంటే -

ప్రభుత్వ రంగ సంస్థల వైఫల్యానికి మీడియా, రాజకీయ నాయకులూ కలిసి, రకరకాల భాష్యాలు చెప్పారు. రోజుల మారిపోయాయన్నారు. రాజకీయుల అవినీతి, అధికారుల్లోకీ ప్రవేశించిందన్నారు. సమన్వయ లోపం అన్నారు. ఇక ఒకో సంస్థ వైఫల్యానికీ ఒకో భాష్యాన్ని, సోకాల్డ్ మేధావులూ, నిపుణులూ, పత్రికల్లో వ్యాసాలుగా వ్రాసారు. నిజానికి ఈ మేధావులూ, నిపుణులూ కూడా, మీడియా నిలబెట్టిన బొమ్మలే! మీడియా కవరేజిలో వెలిగిన సెలబ్రిటీలే!

ఇలా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యానికి, సైద్ధాంతికపరమైన పైకారణాలని[over leaf reason] చూపిస్తూ.... వాస్తవంలో ఇటు కార్మిక సంఘాల నాయకులని, అటు అధికార వర్గాలనీ కూడా.... అవినీతి, రెడ్ టేపిజం, శ్రమ కిష్టపడక ప్రక్కదారులు తొక్కే మనస్తత్వం వంటి ప్రభావాలలో ముంచెత్తారు. ఇందుకోసం పన్నిన వ్యూహాలతో[ఎక్కువగా కార్మిక సంఘాల సమ్మెల దెబ్బ] సహజంగానే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్పత్తి తగ్గింది. వ్యయం పెరిగింది.

[ఇదే ఇప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టులలోనూ, పధకాలలోనూ నడుస్తున్న తీరు! వ్యయం పెరుగుతుంది, ప్రయోజనాలు శూన్యమౌతాయి. వ్యూహాలు బహిర్గతమౌతున్న తీరిది.] అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రతీదశలోనూ.... అవకతవకలు, అధికారులకీ కార్మిక నాయకులకీ మధ్య వైషమ్యాలూ, వివాదాలు!

అప్పటి కార్మిక సంఘ నాయకులలో చాలామంది, క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎదిగారు కూడా! దాన్ని బట్టే చెప్పవచ్చు, సదరు కార్మిక సంఘ నేతలకి తెరవెనుక అండదండలందాయని! ఇలాంటి నాయకులు కార్మిక నాయకులవటం చేత, 70-80 దశకాలలో, ఎప్పుడు చూసినా, యాజమాన్యపు అధికార వర్గాలతో, కార్మికుల వివాదాల వార్తలే వినబడుతుండేవి. సమ్మెలూ, లాకవుట్లూ, కోర్టుకేసులూ నడుస్తుండేవి. వెరసి ఉత్పత్తి మాత్రం దారుణంగా పడిపోయేది. ఇప్పాటిలా అప్పటికి, కోర్టుల ‘కుట్ర భాగస్వామ్యం’ ఇంతగా బహిర్గత పడలేదు.

నిండా చిల్లులున్న కుండని నింపటం ఎవరికీ సాధ్యంకానట్లే... ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఉండేది. ఫలితంగా ఆల్విన్ లు మూతపడ్డాయి.

దీనికి గట్టి ఉదాహరణ చెప్పాలంటే సింగరేణి కాలరీసే! అక్కడ ఎప్పుడు చూసినా కార్మికుల సమ్మెలే నడిచేవి. నెలలో సగం రోజులు అవే! 1992 వరకూ సింగరేణి వంటి సంస్థల తీరు ఇదే! తర్వాత మాత్రమే, సదరు సంస్థ వాటి నుండి బయటపడి, ‘లాభాలు’ ’ఉత్పత్తి పెరిగింది’ గట్రా మాటలు వినబడ్డాయి.

ఈ స్థితికి సింగరేణి కంటే పెద్ద ఉదాహరణ ఏపీఎస్ ఆర్టీసీ! 1992 వరకూ కూడా ‘ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణీకులకి సరైన తీరులో సేవ చేయరన్నది’ జగమెరిగిన సత్యం! అప్పట్లో ఆర్టీసీ డ్రైవర్లు, బస్ స్టాపుకు పదిమీటర్లు ముందో వెనుకో ఆపుతారు, తప్ప స్టాపులో ఆపనే ఆపరనే... జోకులూ, విమర్శలూ ఉండేవి. ఖాళీగానైనా బస్సులు తిప్పుతారు గానీ, ప్రయాణీకులున్నా కూడా, స్టాపుల్లో ఆపి ఎక్కించుకోరనీ విమర్శలుండేవి. కండక్టర్లు చిల్లర మింగేస్తారని కార్టూన్లు, జోకులూ ఉండేవి.

ఇప్పుడు? ముఖ్యంగా పల్లెరూట్లలో, పట్టణానికి దగ్గర ఉన్న ఊళ్ళకీ, సెవన్ సీటర్ ఆటోలు, టాక్సీ కాబ్ లూ వచ్చేసరికి... లాభాలు రాకుంటే ఆర్టీసీ ప్రైవేటైజ్ అవుతుంది అన్న ప్రమాదం కనబడేసరికి.... ఒకటిన్నర దశాబ్దాంగా, ఆర్టీసీ నుండి అంతకు క్రితం కంటే కొన్నిరెట్లు మెరుగైన సేవలు అందుతున్నాయి.

ముఖ్యంగా... చెయ్యేత్తితే బస్సు ఆపబడటం గురించి 1990 కు ముందర ప్రయాణీకులు ఊహించనైనా లేదు. ప్రైవేటు టాక్సీవాలా ఆరిచినట్లు, ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణీకులని ఆకర్షిస్తూ, బస్సు ప్రయాణ మార్గంలోని ప్రాంతాల పేర్లు అరుస్తూ, ప్రయాణీకులని పిలుస్తారని, కండక్టర్లు కూడా ఊహించి ఉండరు. ఒకప్పుడు వాళ్ళకి ఆక్యుపెన్సీరేటు గురించి బాదరబందీనే ఉండేది కాదు.

ఎందుకీ మార్పు వచ్చినట్లు? రేట్లు పెరిగితే, ప్రయాణీకులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ఆపరేటర్లు కనబడుతున్నారు. ‘నష్టాల బాటలో ఉంటే ఆర్టీసీ ని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేస్తుందేమో!’ అన్న భయం, ఉద్యోగుల్లో తెచ్చిన అప్రమత్తతే ఇందుకు కారణం! అంటే అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వలన వచ్చే ప్రయోజనం అన్నమాటే కదా! [అసలుకే లాభాలున్నా ‘ఏకమొత్తంగా భారీ సొమ్ము వ్యక్తిగత ఖాతాలకు జమపడుతుంది కదాని’ ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసేస్తున్నారయ్యె!]

అలాంటప్పుడు మిశ్రమ ఆర్దిక వ్యవస్థ సిద్దాంతంలో లోపం ఉందా? అమలులో లోపం ఉందా? దాని వైఫల్యం యాదృచ్ఛికమా?, లేక వ్యూహాత్మకమా?

మరో ఉదాహరణ చూడండి! భారతదేశంలో టెలిఫోన్ సేవలకు సంబంధించినది ఇది! ప్రైవేటు సెల్లులు, ఫోన్ల కంపెనీలు రంగంలోకి ప్రవేశించక ముందు, భారత్ లో మొత్తం టెలిఫోన్ల రంగం కేంద్ర ప్రభుత్వానిదే! [అప్పట్లో పోస్టల్ & టెలిఫోన్ శాఖలు కలిసి ఉండేవి. తర్వాతే విడిపోయి BSNL గా టెలిఫోన్ సంస్థ ఏర్పడింది.] అప్పట్లో, అంటే 1992 కు ముందర, టెలిఫోన్ సర్వీసులు అధ్వాన్నంగా ఉండేవి.

[మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు అసలే అంతంత మాత్రంగా సేవలందించే టెలిఫోన్ ఎక్చేంజ్ ల మీద, నక్సలైట్లు దాడి చేసి ధ్వంసం చేసేవాళ్ళు. దాంతో నెలల పాటు టెలిఫోన్లు మూగపోవటం అప్పట్లో సర్వ సాధారణం.] అప్పట్లో టెలిఫోన్ సర్వీసుల మీద, ఆపరేటర్ల మీద, ఎన్నో జోకులూ, కార్టూన్లూ ఉండేవి.

ఒక్క ఫోన్ కనెక్షన్ కోసం సంవత్సరాల పాటు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. కనెక్షన్ ఇచ్చినా అంతంతమాత్రపు నాణ్యత, సేవ! ఇతర దేశాలలో మనదేశపు టెలిఫోన్ సేవల గురించి, ఫోన్ కోసం వేచి ఉండాల్సి రావటం గురించీ జోకులుండేవని, అప్పటి నా ఎన్.ఆర్.ఐ. స్నేహితులు చెప్పేవాళ్ళు. అలాంటివి విన్నప్పుడు అవమానంగా, రోషంగా అన్పించేది. భారతదేశపు రోడ్ల గురించీ ఇదే గతి ఉండేది.

బజాజ్ స్కూటర్సు గట్రాల కోసం కూడా, సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. స్కూటర్ అలాట్ అయిన వాళ్ళు పార్టీలు ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇవన్నీ దేశపు హోదాకు గుర్తులుగా చెలామణి అయ్యేవి. ఒక దేశపు ఆర్దిక హోదాని, పరువుని, ఇలాంటి ‘ప్రమాణాల’తో అనధికారికంగా కొలిచేవాళ్ళు. అది తలచుకొని.... ఇప్పుడు రోడ్ల ప్రక్కన టెంట్లు వేసుకొని, ప్రైవేటు ఫోన్ల కంపెనీల వాళ్ళు, మోటార్ బైకుల వాళ్ళు, తక్షణం సెల్ ఫోన్లు/బైకులు ఇస్తామంటూ కాంపెయిన్ లు నిర్వహించటం చూసి మేము చాలా నవ్వుకుంటూ ఉంటాము.

మారిన రోజులని, పరిస్థితులని తలుచుకొని "రాయల వారి కాలంలో రోడ్డుప్రక్కన రత్నాలు పోసి సోలలతో అమ్మేవాళ్ళట. అది మనం చూడలేదు గానీ, ఒకప్పుడు అపురూపం అయిన ద్విచక్ర వాహనాలనీ, ఫోన్లనీ, ఇప్పుడు రోడ్డుప్రక్కన కూర్చొని ‘రండి బాబూ! రండి. తక్షణమే అందజేస్తాం!’ అంటూండటం మాత్రం చూడగలుగుతున్నాము" అనుకొని చమత్కారించుకుంటూ ఉంటాం నేనూ, మా వారు!

సరే! అంత డిమాండు ఉండి, అప్పట్లో అంత నాసిరకపు సేవలందించిన BSNL, గత దశాబ్ధంలో ప్రైవేటు ఫోన్ల పోటీ కారణంగా, అనివార్యంగా పోటీ పడుతోంది. దరఖాస్తు చేసిన వెంటనే [గతంతో పోలిస్తే] కనక్షన్ ఇస్తోంది. ధరల్లో పోటీ పడుతుంది. బ్రాండ్ బ్యాండు గట్రా సేవలన్నిటినీ, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ జెట్ స్ఫీడుతో అందిస్తూన్నానంటోంది. [అందులో కొంతమాత్రమే నిజముంది.] జెట్ స్పీడుతోనే కాదు, బోటు ప్రయాణమంత సరసమైన ధరకీ అందిస్తున్నానంటోంది. [ఇందులోనూ కొంత నిజముంది.] ఏతా వాతా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల పరస్పర పోటీతో, ఈనాడు మేకలూ, గొర్రెలూ కాచేవాళ్ళ దగ్గర సైతం సెల్ ఫోన్లుండటం, మన కళ్ళెదుట ఉన్నదే!

ఈ నేపధ్యంలో, 1960-90ల దాకా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యాన్ని పరిశీలిస్తే.... అది యాదృచ్ఛికమా[దానంతట అదే సంభవించిందా?] లేక వ్యూహాత్మకమా?[కావాలని జరిపించబడిందా?]

ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల వల్లా, గూఢచర్య కారణాల వల్లా, నకిలీ కణిక వ్యవస్థ... ‘సరళీకృత ఆర్దిక విధానాల వల్లే ఈ ఆభివృద్ది అంతా సంభవించింది’ అనటం కోసం ప్రైవేటు ఫోన్ కంపెనీలని తెర వెనక ప్రోత్సహించింది. ‘తానొకందుకు చేస్తే... ఫలితం మరొకటైంది’ అన్నట్లుగా, నకిలీ కణిక వ్యవస్థ ఒకందుకు చేస్తే.... తీరా అంతా అయ్యాక చూస్తే, అది కాస్తా మిశ్రమ ఆర్దిక వ్యవస్థ వైఫల్యం.... సిద్దాంతంలో లేదని, అమలులోనే ఉందని, అమలు వెనక అదృశ్య హస్తాలున్నాయనీ ఇలా నిరూపితమైంది.

గూఢచర్య యుద్దం పదునెక్కే కొద్దీ, సరళీకృత ఆర్దిక విధానాలు కూడా, కొత్త కోణాలు తెరుచుకుంటున్నాయి. పీవీజీ చేత ప్రారంభంచబడిన ఈ లిబరలైజేషన్ లో మన్మోహన్ సింగ్ లూ, మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాలు, చిదంబరాలతో సహా అందరూ, ఎవరి సువర్ణముఖిని వాళ్ళు అందుకుంటున్నారు, అందుకోనున్నారు. వాటిల్లో కొన్ని ఇప్పటికే బహిర్గతమయ్యాయి. మరికొన్ని తెరచాటున మరుగుతున్నాయి.

ఏదైనా.... నిజం ఎప్పుడైనా బయల్పడక తప్పదు కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

5 comments:

అప్పట్లో ట్రేడ్ యూనియన్ నాయకులుగా చెలామణి అయిన చాలమంది ఇప్పుడు రాజకీయనాయకులుగా మారిపోయారు . INTUC నాయకుడు సంజీవరెడ్డి ఇప్పుడు రాజ్యసభ(కాంగ్రెస్) సభ్యుడు. మాజీ మంత్రి నాయని నరసిమ్హా రెడ్డి(TRS) ఒకప్పుడు ముషీరాబాద్ పారిశ్రామిక వాడలో కార్మిక నాయకుడు. మాజీ మంత్రి పి. జనార్ధన రెడ్డి (ఖైరతాబాద్ శాసన సభ్యుడు ) హైదరాబాద్ లోని సగం ఫాక్టరీలకు గౌరవ అధ్యక్షుడు. ఆయా ఫాక్టరీల వ్యవహారాలన్నీ ఆయన కనుసన్ననలోనే జరిగేవి .ఉదాహరణకు లాకౌట్లు , బోనస్ సెటిల్మెంట్లు , ట్రేడ్ యూనియన్ ఎలెక్షన్లూ, స్ట్రైకులు గట్రా ... నేను కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండే ఫాక్టరీలో ( ఎర్రగడ్డలో ఉన్న ఎలక్ట్రికల్ మీటర్ ఫాక్టరీ ) మూడునెలలు పనిచేసాను . అది నెల పనిచేస్తే రెండు నెలలు మూత పడేది .

what is ur opinion for Sasidhar reddy,now running a college

నా "ప్రపంచ పౌరుడు" బ్లాగు చదివే వుంటారు.

ఈ బీ ఎస్ ఎన్ ఎల్ వాళ్ళకీ, ఎల్ ఐ సీ లాంటి వాళ్ళకీ ఇంకా పూర్తిగా బుధ్ధి రాలేదు--ఆర్ టీ సీ వాళ్ళకి వచ్చినట్టు (అవి కేంద్ర ప్రభుత్వానివి కదా!)

కార్మికుల చట్టబధ్ధమైన హక్కుల్ని పరిరక్షించవలసిన కార్మిక సంఘాలు అనవసరమైన రాజకీయాలలో ప్రవేసించి, భ్రష్టు పట్టి పోయి ఈ అవస్థ దాపురించించి మరి.

ఉదాహరణకి--కమ్యూనిష్టులు ఎమర్జెన్సీని సమర్థించడం!

ఇది మార్చడం మన చేతుల్లోనే వుంది. కాదంటారా?

కృష్ణశ్రీ గారు: మీ కామెంట్ పబ్లిష్ చేస్తే, ప్రస్తుతానికి కనిపించటం లేదండి. మీరన్నట్లు మనం ఈ పరిస్థితులని మార్చవచ్చండి.

మొదటి అజ్ఞాత గారు: మీరన్నది నిజం అండి. మంచి పరీశీలన పంపారు. నెనర్లు!

రెండవ అజ్ఞాత గారు: మీరు ఏ శశిధర్ రెడ్డి గురించి అడిగారు?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu