ఒక్క తరగతి వాచక పుస్తకంలో కూడా పంచతంత్రంలోని సంభాషణలూ, పోలికలూ ఉండవు. రసం పిండిన పిప్పిలాంటి కథ మాత్రమే ఉంటుంది.

మరో ఉదాహరణ చూడండి.

నిన్న చెప్పిన కథలోనే....
పంచతంత్రం ప్రారంభ కథ అయిన దీనిలో....

విష్ణుశర్మ రాకుమారులతో "మీకు వినోదార్ధం ఒక మంచి కథ చెబుతాను. అందులో మిత్రలాభము, మిత్రబేధము, విగ్రహము, సంధి అనే నాలుగు అంశాలు ఉంటాయి. ధన సాధన సంపత్తి లేకపోయినా బుద్దిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకుని, కాక, కూర్మ, మృగ, మూషికాల వలె [కాకి, తాబేలు, జింక, ఎలుక] తమ పనులు సాధించుకుంటారు" అన్నాడు.

అది విని రాకుమారులు "కాకి, తాబేలు, జింక, ఎలుకలు ఏ కార్యాలు సాధించాయి? మాకు వివరంగా చెప్పండి" అన్నారు. [విష్ణు శర్మ, కథ గురించి ఊరిస్తూ, ఇప్పటి వాణిజ్య ప్రకటనలా, పిల్లలకి కథ గురించి పరిచయ వాక్యాలు చెప్పాడు. ఆసక్తికరంగా కథ చెప్పడంలోని నైపుణ్యం ఇది. వీటిని పరిశీలించకుండా.... కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఏ శిక్షణా సంస్థలో చేరినా వచ్చేదేమి లేదు, చెల్లించిన ఫీజులు పోవటం తప్ప.] విష్ణుశర్మ చెప్పటం ప్రారంభించాడు.

అనగా అనగా....

గోదావరీ తీరంలో గొప్ప బూరుగ వృక్షం ఉండేది. దాని మీద, నానాదిక్కుల నుండి వచ్చే పక్షులు రాత్రిపూట నివసించేవి. ఒకనాటి వేకువన లఘపతనం అనే కాకి నిద్ర లేచి, అక్కడే రెండో యముడి వలె సంచరిస్తున్న వేటగాణ్ణి చూసింది "తెల్లవారి నిద్దర లేస్తూనే ఈ కిరాతుడి మొహం చూసాను. ఈనాడు ఏ కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువ రాదు. ఆలస్యం చేయక ఈ చోటు విడిచి పోవటం మేలు!" అనుకుంది.

అంతలో ఆ వేటగాడు, ఆ చెట్టుకి దగ్గరలో నూకలు చల్లి వల పన్నేడు. ప్రక్కనే ఉన్న పొదలో దూరి పొంచి చూడసాగాడు. ఈ లోగా కొన్ని పావురాలు ఆకాశంలో ఎగురుతూ అటుకేసి వచ్చాయి. ఆ పావురాల రాజు పేరు చిత్రగ్రీవుడు [విచిత్రమైన మెడ కలవాడు అని అర్ధం.]అతడు నేల మీది నూకలు చూసి, తోటి పావురాలతో "నిర్జనమైన ఈ అడవిలో నూకలు పడి ఉండటానికి కారణం ఏమిటి? మనం ఈ గింజల కోసం ఆశ పడకూడదు. పూర్వం ఒక బాటసారి, కంకణంకు ఆశపడి పులి చేతిబడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి" అని, ఇలా చెప్పసాగాడు.

అనగా అనగా.....

ఒక ముసలి పులి స్నానం చేసి, ధర్బలు చేతపట్టుకుని కొలని గట్టున కూర్చుంది. దారిన పోయే బాటసారులను "ఓయి! తెరువరి! ఈ పసిడి కంకణాన్ని పుచ్చుకుందువు గాని, ఇటు రా!" అని పిలవ సాగింది. ఒక పాంధుడు [బాటసారి] ఆ మాట విని "ఇది నా అదృష్టం అనుకుంటాను. సందేహించడం ఎందుకు?" అనుకున్నాడు. "ఏదీ, కంకణం చూపించు?" అని అడిగాడు. పులి చేయి పైకెత్తి "ఇదిగో హేమ కంకణం. చూడు" అని చూపించింది. సూర్య కిరణాలకి ఆ ధర్భలు బంగారం వలె మెరుస్తున్నాయి. బాటసారి భయము, ఆశ కలిగిన వాడై "నీవా కౄర జంతువువు. ఎలా నిన్ను నమ్మటం?" అన్నాడు.

ఆ మాట విని పులి, స్పుటమైన కంఠంతో "ఓరీ! పాంధా! విను. గతంలో నేను యవ్వనంలో ఉండి, మిక్కిలి దుష్టుడినై ఉన్నాను. అనేక గోవులను, సాధు జంతువులను, మనుషులను వధించి, మితిలేని పాపాలను మూట గట్టుకున్నాను. చివరికి ముసలితనంలో అందరినీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలాను. అప్పుడొక పుణ్యాత్ముడు నాకు తారసిల్లి, ‘ఇక మీదట గోవులను, మనుష్యులను చంపకు, సత్కార్యములు చేయి’ అని ఉపదేశించాడు. అది మొదలు కొని పాపకృత్యాలు మాని, మంచి పనులు చేస్తూ ఉన్నాను. వృద్దుణ్ణి, బోసి నోటి వాడిని, గోళ్ళు పోయినవి, లేవ సత్తువ లేదు. ఎందుకు నన్ను నమ్మవు? నీవు దరిద్రుడవని గమనించి,. ఇది నీకు దానం చేయాలనుకున్నాను. సందేహించక ఆ కొలనులో స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం పుచ్చుకో" అన్నది.

బాటసారి పేరాశ కొద్ది దాని మాటలకు లోబడి, స్నానం చేయడానికి కొలనులోకి దిగాడు. అంతే! మొలలోతు బురదలో దిగబడ్డాడు. పులి అది చూసి "అయ్యోయ్యో పెను రొంపిలో దిగబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవనెత్తుతాను. భయపడకు" అంటూ మెల్లిమెల్లిగా వాడిని సమీపించి పట్టుకుంది. అప్పటికి గానీ బాటసారికి ప్రమాదం అర్ధం కాలేదు. "కౄర జంతువుని నమ్మకూడదు. ఆశ కొద్ది నమ్మి ఈ గతి తెచ్చుకున్నాను. జరిగిపోయిన దానికి ఎంత ఏడ్చి ఏమి ప్రయోజనం? విధిని తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు" అని దుఃఖిస్తూ పులి చేత భక్షింపబడ్డాడు.

చిత్రగ్రీవుడు పావురాలకు ఈ కథ చెప్పి "కాబట్టి అన్ని విధాలా ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు. చక్కగా ఆలోచించి చేసిన పనికి ఎప్పటికీ హాని కలగదు అన్నాడు. [చూడండి కథని ఎంత చక్కగా, జీవితంలో అప్పటి తమ పరిస్థితికి అనువర్తించాడో చిత్రగ్రీవుడు!] ఇదంతా విని ఒక ముసలి పావురం గొల్లున నవ్వి ఇలా అంది "ఆ! ఇవేం మాటలు! ఒక ఇక్కట్లు వచ్చినప్పుడు వృద్దుల మాట వినవలసింది. కాబట్టి నా మాట వినండి. యుక్తాయుక్తాలు విచారించకుండా, అన్ని చోట్లా ఇలాంటి సంశయాలు పెట్టుకోకూడదు. పనికిమాలిన అనుమానాలతో భోజనం మానుకోవచ్చునా! అలా మానుకుంటే బ్రతికేదెలా! నిరంతరము... పరులను చూసి ఈర్ష్య పడేవాడు, రోత పడేవాడు, సంతోషం లేని వాడు, క్రోధము గలవాడు, శంకిస్తూ ఉండేవాడు, ఇతరుల సంపదను అనుసరించి బ్రతికేవాడు.... ఈ ఆరుగురూ ఎప్పుడూ దుఃఖాలే అనుభవిస్తారని నీతి కోవిదులు చెప్పారు" అన్నది.

ఆ మాటలకు ప్రభావపడి, నూకలకి ఆశపడి పావురాలన్ని నేల వ్రాలాయి.

"అనేక గొప్ప శాస్త్రాలు చదివి, ఎన్నో విషయాలు విని, ఇతరుల సందేహాలను తీర్చగలవారు కూడా, లోభం వల్ల వివేకం పోగొట్టుకుని కష్టాలలో పడతారు. ఆహా! లోభం ఎంత చెడ్డగుణం? అన్ని కష్టాలకు లోభమే కారణం" అంటూ విష్ణుశర్మ కథను కొనసాగించాడు. [చిత్రగ్రీవుడిని గురించి విష్ణుశర్మ ఈ మాటలు అన్నాడు.]

నేల వాలిన పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. దుఃఖంతోనూ, కోపంతోనూ పావురాలు, ముసలి పావురాన్ని చూసి "నీవు వృద్దుడివి, తెలిసిన వాడివని భ్రాంతి పడి, నీ మాటలు విని ఈ ఆపదలో పడ్డాము. ఎవడు బుద్దిమంతుడో వాడు వృద్దుడు గానీ, వయస్సు పైబడ్డంత మాత్రాన వృద్దుడా?" అని తిట్టసాగాయి.

వాటిని వారిస్తూ చిత్రగ్రీవుడు "ఇది అతని దోషం కాదు. ఆపదలు రాగలప్పుడు మంచి సైతం చెడుగా వినిపిస్తుంది. మన కాలం మంచిది కాదు. ఊరికే అతడిని ఎందుకు నిందించడం? [తను మంచి చెబితే వినలేదు. ముసలి పావురం చెప్పిన చెడు, పావురాలకి ఆకర్షణగా అనిపించింది. అయితే చిత్రగ్రీవుడు ఆ విషయమై వాటిని దెప్పలేదు. ఎందుకంటే మాటలతో వృధా పుచ్చకూడని ఆపత్కాలం అది.] ఇతడు తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ది ఏమయింది? మనకు అతడి సలహా నచ్చే కదా చేసాము? ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఆలోచించాలి కానీ, యీ మాటల వల్ల ఫలమేమిటి? విపత్కాలమందు విస్మయం చెందటం [షాక్ అవ్వటం] అసమర్ధ లక్షణం. కాబట్టి, ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని పరిష్కారం ఆలోచించండి.

ఇప్పటికి నాకొకటి తోస్తున్నది. మీరందరూ పరాకు లేకుండా వినండి. ఒక్కసారిగా మనందరం వలనెత్తుకుని ఎగిరి పోదాం. ‘మనం అల్పులం, మనకీ పని సాధ్యం అవుతుందా?’ అని సందేహించవద్దు. అందరం కలిస్తే ఎంతటి పనినైనా సాధించవచ్చు. గడ్డి పరకలు సైతం తాడుగా పేనితే మదపటేనుగును కూడా బంధిస్తాయి. మీరూ ఆలోచించండి. ఇంత కంటే మంచి ఉపాయం మీ బుద్దికి తోస్తే అదే చేద్దాం అన్నది. [ఆపద సమయంలో, చిత్రగ్రీవుడు చూపిన ధైర్యం, ఆలోచన కోల్పోని తనం, తోటి వాళ్లని ఉత్తేజపరచి, పరస్పర నిందారోపణలు మాన్పించి, ఒక్కటిగా సమాయత్త పరచటం.... ఎంతో చక్కని నాయకత్వ ప్రతిభను ఈ పాత్ర చూపెడుతుంది.]

చిత్రగ్రీవుడు చెప్పిన దానికి పావురాలన్నీ ఏక కంఠంతో "మీరు చెప్పినదే బాగుంది. ఇంతకంటే మంచి సాధనం లేదు" అన్నాయి. కూడబలుక్కొని ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి ఎగిరాయి. దాంతో ఆ వేటగాడు ఒక్కసారిగా విభ్రాంతుడై "ఈ పక్షులన్నీ గుప్పుగుడి వలయెత్తుకొని పోతున్నాయి. అవి నేల వాలినప్పుడు పోయి పట్టుకుంటాను" అనుకుంటూ ముఖం పైకెత్తి రెప్పవేయకుండా పావురాల వైపే చూస్తూ ముళ్ళపొదల కడ్డం పడి పరిగెత్తసాగాడు. [పిల్లలకి ఈ కథ చెప్పినప్పుడు ఈ సన్నివేశంలో ఎంత హాయిగా నవ్వుతారో! అపాయంలో ఉపాయం, దుష్టుడి ఓటమి పట్ల గల ఇష్టం, ఆ కిలకిలల్లో ఉంటుంది. మానవ సహజ లక్షణం అది.]

ఈ వింత చూద్దామని లఘపతనం పావురాలని వెంబడించసాగింది. పడుతూ లేస్తూ నేల మీద పరుగెడుతున్న వేటగాడు, పావురాలు కనుమరుగయ్యే సరికి నిరాశతో వెనుదిరిగాడు.

వలతో సహా ఎగురుతున్న పావురాలు "ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి?" అని అడిగాయి. చిత్రగ్ర్రీవుడు "లోకంలో.... తల్లి, తండ్రి, స్నేహితుడు - వీళ్ళు ముగ్గురూ హితులు. తక్కిన వారందరూ ప్రయోజనాన్ని బట్టి హితులౌతారు. నాకు మిత్రుడొకడున్నాడు. అతడు హిరణ్యకుడు అనే మూషిక రాజు. గండకీ తీరంలోని విచిత్ర వనంలో అతడి నివాసం. అతడు పళ్ళబలంతో ఈ వల త్రాళ్ళు కొరికి మనల్ని ఈ ఆపద నుండి రక్షించగలడు. కాబట్టి మనం అతడి దగ్గరికి పోదాం" అన్నాడు.

పావురాలన్నీ చిత్రగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం ఎగురుతూ పోయి హిరణ్యకుడి కలుగు ప్రక్కన వ్రాలాయి. ఆ సవ్వడికి భయపడిన హిరణ్యకుడు కలుగులో కదలకుండా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడు హిరణ్యకుణ్ణి ఎలుగెత్తి పిలిచాడు.

తరువాయి కథ మీరు నిన్నటి టపాలో చదివారు. ఒక కార్యం సాధించబడాలంటే అందులో ఎన్ని మెలికలు, మలుపులు ఉంటాయో ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అపాయాలూ, వాటిని దాటే ఉపాయాలూ అన్నీ ఉంటాయి ఈ కథల్లో!

పంచతంత్రమే కాదు, మహాత్ముల జీవిత కథల్లో సైతం, రస స్పూర్తిని వదిలేసి ’సొల్లు’తో పాఠ్యాంశాలని నింపటమే ఉంది, మన పిల్లల సిలబస్ లో! హైస్కూలు పిల్లలకి తెలుగులో, కేవలం జరద్గవం అనే గుడ్డిగ్రద్ద కథ, ‘కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు’ అనే చివరి నీతి వాక్యంతో ముగిసే కథ, దాదాపు మూడు తరగతుల పిల్లలకి సిలబస్ లో ఉంది.

ఇది ఖచ్చితంగా, కావాలని కంపైల్ చేయబడ్డ సిలబస్! ఇందుకు నేను ఆ సిలబస్ ని కంపైల్ చేసిన ప్రొఫెసర్లని [పంతులమ్మలూ, పంతులయ్యలని] నిందించటం లేదు. బహుశః వాళ్ళు తమకు తమ ’పైవారి’ నుండి వచ్చిన ఆజ్ఞాపనలు [Assignments] ప్రకారమే ఆ విధంగా కంపైల్ చేసి ఉంటారు. ఇందుకు మంత్రులనీ, రాజకీయ నాయకులనీ, సంబంధిత శాఖల కార్యదర్శిల వంటి బ్యూరాక్రాట్లనీ నిందించను. వాళ్ళు తమ ‘పైవారి’ని అనుసరించి ఉంటారు. బదులుగా కెరీర్, డబ్బు, ఖ్యాతి వంటి ప్రయోజనాలు పొందుతారు. ఇదంతా దేశ భవిష్యత్తు మీద, జనాల జీవితాల మీద కుట్ర అయినప్పుడు, ఇంతకంటే భిన్నంగా ఏమి ఉంటుంది?

అయితే, ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులకి మాత్రం ఈ విషయమై బాధ్యత ఉందంటాను. పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని, నిర్భాధ్యతనీ, ఆలోచనా రాహిత్యాన్ని నిందించక తప్పదు. అలాంటి సిలబస్ కారణంగా జరుగుతున్న హాని అర్ధమయ్యాక కూడా "ఏం చెయ్యగలం?" అని నిట్టూరుస్తూ, ఆపైన అంగలార్చే అలసత్వాన్ని తప్పకుండా నిందించాల్సిందే!

అంతేకాదు, పిల్లల్లో శ్రమించే తత్త్వాన్ని పెంచాలన్న విషయంలో కూడా ఏ విధమైన శ్రద్దా తీసుకోబడటం లేదు. తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లల్ని సోమరులని చేయటం నేను పరిశీలించాను. దాన్ని వాళ్ళు ’ముద్దు చేయటం’ ’గారబం’ గట్రా పేర్లతో పిలుస్తారు. అచ్చంగా సినిమా గారాబం! "ఒరే డాడీ!" అని పిలిపించుకుంటూ మురిసిపోయే తండ్రులని చూశాను. "మా పిల్లలు అటు పుల్ల తీసి ఇటు పెట్టరమ్మా" అంటూ దీర్ఘాలు తీసే తల్లుల్ని చూశాను. ఇక సెంట్రల్లీ ఏసీ, స్కూలు బస్సు ఏసీ ఉండే బడుల్లో పిల్లల్ని చేర్చటం చూస్తూనే ఉన్నాం.

"మాకు డబ్బుంది! కాబట్టి ఏసీ బడుల్లో చేరుస్తాం. మీకేం నొప్పి?" అంటే, అది వారి విజ్ఞత. ఆ డబ్బు సంపాదించాలన్నా, కష్టించి పనిచేసే తత్త్వం అలవడాలి అన్నది సత్యం. ఈ సత్యం.... ఏసీ బడుల్లో చేర్పించేందుకు కావాల్సిన డబ్బు కష్టపడకుండా వస్తే తప్ప, ఎవరూ మరిచిపోలేనిది. ఈ సంగతి పక్కన పెడితే... అందరు తల్లిదండ్రులూ, వారి పిల్లలూ ఇలాగే ఉన్నారని నేను అనను. అయితే అధికశాతం తల్లిదండ్రులూ, వాళ్ళ పిల్లలూ మాత్రం ఇలాగే ఉన్నారు. కేవలం ’మార్కులూ, ర్యాంకులే సమస్తం, వ్యక్తిత్వ నిర్మాణమా వంకాయా? అదంతా అనవసరం’ అనుకుంటూ!

పిల్లల్లో శ్రమించే తత్త్వమూ, ధైర్య సాహసాలూ, ఆసక్తి, కుతుహలం, తార్కిక ఆలోచన, విచక్షణ, మొదలైన లక్షణాలు అవసరమని కూడా గుర్తించకుండా! ఎంతగా విచక్షణ కోల్పోయారంటే - ఏమార్గంలో మార్కులూ, ర్యాంకులూ వచ్చాయో కూడా పట్టించుకోనంతగా! [మార్కులూ, ర్యాంకులూ రావటం ముఖ్యం. ఎలా సంపాదిస్తేనేం డబ్బులు సంపాదించటం ముఖ్యం అనుకున్నట్లుగా!] కాపీలతో కానివ్వండి, విద్యాసంస్థల ర్యాంకు ఫిక్సింగుల వంటి అవినీతిలో రానివ్వండి, ఎక్కువ మార్కులూ, మంచి ర్యాంకులూ రావటం ప్రతిష్ఠాత్మకం. నిజానికి ప్రక్కదారిలో సంపాదించే మార్కులూ, ర్యాంకులూ పిల్లల సామర్ధ్యానికి గీటు రాళ్ళెలా అవుతాయో, అలాంటివి తమ ప్రతిష్ఠకు సోపానానెలా అవుతాయో వాళ్ళకే తెలియాలి!

తల్లిదండ్రుల ఈ విధమైన ఆదరణ కారణంగానే స్కూళ్ళు, కాలేజీలూ.... ప్రశ్నాపత్రాల లీకులూ, కాపీయింగులూ, మూల్యాంకన అవకతవకలూ, ర్యాంకు ఫిక్సింగులూ చేయగలుగుతున్నాయి. అందుకోసం ప్రతీ ఏటా వందల కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కాబట్టే, రాజకీయ నాయకులు, మీడియా ఉద్దండులూ, ఉన్నతాధికారులూ ఈ మోసాల మీదా, అవకతవకల మీదా నిశ్శబ్దం పాటిస్తుంటారు. కాబట్టే చుక్కా రామయ్యల వంటి విద్యావేత్తలూ, లోక్ సత్తా జేపీ వంటి మేధావులూ, ఈ బహిరంగ రహస్యాన్ని మరింత రహస్యంగా ఉంచుతుంటారు.

క్రికెట్ రంగంలో మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఎంసెట్ ర్యాంకుల అవకతవకల మీద మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంతో పోరాడాం. ఈ మొత్తం అవకతవకల గురించి దృష్టాంతాలు, సాక్ష్యాధారాలతో సహా, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కీ, యూపీఏ కుర్చీ వ్యక్తి సోనియాకీ, భారత రాష్ట్రపతికీ, సింఘ్వీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా అతడికీ, లోకా యుక్తాకీ, మానవహక్కుల కమీషన్ కీ, మీడియాకీ కూడా.... అందరి దృష్టికీ తీసి కెళ్ళాము. అందరూ కూడబలుక్కున్నట్లుగా.... వ్యూహాత్మక మౌనం పాటించారు, ఒక్క భారత రాష్ట్రపతి APJ కలాం తప్ప. ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా, ఆ వివరాలన్నీ మా ఆంగ్ల బ్లాగు Coups On World లోని Documentary, Evidence లో పొందుపరిచాను.

ఈ విషయాన్ని ప్రక్కన బెడితే... పిల్లల్లో శ్రమించే తత్త్వాన్ని, ఇతర మంచి లక్షణాలనీ పెంపొందించాలనే విషయాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు తాము పరుగులు పెడుతూ పిల్లల్నీ పరిగెత్తిస్తున్నారు.

ఈ సందర్భంలో మరో కథ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

40 సంవత్సరాల క్రిందట.కంపనీ లో నేనోక్కన్నే ఇండియన్ని.recession ఉద్యోగాలు పోతున్నాయి.నాకు ఉద్యోగమిచ్చి న వాడు ఇంకొకడు కొట్టుకుంటున్నారు.చిన్నప్పుడు చదివిన నిగమ శర్మో పాఖ్యానము పంచతంత్రము గుర్తుకు వచ్చింది. అమెరికా మారుమూల ఉన్న Waukigan లైబ్రరీ లో పంచతంత్రం ఇంగ్లీషు అనువాదం నన్ను రక్షించింది. చెప్పుకోవాలని అనిపించింది. చెప్పుకున్నాను. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

చిన్ననాటి మా చదువుల్ని ఎంత అందంగా జ్ఞాపకం చేసారండీ ! ధన్యవాదాలు.

Rao S Lakkaraju గారు: మీరు పెద్దవారు. మీ అనుభవాన్ని, అనుభూతిని మా బ్లాగులో మా అందరితో పంచుకోవాలనుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. నెనర్లండి!

నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి] గారు: మీ చిన్ననాటి చదువులని నా టపాలు గుర్తుకు తెచ్చాయంటే సంతోషంగా ఉంది :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu