గతనెల (జనవరి) చందమామలో ప్రచురితమైన నా కథ! ఇంకా చందమామ పుస్తకం(కాంప్లీమెంటరీ కాపీ)అందనందున ఫోటోలతో సహా ప్రచురించలేక పోతున్నాను.

కుందన గిరి గ్రామంలో ఒకప్పుడు సిద్దరాముడు అనే యువకుండేవాడు. వాడు ఆరేళ్ళ వయస్సులో ఉండగా, అంతుచిక్కని జబ్బు చేసి వాడి తల్లి మరణించింది. ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి ఆరునెలలు తిరిగేసరికల్లా కాలం చేసాడు.

అప్పటి నుండి వాడి బాగోగులు, వాడి మేనత్త సూరమ్మ, ఆమె భర్త శంకరయ్య చూసుకునే వారు. సిద్దరాముడు కాస్త అమాయకుడు. కానీ మంచి వాడూ, కష్టించి పనిచేసే వాడు. వాడికి భయం అన్నదే తెలియదు.

వాడి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుండి సిద్దరాముణ్ణీ వాడి ఆస్థిపాస్తుల్నీ దగ్గరుండి చూసుకునేందుకు సూరమ్మత్త, శంకరయ్య మామలు, వాళ్ళ ఊరు వదిలి కుందరగిరికి వచ్చేసారు. మొదట్లో సూరమ్మత్త సిద్దరాముణ్ణి బాగానే చూసుకునేది. సూరమ్మత్తకు సంతానం కలగలేదు. దాంతో క్రమంగా సిద్దరాముడి మీద తెలియకుండానే ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంది.

ఇరుగుపొరుగు అమ్మలక్కలు "నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ! సిద్దరాముడినే నీ కొడుకనుకో!" అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది.

దాంతో ఎవరూ చూడనప్పుడు సిద్దరాముడి నెత్తి మీద మొట్టికాయలు వేసేది. ఆ వంకా ఈ వంకా పెట్టి తెగ తిట్టేది. భార్యను సంతృప్తి పరవటానికి శంకరయ్య కూడా సిద్ద్రరాముడిని ఈసడించి తిడుతూ ఉండేవాడు.

సిద్దరాముడికి మాత్రం సూరమ్మత్త, శంకరయ్య మామలంటే ఇష్టమూ, గౌరవమూ. తల్లిదండ్రులు లేని తనని, చిన్నప్పటి నుండే వాళ్ళే గనక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమై పోయి ఉండేవాడో అనుకునే వాడు. వాళ్ళ మెప్పుకోసం ఇంటిపని, పెరటి తోట పని, పొలం పని చెప్పక ముందే చేసే వాడు. ఐతే రాను, రాను సూరమ్మ గయ్యాళితనం పెరిగిపోసాగింది. సిద్దరాముడి నెత్తిమీద మొట్టటం సూరమ్మత్త కీ, తిట్టటం శంకరయ్య మామకీ అలవాటై పోయింది.

దాంతో ఒక రోజు ఇదంతా తలచుకుని సిద్దరాముడికి చాలా బాధ కలిగింది. పొలం నుండి ఇంటికి రా బుద్ది కాలేదు. అడవి దారి పట్టి అలా నడుచుకు పోయాడు. సాయంత్రం అయ్యేసరికి ఓ సెలయేరు వద్దకు చేరాడు. నీటిలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, దాహం తీర్చుకున్నాడు. ఒడ్డునే ఉన్న చింత చెట్టు క్రింద జారగిల పడ్డాడు. తన స్థితి తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

ఇంతలో చెట్టుపై నుండి భీకర శబ్దం వినిపించింది. వాడి చుట్టూ గులక రాళ్ళు వర్షం కురిసింది. ఒకట్రెండు రాళ్ళు వాడి మీద కూడా పడ్డాయి. ‘శంకరం మామ కూడా, డబ్బాలో గులకరాళ్ళు వేసి గలగల లాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు’ అనుకున్నాడు సిద్దరాముడు.

అంతలో టపటప చింతకాయలు రాలి వాడి నెత్తి మీద పడ్డాయి. మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునే సరికల్లా, అంత బాధలోనూ వాడికి నవ్వు వచ్చింది.

అంతలో చెట్టు మీదినుండి గబిల్లున వాడి ముందు దూకిందో దయ్యం. పొట్టిగా లావుగా ఉన్న ఆ దయ్యం, సిద్దరాముడిని భయపెట్టటానికా అన్నట్టు, వికృతంగా అరుస్తూ వింత చేష్టలు చేసింది.

మన వాడికి అసలే భయం తెలియదయ్యే! దాని వింత చేష్టలు వికృతపు కూతలు చూసి, ఫకాలున నవ్వాడు. అంత సేపు వాడిని భయపెట్టటానికి చిందులు తొక్కిన దయ్యం, ఆయాసంతో రొప్పుతూ "ఒరే అబ్బి! నీకు భయం వేయటం లేదూ?" అంది.

"ఎందుకూ భయం?" అన్నాడు సిద్దరాముడు.

"నీ చుట్టూ రాళ్ళ వర్షం కురిపించాను. నెత్తి మీద చింతకాయలు కురిపించాను"అంది దయ్యం గుడ్లురుముతూ.

"మా శంకరం మామ తిట్ల వాన, నీ రాళ్ళ వాన కంటే పెద్దది. ఇక నా నెత్తి మీద నువ్వు రాల్చిన చింతకాయలు, మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్చితే సుతారంగా ఉన్నాయి. వీటికే భయపడిపోతానా?" అన్నాడు.

లావుపాటి పొట్టి దెయ్యం వాడి పక్కకు జరిగి "ఒరే అబ్బీ! బ్రతికుండగా అందరికీ భయపడుతు బ్రతికాను. చచ్చి దయ్యాన్నై, అందరినీ భయపెడుతూ సంతోషిస్తున్నాను. నాకు తారసిల్లిన వారందరూ నా చేష్టలకు భయపడి పుంజీలు తెంచుకు పారిపోయారు. నీ ధైర్యం చూసి ముచ్చటగా ఉందిరా అబ్బీ! నీ కధేంటో చెప్పు?" అంది.

సిద్దరాముడు తన కథంతా దానికి చెప్పుకున్నాడు. లావుపాటి పొట్టి దయ్యం "ఒరే అబ్బాయ్! నేనూ నీతో పాటు మీ ఇంటికి వస్తాను. సూరమ్మత్త, శంకరయ్య మామలకు బుద్ది చెబుదాం. ఐతే నేను నీకు తప్ప ఎవరికీ కనబడను. అక్కడ సందర్భాన్ని బట్టీ, నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు. నేనెవరికీ కనబడను కనుక, ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా, నేనేం చేయాలో అన్యాపదేశంగా చెప్పు!" అంది.

సిద్దరాముడు "సరే" అన్నాడు. ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు. సూరమ్మత్త, సిద్దరాముడిని చూడగానే కోపంతో చిందులు తొక్కింది. శంకరయ్య మామ "పొద్దున్నుంచీ ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి తిరగకపోతే పనిపాటా చక్కపెట్టవచ్చు కదా? బుద్ది లేని గాడిదా!" అంటూ తిట్లు లంకించుకున్నాడు.

శంకరయ్య మామ తిట్లు ఆపగానే "అమ్మయ్యా! రాళ్ళవాన కురిసినట్లుంది మామయ్యా" అన్నాడు సిద్దరాముడు. వెంటనే లావుపాటి పొట్టి దయ్యానికి తనేం చేయాలో అర్ధం అయిపోయింది. అర చేతి మందాన ఇల్లంతా రాళ్ళవాన కురిపించింది. సూరమ్మత్త శంకరయ్య మామలు నోరెళ్ళపెట్టారు.

సిద్దరాముడు నవ్వుతూ "ఓర్నాయనో! ఈ రాళ్ళన్నీ ఊడ్చి పారేయడానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళెన్ని విరగాలో" అన్నాడు. దిగ్ర్భాంతి పడిన సూరమ్మ చీపురు చేతిలోకి తీసుకుని ఊడ్చపోయింది. అంతే! చీపురు కాస్తా విరిగికూర్చుంది. మరొక చీపురు తీసుకుంటే అదీ అంతే! భార్యాభర్తలిద్దరూ మ్రాన్పడిపోయారు.

సిద్దరాముడు "బెదిరిపోకు అత్తా! ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే!" అన్నాడు. వాడి ఉద్దేశం అర్ధమైన దయ్యం, రాళ్ళన్నిటినీ మాయం చేసేసింది. అయోమయంలో పడిన సూరమ్మతో సిద్దరాముడు "అత్తా! ఆకలేస్తుంది. అన్నం పెట్టవూ?" అన్నాడు. సూరమ్మ అప్రయత్నంగా తలాడించి వంటింట్లోకి దారితీసింది. కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి సిద్దరాముడు వంటింట్లో పీట వాల్చుకు కూర్చున్నాడు. అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందుపెట్టి, అలవాటుగా వాడి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది సూరమ్మ.

సిద్దరాముడు "అత్తా! ఈ రోజేమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక సుతిమెత్తగా ఉంది? నీ మెడలోనూ, చేతులకీ ఉన్న నూలు దారపు దండలంత మెత్తగా ఉంది" అన్నాడు. కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది. చేతులకి బంగారు గాజులకు బదులు నూలు దారపు దండలున్నాయి. మెడ తడిమి చూసుకుంటే చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలు దండలై పోయాయి. దెబ్బతో కెవ్వునరిచేసి సూరమ్మ స్పృహ తప్పిపోయింది.

ఈ మాయంతా చేసిన లావుపాటి పొట్టి దయ్యం నిశ్శబ్ధంగా నవ్వసాగింది. సూరమ్మ కేక విని శంకరయ్య పరిగెత్తుకు వచ్చాడు. పరిస్థితి అంతా చూసి సిద్దరాముడి చేతులు పట్టుకుని "రాముడు! నువ్వుగానీ మాయ మంత్రాలు నేర్చుకున్నావేమిట్రా? బాబ్బాబు! మీ అత్తని మామూలు మనిషిని చేయరా. మాకు బుద్ది వచ్చింది. నిన్నుప్రేమగా చూసుకుంటాము" అన్నాడు.

దానికి సిద్దరాముడు "అత్తకీ, అత్త నగలకీ ఏమీ కాదులే మామయ్యా!" అన్నాడు. నూలు నగలు మళ్ళీ బంగారు నగలుగా మారిపొయ్యాయి. సూరమ్మ లేచి కూర్చుని, బిత్తర చూపులు చూడసాగింది. శంకరయ్య కూడా సిద్దరాముడిని బెదురుగా చూస్తున్నాడు.

సిద్దరాముడు "మరేం లేదు మామయ్య! నేను పొలంగట్టు మీద కూర్చునుండగా ఒక దయ్యం కనిపించింది. నా కథంతా విని, మీరిద్దరూ, నన్ను తిట్టి కొట్టటం వంటి చెరుపు చేస్తే మీకూ చెరపవుతుంది" అని వరం ఇచ్చింది అని అన్నాడు.

దయ్యం అనే సరికల్లా శంకరయ్య గజగజ వణుకుతూ "నాయన్నాయన! ఇంకెప్పుడూ నిన్ను తిట్టం! కొట్టం!" అన్నాడు.సూరమ్మ మెల్లిగా కూడదీసుకుంటూ "మరి మేమిద్దరమూ నీకు మంచి చేస్తే, మాకూ మంచి జరగాలనే వరాన్ని అడగకూడదూ ఆ దెయ్యాన్ని?" అంది గొణుగుతున్నట్లుగా!

సిద్దరాముడు "నేనూ అదే అడిగానత్తా! దానికా దెయ్యం, నేను దెయ్యాన్ని, దెయ్యాలు చెడ్డవరాలే ఇస్తాయి. మంచి వరాలు కావాలంతే దేవుణ్ణి అడగాల్సిందే అంది" అన్నాడు.

దానికి సూరమ్మత్త, శంకరయ్య మామ "ఆ దెయ్యం గోల మనకెందుకులేరా! మనం మంచిగా ఉందాం!" అన్నారు. సిద్దరాముడు నవ్వుతూ తలూపాడు. ఎవరూ చూడకుండా లావుపాటి పొట్టి దయ్యానికి కృతజ్ఞత చెప్పాడు.

వాడి దగ్గర సెలవు పుచ్చుకుంటూ దయ్యం "సిద్దరాముడు! నువ్వు అమాయకుడివి కాదు. మంచి వాడివి. ధైర్యస్తుడివి. పైగా తెలివిగల వాడివి. మీ అత్తకి నువ్వేసిన మొట్టికాయలు సుతిమెత్తనివి!" అనేసి చక్కా పోయింది.

ఆనాటి నుండీ సూరమ్మ శంకరయ్యలు, సిద్దరాముడిని కన్నకొడుకులా చూసుకున్నారు. మంచి పిల్లను చూసి పెళ్ళి చేసారు. సిద్దరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు.

9 comments:

:)

Maam, does Chandamama accepts stories sent through e-mail in Telugu script to them?

Bagundhi.

nice story

సత్యేంద్ర గారు: నెనర్లు!

కృష్ణ గారు: నిరభ్యంతరంగా తీసుకుంటారండి!

క్రికెట్ లవర్ గారు, మయూరి గారు: కథ మీకు నచ్చినందుకు నెనర్లండి!

చాలా బావుందండి :-)

Thank you for writing this story.
I love it somuch.
Can you write another intersting story like this?

With Regards,

A. Lalitha Kalyani
Singapore

ప్రసూన గారు: నెనర్లండి!

లలితా కళ్యాణీ:బుడ్డీ, నీలాంటి చిన్నారుల కోసం నేను అనగా అనగా... కథలు వ్రాస్తున్నాను. చదువుతున్నావా? అన్నట్లు నీ పాట నేను విన్నానోచ్!:)

Thanks very much for your answer maa'm.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu