భారతంలో... ద్రౌపదీ ధర్మరాజుల సంభాషణలో ‘క్రోధం, సహనం... ఎంత మేరకు ఉండాలో’ చర్చింపబడుతుంది. మనకీ జీవితంలో, ఎన్నోసార్లు ఇలాంటి కీలక సంఘటనలు ఎదురౌతాయి. ఎంత వరకూ శాంతంగా, సహనంగా భరించాలో, ఏ మేరకు ప్రతిఘటించాలో, ఒక పట్టాన తేల్చుకోలేం.

ఇక్కడ ధర్మరాజు చెప్పిన ఒకమాట చూడండి. ‘అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి చేసేలోగా తమకు, ఎందరో మిత్రులు సమకూరుతారు’ అంటాడు.

ఇందులోనే నిగూఢమైన అంశం ఉంది. ధర్మరాజుకీ, పాండవులకీ మిత్రులుండవచ్చు. అలాగే దుర్యోధనుడికీ కౌరవులకీ కూడా మిత్రులుండవచ్చు. రాజులకి రాజులైన మిత్రులుండటం ఇక్కడ విషయం కాదు. ప్రజలూ మిత్రులుగా ఉండాలి.

మరోమాటగా చెప్పాలంటే ప్రజా బాహుళ్యం నుండి సంపూర్ణ సహకారం, సానుకూలత కావాలి. దాన్నే ప్రజామైత్రి అనవచ్చు. అందుకు సహనంగా వేచి ఉండాలి. ఎందుకంటే – దుష్టుల దౌష్ట్యం ప్రజలకు బహిరంగ పడాలంటే, అవగాహనకు రావాలంటే, సహనం చూపక తప్పదు. అప్పుడే ప్రజామైత్రీ, సహకారం లభిస్తాయి.

పాండవులని వారణావతానికి పంపి అక్కడ లక్క ఇంటిలో సజీవ దహనం చేయాలని ప్రణాళిక పన్నినప్పుడు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ‘పాండవుల పరోక్షంలో తాను ప్రజలకి దానధర్మాలు చేసి, వారిని తనవైపు తిప్పుకుంటాను’ అని చెబుతాడు.

పాండవులు తమ నడవడితో ప్రజామన్నన పొందారు. దాన్నుండి ప్రజల మనస్సు మళ్ళించి, తనవైపు తిప్పుకునేందుకు ‘దానధర్మాలని’ మార్గంగా ఎంచుకున్నాడు దుర్యోధనుడు. ఈనాటి సంక్షేమ పధకాలు, ఉచిత వరాల కార్యక్రమాలు, ఓట్ల నాకర్షించేందుకు నిర్వహించే ప్రజాకర్షక పథకాలు... ఆనాటి దానధర్మాలకు ప్రతిరూపాలే!

బోరింగు పంపుతో, జలాలు పైకి లాగాలంటే – ముందుగా అందులో ఓ రెండు చెంబులు నీళ్ళు పోయాలి. తర్వాత మనం ఎన్ని బకెట్ల నీటినైనా లాక్కోవచ్చు. అదే విధంగా... దుర్యోధనుడు దానధర్మాలు చేసినా, ఇప్పటి పాలకులు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినా.... తదుపరి ప్రజా దోపిడి యధాతధం. అధర్మ పరిపాలనా యధాతధం!

పర్యవసానంగా తమ బ్రతుకులు తగల బడుతున్నప్పుడైనా, ప్రజలకి ఒక కనువిప్ప కలుగుతుంది. నిజానిజాలు అర్ధమౌతాయి.

భారత గాధలో అయితే...అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తిచేసి ఒప్పందం ప్రకారం తమ రాజ్యం తమకిమ్మని, ముందు రాయబారుల్ని పంపి శాంతంగా అడిగారు పాండవులు. దుర్యోధనుడు కాదన్నాకే యుద్ధానికి దిగారు. అలాగే... అరణ్య అజ్ఞాత వాస కాలాన్ని సహనంగా గడిపారు. దాంతో ఘోష యాత్ర వంటి సంఘటనలతో, కౌరవులు దౌష్ట్యం మరింతగా తేటతెల్లమయ్యింది. ప్రజాభిప్రాయమూ, ఋషుల అభిమతమూ పాండవ విజయం అయ్యేటంతగా, ప్రజామైత్రి పాండవులకి సమకూరింది.

నాడైనా, నేడైనా ప్రజా సహకారం, ప్రభుత్వం నడిపేవారికి తప్పనిసరిగా అవసరం. సైనిక బలంతో ప్రజల మీద పెత్తనం చలాయించ వచ్చుగాక! పన్నులు సమీకరించి ధన సంపాదన చెయ్యాలన్నా, ప్రజలు కష్టించి సంపద సృష్టిస్తేనే అది సాధ్యమౌతుంది. అది పంటలు పండించడం కావచ్చు, వస్తూత్పత్తి చేయటం కావచ్చు, సేవలు అందించటం కావచ్చు. ప్రజలు సహకరిస్తేనే, సహాయ పడితేనే... (అది తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎదిరించలేక చేసినా) పాలకులు సంపదని పొందగలుగుతారు.

[కాబట్టే – బాపూజీ సహాయ నిరాకరణని ఉద్యమంగా చేపడితే, బ్రిటీషు ప్రభుత్వానికి జవసత్వాలు జావగారి పోయాయి.]

ఆ విధంగా ప్రజామైత్రి సంపాదించాలంటే – ప్రజలకి అవగాహన కలగటం అవసరం. అందుకే సహనంగా వేచి ఉన్నాడు ధర్మరాజు.

దీనిని ఈనాటి కాలానికి సరిపోల్చే ఓ చిన్న కథ చెబుతాను.

ఒక పళ్ళ వ్యాపారి ఉన్నాడు. చిన్నబండి మీద ఆపిల్ పళ్ళమ్ముకునే చిరువ్యాపారి అతడు. కష్టించి పండించిన రైతు దగ్గర, సరైన ఖరీదిచ్చి, నాణ్యమైన పళ్ళు తెచ్చి అమ్ముకునే వాడు.

అతడి దగ్గరికి ఓ సఫారీ సూటూ వేసుకునే ఘరానా పెద్దమనిషి పళ్ళు కొనేందుకు వచ్చేవాడు. అయితే వ్యాపారి బేరాల్లో తలమునకలై ఉన్నప్పుడు చల్లగా నాలుగు పళ్ళు తస్కరించి జేబులో వేసుకుని వెళ్ళిపోతుండేవాడు.

అంత సఫారీ సూటూ వేసుకున్న డబ్బున్న ఆసామీ, తన వంటి పేదవాడి దగ్గర పళ్ళు దొంగిలిస్తాడని ఊహించని పళ్ళ వ్యాపారి, ‘అతడికి తన పళ్ళు నచ్చలేదో, తాను ఇతర కొనుగోలుదారులతో హడావుడీగా ఉన్నందున కొనకుండానే వెళ్ళిపోయాడో లేక మరో కారణమో’ అనుకునే వాడు.

కొన్నాళ్ళకి అతడికి అనుమానం వచ్చింది, ఈ పెద్ద మనిషి, తన పనిలో తానుండగా మెల్లిగా తన పళ్ళు దొంగిలించుకు పోతున్నాడని. నిఘాపెట్టి గమనించాడు. నిజమని తేలింది. కోపం, ఆక్రోశం కలిగాయి. తన వంటి చిన్న వ్యాపారీ, పేదవాడి కష్టం దొంగిలిస్తున్న ఆ సఫారీ సూటు ఆసామిని తలుచుకోగానే, కడుపు రగిలి పోయింది. రక్తం మరిగి పోయింది. ఏం చేయటం?

గట్టిగా అరిచి నిలదీస్తే, అతడు తననే నిందిస్తాడు. ఎదురు తన మీదే ఏవో నేరాలు బనాయిస్తాడు. కాబట్టి ఏది చేసినా జాగ్రత్తగా చేయాలి. దొంగని పట్టుకుని నేరం ఋజువు చేయాలి. తగిన శిక్ష విధించాలి. ఎలా?

పళ్ళ వ్యాపారి, తనలాంటి మరికొందరికి విషయం చెప్పాడు. అందరూ ఈ సఫారీ సూటు ఆసామి వ్యవహారాల మీద కన్ను పెట్టారు. ఒక్క పళ్ళ వ్యాపారి దగ్గరే గాక, ఆ సఫారీ సూటు ఆసామి, తమ లాంటి చిల్లర వ్యాపారుల దగ్గర దొంగవాటం చాలానే చూపిస్తున్నాడని అర్ధమయింది. దాంతో శాంతంగా ఆలోచించారు. సహనంగా వేచి ఉన్నారు.

ధనికుడు యధాప్రకారం పళ్ళ వ్యాపారి దగ్గరి కొచ్చాడు. వ్యాపారి యధాప్రకారం బేరాల హడావుడీలో ఉన్నాడు. అయితే ఓ కన్ను ఈ సఫారీ సూటు దొరబాబు మీద వేసి ఉన్నాడు.

సఫారీ ఆసామీ పళ్ళ నాణ్యత పరిక్షిస్తున్నట్లు నటించి, ఆ పండు ఈ పండూ కెలికాడు. మెల్లిగా నాలుగు పళ్ళు జేబులో వేసుకున్నాడు. ఆ క్షణమే పళ్ళ వ్యాపారి ఆ సఫారీ ఆసామీ చెయ్యి పట్టుకుని ‘దొంగా దొంగా’ అని అరవలేదు.

అలాగంటే... సఫారీ సూట్ పెద్దమనిషి “నోరు ముయ్యవోయ్! నేను పళ్ళు కొనుక్కుందామని వచ్చాను. ఇవి నచ్చాయి. తీసుకున్నాను. ఇదిగో డబ్బు” అనవచ్చు.

“మరి బేరం ఆడకుండా తీసుకున్నావేం?” అంటే...

“నీలాంటి పేదవాడితో కూడా ఏం బేరం ఆడతాన్లే అనుకొని నువ్వడిగినంతా ఇద్దామనుకునే పళ్ళు తీసుకున్నాను” అనగలడు.

“నాకు చూపించి తీసుకోవద్దా?” అంటే...

“ఇవేమన్నా బంగారమా? ఈపాటి దానికి నేను అబద్దం ఆడతానా? దొంగతనం చేస్తానా? నువ్వెటు బేరాల హడావుడీలో ఉన్నావు. ‘సరే! ఏం పోయింది’ అనుకున్నాను... నాకు సమయం ఎక్కువ లేదు. అందుకే ముందు పళ్ళు జేబులో వేసుకుని డబ్బులిద్దాం అనుకున్నాను. నేను డబ్బు తీసి ఇచ్చేలోగానే గోల చేస్తున్నావే! అసలేమను కున్నావ్ నా గురించి? నా ఇంటి కుక్కకు పెట్టేంత ఖర్చు కాదు నీ బండి మీద సరుకంతా కలిపినా? అలాంటిది నన్ను ‘దొంగా దొంగా’ అంటూ నా పరువు తీస్తావా? చూడు నిన్నేం చేస్తానో! నీ మీద ఫిర్యాదు చేస్తాను” అని ధుమ ధుమ లాడగలడు.

ఇక అలాంటి చోట “నువ్వు రోజూ నా బండి మీద పళ్ళు దొంగతనం చేసావు?’ అని ఎలాగన గలడు ఈ పళ్ళ వ్యాపారి? అంటే మాత్రం ఆ సఫారీ సూట్ పెద్దమనిషి ఊరుకుంటాడా?

“నిజంగా నేను రోజు నీ బండి మీద పళ్ళే దొంగతనం చేస్తూ ఉంటే, అప్పుడే పట్టుకోలేక పోయావా?” అంటూ ‘లా పాయింట్’ లేవనెత్తు తాడు.

అంతటితో ఊరుకోనూ ఊరుకోడు. ఒంటరిగా ఎదిరించిన పళ్ళ వ్యాపారిని వేధించగలడు. అధికారం ఉంటే ఏవో నిందలు వేసి శిక్షించనూ ప్రయత్నిస్తాడు. అందుకోసం కూడా పళ్ళ వ్యాపారి, ఆ సఫారీ సూటు ఆసామి చేతిలో తనలాగే దోపిడికీ, మోసానికీ గురవుతున్న ఇతరులని సమీకరించుకున్నాడు.

అందుకే ఈ పళ్ళ వ్యాపారి ఆ సఫారీ సూటు ఆసామిని చెయ్యి పట్టుకుని ‘దొంగా దొరికావ్’ అన లేదు. వేచి ఉన్నాడు. ఆ ఆసామి చేతివాటాన్ని ఏమాత్రం ఆటంకపరచ లేదు.

ఆసామి పళ్ళు జేబులో వేసుకున్నాక కూడా పళ్ళ వ్యాపారి మౌనంగా వేచి ఉన్నాడు. అతడు రెండడుగులు వేసాక కూడా, వ్యాపారి ఏమీ అనలేదు. ఎందుకంటే - “అయ్యా! ఏమిటీ పని?” అంటే ఆ ఆసామి “అరే! మరిచిపోయాను సుమా!” అంటూ పరమ నిజాయితీ పరుడూ, మతిమరుపు మహారాజులాగా ఫోజు పెట్టి, ఆ నాటికి పైసలిచ్చేస్తాడు. మరోసారికి మరింత పకడ్బందీగా పళ్ళు కొట్టేస్తాడు.

అందుచేత కూడా పళ్ళ వ్యాపారి సహనంగా వేచి ఉన్నాడు. అతడితో పాటు అతడి ఇతర మిత్రులూ వేచి ఉన్నారు. ఆ ఆసామి తర్వాత మరో బండి దగ్గరికి పోయాడు. అక్కడా, ఇక్కడా చేతివాటం చూపించి, నచ్చిన వాటిని జేబులో వేసుకుని వెనుదిరిగాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యాపారులు ఆ బళ్ళ దగ్గరికి వచ్చిన ఇతర కొనుగోలు దారులకి కూడా చూపించారు.

దాంతో, ఇలా దొంగతనం చేసి సఫారీ సూటు ఆసామీ ఇంటి దారి పట్టేందుకు పది గజాలు నడిచాక, ఈ సామాన్య వ్యాపారులంతా ఆ సఫారీ సూటు పెద్ద మనిషిని పట్టుకుని ఆపారు. దొంగతనం గురించి నిలదీసారు.

జేబులో సరుకులతో దొరికి పోయిన ఆ ఆసామి, ముందు బుకాయించ చూసాడు. కానీ ఒకరి దగ్గర కాదు, నలుగురి దగ్గరా డబ్బివ్వటం మరిచి పోయానంటే... యధాలాపంగా వస్తువులు జేబులో వేసుకున్నానంతే అంటే... దూడ గడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానన్నట్లే ఉంది.

వ్యాపారుల ఆ ఆసామి నిర్వాకం మధ్యలో ఉండగా పట్టుకుని ఉంటే – అతడికి విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ద్వంద్వ వాదం ఏదైనా దొరికి ఉండేది. కానీ వ్యాపారులు సహనంగా ఆ సూట్ పెద్దమనిషిని దొంగతనం పూర్తి అయ్యేదాకా వేచి ఉండటంతో, పైకారణంగా చెప్పుకునేందుకు ఏ వాదమూ మిగల కుండా పోయింది. ఆ విధంగా ఆ ఆసామి నేరాలు, అక్రమాలు, అవినీతి... ‘ప్రయత్నపూర్వకం, యాదృచ్చికం లేదా పొరపాటు’ అనే ద్వంద్వం దాటిపోయి, సంపూర్ణ సత్యం బహిర్గత మయ్యింది.
ఇలా... సహనంగా వేచి ఉండి, దొంగని పట్టుకున్నాక... అప్పటి దాకా దగా పడిన ఆ సామాన్యులు, అతణ్ణి, సూటూ బూటూ విప్పించి, విరగదన్ని తరిమారు.

ఇదీ కథ!

ఇది కొత్త కథ కాదు. గతంలో బాపూజీ బ్రిటీషు వాళ్ళ హయాంలో నిజం చేసిన చూపించిన కథ!

వర్తమానంలో పీవీజీ, ఆయన సమీకరించిన నెం.5 వర్గం నిజం చేసి చూపిస్తున్న కథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

కిరణ్ said... February 15, 2011 at 9:22 PM  

[కాబట్టే – బాపూజీ సహాయ నిరాకరణని ఉద్యమంగా చేపడితే, బ్రిటీషు ప్రభుత్వానికి జవసత్వాలు జావగారి పోయాయి.] నిజం గా బాపూజీ అంత చేశారా ?... ఆయన ఎప్పుడు ఉద్యమం లో చేరాడు.. ఎప్పుడు ప్రముఖుడు అయ్యాడు... ఎప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చింది .... అతను ఒక కోవర్ట్...బ్రిటిష్ వాళ్ళకి ప్రపంచ యుద్ధం తర్వాత మన దేశాన్ని నిర్వహించే స్తోమత లేక మాత్రమే మనల్ని వదిలి వెళ్ళారు... స్వంత వారి దగ్గర నిరాహార దీక్షలు చేయవచ్చు.. అలిగి సాధించుకోవచ్చు... పరాయి వాళ్ళ దగ్గర అలగటం... జాతి ఆత్మ గౌరవాన్ని ఏం చేసినట్టు.. అది జాతికి ఏం సందేశం ఇచ్చినట్టు... ? గాంధీ గురించి మీరు కూలం కషం గా వ్రాయ గలరా ?,,, అలాగే యూట్యూబ్ లో అంబెడ్కర్ గాంధీ గురించి ఏం చెప్తాడో చూడండి.. అతను లొపల ఒక మనిషి బయట ఒక మనిషి అన్నాడు అంబెడ్కర్...

అసలు అ౦బేత్కర్ వల్లే ఈ రోజు మన౦ ఈ పరిస్తితిలో వున్నా౦. ఎవడైనా సమర్థుడైన అధికారి ఉన్నాడా ఈ రోజుల్లో.
అ౦తా చేతకాని తన౦, అవినీతి, నైతిక విలువలు మట్టి కొట్టుకు పోయాయి. ఎవడైనా తప్పు చేశాడని నిలదీస్తే, నువ్వే౦ గొప్ప అనే విత౦డ వాదాలు.
తమలపాకుతో నువ్వొకట౦టే, తలుపు చెక్కతో నే రె౦డేస్తా అనే బాపతు. అవకాశము౦టే వీళ్ళు మరి౦త అమానుష౦గా ప్రవర్తి౦చగలరని ఎప్పుడో నిరూపి౦చారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu