వారం రోజుల నుండీ పొడుగుపాటి టపాలు వ్రాసి నేనూ, చదివి మీరు అలిసిపోయి నందున చిన్న బిర్రే...క్!

ఈ లోపు కాసిన్ని కబుర్లు.....

ముందుగా బ్లాగర్ల దినోత్సవం జరుపుకుంటున్న బ్లాగర్లకి, బ్లాగు చుట్టాలకీ నా శుభాకాంక్షలు. కీ బోర్డులోంచి వచ్చిన అక్షరాలతో చెప్పడం లేదండి. మనసులోంచి వచ్చిన మాటలతో చెబుతున్నాను.

న్యూటన్ మహాశయుణ్ణి ఎవరో అడిగారట “మీరిన్ని విషయాలు ఎలా కనిపెట్టారు?" అని. ఎంతో వినయంగా “మిత్రమా! నేను నాముందు వాళ్ళ భుజాలా మీద ఎక్కి ఎక్కువ దూరం చూడగలిగాను” అన్నాట్ట ఆ శాస్త్రవేత్త.

తనముందు వారి కృషిని తాను ఉపయోగించుకున్నాననీ, ఆనందించాననీ చెప్పాడాయన.

అంతర్జాలం గురించి, కూడలి గురించి నేనూ ఇదే అనుకొంటున్నాను. “నాముందు వారంతా ఎంతో కృషి చేసి, దీని నింతగా అభివృద్ది చేశారు, కాబట్టి కదా, ఇప్పడింతగా దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం” అని.

ఈ సందర్భంలో వీవెన్ గారికి, నల్లమోతు శ్రీధర్ గారికి [బ్లాగు తెరిచే ముందు నేను వీరి కంప్యూటర్ ఎరా నుండి ఓనమాలు దిద్దాను] జ్యోతి వలబోజు గారికి, సలహా చెప్పండి బాబోయ్ అనగానే ఆదుకున్న తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారికి, శిరిష్ గారికి, రమణ గారికి, మిరియాల ప్రదీప్ కి, యోగికి, వ్యాఖ్యలు వ్రాసి ప్రోత్సాహించే రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి, బొల్లోజు బాబా గారికి, ఇంకా నాబ్లాగులో వ్యాఖ్యలు వ్రాసిన, టపాలు చదివిన అందరికీ కృతఙ్ఞతలు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మఒడి అందరూ అనందంగా ఉండాలనీ, ఎవరికి సాధ్యమైన రీతిలో వారు ఙ్ఞానాన్ని పంచాలనీ, సహాయ సహకారాలందించుకుంటూ చల్లని స్నేహంలో వెచ్చని అనుభూతుల్ని పంచుకుంటుండాలనీ, అందరికీ మంచి జరగాలనీ కోరుకుంటోంది.

మీ అందరికీ నాదో చిన్న కానుక…..

అనగా అనగా….

మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు. కాని అతడి ముఖంలో ఏదో దిగులు, విచారం! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు. కుతూహలంగా తోచింది. ఆగి పలకరించాడు. “ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు?" అడిగాడు నసీరుద్దీన్.

ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

"ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను” అన్నాడు.

నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు.

ధనికుడు “నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆనందం మాత్రం లేదు. నేనెప్పడూ సంతోషంగా గడపలేదు” అన్నాడు విచారంగా.

"అదేం? ఆరోగ్యం లేదా?" అడిగాడు నసీరుద్దీన్.

"నాకేం. పిడిరాయిలా ఉన్నాను”.

"మరి సంతానం లేదా?"

"రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు”కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు.

"వాళ్ళుత్త బడుద్దాయిలా?" అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్.

"చాలా బుద్ధిమంతులు. నే గీచిన గీత దాటరు. చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు?"

"మరేమిటి మీ సమస్య? ఎందుకు విచారం?" మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"నాకన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను. అందుకే చూడటానికి వచ్చాను. ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ. అదీ తీరేటట్లుగా కనబడటం లేదు.”

నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు. సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి. మరి ఆనందం ఎందుకు లేదు. తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి.

వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి, ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని, ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు.

"అయ్యో! అయ్యో. నాడబ్బు. నాడబ్బు” ఘొల్లుమన్నాడు ధనికుడు.

అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారూ, దుఃఖం, హడావుడీ, వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి, తేరుకొని గట్టిగా అరిచాడు.

"నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు. దొంగా! పట్టుకోండి” భయంతో కీచుమంది ధనికుడి గొంతు.

వీధంతా హడావుడిగా ఉంది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు.

ధనికుడికేం చేయాలో పాలుపోలేదు. చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ, పరిశీలిస్తూనే ఉన్నాడు.

ధనికుడికి ఆకలి వేసింది. నీరసంగా ఉంది. అలిసిపోయాడు. ఎక్కడైనా బస చేద్దామన్నా, తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు.

దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి. “ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేరకపోయి వచ్చాను. ఆనందం లేకపోతే పోయింది. ఇప్పడు తిండీ తిప్పలూ లేవు, నిద్రానిప్పులూ లేవూ. వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు. ఏం చేయాలిరా బాబూ” అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు.

అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు.

నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది. తనదే. అచ్చంగా తనదే.

ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు. డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు. చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు. కుప్పిగంతులు వేశాడు.

"ఓ హోహో! దొరికింది. నాడబ్బు దొరికింది” సంతోషంగా అరిచాడు.

చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు. మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు.

నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ “ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే.”

ఇదీ కథ.

అవును. జీవితంలో కష్టాలే లేకపోతే సుఖాల విలువా తెలియదు, ఆనందాల అనుభూతి అర్ధంకాదు. నేర్చుకొనేది ఏమీ
ఉండదు. రోజులో రాత్రిపగలులా, జీవితంలో కష్టమూ సుఖమూ రెండు ఉండాలి.

మీరే మంటారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

12 comments:

ఇంకేమంటాం మేడమ్! మీరు చెప్పింది అక్షరాలా నిజమని ఒప్పేసుకుంటాం! కష్టాలు లేకపోతే సుఖాల విలువ తెలియదు. నిజం!

ఆదిలక్ష్మి గారూ, మీకూ బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు. మంచి కధ చదివించారు ధన్యవాదాలు.

నిజమే, చలికాలం మజా, వేసవి లేక పోతే తెలిసేదా?

కానుక బాగుంది. రోజుకొకటి ఇవ్వండి.

అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.మీ ఆకాంక్ష భగవంతుని ఆశీస్సులతో నెరవేరుగాక.

:-)

మంచి కానుక.కృతజ్ఞతలు.

మంచి మంచి కథలు కథలతో పాటు చక్కని విషయాలు చెపుతున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.

చాలా బాగుందండి, మీకు కూడా శుభాకాంక్షలు.

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

మంచి కథ.

chala baga chepparu.
kani kontha mandiki epudu kastale.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu