ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా ...

ఓ అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులూ, పక్షులూ ఉండేవి. అప్పటికి గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి.

ఓరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఓగ్రామం నుండి ఓ కుర్రాడు ఉండేలు తీసుకొని అడవికి వచ్చాడు. వాడు బంక మట్టితో చిన్న గోళీకాయలంత ఉండలు చేసి ఉండేలులో బెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. ఒకటి రెండు పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్కక్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచు మంది గుడ్లగూబ.

అంతలో అటువైపు కౄరజంతువులు రావడంతో ఉండేలు కుర్రాడు అక్కణ్ణుండి పారిపోయాడు.

గుడ్లగూబ బాధతో చెట్టుకొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరికొచ్చింది.

"ఏం జరిగింది గూబమామా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళుపెడుతూ “ఎవడో కుర్రవెధవ! రాయితో కొట్టాడు అల్లుడూ” అంది.

"అయితే వైద్యుడి దగ్గరికి పోరాదూ?" అంది కాకి సానుభూతిగా.

"వైద్యుడెక్కడున్నాడు?" మూలుగుతూ అడిగింది గుడ్లగూబ.

"కోకిలమ్మ చాలాబాగా వైద్యం చేస్తూంది. కాకపోతే వూరికే చేయదు. మనమే దైనా ప్రత్యుపకారం చెయ్యాలి" అంటూ కాకి వివరించింది.

గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం! కాకికి దాన్ని చూసి చాలా జాలివేసింది.

గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసికెళ్ళింది.

"ఎవరికి జబ్బూ?" పరిశీలనగా చూస్తు అడిగింది కోకిలమ్మ.

"గూబ మామాకి. ప్రొద్దునే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట్టా" చెప్పింది కాకి.

కోకిలమ్మ గుడ్లగూబని పరిక్షించింది. రెక్కక్రింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది.

"వూ. వైద్యం చేస్తాను. మరి నాపారితోషికం ఎవరిస్తారు?" అంది ముందు జాగ్రత్తగా.

గూబ కుయ్యు మందిగాని “సరే నేనిస్తాను” అనలేదు.

కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్నవేసింది.

ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టింది గానీ, వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు.

ఇదంతా చూస్తూన్న కాకి, "ఫీజు దేముంది కోకిలమ్మ? ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా? వైద్యం చెయ్యి” అంది ఆదుర్దాగా.

"మరి నా ఫీజు?" సందేహంగా అడిగింది కోకిలమ్మ.

"గూబమామా ఇస్తాడులే. నాదీ పూచీ!” అంది పుచిక్కని కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో.

"సరే” అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ.

గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసికెళ్ళి వేడినీటిలో ఓ ఘడియ సేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ.

"నా ఫీజు?" వెంట బడింది కోకిలమ్మ.

"ఏం ఫీజు? నేనిస్తానన్నానా?" అంది దబాయింపుగా గుడ్లగూబ.

కోకిలమ్మ కాకి నడిగింది.

కాకి “అదేమిటి గూబ మామా! కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా! మరి ఆఖర్చు ఇవ్వద్దూ” అంది.

"ఎవరు చెయ్యమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు?" పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.

"కాకి! అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నాదగ్గరికి తెచ్చావు. నీది పూచీ అంటేనే నేను వైద్యం చేసాను. కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు” అంది కోకిలమ్మ.

"బాగుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. పోన్లే పాపం ఏడుస్తోందని సాయం వస్తే నేనేందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి?" కాకి వాదన పెట్టుకొంది.

కాస్సేపటికి తగవు పెద్దదయ్యింది.

పది పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయటం మేలని అన్ని పక్షులూ సలహా ఇచ్చాయి.

సరేనని కాకి, కోకిలా, నెమలి రాజు ఆస్ధానానికి వెళ్ళివిన్నవించుకొన్నాయి.

పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది.

కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలూ చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషీ అడిగింది.

"రాజా! నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నాపాటికి నేను ఏడుస్తూంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మ కి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి” అంది గుడ్లగూబ తన వాదనని బలంగావినిపిస్తూ.

కోకిలమ్మ “నిజమే ప్రభూ! అక్కడికీ నేను రెండు మూడు సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది గాని వైద్యంకు కూలీ ఇస్తానన లేదు. కాకే నాదీ పూచి అంది. అందుకే వైద్యం చేసాను” అంది వినయంగా.

కాకి “అవును ప్రభూ! నొప్పితో ఏడుస్తూంటే నేనే గుడ్లగూబ వైద్యడి దగ్గరికి తీసికెళ్ళాను. కోకిలమ్మ కూలీ అడిగినప్పడు నొప్పితో జవాబు చెప్పలేక పోతుందను కొని నాదీ పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది గదా అన్న తొందరలో అన్నాను. అంతే గాని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తూందనూ కోలేదు” అంది ఏడుపు గొంతుతో.

"అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభూ! ఇక మాట మార్చేందుకేముంది?" న్యాయచుక్క[లా పాయింట్] లేవనెత్తింది గుడ్లగూబ.
రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలి రాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని [పార్లమెంటరీ సంఘాన్ని] నియమించాడు. వాళ్ళుకొన్నినెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు.

రాజు తీర్పు ఇచ్చేరోజు పక్షుల సభ కిక్కిరిసి పోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూన్నారు.

చివరకి నెమలి రాజు తీర్పు చెప్పాడు.

"కోకిలమ్మ, గుడ్లగూబకే వైద్యం చేసినా, కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేక పోయేది. అయితే కాకి పూచిని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలీ ఇచ్చితీరాలి”.

తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది.

కోకిలమ్మ “హమ్మయ్య!” అనుకొంది.

పక్షులన్నీ బిత్తరపోయాయి.

కాకి ఘోల్లుమంది.

"మహాప్రభో! నాదగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధ పడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష” అక్రోశంతో అడిగింది కాకి.

"న్యాయశాస్త్ర పరంగా అంతే” అంది చట్టసభాసంఘం. అంగీకారంగా తలవూపింది నెమలి రాజు.

"పేదవాణ్ణి. కనికరించండి బాబోయ్!” ఏడుపులంకించుకొంది కాకి.

"డబ్బులేక పోతే నీ సేవతో బకాయి చెల్లించు” ఇదే తుది తీర్పన్నట్లు నెమలి రాజు సభాచాలించి ఇంటికెళ్ళి పోయింది.

ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి, పిల్లల్ని పెంచసాగింది. ఆవిధంగా సేవ చేసి బకాయి తీర్చుకొంటుంది.

కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళుమండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతనీ తిట్టి పోసాయి. అది కన్పిస్తే చాలు అసహ్యంతో మొహం తిప్పుకొన్నాయి. శాపనార్దాలు పెట్టాయి. అవమానించాయి.

దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావడానికి మొహం చెల్లక పగలు గూట్లోనో, చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెదుక్కోవడం మొదలెట్టింది.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కోకిల గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులూ, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి.

ఇదీ కథ!

ఈ కథలో పక్షులన్నీ కలిసి గుడ్లగూబని సిగ్గుపడేలా చేశాయి. ఎందుకంటే పక్షులకి పత్రికలు అంటే మీడియా లేదు గనుక. నెగిటివ్ వాయిస్ కూ పాజిటివ్ కాప్షన్ పెట్టే పత్రికలు లేవు, ఇదే పక్షుల అభిప్రాయం అంటూ ఏమీడియా తనకూ కావలసిన దాన్ని ప్రచారం చేయలేదు గనుక. అదే మన సమాజంలో అయితే?.....

ప్రజలంతా నెత్తినోరూ కొట్టుకొని ఇదికాదు మా అభిప్రాయం అన్నా పత్రికలు,టీవి, సినిమాలు ఒక్కమాటలో చెప్పాలంటే మీడియా “ఛస్! నోరు మూయ్యండి. ఇదే ప్రజాభిప్రాయం” అంటూ తము ఏది జనం నెత్తిన రుద్దదలుచు కొన్నారో దాన్నే “పదేపదే అదే ప్రచారం” అన్న తంత్రంతో చెల్లుబాటులోకి తెస్తాయి.

నాకు చేతనైనన్ని దృష్టాంతాలు [సర్కం స్టాన్షియల్స్] మీ దృష్టికి తేవడానికి ప్రయత్నిస్తాను. పరిశీలించి చూస్తే ఇంకా మరెన్నో అంశాలు మీరూ జాబితా చేయగలరు.

1. రెండు మూడు దశాబ్దాల క్రితం పత్రికల్లో, సినిమాల్లో ఓ జోక్ ప్రముఖంగా కనిపించేది. టీచర్ లేదా తండ్రి పిల్లవాడికి సత్యహరిశ్చంద్ర కథంతా చెప్పి,

"ఒరే రామూ! ఇప్పడు చెప్పు. సత్యహరిశ్చంద్రుడు కథనుండి నువ్వేం నేర్చుకొన్నావు?"

రాము: “నిజం చెబితే చాలా కష్టాలు పడాల్సివస్తూంది టిచర్. అంచేత హాయిగా అబద్దం చెప్పడం మంచిదని నేర్చుకొన్నాను.”

ఇదే జోక్ రకరకాలుగా మీడియాలో ప్రచారంలో ఉండేది. అదే సత్యహరిశ్చంద్రుడి కథ చదివి, స్ఫూర్తి పొందిన ఓ సామాన్య బాలుడు మహాత్ముడుగా పరిణమించాడనీ, రవి అస్తమించదని గర్వంగా ప్రకటించుకొనే బ్రిటిషు సామ్రాజ్యవాద వ్యాపారుల్ని పొలిమేరలకావలకు వెళ్ళగొట్టాడనీ ప్రజలకి గుర్తుచేయాలనే బాధ్యతని వ్యుహాత్మకంగా మరచిపోయి, ఈ జోక్ ని మాత్రం తమకర్తవ్యంగా ప్రచారించాయి. [నిజానికి భారతదేశంలో మతాలమీద మీడియా కుట్ర గురించి చెప్పాలంటే అది మరికొన్ని వరుస టపాల మాలిక అవుతుంది. ఈ మాయాజాలపు మాలిక తర్వాత అది వ్రాస్తాను]

మతాలను, నమ్మకాలను సమర్ధిస్తూ, ఉషశ్రీ, విశ్వనాధ సత్యనారయణలాంటి వారు వ్రాస్తే పత్రికలు పట్టించుకోలేదు. అదే రంగనాయకమ్మ లాంటి వారు మతాలనూ, నమ్మకాలనూ విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ వ్రాస్తే ప్రముఖంగా ప్రచురించారు. అదే ప్రజాభిప్రాయం అన్నారు. వెరసి తమ దోపిడికి కావలసిన విధంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజలతో నిమిత్తం లేకుండానే సృష్టించాయి.

2.మరో దృష్టాంతం చెప్పాలంటే 1975 ల తర్వాత నుండీ ఈ నాటిదాకా సినిమాలు. సినిమాల్లో అశ్లీలం, అర్ధనగ్న నృత్యాలు, జ్యోతి లక్ష్మీ, జయమాలిని, సిల్క్ సిత్మల దగ్గరనుండి నేటి మొమైత్ ఖాన్ లదాకా అదే అంగాంగ ప్రదర్శన, హాస్యం పేరుతో బూతు. అదేప్రజలు కోరుతున్నారంటూ మీడియా అదరగొట్టే ప్రచారం. అదే నిజమైతే నాటి శంకరాభరణం నుండి నేటి ఆనంద్, బొమ్మరిల్లు, గమ్యం లాంటి సినిమాలదాకా ఎందుకు ప్రజలు ఎడారిలో ఓయసిస్సుల్ని ఆనందించినట్లు సేదతీరారు? పైగా తీస్తూన్నారు కాబట్టి చూస్తూన్నాం, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అన్నపరిస్ధితి ఉందంటూ ఓ ద్వంద్వపు సృష్టి!

నాటి బూతుల్లో మచ్చుకి ఒకటి.

ప్రఖ్యాత నటుడు చిరంజీవి నటించిన ఓ చిత్రంలో నాయక నగ్మ తనకారుతో అతని రిక్షాను గుద్దేస్తుంది. కేసు కోర్టుకి వస్తుంది. ఆవిడ తనసలు యాక్సిడెంట్ చేయలేదంటూ తను కారుతో రిక్షాను గుద్దలేదంటుంది. తర్వాత డైలాగుల్లో మిగిలిన అన్నిమాటలూ వదిలేసి కేవలం [డాష్ ఇవ్వలేదు అన్న అర్ధం వచ్చేందుకు] ’జి యు డి డి ఎ లేదు’ అంటుంది. అప్పడు హీరోగారు చొక్కా ముందు గుండీలు మూడు నాలుగు వూడదీసుకొని చొక్కా ముఖం మీదకి లాక్కుని సిగ్గుపడిపోతాడు. ఆవిడ రెండు మూడు సార్లు అదే మాట అంటుంది. ఈయన రెండు మూడు సార్లూ సిగ్గుపడిపోతాడు. నాఖర్మకాలి ఈ సినిమాని స్నేహితులకి పార్టీ ఇవ్వాల్సివచ్చిన సందర్భంలో ధియేటర్ లో చూశాను. నాతోటి స్త్రీల ముఖాల్లో అవమానపు ఎరుపునీ, నేల క్లాసులో మాస్ జనాలమనుకొంటూ కేకలూ, ఈలలూ వేసిన 15 లేదా 18 ఏళ్ళ లోపు వయస్సు కుర్రాళ్ళనీ చూశాను. అదే ప్రజాభిప్రాయమా?

ఒకవేళ అదే ప్రజాభిప్రాయమైతే పత్రికల బాధ్యత ఏమిటి? మన ఇంట్లో చిన్నపిల్లాడు సిరంజీ తోనో, నిప్పుతోనో ఆడుకుంటానంటే ఏమంటాం? ముందు ’ఒద్దు నాన్నా ప్రమాదం’ అంటాం. వినకపోతే ఎందుకు ప్రమాదమో డెమాన్ స్ట్రేషన్ చేసి చెబుతాం. అప్పటికీ వినకపోతే రెండు పీకి బుర్రకి ఇంకిస్తాం. అంతేగానీ అదేవారి అభిప్రాయమని “సిరంజితో ఆడుకోనాయనా, కళ్ళల్లోనో ముక్కులోనో గుచ్చుకోనాయనా” అంటామా? లేకపోతే “నిప్పతో ఆడుకో నాయనా? కొంప తగలడితే తగలడుద్ది అంతే గదా!” అంటామా?

తల్లితండ్రులుగా, పెద్దవారిగా మనం మన బాధ్యతని ఎలా నిర్వర్తిస్తాం? మరి సమాజంలో విలువల్ని కాపాడే వృక్షాలమనీ, ప్రజాశ్రేయస్సు కోసమే పని చేసే వ్యవస్థలమనీ చెప్పకొనే పత్రికలూ, మీడియా బాధ్యత ఏమిటి? ప్రజలకి మార్గదర్శకం చేయడమా? ప్రజలు సరైన దారిలో ఉంటే, పెడదారి పట్టించడమా? తమకి కావలసినట్లుగా ప్రజాభిప్రాయమనే ముసుగులో మరేదో చేయడమా?

నిజానికి స్వాతంత్రానికి పూర్వం కొందరు భారతీయులు బ్రిటిష్ వారి ప్రచారం నమ్మి ’బ్రిటిషు పాలనే ఇండియాకి మంచిదనీ, వాళ్ళు రైళ్ళూ, రోడ్లూ వేసి దేశాన్ని అభివృద్ధి చేశారనీ, చేస్తూన్నారనీ, భారతీయులకి తమని తాము పరిపాలించుకోవటం రాదని’ అభిప్రాయపడ్డారు. అప్పడు పత్రికలు అదే ప్రజాభిప్రాయమంటూ చేతులు కట్టుకూ కూర్చోలేదు. ప్రజల్ని చైతన్యపరిచారు. సత్యాన్ని అర్ధం చేసుకొనేలా చేసాయి. “బ్రిటిషువాడు ఇండియాని దోచుకుంటున్నాడనీ, వాళ్ళ ముడి సరకూ, ఉత్పత్తి రవాణాలకూ రోడ్లూ, రైళ్ళూ వేశాడనీ, ప్రజలకోసం కాదనీ, ప్రజల కోసమైతే పల్లెపల్లెకూ, అన్ని పట్టణాలకూ వేసేవాడనీ, కేవలం నౌక రేవుపట్టణాలకి, ముడి సరుకు కేంద్రాలకి మధ్యనే రోడ్లూ వేసాడనీ తెలియచెప్పారు. శతాబ్దాలుగా ఇండియాకి ఉన్న చరిత్రనీ, వారసత్వ సంపదనీ, ఙ్ఞానాన్ని గుర్తుచేశారు. ఆవిధంగా తమ బాధ్యతని ఎంతో శ్రమించి నెరవేర్చారు.

ఎందుకంటే ఆనాటి పత్రికాధిపతులు దేశభక్తులూ, నీతి పరులూ, నిజాయితీ పరులు, మానవతామూర్తులు. ముఖ్యంగా వ్వాపారస్థులు కాదు కనుక.

నిజం చెప్పాలంటే ఎక్కడైతే బ్రిటిషు వారి పాలనా తంత్రం ఓడిపోయిందో అక్కడినుండి తరువాయి కుట్ర ప్రారంభమైంది. ఆనాటి సత్యగ్రహులపట్ల బ్రిటిషు వారి దౌష్ట్యం, క్రౌర్యం బయటి ప్రపంచానికి పత్రికలు వెల్లడి చేశాయి.

అస్సలు ఆయుధం చేతబట్టని సత్యాగ్రహుల పట్లా, అమాయక ప్రజలపట్ల జనరల్ డయ్యర్ లాంటివారు చూపిన క్రౌర్యాన్నీ, అలాంటి వాళ్ళకూ బిరుదులిచ్చిన బ్రిటిషు రాణి కుటిలతనీ, లాలా లజపతి రాయ్ ఛాతీ ఎముకలు విరిగేదాకా లాఠీఛార్జీ చేసిన బ్రిటిషు పోలీసుల దౌష్ట్యాన్నీ, బాపూజీ రగిల్చిన దండి ఉప్పు నిప్పునీ, నాటి పత్రికలు ప్రపంచానికి చాటి చెప్పాక బ్రిటిషుపాలకులకి పైకి చెప్పకొనే కారణాలు కరువయ్యాయి. నగ్నంగా నడిరోడ్డున నిలబడినట్లయింది. ఇక ఏ నీతులు చెప్పినా తాము మానవత్వాన్ని మరచి చేసిన వ్యాపారగోతులు దాగక, అనివార్యమై, దేశాన్ని విడిచి పెట్టిపోయారు.

అసలు ఆయుధమే చేతబట్టని సత్యాగ్రహులగురించి వాళ్ళుకొడితేనే మా పోలీసూలు ఆత్మరక్షణకి కాల్పులు జరిపారు, స్వాతంత్ర సమరయోధులు ముందు హింసకు పాల్పడ్డారా లేక బ్రిటిష్ పోలీసులు ముందు హింసకు పాల్పడ్డారా లాంటి ద్వంద్వాలు సృష్టించలేక బ్రిటీషు వారు పత్రికల చేతిలో ఓడిపోయారు.

కాబట్టే బ్రిటిషు వారి పాలన ఓడింది పత్రికల చేతిలో. అందుచేత ఈసారి భారతదేశం మీద కుట్ర పత్రికల చేత, పత్రికల మాటున నడిపించబడుతుంది.

౩. పత్రికలు తాము వ్రాయదలుచుకొంటే అరటిపండు వలిచి చేతిలో కాదు నోటిలో పెట్టినంత సరళంగా, వివరంగా వ్రాస్తాయి. వ్రాయదలుచు కోకపోతే పాషాణ పాకంలాగా వ్రాస్తాయి. అవే పదాలు, వాక్యాలు వివిధ సంయోగ వియోగాలతో [పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ లలో] తిప్పితిప్పి వ్రాసి పేజీలకు పేజీలు నింపుతారు గానీ చదివిన మనకు మాత్రం ముక్క అర్ధం కాదు.నిష్పత్తులు చెబుతూ మధ్యలో శాతాలు చెబుతారు. ఉదాహరణకి నిన్న అంటే నవంబర్,30 న ఈనాడు పత్రిక 8 పేజీలో [బిజినెస్ పేజీలో] ‘ఎంతకష్టం ఎంత నష్టం’ అనే శీర్షికన రతన్ టాటా ఫోటో వేసి మరీ వ్యాసం ప్రచురించింది. అందులో

‘దాడుల ప్రభావంలో టాటా గ్రూప్ నేతృత్వంలోని ఇండియన్ హోటల్స్ షేరు ధర శుక్రవారం దాదాపు 20 శాతం పడిపోయింది. 40 రూపాయలకు చేరుకుంది. ఏడాది క్రిందట ఈ షేరు ధర 125.99 రూపాయలని వ్రాసినది. అంతేగాని ఎక్కడా దాడులకు ముందు షేరుధర ఎంతో వ్రాయలేదు. మనం కేలిక్యులేటరో, ఆల్ జిబ్రానో, ఆంకగణితంతోనో గుణించి చూస్తే అది 50 రూపాయలు ఉంది. చదివేవారికి దాదాపు 126 నుండి టాటా హోటల్స్ షేరు ధర 40 రూపాయలకు పడిపోయింది పాపం అన్పిస్తుంది గానీ 50 రూపాయల నుండి 40 రూపాయలకి పడిపోయింది అని ఎందరికి తెలుస్తుంది.

ఇలాగే చాలాషేరు ధరలు గురించి రేటు నుండి శాతాలలోకి లెక్కలు మారుతుంటాయి గమనించిచూడండి.

అదే ఈ క్రింది వార్త చూడండి.

2005 లోనో 2006 లోనో అదే ఈనాడు పత్రిక ఎపి ట్రాన్స్ కో చేసే ప్రజాధనపు దుర్వినియోగం, ఆ నెపంతో బొక్కుతున్న లంచాలూ, చేస్తోన్న అవినీతి గురించి వ్రాస్తూ ఇలావ్రాసింది.

‘ఉదాహరణకి మన ఇంట్లో ఇత్తడి బిందెకు కన్నం పడిందనుకోండి.

మనమైతే ఏం చేస్తాం?

మాట్లేసే వాణ్ణి పిలిచి బేరమాడతాం. వాడు 20 రూపాయలంటే ఏ 12 రూపాయలకో బేరమాడి మాటు వేయిస్తాం. మళ్ళీ బిందె ఎంచక్కా వాడుకలోకి వచ్చేస్తుంది.

ఎపి ట్రాన్స్ కో అయితే ఏంచేస్తూంది?

ట్రాన్స్ కో అయితే బిందె చిల్లు పడిందని, క్రొత్తది కావాలని ఇండెంటు పెడుతుంది. అలావారం గడుస్తుంది. ఈ లోపున రోజుకి 10
రూపాయలన అద్దె కు బిందె తెచ్చి పని నడుపుతుంది. ఇంతలో పైనుండి క్రొత్త బిందె వద్దు. పాతది రిపేరు చేయించమని తాఖిదు వస్తూంది. ఇక లోకల్ ఏఈ గారు రిపేరు గురించి వాకబు చేయిండానికి టిఏ, డిఏ లు వ్రాసుకొని తర్వాత తీరుబడిగా ఈ ఉళ్ళో రిపేరు చేసేవాళ్ళు లేరని, కావాలంటే రాజధానికి రవాణా చేస్తామని, రిపేరు చేయించి మళ్ళీ వెనక్కి పంపాలనీ వ్రాస్తారు. దీనికి మరో వారం పడుతుంది. ఈ లోపున యధాప్రకారం బిందెకు అద్దె కడుతుంటారు. ఈలోగా ఖర్చులన్నీ లెక్కగట్టి, తమ సంస్థ లాభనష్టాలని లెక్కవేసి, సంస్థ శ్రేయస్సు కోరి, ఈ రిపేరు కంటే క్రొత్త బిందె కొనమని అనుమతి వస్తూంది.

ఇక టెండర్ల ప్రకటనలు, టెండర్లు తెరవడాలు గట్రాగట్రా... అన్నీ ఫార్సులూ ప్రారంభం. చివరకి బిడ్ వేసిన కాంట్రాక్టర్లలో అసమదీయులకో తసమదీయులకో టెండరు దక్కుతుంది. ఏ 800 రూపాయలకో క్రొత్త బిందె సప్లై చేయబడుతుంది. ఈ లోపున వాడిన బిందెకు అద్దె, అఫీసు ప్రాసెస్ ఖర్చు, టెండర్ల ఖర్చు, క్రొత్తబిందె వెరసి, అంతా 2400 రూపాయల దాకా అవుతుంది’.

ఇదీ కధనం.

ఎంతో వివరంగా, లెక్కలు రాని వాడికి కూడా విడమర్చి చెప్పినట్లుగా, ఎంత సరళంగా, దాంట్లో అవినీతి జరుగుతున్నట్లు అర్ధమయ్యేలా ఉందో చూశారు గదా.

4. పైగా ఈ పత్రికలు, మీడియా మధ్య కొన్ని ’పత్రికా విలువలు’ ఉన్నాయండోయ్. వాటిల్లో ఒకటేమిటంటే ఒక పత్రిక వ్రాసిన దానికి మరో పత్రిక వ్యతిరేకంగా వ్రాయకూడదట. మొన్నమధ్య సాక్షి, ఈనాడు పత్రికలు ఏ అంతర్గత కారణంగానో, బాహాటంగా కొట్టుకున్నప్పడు ఈ విషయం బైటపెట్టుకున్నాయి. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళూ పంచుకున్నట్లు ఓ పత్రిక వ్రాసిన దానికి వ్యతిరేకంగా ఇంకో పత్రిక వ్రాయకూడదా? ఏం మ్యాచ్ ఫిక్సింగ్? ‘నీకు కావాల్సినట్లు నువ్వు వ్రాసుకో నేను బైటకి చెప్పను, నాకు కావాల్సినట్లు నేను వ్రాసుకొంటాను నువ్వు బైట పెట్టెద్దు’. అన్న ఒప్పందం కాదూ ఇది? ఏ ఒక్కరికైనా అసలు నిజాయితీ గానీ, నిబద్దత గానీ ఉన్నాయా? ఇందులో ఏ పత్రికా ఒకదానికొకటి తీసిపోవు. నేను ఉదాహరణకి ఈనాడు వ్రాసనండి. మీరు ఏ పేపరు ఉదయన్నే చదివితే, ఆ పేపరునే యధాలాపపు కన్నుతో గాక తార్కికపు కన్నుతో చదవండి. నేను పైన వ్రాసిన దంతా ఎంత అక్షరసత్యమో మీకే కన్పిస్తూంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏ పత్రికా, ఏ మీడియా అతీతం కాదు. కాకపోతే ఓ పత్రిక ట్రెండ్ సెట్టర్ లేదా ఒరవడి సృష్టికర్తా అవుతుంది, మరో పత్రిక అనుచర పత్రిక అవుతుంది. అంతే తేడా.

7 comments:

Wonderful writeup and equally good presentation of it. Would expect to see more of these from you.

Vamsi

vaastavaaniki darpanam meerachana. deenini patrikalavaariki koodaa pampamdi

excellent !!! You should mark a copy of this to all leading papers editors mail ids.

చాలా బాగా వ్రాసారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు (వాళ్ళు కత్తులతోటీ,వీళ్ళు కలాలతోటీ అంతే తేడా)

మొదటి నుంచీ చాలా క్షుణ్ణంగా చదువుతున్నానండి,చివరి భాగమూ వచ్చాక అప్పుడు చర్చిద్దాం కొనసాగించండి,అభినందనలు

ఆలోచనాత్మకంగా ఉన్నాయి మీ పోస్టులు
అభినందనలు

chala alochincheviga unnayi mi posts.

good work

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu