ఈ రోజు శివరాత్రి!

ఉపవాసాలు, జాగరణలతో బాటు జాతరలతో శైవ క్షేత్రాలు కళ కళలాడుతుంటాయి.

ముఖ్యంగా శ్రీశైలంలో....

శివదీక్షా స్వాములతో, ఎటు చూసినా ‘శివా శివా’ అన్న పిలుపులతో..... అక్కడి లోయలూ, కొండలే కాదు, దుమ్ముధూళిలో కూడా భక్తిభావం పొర్లుతూ ఉంటుంది.

అసలు ‘మల్లయ్యా’ అన్న పిలుపే మధురంగా తోస్తుంది.

ఎంత చల్లని సామి మల్లయ్య!

సువర్ణ మందిరాలు, సిరిసంపదలూ లేని స్వామి.

భోళా శంకరుడనీ, భక్త సులభుడనీ....ఆర్తితో పిలిస్తే తొందరగా ఆలకిస్తాడనీ, ఆపద నుండి ఆదుకుంటాడనీ భక్తుల ఆశ!

లయకారుడనీ, రౌద్రుడనీ.... ఒకింత వెరపు కూడా!

సృష్టికి విధ్వంసం కూడా అవసరమే కదూ!

పాతది పోనిదే కొత్తది వచ్చేదెలా?

అందుకే నేమో! శివతత్త్వం అర్ధం చేసుకోవటం బహుకష్టం అంటారు పండితులు!

తత్త్వాలు అర్ధం చేసుకునేంత దృశ్యాలు ఎటూ మనకి లేదనుకొండి!

ప్రేమతో భక్తితో భజిస్తే చాలు! చల్లగా చూసే స్వామి మల్లయ్య!

ఈ సందర్భంలో.... ‘మూగ మనసులు’ సినిమాలోని ఘంటసాల సుశీల బృందం పాడిన ‘గౌరమ్మా! నీ మొగుడెవరమ్మ’ అన్నపాట గుర్తు కొస్తోంది.

మరదలిని ఏడిపిస్తూ..... ఓ పల్లెటూరి మామఁ

“గౌరమ్మ నీ మొగుడెవరమ్మా

ఎవరమ్మా.... వాడెవరమ్మ” అంటాడు.

ప్రతిగా ఆమె

“చెప్పాలంటే సిగ్గు కదయ్యా! ఆనవాలునే చెబుతానయ్య!” అంటుంది.

‘చెప్పు చెప్పు’ అన్న ప్రోత్సాహంతో,

“సిగలో నెలవంక, మెడలో నాగరాజు

ఆరేడు నావాడు సరిరారు వేరెవరూ

మావఁయ్యా నా మొగుడెవరయ్య! ఎవరయ్యా వేరెవరయ్యా!”

అంటూ చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ పల్లెటూరి మాఁవ, వ్యంగ్యాలు పోతూ....

“ఇల్లూ వాకిలి లేని వాడు, లే...నీ... వాడూ, లేనివాడు

బిచ్చమెత్తుకుని తిరిగే వాడు.

మాదాకవళం.

ఎగుడూ దిగుడూ కన్నుల వాడు, జంగం దేవర నీవాడా!” అనేస్తాడు.

ఇక చూడండి గౌరమ్మ సమర్ధింపు!

“ఆకాశమే ఇల్లు, లోకమే వాకిలీ!.... అవును!

బిచ్చమడిగేది భక్తి! బదులు ఇచ్చేది ముక్తి!

బేసి కన్నులే లేకుంటే బెంబేలెత్తును ముల్లోకాలు” అంటుంది.

ఇక ఇలా కాదని ఆ గడుసు గౌరమ్మని నిలేస్తూ... ఈ మామ

“మొగుడు మొగుడని మురిసావే, పొగిడావే, పిల్లోయ్!

నెత్తిన ఎవరినో ఎత్తుకొని నిత్యం దానినే కొలుచునట

ఆమెయె ఆతని ఆలియట. కోతలు ఎందుకు కొస్తావే!?” అంటాడు.

గౌరమ్మా మజాకా! ఎంత గడసరిగా బదులిస్తుందో చూడండి.

“యెవరో పిలిస్తే వచ్చింది, యెవరి కోసమో పోతోందీ

మయాన మజిలీ యేసింది, మయాన మజీలీ యేసింది.

సగం దేహమై నేనుంటే..... అది పెళ్ళామంటే చెల్లదులే

పళ్ళుపదారు రాలునులే” అంటుంది.

ఇంతకీ పళ్ళు పదారు రాలేది ఎవరికి?.... ‘గంగ శివుని భార్య, అన్న వాళ్ళకా?

లేక ఆ మాటన్నాడంటే...... ఆయనకైనా సరే, పళ్ళు పదారు రాలుతాయంటుందా?

ఎంత గడుసు గౌరమ్మో కదా!

అసలుకే, అర్ధనారీశ్వరుడై, ఆలుమగల అరమరికలు లేనితనాన్ని, అఖిల జనానికి చాటిన ఆదిదంపతులు ఆ శివపార్వతులు!

భిక్షాపాత్ర చేగొని, భార్యనే భిక్ష అడిగే జంగమ దేవర ఆయన.

అర్ధశరీరాన్ని ఆలికిచ్చేసిన ప్రియపతి ఆ పశుపతి!

ఈ పండుగ రోజున..... వారి గురించి జానపదులు ప్రేమగా చెప్పుకునే బోలెడు కల్పిత కథలలో..... ఒక కథ, మీకోసం!

ఈ కథ నాకు మరింత ప్రత్యేకమైనందండోయ్! ఎందుకంటే... ఎన్నో కథలు, నేను నా కూతురికి చెప్పినవైతే.... ఇది మాకు మా అమ్మాయి చెప్పిన కథ! తొలిసారిగా మాకు తెలియని ఓ కథని..... మాకు చెప్పినందుకు, తానూ, మేమూ కూడా మురిసిపోయామన్న మాట! ఇప్పుడు కాదులెండి ఓ ఆయిదారేళ్ళ క్రితం!

ఇక కథలోకి!

ఓ సారి పార్వతీ పరమేశ్వరులు, ఆకాశమార్గాన భూలోక విహారం చేస్తున్నారు.

మాటల సందర్భంలో అయ్యవారు “ఈ సృష్టిలో ప్రతీ పని కూడా.... కార్య కారణ సంబంధం కలిగి ఉంటుంది. ఎంత చిన్న పని అయినా, అది మరిన్ని సంఘటనలకు దారి తీస్తుంది” అన్నాడు.

అప్పటికి వారిద్దరూ ఓ ఊరి దాపున ఉన్నకొండవాలులో ఉన్నారు. అక్కడున్న పచ్చిక మేస్తూ కొన్ని గొర్రెలున్నాయి. వాటిని కాస్తూ ఓ పిల్లాడున్నాడు. వాడు ఊసుపోక గోళ్ళు కొరుక్కుంటున్నాడు.

ఈశుని మాటలకు నవ్వుతూ ఈశ్వరి “స్వామీ! ఇప్పుడీ గొర్రెలు కాసే పిల్లవాడు, పనేం లేక గోళ్ళు కొరుక్కుంటున్నాడే! దీనికీ కార్యకారణ సంబంధాలు, పర్యవసానాలూ ఉంటాయంటారా?” అంది.

సన్నగా నవ్వాడు శివుడు.

“నిశ్చయంగా ఉంటాయి దేవి!” అన్నాడు.

“అయితే చెప్పండి. ఇప్పుడీ పిల్లాడు గోళ్ళు కొరకడంతో ఏం జరగబోతోంది? ప్రళయం వస్తుందా?” అంది అంబ.

“ప్రళయం రాదు గానీ అంతే అల్లకల్లోలం అవుతుంది. వీడు గోళ్ళు కొరకటం ద్వారా ఓ పావురం మరణిస్తుంది. ఈ దేశాన్నేలే రాజు మరణిస్తాడు. ఈ దేశంలో అరాచకం చెలరేగుతుంది – చివరికి దేవలోకాలు కూడా అల్లకల్లోలం అవుతాయి” అన్నాడు పరమ శివుడు.

“స్వామీ! అదెలా జరుగుతుందో చూద్దామని నాకు కుతూహలంగా ఉంది. మనం ఇక్కడే కొన్నాళ్ళుండి ఏం జరుగుతుందో పరిశీలిద్దాం” అంది పార్వతి.

ఇల్లాలు అడిగితే ఈశుడు కాదాంటాడా? సతి మాటలకు సరేనన్నాడు.

ఇంతలో గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్న పిల్లాడు, నోట్లో ఉన్న గోటిని బయటకు ఊసి, బొడ్లో దోపుకున్న మూటలోంచి మరమరాలు తీసి తినటం ప్రారంభించాడు. గాలికి కొన్ని మరమరాలు అతడి చుట్టూ పడ్డాయి.

అవి చూసిన ఓ పావురం, చెట్టు మీది నుంచి అతడి దాపులనే వాలి, మరమరాలు తినసాగింది. అలా తింటూ తింటూ, పొరపాటున పిల్లవాడు కొరికి పారేసిన గోటిని కూడా మింగేసింది. అయితే ఆ గోరు కాస్తా, పావురం గొంతులో గుచ్చుకు పోవటంతో, పాపం ఆ పావురం, ఉక్కిరి బిక్కిరయ్యింది. గిలగిల కొట్టుకుంది.

గొంతులో కుచ్చుకున్న గోరు మూలంగా పావురం ఆహారం తినలేకపోయింది. అనారోగ్యం పాలైంది. గోరు కారణంగా దాని శరీరం విషపూరితం అయ్యింది. దాంతో దానిలో చురుకుదనం తగ్గిపోయింది. తేలిగ్గా వేటగాడి వలలో చిక్కుకుంది.

వేటగాడు దాన్ని తెచ్చి నగరులో అమ్మాడు. దాన్ని రాజు గారి వంటవాడు కొన్నాడు.

ఆ దేశపు రాజు గారికి, రోజూ పడుకునే ముందు పావురపు రక్తం త్రాగటం అలవాటు. అలా చేస్తే మంచిదని ఎవరో చెప్పటంతో నమ్మి ఆచరిస్తున్నాడతడు.

వేటగాడి దగ్గర కొనుక్కొచ్చిన పావురాన్ని చంపి, ఆ రక్తాన్ని రాజుకిచ్చాడు వంటవాడు. విషపూరితమైన ఆ పావురపు రక్తం తాగిన రాజు గారికి కూడా, అనారోగ్యం పట్టుకుంది. ఎన్ని మందులు వాడినా.... అంతుచిక్కని జబ్బుతో కొన్నాళ్ళు బాధపడి, చివరికి రాజు గారు మరణించారు.

రాజు లేక పోవటంతో ఆ రాజ్యంలో ఆరాచకం ప్రబలింది. అది చూసి పరమ శివుడు “పార్వతీ! గొర్రెలు కాస్తున్న పిల్లవాడు గోళ్ళు కొరకటం చూసి దానికే పర్యవసానాలుంటాయి? అన్నావు. చూశావా! ఆ చిన్నపని ఎంతకి దారి తీసిందో?” అన్నాడు.

పార్వతీ దేవి అయ్యవారి మాటలను అంగీకరిస్తు “అవును స్వామీ! మీ మాట ఒప్పుకుంటాను. అయితే ప్రభూ! నాకో సందేహం! పిల్లవాడు గోరు కొరకటంతో పావురం చచ్చిపోతుంది. రాజూ చచ్చిపోతాడు. ఈ రాజ్యం అరాచక మౌతుందన్నారు. అయ్యింది. మరి దేవలోకాలు కూడా అల్లకల్లోలం అవుతాయన్నారే!” అంది.

ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు పరమ శివుడు. “మరి!? ఈ చోద్యం చూడటానికి మనం ఇన్ని రోజులూ భూలోకంలో ఉండిపోతే.... కైలాసంతో సహా దేవలోకాలన్నీ అల్లకల్లోలం కావా!? పద పద!” అన్నాడు.

“అవునండోయ్! మరిచే పోయాను” అంది అమ్మవారు బుగ్గలు నొక్కుకుంటూ!

ఇదండీ కథ!

ఈ శివరాత్రి రోజు....

మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యులనీ భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి వార్లు చల్లగా చూడాలని కోరుకుంటూ......!


6 comments:

nice story

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

Nice Picture .. the way causual pose of Shiva sitting down with Ganapathi on his lap, while Parvati sitting on PanivaTTam. :)

కిరణ్ said... March 8, 2011 at 10:55 PM  

చాలా అద్భుతం గా కథ చెప్పారు.. చిన్న చిన్న తప్పులు అని అలసత్వం తో నైనా, అనుకుని అయినా ఎటువంటి తప్పునీ చేయరాదు అని శివుడి తో చెప్పించారు .. చాలా బాగుంది.....
(ఈ ఇమేజ్ ని నా కంప్యూటర్ స్క్రీన్ బాక్ గ్రౌండ్ లా పెట్టుకున్నా..)

జై తెలంగాణ గారు: నెనర్లు!

శివ చెరువు గారు: నెనర్లండి!

snkr గారు, కిరణ్ గారు : ఆ బొమ్మ నేను ఈనాడు నుండి తీసుకున్నానండి. కురచ దుస్తుల సుందరీమణులని, చేతులెత్తెసి బాహుమూలాలని ప్రదర్శించే నటి మణులని తరచుగా ప్రచురించే ఈనాడు, ఏటికో ఏకాశి, జన్మకో శివరాత్రి అన్నట్లుగా అతి అరుదుగా ప్రచురించే హిందూ దేవుళ్ళ బొమ్మలలో ఇదీ ఒకటి!

కొడుకును ఒళ్ళో పెట్టుకుని క్రింద చతికిల బడి కూర్చున్న మల్లయ్య సామీ, పల్లెటూరి ఆసామిలా ఎంతో బాగున్నాడు. ఆ బొమ్మ మీకు నచ్చినందుకు సంతోషం. నెనర్లండి!

అమ్మా, అస్తమానూ మీరు దుమ్మెత్తి పోసే ఈనాడులోనే మీకు కావలసిన ఫొటో దొరికిందన్నమాట! బ్యూటిఫుల్!

అవునూ, పాపం మీరు ఆ పత్రిక తప్ప ఇంకే పత్రికా చూడరా? ఎందుకంటే దాదాపుగా నగ్న చిత్రాలు ప్రచురించే అనేక ఇతర పత్రికలు వదిలేసి ఇక్కడ కూడా ఆ పత్రికమీదే పడుతుంటేనూ!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu