మొన్నామధ్య, ప్రభుత్వం, చౌకధరల దుకాణాల్లో ఇచ్చే కందిపప్పు ధర అమాంతం 30 నుండి 45 కి పెంచేసి అందులో కేజీ నుండి అరకేజికి కోతపెట్టింది. అంతే! మార్కెట్లో కందిపప్పు ధర అమాంతం 55-60 నుండి దాదాపు 75-80 రూ. లకు ఎక్కికూర్చుంది. సబబే కదా! ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనీ పెద్దలు చెప్పే సామెత. అలాంటిది, ప్రభుత్వమే స్వయంగా ధరలు పెంచేస్తే ప్రైవేటు వ్యాపారులు ఊరుకుంటారా? ఇలాంటిదే పెట్రో ధరలు పెంపకం కూడా! బియ్యం దారీ అదే! మళ్ళీ మరోప్రక్క – ప్రభుత్వం, పత్రికలు, టీవీ గట్రా మీడియా, ఈ సంవత్సరం ‘సిరులు పండించిన వరి’ అంటూనూ, ధాన్యం ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి అయ్యిందనీ, దిగుబడి పెరిగిందనీ, గణాంక వివరాలతో సహా ప్రకటిస్తూ ఉంది. మరి ధరలెందుకు పెరుగుతున్నాయి? నియంత్రించాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేసి తానే రేషన్ షాపుల్లోని ధరలు పెంచేయటంలో మతలబు ఏమిటి?

నిశితంగా పరిశీలిస్తే ... ప్రభుత్వం రేషన్ షాపుల్లో కందిపప్పు ధర పెంచటం ద్వారా, ప్రైవేటు వ్యాపారులకి ఒక సంకేతం [signal] ఇచ్చేసిందన్న మాట. ’ఇక మీ దోపిడి మీరు కానివ్వండి. ఆనక మా వాటా మాకు ఇచ్చేయండి’ అని! ఎటూ, ప్రభుత్వం ధరలు నియంత్రించటానికి, బ్లాక్ మార్కెట్ ని నిరోధించటానికి ఉపయోగించే పాలనా యంత్రాంగాన్ని, అధికారులనే, వసూళ్ళ నిర్వహణకు ఉపయోగించుకుంటోందయ్యె! గమనించి చూడండి. ఆ మధ్య ప్రతీ ఊళ్ళో అక్రమనిల్వలపై దాడులు జరిగాయి. మా నంద్యాలలో అయితే భారీగానే అక్రమనిల్వలు బయటపడ్డాయి. తర్వాతేమయ్యిందో? విచారణ సాగుతూ.......నే ఉంది. తర్వాత ప్రభుత్వం కందిపప్పుధరలు పెంచింది. దెబ్బతో కందిపప్పుతో సహా చాలా నిత్యావసరాసరుకులు ధరలు [బెల్లం, చక్కెరలతో సహా] అమాంతం పెరిగి కూర్చున్నాయి.

మామూలుగా ప్రభుత్వం, ప్రతిసంవత్సరం మార్కెఫెడ్ సంస్థ ద్వారా పప్పు ధాన్యాలు కొని ఉంచుతుంది. మార్కెట్లో పప్పుధాన్యాలు పెరిగినప్పుడు మార్కెఫెడ్ మార్కెట్లోకి పప్పు ధాన్యాలను విడుదల చేస్తుంది. ఆ విధంగా మార్కెటులోని అధికధరలని కంట్రోలు చేస్తుంది. కాని క్రితం సంవత్సరం ఎలక్షన్స్ కు ముందు వై.యస్. ప్రభుత్వం, మార్కెఫెడ్ చేత కొనుగోలు చేయించలేదు. కారణం ప్రభుత్వాధికారులకి, వై.యస్.కి మాత్రమే తెలుసు.

ప్రభుత్వం ఎందుకని మార్కెఫెడ్ చేత పప్పు ధాన్యాలు కొనుగోలు చేయించలేదు? ప్రభుత్వం ముందే ఊహించలేకపోయిందా లేక ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం, వ్యాపారులు అందరు కుమ్మక్కయి ప్రజలని దోపిడి చేస్తున్నారా? ప్రభుత్వం ముందే ఊహించలేకపోయింది అన్న కారణమయినా, ప్రభుత్వం కన్నుగప్పి వ్యాపారులు ప్రక్క రాష్ట్రాలకు, ప్రక్కదేశాలకు దొంగచాటుగా తరలించగలుగుతున్నారంటే ప్రభుత్వం విఫలమయ్యింది అనాలి. అడ్మినిస్ట్రేషన్ ఫెయ్యీలర్ ని ఒప్పుకోవాలి? లేదా తము ప్రజలను దోచుకోవాడానికే ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యామని ఒప్పుకోవాలి? రెండోది ఎలాగూ ఒప్పుకోరు. అటువంటప్పుడు మొదటి కారణమయిన అడ్మినిస్ట్రేషన్ ఫెయ్యీర్ ని ఒప్పుకోవాలి. వ్యాపారులకి ప్రభుత్వం అంటే లెక్కలేదని ఒప్పుకోవాలి.

ఇదంతా చూస్తుంటే ఓపోలిక గుర్తొస్తుంది –

కార్పోరేట్ కాలేజీలలో, బయటికి, తల్లిదండ్రులకి తాము లెక్చరర్లకి ఏడాదికి పదుల లక్షలు చెల్లిస్తున్నామని ’బుస్’లు కొట్టినా, లోపల ఏ లెక్చరర్ అయినా తన సామర్ధ్యం మీద నమ్మకంతో ’మా టీచింగ్ అవసరం మీకుంది’ అన్నట్లు ప్రవర్తించాడనుకొండి. వెంటనే కాలేజీ యాజమాన్యం – ‘ఓస్! మహా నువ్వు చెప్పినందుకు, ర్యాంకులు వస్తున్నాయేంటి? మా దారులు మాకున్నాయి లే!’ అన్న డీల్ చూపిస్తుంది.

సరిగ్గా అలాగే ఇప్పటి ప్రభుత్వాలు జనాలని ’ఓస్! మేం మీకు చేసిన సేవలు చూసి మీరు ఓట్లేస్తే మేం గెలుస్తున్నామేంటి? EVM టాంపరింగ్ లాంటి మా దారులు మాకున్నాయమ్మా!’ అన్న డీల్ చూపిస్తోంది.

కాబట్టే నిశ్చలంగా ధరలు పెంచుకుంటూ పోతుంది. లెక్కల మాయలనే ప్రణవనాదాలుగా మారుమోగిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ మాట నిజాయితీగా ఒప్పుకోవాలి. ప్రజల సహన శక్తి గొప్పది అనాల్సిందే నిజంగా జనాల ఓర్పు, సహనాలకి జోహరులు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

naku ee black background meeda white letters chadavadam kashtamga umdi :-(

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
కరెక్ట్ గా చెప్పారు.
కానీ విచిత్రమేమంటే,అసలు ఆవు ,దూడ రెండూ గట్టునే ఉన్నాయని ,చేను సురక్షితంగానే ఉందని మన అభినవ పోప్‍ వైయస్సార్ గారు చెపుతుంటే మనం నిజమే కదా అనుకోవటం

గత ఐదేళ్ళలో తరతరాలకు సరిపడా ఆస్తులు ఇప్పటికే పోగేశారు. ఇప్పుడైనా సుపరిపాలన సాగిస్తే బాగుండు. గొర్రె కసాయిని నమ్మినా కసాయి మనసు మారదు కదా?

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu