సంక్రాంతి సంబరాలతోపాటుగా చదువు కునేందుకు ఓ చిన్న కథ!

అనగా అనగా…

ఓ రాజు గారుండే వాడు. అతడికి చిత్ర విచిత్రమైన ఆలోచనలొస్తుండేవి. దానికి తోడు తన కొచ్చేవన్నీ బహు గొప్ప ఆలోచనలని ఆయన గారికి మహా దొడ్డ విశ్వాసం.

ఓ రోజు రాజా వారు వ్యాహ్యాళికి వెళ్ళారు. రధం మీద ఝామ్మని పోతూ ఉంటే, దారిలో ఆయనకి చాలామంది ముసలి వాళ్ళు తారస పడ్డారు. కొందరు మనుమలతో ఆడుకుంటుంటే, ఇంకొందరు తీరిగ్గా కూర్చొని కబుర్లాడు కుంటున్నారు. మొత్తంగా ముసలి వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూనో, మరేదో కాలక్షేపం చేస్తూనో కనిపించారే తప్ప, కుర్రకారు యువతీ యువకుల్లా ఒళ్ళొంచి బరువు పనులు చేస్తూ ఎవరూ కనిపించలేదు.

ఠక్కున… రాజు గారికి ‘తన రాజ్యంలో ముసలి వాళ్ళంతా వృధా’ అనిపించింది. తిండి దండగ యవ్వారమే అనిపించింది. దాంతో ‘యువతరం తప్ప వయస్సు మళ్ళిన జనం తన రాజ్యంలో ఉండరాదని’ శాసనం చేసేసాడు.

‘తన రాజ్యంలోని ప్రజలంతా వయస్సు మళ్ళిన తమ తల్లిదండ్రుల్ని రాజ్యం అవతల కొండల్లోని అడవుల్లో విడిచి పెట్టి రావాల్సింది’గా దండోరా వేయించాడు.

ప్రజలు నివ్వెర పోయారు. తమ ఇంటిలోని పెద్ద వాళ్ళని అడవుల్లో వదిలేస్తే… ఆకలి దప్పలకి అల్లాడి, అడవి జంతువుల వాతబడి, ఎండా వానలకి తట్టుకోలేక మృతి చెందడం ఖాయం.

అలాగని ఇంట్లో పెట్టుకుంటే రాజు గారు తమ తలలనీ, తమ పెద్దల తలలనీ తీయించడమూ ఖాయమే! అలాగని చాటింపు వేసారయ్యె! ఏం చెయ్యాలి? కొందరు తమ పెద్దల్ని ప్రక్క రాజ్యంలోని చుట్టాలింటికి పంపారు. ప్రక్క రాజ్యాల్లో చుట్టాల్లేని వాళ్ళల్లో కొందరు తామే ఊరొదిలి పోయారు.

ఈ వలసలు చూసి ప్రక్క రాజ్యాల రాజులు జాగ్రత్త పడ్డారు. దాంతో ప్రజలు చేసేది లేక, పెద్దల్ని అడవుల్లో వదిలి, ఏడ్చుకుంటూ, లోలోపల రాజు గారిని తిట్టుకుంటూ గడప సాగారు.

ఆ రాజ్యంలో ఓ ముసలామె ఉండేది. ఆమెకి ముగ్గురు కొడుకులు. కొడుకులకి తల్లంటే ప్రాణం. ముసలామెకి కొడుకులంటే తగని ప్రేమ. రాజు గారి శాసనం వీళ్ళకి కొరడా దెబ్బలా తాకింది. ఓ నాటి అమావాస్యకి అవ్వకి అరవై ఏళ్ళు నిండాయి. రాజు గారి చట్టం ప్రకారం, అరవై నిండితే అడవుల్లో ఉండాల్సిందే!

అది కొడుకులకి సుతరామూ ఇష్టం లేదు. కానీ చుట్టుప్రక్కల వాళ్ళెవరైనా రాజభటులకి సమాచారం అందిస్తే ముప్ప తప్పదు. అంచేత, ఏడుపు బిగబట్టుకుని, తల్లిని తీసుకుని రాజ్యానికావల ఉన్న కొండపైకి ఎక్కారు. కొండ కొసన, చిక్కని అడవికి చేరాక, తల్లిని విడిచి పెట్టి రాలేక వెక్కి వెక్కి ఏడ్చారు.

తల్లి కొడుకుల్ని ఓదార్చి సుద్దులు చెప్పింది. జాగ్రత్తగా మసలుకొమ్మంది. ఏడవకుండా పోయి రమ్మంది. వదల్లేక వదల్లేక తల్లిని వదలి, ఇంటి ముఖం పట్టారు కొడుకులు. చిక్కని అడవిలో తాము వచ్చిన దారేదో అర్ధం గాక బిక్కముఖం వేసారు.

కొడుకుల్ని చూసి అమ్మ నవ్వింది.

“వెర్రినాగన్నల్లారా! దారి కనుక్కోలేరని, వచ్చేదారిలో తుంగ మొక్కల కొసళ్ళు తెంపుకుంటూ వచ్చాను. ఆ గుర్తు పట్టుకుని ఇల్లు చేరండి” అంది.

కొడుకులు కళ్ళు తుడుచుకుని చుట్టూ పరికించారు. ఏపుగా పెరిగిన తుంగ మొక్కల కొసళ్ళు తెంపి ఉన్నాయి. ఆ దారి బట్టుకు ఇల్లు చేరారు. ఇల్లు చేరింది మొదలు ముద్ద దిగలేదు. ఏ పని చేస్తున్నా తల్లి గుర్తొస్తోంది. అమ్మ లేకుండా బ్రతక లేమని పించింది.

ఓ వారం గడిచే సరికి…

‘ఎవరికీ తెలీకుండా తల్లిని తెచ్చుకుని ఇంటి లోపలే ఉంచుకొని సాకుదాం!’ అనుకున్నారు. గుట్టు చప్పుడు గాకుండా కొండ దాపు చేరారు. తల్లిని ఎక్కడ వదిలి వచ్చారో! ఎలా ఉందో? ఆనవాలెలా పట్టడం?

పరికించి చూస్తే కొండ వాలు వెంట ఆవ మొక్కలు మొలిచి ఉన్నాయి. అన్నీ ఒకేసారి మొలిచినట్లు, కొండపై దాకా…వాలుదారి వెంట… వంకర్లు తిరిగి… ఒకే ఎత్తులో ఉన్నాయి. ‘ఇది అమ్మ ఉపాయమే’ అనుకొని, ఆనందంగా ఆవ మొక్కల ఆనవాలు పట్టుకుని కొండ ఎక్కారు.

పైకెక్కి చూస్తే అమ్మే…ఎండాకులు పోగేసి మంటేసుకుని, అందులో దుంపలేరుకుని తంపట వేసుకుని తింటూ, కాలం వెళ్ళ బుచ్చుతోంది. కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వింది. చిరు వెన్నెలలో ఆ నవ్వు, కొడుకులకి కొండంత అండగా అనిపించింది.

“అమ్మా! నువ్వు లేకపోతే బతకలేం. ఇంటికి పోదాం”అన్నారు కొడుకులు.

“నాకు తెలుసర్రా! అందుకే, మీరు నన్ను తీసుకు వచ్చేటప్పుడు, కొంగులో ఆవాలు మూటగట్టుకు వచ్చి, ఓ చేత్తో దారంట జార విడుస్తూ వచ్చాను” అంది అమ్మ.

అదే దారిలో ఇంటికొచ్చేసారు తల్లీ కొడుకులు.

అది మొదలు, అమ్మని బయటికి కనబడి నీయకుండా ఇంట్లోనే ఉంచి, బ్రతక సాగారు కొడుకులు. ఎవ్వరికీ అనుమానం రాలేదు.

ఇలా ఉండగా ఓ సారి…

రాజు గారికి కొన్ని చిత్రమైన ఆలోచనలు తోచాయి. ఆ ప్రకారం…`రాజు గారు చెప్పే పనులు చేసిన వారికి, మంచి బహుమానం ఇస్తారని’ చాటింపు వేయబడింది. ఎవరు వెళ్ళినా బహుమతి గెలుచుకోలేక పోయారు.

ఓ రోజు ముగ్గురు కొడుకులూ రాజు గారి సభకి వెళ్ళారు.

రాజు గారు…శంఖంలోంచి దారం గుచ్చాలనీ, భస్మంతో తాడు చెయ్యాలనీ చెప్పారు. కొడుకులు ముగ్గురూ మర్నాటికి గడువు అడిగి ఇంటికి వచ్చారు.

మరునాటి సభకి బోలేడుమంది, వింత చూడ్డానికి ఎగబడి వచ్చారు. రాజు గారు కుతుహలంగా చూస్తున్నారు.

అవ్వకొడుకులు, రాజు గారిచ్చిన శంఖాన్ని తీసుకుని, దానికి లోపల సన్నగా బెల్లం పాకం పూసారు. ఓ దారం తీసుకుని, ఓ చీమకి దాన్ని కట్టారు. శంఖం ఈ వైపున చీమని వదిలి, రెండో వైపున ఓ చిన్న బెల్లం ముక్కని ఉంచారు. చీమ బెల్లం వాసనకి, శంఖం లోంచి దూరి, ఈ వైపు నుండి ఆ వైపుకి వచ్చింది.

ఇంకేముంది? శంఖం లోంచి దారం దూరి పోయింది.

ప్రజలంతా చప్పట్లు కొట్టేసి ఆనందపడ్డారు. రాజు గారూ అబ్బురపడ్డారు.

రెండో పనిగా… అవ్వ కొడుకులు, ఓ పలక తీసుకుని, దానిపైన తాడుని ఉంచారు. దాని కొసకి నిప్పంటించారు. కాసేపటికి తాడు మండి బూడిదయ్యింది. చిత్రం! ఆ బూడిద, తాడు ఆకారంలోనే మెలికలు తిరిగి ఉంది.

అదే బూడిద తాడు! రాజు గారు చప్పట్లు కొట్టారు. ప్రజలు కేరింతలు కొట్టారు.

రాజు గారు మెచ్చేసుకుని, అవ్వ కొడుకులకి బహుమానం ఇవ్వబోయారు.

కొడుకులన్నారు కదా… “మహారాజా! ఈ తెలివి మాది కాదు. మా అమ్మది! ఈ బహుమానం మాకొద్దు. మీరామెని మా ఇంట్లో ఉండనిస్తే, అదే మాకు పెద్ద బహుమతి!” అన్నారు.

రాజు గారికి ఆశ్చర్యం వేసింది. ప్రజలంతా కూడా “అవును మహారాజా! పెద్ద వాళ్ళకి జీవితానుభవం ఉంటుంది. వాళ్ళు తిండి దండగ మనుషులు కాదు. వాళ్ళ తెలివీ, అనుభవంతో యువజనానికి సలహాలిస్తారు. అంచేత మా పెద్ద వాళ్ళని మాతో ఉండనీయండి. రేపు మీరు పెద్ద వాళ్ళయితే, యువరాజు గారు మిమ్మల్ని విడిచి ఉండాలి. మీరు యువరాజుని విడిచి ఉండగలరా! అంచేత పెద్దవాళ్ళని ఇళ్ళకి పిలిపించండి” అన్నారు.

రాజు గారికి ‘తనవి చిత్ర విచిత్రమైన ఆలోచనలు కాదు, వాటిల్లో కొన్ని తలతిక్క ఆలోచనలనీ’ అర్ధమయ్యింది. దాంతో తన శాసనాన్ని రద్దు చేసేసాడు.

ప్రజలంతా అడవుల్లో వది లేసిన తమ పెద్ద వాళ్ళని ఇళ్ళకి తెచ్చుకుని పండగ చేసుకున్నారు. రాజు గారు అవ్వనీ, ఆమె కొడుకుల్నీ మెచ్చుకుని బోలెడు బహుమాన లిచ్చాడు.

అప్పటి నుండీ అందరూ హాయిగా ఉన్నారు.

ఇదండీ కథ!

ఇది పాత చందమామలో చదివిన జపాన్ జానపద కథ. ఇందులో రాజు గారు మూడు పనులు చెబుతారు. నాకు రెండే గుర్తున్నాయి. ఎవరికైనా మూడోది గుర్తొస్తే కథని కొనసాగించగలరు!

"ఈ భోగి పండగ భోగభాగ్యాలనీ…
సంక్రాంతి సంబరాలనీ…
కనుమ పండుగ కమ్మని అనుభూతుల్నీ…
మొత్తంగా ఈ ఉత్తరాయణం మీ అందరికీ ఉత్తమోత్తమ జీవితాన్ని అందించాలనీ కోరుతూ,
అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు!"

1 comments:

SR Rao గారు:మీకు, మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. అమ్మఒడి బ్లాగులో వ్యాఖ్యలు ఎందుకు ప్రచురింపబడటం లేదో నాకూ అర్ధం కావటం లేదండి! దృష్టికి తెచ్చినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu