గత టపాలో చెప్పినట్లుగా గ్రామీణుల జీవితాల్లో తత్త్వాలు, పనితో పాటు పాటలూ ఉండేవి. జీవితాలని గాడి తప్ప నివ్వకుండా, క్రమశిక్షణని గుర్తు చేస్తూ, పదార్ధం వెంట పరుగుని నియంత్రించేవి.

అంతేగాక, గ్రామాలలో రైతుల జీవితాలు ఎప్పుడూ క్రియాశీలతతో, సందడితో, పండుగలతో ముడిపడి ఉండేవి. పసితనం నుండీ రైతు కుటుంబాల్లో పిల్లలు, వ్యవసాయపు పనులని పరిశీలిస్తూ, పని నేర్చుకుంటూ పెరిగేవాళ్ళు. పొలాల్లో శ్రమించే సత్తువ కోల్పోయి, ఇంట్లో విశ్రాంతి తీసుకునే తాతల దగ్గర, వాళ్ళు తాళ్ళు పేనే పని చేస్తుండగా, ఆ పనిని పరిశీలిస్తూ, దాని గురించి ప్రశ్న లేసి విసిగిస్తూ… తాతయ్యలు చెప్పే కథలూ కబుర్లూ వినటం… ఆ పిల్లలకి పరిపాటి. వాళ్ళ చదువంతా కలిపి ‘పెద్ద బాలశిక్ష’ మాత్రమే! (నిజానికి ఆ పేరుతో, వారి చదువుల అంశాలన్నీ, తర్వాత పుస్తకంగా సంకలించ బడ్డాయి.)

అందులో వాళ్ళు వ్రాయటం, చదవటం, చిన్నపాటి లెక్కలు వేయటం నేరుస్తారు. బద్దింపు విధానంలో కూడికలు, తీసివేతలూ, హెచ్చింపులూ, భాగింపులే గాక, వడ్డీ లెక్కలూ, నిష్పత్తుల లెక్కలూ, అనుపాతాలూ నేరుస్తారు. సగటు కట్టడాలూ, శాతాలూ లెక్కించడాలూ అర్ధం చేసుకుంటారు. అంతే! డిఫరెన్షియల్స్, ఇంటెగ్రల్స్ అంటూ కాలిక్యులస్ లూ, ట్రిగనోమెట్రీలు వాళ్ళకి అవసరం లేదు.

రేఖాగణితంతో కొద్దిపాటి పరిచయం, వాళ్ళకి ఆకృతులని గుర్తించే నేర్పు వచ్చేలా చేస్తుంది. పరిసరాల విజ్ఞానం, భౌగోళిక గుర్తింపులూ తెలుస్తాయి. పంచాంగపు లెక్కలు తెలుస్తాయి. ఋతువులూ, సంవత్సరాల పేర్లూ, రాశీఫలాలు గట్రా గురించి, కొంత అవగాహన కలుగుతుంది. జీవశాస్త్రం, వృక్షశాస్త్రం అంటూ మనం సవాలక్ష పేర్లతో నేర్చుకునే బాదరబందీ ఏదీ లేకుండా, వాళ్ళ వృత్తికి తగినంత పరిజ్ఞానం తెలుసుకునేవాళ్ళు.

అది నేటి సైన్స్ అంత అధునాతనమైనదీ, విస్తారమైనదీ, సాంకేతికమైనదీ గాకపోయినా, ఖచ్చితంగా ఇంగిత జ్ఞానంతో కూడినది. మార్కుల కుంభకోణాలు, ర్యాంకుల కుంభకోణాలు లేనిది.

చివరిగా పెద్దబాలశిక్షలో ఉండే చిన్న కథలతో… ఇరుగుపొరుగు సంబంధాలు, నీతి విషయాలు, ఇతరులతో మెలిగే వ్యవహారశైలి, రాజు, గ్రామ పెద్ద, కరణాలు గట్రాల పరిపాలనా విధానం గురించి, పరిచయం కలుగుతుంది. దాంతో వాళ్ళ ప్రాధమిక విద్య పూర్తయినట్లే!

అయిదేళ్ళ దాక అమ్మానాన్నల వెనక, అవ్వాతాతల ఒడుల్లో, మాటలూ పాటలూ నేర్పిన పిల్లలు, తోటి పిల్లలతో ఆడుకుంటూ, ఇంటి పరిసరాల్లో పశుపక్ష్యాదుల్ని పరిశీలిస్తూ, ప్రాధమిక జ్ఞానాన్ని ఒంట బట్టించుకునే వాళ్ళు. అంతేగానీ, ఇప్పటి పిల్లల లాగా father’s father is a grand father అని బట్టి పట్టే వాళ్ళు కాదు.

అయిదేళ్ళు వచ్చి అక్షరాభ్యాసమనే కార్యక్రమం పూర్తయ్యేదాకా, వ్రాత పనిముట్లు (బలపం, పెన్సిలూ, పెన్ను గట్రాలు) ముట్టుకోనక్కర లేదు. ఇక బండెడు పుస్తకాల బరువూ, హోంవర్కుల వత్తిళ్ళూ ఎక్కడ? అయిదేళ్ళ వయస్సు వరకూ, హాయిగా, స్వేచ్ఛగా, పెద్దవాళ్ళ వాత్సల్యాన్ని ఆనందిస్తూ ‘బడుద్దాయ్’ల్లా తిరిగేసే వాళ్ళు. తర్వాతే ‘పెద్దబాల’ శిక్ష కూడా!

పిల్లల సామర్ధ్యం, ఆసక్తి, ధారణ శక్తిని బట్టి, పెద్ద బాలశిక్ష లేదా తత్సమాన చదువుని వాళ్ళు, రెండు నుండి మూడేళ్ళ కాలంలో పూర్తి చేసేవాళ్ళు. కొందరికది అయిదేళ్ళు పట్టటం కూడా అసాధారణం కాదు.

ఇక అప్పుడు వాళ్ళ విద్య, ఇతిహాసాల వైపుకీ, నీతి శాస్త్రాల వైపుకీ మళ్ళుతుంది. ఇతిహాసాల నుండి కథల పూర్వకంగా పిల్లలు… ఒక దృక్పధాన్నీ, తాత్త్విక దృష్టినీ, నీతిపరమైన హద్దుల్నీ నేర్చుకునేవాళ్ళు. కొన్ని శ్లోకాలని, పద్యాలని బట్టి వేయించటం ద్వారా… వాళ్ళ జ్ఞాపకశక్తినీ, ధారణ శక్తినీ పెంచటం ఉండేది. నీతి శాస్త్ర పద్యాలూ నేర్పేవాళ్ళు.

అప్పటికి సగం చెక్కిన శిల్పంలా మలచబడిన పిల్లలు… మెల్లిగా ఒక వ్యక్తిత్వాన్ని, తమదైన మేధస్సునీ, వ్యవహారశైలినీ, దృక్పధాన్ని అలవరుచుకుంటారు.

ఇదంతా పూర్వయ్యేటప్పటికి పిల్లలు, 10 నుండి 12 ఏళ్ళు సంతరించుకుంటారు. ఇక అప్పుడు పిల్లల ఆసక్తి, నైపుణ్యం, సామర్ధ్యాలని బట్టి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి, పిల్లలు, పై చదువులకి అంటే ప్రత్యేకమైన విద్యల నార్జించేందుకు పంపబడే వాళ్ళు.

ఉదాహరణకి పిల్లవాడికి సంగీతమంటే ఆసక్తి ఉంటే, తల్లిదండ్రులందుకు సమ్మతిస్తే, ఆ పిల్లవాడి కోసం గురువు అన్వేషింపబడేవాడు. సంగీతం నేర్పగల గురువు కోసమన్న మాట. తగిన గురువును వెతుక్కొని, అభ్యర్ధించుకొని, గురువుని ఆశ్రయించి, సేవలతో, వినయ విధేయలతో గురువుని ‘ఇంప్రెస్’ చేసుకుని, విద్య నేర్చుకునే వాళ్ళు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, స్థోమతని బట్టి, గురువు ఆనతిని బట్టి, గురుదక్షిణ సమర్పించుకునే వాళ్ళు.

సాహిత్యం, తర్కం, గణితం, ఖగోళ జ్యోతిష్యాది శాస్త్రాలు, చిత్రలేఖనం, శిల్పం ఇత్యాది కళల విషయంలోనూ ఇంతే! వ్యాపారం, వైద్యం, వంటి ఇతర సేవలు (ఆయుర్వేదం వంటివి) కూడా ఇదే విధంగా కొనసాగేవి.

ఇది సమాజంలో ఎంత బలంగా వేళ్ళూనుకు పోయిన సంస్కృతి అంటే –

నా చిన్నప్పుడు మా నాన్న దగ్గర ‘ఆటోమొబైల్ ఎలక్ట్రిషియన్’ పని నేర్చుకునేందుకు పది పన్నెండేళ్ళ పిల్లలు వచ్చి చేరేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. తిండి తిప్పలు సమకూర్చి, మా నాన్న వాళ్ళకి పనినేర్పే వాళ్ళు. వాళ్ళలో చిన్న వాళ్ళు మమ్మల్ని ‘అక్కా’ అని పిలిస్తే, పెద్ద వాళ్ళని మేం ‘అన్నా’ అని పిలిచేవాళ్ళం.

పని కొంచెం బాగా నేర్చుకున్నాక, వాళ్ళు మా నాన్నకి పనిలో సాయం అందించేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మా నాన్న ‘బేటా’ పేరుతో, దినసరి భత్యం చెల్లించే వాళ్ళు. అదీ మా ఇంట్లోనే తింటూ, మా ఇంట్లోనే ఉండేవాళ్ళకి గాకుండా, బయట నుండి వచ్చే వాళ్ళకి!

ఈ విధంగా వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి అయిదారేళ్ళు (కొందరైతే పది పన్నెండేళ్ళ) పని నేర్చుకున్నాక, వాళ్ళు స్వంతంగా వర్క్ షాప్ తెరుచుకునేటప్పుడు, పని నేర్పిన గురువుకి ‘గురుపూజ’ నిర్వహిస్తూ, వాళ్ళ షాప్ కి పూజ, గురువు చేతే చేయించుకునేవాళ్ళు.

అలాంటి సంధర్బాలలో మా అమ్మానాన్నలకి పట్టుబట్టలూ, బంగారు నగలు (గొలుసూ, ఉంగరాల వంటివి) పెట్టి సత్కరించటం, నాకు ఊహ వచ్చాక కూడా తెలుసు. అదే గురుదక్షిణ అన్నమాట!

“పిడికెడు అన్నం పెట్టి పని నేర్పు మేస్త్రీ! నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాడు!” అంటూ తమ కొడుకుల్ని మా ఇంట్లో వదిలే వాళ్ళు. ఎప్పుడూ చూసినా మా ఇంట్లో కనీసం ముగ్గురైనా ఇలాంటి కుర్రాళ్ళు ఉండేవాళ్ళు!

అంత బలమైన ముద్ర గలది గురుకుల వ్యవస్థ. ఇప్పుడు అది పూర్తిగా మారి పోయిందనుకొండి, అది వేరే విషయం!

ఇక ఈ విధంగా ఏ ఇతర కళ లేదా శాస్త్రాల మీదా అధ్యయనాసక్తి, అభ్యాసనాసక్తి లేని పిల్లలు, లేదా ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల ప్రోత్సహించని పిల్లలు, తమ వారసత్వ విద్యని వృత్తినీ చేపట్టే వాళ్ళు.

సహజంగానే అది వారి వారసత్వపు విద్య అయ్యేది. అంటే కుల వృత్తి మాదిరిగా నన్న మాట. వారి తల్లిదండ్రుల వృత్తినే వాళ్ళూ స్వీకరించటం జరిగేది. రైతు కొడుకు రైతు గానూ, కుమ్మరి కొడుకు కుమ్మరి గానూ, వడ్రంగి కొడుకు వడ్రంగి గానూ!

నిజానికి జన్మతః లేదా, కులాన్ని బట్టి, వృత్తి అవలంభించటం అనేది, క్రమంగా సంభవించిన పరిణామం. అన్నివృత్తులూ వాటి వాటి పాత్రతని బట్టి సమాదరించబడిన నాడు, వైషమ్యాలు అంత ఎక్కువగా సమాజంలో పెచ్చరిల్లని నాడు, అహంకారం, కుంచిత ధోరణి వంటి మానసిక వికారాలు సమాజంలో పెచ్చరిల్లని నాడు, అదంతా చాలా మామూలుగా జరిగి పోగలిగేది. ‘అగ్రవర్ణం, అగ్రకుల వృత్తి, నిమ్న కులం, నిమ్న కులవృత్తి’ అనే అంతరాలు ఏర్పడిన నాడు, ఘర్షణ నెలకొనటం సహజమే కదా!?

గతంలో అంతా మంచే అని కాదు గానీ, అప్పటి సామాజిక వ్యవహార శైలినీ, జీవన వ్యవస్థనీ ఏ విధంగా కాలుష్య పరిచారో… అదే, కుట్ర తీరు! దానిని వివరించే ప్రయత్నమే ఇది!

ఇప్పుడు నటుల సంతతి నటనా వృత్తి చేపడుతున్నారు. కార్పోరేట్ కంపెనీల అధినేతల సంతానం, తండ్రుల కుర్చీలని వారసత్వంగా అందుకుంటున్నారు. రాజకీయ నాయకుల కెరీర్ ని, కొడుకులూ కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళతో సహా బంధువులంతా, అంది పుచ్చుకుంటున్నారు. దాని గురించి… ఇప్పుడు, ఏ మీడియా, ఏ అధునాతన రచయితలూ/రచయిత్రులూ, అభ్యుదయ వాదులూ, మాట్లాడటం లేదు గానీ… ఒకప్పుడు చాకలి కొడుకు చాకలే కావాలా? మంగలి కొడుకు మంగలే కావాలా? అంటూ… BC లనీ SC లనీ ST లనీ వర్గ విభజనలు చేసి మరీ, చిచ్చు పెట్టారు. [ఆ చిచ్చు నేటికీ కొనసాగటం చూస్తూనే ఉన్నాం కదా!] కుల వృత్తులతో కూడిన ప్రాచీన హైందవ సమాజమంత భ్రష్ఠమైనది మరొకటి లేదని ఎలుగెత్తి అరిచారు. అదలా ఉంచి మళ్ళీ వ్యవసాయ రంగం దగ్గరికి వస్తే…

ఈ వారసత్వ విద్యలనీ, వృత్తులనీ వాళ్ళు తమ తల్లిదండ్రుల నుండీ, అవ్వాతాతల నుండీ, ఇతర పెద్దల నుండీ అభ్యసించేవాళ్ళు. అయితే అబ్బాయిలే ఎక్కువగా, ఈ వృత్తి విద్యలని అభ్యసించే వాళ్ళు. అదే విధంగా ‘అక్షరాస్యత’ అంటే ‘పెద్ద బాలశిక్ష’ణ కూడా, పూర్తిగా అబ్బాయిలకే అందుబాటులో ఉండేది. అమ్మాయిలది దాదాపుగా మౌఖిక విద్యే! కొంతమంది అమ్మాయిలకు ఈ ప్రాధమిక విద్య అందినా తర్వాత అమ్మాయిలందరూ ఇంటిని నిర్వహించటమే నేర్చుకునేవాళ్ళు.

ఈ పాత పద్ధతుల్లోని అన్ని ప్రతికూలతలని పరిహరించి, సానుకూలతలని మాత్రమే గ్రహించి,

అదే విధంగా మన ఇప్పటి పద్దతుల్లోని ప్రతికూలతలని తొలగించి, సానుకూలతలని గ్రహించి,

అన్నిటినీ మేళవించి, ఇప్పటి పరిస్థితులకీ, అవసరాలకీ అనుగుణంగా మెరుగు పరచి… మన పిల్లల విద్యా వ్యవస్థని నిర్మించుకుంటే… అది ఎంత హాయిగా, ఎంత వత్తిడి రహితంగా ఉంటుందో కదా!?

ఇక ఈ వృత్తి విద్యల్లో… రైతు కుటుంబాల విషయాని కొస్తే…ఒక రైతు కుమారుడు, తన ప్రాధమిక విద్యాభ్యాసం ముగించాక, (ముగించక పోయినా సరే) వారికి పదిహేనేళ్ళ వయస్సుండగా… మేనమామ పంచెలుపెడతాడు. దాంతో వారి వృత్తి జీవితపు పండుగ ప్రారంభమౌతుంది.

ఏ వృత్తి అవలంబించే వారికైనా, మేనమామ పంచెలు పెట్టాడంటే, వాళ్ళిక పెద్ద వాళ్ళయ్యారనీ, బాధ్యతాయుత జీవితంలోకి అడుగుపెట్టారనీ అర్ధం! బాల్యం అయిపోయిందనీ, బాల్య చేష్టలిక తగ్గించుకోవాలనే హెచ్చరిక, ఆ పండుగ జరిపే ఆచారంలో ఉంటుంది. ఇదే పోలిక, 11 ఏళ్ళ వయస్సుకి ఆడపిల్లకి మేనమామ ఓణీలివ్వడంలోనూ ఉంటుంది.

ఇక తొలిసారి నాగలి పట్టించే రోజున కూడా పండుగ చేస్తారు. పిల్లవాడి చేత నాగలికీ, ఇతర వ్యవసాయ పనిముట్లకీ, ఎద్దులకీ పూజ చేయిస్తారు. పిల్లవాడి తలపై అక్షతలు జల్లి పెద్దలంతా దీవిస్తారు. అదే ఆడపిల్ల అయితే, తొలిసారి కవ్వం పట్టించే రోజున ఇలాగే చేస్తారు.

మా చెల్లెళ్ళకు చెయ్యలేదు గానీ, నాకైతే…కవ్వం పట్టించే రోజున, మా ఇంట్లో అమ్మ దేవుడికి పొంగలి నా చేత వండించి నైవేద్యం పెట్టించింది. గుంజకి కట్టిన పెద్ద కవ్వానికి, క్రిందా పైనా తాడుతో కట్టి, నాన్న నాకు కవ్వాన్ని ‘హాండిల్’ చెయ్యటం నేర్పారు. సినిమాల్లో చూపిస్తారు చూడండి, అలాంటి నిలువెత్తు పెద్ద కవ్వం మా ఇంట్లో ఉండేది. ఆవులూ గేదెలూ ఉండటంతో, పాలూ మా ఇంట్లో సమృద్దిగా ఉండేవి.

ఆ నిలువెత్తు కవ్వం మీద మోజు కొద్దీ, కొన్ని రోజులపాటు జడగంటలు పెట్టుకుని ముస్తాబై, ఆపైన పెరుగు చిలికేదాన్ని. (ఆ తర్వాత టైమ్ లేదంటూ కాలేజీకి పరిగెడితే, చివరికి నాన్న టేబుల్ ఫ్యాన్ కి రెక్కలు తీసేసి, చిన్ని కవ్వం తగిలించి, స్టాండు ని భూమికి లంబంగా గాకుండా సమాంతరంగా రాడ్డుకి బిగించి, మజ్జిగ మెషిన్ తయారు చేసారు. దానితో అమ్మ వెన్న తీసేది.)

ఆ విధంగా మగపిల్లల చేత నాగలి, ఆడపిల్లల చేత చల్లకవ్వం పట్టించిన రోజున, పాలు పొంగించి పొంగలి చేయటం, పూజలు చేయటం, పండుగ జరపటంలో… పాడి పంటలు తమ ఇంట పొంగి పొర్లాలనే ఆకాంక్ష ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

Nice post.

కామెంట్ రాయలేక పోతున్నా, రోజూ గూగుల్ రీడర్ ద్వారా మీ బ్లాగు ను ఫాలో అవుతున్నాను. బాగా రాసారు.

Rajiv Malhotra

Rajiv Malhotra is a public intellectual on current affairs, world religions and cross-cultural encounters between East and West. His career has spanned the corporate world as a senior executive, strategic consultant and successful entrepreneur in the information technology and media industries. His Infinity Foundation, seeks to foster a better global understanding of Indian civilization. Rajiv's work argues that the dharma offers a complex and open framework for a genuine dialogue among diverse peoples, rather then a zero sum game. He shows the limitations of globalization when it is a parochial imposition of Western paradigms. He is well known as a speaker and writer for a wide audience and is frequently interviewed and invited to deliver keynote addresses. He serves on the Board of Governors of the India Studies program at the University of Massachusetts, and served as a Chairman for the Asian Studies Education Committee of the State of New Jersey.

శ్రీవాసుకి గారు: నెనర్లండి.

మనోహర్ :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu