ఈ మధ్య కాలంలో నేను చదివిన కథలన్నిటిలో నాకు బాగా నచ్చిన కథ, కె.ఎ.ముని సురేష్ పిళ్ళె వ్రాసిన ‘ఈగ’. అక్టోబరు 31, 2010 సాక్షి ఆదివారపు సంచిక ‘ఫన్ డే’ లో ప్రచురితమైన కథ! అది రచయిత అసలు పేరో కాదో తెలియదు గానీ, ‘ఈగ’ అనే కథ పేరు మాత్రం దానికి ఎంతో తగి ఉన్న పేరు.

ఆ కథని ఓ సారి పరిశీలించాలంటే ఇక్కడ నొక్కండి.

‘ఈగ’ కథలో…

నికార్సయిన నిగ్గరు హేరిస్!

పసి వయస్సులో ఉండగా… అతడి మనస్సులో చెరగని ముద్ర చేసిన ఈగ బ్రతుకు, అతడి బ్రతుకు లాంటిదే!

తెల్లతోలున్న యజమాని జిమ్.

తన కొడుకు జార్జి గుర్రం ఆట ఆడుకునేందుకు కొన్న పసి బానిస హేరిస్.

జిమ్ కొడుకు జార్జి ‘అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ లాంటి వాడు.

బానిసలతో సహా తన సంపదని ప్రదర్శించుకునే జిమ్ కి కొడుకు, బానిసలని ఫ్యాక్టరీ పనికి పంపి భత్యం వసూలు చేసుకునే జార్జి!
హేరిస్ వేలంపాట నిర్వహించేవాడు తండ్రి.

వాడి పనితనాన్ని నిధిని దాచుకున్నట్లు దాచుకునేవాడు కొడుకు.

ఏ దేశంలోనైనా, బానిసలని… బానిస సంకెళ్ళల్లో వాళ్ళంతట వాళ్ళే ఉమ్మిలో ఈగల్లా పడుండేటందుకు, తరతరాలుగా, రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు.

“ప్రభువులని సేవించేందుకే బానిస జన్మలున్నది. అదే వారి జీవిత పరమార్ధం” – ఇది నయాన చేసే బ్రెయిన్ వాష్!

“అదిగో తప్పించుకో చూసిన వాడి గతేమయ్యిందో చూడు! బ్రతికుండగానే తోలు వలవబడింది. స్వేచ్ఛ కోరటమే మహాపరాధం. జాగ్రత్త సుమా” – ఇది భయాన చేసే బ్రెయిన్ వాష్!

పదే పదే… అదే ప్రచారంతో… బుర్రలోకి ఇంకి, గడ్డకట్టి, శాశ్వతంగా నిలిచిపోయే, బ్రెయిన్ వాష్!

ఆనాడే కాదు, ఈనాటికీ ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడిన హేరిస్ వంటి నిగ్గర్లు ఎల్లెడలా ఉన్నారు.
ఉమ్మిలో పడి,

అందులో అతుక్కు పోయి,

తప్పించుకునేందుకు గిలగిల లాడే కొద్దీ మరింతగా చిక్కుకు పోయి…

చచ్చే వరకూ…

చచ్చాక కూడా శవం ఎండి పోయే వరకూ… ఆ ఉమ్మిలోనే ఉండిపోయిన ‘ఈగ’ ల్లాంటి బానిసలు, ఇప్పటికీ మన చుట్టూ ఎందరో ఉన్నారు.

నాకు ఈ కథ అంతగా నచ్చడానికి, ఈగల్లాంటి బానిసలని స్వానుభవ పూర్వకంగా చూడటమూ, ఎదుర్కోవటమూ ఒక కారణం కావచ్చు.

స్వేచ్ఛ కోసం ప్రయత్నించని బానిసలు,

పోరాడే మాలాంటి వాళ్ళకి సుద్దులు చెప్పవచ్చిన బానిసలు,

జిమ్ గట్రా ప్రభువుల వంటి తమ ‘బాస్’ల తరుపున మమ్మల్ని వేధించిన బానిసలు,

మా పోరాటానికి అడ్డం వచ్చిన బానిసలు,

‘బాస్’లు తమకి పోసిన మద్యపు చుక్కలకీ, మాంసపు ముక్కలకీ, డబ్బులు లెక్కలకీ మురిసి పోయి, తమ చుట్టు ఉన్న
ఉమ్మిలాంటి బానిసత్వాన్నే స్వర్గంగా భావించిన బానిసలు,

“అంత గొప్పోళ్ళతో, డబ్బూ అధికారం ఉన్నవాళ్ళతో మీకెందుకు? తలుచుకుంటే వాళ్ళేమైనా చేయగలరు. మీ బ్రతుకు మీరు బ్రతకండి” అని మాకు హిత బోధలు చేసిన బానిసలు,

“డబ్బూ, కెరీర్ ఇస్తామంటే పడి ఉండక, ఏదో పెద్ద so & so ల్లాగా పోరాడతామంటారు. రాజీ పడటానికి ఏం తీపరమా? తలొంచుకు తప్పుకు పోతే పోయేదానికి ఎందుకు బ్రతుకు నాశనం చేసుకుంటారు?” అని మమ్మల్ని ఈసడించిన బానిసలు.

“బ్రతక చేత గాని వాళ్ళు” అని మమ్మల్ని హేళన చేసిన బానిసలు,

“గడ్డి వామి దగ్గర కుక్కలాగా ఎందుకొచ్చిన పనికిమాలిన పనులు? అవినీతితోనే అభివృద్ధి సాధ్యం అని అర్ధం చేసుకోలేని మూర్ఖులు” అని మా గురించి జాలిపడిన బానిసలు!

ఇలాంటి హేరిస్ లనీ, బానిసలనీ సూర్యాపేటలో మా ఇంటి ఓనరు భాగ్యలక్ష్మి దగ్గరి నుండి, శ్రీశైలంలో మాజీ డిఈవో కృష్ణయ్యల దాకా… వందల మందిని చూశాము.

“ఔను! మేము కాంగ్రెస్ అధిష్టానపు ఇంటి కాపలా కుక్కలం” అనే కాంగ్రెస్ కునాయకుల వంటి బానిసలని, అధిష్టానపు కాళ్ళు పట్టుకోవటానికి క్యూలు కట్టే కెరీర్ దాహపు కరుడగట్టిన బానిసలనీ… మీరూ చూస్తూనే ఉన్నారు. ఒక్క మా విషయంలోనే కాదు, బానిస సంకెళ్ళు తెంపజూసే ఎవరికైనా… అడ్డం వచ్చే బానిసలు వీళ్ళంతా!

‘ఈగ’ కథలో హేరిస్ సహబానిస జేమ్స్

>>>“జేమ్స్ కాండ్రించి ఉమ్మిన ఉమ్ము హేరిస్ ముఖం మీద పడినట్లుగా తుప్ మని చిత్రమైన చప్పుడు వచ్చింది. తుడుచుకున్నాడో… తడుముకుని అలవాటుగా ఉపేక్షించాడో…”అంటాడు రచయిత హేరిస్ గురించి.

అంతగా ముఖాన పడ్డ ఉమ్మిని కూడా ఉపేక్షించటం అలవాటయి పోయిన బానిస హేరిస్.

ఈనాటి వ్యవస్థలో, మీడియా, రాజకీయులు, కార్పోరేట్ లు, బ్యూరాక్రాట్ లూ, … జిమ్ ప్రభువుకీ, జార్జి ప్రభువుకీ ప్రతీకలైతే…

వాళ్ళు చేసిన రకరకాలు ప్రచారాల వంటి,

ప్రచారించిన రకరకాల సిద్ధాంతాల వంటి

వాళ్ళు చూపిన కెరీర్, ఇతర ప్రయోజనాల వంటి

ఉమ్మిలో పడి… బయటపడేందుకు, కనీసం కథలోని ఈగ లాగా కూడా గిలగిల్లాడని బానిసలు… మన సమాజంలో, మన దేశంలో, దేశాల కతీతంగా ప్రపంచమంతటా చాలామందే ఉన్నారు.

అలాంటి ఎంతమంది బానిసల్ని ‘ఈగ’ కథారచయిత, ముని సురేష్ పిళ్ళె, పాత్రికేయ రంగంలో చూశాడో గానీ, ‘మరణించిన పాత్రికేయుడు SM గౌస్ కు, ఇంకా మరణించని మరికొందరు మిత్రులకు’ ‘ఈగ’ కథని అంకితమిచ్చాడు.

ఈ కథ చివరి పేరాలో రచయిత వర్ణించినట్లుగా…

>>>కత్తి చేసిన దారిలోంచి ప్రభువు రక్తం నెమ్మదిగా జారి, వెచ్చగా ఉబికి వస్తున్న నిగ్గరు రక్తంతో కలిసిపోయింది. ప్రళయం రాలేదు. భూకంపం పుట్టలేదు. సృష్టి తిరగ బడలేదు. రెండూ ఒక్కటే అన్నట్లుగా కలిసిపోయాయి.

నిజమే!

బానిస సంకెళ్ళు తెంచుకుంటే… ప్రళయం రాదు,

భూకంపం రాదు.

స్వేచ్ఛ వస్తుంది.

స్వాతంత్రం వస్తుంది.

దోపిడి లేని సమాజం వస్తుంది.

ఆ ఆశని వెలిగిస్తూ… రచయిత, కథని,

“దోమల కొట్టాల్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రేగింది
కొవ్వొత్తుల దీపాలు వెలిగాయి” అని ముగించాడు.

అవును!

దీపాలు వెలగాలి.

చేతుల్లోనే కాదు,

చేతల్లో కూడా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

bagundi.

ఇంటరెస్టింగ్. రచయిత పేరు అదే, కానీ ఈ కథ నా కంటబడలేదు.
అణచబడిన వర్గాల్లో ఉన్న పరిస్థితే తమ సహజ పరిస్థితి అని నమ్మించే ప్రయోగం ఒకటి అలా ఉండగా, ఇప్పుడు మధ్యతరగతి వర్గాల్లో కూడా ఈ ధోరణి బాగా మొదలైంది. దేన్నీ ప్రశ్నించకూడదు, ప్రస్తుతం ఆవరించి ఉన్న పరిస్థితులకి భిన్నంగా ఏ ఆలోచనా చెయ్యకూడదు. చాలా విద్యాధికులం, కొత్త భావాలున్నవాళ్ళం అనుకునే వారిలోనే ఇటువంటి సంకెళ్ళ భావాలు బాగా చుట్టుకుని ఉంటున్నాయి.

kathanu chadivinchela parichayam chesaru. thanks. sakshi funday follow kavatledu. mallee vetukkovali..

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.

లక్ష్మీ గారికి నెనర్లండి!

కొత్తపాళీ గారు: నిజం చెప్పారండి. ముని సురేష్ గారు వ్రాసిన ఆ కథ ఇప్పటి పరిస్థితులకి కూడా చక్కాగా అతికినట్లుంది. నెనర్లండి!

కెక్యూబ్ గారు: అంత శ్రమ అవసరం లేదండి. కథ లింకు నేను టపాలోనే ఇచ్చాను. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu