విజయ దశమి పండుగ రోజున, విజయం కోసం వినూత్నంగా ఆలోచించాలని చెప్పే ఓ చిన్ని కథతో నా టపా ప్రారంభిస్తున్నాను.

దీని మూలకథ ఇంటర్ తొలి ఏడాది పిల్లలకి ఆంగ్ల పాఠంలో ఉంది. ఇక కథలోకి!

అనగా అనగా....

ఓ ఊళ్ళో ఓ పేదరైతు ఉండేవాడు. అతడి కొక కూతురు. చక్కని పిల్ల! ఆ ఊళ్ళో ఓ వడ్డీ వ్యపారి కూడా ఉండేవాడు. ఇతడు నడివయస్సు వాడు, అనాకారి. పైగా దుర్భద్ధి గలవాడు.

ఈ పేద రైతు ఎంతగా రెక్కలు ముక్కలు చేసుకున్నా తిండికే చాలీ చాలనట్లు గడిచేది. రైతు భార్యా, కూతురూ కూడా వ్యవసాయంలో సాయం చేసేవాళ్ళు. అయినా పరిస్థితి అంతే!

ఇలా ఉండగా... ఓసారి రైతు భార్యకి బాగా జబ్బు చేసింది. వైద్యం కోసం డబ్బు అవసరం పడి, వడ్డీ వ్యాపారి దగ్గర పదివేల రూపాయలు అప్పు చేసాడు రైతు. భార్యా జబ్బు నయమైంది గానీ, వడ్డీ కొండలా పెరిగి, పదివేలు కాస్తా ఏభైవేలై కూర్చుంది. అప్పు తీర్చగల దారీ తెన్నూ కూడా రైతుకి కాన రాలేదు. ఏం చెయ్యాలో తోచక బెంగ పడసాగాడు.

అప్పటికే... వయస్సులో ఉన్న రైతు కూతురి మీద కన్ను వేసి ఉన్న వడ్డీవ్యాపారి, రైతు మీద బాగా వత్తిడి పెంచాడు. ఓ రోజు రైతు ఇంటికి వచ్చి "అప్పు కడతావా? జైలుకి పంపించమంటావా?" అంటూ పీక మీద కూర్చున్నాడు.

రైతు కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలాడు. వడ్డీ వ్యాపారి "సరే! ఇంతగా బ్రతిమాలుతున్నావు గనుక, నీకు ఓ అవకాశం ఇస్తున్నాను. మనమంతా యేటి గట్టు మీదికి వెళ్దాం. అక్కడ చిన్న చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. నేను, నా చేతి సంచిలో ఒక తెల్ల్రరాయి, ఒక నల్ల రాయి వేస్తాను. నీ కూతుర్ని సంచిలోంచి ఒక రాయి తీయమను.

ఆమె తెల్లరాయి తీసిందో, ఆమె నన్ను పెళ్ళి చేసుకోవాలి. అంతేగాక, నేను నీ బాకీ మాఫీ చేస్తాను. ఆమె నల్లరాయి తీసిందో, ఆమె నన్ను పెళ్ళి చేసుకోనక్కర లేదు. అంతేగాక, నేనే నీకు, నీ బాకీకి రెట్టింపు సొమ్ము, అంటే లక్ష రూపాయలు ఇస్తాను. అసలామె ఈ పందానికే ఒప్పుకోకపోతే, తక్షణం నిన్ను జైలుకి పంపిస్తాను" అన్నాడు.

రైతు, అతడి భార్య కోపంతో పెదవులు కొరుక్కున్నారు. నిస్సహాయతతో గుడ్లనీరు కుక్కుకున్నారు. రైతు కూతురు నివ్వెరపోయి చూస్తోంది. చివరికి, చేసేది లేక, రైతు కుటుంబం ఈ పందానికి ఒప్పుకొంది. ఇదంతా తెలిసి చుట్టు ప్రక్కల వాళ్ళు కొందరు పోగయ్యారు. అందరూ కలిసి యేటి గట్టుకు వెళ్ళారు. అక్కడ గుండ్రని చిన్నచిన్న రాళ్ళు చాలా ఉన్నాయి.

రైతూ, అతడి భార్యా చాలా ఆందోళనతో ఉన్నారు. అందరూ గోలగోలగా మాట్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారి క్రిందికి వంగి, రెండు రాళ్ళు తీసి సంచిలో వేసాడు. రైతు కూతురు అందమైనదే కాదు, చురుకైనదీ, తెలివైనదీ కూడా!

ఎవరిగోలలో వాళ్ళుండగా, వడ్డీ వ్యాపారి, రెండు రాళ్ళూ తెల్లటివే తీసి సంచిలో వేయడాన్ని ఆ పిల్ల గమనించింది. (ఈ కుతంత్రం కడుపులో ఉంచుకునే, వడ్డీ వ్యాపారి అంత ధీమాగా పందెం కట్టాడు.)

ఇంతలోనే వడ్డీ వ్యాపారి, సంచి ఆమె చేతికిస్తూ, అందులోంచి ఒక రాయిని తియ్యమన్నాడు. దాంతో అప్పటి వరకూ ఆసక్తిగా పందెం గురించి మాట్లాడుతున్న వారంతా, మాటలాపి కుతుహలంగా చూడసాగారు.

ఇప్పుడా అమ్మాయి ఏం చెయ్యాలి?

మామూలుగా ఆలోచిస్తే... ఆ పిల్ల మూడు రకాలుగా స్పందించవచ్చు.

1]. ఆమె సంచిలోంచి రాయిని తీయటానికి నిరాకరించవచ్చు.
[కానీ అలా చేస్తే, ఆమె తండ్రిని జైలుకు పంపిస్తానని ముందే షరతు విధించాడు వడ్డీ వ్యాపారి. కాబట్టి అది ప్రమాద హేతువు.]

2]. అతడు సంచిలో రెండూ తెల్ల రాళ్ళే వేసాడని అందరికీ చెప్పి, సంచి తెరచి చూపించి, అతడి మోసాన్ని బహిర్గతం చేయవచ్చు.
[కానీ అలా చేస్తే, వడ్డీ వ్యాపారి "అరే! పొరబాటు జరిగింది. నేను ఒకటి తెల్లరాయి, మరోటి నల్ల రాయి అనుకున్నాను. రెండూ తెల్లవే తీసాను కాబోలు. ఈ సారి తెల్లదొకటీ, నల్లదొకటీ వేద్దాం! కావాలంటే మరెవ్వరైనా వెయ్యండి. అప్పుడు ఆమెని సంచిలోంచి రాయి తియ్యమందాం" అంటాడు.

ఆ విధంగా చేసినా తెల్లదో నల్లదో తీయటానికి 50% అవకాశం ఉంటుంది. రైతు కూతురు నల్ల రాయి తీసిందో బ్రతికి పోతుంది. ఖర్మగాలి తెల్ల రాయి తీసిందా, అయిపోతుంది. అదీగాక... ఈసారికి తప్పుని కప్పిపుచ్చుకున్నదే గాక, మోసం బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు, వడ్డీ వ్యాపారి మరింత జాగ్రత్త పడతాడు. మరోసారి మరింత పకడ్బందీగా పధకాలు వేస్తాడు. కాబట్టి, అదీ పాక్షికంగా ప్రమాదహేతువే.]

3]. ఎటూ వడ్డీ వ్యాపారి కుతంత్రాలని అరికట్ట లేననుకొని, సంచిలోంచి రాయి తీసేందుకు సిద్ధపడాలి. తప్పకుండా తెల్ల రాయే వస్తుంది కాబట్టి, తండ్రిని జైలు కెళ్ళకుండా కాపాడటం కోసం, తన జీవితాన్ని బలిపెట్టుకునేందుకు సిద్ధపడాలి.

[కానీ ఇలా చేయటం అంటే - తెలిసి తెలిసీ జీవితాన్ని నష్టపోవటమే!]

అయితే... ఇలా సాధారణంగా గాక, అసాధారణంగా, వినూత్నంగా ఆలోచిస్తే...?
ఆమె ఏం చేయవచ్చు?

రైతు కూతురు తెలివైన అమ్మాయి. ఆమె వడ్డీ వ్యాపారి చేతి సంచిలో చెయ్యి పెట్టి, ఒక రాయిని బయటకు తీసింది. గుప్పిలి తెరవబోతూ, కావాలని రాయిని నేల మీదకు జార్చింది. క్షణాల్లో అది నేల మీద పడి ఉన్న బోలెడు రాళ్ళల్లో కలిసి పోయింది.

రైతు కూతురు గాభారా పడుతున్నట్లుగా "అయ్యో! పొరబాటున చెయ్యి జారి, రాయి నేలపై పడిపోయింది?" అంది. అందరూ ‘ఇప్పుడెలాగా?’ అన్నట్లు చూస్తున్నారు. వడ్డీ వ్యాపారి బిత్తర పోయి చూస్తున్నాడు.

రైతు కూతురు అంతలోనే తమాయించుకున్నట్లుగా "సరే, ఏం పోయింది? ఎటూ సంచిలో ఉన్నది రెండు రాళ్ళే కదా? ఇప్పుడు సంచిలో మిగిలి ఉన్న రాయి ఏదో చూస్తే, నేను తీసింది ఏ రాయో తెలిసి పోతుంది కదా?" అంది.

అందరూ అవునన్నారు. ఆమె సంచి తెరచి, అందులోని తెల్ల రాయిని బయటకి తీసి "ఇదిగో, ఇందులో తెల్లరాయి ఉంది. అంటే నేను నల్ల రాయిని తీసానన్న మాట! కాబట్టి ఇప్పుడు నేను ఈ వడ్డీ వ్యాపారిని పెళ్ళి చేసుకోనక్కర్లేదు. అంతేగాక, ఈ వడ్డీ వ్యాపారి మా నాన్నకి లక్ష రూపాయలు ఇవ్వాలి" అంది.

వడ్డీ వ్యాపారి ఏడ్చుకుంటూ, రైతుకి లక్ష రూపాయలు చెల్లించి, మొత్తుకుంటూ ఇంటికి పోయాడు.

రైతు కుటుంబం సంతోషంగా ఇంటికి తిరిగొచ్చింది.

ఇదీ కథ!

ఈ కథలో... రైతుకుటుంబం వంటిదే, ప్రస్తుతం సమాజంలో సామాన్యుడి పరిస్థితి! ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇదే స్థితి సామాన్య పౌరులది!

ప్రభుత్వాధికారంలో ఉన్న రాజకీయ నేతలూ, ఉన్నతోద్యోగులూ, కార్పోరేటు బడా వ్యాపారులూ... ఇలా సంపన్నుల జాబితాలోకి చేరే వారిలో అత్యధికులు, కథలోని వడ్డీ వ్యాపారి వంటి వారే!

ఇప్పటి వరకూ వాళ్ళ ‘అతి’తెలివి తేటలు సాగాయి, సాగుతూనే ఉన్నాయి... సామాన్యులు కుదేలయ్యారు, అవుతూనే ఉన్నారు.

కథలోని రైతు కూతురు... సాధారణ ధోరణిలో గాకుండా వినూత్నంగా ఆలోచించింది. వడ్డీ వ్యాపారి లాంటి దొంగని, కన్నంలో అతడి చేయి ఉండగానే, తేలుతో కుట్టించింది. ఇక వాడు కిక్కురు మనలేడు. వాడి మోసాన్ని వాడి మెడకే చుట్టి, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది.

వాడి దురాశలోనే వాణ్ణి ముంచి, వాడి పాపానికి అంతకంతా కట్టించింది. ప్రస్తుతం సామాన్య ప్రజలకి కావాల్సింది, ఇలాంటి వినూత్న ఆలోచనా విధానమే!

అప్పుడు ఖచ్చితంగా...
మనం మన ధరిత్రిని, మన దేశాన్ని కాపాడుకోగలం.
భారతీయతని కాపాడుకోగలం
మానవీయతని కాపాడుకోగలం
మన జీవితాలని, మన భవిష్యత్తుని కాపాడుకోగలం
మన చిన్ని పాపల చీకూ చింతాలేని బాల్యాన్ని కాపాడుకోగలం!

అలాంటి వినూత్న ఆలోచనా విధానాన్ని, ఆ మహిషాసుర మర్ధని, మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ....

అందరికీ విజయ దశమి శుభాకాంక్షల!

6 comments:

ఆదిలక్ష్మిగారూ!మీకు,మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు!

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు!

మీకు విజయ దశమి శుభాకాంక్షలు.

దసరా శుభాకాంక్షలు .

విజయ దశమి శుభాకాంక్షలు.

-సత్యేంద్ర.

http://www.andhrabhoomi.net/sampaadakeeyam/22-edit-783

http://www.andhrabhoomi.net/sampaadakeeyam/22-edit-783

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu