ఈ విధంగా పొదుపు చేసుకున్న డబ్బుని మదుపు చేసుకోవాలనుకునే వాళ్ళని మినహాయిస్తే... షేర్ల స్వల్పకాల క్రయ విక్రయాలకు సిద్దపడే వారంతా, కంపెనీ పంచిఇచ్చే డివిడెండ్లని ఆశించి గాక ‘షేర్ల ధరలు పెరుగుతాయి, పెరిగాక అమ్ముకుని లాభాలు పొందుదాం’ అనుకుని షేర్లలో పెట్టుబడి పెడతారు.

[నిజానికి వీరు పొదుపు ఆలోచన గాక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అనే ఆలోచనతో షేర్ల క్రయ విక్రయాలలోకి దిగుతారు.]

కాబట్టి, ఖచ్చితంగా వీరిని పొదుపరులు అనకూడదు, మదుపుదారులు అని కూడా అనకూడదు. ఎందుకంటే - షేర్ మార్కెట్ వ్యాపారం ‘మదుపు, పెట్టుబడి’ అనే దశ నుండి ‘జూదం’ అనే స్థాయికి ప్రయాణించి చాలా కాలమయ్యింది. "ఠాఠ్! నేనొప్పుకోను. ఇది మదుపు చెయ్యడమే. జూదమాడటం కాదు" అనడమంటే, అది నిశ్చయంగా ఆత్మవంచనే!

నిజానికి... ఈ అత్మవంచన లేదా జూదంలోకి... తమ సంపాదనలో కొంత పొదుపు చేసుకొని, మదుపు పెడదామనుకునే సామాన్యప్రజలు, ఏ విధంగా నెట్టబడ్డారో తర్వాతి టపాలలో పరిశీలించ వచ్చు.

చాలా కాలంక్రితమే, షేర్ మార్కెట్ లో క్రయ విక్రయాలు జూదపు స్థాయికి చేరాయి. కాబట్టే... వదంతుల కారణంగా ‘ఫలానా షేర్ ధరలు పెరిగాయి/తరిగాయనో’ మాటలు వింటుంటాం. ‘ఫలానా మంత్రి ఫలానా ప్రకటన చేసినందున సెన్సెక్స్ రఁయ్యిమంటూ దూసుకుపోయిందనీ లేదా కుఁయ్యంటూ కూలబడిందనీ’ వింటుంటాం.

ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టిన ప్రచారం... క్రికెట్ ఆటలో (అదీ సదరు క్రికెట్ సిరీస్ లేదా వన్‌డే లు మ్యాచ్ ఫిక్సింగ్ అని తేటతెల్లగా వెల్లడైనా కూడా) గెలుపోటములని బట్టి కూడా, షేర్ ధరలు పెరగటం లేదా తరగటం కూడా చూస్తున్నాం. ‘సెంటిమెంటు పనిచేసిందన్న’ సర్వేలూ, విశ్లేషణలూ ఉన్నాయి.

వాస్తవానికి... క్రికెట్ మ్యాచ్ లకీ, షేర్ ధరలకీ సంబంధమేమిటి? క్రికెట్ ఆట గెలుపోటముల వలన వస్తూత్పత్తి నిర్వహించే కంపెనీల ముడిపదార్ధాల ధరలో, లభ్యతలో లేక ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలూ లభ్యతలో ఎలా ప్రభావితం అవుతాయి?

ఈ ప్రశ్నలు ఎవరూ వేయరు, మనబోటి వాళ్ళు వేసినా ఎవరూ సమాధానాలు చెప్పరు!

ఇక వస్తూత్పత్తి చేసే కంపెనీలతో బాటు, సేవలందించే సంస్థలూ ‘షేర్లు విడుదల చేయటం’ ప్రారంభిమై చాలా కాలమే అయ్యింది.

ఇక ఇన్ని కారణాలతో, మరికొన్ని కనబడని కారణాలతో... షేర్ల ధరలు పెరగటం/తరగటం సంభవించటంతో... షేర్ హోల్డర్లు కూడా, దీర్ఘకాలిక పెట్టుబడి లేదా పొదుపు చేసిన డబ్బు దాచుకోవటం కోసం గాక ‘స్వల్ప కాలంలో లాభాల పంట పండించు కోవచ్చు’నన్న ఆలోచనతో ట్రేడింగ్ లోకి దిగి బుల్స్ నాశ్రయిస్తుంటారు.

ఇప్పుడంతగా లేదు కాని, 1985-90ల్లో, 1992 దాక కూడా, షేర్ మార్కెట్ గురించి ఊరించే వార్తా కధనాలు, షేర్ ట్రేడింగ్ మీద ఆధారపడిన కధాంశాలతో నవలలూ వెల్లువెత్తాయి కూడా!

ఆర్దిక మాంద్యం రీత్యా ఇప్పుడది కొంచెం మందగించబడింది.

వార్తాపత్రికల్లో ప్రచురించే వార్తాంశాల్లో కూడా... ఫలానా విధంగా షేర్ మార్కెట్లు కుప్పకూలటంలో, రాత్రికి రాత్రి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి లేదా షేర్ మార్కెట్లు పుంజుకోవటంతో రాత్రికి రాత్రి వందల వేల సామాన్య మదుపర్లు కుబేరులయ్యారనీ... ఉపమాన, ఉత్పేక్ష, రూపకాలంకార సహితంగా వ్రాస్తుంటారు.

"నిన్న... అతడో సామాన్య మదుపరి! వంద నోటుని ఒకటికి పదిసార్లు చూసుకుని ఖర్చుపెట్టేవాడు. ఈ రోజు...!? ఇల్లుపట్టనంతగా కరెన్సీ కట్టలు కలిగి ఉన్న అపర కుబేరుడు, ఒక్కరోజులో అతణ్ణి కోటీశ్వరుణ్ణి చేసిన మహత్తూ.... ఫలానా ఫలానా" అంటూ తెగ వర్ణించి వ్రాస్తుంటారు. (1992 లో హర్షద్ మెహతా అవకతవకలకు ముందు, షేర్ మార్కెట్ బూమ్ వలన ‘చాలామందికి బంగారు పంట పండిందని’ వార్తాపత్రికలు తెగ వ్రాసేసాయి. అవకతవకలు బయటపడిన తరువాత గానీ, అసలు నిజం తెలియలేదు జనాలకి!)

2008 సెప్టెంబరులో ‘ప్రపంచాన్ని ఆర్దికమాంద్యం పట్టికుదుపుతోందన్న’ వార్త...
ఆపశక్యం గాక బట్టబయలైనప్పుడు...
లేమాన్ బ్రదర్స్ వంటి 150 ఏళ్ళ చరిత్ర గల కంపెనీలు దివాళా తీసినప్పుడు...
రోజుకి పదుల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులు దివాళా బాటపట్టినప్పుడు...

వార్తాపత్రికలన్నీ ఇలాగే వ్రాసాయి. ‘మదుపర్ల కుటుంబాలు వేలాదిగా రోడ్డున పడ్డాయి, నిన్న కుబేరుడు ఈ రోజు బికారి’... గట్రా! నిజానికి జూదంలో ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

లాభాన్ని ఆశించి సాహసానికి ఒడిగట్టినప్పుడు, లాభానికి సమాంతరంగా నష్టం వచ్చే అవకాశమూ అంతే ఉంటుంది. అది తెలిసి తెలిసీ దిగారు కదా!

అసలుకే... ‘నత్తల నడకల మీదా, పీతల పరుగుల’ మీదా పందాలు కట్టే జూద మనస్తత్వం పెరిగిన చోట, ఊరించే వార్తాంశాలు మరింత ఆకర్షించటం సహజమే కదా! కానట్లయితే... ‘ఒక ఓవర్ లో ఫలానా ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు, ఎన్నో బంతి నోబాల్ అవుతుంది, ఎవరు ఎవరి చేతిలో అవుట్ అవుతారు’ అన్న వాటి మీద వేల కోట్ల రూపాయలు చేతులు మారవు కదా!

[‘నత్తల నడకలూ, పీతల పరుగులూ’ అంటే అతిశయోక్తిగా అనిపిస్తుందేమో గానీ ‘చిత్రహార్ లో ఏపాట వస్తుంది?’ అన్నదాని మీద పందాలు నడవటం, 1990లో గగ్గోలు అయ్యి, సంచలనం సృష్టించిందన్న నిజం, ఆనాటి పెద్దలకి గుర్తుండే ఉంటుంది!]

ఈ విధంగా, మీడియా...
షేర్ మార్కెట్ కి నూటికి నూరు పాళ్ళు సహాయసహకారాలు అందిస్తూ వార్తాంశాలు వ్రాసేచోట...
సామాన్య మదుపర్లు రోడ్దున పడ్డారనీ, కుబేరులు బికారులయ్యారనీ ఏవేవో ఉపమానాలు వ్రాసిన చోట...
అసలు నిజం ఏమిటంటే...
ఆర్దిక మాంద్యం నేపధ్యంలో ఆవిరయ్యిందీ, అవుతోందీ కాగితపు సంపదే!

12 ఫిబ్రవరి, 2008 ఈనాడులో, [ఇంకా చాలా వార్తా పత్రికల్లో] ‘ఆవిరౌతుంది కాగితపు సంపదే’ అంటూ ప్రచురించిన సుదీర్ఘ వ్యాసంలో, స్పష్టంగా ఈ విషయాన్ని ఉటంకించారు.

[మన బ్లాగుల్లోనో, వెబ్ సైట్లలోనో పాత టపాలన్నీ... తేదీల వారీగా ఉంచినట్లుగా...
ఈ వార్తా పత్రికలూ, ప్రైవేటు టీవీ ఛానెళ్ళు... తమ పాత వార్తాంశాలను, లైబ్రరీలాగా...
పాఠకులకి, ప్రేక్షకులకీ అందుబాటులో ఉంచితే...
అప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేకుండానే, సదరు మీడియా వాళ్ళు, ఎప్పుడు, ఎలాంటి ప్రచారాలు చేసారో అర్ధమౌతుంది. ఒకసారి చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైనది మరోసారి ఎలా చెబుతారో, ఎప్పుడెప్పుడు చెప్పారో పక్కాగా దొరికిపోతారు కూడా! అందుకే అలాంటి సాహసం వాళ్ళు చెయ్యరనుకొండి.

చేస్తే... పాఠకులు, ప్రేక్షకులు మీడియాని ‘పోస్ట్ మార్టమ్’ చేసేస్తారు మరి!]

అది ఏవిధంగా కాగితపు సంపదో పరిశీలించేముందు... ఓసారి... బ్యాంకులూ, షేర్ క్రయ విక్రయాల నేపధ్యం గురించి పరిశీలించాలి.

నిజానికి పబ్లిక్ ఇష్యూ పేరిట ‘వాటాల అమ్మకం’ అనే ప్రక్రియని, ప్రపంచంలో మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు.... అన్నీ సానుకూల అంశాలే చెప్పబడ్డాయి, చూపించబడ్డాయి, నమ్మించబడ్డాయి. చెప్పినట్లు,చూపించినట్లు, నమ్మించినట్లు... ఆచరణ కూడా సానుకూలంగా ఉండి ఉంటే, ఆ ప్రక్రియ, ఈ పాటికి ప్రపంచాన్ని, ప్రశాంత సౌభాగ్య స్వర్గధామంగా మార్చగలిగి ఉండేది.

ఆ ప్రక్రియ యొక్క సిద్ధాంతంలో లోపం లేదు. లోపం ఉందల్లా ఆచరణలోనే! సిద్ధాంతంలో అన్నీ సానుకూలాంశాలే చూపించి, ఆచరణలో అన్నీ స్వార్ధ ప్రయోజనాలే నడిపించుకున్న కుతంత్రం అది.

వివరంగా చెప్పాలంటే....

ప్రజలకి, తమ తిండి తిప్పలకీ, రోజు వారీ జీవితాలకీ ఖర్చుపెట్టుకోగా... భవిష్యత్ అవసరాల కోసం, డబ్బు పొదుపు చేసుకుని దాచుకోవటం అవసరం. అది మంచి అలవాటు, భద్రమైన మార్గం, ఆరోగ్యకరమైన అలోచనా ధోరణి కూడా!

ఎక్కడ దాచుకోవాలి? అవసరంలో ఉన్నవారికి అప్పుగా ఇచ్చి ధర్మవడ్డీ పుచ్చుకుంటే... సమాజంలో పొదుపు చేయగలిగినంత ఆదాయం కలవారికీ, అవసరాలకి అంతంత మాత్రం సరిపోయే ఆదాయం గలవారికీ కూడా ప్రయోజనకరం!

కానీ మనిషి బుద్ధి అలా స్థిరంగా ఉండదు కదా! ధర్మవడ్డీ పొందగల అవకాశం ఉంటే, అందులోంచి చక్రవడ్డీ, అవధుల్లేనంత వడ్డీ గుంజాలని ఆశపుడుతుంది. అదే ప్రైవేటు బ్యాంకులుగా రూపొంది విశ్వరూపం చూపించింది. నాటి బడుగుల బ్రతుకలని ఛిద్రం చేసింది. ఈ విషయమై ప్రపంచంలో మిగిలిన దేశాలు ఎలా వ్యవహరించాయో గానీ, భారతదేశంలో మాత్రం, ఇందిరా గాంధీ హయాంలో బ్యాంకుల జాతీయం చేయబడి, ఈ వడ్డీ ఆశకు ఆనకట్ట వేయబడింది.

సరే! బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. అవసరాల కంటే ఎక్కువ ఆదాయం ఉండి దాచుకోగలవాళ్ళు, బ్యాంకుల్లో దాచుకుంటే, ఆ సొమ్ముకి బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అదే సొమ్ముని, అవసరాలకి తగినంత ఆదాయం లేని వారికి అప్పుగా ఇస్తుంది. బ్యాంకు ఒక వ్యక్తి కాదు గనుక, ప్రభుత్వ సంస్థ గనక, జలగల్లా రక్తం పీల్చి వడ్డీలు వసూలు చెయ్యరు, చేసేంత దురాశ కలిగి ఉండదు.

బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న మదుపర్లకు (అంటే డిపాజిట్లకు) కొంత తక్కువ వడ్డీ చెల్లించి, బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వారి నుండి కొంత ఎక్కువ వడ్డీ వసూలు చేస్తే... ఆ స్వల్ప లాభం, బ్యాంకుల నిర్వహణా ఖర్చులకి, సిబ్బంది జీతభత్యాలకి, బ్యాంకుల అభివృద్ధికి పనికి వస్తుంది - ఇదీ బ్యాంకుల జాతీయకరణ నాడు... దేశం పట్ల, ప్రజల పట్ల నిబద్దత గల ఆనాటి నేతలు కన్న తీయటి కల. (దీనిని పీవీజీ తన ‘లోపలి మనిషి’లో బండి మీద కూరగాయలమ్మే పెద్దామెతో సంభాషణతో వివరించారు.)

అయితే, అన్నిటిలాగానే అదీ ఆచరణలో విఫలం కావటమే... ప్రైవేటు బ్యాంకులు దూసుకు రావటం, సూక్ష్మరుణాల సంస్థలు రూపుదాల్చడం, పిట్టల్లా రాలుతున్న బడుగుల జీవితాల ఉదాహరణలతో... ఇప్పుడు మనం చూస్తున్న వాస్తవానికి కారణం!

ఏ పధకాన్నైనా, ఏ సిద్ధాంతాన్నైనా, ఆచరణలో వైఫల్యానికి గురి చెయ్యడమే... కుట్రదారులైన ‘నకిలీ కణిక వ్యవస్థ పనితీరు’ అనటానికి ఇది మరొక సజీవ, తాజా ఉదాహరణ!

మరోసారి బ్యాంకుల విషయానికి వస్తే... ఆచరణలో విఫలమై, ఇప్పుడు ఫిక్సిడ్ డిపాజిట్లకు కూడా ముష్టి వడ్డీ ఇస్తూ, పూర్తిగా డిపాజిటర్లని బ్యాంకుల గడప తొక్కకుండా తరిమి వేసాయి గానీ, మా చిన్నప్పుడు 5 1/2ఏళ్ళకు సొమ్ము రెట్టింపయ్యే ఫిక్సిడ్ డిపాజిట్లకు ఆదరణ బాగా ఉండేది.

ఇప్పుడు (ఈ ఒకటిన్నర దశాబ్దంలో) బ్యాంకు వడ్డీలని మరింత మరింత కృశింప జేసి, అనివార్యంగా, చిన్న మొత్తాలని పొదుపు చేసుకునే సామాన్య ప్రజలు కూడా ప్రత్యామ్నాయాలు వెదుక్కునేటట్లు చేయటం కూడా కుట్రలో భాగమే!

ఇంట దాచుకోలేరు, దొంగ భయం ఉంటుంది. పోలీసులు ఆ సమస్యను నివారించరు. వడ్డీలకిచ్చుకోలేరు, ఎగవేత భయం ఉంటుంది. వసూలు చేసుకోవటానికి తల ప్రాణం తోక ఉంటే దాంట్లోకి వస్తుంది. అనివార్యంగా షేర్ల వైపు అడుగులు వేయటం పెరిగింది. దోపిడిలో ఇదీ భాగమే. ఎలాగంటే... నిజానికి బ్యాంకులు... డబ్బు ఎక్కువ ఉండి పొదుపు, మదుపూ చేసుకునే వారికి... అవసరాలకి అప్పుకోసం దిక్కులు చూసే వారికీ... మధ్యలో అనుసంధాన కర్త వంటివి. వ్యవహర్తలా ఇద్దరి అవసరాలూ తీరుస్తాయి.

సరిగ్గా... ఇలాంటి సత్ర్పయోజనమే, భారీగా వస్తూత్పత్తి చేసే సంస్థలు (కంపెనీలు) పెట్టుబడులు సమీకరించుకునేందుకు, పబ్లిక్ ఇష్యూ విడుదల చేయటంలో ఆశించబడింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

లాభాలు చూపించిన కంపనీకి ఆ తరువాత రెండు ఆప్షన్స్ ఉంటాయి. 1) కంపనీ లాభాలను డివిడెండ్ రూపంలో షేఋ హోల్డర్లకు పంచవచ్చు, లేకపోతే 2) ఆ లాభాలను కంపనీలోనే తిరిగి ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

2) వ ఆప్షన్ తీసుకున్నట్లయితే షేర్ హోల్డరుకు ఆదాయం వచ్చే బదులుగా పెరిగిన కంపనీలో వాటాదారుడవుతాడు, సహజంగా షేర్ ధర పెరుగుతుంది. కాబట్టి షేర్ మార్కెట్లో షేర్లు డివిడెండ్ల కోసమే కొనాలనడం తప్పు. రెండింటిలోనూ తేడా ఎమీ లేదు.

రెండో విషయం షేర్ ధర్ కంపనీ ప్రస్తుత పనితీరుమీద కాక, ఇన్వెస్టర్ల ఫ్యూచర్ ఎక్ష్పెక్టేషన్ మీద డిసైడ్ అవుతుంది, అందుకే ఇక్కడ ఇన్వెస్టర్ల సెంటిమెణ్ట్లు ముఖ్యం. ఉదాహరణకు ఎల్ & టీ ఇప్పటి పని తీరుకూ, రెండేల్ల కిందటి పని తీరుకు పెద్ద తేడా ఏమీ ఉండకపోయినా రెండేల్లకింద మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు వాటి ధర పడిపోయింది.

మీరు ఇంతకుముందు టపాలో నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu