నాటి ప్రఖ్యాత ఆంగ్ల రచయితల దగ్గరి నుండి, నేటి ఆధునిక రచయితల దాకా...

అందరికీ ‘టైం మెషీన్’ అంటే ప్రత్యేక ఆకర్షణ!

ఆదిత్య 369 వంటి సినిమాలలో చూసి, మనందరికీ కూడా... అదో మంచి సరదా!

ఒకసారి... ఎంచక్కా మనకే అలాంటి టైం మెషీన్ దొరికితే... ఏయే కాలాలకి, ఏయే ప్రదేశాలకీ వెళ్ళి పోవచ్చో, ఎన్నెన్ని తమాషాలు చేసేయొచ్చో... ఊహిస్తే భలే మజా వస్తుంది!

ఇన్ని ఆలోచనలలో బోలెడు సందేహాలు కూడా వస్తుంటాయి. సరే! టైం మెషీన్ ఎక్కి, ఆదిత్య 369 లో బాలకృష్ణ లాగా, ఏ శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలోకో వెళ్ళామనుకొండి.

వెళ్ళి నంగనాచిలాగానో, దెయ్యాల లాగానో అదృశ్యంగా ఉంటూ, వాళ్ళని పరిశీలించి వస్తే సమస్యలేదు. అలాగ్గాక వాళ్ళతో ఏదైనా ఇన్వాల్వ్ మెంట్ పెట్టుకుంటే... గతంలో వాళ్ళకి వాళ్ళవైన అనుభావాలేవో ఉండి ఉంటాయి కదా? అందులో, ఈ టైం మెషీన్ ఎక్కి వచ్చిన వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు కదా? ‘మరి వాళ్ళు దీన్నంతా ఎలా రిసీవ్ చేసుకుంటారు?’ అన్నది నాకు మహా గందర గోళంగా ఉంటుంది.

ఇలాంటిదే... మరో గజిబిజి!

మనవాడు టైం మెషీన్ ఎక్కి ఓ అయిదువందల ఏళ్ళు వెనక్కి పోయి, అప్పటి హంపి విజయనగరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి రాజ్యాన్ని చేరి, అన్నిటినీ చూసాడే... అనుకుందాం. మరి 500 ఏళ్ళ తర్వాత, ఇప్పుడున్న హంపి ఎక్కడ ఉంటుంది? ఒకే స్థలంలో రెండు కాలాలు ఎలా ఉంటాయి?

ఏమో బాబోయ్! అయినా... ఫిక్షన్ కథలో లాజిక్కులు అడక్కూడదు కదా?

అంచేత... నేనూ సరదాగా ‘రాజకీయ ఫిక్షన్ కథ’ వ్రాస్తున్నాను.

ఇక కథలోకి...

క్రీ.శ. 2010....

రిలయన్స్ కంపెనీ వాళ్ళు టైం మెషీన్ ని తయారు చేసారు!

ముందుగా ఎవరు దానిలో ప్రయాణించాలి అన్న దాని మీద వేలం పాట వేసి అవకాశం కల్పించారు. డిమాండు మరి!

సరే! ముందుగా బోలెడన్ని కోట్లు కుమ్మరించి, తొలి అవకాశాన్ని నందమూరి బాలకృష్ణ అందుకున్నాడు. బావమరిది, అందునా వియ్యంకుడూ అయిన బాలకృష్ణని కన్విన్స్ చేసి, చంద్రబాబు కూడా టైం మెషీన్ ఎక్కేసాడు.

అర్జంటుగా ఇద్దరూ, 1995 లో మరణించిన ఎన్టీఆర్ ని కలవటం కోసం, 1992-93 నాటి కాలానికి వెళ్ళిపోయారు. అప్పటికే తాను మరణించి పదిహేనేళ్ళయినందున... ఎన్టీ రామారావు, తానున్న లోకం నుండి, 2010 వరకూ గడిచిన కాలాన్ని, సంఘటనలని అప్పుడప్పుడూ చూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. మిగతా సమయంలో యమగోల, యమదొంగ లాంటి సినిమాలు చూస్తూ, గడుపుతూ ఉన్నాడు.

ఇంతలో హఠాత్తుగా తనముందు దిగిన కొడుకూ, అల్లుడిని చూసి విస్తుపోయాడు. మాటలుడిగి చూస్తున్నాడు. బాలకృష్ణ హడావుడిగా ‘సింహ’ సినిమా డైలాగు మాడ్యులేషన్ లో "నాన్నా! నా మాట వినండి. ఆ లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకోకండి. అప్పుడంతా దబ్బిడి దిబ్బిడే" అన్నాడు.

‘ఓర్నాయనో! బామ్మర్ది నా కొంప ముంచుతున్నాడే! లక్ష్మీపార్వతిని చేసుకోక పోతే, ఆ వంకతో నేను వెన్నుపోటు పొడిచేదెలా? పార్టీని చీల్చేదెలా? ముఖ్యమంత్రి నయ్యేదెలా?’ మనస్సులో ఇదంతా అనుకున్న చంద్రబాబు, బాబ్లీ యాత్రలో మాట్లాడినంత ఉద్వేగంగా,

"వద్దొద్దు మామయ్యా! మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి. లేకపోతే మీ బాగోగులు ఎవరు చూస్తారు? ఎందరు కూతుళ్ళు, కొడుకులూ ఉన్నా, ఎవరి సంసారాలు వాళ్ళవయ్యె! మీ సంసారం మీకుంటే... అన్నీ అవే నడిచిపోతాయి" అని గోలపెట్టాడు.

ఒక చెవిలో కొడుకు బాలకృష్ణ "రెండో పెళ్ళి వద్దు" అంటుంటే...

మరో చెవిలో అల్లుడు చంద్రబాబు "చేసుకో! పెళ్ళి చేసుకో!" అంటున్నాడు.

ఒక వైపు లక్ష్మీపార్వతితో పెళ్ళి, మరో వైపు అల్లుడుతో వెన్నుపోటు ఆలోచిస్తూ... పిచ్చెక్కినట్లయ్యి... ఎన్టీఆర్ ఒక్క గావుకేక పెట్టాడు.

"ఛస్ నోరు ముయ్యండి! దిగిన మెషిన్ ఎక్కి వచ్చిందారిన పొండి" అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి, వీళ్ళకి అందనంత దూరం వెళ్ళిపోయాడు.

~~~~~~

రెండోసారి టైం మెషీన్ ఎక్కే అవకాశాన్ని, వేలంపాటలో పాల్గొని, వై.యస్.జగన్ దక్కించుకున్నాడు.

కళ్ళొత్తుకుంటూ, కొండా సురేఖ దంపతుల నుండి టాటాని, అంబటి రాంబాబు లిచ్చిన ఓదార్పునీ అందుకుని, ధైర్యం తెచ్చుకుని, టైం మెషీన్ ఎక్కి బయలు దేరాడు.

సర్రున 2009 సెప్టంబరు 1వ తేదీ కెళ్ళిపోయాడు. తండ్రిని చూడగానే బావురుమన్నాడు. వై.యస్సారూ కొడుకుని కావలించుకుని ఓదార్చాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. 108 కుయ్యి కుయ్యి మంటోందా? అని అలవాటుగా అడిగేసాడు.

"అవన్నీ వదిలెయ్ నాన్నా! నే చెప్పేది విను" అన్నాడు జగన్ డగ్గుత్తికతో!

చెప్పమన్నట్లు చూసాడు వై.యస్సార్! "నాన్నా! నువ్వు సీఎం సీటులో ఉండగా.... పొన్నాలకీ, బొత్సాలకీ, మీ చేవెళ్ళ చెల్లెమ్మకీ... అందరికీ ఎంతెంత తినిపించావు? జలయజ్ఞం అనీ, అదనీ ఇదనీ, ఎంత ఉదారంగా ఆస్థులు కూడా బెట్టుకోనిచ్చావు? అయినా నువ్వు పోయాక... నన్ను చిన్నపిల్లాణ్ణి చేసి...." ఇక చెప్పలేక బోరుమన్నాడు.

వై.యస్సారు కొడుకు భుజం మీద తట్టి, వెన్ను నిమిరాక, దుఃఖం దిగమింగుకొని, కొనసాగిస్తూ... జగను,

"అదంతా మర్చిపోయి... ఇప్పుడు నేనెవ్వరో తెలీనట్లు మొహం తిప్పేసు కుంటున్నారు. మద్దతుగా నిలబడటం సంగతి అంటుంచి కనీసం మాట కూడా మాట్లాడటం లేదు! అంతేగాక తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లు నిన్నూ, నన్నూ తిడుతున్నారు నాన్నా! అధిష్టానం అయితే... నిన్ను ‘దార్శనికుడు’ అంది. నన్ను ‘నోర్మూసుకో’ అంటోంది" అన్నాడు, వెక్కిళ్ళు పెడుతూ!

"అంతేరా అబ్బాయ్! ‘పెట్టిన నాడు పెళ్ళి కూడు, పెట్టని నాడు శ్రాద్దపు కూడు!’ అంటారు. ఈ లోకం నుండి నాకూ అంతా కన్పిస్తూనే ఉంది. ఏం చెయ్యను? అలవి కాని రోజుల్లో ఆక్రోశం తప్ప ఒరిగేదేముంది? గతంలో అనుభవమే ఇలాంటివి మనకి!" ఓదార్పుగా అన్నాడు వై.యస్సార్.

ఎంతసేపు ఒగర్చినా, ఒరిగేదేమీ లేక, నిరాశగా టైం మెషీన్ వైపు నడిచాడు జగన్! నిట్టూర్పు విడిచాడు వై.యస్సారూ!

~~~~~

టైం మెషీన్ లో వెళ్ళిన వాళ్ళంతా క్షేమంగా వస్తుండేసరికి, తర్వాతి అవకాశం కాంగ్రెస్ అధిష్టానం సోనియా తీసుకుంది. ఆమె వేలంపాటలో పాడుకొని, డబ్బిచ్చి అవకాశం పొందింది - అనుకుంటున్నారా? అబ్బే, లేదు! అవకాశం ఇవ్వకపోతే, రిలయన్స్ మీద, ఐటీ దాడులు, సిబిఐ కేసులూ, వ్యాపార అనుమతులు రద్దు వంటివి చేస్తూందన్న భయంతో, అంబానీ సోదరులు అదురుకొని, అవకాశం ఇచ్చేసారు.

సరే! సోనియా టైం మెషీన్ ఎక్కి ‘ఏ కాలానికి వెళ్ళాలా?’ అని ఆలోచిస్తుండగానే... మెషీన్ కాస్తా 1980-84 లకి చేరిపోయింది. ఎదురుగా చూస్తే ఏముంది? అపర కాళికలా ఇందిరా గాంధీ నిలబడి ఉంది. గడిచిన పాతికేళ్ళుగా... ఇంటినీ, దేశాన్ని చూసి దిమ్మెర పోయి ఉందేమో, కోడల్ని చూడగానే రణ చండికలా అయ్యింది.

"ఒహో! కోడలివని కొంపలో చోటిస్తే కొరివి వయ్యిందే గాక, దేశాన్ని కొల్లగొడతావా?" అంటూ... భారతదేశం చుట్టూ, తిప్పించి త్రిప్పించి ....?

ఆ హైరానాలో టైం మెషీన్ ఎక్కడుందో కూడా గమనించ లేక, ఇబ్బందుల్లో పడింది ఇటలీ గాంధీ!

~~~~~

ఇది సైన్స్ ఫిక్షన్ లాగా రాజకీయ ఫిక్షన్ కథ! ఇందులో ఈకలు పీకటం, లాజిక్కిలు అడగటం చెయ్యకండేం! అడిగారను కోండి! ఏముంది? మిమ్మల్ని కూడా టైం మెషీన్ ఎక్కించేసి ‘ఏదో కాలానికి, ఎక్కడికో’ పంపించేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

మరోసారి తీరికగా టైం మెషీన్ దొరికినప్పుడు మరికొన్ని....


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

మిమ్మల్నీ మీ రాతల్నీ రాణి రత్నప్రభ తెగ తిడుతోంది తన బ్లాగుల్లో కావాలంటే చూసుకోండి- http://weekend-politician.blogspot.com/2010/08/blog-post_12.html

ఇందిరా గాంధీ మీద మీకు మంచి అభిప్రాయం ఉందా? ఈ న్యూస్ చూడండి. ఈనాడు పేపరు ఎడిటోరియల్లో (18/08/2010) ఈమెను దులిపేసారు .

http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20100818a_004101004&ileft=274&itop=47&zoomRatio=130&AN=20100818a_004101004

Rajesh గారు: పై లింక్ రావటం లేదండి. ఈనాడు పేపరయితే మాకు వస్తుంది. బహుశః కులదీప్ నయ్యర్ వ్రాసిన సబ్ ఎడిటోరియల్ అనుకుంటా మీరు ఇచ్చిన లింక్!

కులదీప్ నయ్యర్ రాసిన సబ్ ఎడిటోరియల్ లింకే నేను ఇచ్చింది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu