హిందుమతం.
వేల సంవత్సరాలుగా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత హేళన చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కాలుష్యాలని కలగలిపినా చెక్కుచెదరని హిమవగ్నగం.

ఎన్ని నదులు తనలో వచ్చి కలిసినా....
ఎన్ని తుఫానులు చెలరేగినా...
చెలియాలి కట్ట దాటని ధీర గంభీర సాగరం.
నిశ్శబ్ధంగా నినదించే సముద్రఘోష వంటిది హిందు సంస్కృతి.

అలాంటి సముద్రపు ఒడ్డున కొందరు ఇసుకలో, సముద్రపు అలల నురగలో కొట్టుకు వచ్చిన చిల్లర గవ్వల్నీ, పగిలిన శంఖాల్నీ ఏరుకుంటుంటే... మరి కొందరు ఆ ఆనంత జలరాశిలోకి దిగి, ఈతలు కొట్టి, లోతుల్లోకి మునిగి, మంచి ముత్యాలనీ, వెల లేని రత్నాల వంటి నిత్య సత్యాల్నీ అందుకుంటున్నారనీ, ఆస్వాదించి ఆనందిస్తున్నారనీ ’ఉషశ్రీ’ అంటారు.
అది నిజం!

సరస్సులోని బురద పూసుకునే వారు కొందరైతే, కలువలు కోసుకునే వారు కొందరు. ఎవరేది చూస్తారు, ఎవరేం చేస్తారు అన్నది ఆయా వ్యక్తుల దృష్టీని బట్టి, దృక్పధాన్ని బట్టి ఉంటుంది.

మరోరకంగా చెప్పాలంటే...

మనం చిన్నప్పుడు అక్షరమాల, గుణింతాలు నేరుస్తాం. ఆ తర్వాత వత్తులూ, చిన్న చిన్నపదాలు మెల్లిగా వాక్యాలు. ఆ తర్వాతే పద్యాలూ, కథలూ, వ్యాకరణాలూ, ప్రబంధాలూ! గణితమైనా అంతే! ముందు సంఖ్యలూ, కూడికలూ, తీసివేతలూ, హెచ్చవేతలూ, భాగహారాలు. తర్వాతే ఘాతాంకాలు, సంవర్గమానాలు, ఏది నేర్చినా. ఒకటో తరగతి తర్వాత 2,3,....అలా అలా పదో తరగతి. ఆపైన పీజీల దాకా, ఏ చదువైనా అంతే!
హిందూమతమైనా అంతే!

జనులందరికీ, అన్ని స్థాయిల వారికీ, వారి వారి స్థాయిని బట్టి అందుకునే విద్య వంటిది. ఆయా వ్యక్తుల మానసిక స్థాయిని బట్టి, పరిణతిని బట్టి, జన్మతః వారసత్వంగా వచ్చిన భావ సంపదని బట్టి, హిందూమతాన్ని వారు గ్రహించే తీరు ఉంటుంది. ఎవరైనా ఒకటో తరగతి నుండి పైతరగతుల్లోకి ప్రమోట్ అయినట్లుగా... సాధనతో పరిణతిని, పరిపక్వతని పెంచుకుంటూ పోవలసిందే!

అంతేగానీ ఒకటో తరగతి వాడు. తన అజ్జానం కొద్దీనో, తెలియని తనానికి అహంకారాన్ని జోడించుకునో, తన కంటే పై స్థాయి వాడిని నానా మాటలు అంటే ఎలా ఉంటుందో... హిందూమతం పైనా, హిందూ మతగ్రంధాల పైనా, విమర్శలు చేయటం అలా ఉంటుంది. దీన్ని సోదాహరణంగా వివరిస్తాను.

ముందుగా ఓ ఉదాహరణ చెబుతాను.

సూర్యాపేటలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్న రోజుల్లో, ఓ రోజు క్లాసులో పిల్లలకి Quadrodic equations లో లెక్కలు చేయిస్తున్నాను. ఓ విద్యార్ధి "మేడం! 73 రావటం లేదండి" అన్నాడు. 73rd Problem అని అతడి ఉద్దేశం. ప్రక్కనే ఆడుకుంటున్న మాపాప [అప్పటికి ఆమెకి నాలుగున్నరేళ్ళు ఉంటాయి] "అయ్యో! 73 రాదా? 7 వేసి పక్కనే 3 వేయ్యాలి. అంతే!" అంది. ఆ పిల్లవాడు "అవునమ్మా! 73 రావటం లేదు" అంటూ అమాయకంగా ముఖం పెట్టి మా పాపని ముద్దు చేసాడు. అందరం ఒకటే నవ్వు కున్నాము.

ఆమె పసిది గనుక, అది కళ్ళకు కనబడుతున్న అమాయకత్వంతో కూడిన అజ్ఞనం కనుక, అందరం హాయిగా నవ్వుకుంటాం. అదే అహంకారంతో కూడిన అజ్ఞానంతో అవహేళన చేస్తే, క్రోధంతో అసహనంతో ఉడికి పోతాం. ఆ క్రోధపు స్థాయి కూడా ఆయా వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. ఒకోసారి పరిణతి, పరిపక్వత స్థాయి ఎక్కువ ఉన్నవారు, ఉదాసీనంగానో, నిర్లిప్తతతోనో, అలాంటి అవహేళనలని పట్టించుకోరు. ’ఆశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది’ అనుకుని తప్పుకుని పోతారు.

అయితే... అశుద్దాన్ని, అశుద్దాన్ని నలుగురు తిరిగే బాటలో వేసిన వాళ్ళనీ ఉపేక్షించటం కూడా, ఓ పరిమితి[limit] దాటితే శ్రేయస్కరం కాదు. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది కదా! అందుకే ’యుక్తాహార విహారస్య’ అన్నది గీత.

ఇక్కడో విశేషం ఏమిటంటే - ఇలా అశుద్దాన్ని వెదజల్లే వారి వాదనలనే తప్ప, ఆ వాదనలోని లొసుగుల్ని ఎత్తి చూపే వారి గళాలకి మీడియా మైకు ఇవ్వకపోవటం. అంటే ఫోకస్ చేయకపోవటం.

కాబట్టే, రామాయణ విషవృక్షాలకీ, రంగనాయకమ్మలకే వచ్చినంత ఫోకస్ కల్పవృక్షాలకీ, హిందూ మతగ్రంధాల సమర్ధకులకీ వచ్చేది కాదు. ఆ స్థితి ఇప్పుడూ ఉండటం చూస్తునే ఉన్నాం.

నిజానికి....

ఒకటో తరగతి పిల్లవాడు ఇంటర్ పిల్లవాడి లెక్కల నోట్సులోని Integrals నీ, Partial Derivatives నీ చూసి ’ఇవేం పిచ్చిగీతలు?’ అంటూ అవహేళన చేస్తే....?

ఇంటర్ పిల్లవాడు ఒకటో తరగతి వాణ్ణి చూసి, తానూ అవిదాటే వచ్చానన్న విషయం మరచి "ఇదేనా నీ స్థాయి?" అంటూ వెక్కిరిస్తే...? ఫలితం వైషమ్యాలే!

నిజం చెప్పాలంటే - ప్రసాదం కోసం గుడికి వచ్చినా, క్రమంగా మంచివైపుకీ, భగవంతుడి వైపుకీ ఆకర్షించబడతారు అన్నది అన్ని మతాలలోనూ ఉన్న ఆచరణే! అదే హిందూమతంలో అయితే... భాగవతంలోని రాసలీలలు, ఇతిహాసాలలోని స్త్రీ అంగాంగ వర్ణనలు, శృంగార వర్ణనలు కూడా అలాంటివే! గుడులలో ప్రాకారాల మీదా, గోపురాల మీదా ఉండే శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు కాముకులని కూడా గుడుల వైపూ, క్రమంగా దైవం వైపూ ఆకర్షిస్తాయి. అందునా పూర్వపు రోజుల్లో పబ్బులూ, నీలిచిత్రాలూ, బూతుబొమ్మలు చూపే వెబ్ సైట్లూ ఉండేవి కావు కదా! [వేశ్యావాటికలున్నా చీకటి మాటున పోవలసిందే! అదీగాక వేశ్యలని entertain చేసేంత ధైర్యమూ, ధనమూ కూడా, కొందరికే తప్ప అందరికీ ఉండవు కదా!]

కాబట్టే ’కామి కానివాడు మోక్ష కామికాడు’ అనే సామెత కూడా ఉండింది.

ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ, భాగవతం చివరిలో, ముసళ్ళ పండుగకు ముందర, శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టంలో, తనను చూడ వచ్చిన గోపికలు శ్రీకృష్ణుడితో - గతంలో తామెంతో ఆనందంగా గడపటం గురించి ప్రస్తావించి ఆ భాగ్యం తమకు కరవైందని దుఃఖిస్తారు. గోపికలని ఓదార్చిన శ్రీకృష్ణుడు వాళ్ళకు జ్ఞాన బోధ చేస్తాడు. ఇది ఎలాంటిదంటే - చాక్లెట్ కోసం ఓ పిల్లవాడు మారాం చేస్తున్నాడనుకొండి. మనం ఏం చెప్పినా వాడి చెవికి ఎక్కదు. గొల్లుమంటూనే ఉంటాడు. వాడి స్థాయి అది. నాలుగు తగిలించినా ఏడుస్తునే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాంతో మనం చాక్లెట్లు ఇచ్చేస్తాం. వాడి కోరిక తీరాక, అప్పుడు కౌన్సిల్ చేస్తాం. చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పుచ్చుతాయనీ, అనారోగ్యం వస్తుందనీ మెల్లిగా నచ్చజెపుతాం. మెల్లిగా వాడి మనస్సులో మార్పు తెస్తాం.

ఇది ఆధునిక మానసిక వైద్యులూ ఒప్పుకునే విధానమే. అదే ఇతిహాసాల్లోని శృంగార వర్ణనలూ, గుడుల్లోని శిల్పాలూ చేసేవి. అదీగాక ఒకప్పుడు గుడులే సర్వవిద్యా కేంద్రాలు; లైంగిక విద్యతో సహా! విద్యనీ, జీవన కళనీ నేర్పేది కూడా అప్పట్లో మతం ఒక్కటే!

కాబట్టే, అన్నమయ్య, క్షేత్రయ్య, జయదేవుడి వంటి భక్త కవులు కొందరు భగవంతుడి పేరిట శృంగార కీర్తనలు వ్రాసి పాడారు. అలాంటి వాటి పట్ల కూడా ఎవరి స్పందన వారిది! అదీ ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి, దృక్పధాన్ని బట్టి ఉంటుంది.

హిందూమతంలోని ప్రతికోణం ఎంతో పరిణతితో కూడినది అనటానికి ఒక ఉదాహరణ చెబుతాను. మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి ప్రాకారాల నుండి మూల విరాట్టు దగ్గరికి వెళ్ళే సరికి చాలా దూరం ఉంటుంది. అది క్యూ లైను అవ్వచ్చు, లేదా గుడి పెద్దదిగా ఉండటం చేత అవ్వచ్చు. అలా ఉండటం ఎందుకంటే ఎంతటి వారికైనా తమ దైనందిక చర్యల తాలూకూ ఆలోచనలు దైవందర్శనం అప్పుడు చుట్టుముట్టకుండా, ప్రాకారం నుండి మూలవిరాట్టు దగ్గరికి వచ్చేసరికి దైవం చుట్టే ఆలోచనలు ఉండేటట్లు, ఏకాగ్రత కుదిరేటట్లు చేయటం కోసం. అంత పెద్ద గుళ్ళు ఉండేవి. ప్రాకారం నుండి దైవం దగ్గరికి వచ్చేసరికి క్రమంగా ఆలోచనలు దైవం చుట్టే తిరుగుతాయి. చిన్న గుడుల్లో అయినా ప్రదక్షిణానంతరమే దైవ దర్శనం చేసుకోవటంలో కూడా ఉన్నది ఈ అంతస్సూత్రమే. అంతగా మనిషి ఆలోచనా సరళి బట్టి,మనిషిని ఎలా దైవం దగ్గరికి తీసుకెళ్ళటమా అని ఆలోచించి తీర్చిదిద్దబడింది హిందూమతం.

సరే, ఇదంతా పక్కన బెడదాం. హిందూమతంలో, ఇతిహాసాలలో శృంగార వర్ణనలూ, అసంబద్ద పాత్రలూ ఉన్నాయనుకుందాం. అయితే అవొక్కటే ఉన్నాయా? మరింకే మంచి విషయాలూ లేవా? అదీ హిందూమతంలో మాత్రమే ఉన్నాయా? అయినా మంచి ఎక్కడ ఉన్నా గ్రహించటం, చెడు ఎక్కడున్నా విస్మరించటం విజ్ఞల లక్షణం అంటారు. అటువంటప్పుడు హిందూ ఇతిహాసాల్లోని చెడు[ఉంటే] వదిలేసి, మంచినే గ్రహిస్తే గొడవే లేదు కదా! అది వదిలేసి "ఇంత అంగాంగ వర్ణనలున్నాయి, ఇంత చెత్త ఉందీ!" అంటూ పనిగట్టుకుని మరీ గగ్గోలు చేయటం దేనికి?

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ సి.ఆనందారామం వ్రాసిన ఇంద్రసింహాసనం’ అనే నవల చదివాను. అందులో నహుషుడు ఇంద్రపదవి చేపట్టటం, ఇంద్రాణి అయిన శచీదేవిని వాంఛించటం, ఆ క్లిష్ట స్థితిలో శచీ దేవి సమస్యలని ఎదుర్కొన్న తీరు, దానికి సమాంతరంగా అజ్ఞాతవాసంలో ద్రౌపదీ దేవి విరటుని అంతఃపురందాసిగా వ్యవహరిస్తూ ఇతరులలో స్ఫూర్తి నింపటం వగైరాలతో, భారత కథని ఆధునిక సామాజిక స్థితులకి అనువర్తిస్తూ రచయిత్రి చిత్రించింది. అందులో శచీదేవి పాత్ర, ఎమర్జన్సీ అనంతర ఓటమి నాటి రోజుల్లోని ఇందిరాగాంధీ సంఘర్షణని కొంత వరకూ ప్రతిబింబించిందన్న మాట కూడా ఆ రోజులలో విన్నాను. అలాంటి రచనల గురించి పెద్దగా చప్పుడూ ఉండదు. మెల్లిగా అలాంటి రచయిత/రచయిత్రులూ పెన్ డౌన్ అయిపోతారు. అదొక విచిత్రం ఇక్కడ.

ఇలాంటి కుయుక్తుల గురించీ, కుట్రల గురించీ, దౌష్ట్యపు వాదనల గురించీ, నా ఆంగ్లబ్లాగు Coups On World లోని Coups on Hindu Epics లో సుదీర్ఘమైన, సంపూర్ణమైన వివరణ వ్రాసాను. ఆంగ్లంలో వ్రాయటానికే నాకు చాలా సమయం పట్టింది. తెలుగులోకి అనువదించేందుకు సమయం దొరకటం లేదు.

ఇక ఈ టపా ముగించే ముందు మీతో నా సంతోషాన్ని పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇటీవల రంగనాయకమ్మ వారసుల వంటి కొందరు రచయితలు భారతంలోని పాత్రల మీద నవలలు రచించారు. అలాంటి వారిలో ఓ రచయితకి ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు భారతీయ సంస్కృతీ, దేశీయతల మీద కుట్రలు జరుపుతున్న వారికి అనుచరులు కావటాన, ఇలాంటి వారికే అవార్డులు రావటం అన్నది సహజ పరిణామం. ఈ నేపధ్యంలో మరోసారి అలాంటి రచనలకి సంచలనం అంటుకుంది.

ఆ మీదట విమర్శలూ, సమర్ధింపులూ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ కూడా వచ్చాయి. ఎటూ మీడియా హిందూమత సమర్ధకులకి ఎక్కువ కవరేజ్ ఇవ్వదు గదా! అయితే బ్లాగ్లోకంలో కొందరు బ్లాగరులు, హిందూమత గ్రంధాలపై బురద చల్లే కుటిల యత్నాలని ఎదుర్కున్న తీరు నాకు చాలా నచ్చింది.

7 వ తరగతి పిల్లలకి హిందీలో ఓ పద్యం[దోహా] ఉంటుంది. వసంత ఋతువు కోకిల గానం చేస్తుంటుంది. తర్వాత వర్షాకాలం వస్తుంది. అప్పుడు కోకిల మౌనం వహిస్తుంది. వర్షాలకి నీళ్ళు నిండగా చెఱువులూ, దొరువుల్లో కప్పలు చేరి బెకబెక మంటూ దరువులు వేస్తుంటాయి. కోకిల మౌనం దాల్చినందునే కప్పలు గానం ప్రారంభించాయంటాడు కవి. అలాగే మేధావులు/మంచివారు మౌనం దాల్చగా మూర్ఖులూ/చెడ్డవారు తమ వాదనలతో సమాజాన్ని కాలుష్య పూరితం చేస్తారని పోలిక చెబుతాడు.

అందరూ చెడునీ, చెడు వాదనలని చూసి, "అశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది. ఎందుకొచ్చిన గొడవ? తప్పుకు పోతే సరి"అనుకుంటేనే... నిర్లిప్తత వహించి "ఎవరి పాపాన వాళ్ళే పోతారు" అనుకుంటూ ఉపేక్షిస్తేనే... పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. హిందూమతం మీద బురద చల్లే హక్కు, మీడియా సాక్షిగా, చాలామందే పుచ్చుకున్నారు. మీడియా మైకు నివ్వక పోయినా, కనీసం ఈ బ్లాగ్లోకంలోనైనా అలాంటి కుటిల యత్నాలని కొందరు బ్లాగరులు ఎదుర్కున్న తీరు హర్షణీయంగా ఉంది. అలా ఎదుర్కున్న వారిలో నా కంటే పెద్దవారికి నా నమస్కృతులు. నా కంటే చిన్న వారికి నా ఆశీస్సులు.

ఈ దృశ్యం ఎవరి స్థాయిలో వారు యుద్దం చేస్తుంటే చూస్తున్నట్లుగా ఉంది. యతో ధర్మ తతో జయః అనిపిస్తోంది. అందరికీ మా జేజేలు!

అయితే ఒక చిన్న సవరణ! మనం సమస్యని గాక, సమస్య మూలాలని నాశనం చేయాలి. అప్పుడే యుద్దం సరైన రీతిలో ఉంటుంది. కాబట్టి హిందూఇతిహాసిక పాత్రలని తమ ఇష్టమొచ్చిన రీతిలో,తమ అరిషడ్వర్గాల సహితంగా చిత్రీకరిస్తూ ఆధునిక పోకడలు పోతున్న అపర ఆచార్యులనీ, రంగనాయకమ్మ వారసుల వంటి వారినీ, అలాంటి రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసిన వారినీ, చేయింపించిన వారినీ లక్ష్యంగా ఎంచుకోవటం మంచిది. అంతేగానీ ఆయా రచనలనీ, రచయితలనీ సమర్ధించే లేదా పొగిడే తోటి బ్లాగర్లతో వివాదాలు పడటం, మాటల తూటాలు పేల్చుకోవటం అనవసరం. వైషమ్యాలు పెరగటం మినహా ఒరిగేదేం ఉండదు. అది బ్లాగ్లోకంలో ఒకరికొకరు జాతర బొమ్మలు/జంటపీతలుగా తయారవటమే అవుతుంది.

యుద్దంలో శస్త్రాన్ని సంధించేటప్పుడు లక్ష్యాన్ని కూడా సరిగా నిర్ణయించుకోవడం ముఖ్యం కదా! తోటి బ్లాగర్లని విమర్శించటం ద్వారా, పరిధి కుదించుకుపోతుంది. అంతేకాదు మన విలువైన శక్తి, సమయం, ఆవేశం కూడా వృధా అవుతాయి. ఎవరైతే ఇటువంటి కుటిల రచనలని గొప్ప సాహిత్యలుగా బహుమతులు కట్టబెట్టారో, కట్టబెట్టించారో వాళ్ళని లక్ష్యంగా చేసుకోవటం ద్వారా, మన అభిప్రాయాన్ని చెప్పినట్లవుతుంది. బ్లాగుల ద్వారా మన గళాన్ని వినిపించినట్లవుతుంది. అలాగాక, తోటి బ్లాగర్లని కెలుక్కోవటంలో ఆనందం ఉందంటే, అది వారి ఇచ్ఛ.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

సరిగ్గా చెప్పారు. ఈ రచనకు పనిగట్టుకుని కేంద్రం వారు అవార్డు ఇవ్వటం సహజపరిణామం కాదు.

చాలా చక్కగా చెప్పారు.

ఇక మీరన్నట్టు లక్ష్యానికి గురి పెట్టాలి. కానీ ఆలక్ష్యంతో పాటు మనం చేవలసిన పని ఇంకోటుంది. పండితుల స్థాయిలొ ఉన్న మన శాస్త్రాల, సాంప్రదాయాల అంతరంగాన్ని ప్రాధమికుడి స్థాయి వారికి కూడా అర్థమయ్యేటట్టు మన శక్తి కొలదీ వివరణలు ఇవ్వడం. దాని విలువలను తెలియపరచడం.

మన విలువ తెలిసిననాడు దానిని విమర్శించే వీలులేదుకదా. అయినా విమర్శించే వారు ఉండకపోరు. ఇక వారికి మీరన్నట్టు శస్త్ర సమాధానమే. ఈ రెండూ సమానంగా సాగాలి.

ఒకటి తప్పు అని చెప్పడం ఎంత అవసరమో , ఇది సబబు అని చెప్పడం కూడా అంతే అవసరం.

ఈ రెండూ కాక సరైన వివరణ ఇచ్చి వారినే ఆలోచించుకునే టట్లు చేయడం చాలా చాలా యుక్తమైన,తెలివైన పని.

నేను ప్రస్థుతం "రామాకనవేమిరా...!" బ్లాగులో అదే చేస్తున్నాను. మూఢనమ్మకాలు అనే టపా చదవండి వీలుంటే, వ్యాఖ్యలు కూడా.

ధన్యవాదాలు.

చాలా బాగా దిశా నిర్దేశం చేసారు. బ్లాగుల్లో తిట్టుకోడం కాదు, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని పోరాటం సాగించాలి. ప్రతీ విషయంలోనూ సమర్ధకులు, విమర్శకులు ఉంటారు, వాళ్ళలో వాళ్ళు కలహించుకోడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. కనీసం బ్లాగ్ ముఖంగానైనా అలాంటి రచనలు చేసేవారిని, వాటికి పట్టం కట్టేవారిని నిలదియ్యకపోతే మన మౌనం అసమర్ధతగా ఎంచి, మరింత పెచ్చుమీరిపోతారు. మనకున్న సహనం ఏ ఇతర మతాల వారికీ లేదు కాబట్టే మనకిన్ని అవస్థలు.

GOOD POST

చక్కటి సలహా ఇచ్చారు.

రవి గారు, అశోక్ గారు, రవి చంద్ర గారు,

నెనర్లు!
~~~
రాజశేఖరుని గారు,

మీరు చెప్పిన సలహాలని ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఉందండి. మీ బ్లాగులో విషయాలు చదివిన తరువాత నా అభిప్రాయం వ్రాస్తానండి. నెనర్లు! మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చారా? ఇంతకు ముందు వేరే టెంప్లేట్ ఉండేదనుకుంటా? నెనర్లు.
~~~~
స్వర్ణమల్లిక గారు,

అవునండి మనకున్నంత సహనం మరే మతంలోనూ లేదు. అదే అలసత్వంగా మారింది. దాన్ని నుండి బయటకు రావటమే ఇప్పుడు హిందువులు చేయవలసిన పని. నెనర్లు!

యుద్దంలో శస్త్రాన్ని సంధించేటప్పుడు లక్ష్యాన్ని కూడా సరిగా నిర్ణయించుకోవడం ముఖ్యం కదా!

ఎంత చక్కగా చెప్పారు
రామకృష్ణారావు

Nice post. Kudos.

- Shiv.

రావు గారు, శివ గారు,

నా టపా మీకు నచ్చినందుకు సంతోషమండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu