ముందుగా ఓ ఉదాహరణ!

ఓ హత్య జరిగిందనుకొండి. పోలీసుల, నేరపరిశోధకుల[CBCID, CBI etc.] పరిశోధన, పనితీరు ఎలా ఉంటుంది? ’హతుడెవరు?, ఎక్కడ ఎలా హత్య చేయబడ్డాడు?’ అన్నవి ఆరా తీస్తారు. హతుడికి ఇతరులతో ఉన్న సంబంధ బంధావ్యాలు, స్నేహాలు, డబ్బు లావాదేవీలు గురించి కూడా ఆరా తీస్తారు. హత్య జరిగిన విధానాన్నీ, ఆయుధాలనీ, సంఘటనా స్థలంలోని ఇతర ఆధారాలని[clues] సేకరిస్తారు. హత్యా సంఘటనకు ముందూ, వెనకా, జరిగిన ఇతర సంఘటనలనీ, వాటి మధ్య కార్యకారణ సంబంధాలని విశ్లేషిస్తారు. హత్యకు ఉపయోగించిన సాధనాలేమిటి, హంతుకులు కిరాయికి వచ్చిన వారా లేక హతుడి సంబంధీకులా అన్నదీ విచారిస్తారు.

అప్పుడు, హత్యకు పాల్పడే అవకాశం ఎవరెవరికి ఉందో[Motives] విశ్లేషిస్తారు. ఆ విధంగా అనుమానితుల జాబితా తయారు చేస్తారు. వారందరినీ హత్య కోణంలో, నేర నిర్ధారణ కోసమై, విచారిస్తారు. ప్రశ్నిస్తారు. వారు చెప్పిన సమాధానాలని, అందులోని లొసుగులనీ, స్థలకాలమాన పరిస్థితులనీ, ఇతర సాంకేతిక అంశాలని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, నేరపు చిక్కుముడిని పరిష్కరిస్తారు. నేరస్థులెవరో నిగ్గు తేలుస్తారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, నేర నియంత్రణ, పరిశోధనా సంస్థలు అవలంబించే శాస్త్రీయ విధానం. అంతే తప్ప , నేరం జరిగిన చోటా, నేరం జరుగుతూ ఉన్నప్పుడు లేక నేర ప్రణాళిక రచిస్తున్నప్పుడు, నిఘా కెమెరాలుంచి వీడియోలు, ఫోటోలు, సంభాషణల టేపులూ ఏ పోలీసులూ సేకరించలేరు. కొన్నిసార్లు సేకరించవచ్చు గాని, అన్ని నేరాలలో అది సాధ్యం కాదు. హత్యలైనా, దొమ్మీలైనా, దొంగతనాలైనా... ఇతర ఏ నేరాలైనా, పరిశోధనా తీరు ఇలాగే ఉంటుంది.

ఇప్పుడు, మీకు పైన చెప్పిన ఉదాహరణకు కొన్ని అనువర్తనలు చెబుతాను.

1998 - 99 విద్యా సంవత్సరంలో నేను సూర్యాపేటలో ఓ జూనియర్ కాలేజీలో పనిచేసాను. గుంటూరు నుండి ఒక సంవత్సరం కాంట్రాక్టు మీద పనిచేయటానికి వచ్చాను. కొంతసొమ్ము అడ్వాన్సుగా పుచ్చుకుని మరీ వచ్చాను. మంచి ఫలితం కోసం, త్వరగా సిలబస్ ముగించుకుని, కనీసం రెండుసార్లు రివిజన్ చేయించాలన్న ఉద్దేశంతో, డిసెంబరు 98 కల్లా సిలబస్ దాదాపు పూర్తి చేసాను. అప్పటికి కాలేజీ యాజమాన్యం, నాకు ఒప్పందం కుదుర్చుకున్న సొమ్ములో సగంపైన చెల్లించింది. [అడ్వాన్సు + నెలవారీ సొమ్ముతో కలిపి] ఇంకా ఏభైవేల పైచిలుకు ఇవ్వవలసి ఉంది. ఆ నెల జీతం చెక్కు ఇచ్చి , అది బౌన్స్ చేసి మరీ, యాజమాన్యం నాతో తగవు పెట్టుకుంది.

స్థానికేతరులం కాబట్టి అక్కడ మాకెవ్వరూ తెలియదు. ’ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఊరుకుంటాము, మా ఊరుకు వెళ్ళిపోతాము’ అనుకున్నారేమో నోరు కూడా బాగా ఉపయోగించారు. ప్రక్కనే హుజూరు నగర్ లో ఉన్న నా బాల్యమిత్రుడి ద్వారా సూర్యాపేటలోని స్థానిక పెద్దల దగ్గర పంచాయితీకీ ప్రయత్నించాము. అలాగే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. దాదాపు 20 రోజుల పాటు కేసు సాగింది. కాలేజీ యాజమాన్యం స్థానిక నాయకుల దగ్గర పలుకుబడి ఉపయోగించింది. దాంతో మాకు అక్కడ న్యాయం జరగలేదు. స్థానిక సిఐ కి మొత్తం వివరించి న్యాయం చేయమని అర్ధించాము.

ఇంతలో, సూర్యాపేటలోని సదరు కాలేజీ విద్యార్ధుల తల్లిదండ్రులలో ఇద్దరు, పోలీసు స్టేషన్ లో "లెక్చరర్ ని సంవత్సరం మధ్యలో పంపించివేయటానికి యజమాన్యానికి గానీ, మధ్యలో చదువు చెప్పటం మానేస్తానని అనటానికి లెక్చరర్ కి గానీ, హక్కులేదని, ఎందుకంటే ఇద్దరూ కూడా పిల్లలకి సంవత్సరం వరకూ చదువు చెబుతామని హామీ ఇచ్చారని" యాజమాన్యం పైనా, నా పైనా కూడా కేసు పెట్టారు. అడ్మిషన్ల సమయంలో ఆ హామీ యాజమాన్యమూ ఇచ్చింది, మా చేతా ఇప్పించింది. దానికి నేను "సంవత్సరం మధ్యలో వెళ్ళిపోతానని నేను అనటం లేదండి. కానీ జీతం ఇవ్వక పోయినా పనిచేస్తానని నేను మీకు హామీ ఇవ్వలేదు కదా?" అన్నాను.

అప్పటి వరకూ పోలీసు అధికారులు పిలుస్తున్నా, ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తున్న కాలేజీ డైరెక్టర్లు ఇక తప్పక పోలీసు స్టేషన్ కి తమ మందీ మార్భలం[లాయర్ + రాజకీయ నాయకులు] ని వేసుకుని వచ్చారు. విచారణ/పంచాయితీ ప్రారంభం అయ్యింది. ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్.ఐ.లు, ఒక ASI కూర్చుని, ఆ కాలేజీ డైరెక్టర్ ని ప్రశ్నించటం మొదలు పెట్టారు.

అప్పటికి 20 రోజులుగా అతడికి పోలీసు అధికారులకి మధ్య ఫోను ద్వారా నడిచిన సంభాషణలనీ, పోలీసు కానిస్టేబుళ్ళతో పిలవనంపినప్పుడు అతడిచ్చిన సమాధానాలలో ఉన్న వైరుధ్యాలనీ గుచ్చి ప్రశ్నించారు. వాటిని సమర్ధించుకోలేక చివరికి అతడు ’అసలు లెక్చరర్ కి జీతం ఎగ్గొట్టాలన్న ఆలోచన తనకు లేదని, చెక్కు మీద పొరపాటున పొట్టి సంతకం పెట్టటంతో అది బ్యాంకులో తిరస్కరింపబడిందనీ, దాని మీదట నాకూ, తమకూ మధ్య అపార్ధాలు[communication gap] ఏర్పడ్డాయనీ’ చెప్పాడు.

దాంతో పోలీసు అధికారులు ’ఇన్నేళ్ళుగా కాలేజీ నడుపుతూ, ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తూ, బ్యాంకులో తను పెట్టిన నమూనా సంతకం పొడవైనదో పొట్టిదో తెలియదా? ఇప్పుడు కొత్తగా పొరపాటుపడతారా? సరే! పొరపాటే పో! దిద్దుకోవటానికి 20 రోజులు పడుతుందా? అదీ క్లాసులు పోగొట్టుకుంటూ! డబ్బు ఇచ్చేస్తే సమస్య సాల్వ్ అయ్యేది కదా? అది వదిలేసి లాయర్ల వెంటా, రాజకీయ నాయకుల వెంటా ఎందుకు తిరిగినట్లు?’ అంటూ ప్రశ్నల పరంపర గుప్పించారు. చివరికి అతడు తప్పు ఒప్పుకున్నాడు.

విద్యాసంవత్సరం ప్రారంభంలో నమ్మకమూ, సుహృద్భావమూ కొద్దీ, అగ్రిమెంట్లు లాంటి వేవీ వ్రాసుకోలేదు. అప్పుడు తాజా అగ్రిమెంటు వ్రాయించి, సమస్య తీర్చారు. ఎక్కడా... పోలీసులు, కాలేజీ డైరెక్టరుని గానీ, అతడి తరుపున వచ్చిన వారిని గానీ గద్దించటం గానీ, బెదిరించటం గానీ చేయలేదు. లాజికల్ గా, కూల్ గా ప్రశ్నించారు. ఆ విధంగా పోలీసులు నేరనిరూపణ, విశ్లేషణ ఎలా చేస్తారో మాకు అనుభవ పూర్వకంగా మరోసారి అర్ధమయ్యింది. [ఇద్దరి సిఐల్లో ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్. ఈ కేసు నడుస్తున్న రోజుల్లో అది రంజాన్ మాసం, నా కేసు క్రిస్ మస్ రోజు సెటిల్ అయ్యింది.]

సంవత్సరంన్నర తిరిగేటప్పటికి, అదే పోలీసు స్టేషన్లో, పోలీసులు నేరస్తులను కాపాడదలుచుకుంటే ఎలా ప్రవర్తిస్తారో కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. 2000 - 2001 లో సూర్యాపేటలోని మా ఇంటి యజమానురాలి వేధింపు గురించీ, ఎంసెట్ ర్యాంకు మోసాలపై మా ఫిర్యాదు అనంతర పరిస్థితుల గురించిన నా గతటపాలలో, మీరు ఆ వివరాలు చదివి ఉన్నారు.

ఇక మరో అనువర్తన చూడండి. నిన్న[జనవరి 11, 2010] ఈనాడు కర్నూలు ఎడిషన్ లోని వార్తాంశం:
>>>నంద్యాల గ్రామీణ, న్యూస్ టుడే: శిరువెళ్ల మండలం మహదేవాపురం గ్రామానికి చెందిన పన్నెండేళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామానికి చెందిన సంటెన్న తనపై అకారణంగా కులం పేరుతో దూషిస్తూ దుస్తులూడదీసి చెట్టుకు కట్టి కొట్టినట్లు బాధిత బాలుడు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో సంటెన్నతో నరహరి, నర్సి పాల్గొన్నట్లు తెలిపారు. బాలుడు తమ ఇంట్లో టీవీ చూడడానికి వచ్చి ఒంటరిగా ఉన్న బాలికపై బలత్కార యత్నానికి పాల్పడుతుండగా కేకలు వేయటంతో లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయామని ఎదుటిపక్షం వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాము బాలుడ్ని పట్టుకుని మందలించి పంపామని చెబుతున్నారు. చిన్నారిని చెల్లిలా చూసుకున్నానని నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. రెండు వర్గాల ఫిర్యాదులను స్వీకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పై వార్తలోని నేరాన్ని పోలీసులు ఎలా విశ్లేషిస్తారు? బాలుడు చెబుతున్న దాంట్లో నిజానిజాలెంత? ఎదుటి పక్షం[సంటెన్న] చెబుతున్న దాంట్లో నిజానిజాలెంత? అకారణంగా ఎవరైనా ఎవరినైనా దుస్తులూడదీసి చెట్టుకి కట్టి ఎందుకు కొడతారు? కులం పేరుతో ఎందుకు దూషిస్తారు? చెప్పబడుతున్న నేరం ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ఆ సమయంలో నిందితులూ, భాదితుడూ కూడా అక్కడే ఉన్నారా మరెక్కడైనా ఉన్నారా? సదరు సంఘటనకి సాక్షులూ, సాక్ష్యాధారాలూ ఉన్నాయా?

ఎదుటి పక్షంగా చెబుతున్న సంటెన్న గట్రాల వాదనలో నిజమెంత? ’కులంపేరుతో దూషణ కేసు’ భయంతో మందలించి వదిలేసాం అని చెబుతున్నారా? మరింకెందుకైనా బాలుణ్ణి కొట్టి, ఇప్పుడు తమ ఇంటిలోని బాలికపై అత్యాచార యత్నం అని బనాయిస్తున్నారా? నిజానికి తమ ఇంటి ఆడపిల్లని ఎవరూ అల్లరి పెట్టుకోరు. ఆ ధైర్యంతోనే బాలుడు, అతడి తండ్రి తమను కులం పేరుతో దూషించారన్న కేసు పెట్టారా? లేక తమ ఇంట్లో టీవీ చూడటానికి రానిస్తే, ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతోనే కొట్టారా? బాలుడుగా చెప్పబడుతున్న పిల్లవాడి తీరు ఎలాంటిదీ? బాలికని చెల్లిలా చూసుకున్నానని అంటున్నాడంటే అసలు ఆ వయస్సుకి[12 ఏళ్ళకి] చెల్లిలా గాక మరోలా చూడొచ్చుననే ఆలోచన ఎలా తెలుస్తుంది? ఇవన్నీ గాక, ఇంకా ఏమైనా వేరే కారణాలున్నాయా అని కూడా ఆరాతీస్తారు.

ఇలా... అన్ని కోణాలలో పోలీసులు ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు. రెండు వర్గాలనీ ప్రశ్నిస్తారు. ఇతర పరిస్థితులనీ, పరిసర వ్యక్తులనీ పరిశోధించి విచారిస్తారు. నిజాన్ని వెలికి తీస్తారు. అంతే తప్ప, నేరం జరిగిన ప్రతిచోటా నిఘా కెమెరాలు బిగించలేరు. వీడియోలు, ఫోటోలు, సంభాషణా టేపులూ సంపాదించలేరు.

ఈ చిన్న కేసునే దేశపు పరిమాణంలో చూస్తే... రాజీవ్ గాంధీ హత్య అయినా రాజశేఖర్ రెడ్డి మరణమైనా... ఎవరు చేశారు? ఎవరు చేయించారు? సహజంగా జరిగిందా? జరిపించబడిందా? ఇలా అన్ని కోణాలు పరిశీలిస్తారు. ఎవరికి మోటివ్స్ ఉన్నాయో విశ్లేషిస్తారు.

ఒక దృష్టాంతం పరిశీలించండి.

2008, జూలైలో అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి ఎర్రపార్టీవాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నారు. దరిమిలా జూలై 22 న పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గవలసి వచ్చింది. ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తూండగా, సాక్షాత్తూ పార్లమెంటు హాలులో, ఓటుకు నోటు వివాదం డబ్బు కట్టలతో సహా ప్రత్యక్షమైంది. తమకు డబ్బు ఎరవేసి ఓటు కొనాలనుకున్నారని భాజపా ఎంపీలు ప్రకటించారు. తమపై బనాయిస్తున్నారని కాంగ్రెస్సూ, మిత్రపక్షాలూ వాదించాయి. చివరికి కిశోర్ చంద్రదేవ్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ వేసారు. ఓ అయిదారు నెలలు విచారణ చేసి, సదరు కమిటీ అదంతా ఉత్తుత్తి దేనంటూ పెద్ద రిపోర్టు ఇచ్చింది. అయితే సదరు కేసుని బనాయించారని చెప్పబడ్డ భాజపా ఎంపీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు సుమా!

అలాంటి కమీషన్లూ, కమిటీలు[జైన్, లిబర్ హాన్ గట్రాలన్న మాట] మానవమాత్రుడు జన్మలో చదవలేనన్నీ[50,000 పేజీలు] పేజీల కొద్దీ నివేదికలు ఇవ్వడం, వాటిపైన పార్లమెంటు సమర్పణకు ముందే లీకులు కావటం వంటి కొన్ని నాటకీయ పరిణామాలు రక్తి కట్టటం, తర్వాత తీరిగ్గా పార్లమెంటులో అంతే నాటకీయ చర్చజరగటం, మీడియా ప్రచారం... అన్నీ యధాప్రకారం జరిగిపోతాయి. ఆ ఖాతాలోనే కిశోర్ చంద్రదేవ్ నివేదికా వెళ్ళిపోయింది.[ఇవన్నీ చూసినప్పుడు నాకు రాజకీయనాయకులే సహజ నటులేమో అన్పిస్తుంది.అనవసరంగా సినిమా వాళ్ళ నటనకు అవార్డులు ఇస్తాం గానీ, రాజకీయనాయకులకి ఇవ్వాలి.]

అయితే, అప్పటికి తెదేపా ఎంపీలై ఉండి క్రాస్ ఓటింగ్ చేసి, తత్పలితంగా తెదేపా నుండి గెంటి వేయింపించుకుని, ఆనక కాంగ్రెస్ లో స్వాగత సత్కారాల సహితంగా చేరి, ఢిల్లీ ఏపీ భవన్ లో ’క్యాబినెట్ మంత్రి’ స్థాయి హోదా పదవిని పొందాడు మందా జగన్నాధం. ఇక కోటీశ్వరుడు డికే ఆదికేశవులు నాయుడు తితిదే ఛైర్మన్ పదవికి పొందాడు. యధేచ్చగా నడుస్తున్న పాసులు, అయ్యవారి అభరణాది ఆస్థుల అవకతవకల్లో యధాశక్తి వాటాలు మామూలుగానే అందుతాయి కదా?

జేయంయం నేత శిబూశోరెన్ అయితే, పత్రికాముఖంగానే, ’ యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి నిలబెట్టినందుకు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, చేసుకున్న ఒప్పందాన్ని [బేరాన్ని] కాంగ్రెస్ తుంగలో తొక్కింది’ అని దుయ్యబట్టాడు. దాంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడాని తప్పించి శిబూశోరెన్ ని పీఠం ఎక్కించింది. తర్వాత ఉపఎన్నికలలో శిబూశోరెన్ ఓడిపోయాడు.[మొన్న ఎన్నికలలో గెలిచి సీఎం. అయిపోయాడు లెండి] ఏ సంబంధాలు బెడిసి కొట్టాయో గానీ, మధుకోడా అవినీతి బయటపడి ఇబ్బందుల్లో పడ్డాడు.

ఈ వ్యవహారంలో ముఖ్యంగా పరిశీలించాల్సింది ఏమిటంటే - ఓటు వేసినందుకు పదవులు ఇస్తామని ప్రమాణం చేసిన కాంగ్రెస్స్, దాని అధినేత్రి, ఆ ప్రకారమే పదవులూ ఇచ్చిన కాంగ్రెస్సూ, దాని అధినేత్రి డబ్బులు మాత్రం ఇవ్వరా? కళ్ళ ముందు కనబడుతున్న ఈ విషయాన్ని విశ్లేషించడానికి, పరిశోధించడానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి కిశోర్ చంద్రదేవ్ ల కమిటీలు అవసరం లేదు. సీబిఐ లూ, సీఐడీలూ కూడా అవసరం లేదు. మీడియా ఈ విషయాలని దాచుకుంటూ... కాంగ్రెస్ నీ, దాని అధినేత్రి సోనియాని కాపాడుకుంటున్న తీరు గమనించినా, సామాన్యులకి సైతం విషయం అర్ధమౌతుంది.

[ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - 1996 కు ముందు పీవీజీ పార్లమెంటులో విశ్వాస పరీక్ష నెగ్గడానికి శిబూశోరెన్ కి పైకం ఇవ్వచూపారన్న కేసు! అలాగని స్వయంగా నిందారోపణ చేసిన శిబూశోరెన్! జేఎంఎం ముడుపుల కేసుగా మీడియా ప్రచారించిన కేసు! ముఖ్యమంత్రి పదవులిస్తానంటే ఎంపీగా తన పవిత్ర[?] ఓటును అమ్ముకున్న శిబూశోరెన్ ’మరింకేవో’ [డబ్బు + పదవులూ] ఇస్తానంటే ’ఎవరి మీదనైనా కేసులు బనాయించమన్న’ డీల్ కు ఓకే చెప్పడా? శిబూసోరేన్ ఎంతటి క్రిమినలో ఇప్పటికి బాగానే బహిర్గతమయ్యింది కదా! వ్యక్తిగత కార్యదర్శి హత్యకేసులతో సహా!

పీవీజీ మీద, ఎవరినైతే ఉపయోగించి విశ్వాసపరీక్షలో ఓటు కొన్నాడన్న అభియోగాన్ని, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీ రావు, అతడి సోదర తుల్య సోనియా మోపారో... అదే శిబూసోరెన్ కి.. పార్లమెంటులో... అలాగే విశ్వాస పరీక్షలో నెగ్గడానికి, ముఖ్యమంత్రి సీటు ఆఫర్ చేశారని నిరూపించబడటం, మీడియా యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడిన తీరు, ప్రతిపక్షాలు గమ్మునుండటం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఎవరెలాంటి వారో స్పష్టంగా బహిర్గతం చేసిన అంశం ఇది. అలాగే సోనియా బృందపు సువర్ణముఖిలో భాగం కూడా!]

ఈ విధంగా, 2008 విశ్వాసపరీక్షలో శిబూసోరెన్ ఓటు వ్యవహారంలో కిశోర్ చంద్రదేవ్ ఏం చెప్పినా,... మీడియా ఏమీ చెప్పక పోయినా... నేరం జరిగిందో లేదో... ఏ వీడియోలు, ఫోటోలూ, సంభాషణల టేపులూ అవసరం లేకుండా... ప్రజల విశ్లేషణకి, అర్ధమౌతూనే ఉంది. నిర్దారించుకోగలిగేంత స్పష్టంగా, సంఘటనాత్మకంగా నిరూపించబడింది. కాకపోతే చూడగల కన్ను, గుర్తించగలిగే ఓపిక సామాన్యులకి ఉండాలి. అంతే!

నవంబరు 26, 2008 కేసును పరిశీలించామంటే... తాజ్ హోటల్ లో పాక్ తీవ్రవాదులు దాడి. ఏకంగా తాజ్ హోటల్ లో కంట్రోలు రూం నే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు అంతగా వాళ్ళకి సహకరించారు? హోటల్ యాజమాన్యం ప్రమేయం లేకుండా, హోటల్ సెక్యూరిటీ కళ్ళుగప్పి అంత విధ్యంసాన్ని సృష్టించగల ఆయుధాలని లోపలికి ఎలా చేరవేయగలిగారు? ఇందులో వీడియో టేపులు బయటపడినా కసబ్ లు బుకాయించగలుగుతున్నారంటే, తాను మైనర్ నని ఓ రోజు, ఏ పాపం ఎరగని అమాయకుడననీ, సినిమా వేషాల కోసం వస్తే పోలీసులు పట్టుకుని కేసులో ఇరికించారని ఓ రోజూ అనగలిగేంత, తనకు సెంటు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేంత దన్ను అతడికి ఎవరు ఇస్తున్నారు? వీటన్నింటిని పోలీసులు విశ్లేషించటం లేదు.

అలా చూస్తే... భారతదేశమ్మీద జరుగుతున్న రాజకీయ, ఆర్ధిక, విధ్వంసక కుట్రలలో ’పెద్దవాళ్ళ అండ ద్రోహులకి ఉండటం’ సామాన్య ప్రజల కళ్ళెదుట నిలిచిన సత్యం. ఆ విధంగా ద్రోహులని రక్షిస్తున్న వారిలో కొందరు IAS, IPS అధికారులుండవచ్చు, కేంద్రరాష్ట్రప్రభుత్వాధినేతలుండవచ్చు, ప్రభుత్వ కుర్చీ వ్యక్తులుండవచ్చు, మీడియా సామ్రాట్టులూ ఉండవచ్చు. ఎవరి పాత్ర గురించీ, ఎవరూ, వీడియోలు, ఫోటోలూ, సంభాషణల టేపులూ వెలువరించలేరు.

ఏవిధంగా అయితే... ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు, అక్కడే ఉండి పరిశీలించలేరో, అదే విధంగా... దేశం పట్ల జరుగుతున్న ఈ ద్రోహంలో, సామాన్యులు కూడా పరిశీలించలేరు.

ఏవిధంగా అయితే... పోలీసులు నిందుతులనీ, బాధితులనీ, ఆయా పరిస్థితులనీ, వాటి మధ్య కార్యకారణ సంబంధాలనీ, సంఘటనల ముందు వెనకలనీ, సంభావ్యతలనీ పరిశీలించి నేర విశ్లేషణా, నిర్ధారణా చేస్తారో... అదే విధంగా... ప్రజలూ ఆయా వ్యక్తులనీ, వారి మాటలనీ, చేతలనీ, పరిస్థితులనీ పరిశీలిస్తే ఎవరి చరిత్ర ఏమిటో, ఎవరి స్వభావం ఏమిటో కూడా విశ్లేషించనూ వచ్చు, నిర్ధారించుకోనూ వచ్చు.

నేరపరిశోధనలో, నేర నిర్ధారణలో, ఇది ప్రపంచమంతా అంగీకరించే శాస్త్రీయ విధానం!

పత్రికలైనా ఇలాగే విశ్లేషించి, కథనాలు వెలువరించాలి. కాకపోతే మీడియానే ప్రధాన కుట్రదారు గనక నిజాలు తొక్కిపట్టటం, తమకి కావలసిన విధంగా కథనాలు వెలువరించటం, ఏకవాక్య తీర్పులు చెప్పటం చేస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site here http://www.webtelugu.com/

మీ ఓపికకు అకుంఠిత దీక్షతో వివరిస్తున్నతీరుకూ నా నమోవాకాలు.

మీ అభిమానానికి ధన్యవాదాలండి.

అందఱికీ అన్నీ తెలిసీ, అందఱూ అన్నీ ఆలోచించగలిగితే అసలు ఏ ఇబ్బందీ ఉండదు. వార్తాపత్రికలు ఈ లోటును పూరిస్తాయి అని వాటిపై ఉంచిన నమ్మకాన్ని అవే వమ్ము చేసుకుంటున్నాయి. కొన్నినాళ్ల తరువాత బహుశా వార్తాపత్రికల ప్రపంచం పూర్తిగా అంతమయ్యినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందీ అంటే, ఏ రోజున ఐతే ఎక్కువమంది ప్రజలకు వివిధమైన విషయాలపట్ల అవగాహన కలుగుతుందో అప్పుడు.

చక్కగా విశ్లేషించారండీ. నెనర్లు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu