ఈ క్రిస్మస్ పండుగ రోజున కేకంత తియ్యని కథ, మీ ఇంటిలోని బుడ్డీల కోసం వ్రాస్తున్నానండి! నేరుగా కథలోకి....

అనగా అనగా...

ఓ ఎడారి. ఆ ఎడారిలోని ఒయాసిస్సు ప్రక్కన ఓ చిన్ని ఇంట్లో ఓ బామ్మ, తాత, తమ చిన్నారి మనుమరాలితో నివసించేవాళ్ళు. ఆ చిన్నారి పేరు నీలూ! ఒయాసిస్సు ఒడ్డున పెరిగే ఖర్జూరపు పళ్ళుతింటూ, అక్కడి కొచ్చే పక్షులతోనూ, జంతువులతోనూ ఆడుకుంటూ నీలూ హాయిగా ఉండేది. తాత తనకొచ్చిన చదువూ, కథలూ చెప్పేవాడు.

ఓ రోజు ఎడారిలో పెద్ద ఇసుక తుఫాను చెలరేగింది. తాత, నీలూని నేలమాళిగలో దాక్కునేందుకు రమ్మని గట్టిగా కేకవేసాడు. పక్షులతో ఆడుకుంటున్న నీలూ పరుగెత్తుకెళ్ళింది. అప్పటికే బామ్మా, తాత తమ ఇంట్లో మూలనున్న తలుపు తెరుచుకుని మెట్లద్వారా నేలమాళిగలోకి వెళ్ళారు. నీలూ మెట్లు చేరేలోగా ఇసుక తుఫాను రానే వచ్చింది. ఇంటిగోడలతో సహా నీలూని సుడిగాలి ఎగరేసుకుపోయింది. భయంతో, నీలూ కళ్ళు మూసుకుంది.

కళ్ళు తెరిచేసరికి ఏముంది? నీలూ ఎడారి అంచున పడి ఉంది. తమ ఇల్లుండే ఒయాసిస్సు కనుచూపు మేరలో లేదు. తలత్రిప్పి చూస్తే దూరంగా ఏదో ఊరు కనబడుతోంది. పాపం నీలూకి ఏడుపొచ్చింది. కానీ తాత కష్టాలొచ్చినప్పుడు ఏడవకూడదని, దాన్ని దాటడమెలాగో ఆలోచించాలని చెప్పాడు. నీలూ కళ్ళు తుడుచుకుని ఆలోచించటం మొదలెట్టింది. తాత తనకి చెప్పిన నీలినగరం కథ గుర్తుకు వచ్చింది. ఎడారి కావల నీలినగరం ఉందని, దాని రాజు చాలా మంచివాడనీ, ఎవరేం అడిగినా కాదనడని తాత తనకి చాలాసార్లు చెప్పాడు. నీలి నగరానికి వెళ్ళె దారి నీలంగా ఉంటుందనీ, ఆ నగరంలో అన్నీ నీలం రంగులోనే ఉంటాయనీ చెప్పాడు.

అదంతా గుర్తు తెచ్చుకుని నీలూ నలుదిక్కులా చూసింది. నీలపు దారి కనబడింది. నీలూ చకచకా ఆ దారిలో నడవసాగింది.

అలా... అలా... పోతూ పోతూ ఉండగా... దారిలో నీలూకి ఓ పొలం గట్టునున్న దిష్టిబొమ్మ కనబడింది. నీలూ పొలంగట్టున చెట్టునీడన కూర్చొంది. దిష్టిబొమ్మ "ఏం పాప? ఎక్కడి కెళ్తున్నావు?" అంది.

"నీలి నగరం కి?" అంది నీలూ!

"ఎందుకూ?" అంది దిష్టిబొమ్మ.

"మరేం! నాకు మా ఇంటికి దారి తెలియటం లేదు. నీలినగరం రాజు చాలా మంచివాడనీ, ఎవరేది అడిగినా ఇస్తాడని మా తాత చెప్పాడు. మా ఇంటికి పంపించమని అడగటానికి వెళ్తున్నాను" అంది నీలూ!

"అయితే నేనూ నీతో వస్తాను. నేను ఇంత ఉన్నానే గానీ నాకస్సలు తెలివే లేదు. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. నీలినగరం రాజుని నేను, నాకు తెలివి నిమ్మని అడిగి తెచ్చుకుంటాను" అంది దిష్టిబొమ్మ.

నీలూకి జాలేసింది. దిష్టిబొమ్మ తోడుగా ఉంటే ఇద్దరూ ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చని సరేనంది.

ఇద్దరూ అలా... అలా... పోతూ పోతూ ఉండగా... దారిలో వాళ్ళకి ఓ అడవిలో సింహం ఎదురొచ్చింది. నీలూ, దిష్టిబొమ్మ అలా దిమ్మెర పోయి చూడసాగారు. సింహం వీళ్ళద్దరినీ చూసి "ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు?" అంది కళ్ళెగరేస్తూ!

"నా పేరు నీలూ! నీలినగరం వెళ్తున్నాం" అంది నీలూ!

"ఎందుకు?" అంది సింహం కుతూహలంగా!

"నీలి నగరం రాజు మంచివాడు. ఎవరేమడిగినా ఇస్తాడు. నన్ను మా ఇంటికి చేర్చమనీ అడగటానికి వెళ్తున్నాను. ఈ దిష్టిబొమ్మకి తెలివి కావాలట. అందుకే నాతో వస్తానంది" అంటూ వివరంగా చెప్పింది నీలూ!

"నిజంగానా? అయితే నేనూ మీతో వస్తాను. నేను ఈ అడవికే రాజుని. నన్ను చూసి అన్ని జంతువులూ భయపడిపోతాయి గానీ, నిజంగా నాకు ధైర్యం లేదు. నీలినగరం రాజుని అడిగి ధైర్యం ఇప్పించుకుంటాను" అంది సింహం.

నీలూ, దిష్టిబొమ్మ కూడా సరే రమ్మన్నారు.

ముగ్గురూ అలా... అలా... పోతూ పోతూ ఉండగా... దారిలో వారికి ఓ మరమనిషి ఎదురొచ్చాడు. "ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు?" అన్నాడు గరగర శబ్ధం చేస్తూ!

"నా పేరు నీలూ! నీలినగరం రాజుని అడిగి ధైర్యం ఇప్పించుకోవడానికి ఈ సింహం, తెలివి ఇప్పించుకోవటానికి దిష్టిబొమ్మ నాతో వస్తున్నారు. మా ఇంటికి పంపించమని అడగటానికి నేను వెళ్తున్నాను" అంది నీలూ!

"మరైతే నేనూ మీతో వస్తానూ. నాకు అసలు పనిఒడుపే లేదు. నీలి నగరం రాజుని అడిగి పని ఒడుపు తెచ్చుకుంటాను" అన్నాడు మరమనిషి ఉత్సాహంగా!

నీలూ, దిష్టిబొమ్మ, సింహం "సరే రా!" అన్నారు.

నలుగురూ... అలా... అలా... పోతూ పోతూ ఉండగా... దారిలో వారికి ఓ అగడ్త ఎదురొచ్చింది. అగడ్త అంటే రెండు కొండల నడుమ లోతైన ప్రదేశం అన్నమాట. ఆ కొండకీ ఈ కొండకీ నడుమ దాదాపు నాలుగైదు అడుగుల వెడల్పుంది.

నలుగురూ ఏం చెయ్యటమా అని ఆలోచిస్తున్నారు. ఇంతలో దిష్టిబొమ్మ "ఓ పని చేస్తే?" అంది కళ్ళు మెరిపిస్తూ.

"ఏమిటి?" అన్నారంతా!

"మన ముగ్గురం సింహం వీపుమీద కుర్చుందాం. సింహం ఒక్క ఉదుటున ఈ కొండ మీద నుండి ఆ కొండ మీదికి దూకేస్తే సరి! ఎంచక్కా ముందు కెళ్ళి పోవచ్చు" అంది దిష్టిబొమ్మ.

"ఏం నేస్తం, దూకగలవా?" అన్నారు నీలూ, మరమనిషీనూ.

సింహం గుండెలు పొంగిస్తూ, "ఓ! భేషుగ్గా దూకేయగలను" అంది.

ముగ్గురూ సింహం వీపు మీద కూర్చున్నారు. సింహం కాస్త వెనక్కు వెళ్ళి వేగంగా పరుగెత్తుతూ అమాంతం ఈ కొండమీద నుండి ఆ కొండ మీదికి దూకేసింది.

అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆపైన ముగ్గురూ సింహాన్ని మెచ్చుకున్నారు. మళ్ళీ నడక ప్రారంభించారు.

అలా... అలా... పోతూ పోతూ ఉండగా... దారిలో మరొ అగడ్త కనబడింది. ఇది మునుపటి దానికంటే చాలా పెద్దది. దాదాపు ఇరవై అడుగుల వెడల్పు ఉంది. దానికి చూడటంతోనే సింహం దాన్ని దాటటం అసాధ్యమని అందరికీ అర్ధమై పోయింది. ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించసాగారు.

"ఓ ఉపాయం!" ఉత్సాహంగా గట్టిగా అరిచింది దిష్టిబొమ్మ.

"చెప్పు" అన్నారు మిగిలిన ముగ్గురూ.

"ఈ అగడ్త ఇందాకటి దానికంటే చాలా పెద్దది. ఈ కొండ మీది నుండి ఆ కొండమీదికి సింహం కూడా దూకలేదు. అంచేత మనమో పని చేద్దాం. ఈ దేవదారు చెట్టు చూడండి. ఎంతో ఎత్తుగా ఉంది. ఎవరైనా దీన్ని నేర్పుగా కొట్టి ఈ అగడ్తకి అడ్డంగా, ఈ కొండ మీదినుండి ఆ కొండ మీదికి వంతెన లాగా పడవేస్తే, ఎంచక్కా అందరం దాని మీది నుండి నడుచుకుంటూ అవతలి పక్కకి వెళ్ళిపోవచ్చు" అంది దిష్టిబొమ్మ.

"ఎవరు ఈ చెట్టుని కొట్టగలరు?" సాలోచనగా అంది నీలూ!

"నేను కొడతాను" అంటూ మరమనిషి ముందు కొచ్చాడు. తన చేతుల్నే గొడ్డలిలాగా ఉపయోగించి చెట్టుని నేర్పుగా కొట్టాడు. సరిగ్గా అది నేలకి ఒరిగేటప్పుడు ఎంతో ఒడుపుగా ఈ కొండ మీది నుండి ఆ కొండ మీదికి, అగడ్తకి అడ్డంగా వంతెనలా పడేటట్లు వేసాడు.

అందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. జాగ్రత్తగా, ఒకరివెనుక ఒకరుగా చెట్టు మీది నుండి అగడ్త దాటేసారు. ఇంకొద్ది దూరం నడిచేసరికి దూరంగా నీలి కాంతులతో మెరుస్తూ నీలినగరపు కోట గోడలు కనబడ్డాయి. నలుగురూ సంతోషంతో గబాగబా నడిచారు. నగరం దాపులకి చేరారో లేదో... వాళ్ళెదుట... చింపిరి జుత్తూ, పొడవాటి గౌను, తెల్లటి బూట్లు వేసుకున్న ఓ తెల్లటి మంత్రగత్తె నిలబడింది.

పెద్దగా నవ్వుతూ నలుగురినీ పట్టుకెళ్ళి తన ఇంట్లో బంధించింది. మంత్రగత్తె ఇల్లు నీలినగరపు కోటగుమ్మానికి దగ్గర్లోనే ఉంది. పెద్ద కళ్ళు, పటపటలాడిస్తున్న పళ్ళు... మంత్రగత్తె వికృతంగా నవ్వుతూ... సింహాన్నీ, దిష్టిబొమ్మనీ, మరమనిషినీ ఓ గదిలో పెట్టి తాళం వేసింది. నీలూ చేత ఇంటెడు చాకిరీ చేయించసాగింది. రోజూ, మంత్రగత్తె, దాని స్నేహితులు విందులూ వినోదాలూ చేసుకునే వాళ్ళు. ఆ గిన్నెలన్నీ కడగటం, ఇల్లు శుభ్రం చేసి అలంకరించటం, రకరకాల వంటలు చేసి వడ్డించటం... అన్నీ పనులూ నీలూ చేత చేయిస్తోంది. పగలంతా పని చేసి అలిసి పోయిన నీలూ, రాత్రికి తన నేస్తాలని చేరేది. పాపం నీలూ కష్టాలు చూసి, జైలు లాంటి గదిలో బంధింపబడిన దిష్టిబొమ్మ, సింహమూ, మరమనిషీ చాలా బాధపడేవి. కోపమూ, దుఃఖమూ కలిగినా ఏం చెయ్యలేక వూర్కునేవి.

ఓ రోజు నీలూ గిన్నెలు కడుగుతూ ఉంది. అంతలో మంత్రగత్తె అటుగా వచ్చి "ఏం? ఎంత సేపు తోముతావు?" అంటూ హుంకరించింది. నీలూ గమ్మున కన్నీళ్ళు తుడుచుకుని పని చేసుకోసాగింది. మంత్రగత్తె కోపంతో మండిపడుతూ, నీలూని ఆమె నేస్తాలనీ కూడా తిట్టసాగింది. "త్వరగా కానీయ్! దరిద్రపు మొహమా!అవతల విందుకు సమయమౌతోంది. నీకు తోడు ఆ దరిద్రగొట్టు దిష్టిబొమ్మ, నిద్రమొహం సింహం, తుప్పుపట్టిన మరమనిషీ కూడాను. కానీయ్! కానీయ్!" అంటుండే సరికి నీలూకి బాగా కోపం వచ్చింది. తననే గాక, తన నేస్తాలనీ తిట్టేసరికి ఇక నీలూకి సహనం నశించింది. గిన్నెలు కడుగుతున్న బాల్చీలోని నీళ్ళు ఎత్తి మంత్రగత్తె నెత్తిన కుమ్మరించింది.

అంతే! మంత్రగత్తె కెవ్వున అరిచింది.

"ఏయ్! ఎంతపని చేసావు? నీళ్ళు పోస్తే నేను కరిగి పోతానని నీకు తెలీదూ?" అంటూ కీచుగా అరిచింది.

"ఎందుకలా?" అంది నీలూ అయోమయంగా!

అప్పటికే కరగటం మొదలు పెట్టిన మంత్రగత్తె "నేను పంచదార మంత్రగత్తెని. నా మీద నీళ్ళు పోస్తే కరిగిపోతాను" అంది ఏడుస్తూ. అంతలోనే తల దగ్గరి నుండి పాదాల వరకూ కరిగి నీరై పోయింది. కేవలం మంత్రగత్తె మెడలోని గొలుసూ, దానికి వేలాడుతున్న తాళం చెవీ, తెల్లని బూట్లూ మాత్రమే మిగిలాయి.

నీలూ గబగబా ఆ తాళం చెవి తీసుకుని తన నేస్తాలని బంధించిన గది తెరిచింది. ఇంకా, మంత్రగత్తె బంధించిన వాళ్ళనూ కూడా విడుదల చేసారు. నలుగురూ సంతోషంగా ఒకరినొకరు అభినందించుకున్నారు. మంత్రగత్తె పీడ వదిలినందుకు ఎంతో ఆనందపడ్డారు. నేరుగా నీలినగరంలోనికి వెళ్ళి రాజుని కలిసారు. వాళ్ళు వచ్చిన పని తెలిసి రాజు, నీలూ తో "చిన్నారి! నిన్ను మీ బామ్మా, తాత దగ్గరికి పంపిస్తాను" అన్నాడు.

దిష్టిబొమ్మతో "దిష్టిబొమ్మా! నీకు తెలివి లేదని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి నీకు చాలా తెలివే ఉంది. లేనిది నీ మీద నీకు నమ్మకమే! దారిలో అగడ్తలు దాటటానికి ఉపాయాలు చెప్పింది నువ్వే కదా!? నీకు తెలివి ఉంది" అన్నాడు.

దిష్టిబొమ్మ "లేదు లేదు. మహారాజా! నాకస్సలు తెలివి లేదు. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు కూడా! మీరు నాకు తెలివి ఇవ్వాల్సిందే!" అంది.

రాజు చిరునవ్వుతో తన భటుల్ని పిలిచి "ఒరే! ఒక గిన్నెడు తవుడు తెండి రా!" అన్నాడు.

భటులు అలాగే తవుడు తెచ్చారు.

రాజు దిష్టిబొమ్మ తల పాగా ఊడదీసి దాని తలలో గిన్నెడు తవుడు పోసి, మళ్ళా తలపాగా పెట్టేసాడు. దిష్టిబొమ్మ సంతోషంగా "హమ్మయ్య! ఇప్పుడు నాకు ఎంత తెలివొచ్చిందో" అంది కళ్ళు మెరిపిస్తూ.

రాజు సింహంతో "సింహమా! నీకు ధైర్యానికి కొదవ లేదు. నీ నేస్తాలని వీపు మీద ఎక్కించుకుని అలవోకగా అగడ్త దాటావు. ధైర్యం లేకపోతే అలా చెయ్యగలవా? నీ మీద నీవు నమ్మకం కలిగి ఉండు. నీకు ధైర్యం చాలానే ఉంది" అన్నాడు.

"ఉహు! నాకస్సలు ధైర్యం లేదు మహారాజా! అడవిలో జంతువులన్నీ నన్ను చూసి ఊరికే భయపడతాయి గానీ, నాకు అసలు ధైర్యమే లేదు. మీరు కాదనకుండా నాకు ధైర్యం ఇవ్వండి. కాదంటే కుదరదంతే!" అంది సింహం గట్టిగా!

రాజు నవ్వుకుని భటుల్ని పిలిచి "ఒరే! ఓ ముంత రంగు నీళ్ళు తెండిరా!" అన్నాడు. భటులు అలాగే తెచ్చారు. రాజు సింహం జూలు మీద ఆ నీళ్ళు కొన్ని చిలకరించి, మిగిలిన నీళ్ళు దాన్ని తాగమన్నాడు. సింహం ఆ నీళ్ళన్నీ తాగేసింది.

ఎంతో తృప్తిగా "హా! ఇప్పుడు నాకు బోలెడు ధైర్యం వచ్చింది" అంది సింహం గుండెలు పొంగించుకుంటూ!

రాజు మరమనిషి వైపు తిరిగి "మర మనిషీ! నీకు చక్కని పని ఒడుపు ఉంది. కాబట్టే దారిలో పెద్ద అగడ్తని దాటటానికి చెట్టు కొట్టి, చక్కని వంతెనలా ఏర్పాటు చేసావు. నీ పని నేర్పుని నువ్వే గుర్తించుకోలేకున్నావు" అన్నాడు.

మరమనిషి గాభరా పడిపోతూ, ఎక్కడ మహారాజు తనకు పనిఒడుపు ఇవ్వడో నన్నట్లుగా, గబగబా "లేదు లేదు మహారాజా! నాకు అస్సలు ఇంత కూడా పనిఒడుపు లేదు. నేను కదిలినా మెదిలినా కిర్రుకిర్రుమని చప్పుడౌతోంది. తప్పకుండా మీరు నాకు పనిఒడుపు ఇప్పించి తీరాలి. కాదనకండి" అన్నాడు.

రాజు నవ్వుకుని భటులని పిలిచి "ఒరే! ఈ మరమనిషి కాళ్ళు, కీళ్ళల్లో ఉన్న శీలలన్నిటికి ఇంత కందెన పూసి మళ్ళీ బిగించండిరా!" అన్నాడు. భటులు అలాగే చేసారు.

మరమనిషి సంతోషంగా "ఆహా! ఎంత హాయిగా ఉంది! ఇప్పుడు నేను నడుస్తున్నా కదులుతున్నా అసలు శబ్దమే రావటం లేదు. ఇప్పుడు ఏ పనినైనా ఎంతో ఒడుపుగా చేసేయగలను" అన్నాడు, కించిత్తు గర్వంగా!

అందరి కోరికలూ తీరినందుకు నలుగురూ ఎంతో సంతోషంతో నీలినగరం రాజుకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రాజు నలుగురికీ మంచి బహుమతులిచ్చి పంపాడు. భటులు నీలూని ఆమె తాత బామ్మల దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చారు. నీలూ నేస్తాలకి వీడ్కోలు చెప్పి, తాతా బామ్మల దగ్గరికి వెళ్ళిపోయింది. దిష్టిబొమ్మ తన పొలానికీ, సింహం అడవికీ, మరమనిషి కర్మాగారానికీ వెళ్ళిపోయారు.

రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. అలా అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కూడా మీమీ బ్లాగులకి వెళ్ళిపోతున్నారు. కామెంటి మరీ వెళ్ళండేం!?

నీతి: పిల్లలకి వాళ్ళమీద వాళ్ళకి నమ్మకం కలిగిస్తే ఎన్నో అద్భుతాలు చేసి చూపుతారు.

షరతు: ఈ కథ మీ ఇంటిలోని బుడ్డీలందరికీ వినిపించాలి మరి! లేదా మీ కేకులన్నీ కాకులెత్తుకెళ్ళి పోతాయి జాగ్రత్త!

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!

అంకితం: నేను పదేళ్ళు క్రిస్టియన్ స్కూల్ [స్టాల్ గళ్స్ హైస్కూలు, గుంటూరు]లో చదువుకున్నాను. నేను రెండోతరగతి చదువుతున్నప్పుడు ఒకటో తరగతిలో బాగా చదివినందుకు[అంటే ఫస్ట్ ర్యాంకు అన్నమాట] బహుమతిగా ఇచ్చిన పుస్తకాల్లోనిది ఈ కథ! దీపావళికి వ్రాసిన ’చిన్నోడు - చిక్కుడు చెట్టు’ కూడా వీటిలోనిదే!

క్రిస్టియన్ లైనా హిందూపురాణాలని, నాకు పరిచయం చేసిన మా ఎలిజబెత్ టీచర్ కీ, ఇలాంటి బహుమతులిచ్చిన రాజేశ్వరీ మాధ్యుస్ కీ, మంచి బుద్దులు నేర్పిన సావిత్రి టీచర్ కీ, క్రమశిక్షణ నేర్పిన ఫ్లారెన్స్ ప్రకాశం కీ, ప్రేమించడం నేర్పిన సువర్ణముఖి టీచర్ కీ, మొత్తంగా మా స్కూలుకీ ఈ టపా అంకితం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

bagundi.

:)

బాగుందండీ మీ కథ.

మీరు చెప్పిన ఈ కథ చాలా బాగుంది. చివఱిగా మీరు చెప్పిన నీతి, షఱతు, అంకితం నాకు బాగ నచ్చాయి. ఈ టపా విషయంలొ చాలా ఆలస్యంగానే స్పందించాను నేను, ఇక పొతే ఈ కథ కథకాదు ఒక అమెరికన్ నవల, 1939లొ విజార్డ్ ఆఫ్ ఒజ్ గా హాలివూడ్ వారు సినిమాగ తీసాఱు. నాకు నచ్చిన కొన్ని ఉత్తమ హాలివుడ్ ఛిత్రాలలొ ఇది ఒకటి, 1939లొనే కలర్ సినిమాని ప్రెక్షకులకు హాలివూడ్ వాఱు అందించారు. ఇకపొతే ఇందులొ మీరు చెప్పిన నీలు అసలు పేరు డోఱొతి ఘాలే. దిష్టిబొమ్మ, సింహం, మఱమనిషి అన్ని అందులొని పాత్రలే, కథ అభ్దుతంగా సాగిపొతుంది, ఇంగ్లిషువారి పాటల్లొ కూడ చాలా మంచి సంగీతం వుంది. ఆద్యంతం ఎంతొ అభ్దుతంగా వుంటుంది ఈ సినిమా, ఇంత మంచి కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించిన వారిని ఈ సందర్భంగా అభినందించాల్సిందే. ఈ కథకు సంభందించిన ఇతర అంతర్జాల వివరాలు కింద లంకేలుగా ఇచ్చాను, ఇక మా బుడ్డి (నా మేనకొడలు) ఈ సినిమాని లెక్కలెనన్నిసార్లు చూసింది, నీతి గురించి నేను చేప్తాను తనకి. నాకు ఇంత మంచి సినీమాని బహుకరింఛిన నా స్నెహితురాలికి, ఇంత మంచి కథని తెలుగు అనువాధంలొ మళ్ళి చేప్పిన మీకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

- రేణూ కూమార్

http://www.imdb.com/title/tt0032138/
http://en.wikipedia.org/wiki/The_Wizard_of_Oz_%281939_film%29

రేణూ కుమార్ గారు,

అది నవలని, సినిమా అని నాకు తెలియదండి. దొరికితే చూస్తాను. మా పాపకి కూడా అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం! మంచి సమాచారం ఇచ్చారు. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu