మా మీద నడిచిన రామోజీరావు వేధింపులు, పరిశీలిస్తే మనదేశం మీద ప్రయోగించినవే! గతటపాలలో చెప్పినట్లు మాపైన రామోజీరావు వేధింపులలో కొన్నిటిని మాత్రమే ఫిర్యాదులకి ఎక్కించాము.

’పోకిరి’ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజినీరు బ్రహ్మీని బిచ్చగాళ్ళు ఘెరావ్ చేయటాన్ని, అతడెవ్వరికీ ఫిర్యాదు చేసుకోలేడు. చేస్తే ఏముంటుంది? "ఏయ్! దానం చేస్తే చెయ్, లేకపోతే మానెయ్! ఫోన్ పెట్టేయ్!" అన్న హెచ్చరిక వస్తుంది. బంధుమిత్రులకో, సహోద్యోగులకో చెబితే నవ్వుతారు కూడా! కానీ అనుభవించే ’బ్రహ్మీ’కి మాత్రం అది చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్నుండి పుట్టిన హాస్యాన్నే మనం సినిమాలో చూశాం. నిజజీవితంలో అయితే అది నవ్వు పుట్టించదు.

కొన్ని ఉదాహరణలతో ఈ స్ట్రాటజీని వివరిస్తాను.

మన ఇంట్లో మనకి ఇతరులు బహుమతిగా ఇచ్చినవో, లేక మనమే ఏవైనా ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొనుక్కున్నవో లేక ప్రత్యేక సంధర్భాల్లో సేకరించినవో కొన్ని వస్తువులు ఉంటాయి. వాటి ఖరీదుతో నిమిత్తం లేకుండా ఆయా వస్తువులు మనకి జ్ఞాపకాల రీత్యా, అనుబంధాల రీత్యా అపురూపమైనవై ఉంటాయి. అవి ఫోటోలు కావచ్చు, వస్తువులు కావచ్చు. మన ఇంటికి వచ్చిన వారిలో కొందరు అలాంటి వస్తువుల్ని తస్కరించారనుకొండి. మనకెలా ఉంటుంది? ఒకోసారి ఆయా వస్తువులు మిస్సవటాన్ని మనం వెంటనే గుర్తించం. గుర్తించినప్పుడు మనమే పొరబాటున ఎక్కడైనా పారేసుకున్నామేమో అనుకుంటాం. ఒకోసారి వెంటనే గుర్తించినా నమ్మలేం! పదే పదే ఇలాంటివి జరిగినప్పుడు మనకి రూఢి అయిపోతుంది. అయితే ఎవరితోనూ, ఏమీ అనలేం. అంటే సదరు వ్యక్తులతో మన సంబంధాలు దెబ్బతింటాయి. వాళ్ళతో గాక మరొకరితో అన్నా, ’పెదవి దాటితే పృద్వి దాటి’ మరీ చేరాల్సిన వ్యక్తులకి ఆ మాటలు చేరతాయి.

అదీగాక, ఆయా వస్తువులు ఏమాత్రం ఖరీదైనవై ఉండవు. అనుభూతిరీత్యా మాత్రమే విలువైనవై ఉంటాయి. ఆర్ధికస్థాయి బాగా ఉండే మన అతిధులు, రూపాయల్లో ఖరీదులేని వస్తువుల్ని తస్కరించటం అంటే, ఎవరో కాదు ఒక పట్టాన మనమే నమ్మలేం. అలాంటిది ఎవరికైనా ఏమని చెప్పగలం?

ఒకోసారి తస్కరించరు. యధాలాపంగా పడేసినట్లు పగలగొట్టేయటం, విరగ్గొట్టటం చేస్తారు. సింపుల్ గా ఒక ’సారీ’ చెప్పేస్తారు. ఆ చెప్పటంలో ఏ మాత్రం బాధ ఉండదు. ’పొరపాటున వస్తువు పాడయ్యిందే’ అన్న పశ్చాత్తాపం ఉండదు. ఈ పని మూలంగా ఎదుటి వాళ్ళకు [అంటే మనకు] బాధ కలుగుతుందేమోనన్న మెహమాటం కూడా ఉండదు. ఎంతో మామూలుగా ’సారీ’ చెప్పేస్తారు. ఆ చెప్పటంలో యాదృచ్చికం గాక, ప్రయత్నపూర్వకం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒకసారికి గాక పోయినా, పదోసారికో పదకొండో సారికో ఆ స్ట్రాటజీ మనకి అర్ధమౌతుంది. వెరసి మన జ్ఞాపకం, అనుభూతి, భావం భగ్నమౌతాయి.

ఇలాంటి పది అనుభవాలు పదిమందితో[ఒకరితో ఒక్కోటి కాదు, ఒకొక్కరితో పదిరకాలుగా] ఎదురయ్యాక.... ఎవర్నీ ఇంట్లో దాకా అనుమతించక పోవటం, ఒక పరిమితికి లోబడిన స్నేహం చెయ్యటం ప్రారంభించామను కొండి. ఇక మాటల ఈటెలు పరోక్షంగా వచ్చి తగుల్తాయి. సూటిపోటీ మాటలంటారే, అలాగన్న మాట! ఉలిపి కట్టెలం అనీ! ఎవర్నీ నమ్మని నెగిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళమనీ! అంటారు. అదే సమయంలో ఇరుగుపొరుగులతోనూ, స్నేహితులతోనూ అంటీ ముట్లనట్లుగా ఉండటం XYZ సిండ్రోమ్ అనీ, ABCD డిజార్డరు అనీ ’పత్రికలలో’ వ్యాసాలు వస్తాయన్న మాట!

ఇలాక్కాదని, కొద్దిమందితో మాత్రమే, కొంచెం ఎక్కువ స్నేహమే చేశామనుకొండి. ఇక వాళ్ళు, ప్రతి పండక్కీ లేదా ఏదో ఒక వంక పెట్టుకుని విందు ఆహ్వానాలు చెయ్యమంటారు. వాళ్ళు చేస్తారు. ఏదో ఒక సందర్భం పురస్కరించుకుని మనకి వస్త్రాలు వంటి కానుకలు ఇస్తారు. ఫలితంగా మనమూ ఇవ్వక తప్పదు. వాళ్ళకేం బాధలేదు. వెనక నుండి ఫండింగ్ ఉంటుంది. చీర పెట్టినందుకు ఓ 500/-రూ. ఖర్చయితే, బదులుగా మా చేత అలాంటి ఖర్చు పెట్టించినందుకూ, మొత్తం ఈ ప్రక్రియ నిర్వహించినందుకూ, మంచి మొత్తమే చేతికందుతుంది. వెరసి వాళ్ళకి డబ్బురీత్యానూ లాభమే, మెహర్బానీ రీత్యానూ లాభమే! మనకి మాత్రం బడ్జెట్ మన చేతిలో లేకుండా పోతుంది. "వద్దు బాబోయ్! మా ఆర్ధికస్థితి రీత్యా పొదుపు చేయక తప్పనిది. అంచేత మీరు పెట్టా వద్దు, మేమూ పెట్టవద్దు. అనవసర ఖర్చు ఇద్దరికీ దేనికి?" అంటే, ’మేమేం మిమ్మల్ని పెట్టమన్నామా! మా అభిమానం కొద్దీ మేం పెడుతున్నాం’ అంటారు. మాటల్లో ఇదే ఉంటుంది, చేతల్లో మాత్రం ’నువ్వు పిసినారివి’ అన్న భావప్రకటన ఉంటుంది. దీన్ని ఏమీ అనలేం! బ్రహ్మీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లాగా నన్నమాట!

వెరసి ఎవరితోనైనా ’స్నేహం చేయటం, ఇష్టాన్ని ప్రకటిస్తూ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం ’ అన్న మాధుర్యం జీవితంలో నశించిపోతుంది. 1992 కు ముందరైతే నాకు స్నేహితుల నుండి ఇలాంటి చేదు జ్ఞాపకాలు లేవు. ’ఆత్మబంధువులు’ అనుకునేంత స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించాను. జీవితంలో రామోజీరావు గూఢచర్యపు ప్రమేయం సంభవించాకే ఈ ఈతి బాధలన్నీ!

ఇలాంటిదే మరొకటి - ఎప్పుడైనా ఎవరైనా పేదవాళ్ళు బిచ్చమడగటానికి వస్తే, పాత దుస్తులూ, డబ్బూ దానంగా ఇచ్చామను కోండి! ఇక అంతే! క్యూ కట్టినట్లు చందాల కొచ్చేవాళ్ళు, బిచ్చగాళ్ళు, పగటి వేషగాళ్ళు.... చివరికి మనకి విసుగెత్తి "నేను దానం చెయ్యను. వెళ్ళండి" అని కటువుగా చెప్పాల్సి వస్తుంది. చూసేవాళ్ళకి మనం జాలీ దయా లేని కర్కోటకుల్లాగా, పిల్లికి బిచ్చం చెయ్యని పిసినారుల్లాగా, ఎంగిలి చేత్తే కాకిని తోలని లోభుల్లాగా కనబడతాం. ఆ చూపు మిగిలిన వాళ్ళు చూస్తారు కూడా! చూపులతోనే ఆగరు. అలా ఆగితే మనమే అనవసరంగా ఉలికి పడుతున్నామేమో నని సరిపెట్టుకోవచ్చు. అప్పటి వరకూ దానం చేయని వాళ్ళు, తరువాత నుండి దానం చేస్తూ, మనతో దానం గొప్పదనం గురించి రకరకాలుగా చెప్తారు.

మరో ఉదాహరణ చెబుతాను.

మాకు మా పాప అంటే చాలా మురిపెం, ప్రేమ. ఏ తల్లిదండ్రులకైనా అది సహజమే కదా! ఆమె పసిపాపగా ఉన్నప్పుడు మా దగ్గర కెమెరా ఉండేది కాదు. తన ముద్దు చేష్టలు కొన్నిటిని ఫోటో గ్రాఫర్ చేత ఫోటోలు తీయించుకోవటం, కొన్నిసార్లు స్నేహితుల నుండి కెమెరా తెచ్చుకుని మేమే ఫోటోలు తీసుకోవటం చేసేవాళ్ళం. ఇక ఆ ఫోటోలని డెవలప్ చేసి, ప్రింట్లూ తీసి ఇవ్వడానికి ఫోటోగ్రాఫర్లు మమ్మల్ని, తిప్పించి తిప్పించి విసిగించేవాళ్ళు. చివరికి నెగిటివ్స్ పోయాయనో, మరో కారణమో చెప్పేవాళ్ళు. మరోవైపు సహోద్యోగులు, పరిచయస్థులూ ’పాప చాలా ముద్దుగా ఉంది. ఫోటోలు తీసి దాచి ఉంచండి. పెద్దయ్యాక చూపించవచ్చు’ అంటూ ఉచిత సలహాలిచ్చేవాళ్ళు. చివరికి గుడికో బజారుకో వెళ్ళినప్పుడు, ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా, ఇలాంటి ఉచిత సలహాలిచ్చేవాళ్ళు. వెరసి అది మన మనసుకి పడుతుందన్న మాట. కొన్నేళ్ళ తర్వాత మేం కెమెరా కొనుక్కుని ఫోటోలు తీసుకున్నా, ప్రింట్లు వేయించుకున్నాం గానీ అన్ని ఆల్బంలనీ, సూర్యాపేట ఇంట్లో, ఇంటి సామాగ్రితో పాటు పోగొట్టుకున్నాం.

వెరసి మా పాప పసితనపు ముద్దుముచ్చట్లు, మాకు జ్ఞాపకాల రూపంలో మనస్సులో ముద్రలై మిగిలాయి గానీ, ఫోటోలుగా కళ్ళముందు మిగలలేదు. మొదట్లో కొన్నాళ్ళు ఈ ప్రక్రియకి గిలగిల లాడాను గానీ, కొన్ని అనుభవాల తర్వాత, "సరే! పోనీయ్ ఫోటోలు గట్రా వస్తువులైతే పోతాయి. మనస్సులో జ్ఞాపకాలైతే ఎవరో దోచనూ లేరు, పాడు చెయ్యనూ లేరు కదా!" అనుకున్నాము. ఆ స్థితికి వచ్చాక, ఇక ఫోటోగ్రాఫర్ల, ఫోటో స్టూడియోల బాధ మాకు లేకుండా పోయింది. చిత్రంగా, ఆ తర్వాత స్టూడియోల వాళ్ళెవ్వరూ డెవలప్ విషయంలోనూ, ప్రింట్లు విషయంలోనూ మమ్మల్ని విసిగించలేదు. మనం చికాకు పడటం, బాధపడటం మానేసాక, ఇక శతృవుకి అది కొనసాగించటం వృధా ప్రయాస కావటం సహజమే కదా! ఇలాంటి సందర్భలలో మేం "ఒక మోహాన్ని దాటేసాం! కానీయ్!" అనుకునే వాళ్ళం!

2005 తర్వాత, మా జీవితాల్లో రామోజీరావు ప్రమేయం అర్ధమయ్యాక, ’ఇలాక్కూడా అనుభూతుల్ని గాయపరచవచ్చు,’ అన్న అవగాహన కలిగింది.

అప్పుడే మాకు మరో విషయమై కూడా స్పృహ కలిగింది. ఎవరికైనా టైలరూ, బార్బరూ లంకెల వంటి వారే! అందుకే దాదాపు ప్రతీ వాళ్ళకి ఆస్థాన దర్జీ , ఆస్థాన మంగలీ ఉంటారు. దుస్తులు సరిగ్గా కుదరక పోయినా, క్రాపు సరిగా చేయకపోయినా చాలా చికాకూ, అసహనం కలుగుతాయి. ఈ విషయంలో మాకు మరింత చికాకు కలిగేది. టైలరు గానీ, మంగలి గానీ తొలిసారి మాత్రమే బాగా ’సేవ’ అందిస్తారు. తర్వాత తిప్పించటం లేదా చెడగొట్టటం వంటివి జరుగుతాయి. ఎప్పటి కప్పుడు ’సింపుల్ సారీ’లాగా, ఏదో ఒక వంక చెప్పబడుతుంది. ’పోనీ ’ అని ఊళ్ళో డిమాండు ఉన్న ప్రముఖ టైలరు దగ్గరికి వెళ్తె, ఇక ’డీల్’ ఉంటుంది చూడండి! ముంబైలో అప్పాయింట్ మెంట్ లు ఇచ్చే సెలబ్రిటీ లంత సీన్ నడుస్తుంది. అదేమంటే - తమ కస్టమర్లందరూ అలా క్యూలో ఉంటారనీ, పదిసార్లు తిరుగుతారనీ, ఇంకా మాట్లాడితే తమకి డిమాండ్ అంత ఉందనీ మాకు అర్ధం చెయ్యబడుతుంది. అందరికీ ఇలాగేనా అనీ, తెలిసినా వాళ్ళని కనుక్కుంటే, "ఏం లేదు. టైంకే ఇస్తాడే. తిప్పించుకోడే" అని చెబుతారు. మరి మాకు మాత్రమే అలా అన్న విషయం అర్ధం అవుతుంది.

ఇలాంటి చాలా సందర్భాల్లో, అసహనానికీ, క్రోధానికీ గురయ్యి క్రమంగా ’ధ్యాయతో విషయాన్ పుంసః’ అన్న గీతా శ్లోకంతో దాన్ని దాటేసాం! ’ఎలా బ్రతికినా పోయే రోజున శిధిలమయ్యే ఈ శరీరామే శాశ్వతం కాదు. ఇక దీని అలంకరణ.... దుస్తులూ, శిరోజాలూ మాత్రం శాశ్వతమా! పోనీయ్!’ అనుకోవటం మొదలెట్టాం. సాధ్యమయినంత వరకూ రెడీమెడ్ వీ కొనటం అలవాటు చేసుకున్నాం. ఇప్పటికీ టైలర్ల బాధ వదల్లేదు గానీ అసహనపు బాధ మాత్రం వదిలింది.

మరొకటి - ఎవరైనా ఇరుగుపొరుగు పసిబిడ్డలని ముద్దు చేసినా, దాన్నుండీ దుస్ఫలితమే వస్తుంది. క్రమంగా ఆ తల్లిదండ్రులు చెట్టెక్కి కూర్చుంటారు. అదేదో ఆ పసిబిడ్డని మేం దత్తత తీసుకోవాలన్నట్లు, మా పాప కంటే కూడా వాళ్ళ బిడ్డ మీద మేం శ్రద్ద తీసుకోవాలన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది. దాంతో మనమే ఎవరిజోలికీ వెళ్ళకుండా ఉండాల్సి వస్తుంది. పసిబిడ్దలతో ఆడుకోవటం అనే అనుభూతి, అనుభవం మనకి మృగ్యమౌతాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఈ విషయంలో శ్రీశైలంలో చిన్నబడి పెట్టుకున్నాక మేం బాగా ఆనందించాం. పసిబిడ్డల మాటలు, చేతలు, చిరుచెమటలతో కూడిన ఆ చిన్నారి ఆరచేతుల స్పర్శ; వారి ప్రేమని మేం బాగా ఆస్వాదించాం.

ఇంకా.... పొరబాటున కూడా ఎవరితోనూ ఫలానా వస్తువు నాకు ఇష్టం అన్నామా ఇక ఆ వస్తువు మనకి దొరకదు. ఫలానా వ్యక్తిపట్ల మాకు గౌరవం, స్నేహం అన్నామో, ఆ తర్వాత కొన్నిరోజులకే ఆ ఫలానా వ్యక్తితో మనకి సంబంధాలు చెడితీరతాయి. కారణాలు పలురకాలుండవచ్చుగాక, వెరసి సదరు వ్యక్తిమీద గౌరవం పోగొట్టుకోక తప్పదు. ఈ విషయంలో కేవలం ఖాసీం కుటుంబం మాత్రమే మాతో చాలాకాలం స్నేహం కొనసాగించగలిగింది. మిగిలిన వారితో.... అకస్మాత్తుగా ఒకోసారి, క్రమంగా ఒకోసారి ’టర్మ్స్’ సున్నితమై పోయేవి గానీ, ఈ కుటుంబంతో మాత్రం ’స్నేహం’ వాడిపోని పరిస్థితులే ఎప్పుడూ సంభవించాయి. అన్నీ ’యాదృచ్చికాలు, విధి వ్రాతలూ ’ అనుకున్నరోజుల్లో ఇదంతా మాకు అవగాహనకి రాలేదు గాని, జీవితంలో గూఢచర్య ప్రమేయం తెలిసాక, ఖాసిం కుటుంబపు అవసరం రామోజీరావుకి ఎంత ఉందో అర్ధమయ్యాక, ఆయా స్ట్రాటజీలన్నీ మరింత బాగా అవగాహనలోకి వచ్చాయి.

నిజానికి ఇలా ’స్నేహాలు’ చెడటం అర్ధమయ్యాకే, మాకు ’గుంభనంగా ఉండటం’ అలవాటు అయ్యింది. ఎవరి పట్ల ఏ అభిప్రాయం ఉందో ఎవరితోనూ చర్చించటం మానేసాం. ఈ విషయంలో ఖాసీం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేసి ’ఫలానా వాళ్ళని నమ్మవచ్చా’ అని అడిగాడు ఓసారి.

మేం నవ్వేసి, అప్పటికి[ఇప్పటికి కూడా] మా అభిప్రాయం చెప్పాం. ఏమని అంటే - ఏ వ్యక్తిని అయినా చెడ్డవాడు అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు చెడ్డతనం చూపించినప్పుడు అనుకుందాం. అప్పటి వరకూ సదరు వ్యక్తి మంచివాడనే నమ్ముతాం. అలాకానట్లయితే, ఒక మంచి వ్యక్తిని చెడు అనుకున్న ’తప్పు’చేసిన వాళ్ళమవుతాం కదా - అని!

ఇప్పటికీ మా అభిప్రాయం ఇదే! ఎవరి గురించి అయినా మేం పాజిటివ్ గానే అనుకుంటాం. ’మంచి’ అనే తలుస్తాం. ఒకవేళ ’మంచికాదు’ అని తెలిస్తే ’కానియ్!’ అనుకుని తప్పుకు వెళ్ళిపోతాం. ఇక ’ఎవరు నమ్మదగిన వ్యక్తి, ఎవరు మంచి, ఏదీ మంచి, ఏది చెడు ’ అన్న విషయంలో మన విచక్షణ మేరకూ చూస్తాం, తరువాత దైవం మీద భారం వేసే నడుస్తాం.

ఎందుకంటే గతంలో ఈ గందర గోళంతో పడిన ప్రతీసారీ, క్రోధం అసహనాలకి గురైన ప్రతీసారీ, గీత తెరిస్తే

శ్లోకం:
శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగంస యుక్త స్స సుఖీ నరః

భావం:
ఎవడైతే తాను చనిపోయే లోపలనే - కామ, క్రొధాల వల్ల పుట్టిన మనఃచాంచల్యాన్ని ఆరికట్టగలడో వాడే యోగియై ఆత్మానందంతో సర్వసుఖాలూ పొందుతాడు.

అని వచ్చేది.

ఆత్మానందం సంగతి దేవుడెరుగు. ’అసలు ఆనందం కలగలన్నా.... అసహనాన్ని, క్రోధాన్ని జయించాల్సిందే!’ అన్న ఇంగితం, ఆ విధంగా అర్ధమయ్యింది. దాంతో టైలరూ, మంగలి, నేస్తాలు, గట్రా విషయాల్లో కలిగిన అసహనాన్ని, క్రోధాన్ని దాటేవాళ్లం. ఆ ప్రయత్నంలోనే ’రామకోటి’ వ్రాసే సాధన చేశాము.

ఒకోసారి, పై శ్లోకం బదులు....

శ్లోకం:
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే

భావం:
దివ్యము, త్రిగుణాన్వితమూ యైన నా మాయ దాట శక్యం గానిది. నన్ను శరణు వేడే వాళ్ళు మాత్రమే ఈ మాయను తరించగలుగుతాడు.

అని వచ్చేది.

’అవును! మాయ దాటాలంటే భగవంతుడే శరణు’ అనుకునే వాళ్లం. క్రమంగా ’ఏది మంచి, ఏది చెడు, ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మరాదు, ఎవరితో ఎంతవరకూ మెలగాలి’ అన్న గందరగోళం నుండి స్పష్టతలోకి ప్రయాణించగలిగే వాళ్ళం.

వీటన్నిటిలో మాకు అర్ధమయ్యింది ఏమిటంటే - భావాలని, అనుభూతుల్ని గాయపరచటం కూడా గూఢచర్యంలో భాగమని! నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, మా మీద ప్రయోగించిన పై స్ట్రాటజీలే మాకు ఈ స్పృహ కలిగించాయి. తరచి చూస్తే.... భారతీయుల మీదా, దేశాల మీదా కూడా, ఇదే ప్రయోగింపబడటం కనబడింది.

పైకి ఇన్నిరకాలుగా కనబడే ఈ స్ట్రాటజీలో ఉంది, అహం మీద దెబ్బకొట్టటం, తద్వారా ఆత్మన్యూనత, నిరాశనిస్పృహలను ప్రవేశపెట్టాలన్న ప్రయత్నమే! పదే పదే అదే కొనసాగించటంలో, ఒకవేళ మనం గానీ ఆత్మన్యూనతకి, నిరాశనిస్పృహలకి గురవ్వకుండా, ఎదురు పోరాడామంటే, అప్పుడు కనీసం, జీవితం యాష్టకి రావాలన్న మాట!

మా చుట్టూ ఇలాంటి పరిస్థితులు కల్పించటం, వేధింపుల్ని సృష్టించటం, వేధించగల వ్యక్తుల్ని మా చుట్టూ సమీకరించటమే కాదు, 1992 కు ముందరి కాలంలో మాకు పరిచయం ఉన్న చాలామంది, ఇప్పుడు సిరిసంపదలతో తులతూగుతూ, అప్పుడప్పుడూ మాకు తారస పడతారన్న మాట. గతంలో నా దగ్గర నెలకు 600/-రూ. జీతానికి పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు కారు మైయింటెన్ చేస్తూ ఉంటాడు. ఆసుపత్రిలో సహాయకులుగా పనిచేసిన వాళ్ళు, ఇళ్ళు కార్లు కొంటారు. అదీ, ఒకరు ఇద్దరూ గాకుండా, గత పరిచయస్తులూ, బంధుమిత్రులలో ఎక్కువమంది, ఇప్పుడు దమ్మిడీల విషయంలో soundedగా ఉంటారన్న మాట. ఇందుకు మనం ఈర్ష్య పడి దుఃఖపడినా సరే! తమ ప్రయోజనం నెరవేరినట్లే. ఒకవేళ మనం ఈర్ష్య పడకుండా, ’పోనీ! ఎవరి రాత వాళ్లది. వాళ్ళకి అలా బ్రతకటం ఇష్టం. మనకి ఇలా బ్రతకటం ఇష్టం!’ అనుకున్నా కుదరదు. ఇక అప్పుడు ఆ పరిచయస్థులూ, బంధుమిత్రులూ మనకి తలకి పోసే పని, అంటే బ్రెయిన్ వాష్ చేసేపని మొదలెడతారు.

వెరసి.... మన బుర్రకి ఎక్కించ ప్రయత్నించేది ఏమంటే - "చూడు! వాళ్ళకే ఎంత flurish ఇచ్చామో! ఇక నువ్వు మాకు సహకరిస్తే, ఇక నీకెంత scene ఇస్తామో నువ్వే ఆలోచించు" అని.

మొదట్లో ఇది మాకు అర్ధమయ్యేది కాదుగానీ, 2005 తర్వాత, క్రమంగా, బాగానే అర్ధమయ్యింది.

ఆ క్రమంలో మేం శివాజీ గణేశన్ నటించిన "వీర పాండ్య కట్టబొమ్మన" సినిమాలో డైలాగు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాం. ఆ సినిమా మాకు చాలా ఇష్టమైన సినిమాలలో ఒకటి. అందులో పతాక సన్నివేశాలు మాకు మరింత ఇష్టం. "ఎదురొడ్డి పోరాడటాం మాని, పిరికిపందలా పారిపోయాను కదూ, అంచేత నా కంఠాన్ని నువ్వు అలంకరించవలసిందే!" అంటూ ఉరితాడుని కట్టబొమ్మన ముద్దాడే సీన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అసలా పతాక సన్నివేశంలోని ప్రతీ డైలాగూ, ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటాయి.

అందులో ఇంగ్లీషు వాడివేషం వేసిన నటుడు, వచ్చీరాని ముద్దుముద్దు తెలుగులో డైలాగు చెబుతూ, "ఇందరు మాకు లొంగి పోగా నీవొక్కడవూ లొంగకుండటం నీకేమైనా లాభమా!" అంటాడు. దానికి - శివాజీ నటనకి శోభ చేకూరుస్తూ, కళా వాచస్పతి కొంగర జగ్గయ్య కంచుకంఠం, "ఇందరు నీకు లొంగిపోగా నేనొక్కడినే లొంగకుండిన నీకేమైనా నష్టమా?" అంటాడు.

ఇది గుర్తుతెచ్చుకుని మేం నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే - ఏదో చిన్న బడి పెట్టుకుని, లేదా చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టుకుని, పదిమంది పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ, సాయంత్రం అలా వాకింగ్ కి వెళ్తూ, రాత్రికి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ, ఓ మూలన హాయిగా గడిపేసే ఓ సామాన్యుడితో, ఎవరికి వచ్చే నష్టం మాత్రం ఏముంది గనక?

ఇక ఈ విషయాంతరం ఆపి, మళ్ళీ భావాలని గాయపరచటం అన్న స్ట్రాటజీ దగ్గర కొద్దాం. ఇలా భావాలని, అనుభూతులని గాయపరచటం అన్నది కణిక నీతే! కణికుడు ధృతరాష్ట్రుడికి, కూటనీతి గురించి చెప్పెటప్పుడు, ’శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలని నాశనం చెయ్యమని ’ చెబుతాడు.

భావసంపదని నాశనం చేస్తే.... ఉత్సాహాన్ని, తత్ఫలితంగా, ఐశ్వర్యాన్ని, మంత్రాంగాన్ని నాశనం చేయవచ్చు. ఇది కణిక నీతి.

మహా భారతంలోని ఈ కణిక నీతిని పుణికి పుచ్చుకున్నారు కాబట్టే, వాళ్ళది నకిలీ కణిక వ్యవస్థ అన్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

లక్ష్మి గారు ఇది మీ బ్లాగ్ లో నా తొలి కామెంట్
చాలా బాగుంది మీబ్లాగ్ ఈ టపా అయితే సూపర్ గా ఉంది ...
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు.. ఈ టపా అంత నిజాలే..
ఎక్కువ శాతం మంది ఇంతే పైకి ఒకలా ఉంటారు లోపల మొరొక రకం ఎందు కంటే అభిమానం కాదు కాదు డాబు , దర్పం అడ్డు వస్తే మరి..
ఇంకా అప్పుడప్పుడు మీ బ్లాగ్కి వహ్చి వెళ్తుంటాను..

మీకు నా అభినందనలండీ, ఇన్ని ఇబ్బందులనీ హాయిగా దూదిపింజల్లా భావిస్తూ నెగ్గుకువస్తున్నందుకు.

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

cartheek గారు,

నెనర్లండి!

రాఘవ గారూ,

చక్కని శ్లోకం, అదీ అమ్మవారి గురించి గుర్తు చేశారు. సంతోషంగా ఉంది. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu