గతంలో గోబెల్స్ ప్రచారం గురించి నేను విని ఉన్నాను; చదివి ఉన్నాను. 1980 వ దశకంలో....ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్ళలో.... ఆ పార్టీకీ, పార్టీనాయకుడూ సినిమా నటుడూ అయిన ఎన్టీఆర్ కి రొడ్డుప్రక్కన గడ్డం గీయడం, స్నానాలు చేయడం వంటి చర్యల ఫోటో సహిత వార్తలతో, విపరీత ప్రచారం చేసిన ’ఈనాడ’ నేపధ్యంలో గోబెల్స్ ప్రచారం గురించిన ప్రస్తావన, చర్చ అప్పట్లో బాగా జరిగాయి. ఆ నేపధ్యంలో... కృష్ణ, భానుమతీ రామకృష్ణలు నటించిన ’మండలాధీశుడు’ సినిమా ద్వారా గోబెల్స్ ప్రచారం గురించి మరికొంత తెలిసింది. ఆ కుతుహలం కొద్దీ రెండవ ప్రపంచయుద్ద నేపధ్యాన్ని, హిట్లర్, అతడి ప్రచార శక్తి గోబెల్స్ ల గురించి మరికొంత చదివాను. కాలక్రమంలో అది మరింత స్పష్టంగా కనబడిందనుకొండి, వైయస్ ’దేవుడు - అవినీతి దెయ్యం’ తో సహా! ఎంత చదివినా, అనుభవరీత్యా చూస్త్గేనే మరింత అర్ధమౌతుంది కదా!

మేం ఎదుర్కొన్న అలాంటి అనుభవమే ఒకటి - 1993 - 95 వరకూ మేం శ్రీశైలంలోని పాతాళగంగ మెట్లదారిలో గుడిసెలో నివాసం ఉన్నాం. అప్పట్లో అక్కడున్న 150 గుడిసెలలో ఒక్కరికి తప్ప మరెవరికీ విద్యుత్ సౌకర్యం లేదు. ఆ ఒక్కరూ అక్కడ పెద్దమనిషి అన్నమాట. అక్కడున్న గుడిసెల్లో నివసించే బెస్తవారిలో కొద్దిమంది తప్ప, దాదాపు అందరూ అతడి బంధువులే. అక్కడందరూ, దేవస్థానం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన నీటి కుళాయిల మీద ఆధారపడాల్సిందే. శ్రీశైల దేవాలయానికి, యాత్రికుల వసతి గృహలకీ, సత్రాలకీ నీరు పంపిణీ చేసేందుకు, వాటర్ వర్క్సు వారి ట్యాంకులూ, మోటార్లు ఉండేవి. సిబ్బంది విధులు నిర్వహించేవాళ్ళు. ఆ సిబ్బందిలోని ఓ మోస్తరు నాయకుడితో, ఈ పెద్ద మనిషి పెద్దకూతురికి అక్రమ సంబంధం ఉండేది. దాన్ని చూసీ చూడనట్లుగా ఈ పెద్దమనిషి ఊరుకుండేవాడు. వెరసి ఈ పెద్దమనిషికి గానీ, అతడి కుటుంబసభ్యులకి గానీ కోపం వస్తే, మెట్ల దారిలో ఉన్న నాలుగు కుళాయిలలో దేనికైనా నీటి సరఫరా బందు చేయగల అధికారాన్ని[వాటర్ వర్క్సు సిబ్బంది సహాయంతో] కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ అజమాయిషీ నడిచేది. అతడి గుడిసె మెట్లదారిపైన ఉండటం, పెద్దదిగా ఉండటం, దాదాపు 200 మేకల మంద ఉండటం గట్రా కారణాలతో, వారిలో సంపన్నుడి గానూ, నాయకుడిగానూ పరిగణనలో ఉండేవాడు.

అతడికి సంతానం కూడా మెండు. దాదాపు ఆరేడుగురు పిల్లలుండేవాళ్ళు. ఆటవికుల్లో కుటుంబ సంఖ్యా బలం కూడా శ్రమశక్తిరీత్యా ’ధనం’గా పరిగణింపబడుతుంది. అతడి పిల్లలు, సన్నిహితులందర్నీ "అమ్మో! నాయనకి తెలిస్తే సంపేత్తాడు"అంటూ కళ్ళింత చేసి హెచ్చరించేవాళ్ళు. ఆ హెచ్చరికకి ’రకరకాల అవసరాల భయాల’ రీత్యా, అక్కడి వాళ్ళు కట్టుబడేవారు. ఆ ఆదమరుపులో అతడి మనుష్యులు, ఒక్కోసారి ఇతరులతో కూడా అలాగే అనేవాళ్ళు. అది చూసి మేం నవ్వుకునేవాళ్ళం.

’వాళ్ళ వాళ్ళకి అతడు నాయకుడు కాబట్టి అతడంటే భయం కావచ్చు గానీ, ఇతరులెందుకు భయపడతారు?’ అనుకునేవాళ్ళం. సరిగ్గా ’అధిష్టానాన్ని గౌరవించాలి’ అని డీ.ఎస్. అంటే .... మాకు ఇప్పుడు అదే గుర్తుకు వస్తోంది.

డీ.ఎస్. లాంటి వాళ్ళకయితే పీసీసీ పదవులు, ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు, ఈవిఎంలు అధిష్టానం చేతుల్లో ఉన్నాయి గనుక, తమ గెలుపోటములు, ప్రభుత్వ పదవులు, తమ పిల్లల వారసత్వపు కెరీర్లు.... మొత్తంగా తమ జీవితాలే అధిష్టానం చేతుల్లో ఉన్నాయి గనుక, తాము అధిష్టానం కాళ్ళమీదపడి ’నీ బాంచన్ కాల్మొక్త’ అంటారు గానీ, ప్రజలకీ, ఇతర పార్టీ ఎం.ఎల్.ఏ.లకి ఏం అవసరం అలా అనడానికి?

ఇక కేకే లాంటి వీరభక్త విధేయులైతే ’అంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్యేలు అని లెక్కలు చెప్పడం సరికాదు. ఎందరు ఎమ్మెల్యేలైనా సోనియా కంటే ఎక్కువా?’ అని హుంకరిస్తారు. అంతేకాదు, ’అమ్మ తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ఇస్తారు. మాకా నమ్మకం ఉంది’అంటూ కాంగ్రెస్ బానిసల సమూహం కళ్ళార్పుతూ చెబుతుంది. ఎవరి అబ్బసొత్తు? ఎవరు ఎవరికి కానుకగా ఇస్తారు?

"అమ్మా! నిన్ను మరవదు ఈ గడ్డ" అంటూ కోమటి రెడ్డి వంటి మంత్రులు ఘనస్త్రోత్ర పాఠాలు చదువుతారు.
వెరసి జనాభిప్రాయం కంటే సోనియా అభిప్రాయానికే విలువెక్కువ అనడం? ఎంత అహంకారం? ప్రజల పట్ల ఎంత చులకన?

ఒక ప్రదేశాన్ని ముక్కలుగా విడదిస్తే వచ్చే ప్రయోజనాలేమిటి, ఇబ్బందులేమిటి, సమస్యలేమిటి, పరిష్కారాలేమిటి? ఏదీ ఆలోచించే పనిలేదా? భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట - కేంద్రం రాష్ట్రాల విభజనలోని ఫెడరల్ స్ఫూర్తికి అర్ధం ఏమిటి?

1953 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం పేరిట ఉన్న సువిశాల భూభాగం, 1956 లో ఆంధ్ర, కన్నడ, తమిళ నాడులుగా ఏర్పడ్డనాటి పరిస్థితులేమిటి? ఆ విభజనలో జరిగిన పరిణామాలేమిటి? 1953 అక్టోబరు ఒకటిన, అప్పటికి 58 రోజుల నిరాహార దీక్ష తదనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన దరిమిలా కర్నూలు రాజధానిగా, గుంటూరులో హైకోర్టు వంటి ఏర్పాట్లతో ఏర్పడిన ఆంధ్రా రాష్ట్రం, 1956 నవంబరు ఒకటిన ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. రాజధాని కర్నూలు నుండి హైదరాబాదు కి తరలిపోయింది. హైకోర్టు గుంటూరు నుండి హైదరాబాదు కే నడిచిపోయింది.

ఆ ’ఎరా’లో, నిజాం నవాబు వంశీయుల ఆస్తులైన... భవనాలు, హైకోర్టులుగా, కళాశాలలుగా, గ్రంధాలయాలుగా, వైద్యశాలలుగా.... ప్రజా ఆస్తులుగా పరిణామం చెందేందుకు, సదరు రాజభవన యజమానులైన నిజాం వంశీయులకి, ఎంత డబ్బు ముట్టజెప్పబడిందో, ప్రత్యామ్నాయ ఆస్తులుగా ఎంతెంత భూభాగం, నగరానికి వెలుపలా లోపలా ఏయే దిశలలో బదలాయింపులు జరపబడ్డాయో.... అప్పటి లెక్కలు ఇప్పుడెవరికీ తెలియదు. ఈ ఏభై ఏళ్ళలో, ఆయా భూములకు ఎంతెంత విలువల పెంపుదల దక్కిందో రియల్ వ్యాపారులకి కూడా తెలియదు. అందుకోసం, తెరవెనుక మంత్రాంగంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా, పధకం ప్రకారం నడిపిన వాళ్ళకి మాత్రమే ఈ ’లోగుట్లు’ తెలుస్తాయి.

నిజానికి రాష్ట్రం పేరు ఏదైనా, పరిధి ఎంతైనా, పాలించే రాజకీయపార్టీ ఏదైనా, ప్రజలకి ఒరిగింది మాత్రం సున్నా! కోస్తాలోనైనా, రాయలసీమలోనైనా, తెలంగాణాలో నైనా.... కందిపప్పు ఎనభై, బియ్యం నలభై రూపాయలే! ఎవరికి ఒరగబెట్టిందీ ఏమీలేదు. హైదరాబాదు లో అంతెత్తు భవనాలు నిర్మించింది రాజకీయనాయకులూ, వారి ప్రాపుదక్కించుకున్న బడా వ్యాపారులు. అసలు రాజకీయ నాయకులే అసలు సిసలు వ్యాపారులనుకోండి. ఈ రోజు, కామధేనువులాగా కాసులు కురిపిస్తున్న విద్యాసంస్థల వ్యాపారాలు లేని రాజకీయ నాయకులు లేరు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికీ ఇంజనీరింగు కాలేజీలున్నాయి. దాదాపు అందరికీ ఇలాంటి వ్యాపారాలున్నాయి.

భూవ్యాపారం [రియల్ ఎస్టేట్] లోనూ వీరిదే పైచేయి. అందులో సినీతారలూ ఉన్నారన్న మాట ఉంది. ఎవరు ఏ వ్యాపారం చేసినా, వాటాలు రాజకీయ నాయకులకీ, వారి నుండి అధిష్ట్రానానికీ అందాల్సిందే! ఈ పాటి దానికి, అదేదో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ప్రజలు సుఖపడతారన్నట్లు/బాధపడతారన్నట్లు అమాయకంగా పోట్లాడుకోవటం, కిరసనాయిలు పోసుకుని ప్రాణాలు పోగొట్టుకోవటం.... ఎంతగా దగా పడటమో ఇది?

సీమ, ఆంధ్రా, తెలంగాణా.... ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నాడా? నేతన్నలు ఉరిపోసుకోవటం ఆగిందా? రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా, తెరాస నేత కేసీఆర్ వంటివాళ్ళు శ్రీచైతన్య బిఎస్ రావు ఇచ్చే డబ్బులకీ, భాష్యం రామకృష్ణ ఇచ్చే డబ్బులకీ, నారాయణ నారాయణ రెడ్డి ఇచ్చే డబ్బులకీ ఆశపడకుండా ఉంటారా, ఆయా విద్యాసంస్థల వ్యాపారాన్ని అనుమతించకుండా ఉంటారా? అదేమంటే రాష్ట్రాభివృద్ధి కోసమే అలాచేశాం అంటారు కదా![ఇప్పుడు దేశప్రయోజనాల కోసమే అలా చేసానన్న సోనియా లాగా!] ఇప్పుడు అంబానీలకీ, సుభాష ఘాయ్ లకీ భూగర్భ నిక్షేపాలూ, భూములూ కట్టబెడుతూ అంటున్న మాటలివే కదా? అప్పుడిక మళ్ళీ తెలంగాణాలో కూడా, నల్గొండా, ఖమ్మం లంటూ జిల్లాల వారిగా విడిపోతారా?

అసలు సామాన్యుణ్ణి వెనకబడేలా చేయటమే అజెండాగా, దోపిడి చేసుకుంటున్న రాజకీయ నాయకులూ, పార్టీలు, తమ స్వప్రయోజనాల కోసం గాక రాష్ట్రప్రజల అభివృద్ధి కోసం ఉద్యమాలు చేపట్టారనుకోవటం కంటే అమాయకత్వం లేదు. 42 మంది ఎంపీలు ఉండి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? తమిళనాడుకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా తరలి పోతున్నాయి. ఐటీ పరిశ్రమకి పేరు వచ్చిందన్నా, ఇలాంటి పరిస్థితులలో, బందుల వల్ల ఉన్న ఐటీ కంపెనీలు కూడా తరలిపోయే దాకా నిద్రపట్టేటట్లు లేదు మన రాజకీయనాయకులకి!

కోస్తావాళ్లనీ, సీమవాళ్ళనీ వెళ్ళగొట్టేస్తే పదోన్నతులు వస్తాయి, తమ పిల్లల్ని ప్రభుత్యోద్యోగాల్లోకి లాక్కునే అవకాశాలు మెండుగా వస్తాయని, ఉద్యోగులు ’పెన్ డౌన్’లు చేస్తారు. విశ్వవిద్యాలయాలు వదిలి పెట్టగానే ఉద్యోగాలు వస్తాయన్న ఆశలకీ, ప్రలోభాలకీ లొంగి విద్యార్ధులు రోడ్ల మీది కొస్తారు. అంతేగానీ బళ్ళమీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులూ రారు, రెక్కాడితే గానీ డొక్కాడని పేద వాడూ రాడు.

ఏది ఏమైనా.... 48గంటల్లో వేర్పాటువాదులు, సమైక్యవాదులూ అంటూ జనం, వీధుల్లో నుండి బ్లాగుల్లో దాకా, గొడవలు పడే దిశకు లాక్కెళ్ళిన సదరు ’బక్క’రాజకీయనాయకుడికీ, ఇటలీ దేవతకీ హేట్సాఫ్ చెప్పాల్సిందే! ’విభజించి పాలించ’మన్న కణిక నీతిని ఎంచక్కా ప్రయోగించారు.

ఈ హైసర బజ్జాలో పడి.... అఖిలాంధ్రులూ తెలుగువాళ్ళమన్న స్పృహ మరిచి పోయి కొట్టుకుంటున్నారు. ఇంకా ఏమేమి చూడాలో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

నిజం చెప్పారు మేడం.

Excellent...this is what the reality...
When should people get this????

చాలా బాగా చెప్పారు.ఎంతమంది అర్థం చేసుకుంటారు.

I am reading your blog since 6 months. This is my first comment. In this entire conspiracy not only KCR is not responsible. Every politician in the state is responsible. Each party accpted Telangana. After Central announced Telangana, every body taken U turn. I didn't mention Sonia name bacause after reading your blog 6 months I can understand what Sonia is.....

great

అజ్ఞాత గారు,

మీ తొలి వ్యాఖ్యకి నెనర్లు! తదుపరి టపాలలో పూర్తి వివరాలు వ్రాస్తాను.

~~~~
sreenadu గారు,

నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu