నిన్నటి టపా: ఈ బ్లాగులోని అన్ని టపాలనీ ఒకేసారి చూడాలంటే –


దీపావళి, పిల్లల కిష్టమైన పండుగ! ఈ పండుగ రోజున పిల్లలకిష్టమైన తియ్యని అప్పచ్చులతో పాటు, ఓ తియ్యని కథ! ఈ కథని మీ ఇంటిలోని చిన్నారులకి చెప్పటమో, వారి చేత చదివించటమో చెయ్యకపోతే, మీ ఇంటి టపాకాయలన్నీ తుస్సుతుస్సుమనుగాక! [శాపానికి భయపడి అయినా బుజ్జాయిలందరికీ ఈ కథ చెబుతారు గదా?]

అనగ అనగా…..

ఓ ఊళ్ళో ఓ పేదరాలు ఉండేది. ఆమెకి ఒక కొడుకున్నాడు. పేరు చిన్నోడు. వాడి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అసలే ’ఒక్కగా నొక్క కొడుకు, అందునా తండ్రిలేని పిల్లాడు’ అంటూ ఆ పేదరాలు, మన ’చిన్నోణ్ణి’ అమిత గారాబంగా పెంచింది. దాంతో చిన్నోడు ఆటపాటలు బాగా మరిగాడు. స్వతహాగా తెలివైన వాడు, ధైర్యసాహసాలున్న వాడు. కానీ తల్లి గారాబంతో చదువుసంధ్యలు నేర్వకుండా, తిని తిరగటం నేర్చుకున్నాడు.

ఎన్నిసార్లు తల్లి మందలించినా లక్ష్య పెట్టేవాడు కాదు. పేదరాలు దీనికెంతో బాధపడుతుండేది. తానే ఏవో తంటాలు పడుతూ, కొడుకునీ పోషిస్తుంది.

ఓరోజు పేదరాలు “ఒరే చిన్నోడా! మన ఆవు పాలు ఇవ్వటం లేదు. మేత దండుగ. దాన్ని సంతకి తోలుకెళ్ళి అమ్మి, నాలుగు మూటలు జొన్నలు పట్టుకురా!” అని చెప్పింది.

ఏ కళ నున్నాడో గాని చిన్నోడు “సరేనమ్మ! రేప్పొద్దున్నే బయలుదేరుతాను” అన్నాడు.

పేదరాలు దానికే ఎంతో సంతోషపడిపోయింది. మర్నాటి ఉదయమే ఇంత పెరుగన్నం మూట కట్టి ఇచ్చింది. చిన్నోడు ఆవుని తోలుకుని సంతకు బయలుదేరాడు. ఎండ బాగా ఉంది. కాలిబాటన నడుస్తున్నాడు. ఇంతలో మేకని తోలుకెళ్తున్న ఓ రైతు తారసబడ్డాడు.

"ఎక్కడికబ్బాయ్!” అన్నాడు ఆ రైతు.

"సంతకి” అన్నాడు చిన్నోడు.

"దేనికి?”

"ఈ ఆవుని అమ్మటానికి”

"నేనూ సంతకే పోతున్నా! ఈ మేకని అమ్మి ఆవుని కొందామని! ఇంత ఎండలో అక్కడిదాకా ఏంపోతాం? నీ ఆవుని నాకిచ్చి ఈ మేకని మారకం తీసుకో! ఎంచక్కా ఇద్దరం ఇంటికెళ్ళి పోవచ్చు” అన్నాడు రైతు.

ఈ మారు బేరం బాగానే ఉందనిపించింది చిన్నోడికి.

సరేనంటూ ఆవునిచ్చి మేకని తీసుకున్నాడు.

తల్లిజొన్నలు తెమ్మంది కదాని సంత కేసి నడవసాగాడు.

మరికొంత దూరం పోయేసరికి, ఈసారి కోడిపుంజుని మోసుకొస్తున్న రైతు ఒకడు కన్పించాడు.

చిన్నోడి వివరాలు విని మేకని కోడికి మారకం వేయమన్నాడు.

చిన్నోడు సరేనని మేకనిచ్చి కోడిపుంజుని తీసుకున్నాడు.

మరికొంత దూరం పోయేసరికి మరొక రైతు ఎదురయ్యాడు.

"ఏమిటబ్బాయ్?" అంటూ విషయం అడిగాడు.

చిన్నోడు చెప్పిందంతా విని కోణ్ణి తనకిస్తే చిక్కుడుగింజలు ఇస్తానన్నాడు. చిన్నోడు అవి తీసుకొని కోణ్ణి ఇచ్చేసాడు.

సంతకెళ్ళాక గానీ గుప్పెడు చిక్కుడు గింజలకు జొన్నలెవ్వరూ ఇవ్వరన్న విషయం వాడికి స్ఫురించలేదు. గమ్మున వెనక్కి తిరిగి వచ్చి తల్లికంతా చెప్పాడు. జేబులోంచి గుప్పెడు చిక్కుడు గింజలు తీసిచ్చాడు.

పేదరాలికి ఒళ్ళుమండిపోయింది. కొడుకుని తిట్టిపోసింది. కోపంతో, దుఃఖంతో చిక్కుడు గింజలని కిటికీలోంచి పెరట్లోకి విసిరేసింది.

"ఇంత వయస్సు వచ్చినా నీకు బాధ్యత తెలియలేదు కదా? అంత ఆవునిచ్చి గుప్పెడు చిక్కుడు గింజలు తెస్తావా? నాలుగు మూటల జొన్నలొస్తాయని కూడా చెప్పాను కదరా నాయనా? అయినా నీకు బుద్దిలేక పోయింది. నా ఖర్మ!” అంటూ నెత్తిబాదుకుంది.

చిన్నోడికి రోషం వచ్చింది. దుఃఖమూ వచ్చింది. తన మీద తనకే కోపం వచ్చింది. తల్లీకొడుకులిద్దరూ, ఎవరి ఏడుపు వారు ఏడ్చుకుంటూ ముడుచుకు పడుకున్నారు.

తెల్లారింది. చిన్నోడు నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ పెరట్లోకి వచ్చాడు.

ఆశ్చర్యం!
పెరట్లో చిక్కుడు మొక్క అడుగెత్తు పెరిగి ఉంది. వాడు ఆశ్చర్యంగా దానివైపే చూడసాగాడు. వాడు చూస్తుండగా చిక్కుడు తీగ క్షణానికొక అడుగు పెరగసాగింది. అంతకంతకూ పెరిగి పోతున్న దాన్ని చూస్తూ, ఆశ్చర్యంగా వాడు పెద్దగా కేకపెట్టాడు. అది విన్న పేదరాలు ఉలిక్కిపడి లేచి, ఆదరాబాదరా పెరట్లోకి వచ్చింది. చిక్కుడు తీగ కాస్తా చిక్కుడు చెట్టులాగా పైపైకి పెరగటం చూసి ఆమె కూడా నోరెళ్ళపెట్టింది.

అప్పటికే చిక్కుడు చెట్టు తాటి చెట్టంత ఎత్తు పెరిగి పోయింది. వాళ్ళలా చూస్తుండగానే చిక్కుడు చెట్టు పైభాగం మబ్బుల్లోకి పోయింది. చిన్నోడు ఉత్సాహంగా “అమ్మా! ఈ చెట్టు ఎక్కి పైన ఏముందో చూసి వస్తాను” అంటూ గభాలున చెట్టెక్కడం మొదలుపెట్టాడు. తల్లి వారిస్తున్నా వినలేదు.

గబ గబా పైకెక్కసాగాడు. పైకి పోయే కొద్దీ తమ ఇల్లు, ఊరు చిన్నగా కన్పించసాగింది. చిన్నోడికి భలే హుషారుగా అన్పించింది. ఇంకొంచెం పైకి పోయేసరికి దూదిపింజల్లా మబ్బులు. చేతికి అందుతున్న ఆకాశం అన్నట్లు చల్లదనం. ఇంకా వేగంగా పైకి ఎక్కసాగాడు. అలా పైకి పైకి….. పైపైకి. అద్భుతం!

ఆ చిక్కుడు చెట్టు అంచున ఓ పేద్దమేడ! చెక్కమెట్లు ఎక్కి పైకెక్కాడు. కిటికీలోంచి తొంగి చూశాడు. లోపల ఓ చక్కని అమ్మాయి! వీణ వాయిస్తోంది. పాపం, ఏడుస్తోంది కూడా!

చిన్నోడికి జాలి వేసింది.

"ఎందుకు ఏడుస్తున్నావు?" అనడిగాడు.

ఒక్కసారిగా వినబడిన స్వరానికి ఆ అమ్మాయి ఉలిక్కిపడింది.

కిటికీ దగ్గర చిన్నోడిని చూసి బిత్తర పోయింది.

"ఎవరు నువ్వు?" అంది ఆశ్చర్యంగా!

"నువ్వెవరు?" అన్నాడు చిన్నోడు.

"లోపలికి రా!” అంది అమ్మాయి.

చిన్నోడు లోపలికి వెళ్ళాడు. బల్లపై పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. పళ్ళు మిఠాయిలూ ఉన్నాయి.

వాటిని చూడగానే చిన్నోడికి ఆకలి గుర్తుకొచ్చింది.

"తింటావా?" అడిగింది అమ్మాయి.

"ఊఁ” అన్నాడు చిన్నోడు.

"తిను!” అంది.

అంతే! మనవాడు తాపీగా భోజనం చెయ్యటం ప్రారంభించాడు.

ఆ పిల్ల, చిన్నోడికి తన కథంతా చెప్పింది. ఆ ఇల్లు ఓ రాక్షసుడిది. ఆ అమ్మాయి ఓ రాజకుమారి. ఆ పిల్లని రాక్షసుడు చిన్నప్పుడే ఎత్తుకొచ్చాడు. అన్ని కళలూ నేర్పించాడు. పగలంతా ఎక్కడెక్కడికో పోతాడు. రాత్రికి తిరిగివస్తాడు. ఇప్పటికైతే ఆ పిల్లకి ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు గానీ, పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడట!

ఇదంతా చెప్పి ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తనతో ఆడుకోవటానికి గానీ, మాట్లాడటానికి గానీ ఎవరూ లేనందుకు బోలెడు దిగులుగా ఉంటుందని చెప్పింది.

"ఇక నుండీ రోజూ రా! ఆడుకుందాం!” అంది.

ఈ మాట చిన్నోడికి భలే నచ్చేసింది. ఇద్దరూ చాలాసేపూ ఆడుకున్నారు.

అంతలో ఆ అమ్మాయి “చిన్నోడా! ఇక రాక్షసుడు వచ్చే సమయమైంది. ఇంటికెళ్ళి మళ్ళీ రేపురా! ఎంచక్కా ఆడుకుందాం” అంది.

చిన్నోడు “మా అమ్మకి కూడా భోజనం కావాలి మరి!” అన్నాడు.

ఆ అమ్మాయి అన్నీ మూటకట్టి ఇచ్చింది. ఇంకా బంగారు నాణెలూ, వజ్రాలు, వైడూర్యాలూ కూడా మూటకట్టి ఇచ్చింది.

చిన్నోడు సంతోషంగా ఆమెకు వీడ్కొలు చెప్పి చిక్కుడు చెట్టు దిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే పేదరాలు చిన్నోడు ఏమయిపోయేడోనని ఏడుస్తూ కూర్చుని ఉంది.

చిన్నోడు ఆనందంగా “అమ్మా! అమ్మా!” అంటూ ఆరుస్తూ రాగానే, ఒక్క ఉదుటున వాణ్ణి కౌగలించుకుని ఏడ్చేసింది.

చిన్నోడు తల్లికి అన్ని వివరంగా చెబుతూ తల్లికి పంచభక్షపరమాన్నాలతో అన్నం తినిపించాడు. పేదరాలు ఎంతో సంతోషపడింది. వాడు తెచ్చిన బంగారం, వజ్రాలూ అన్ని దాచిపెట్టింది. వాటితో తము పెద్ద ఇల్లు కట్టుకొని, పొలం కొనుక్కుని సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు.

మర్నాడు మళ్ళీ చిన్నోడు చిక్కుడు చెట్టు ఎక్కి పైకి వెళ్ళాడు. రాకుమారితో ఆడుకుని రాక్షసుడు వచ్చే సమయానికి తిరిగి వచ్చేసాడు. వచ్చేటప్పుడు రాకుమారి వాడికి నిన్నటి లాగానే మంచి భోజనం, బంగారమూ ఇచ్చింది.

కొన్నిరోజులు గడిచాయి. రాకుమారి వాడికి చదువూ, కళలు కూడా నేర్పుతోంది. ఓ రోజు చిన్నోడు, రాకుమారి ఎంచక్కా తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు. అంతలో ఉరుములేని పిడుగులా రాక్షసుడు ఇంటికొచ్చాడు. వారికీరోజు తలనొప్పిగా అన్పించి తొందరగా ఇంటికొచ్చాడన్న మాట. చూస్తే ఏముంది? రాకుమారితో ఆడుకుంటూ ఎవరో ఓ అబ్బాయి! రాక్షసుడికి కోపం ముంచుకొచ్చింది. గట్టిగా ఆరుస్తూ చిన్నోడి వెంటపడ్డాడు. రాకుమారి భయంతో కెవ్వున కేక వేసింది. చిన్నోడు ఒక్క ఉదుటున రాకుమారి చెయ్యిపట్టుకుని క్రిందికి పరిగెత్తాడు. ఇద్దరూ వేగంగా చిక్కుడు చెట్టు దిగసాగారు. వెనకే పెద్దగా అరుస్తూ రాక్షసుడు వెంటబడ్డాడు.

కేకలు విని పేదరాలు హడావుడీగా పెరట్లోకి వచ్చింది. తలపైకెత్తి చూడసాగింది. పైనుండి దిగుతూనే చిన్నోడు “అమ్మా! గొడ్డలి తే” అంటూ గట్టిగా అరిచాడు. పేదరాలు పరుగున పోయి గొడ్డలి తెచ్చింది. క్రిందికి దూకిన చిన్నోడు, ఒక్క ఉదుటున గొడ్డలి పుచ్చుకుని చిక్కుడు చెట్టుని మొదలంటా కొట్టేసాడు.

చిన్నోడంటే చురుగ్గా చెట్టు దిగేసాడు. తనతోపాటు రాకుమారినీ లాక్కొచ్చేసాడు. పాపం! రాక్షసుడు లావుగా ఉన్నాడు. అందునా కోపంతో రొప్పుతున్నాడు. దాంతో వేగంగా దిగలేక పోయాడు. అప్పటికి సగం చెట్టు దిగాడంతే!

మనవాడు చెట్టు కొట్టేయటంతో, పెద్దగా అరుస్తూ చెట్టుతో సహా క్రిందపడ్డాడు. చెట్టు మీద ఇల్లు క్రిందపడింది. రాక్షసుడు పెద్దగా అరిచి చచ్చిపోయాడు. ఊరి వాళ్ళంతా ఆశ్చర్యంతో పేదరాలి ఇంటి చుట్టూ మూగారు. రాక్షసుడి ఇంట్లో ఇంకా బోలెడంత బంగారం, వజ్రాలూ, గట్రా ఉన్నాయి. చిన్నోడు, రాకుమారి ఆ బంగారాన్ని ఊరందరికీ పంచిపెట్టారు.

అతడు మంచి ఇల్లు కట్టుకుని, పొలం కొనుక్కుని హాయిగా ఉన్నారు. పెద్దయ్యాక, పేదరాలు చిన్నోడికి రాకుమారికి ఇచ్చి పెళ్ళి చేసింది. అందరూ హాయిగా ఉన్నారు.

కథ కంచికి మనం పటాసులు కాల్చుకోవడానికి!

~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~

[ఈ కథలో – చిక్కుడు చెట్టు ఊళ్ళో మిగిలిన వాళ్ళకి కనబడలేదా? రాకుమారిని వాళ్ళ నాన్నగారైన రాజుగారు తీసికెళ్ళిపోలేదా? అసలు చిక్కుడు చెట్టు అంతలా ఎలా పెరిగి పోయింది? పోయి పోయి రాక్షసుడిఇంటిదాకానే ఎందుకు పెరిగింది? రాక్షసుడికి తలనొప్పి వస్తుందా? మబ్బుల్లో ఉండీ రాక్షసుడు చెట్టు మీద నుండి పడిపోయి చచ్చిపోతాడా? – ఇలాంటి సందేహాలు బుడ్డీలకి రావు. వచ్చాయంటే ‘వాళ్ళు పెద్దయ్యారు’ అనే అర్ధం. అప్పుడు వాళ్ళకి ‘పటాసులు కొనకపోయిన ఫర్వాలేదు’ అంటే చాలు! అప్పుడు ఏ సందేహాలు పిల్లలకి రావు మరి!]

అంరికీ దీపాళి శుభాకాంక్షలు


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~~~

23 comments:

బాగుంది కథ మీకు, మీ కుటుంబానికి కూడా దీపావళి్ శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఈ కద నాకు తెలుసోచ్..!! చిన్నప్పుడు చదివాను...మా పాపకి చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు..

మీకు,మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభకాంక్షలు.

నేను కూడా చిన్నపిల్లాడినైపోయి మీ కధ అంతా చదివేసాను. ఆశ్చర్యంగా మీరు దిగువన ఇచ్చిన సందేహాలు నాకు అస్సలు రాలేదంటే నమ్మండి..

చిలమకూరు విజయమోహన్ గారు, వంశీ గారు, త్రిష్ణవెంట గారు, నానీ గారు,

నెనర్లు!
*******

శేఖర్ పెద్దగోపు గారు,

అయితే మీరు టపాసులు కాల్చుకోదలచుకున్నారన్న మాట!

కథ చదివీ చదవనట్టు, వినీ విననట్టు, గుర్తుండీ గుర్తుండనట్టుగా ఉంది, కథ కన్నా చివరి పేరా బాగుంది.
దీపావళి శుభాకాంక్షలు.

ee kadhya maaku convent lo teaches chepparu ... manasulo gurthundi poyindi ..oka stage lo meeru cheppe anumaanaalu anni vachevi .ammayya doubts enduku vachevo meeru cheppaka telsindi :P

katha chala baundi... దీపావళి శుభాకాంక్షలు

గుర్తుకొస్తున్నా రానట్లు నటించి మరోసారి చిన్న పిల్లలా సంబరంగా [అమాయకత్వం ఇంకా పోలేదని ఎలాగూ నాకు పేరుండిలేండి :)] చదివాను. బాగుంది. ఇక పటాసులు కాల్చను సమయముంది, ఈ లోపు విందుకి సిద్దం చేయాలి....

కన్నాగారు,

ధన్యవాదాలు చెప్పీ, చెప్పనట్లు చెప్పాలని ఉందండీ! ఎలాగో తెలియటం లేదు! నెనర్లు!

*****

Mauli గారు, అజ్ఞాత గారు,

నెనర్లండి!

కథ బాగుంది! మీకూ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !

చందమామ కథకన్నా బాగుంది. ఇంక సందేహాలేమిటి. మళ్ళీ పాత చందమామ కథ చదివిన తృప్తి కలిగింది. నేనే చిన్నపిల్ల లాగా చదివేసుకున్నాను. మీకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.

ఉష గారు, పరిమళం గారు, జయ గారు,

నెనర్లు!

In my childhood days, my father gave me a comic by name Chinnoo-Chikkuduteega in Telugu. Great Book. Unfortunately, it was lost in my native place to white ants alongwith many other cimics like Sad Sack etc. Thanks for reminding me that excellent story. When I read I never got all the doubts expressed by you in the end. Getting those doubts makes us realise that we are grown up. How I long for those days in 1960s!!!! Alas! they are lost forever.

baagundandi katha meeku mee kutumba sabhyulaki dipaaali subhaakankshalu (telugu typing ravadamledu sorry)

కథ చాలా బాగుంది. మిమల్ని మీ రచనలని చదువితే నాకూ ఆంధ్రలో ఇంకాచెప్పాలి అంటె భారత దేశం లో తప్పి పుట్టారని పిస్తుంది.
మీకు,లేనిన్ గారికి అలాగే మీ అమ్మాయికి దీపావళి శుభాకాంక్షలు.
JayahO

కథ బాగుంది. దీపావళి శుభాకాంక్షలు.

mee visleshana lo okati matram miss ayindhi. adi edhante "" gandhi maranam tarvatha india PM nehru's most disputes decisions "". idhi kooda vivarishte mee visleshana poorthiga vuntundhi.

శివ గారు,

పుస్తకాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరమండి. ఆ బాధ మాకూ తెలుసు. మేమే మీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. చందమామలు అందించినందుకు. నెనర్లు!

*****
రమణి గారు, సురేష్ తోటకూర గారు, అజ్ఞాత గారు,

నెనర్లండి!

****
జయహో గారు,

భారతదేశంలాంటి కర్మభూమిలో పుట్టినందుకూ, తీయని తెలుగు గడ్డపై పుట్టినందుకూ మేమెంతో సంతోషిస్తామండీ! మీ అభిమానానికి నెనర్లు!

****

muke mariyu me familiki deepwali subakankshalu....

మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

అజ్ఞాత గారు, మాలాకుమార్ గారు,

వ్యాఖ్యవ్రాసినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu