ఇక తమకి దాసోహం అనే కళాకారుల [దర్శకులు, నటీనటుల, నృత్యదర్శక గాయకులూ గట్రాగట్రా] కు మీడియా ఎంతగా ఇమేజ్ ఇస్తుందో అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా చూస్తే దడుచుకునే సుందరీ సుందరులని, కెమెరా మేకప్ మాన్ ల నైపుణ్యంతో, మహాసౌందర్యవంతులుగా చూపుతారు. అంతగా నటనా సామర్ధ్యం లేని ఓ నటి లేదా నటుడు, కోపాన్ని చూపెట్టాల్సి వుందనుకోండి. సీన్ అంతగా పండదు. అప్పుడు దర్శకుడేం చేస్తాడంటే – సదరు నటి లేదా నటుడి ముఖాన్ని, క్లోజప్ లో ఓవైపు నుండి మరో వైపుకి తిప్పడాన్ని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నేపధ్యంలో, కెమెరాతో, మళ్ళీమళ్ళీ షూట్ చేస్తాడు. లేదా పలుకోణాల్లో ఆ ముఖాన్ని Focus చేస్తాడు. క్రికెట్ ఆటలో బంతి క్యాచ్ పట్టుకోబడి ఆటగాడు అవుటయి నప్పుడు, ఆ బంతి క్యాచ్ పట్టుబడటం లేదా స్టంప్ కి తగలటం, స్లోమోషన్ లో, పలుకోణాలలో, వివిధ కెమెరాలలో చిత్రీకరిస్తూ, ప్రత్యక్ష ప్రసారాలలో చూపిస్తుంటారు చూడండి, అలాగన్న మాట!

ఇంత హంగూ ఆర్భాటమూ చేశాక, ప్రేక్షకుడు ఆయా నటీనటులు కోపాన్ని అభినయించారనే అనుకుంటారు. వాళ్ళకి కోపం వచ్చింది అన్న విషయం, ఆయా నటీనటుల అభినయం చెప్పకపోయినా, సంగీత పరికరాల విన్యాసాలతోనూ, కెమెరా పనిమంతులు, దర్శకుడు చెప్పారు కదా! నకిలీ కణికుడి కుట్రలో ఎన్టీఆర్ తోడ్పాటు గురించి వ్రాసిన టపాలో ఈ విషయమై మరింత విపులంగా వ్రాసాను.

మరో ఉదాహరణ పరిశీలించాలంటే – సినీ నటుడు చిరంజీవి! పిల్లనిచ్చిన మామ, అల్లు రామలింగయ్య లాబీయింగ్ తోడయ్యాక, అప్పటివరకూ అలా అలా కొనసాగుతున్న చిరంజీవి కెరీర్ మంచి ఊపందుకుంది. తదనంతర పరిణామాల్లో అగ్రస్థాయికి చేరి మెగాస్టార్ అయిపోయాడు.

తోడికోడళ్ళు సినిమా కోసం ఆత్రేయ ఓపాట వ్రాసాడు. ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు. అందులో “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీదానా! నీదు బుగ్గల గులాబీరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుఎండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో ” అంటారు.

ఈ స్థితిని మరోరకంగా చెప్పాలంటే ’ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్టు మహావృక్షమౌతుందనీ’ అంటారు. చిరంజీవి విషయంలో, సినీ గాడ్ ఫాదర్ల ముసుగు వేసుకున్న నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలకవ్యక్తి రామోజీరావు అనుసరించింది ఇటువంటి స్ట్రాటజీనే. ఆనాటి సినిమాలు ఓసారి గుర్తు తెచ్చుకుంటే – అప్పటి మాస్ ని ఉర్రూతలూగించగల పాటల ట్యూన్లు, కథలు, డాన్స్ స్టెప్పులు కేవలం చిరంజీవికి మాత్రమే సమకూర్చబడేవి. మరింకే నటులకీ అటువంటి డాన్స్ స్టెప్పులు డాన్స్ డైరెక్టర్లు గానీ, చిత్రదర్శకులు గానీ ఇచ్చేవారు కాదు. దాంతో మెగాస్టార్ డాన్స్ సూపర్ డాన్స్ అనిపించుకుంది.


1992 తర్వాత, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా తెరవెనుక నుండి తెరమీదకి వచ్చి, జంటిల్ మెన్, కాదలన్ [తెలుగులో ప్రేమికుడు చిత్రం] విడుదల కావటంతో, ఈ విషయం స్పష్టంగా బహిర్గత మయ్యింది. అదే 1992 కు ముందు నాకు గుర్తుండి ’హృదయం’సినిమాలో ప్రభుదేవా పాట [ఏప్రిల్,మే లలో పాపలు లేరురా, బోర్! బోర్!రా!] లో నటించాడు. ఆ పాటలో పెద్ద స్టెప్పులు లేవు. అంతా సైకిల్ మీద తిరుగుతూ నటించాడు. అదే 1992 తర్వాత ఒక పాటలో నటించిన సినిమా ’జంటిల్ మెన్.’ ఈ పాటలో డాన్స్ స్టెప్పులతో పేరు బాగా సంపాదించాడు.

ఆ తర్వాత, క్రమంగా సినీరంగంలో చిరంజీవి ప్రభ తగ్గింది. ఏ సినిమా అయినా హిట్ అన్పించుకోవడానికి నానా ఫీట్లూ చెయ్యాల్సివచ్చింది. 1992 తర్వాతే ఇతర నటులకి కూడా మంచి సంగీతం, డాన్స్ స్టెప్పులూ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోణంలో క్రమంగా మోనోపలి బద్దలయ్యింది. నిజానికి ఈ ‘ఆముదపు చెట్టు స్ట్రాటజీ’లో నకిలీ కణిక వ్యవస్థకి ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సినీరంగంలో కళాత్మకతని నాసిగా ఉంచటం. దాంతో ప్రజలలోని ఉత్సాహ చైతన్యాలని హరించవచ్చు. కణికనీతి లో ఇది తొలి వాక్యం. రెండో ప్రయోజనం మోనోపలిలో డబ్బు దండుకోవటం. ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రజలు అవే చూడకా, డబ్బు చెల్లించకా ఛస్తారా?

మరో విషయం ఏమిటంటే – చిరంజీవికి, కొంతమంది హీరోలకి, కెమెరా మెన్ ల సాయంతో ఇచ్చే ఇమేజ్! స్లోమోషన్ లో నడకలు, రిపీటెడ్ షాట్ లూ, క్లోజప్ లూ, ఫైటింగ్ షాట్లతో సూపర్ ఇమేజ్ ఇచ్చేవాళ్ళు. 1992 తర్వాత, ప్రతీ హిట్ సినిమాకి, మరో సినిమాలో కామెడీ ట్రాక్ గా పేరడీలు రావటం, ఆయా హీరోలకి ఇచ్చిన స్లోమోషన్, క్లోజప్ లూ, ఫైటింగ్ షాట్సు, పంచ్ డైలాగులూ కమీడియన్లు చేయటం జరిగింది. దాంతో హీరోల ఆరాధన దెబ్బతింది. ఉదాహరణ కావాలంటే, తమిళ అనువాద సూపర్ హిట్, కార్తీక్, ప్రభుల సినిమా ‘ఘర్షణ’ని సుధాకర్, బాబూమోహన్ లతో మరో సినిమాలో కామెడీ ట్రాక్ తీసారు. వేణు మాధవ్ వంటి కమేడియన్లు, విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’ల వంటి కామెడీ ట్రాక్ లు చేసారు. సునిల్,ధర్మవరపు సుబ్రమణ్యం వంటి కమేడియన్లు కూడా ఇటువంటివి చాలానే చేశారు.

దానదీనా, హీరో వర్షిప్ అన్నది ప్రజల దృష్టిలో పల్చబడింది. హాస్యరసం కారణంగా, నవ్వుతూ అయినా, తర్వాత ‘హీరో చేసింది కమేడియన్లు చేశారు. కెమెరా మెన్, మ్యూజిక్ కలిస్తే గొప్పగా హీరోయిజం అన్పించింది. కమేడియన్ చేస్తే నవ్వొచ్చింది. అంతే!’ అనుకునే స్థితికి, ప్రేక్షకులు వచ్చారు. ఇంత స్ట్రాటజీ నడుస్తుంది ప్రతీ అంశంలోనూ. అంతే కాదు, ఒకప్పుడు హీరో అంటే ఇలాగే ఉంటాడు అనే హీరో ఫీచర్స్ ఉండేవి. అదే ఇప్పుడయితే, పబ్లిక్ లో ఉండే రకరకాల వ్యక్తుల ముఖకవళికలు గల వారిని తీసుకుని, వారినే హీరోలుగా, హీరోయిన్లుగా నటింపజేస్తున్నారు. ప్రతీ ఒక్క సినిమా హీరోకి, హీరోయిన్ కి కనీసం ఒక హిట్ అయిన ఉంటున్నది. దాంతో ఆ ముఖకవళికలు గల వారు, తామని తాము ఆ హీరోలా ఉన్నామనుకుంటూ, తనకు తానూ హీరోగా ఊహించుకుంటున్నాడు. ఆ విధంగా కూడా సూపర్ హీరో ఇమేజ్ అన్న దానిని బద్ధలుకొట్టారు.

ఇక రచయితలకూ, దర్శకులకూ ఘోస్ట్ లు ఉండటం కద్దు. తమకి దాసోహం అన్న వారికి, మీడియా ఎటూ ఇమేజ్ ఇస్తుందయ్యె! విజయాల్ని కూడా కట్టబెడుతుందయ్యె! అందుకోసం మరికొన్ని స్ట్రాటజీలు కూడా నకిలీ కణిక వ్యవస్థ అమలు జరిపింది. తమకు అనుకూలురైన నటీనటులకి, ఇతర కళాకారులకి ఇమేజ్ ఇచ్చేటందుకు, ఇతరుల చేత పొగిడించటం ఓ పద్దతి. ఆయా నటీనటులు ఏ సినిమాలో చేసినా, ప్రక్కపాత్రల ద్వారా సహనటీనటులు, సదరు నటీనటుల పాత్రల్ని పొగిడేవారు, వాళ్ళనీ పొగిడేవారు. పదే పదే అదే ప్రచారం. క్రమంగా ఓ ఆరాధన, బలమైన ప్రభావం ముద్రలేసేస్తారు.

ఓ ఉదాహరణ చూడండి. ’అల్లుడొచ్చాడు’ అంటూ ఓ గొప్ప సినిమా వచ్చింది. నలుపు తెలుపు సినిమా. రామకృష్ణ, రాజబాబు హీరోలు, జయసుధ, ప్రభ హీరోయిన్లు. జయసుధ కెరియర్ ప్రారంభచిత్రాల్లో ఇదీ ఒకటి. అందులో హీరో గాయకుడు. తెరవెనుక గాయకుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం. హీరో, ఆకాశ వాణిలో “లేత కొబ్బరి నీళ్ళల్లే, పూత మామిడి పిందెల్లే, చెప్పకుండా వస్తుంది చిలిపి వయస్సు. నిప్పుమీద నీళ్ళవుతుంది లేతమనస్సు. మనస్సు…..” అంటూ ఓ పాట పాడతాడు. ఆ పాటని, ఆబాలగోపాలమూ, పండిత పామరజనమూ, ఊరూరా ఉర్రూతలూగుతూ వింటున్నారని చూపెట్టడానికి దర్శకుడు నానాఫీట్లు చేసాడు. ఆ ఎరా[era]లో, సినిమా గురించి ప్రచార ప్రస్తావనల్లో, “ సినిమాలోనే కాదు, నిజంగా కూడా ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాటలకు ప్రజాస్పందన అలాగే ఉంది” అంటూ చిత్రసీమలో పేరెన్నిక గన్న వారందరూ, పదేపదే చెప్పి మరీ పొగిడారు. తదుపరి రోజుల్లో బాలసుబ్రమణ్యాన్ని సక్సెస్ చేయటానికే అటువంటి చిత్రాలు నిర్మించబడటమే ఇక్కడి అసలు స్ట్రాటజీ!

ఆ విధంగా ప్రత్యక్ష ప్రచారం ఒక్కటే గాకుండా, ఇలాంటి పరోక్ష ప్రచార స్ట్రాటజీలతో కూడా, తమకు అనుకూలురైన వ్యక్తుల్ని, నకిలీ కణిక వ్యవస్థ, గాడ్ ఫాదర్ ల ముసుగులో పైకి తెచ్చుకుంది. ఈ విధమైన రకరకాల స్ట్రాటజీలతో ఆయా విభాగాల్లో, రంగాల్లో మోనోపలి సృష్టించుకోవటంలో నకిలీ కణిక వ్యవస్థకి, అందులోని కీలక వ్యక్తులకి రెండు సౌలభ్యాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి డబ్బు. రెండోది ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం. నిజానికి ఇదే వారి ప్రధాన లక్ష్యం కూడాను.

ఓ సామెత ఉంది. ’కుక్కని చంపాలను కుంటే, ముందు దాన్ని పిచ్చికుక్కగా ముద్రవెయ్యి’ అని! అప్పుడు దాన్ని సులభంగా చంపొచ్చు. సరిగ్గా ఇదే తంత్రం ’ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్న స్ట్రాటజీ వెనుక ఉంది. అందుకోసమే, చాలా పకడ్బందీగా, పద్దతి ప్రకారం, వ్యూహాత్మకంగా, ప్రజాదృక్పధాన్ని – సినిమాలు, మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రభావపరచటం జరుగుతోంది. ఇది గూఢచర్యంతో కూడిన కుట్ర. తార్కిక జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనా సరళిని, పౌరుషపూరితమైన భావోద్వేగాల్ని, సాహసోపేత వ్యవహార సరళిని, సృజానాత్మకతనీ, ఇతర నైపుణ్యాలని నాశనం చేయటం ద్వారా, ఓ జాతిని, ఓ దేశాన్ని చాలా సులభంగా నాశనం చేయవచ్చు.

ఎందుకంటే దేశమంటే మట్టికాదు, మనుష్యులు కదా! కళ్ళెదుట – పనికి మాలిన వారు కాకాలు కొట్టటం, ప్రక్కదారులు తొక్కటం వంటి పనులతో, ప్రముఖ కళాకారులుగా, వ్యక్తులుగా వెలుగొందుతున్నప్పుడు, నిజంగా సత్తా ఉన్న కళాకారులకు, వ్యక్తులకీ ఏమనిపిస్తుంది? సమాజంలో నెగిటివ్ ధోరణిలే పెరిగిపోతాయి. ఈ స్థితి రాకూడదనే హెచ్చరిక, విదురనీతి, నారదనీతి, వ్యాస నీతి చెబుతాయి. ఈ సందర్భంలో విదురుడూ, వ్యాసుడూ మహారాజు అయిన ధృతరాష్ట్రునితో సంభాషణ, మహాభారతంలో చెప్పిన విషయాలు, మరోసారి గుర్తుచేసుకోవచ్చు.

వ్యాసమహర్షి ఓసారి ధృతరాష్ట్రుని సభకి వచ్చిన సందర్భంలోనిది ఈ చర్చ. అప్పుడు వ్యాసమహర్షి, ధృతరాష్ట్రుని కుశలం అడుగుతూ మహారాజుని “నీ దేశంలో, ఉద్యోగులు తమ అర్హతలకి తగిన పదవుల్లో నియమితులౌతున్నారా లేదా?” అని అడుగుతాడు. “కవులూ, పండితులూ, ఇతర కళాకారులూ వారివారి ప్రతిభ సామర్ధ్యాలకు తగిన విధంగా ఆదాయాల్ని, రాజాదరణనీ, కీర్తి ప్రతిష్టల్నీ పొందుతున్నారా, లేదా?” అని ప్రశ్నిస్తారు. ఒక వేళ అసమర్ధులు గనుక ఉన్నతస్థానాల్లోనూ, సమర్ధలు నిమ్నస్థానాల్లోనో ప్రయోగింపబడితే మనోవికారాలు, చెడు భావనలు, మానసిక అనారోగ్య ధోరణులు సమాజంలో విస్తరిస్తాయని హెచ్చరిస్తారు.

అలాంటి పెడధోరణులు సమాజానికి కీడు చేస్తాయనీ, ప్రజలలోనూ అసంతృప్తి పెరిగిపోతుందనీ చెబుతారు. సమర్ధులూ, ప్రతిభావంతులూ గనక, వారికి తగిన స్థానాల్లో ప్రయోగింపబడకపోతే, వారికి తగిన ఆదాయాన్ని, కీర్తి ప్రతిష్టుల్ని పొందకపోతే సమాజంలో అలజడులు రేగుతాయంటారు. అసమర్ధుడు, నైపుణ్యం లేని వాడు పైస్థానాల్లో ఉంటే, అలాంటివాళ్ళు తమ క్రింది వారిపై, అనవసరపు అజమాయిషీని చూపిస్తూ, తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, తమ అపరిణితిని చాటుకుంటారనీ, అలాగే సమర్ధులూ, ప్రతిభసంపన్నులూ, వారికి తగని తక్కువ స్థానాల్లో నియోగింపబడితే, వారిలోని తేజస్సు, స్ఫూర్తి నాశనమౌతాయనీ, దాంతో అసంతృప్తి, ఆత్మన్యూనత భావాలు చెలరేగి, ఆయా మనోవికారాల కారణంగా, సమాజంలో కొన్ని వైషమ్యాలు పుట్టుకొస్తాయనీ, ఒక ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొంటాయనీ, సమాజంలో ప్రజా ఐక్యత దెబ్బతింటూందనీ చెబుతారు.

కాబట్టి, రాజైన వాడు, ఈ విషయాల్లో సర్వశ్రద్ధలూ పాటించాలని హెచ్చరిస్తారు. అదే ఇప్పుడైతే, ప్రభుత్వాలు మహాభారతంలో చెప్పబడిన ఈ విదుర, వ్యాస బోధనలకు సరిగ్గా విపర్యయాన్ని అమలు చేస్తున్నారు. ఏ పేరుతో ప్రకటించనీయండి, అసలు చడీచప్పుడూ కాకుండా అమలు పరచనీయండి, చేస్తోన్నది మాత్రం, ఈ విదుర, వ్యాస, నారద నీతులకు 100% విపర్యయాన్ని అమలుచేయటమే. లంచగొండితనం, బంధుప్రీతి, కులమత ప్రాతిపదికన రిజర్వేషన్లు, గాడ్ ఫాదర్ల అండదండలూ, లేదా వాళ్ళ నెట్ వర్కు, ఏ పేరైతేనేం [Over leaf reasons అంతే] ప్రతీరంగంలోనూ, ప్రతీ అంశంలోనూ ఇదే స్థితి!

ఇంతటి కుట్ర జరుగుతున్నా, నేటి ప్రభుత్వాల్లో కనీసం అలాంటి గుర్తింపు సైతం ఉండదు. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వాలు నకిలీ కణిక వ్యవస్థకి అనుచరగణంలోనివి కాబట్టి! ఒకప్పటి ప్రభుత్వాలు ఆ పోరాటంలోనే అల్లాడి, అలిసిపోయాయి. మీడియా బలంతో ఇందిరాగాంధీ వంటి నాయకత్వాల్ని, ప్రభుత్వాలని, నకిలీ కణిక వ్యవస్థ నానా అగచాట్లు పెట్టింది. చెబితే అర్ధం చేసుకునే ప్రతిభ, ప్రజల్లో లేకుండా చేసెందుకే ’ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్న స్ట్రాటజీ నడుస్తుందయ్యె! ఇప్పటికైనా, ప్రజలు ఈపాటి స్ట్రాటజీలని తెలుసుకోగలుగుతున్నారు, అర్ధం చేసుకోగలుగుతున్నారు, అంటే – ‘మీడియా విశ్వసనీయత పోవటం’ వంటి పరిణామాలే కారణం. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు, ఓటమి బాటలోని పరిణామాల్లో ఇదీ ఒకటి.

ఇక ఈ కుట్రమీద నుండి అందరి దృష్టీ మళ్ళించడానికి, సినిమా రంగంలో కొన్ని ద్వంద్వాలు సృష్టించబడ్డాయి. నిజానికి ఇలాంటి ద్వంద్వాలు కేవలం పైకారణాలు [Over leaf reasons] మాత్రమే. అంతేకాదు, దాదాపు అన్నీరంగాల్లోనూ, తదనుగుణమైన ద్వంద్వాలని సృష్టించి, కుట్ర జరుగుతోందన్న పరిశీలన కూడా చేయలేనంతగా ప్రజలదృష్టిని హైజాక్ చేసి, దేశంపట్ల నిబద్దత గల నాటి ప్రభుత్వాలని ఏకాకిగానూ, నిస్సహాయంగానూ చేయగలిగింది నకిలీ కణిక వ్యవస్థ.

ఇక సినిమారంగంలోని ద్వంద్వం ఏమిటంటే – ’తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం’ అన్నది. మీడియా ఉద్ఘాటన ప్రకారం – ప్రజలు, “సినీనిర్మాతలు అశ్లీల లేదా చెత్త సినిమాలు తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం” అన్నారట. [అలా అంటున్నారని అప్పట్లో అంటే దాదాపు 1975 నుండి 1992 దాకా తెగ ఊదర పెట్టింది మీడియా] అలాగే నిర్మాతలూ దర్శకులూ, “ప్రజలు చూస్తున్నారు కాబట్టి అలాంటి సినిమాలు తీస్తున్నా” మన్నారు.

నిజానికి, ఇదమిద్దంగా ఏ నిర్మాత దర్శకులూ అలా అన్నారో తెలియదు. ప్రజల్లో ఎవరన్నారో నిశ్చయంగా తెలీదు. ప్రజల తరుపునా, నిర్మాతాదర్శకుల తరుపునా మీడియానే స్వయం వకాల్తా పుచ్చుకుని అనేసింది. ఖచ్చితంగా చెప్పాలంటే ’అలా అంటున్నారు మీరు’ అంటూ ముద్ర [స్టాంపు] వేసింది.

ఇక సినిమా రంగంలో మరో యదార్ధం ఏమిటంటే – కథ, కథనం, కథను ప్రేక్షకులకు చూపించే విధానం [Presentation], స్ర్కీన్ ప్లే, వంటి ప్రతీ అంశం – 1975 నుండి 1992 వరకూ, ఖచ్చితంగా చెప్పాలంటే 1980 నుండి 1992 వరకూ, దాదాపు రెండే అంశాల మీద ఉండేవి. ఒకటి పగ ప్రతీకారం. హీరో చిన్నప్పుడు ఓ విలన్ హీరో కుటుంబాన్ని నాశనం చేస్తాడు. తల్లిదండ్రుల్ని చంపేయటం గట్రాలన్నమాట. హీరో పెద్దయ్యాక పగతీర్చుకుంటాడు. [ఇక్కడ మరో గమ్మత్తుంది. ఇలాంటి సినిమాలలో ఎక్కువగా, మంచివాడైన ఒక ముస్లిం పాత్ర ఉంటుంది. జంజీర్, తెలుగులో నిప్పులాంటి మనిషిలో ‘స్నేహమేరా జీవితం’ అని పాడే సత్యనారాయణ పాత్రలాంటివి అన్నమాట.] ఇదేమూస కథతో దాదాపు దశాబ్ధం గడిచింది.

దీనికి ముందో వెనుకో, మరో దశాబ్ధం, ప్రేమ సాగుడు కథలతో నడిచింది. ఇద్దరు హీరోయిన్లు, ఓ హీరో ముక్కోణపు ప్రేమకథ. చివర్లో ఓ హీరోయిన్ త్యాగం చేసి తేగల కట్ట అయిపోతుంది. వాకిట్లోకి, ఆ తర్వాత చీకట్లోకి కలిసిపోతుంది. లేదా తన ప్రియుడికి మరో హీరోయిన్ తో పెళ్ళి జరిపించి శ్రీవారి ముచ్చట్లు చెప్పించుకుంటూ ’మానసిక తృప్తి’ పొందుతుంది. ఈ సోది కథలతో ఓ దశాబ్దం నడిచింది. ఎంతో చౌకబారు హాస్యం, నస సంభాషణలు, వైవిధ్యంలేని కథ, నీరస నిస్సత్తువల్ని నింపే సంగీతం! ఈ పరిణామానికి ముందు, మెలోడ్రామాతో ఉమ్మడి కుటుంబపు కథలు, మానవసంబంధాల మీద సాగుడు ప్రక్రియతో సెంటిమెంటల్ హేమరింగ్ అన్న పేరు పెట్టబడి ప్రేక్షకుల్ని చిత్రవిచిత్రపు బాధలకి గురిచేసిన సినిమాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్యలతో ‘ఏదో బాబు’ సినిమా, కన్నాంబ, సావిత్రి, ఎన్టీఆర్ లతో ‘ఆత్మబంధం’ వంటి సినిమాలు ఈ కోవలోవే.

కొన్ని సినిమాలలో సోదిని పాటలతో కప్పి పుచ్చినా, మెల్లిగా ‘మెలోడ్రామా, కుటుంబ కథాచిత్రాలు, సెంటిమెంట్ అంటే ప్రజలకి వెగటు పుడుతుంది’ అన్న వాదనకి బలం చేకూర్చేలాగా సినిమాలు వచ్చాయి. పై వాదన బలపడ్డాక, ఎంచక్కా నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, తమ కుట్ర అమలుకు మార్గం మరింత సుగమం అయ్యింది. సినిమాకథల మూసతనం ఒకో దశాబ్ధంలో ఒకో విధంగా ఉండటం [వెరసి 10 ఏళ్ళపాటు ఒకేరకమైన కథలతో సినిమాలు రావటం] గురించి ప్రముఖరచయిత, క్యారెక్టర్ నటుడూ తనికెళ్ళ భరణి చాలాచక్కని వ్యాసం వ్రాసాడు కూడా!

ఇక కథ ఏవిధంగా అయినా ఉండనీయండి, అందులో తప్పనిసరిగా ఉండే మిర్చిమసాలా మరికొంత ఉంది. అది నటీనటుల వేషధారణలోనూ, సంభాషణల్లోనూ, పాటల్లోనూ, నృత్యాల్లోనూ నిండి ఉన్న అశ్లీలత! సినిమాల్లో నాణ్యత తరగటం, 1975 మొదలై తర్వాత 1980 నుండి 1992 లోపల విపరీత వేగంతో పెరిగిపోయింది. సమాజంలోని ఇతర కళారూపాలన్నిటినీ రూపుమాపేసి, సినిమా ఏకైక అవకాశంగా ప్రజల ముందు నిలబడటంతో, వినోదార్ధం మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. [అప్పటికి టీవీలు ఇంతగా వ్యాప్తి చెందలేదు]

ఆ విధంగా ప్రజలలో ప్రేరణనీ, స్ఫూర్తినీ నింపగల సంగీతం, సాహిత్యం, తరం నుండి తరానికి సంక్రమించిన రకరకాల యుద్ధకళలు, కోలాటాది గ్రామీణ జానపద కళలూ, అన్నీ అంతరించిపోయి, సంస్కృతీ సాంప్రదాయాలంటే ఏమిటో తెలియని స్థితికి సమాజం ప్రయాణం మొదలుపెట్టింది. సాంప్రదాయ కళలన్నిటి స్థానే సినిమా ఏకైక సాధనమై నిలబడింది.

దాంతో విజయవంతంగా ప్రజాబాహుళ్యంలోని, ప్రజాదృక్పధంలోని సంస్కృతీ సాంప్రదాయపు విలువల్నీ, నమ్మకాలని, ప్రవర్తనా సరళులని, మాటతీరుని, సభ్యత సంస్కారాలని, మంచి మర్యాదా మన్ననలని, ఆరోగ్యకరమైన పలకరింపు దగ్గరి నుండి ఆత్మీయతా పూర్వక పిలుపుల దాకా, అన్నిటినీ – సినిమా, ప్రభావ పరచటం మొదలై, మార్చిపారేయటంలో సఫలీకృతమైంది. ఇంత జరుగుతున్నా, “ సినిమా కేవలం ప్రజల్ని వినోదపరుస్తుంది. అంతే తప్ప, సినిమాల ప్రభావం ప్రజల మీద ఏమాత్రం ఉండదు” అంటూ సినీపండితులు, నకిలీ కణికవ్యవస్థలోని కీలక వ్యక్తులిచ్చిన Assignments ప్రకారం చిలకపలుకులు పలుకుతూనే ఉంటారు.

ఈ నేపధ్యంలో మరో ప్రత్యామ్నాయం లేక కొంతమందీ, అప్పటికే సినిమాలు చూడటం అన్నది వ్యసనం అనేంత స్థాయిలో ఉండి కొంతమంది, ఏ సినిమాలు అందుబాటులో ఉంటే అవి చూసేవాళ్ళు. అప్పటికీ కొన్ని సినిమాలని ‘పరమ చెత్త సినిమాలు’గా ప్రజలు తిరస్కరించినా, ఆశ్చర్యకరంగా ఆ సినిమాలకీ సక్సెస్ ముద్రపడేది. అవార్డులు వచ్చేవి. 100 రోజుల ఉత్సవాలూ నడిచేవి.

నల్లమేక నలుగురు దొంగల కథలాగా ’నాకొక్కడికే నచ్చలేదేమో! అందరికీ నచ్చినట్లుంది. ఉలిపి కట్టెలాగా నేనే ఉన్నట్లున్నాను’ అని ప్రతివాళ్ళు అనుకోవాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడంటే 100 రోజులూ, 50 రోజుల పండుగలు, క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగుల వంటివని ప్రజలకి తెలిసిపోయింది గానీ, అప్పటికింత అవగాహన ఉండేది కాదు.

అదీగాక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అనే మాయాజాలం ఒకటి ఉండేది. జిల్లాల వారిగా సినిమాల పంపిణి వ్యవస్థ చేతుల్లో, నిర్మాతలు గిలగిల్లాడాల్సి వచ్చేది. మొత్తంగా చిత్రనిర్మాణం దగ్గరి నుండి చిత్రవిజయాల వరకూ అదృశ్యహస్తాల్లో వ్యవస్థీకృతంగా నడిపింపబడేది. ఆ అదృశ్య హస్తపు విన్యాసమే కుట్ర. ఆ హస్తమే నకిలీ కణికవ్యవస్థ. దీనంతటికీ – నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులూ, సంస్థలు ఐ.ఎస్.ఐ., సి.ఐ.ఏ.లు పెట్టిన పేరు ’తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం – చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం’ అనబడే ద్వంద్వం.

ఈ విధమైన ద్వంద్వపు సృష్టితో భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కుట్రదారులు i.e. నకిలీ కణికవ్యవస్థా, అందులోని కీలకవ్యక్తులూ, సంస్థలూ, సినిమారంగంలోని నైతిక విలువల్ని, కళాత్మక విలువల్ని, మానవీయ విలువల్ని, నాణ్యతని సర్వనాశనం చేయగలిగారు. మొత్తంగా కథ దగ్గరి నుండి అన్ని అంశాల్లో, సినిమాల్లోని సాహిత్యాన్ని, సంగీతాన్ని రసం పిండేసిన చెరకుపిప్పిలాగా ఇంకా చెప్పాలంటే నిర్జీవ కళేబరేల్లాగా చేయగలిగారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

http://www.tadepally.com/2009/10/blog-post_12.html?showComment=1256022399735#c4699938248114239747 చూడండి. దాదాపు ఇలాంటి విషయమే అక్కడానూ!

Interesting, as usual.
నా మట్టుకి నేను మన సినిమా తేభ్యాలకి ఆ మాత్రం తెలివి తేటలున్నాయని అనుకోను. తెలుగు టాకీలు అని మొదలయిన రోజునుంచీ నానా చెత్తా తీస్తూనే వున్నారు అని పాత సినిమా పత్రికలు, ఆ రంగానికి సంబంధించిన సాహిత్యంలో స్పష్టంగానే తెలుస్తోంది.
కారులో షికారుకెళ్ళే పాట రాసింది ఆత్రేయ, శ్రీశ్రీ కాదు.

రాఘవ గారు,

నెనర్లు!

*****
కొత్తపాళీ గారు,

అవునండి. ఆత్రేయ గారే! తప్పను సవరించినందుకు నెనర్లు!

ప్రభుదేవా 'హృదయం' కన్నా ముందే 'అసెంబ్లీ రౌడీ'లో ఓ పాటలో నర్తించాడు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu