అది నెం.10 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ అయితే, ఇదే విషయంలో నెం.5 వర్గపు ముఖతః ఉన్న స్ట్రాటజీ ఏమిటంటే – టీవీల్లో, పత్రికల్లో ’చచ్చినోడి కళ్ళు చారెడు’ అన్న సామెతకు బదులుగా ’చచ్చినోడి కళ్ళు చారెడు, బారెడు కాదు ఏకంగా మైళ్ళకొద్దీ’ అనేంతగా వై.యస్.రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించినా, ఆర్జంటుగా అతణ్ణి లోకనాయకుడు, ఆపద్భందువు, అపర భగీరధుడు, జలదాత, జననేత…. గట్రా గట్రా చేసేసినా, దేవుణ్ణి చేసేసినా ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. మహా అయితే ’ఇదేం పోకడరా బాబూ!’ అన్న చికాకూ కలగచ్చు. ఇంకా ఎక్కువైతే జుగుప్స కలగొచ్చు. అది కొద్దిపాటి అసౌకర్యమే! భరించలేకపోతే జనాలు టీవీలు కట్టేసు కుంటారు, లేదా చేతిలో పేపరు గిరాటేసుకుంటారు. అంతే!

అదే అభిమానులం అంటూ కొందరు రోడ్ల కెక్కితే…. అందులో ఏదీ తెలియని, నిజమైన అభిమానులు కొందరుండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దామనుకునే కుతుహలంతో కొందరు చేరొచ్చు. ఆ గుంపులోకి కొందరు లూటీదార్లూ చేరతారు. స్థానికంగా ఉండే ఛోటామోటా నాయకులు, వీళ్ళని ’అన్నా’ అని పిలుస్తూ వెంట దిరిగే మరికొందరు అనుచరులూ, ‘రోడ్డు కెక్కటం’ అన్న ప్రక్రియ, ఆయా స్థానిక ఛోటామోటా నాయకులకి తమ తమ రాజకీయనాయకులతో ఉన్న సంబంధాల పైనా, Communication పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే గుంపుగా జనాలు రోడ్డు కెక్కుతారో, అందులోకి లూటీదారుల వంటి నేరగాళ్ళు దూరతారు. ఇక కిరాణా దుకాణాలు, సూపర్ బజారులూ, మద్యం, టీవీ, ఫ్రిజ్జ్ లూ, మిక్సిలూ అమ్మే దుకాణాల దగ్గరి నుండి వెండి బంగారు దుకాణాల వరకూ, వస్త్ర దుకాణాల వరకూ…. అందినవి, అందినట్లు దోచుకుంటారు. హోటళ్ళు గట్రాలని తగలబెడతారు. వాహన షోరూంల షట్టర్ లను కూడా బద్దలు కొట్టి కొత్త వాహనాలని ఎత్తుకుపోయిన సంఘటనలు విజయవాడలో వంగవీటి మోహనరంగా హత్యానంతరం, దేవినేని మురళి హత్యానంతరం, జరిగాయి. ఆ సమయంలో ఏ వస్తువు లూటీ చేసినా అందినంత లాభమే! పోలీసులు, కేసులు… ఏ గొడవా ఉండదు.

విజయవాడలో రంగా హత్య తర్వాత జరిగిన లూటీల్లో అయితే - ఓ వ్యక్తి బ్లాక్ & వైట్ టీవీ, చిన్నది, లూటీ చేసుకు ఇంటికి వెళ్ళితే అతడి భార్య కలర్ టీవీ తేలేదని తిట్టిందట. అందుకోసం మళ్ళీ రోడ్డుమీదకి వచ్చిన సదరు భర్త, అప్పటికి మొదలైన పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ వార్తని ఫోటోతో సహా బాక్సు కట్టి పత్రికల్లో ప్రచురించగా గుంటూరు, విజయవాడలలో అప్పట్లో అది విపరీతంగా చర్చనీయాంశం అయ్యింది. అలాంటి వార్తలని మీడియా అప్పట్లో మరింతగా ఎందుకు ప్రచారించిందంటే, అరాచకం ప్రబలిపోయిందనీ, ప్రజలు బుర్రలకి ఎక్కించటానికి. నకిలీ కణిక వ్యవస్థ ప్రణాళిక ప్రకారం ’ముఠా రాజకీయాలు’ అన్నపైకారణం [over leaf reason] తో నిర్వహించిన అరాచకాల్లో అదీ ఒకటి. ఆ సమయంలో ఎవరి అనుచరులు ఎక్కువ లూటీలు, దహనాలు చేశారో, తరువాత స్వల్పవ్యవధిలో వాళ్ళు బలమైన స్థానిక నేతలుగా ఎదిగారు. అందునా లూటీలు చేసిన వారిపై కేసులు రాకుండా చూడటం, వచ్చిన కేసుల్ని మాఫీ చేయించటం వంటి చర్యలతో మరింత బలం పెంచుకున్నారు.

ప్రజాజీవనంలో అవినీతి అప్పడే అంతగా ఉండగా, ఇప్పటి పరిస్థితి వేరుగా చెప్పుకోవాలా? టమాటాలు మార్కెట్లో, రైతుకి కేజీకి 35 పైసలు కూడా చెల్లించని దళారులపై కడుపుమండి, కాయలు తెంపిన కూలీ గిట్టని వ్యధతో, వృధాగా రోడ్లపై టమాటాలు పారేయలేని రైతులు, తమ నిరసనని తెలిపేందుకు, టమాటాలు మినీలారీలలో, ఆటోలలో తెచ్చి, ప్రజలకి ఉచితంగా పంచిపెట్టడానికి వస్తే….ఆత్మాభిమానం గానీ, ’మనం మార్కెట్లో 4/- రూపాయలకి టమాటాలు కొంటున్నాం [అప్పటి ధర], రైతుకి 35 పైసలు కూడా గిట్టక రైతు ఇక్కడికి తెచ్చాడట. కనీసం మనం మార్కెట్ రేటులో సగమన్నా ఇద్దాం’ అన్న ఆలోచన గానీ, లేకుండా గంపలూ, బకెట్లతో టమాటాలు తీసుకోవడానికి ప్రజలు ఎగబడటం, కొన్నిరోజుల క్రితం జరగగా, టపాకాయలో పేల్చాను.

అంతగా, ప్రజలలో చాలామందికి, ఊరికే వచ్చే సొమ్ము తియ్యగా ఉంది అనుకునే అవినీతి వర్తన అలవాటు అయ్యింది. ఇలాంటి దృక్పధాన్ని అలవరిచేందుకు, పదుల సంవత్సరాలుగా మీడియా, నకిలీ కణిక వ్యవస్థా చేసిన నిరంతర ప్రయత్న ఫలితమది. అలాంటి చోట, గుంపుగా జనం, ‘అభిమానులమంటు’ రోడ్లపై గుమిగూడితే, కేవలం లూటీలతోనే ఆగిపోదు. ఆ గుంపుల్లో దూరిన నేరగాళ్ళు, స్వార్ధపరులూ, తమకి అక్కసూ, కోపం ఉన్నవారి మీద, పాత తగదాలున్న వారి ఇళ్ళ మీదా పడి, ఇంట్లో వస్తువుల్ని ఎత్తుకుపోవటం, ఆడవాళ్ళని అవమానించటం, హింసా విధ్వంసాలకు పాల్పడటం కూడా, అక్కడక్కడా గతంలో జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు చాలా మామూలుగా తము ఈ పరిస్థితిని ఊహించలేదని, కాబట్టి వాటిని ఆపలేకపోయామని సమాధానం చెప్పడం కూడా కద్దు. వీటన్నింటి వెనుకా అప్పటి అధికారపార్టీ మద్దతు ఉంటుంది.

అలాంటి వేవీ జరగకుండా, ముందుగా సీ.ఎం. మిస్సింగ్… ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మీడియా ద్వారా సృష్టింపబడింది. అందులో నెం.10 వర్గపు అవసరం నెం.10 ది కావచ్చు గాక. ఆ సస్పెన్సు కొద్దీ టీవీల ముందు చతికిలబడిన జనం, అదే అయోమయంతోనూ, సస్పెన్సుతోనూ ఉన్న రాజకీయనేతల గణం….. రోడెక్కలేదు.

మర్నాటికి ముఖ్యమంత్రి మరణ వార్త తెలిసినా, అప్పటికి మీడియా అతణ్ణి దేవుణ్ణి చేసేస్తూ ప్రశంశల సునామీ సృష్టించటంతో అంతా అదే ఒరవడిలో వెళ్ళిపోయింది. ఆ విధంగా పోలీసులను అలర్ట్ చేయటం జరిగింది.

లూటీలు, దహనాలు, పాతకక్షలని సాధించుకుంటూ హింసా విధ్వంసాలు, నివారింపబడేటప్పుడు, అతిప్రచారాలతో కలిగే చికాకూ వెగటూ వంటి మానసిక అసౌకర్యం పెద్దగా పరిగణనలోకి తీసుకోవలసిన అంశం కాదు. ఇది నెం.5 వర్గం నెరవేర్చుకున్న ఆకాంక్ష. ఎందుకంటే నెం.5 కి మనుషుల పట్లా, మానవత్వం పట్లా, రాష్ట్రం, దేశాల పట్లా, ప్రజల పట్లా నిబద్దత ఉంది గనుక!

ఇక్కడ ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే – ఈనాడు రామోజీరావుకు కూడా దాదాపు ఇలాంటి అవసరమే ఉండటం. తమ స్ట్రాటజీలో భాగంగా రామోజీరావుకూ రాజశేఖర్ రెడ్డికీ వైరాన్ని, ఈనాడు Vs సాక్షిల యుద్ధాన్ని తెగ ప్రచారించారయ్యె! అది నమ్మే ’మీడియా ప్రభావితులు’, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అకాలమృత్యువు పాలయ్యాడనగానే, హెలికాప్టర్ ప్రమాదం మీద అనుమానాలు పుట్టుకొస్తాయి. అందరి చూపులు రామోజీరావుమీద, చంద్రబాబునాయుడిల మీద కేంద్రీకరించబడతాయి. అసలుకే సెప్టెంబరు రెండుకు ముందు, ఆగస్టు 31న రాజశేఖర్ రెడ్డి తెదేపా పని ఫినిఫ్ అయిపోతుందనీ, దాని మీద సెప్టెంబరు ఒకటో తారీఖు ’ఎవరు ఫినిఫ్ అవుతారో చూద్దాం’ అని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. పరిస్థితి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా, ఇప్పటికే సృష్టింపబడిన వై.యస్. భక్తగణం, అభిమానుల దళం, మొదట దాడి చేసేది రామోజీరావు, చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యక్తిగత ఆస్థులపైన, ఈనాడు, మార్గదర్శి, కళాంజలి, బ్రిసా గట్రా గట్రాలపైనే. వై.యస్.ని అర్జంటుగా ’దేవుణ్ణి’ చేయటం వెనుక ఇది కూడా ఓ పైకారణం[Over leaf reason]గా చెప్పుకోవచ్చునన్న ఆలోచన కూడా రామోజీరావుకి ఉంది. అయితే ఆస్థుల సంరక్షణ కంటే పెద్ద ప్రయోజనం, వై.యస్.మరణం వెనుక అనుపానులు తెలుసుకోవటమే, దాన్ని బట్టి తదుపరి వ్యూహరచన చేయవలసిన అవసరం ఉండటమే!

నిజానికి దేశంలో గానీ, రాష్ట్రంలో గాని, అధికారంలో ఉన్న నాయకులు, ముఖ్యనేతలూ, ఆకస్మికంగా మృతి చెందినప్పుడు అరాచకాలు ప్రబలకుండా, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేటందుకూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేటందుకు ఆయా వార్తలని నియంత్రిస్తారు. నెమ్మదిగా, అంచెలంచెలుగా నిజాలు వెలువరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా, ఏ దేశంలో అయినా ఇదే సూత్రం అనుసరించబడుతుంది.

జాన్.ఎఫ్.కెన్నడీ అధికారంలో ఉండగా, కారుర్యాలీలో హత్య చేయబడితే, అతడు ఘటనాస్థలంలోనే మరణించినా, ఆసుపత్రికి తరలించిన కొన్ని గంటల వ్యవధి తర్వాత మరణవార్త ధృవీకరింపబడింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం కూడా, ఆమె ఘటనా స్థలలోనే మరణించినా, ఆసుపత్రికి తరలించిన కొన్నిగంటలు తర్వాత, అధికారికంగా మరణ వార్తా ప్రకటన జరిగింది. [అయినప్పటికీ సిక్కుల ఊచకోత జరిగింది. అది వ్యవస్థీకృతమనీ, ముందుగా రచించుకున్న పధకం ప్రకారం జరిగిందనీ ఇప్పటికే నిరూపించబడింది. అయినా ఇన్నేళ్ళుగా కులదీప్ నయ్యర్ సిక్కుల మనోభావాల గురించి నిరంతరాయంగా వ్రాస్తూనే ఉంటాడు, అది వేరే విషయం.]

అది అప్పడప్పుడూ జరిగే సహజ ప్రక్రియ. అయితే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి మృతి విషయంలో, పరస్పర విరుద్ధ వార్తలూ, రోజు రోజుకీ వెలువడటం గమనార్హం. ఇది పూర్తిగా అసహజం. ఈ రోజు వచ్చిన వార్తకు తరువాత విరుద్ధ వార్త, ఆ తరువాత మరో విరుద్ద వార్త. ఇలా…. దాదాపు ప్రతీ వార్తా మరో వార్తకి విరుద్దంగా ఉంటూ, అందులోనూ అసహజ బాష్యాలూ, నాటకీయ పరిణామాలు ఉండటం ఇక్కడ విస్మరించకూడని విషయాలు. వీరప్ప మొయిలీ వంటి నాయకులు సైతం ఈరోజు ప్రకటనకీ, మర్నాటి ప్రకటనకీ పొంతన ఉండకపోవడం – మీడియా మాయాజాలమో, రాజకీయ నాయకుల మాటకారి తనమో, అన్నిటినీ కమ్ముకు వచ్చిన గూఢచర్య తంత్రమో వారికే తెలియాలి.

ఇక మీడియాకి ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే – ఎటూ తము పాముల వారిలాగా నాగస్వరం ఎటు ఊపితే అటు, పాముల్లాగా జనాలూ ఊగుతారు.

ఇప్పుడు తామూ, అధిష్టానమూ ప్రాముఖ్యత ఇస్తున్నామంటే… ‘మరణించిన ముఖ్యమంత్రి చరిత్రని సినిమా తీస్తాం, అతడికి గుడి కట్టిస్తాం, అతడి కోసం పదవే త్యాగం చేస్తాం, అతడి వారసులని సీట్లో కూర్చోబెట్టకపోతే మానవబాంబులమౌతాం’ అనే వీరాగ్రేసరులంతా రేపు తామూ, అధిష్టానము ’ఛల్’ అనగానే మామూలుగా ప్లేటు ఫిరాయిస్తారు గనుకా….

అధిష్టానానికి ఎదురుతిరిగితే ప్యూజులు ఎగిరిపోతాయి. కాబట్టి అధిష్టానం ఏది అంటే అది శిరోధార్యం అంటారు గనుకా….

ఇప్పుడు జయహో అన్న నోటితోనే రేపు వ్యతిరేకంగా మాట్లాడమన్నా వెనుకాడరు గనుకా….

ఎటూ ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాలికం గనుక…..

ఇప్పుడు ఎలా ప్రచారించినా ఫర్వాలేదు. ముందు తమ గూఢచర్యం, తమ పనులు, తమకు సానుకూల పడటం ముఖ్యం.

కాబట్టే సహజ మరణాలను కూడా అభిమానుల ఆగిన గుండెచప్పుళ్ళుగా దైనందిక స్కోరు ప్రకటించారు. జాతీయ పత్రిక ‘ఇండియా టుడే’ అనుబంధ పత్రిక ‘మెయిల్ టుడే’ సర్వే చేసి, ‘అసలు టీవీ కూడా లేని వృద్ధుడు టీవీ చూసి ఏడ్చి ఏడ్చి మరణించటం వంటి సంఘటనలు ఎలా జరిగాయి?’ అంటూ లెక్కలు బయటికి తీస్తే….

స్థానిక పత్రిక అయి ఉండీ, అందునా కాంగ్రెస్ కి తాను వ్యతిరేకమని న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా [ఆ నాటికి ప్రయోజనకరం అన్పించి అనుసరించిన స్ట్రాటజీ అది] అఫిడవిట్ సమర్పించిన ఈనాడు కీ….

అందునా నిజాలు నిర్భయంగా వ్రాసే ట్రెండ్ సెట్టర్ గా తమని తాము అభివర్ణించుకున్న ఈనాడు యజమాన్యానికి….

ఈ మరణాలలో నిజాలెన్ని, ఎంతో కొంత పైకం, రాజకీయనాయకులో[టీజీ వెంకటేష్ కి లాగా] లేక ప్రభుత్వమో ముట్టచెప్పకపోతుందా అని ఆశతో, సహజమరణాలని దుఃఖంతో మరణించారని చెప్పబడిన వెన్ని?... అన్న విషయం తెలియదా? ఏకధాటిగా, దినదినానికి తగ్గుముఖం పట్టటానికి బదులుగా, పెరిగిపోయిన ప్రజాభిమానాన్ని, కొనసాగుతూనే ఉండిన అభిమానుల దుఃఖాతిశయ మరణాలని, పావురాల గుట్ట [రుద్రకోడూరు]కి జాతరలాగా జనం కదలిపోతున్న వైనాన్ని ప్రచురిస్తూనే ఉండటం వెనుక గల ’కొన్ని’కారణాలలో Time gain చేయటం ప్రధానమైనది.

ఆ విధంగా వై.యస్. మరణానంతరం ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ జరుగుతున్న పరిణామాల గురించి తము చెప్పింది వినటం, వ్రాసింది చదవటం తప్ప, ప్రజలు పరిశీలించకూడదు, ఆలోచించకూడదు అన్నది వాళ్ళ అవసరం. ప్రజలే కాదు, ఎవరికీ…. చివరికి ‘రాజకీయనాయకులకి సైతం పెద్దగా ఏదీ అర్ధం కాకూడదు’ అన్నది అక్కడ తీసుకోబడిన జాగ్రత్త. అదెందుకో కూడా వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

కొంచెం సాధ్యమైనంత త్వరగా తరువాతి టపాలు కూడా వ్రాయండీ! నెనరులు.

రాఘవ

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu