ఇంతకు ముందు టపాలలో వివరించినట్లు నకిలీ కణిక వ్యవస్థా, అందులో కీలకవ్యక్తి రామోజీరావు, వాళ్ళ నెం.10 వర్గానికీ, ప్రపంచవ్యాప్తంగా ఆయాదేశాల పట్ల నిబద్ధతా, మానవీయ విలువల పట్ల నమ్మకమూ గల నెం.5 వర్గానికీ మధ్య ఈ 17 ఏళ్ళుగా జరుగుతున్న గూఢచార పోరులో [పీవీజీ భాషలో చెప్పాలంటే మెదళ్ళతో యుద్ధం] రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. వాటిలో మొదటిది నెం.10 స్ట్రాటజీ బహిర్గతమవ్వడం! ఓ గూఢచార ఏజన్సీకి, గూఢచార సంస్థకీ, గూఢచార వ్యవస్థకీ తమ స్ట్రాటజీ బహిర్గతమవ్వడం అంటే మరణంతో సమానం. ఎందుకంటే తమ పనులు సానుకూలం చేసుకోవటానికి, తమ దోపిడి నిరాఘాటంగా జరుపుకోవడానికి స్ట్రాటజీయే వాళ్ళ ఆయుధం, పరికరం ఎక్సెట్రా. అలాంటి స్ట్రాటజీ బహిర్గతమైపోతే ఇక నిష్ఫలమే. ఇక రెండో అంశం ఏమిటంటే ఆయా గూఢచార ఏజంట్లూ, సంస్థలూ, వ్యవస్థలూ, కీలక వ్యక్తుల దగ్గరి నుండి అనామక ఏజంట్ల దాకా, తాము చేసిన కర్మ తాము అనుభవించటం. దాన్నే ‘సువర్ణముఖి’గా వర్ణించాను. ఆయా రంగాలు, దేశాలూ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

అలా బహిర్గతమౌతున్న స్ట్రాటజీలని, ఆయా వ్యక్తులూ, వ్యవస్థలూ, రంగాల సువర్ణముఖిని వీలునిబట్టి వివరిస్తున్నాను.

ఈ టపాలో సినిమా రంగంలో బహిర్గతమైన స్ట్రాటజీని, అందులోని వ్యక్తులూ, వ్యవస్థలూ, అసలా రంగమే అనుభవిస్తోన్న సువర్ణముఖిని వివరిస్తాను.

సినిమా! అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. సమాజం మీద ఎంతో ప్రభావం ఉన్న మాధ్యమం. కాబట్టే సినీరంగంలో విజేతలుగా వెలిగిన హీరోలు రాజకీయనాయకులుగా రూపాంతరం చెంది దేశాధ్యక్షులూ కాగలిగారు. [రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడైనట్లు] రాష్ట్రగవర్నర్లు కాగలిగారు.[ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్ అయినట్లు] రాష్ట్రముఖ్యమంత్రులూ కాగలిగారు.[తమిళ నాడులో ఎం.జీ.ఆర్., జయలలిత, ఏ.పి.లో ఎన్టీఆర్] ఇప్పుడు సినీ నటుడు చిరంజీవి రాజకీయపార్టీ పెట్టడానికి, రజనీకాంత్ ఆవిషయమై ఊగిసలాడటానికి కూడా కారణం ఈ సినిమా ఇమేజే! అలాగే చాలామంది సినీనటులు ఎం.పీ., ఎం.ఎల్.ఏ.లూ కాగలిగారు.

సినిమా! గతంలో ఉన్న అనేక కళారూపాల స్థానే ఈనాడు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. ఎందుకంటే, సినిమా, విజయవంతంగా, ఒకప్పుడు సమాజంలో విస్తరించి ఉన్న అనేకమైన, భిన్నరకాలైన, అద్భుతమైన ఎన్నో కళారూపాలని పూర్తిగా అదృశ్యం చేసేసింది. ఇప్పుడు క్రమంగా సినిమాస్థానాన్ని టీవీ సీరియళ్ళతో ఎలక్ట్రానిక్ మాధ్యమం ఆక్రమిస్తోందంటున్నారు.

వాస్తవానికి సమాజం సాహిత్యం, కళారూపాలతో ప్రభావితమౌతుంది. మనదేశ చరిత్రలోనే కాదు, ఫ్రెంచి విప్లవంతో సహా ప్రపంచ చరిత్ర నిరూపించిన సత్యం ఇది. అయితే ఆశ్చర్యకరంగా అనండి లేక స్ట్రాటజీ అనుగుణంగా అనండి, సినీపండితులంతా కొత్త నిర్వచనాలు, కొత్తపాఠాలు చెప్పారు, చెబుతున్నారు. ఏమనంటే – సినిమా ప్రజలకి కేవలం వినోదాన్ని మాత్రమే ఇస్తుందట. సినిమా ప్రభావం ప్రజలమీద ఏమాత్రం ఉండదట! ఎందుకింత పచ్చి అబద్ధాన్ని పదేపదే ప్రచారించారో, సదరు సినీప్రముఖలకే తెలియాలి. ఒకవేళ దాన్ని అసత్యమని గాక సత్యమని నమ్మి ప్రచారించారనుకుంటే, ఎందుకంత గుడ్డితనం వాళ్ళకి సంప్రాప్తించిందో వాళ్ళకే తెలియాలి.

నిజంగానే ’సినిమా ప్రభావం ప్రజల మీద, సమాజం మీద శూన్యం’ అయితే సినిమాలు చూసి పిల్లలు ఎనిమిది, తొమ్మిదేళ్ళకే ప్రేమల్లో పడటాలు, ఇళ్ళల్లోంచి లేచిపోవడాలు [దీనికి కొత్తపేరు పారిపోవటం] ఎందుకు జరుగుతున్నట్లు? సినిమాల పేరుతో షర్టులు, పాంట్లూ, చీరలూ మొదలైన దుస్తులూ, బూట్లు, బెల్టులూ వంటి ఇతర యాక్సెసరీస్ లు ఎలా మార్కెట్లలో అమ్మకమవుతున్నట్లు? ’సినిమా ప్రభావం సమాజం మీద శూన్యం’ అన్నవాదన నిజమైతే కొత్త ఫ్యాషన్లు, కొత్త మోడల్ వస్తువులూ[వాహనాలతో సహా] సినిమాల ద్వారా చూపబడి ప్రజల్లో ప్రాచుర్యంలోకి ఎలా వస్తున్నట్లు? అంతేకాదు ’సినిమా ప్రభావం సమాజంమీద శూన్యం’ అన్న వాదనే నిజమైతే మరి ఈ సినీ తారలంతా కార్పోరేట్ ఉత్పత్తులకు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నట్లు? చివరికి ప్రభుత్వపధకాలకు కూడా వాళ్ళు ప్రచారకర్తలు కావటం చూస్తునే ఉన్నాం కదా! కొత్త దుస్తులు, క్రొత్త ట్రెండ్ లూ, క్రొత్త పోకడలూ, క్రొత్త ఎలక్ట్రానిక్ వస్తువుల మోడళ్ళు వంటి ఏ వస్తువులైనా ప్రజల్లోకి చేరడానికి, వ్యాపారం వూపందుకోవడానికి, ఎందుకు సినిమాలూ, సినిమాతారలే ప్రచారమాధ్యమాలుగా ఎంచుకోబడుతున్నారు? అటువంటప్పుడు ’సినిమా ప్రభావం ప్రజలమీద సమాజం మీద శూన్యం. సినిమా కేవలం వినోదార్ధం మాత్రమే’ అనటం పచ్చి అబద్ధమే కదా? అటువంటప్పుడు ఈ రకపు ప్రచారం ఆశ్చర్యకరమో లేక స్ట్రాటజీ పఠమో కావాలి కదా!

దశాబ్దాలుగా ఎన్నో ’మానరిజమ్స్’ ఎన్నో సంభాషణలు[డైలాగులూ, పిలుపులతో సహా] ప్రజల్లోకి ప్రచారించబడి, వారి జీవన సరళిలో ఓ భాగమైపోయాయి. ఎన్నో పాత్రలూ, ఎన్నో దృక్పధాలు ప్రజల్ని ప్రభావపరిచాయి, ఇప్పటికీ పరుస్తునే ఉన్నాయి. [వీటన్నింటిని నియంత్రించడానికి ప్రభుత్వం సీరియస్ గా ఎందుకు తీసుకోవటం లేదు?] నిజానికి ఏ కళారూపమైనా అటువంటి సమ్మోహన శక్తి కలిగి ఉంటుంది. అటువంటది ఓ ప్రక్క ప్రజల ఆలోచనల్ని, భావాల్ని దృక్పధాన్ని ఇంతగా కలుషితం చేస్తూ, మరోప్రక్క ’సినిమా ప్రభావం ప్రజలమీద, సమాజం మీద ఉండదని’ ప్రచారించటం కుట్ర కాదా? అందునా పదేపదే అదే అనటం! సినీ పండితులు, రచయితలు, దర్శకులూ, నటీనటులూ అందరూ కూడబలుక్కున్నట్లు మరీ అనటంలో, నిశ్చయంగా ఇది ఆశ్చర్యకరం కాదు. ఖచ్చితంగా స్ట్రాటజీ ప్రకారం, ప్రణాళిక బద్ధంగా చేస్తున్న కుట్ర ఇది.

గమనించి చూడండి. ఒకప్పుడు సినిమాలలో కూడా ’నీ సుఖమే నే కోరుకున్నా. నిను వీడి అందుకే వెళుతున్నా! మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే ఋజువు కదా!’ అంటూ ప్రేమకు నిర్వచనాలు చెప్పబడ్డాయి. [పై పాట మురళీకృష్ణ సినిమా కోసం ఘంటసాల పాడింది] ప్రేమంటే మనం ప్రేమించిన వ్యక్తికి సంతోషం కలిగించటం. అటువంటిది ఇటీవల కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సినిమాలు చూడండి. ’ఆర్యా’ సినిమా! అందులో హీరో హీరోయిన్ని ప్రేమిస్తున్నానంటూ ’Feel my love’ చివరికి నన్ను తిడుతూ ఆసహ్యించుకుంటూ కూడా ‘feel my love’ అంటూ వెంటపడి విసిగించి వేధిస్తూనే ఉంటాడు. చివరకు, ‘తినగా తినగా వేము తియ్యనుండు’ అన్నట్లు ప్రేమప్రేమ అంటూ విసిగించగా చివరికి ఆ కథలో హీరోయిన్ హీరోని ప్రేమించేస్తుంది. ఇలాంటి కధే… మరో సినిమా ‘దేశముదురు’. చివరికి సన్యసించిన స్త్రీ[?]ని కూడా వదలకుండా ప్రేమ కోసం అంటూ వేధిస్తాడు హీరో. ప్రక్క పాత్రలన్నీ కూడా ఇందుకు ఎంతో కొంత సాయం చేస్తాయి. ఇందులోనూ షరా మామూలే. చివరికి హీరోయిన్ హీరోని ప్రేమించేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత పెళ్ళవుతుంది. ఇక పరుగు మరో సినిమా. అందులోనూ అదే కథ. అన్ని సినిమాలూ ఒక్క హీరోవే చెప్పాననుకోకండి. ఇలాంటివే ఇంకా చాలా సినిమాలూ ఉన్నాయి. ఏదేమైనా హీరోయిన్ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా “నేను ప్రేమించాను కాబట్టి, నాది నిజమైన ప్రేమ అయితే నువ్వు నన్ను ప్రేమించి తీరాలి. ప్రేమిస్తావు” అంటాడు హీరో. వెంటపడి విసిగించి వేధిస్తాడు. చివరాఖరికి అమ్మాయి ప్రేమించేస్తుంది. ఈ కథాంశాలతో సినిమాలు చూసిన, తెలిసీ తెలియని వయస్సులోని యువతరం ప్రేమోన్మాదానికి అమ్మాయిల కుత్తుకలు కోయడం చూస్తునే ఉన్నాం. యాసిడ్ దాడులు, గొంతుకోయటం లాంటివి ఈమధ్య కాలంలో చాలా తరచుగా జరుగుతున్నవి. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా రాజకీయనాయకులు గానీ, మహిళసంఘాలు గానీ ఈకథలతో వచ్చిన సినిమాలను బ్యాన్ చేయాలని గాని, ఇలాంటి కథలను నిషేధించాలని గాని ఒక్క మాట అనలేదు. ఇందులో స్ట్రాటజీ ఏమిటంటే ఇలాంటి కథలతో స్వంత సినిమాలు తీసిన నిర్మాతలు, నటులు, ప్రజాసేవ చేస్తామంటూ రాజకీయ పార్టీలు పెట్టటం! ఇక చిన్నప్పుడే ప్రేమలు మొదలవ్వటం లాంటి ఖుషీలు, బుజ్జిగాడు, మనసంతా నువ్వే ననే తూనీగలూ కోకొల్లలు. ఇలాంటి నేపధ్యంలో సినిమా కేవలం వినోదం కోసమే ప్రజలు చూస్తారు. దాని ప్రభావం ప్రజలమీద ఉండదు అనటం ఖచ్చితంగా కుట్రే! నిశితంగా సినిమారంగాన్ని, తెరమీద, తెర వెనుకా, పరిశీలిస్తే ఈ పచ్చినిజం పరమ అద్భుతంగా దృగ్గోచరమౌతుంది.

ఒక్కసారి మనం తెలుగు సినిమా రంగాన్ని, కధాక్రమాన్ని పరిశీలిస్తే – భారతదేశంలోనూ, తెలుగు సీమలోనూ తొలినాళ్ళలో అప్పటికి విస్తరించివున్న జానపద, ఇతర కళారూపాలతో పోటీ పడేందుకు ‘సినిమా’ తెగ పెనుగులాడ వలసివచ్చింది. భాగవత కథకులూ, హరికథకులూ, బుర్రకథకులూ, తోలు బొమ్మలాటలూ, యుద్ధవిద్యాక్రీడా ప్రదర్శనలూ, కోలాటాది ఇతర సంగీతాధారిత కళారూపాలూ, పద్యనాటకాలూ తదితర కళారూపాలు అప్పటికే ప్రజల్లో వేళ్ళునుకొని ఉన్నాయి. ఈ కళాకారులంతా రైతుల ఇంటి గుమ్మాలను చేరగలిగే వారు. గ్రామాల్లో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళు. రైతులే కళారూపాలకు ప్రధాన పోషకులు. కళాకారుల బృందాలు గ్రామాలలో పర్యటిస్తూ, పొద్దంతా వ్యవసాయపనులతో అలసిన రైతుకుటుంబాలకు, సాయంత్రం వేళ, భోజనానంతరం, గ్రామాల్లోని గుడి దగ్గరో, కూడళ్ళ దగ్గరో ప్రదర్శనలు నిర్వహించి తమ ప్రతిభతో, వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచేవాళ్ళు. ఆ రసాస్వాదనలో భావవాదపు పాళ్ళు, సంస్కృతీ, సాంప్రదాయాల భావాలూ, దృక్పధపు మూలాలు ఉండేవి. కళాకారులు ఈ విధంగా ప్రజలని సేదతీర్చి, వాళ్ళ తృష్ణ తీర్చి మెప్పించేవాళ్ళు. సంతృప్తి చెందిన రైతులు పండగ పబ్బాలప్పుడు, తమ ఇంట పెళ్ళి పేరంటాలప్పుడూ, పంట చేతి కొచ్చినప్పుడు, ఈ కళాకారుల కుటుంబాలను సత్కరించేవాళ్ళు. ముందుగా కళాకారులు రైతులకి తమ సేవలందించేవాళ్ళు. ఆ సేవలతో సంతృప్తి చెందిన రైతులు ధాన్యం కొలవటంతో కళాకారులకి చెల్లింపులు చేసేవారు. ఇది ఒక్క కళారంగంలోనే కాదు, ప్రతీ రంగంలోనూ ఉండేది. చివరికి విద్యారంగంలో కూడా! ప్రతిరంగంలోనూ ముందుగా సేవల్ని అందించిన తదుపరే చెల్లింపులు ఉండేవి. చివరికి క్షవరం చేయించుకోవటంతో సహా! టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళి, బార్బరు సరిగా జుత్తు కత్తిరించలేదని విసుక్కుంటు బయటకి రావలసిన అవసరం లేదు. ఈ సెలూన్ కున్న పేరు ప్రఖ్యాతులు చూసి మోసపోయామని నిట్టూర్చనక్కర్లేదు. ఇదే సూత్రం కళారంగానికీ అనువర్తింపబడేది.

ఇప్పుడు సినిమా పేరు చూసో, టీవీలో వాళ్ళిచ్చిన ప్రచారపు హోరుని చూసో, టిక్కెట్టు కొనుక్కోని ధియేటర్ లోపలికి వెళ్ళి నష్టపోయామన్న ఉక్రోషంతో బైటకి రావలసిన పని లేదు. అందుచేత, తొలినాళ్ళలో సినిమాకి వెళ్ళటం అంటే రైతులూ, ప్రజలూ కదిలి ధియేటర్ కి రావాలి. అది కొంత అవరోధంగా[Disadvantage గా] ఉండేది. మరో అవరోధం ఏమిటంటే నాటకాలు అయితే తెల్లవారుజాముదాకా నడిచేవి. సినిమా కూడా మూడుగంటలు పైగా చూపినా జనంకి నచ్చేది కాదు. అలాగే ఇంకో అవరోధం సినిమా యంత్రం చూపెట్టేది. Projector అన్నమాట. అప్పట్లో ఇది కొంత కొత్తగానూ, అసంతృప్తిగానూ ఉండేదిట. అప్పటివరకూ వాళ్ళకి ఎప్పుడు తాము కోరితే, అప్పుడు, మళ్ళీ తమ ప్రదర్శనని నిర్వహించే కళాకారులే తెలుసు. నచ్చినపాట, పద్యం మరోసారి పాడమంటే పాడటమే తెలుసు. నచ్చిన నృత్యం మరోసారి ప్రదర్శించమంటే ఆయా కళాకారులు సంతోషంతో మళ్ళీ ప్రదర్శించటమే తెలుసు. ఆయా కళా ప్రదర్శనలో, ఆయా భావాల్ని, కళారూపాల్ని కళాకారుడితో సమంగా, అదే పౌనఃపున్యంతో, వీక్షకులుగా, శ్రోతలుగా అందుకోవటమే తెలుసు. ఫిజిక్స్ లో చెప్పుకునే resonance వంటిది ఈ ప్రక్రియ. కళను సృష్టించే కళాకారుడూ, దాన్ని అందుకునే ప్రేక్షకుడూ – రెండూ ఆత్మలు కూడా ఒకే భావాన్ని, ఒకే సమయంలో, అదే శృతిలో పంచుకోవటం, అందుకోవటం, కళాస్ఫూర్తిని, కళకి ఉన్న ఉతృష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చేవి. ఒక అలౌకిక ఆనందాన్ని, ఆ క్షణమే, కళాకారుడూ వీక్షకుడూ కూడా పొందేవారు. అది ఒకోసారి లయించిపోయేంత ఆనందపు అగ్రస్థితికి, బ్రాహ్మీస్థితికి, తీసుకుపోయేది. ఈ అనుభూతి ధియేటర్ లో ప్రేక్షకులకి లభించేది కాదు.

ఇక్కడో ఉదాహరణ చెబుతాను. ఇది మా నాన్న చెప్పారు. ఆయన చిన్నతనంలోని సంఘటన. ఓ సారి సినిమా హాల్లో ‘షావుకారో’, ‘బ్రతుకు తెరువో’ ఏదో సాంఘీక సినిమా ప్రదర్శన జరుగుతోందట. హీరో పదిమందితో ఫైటింగ్ చేస్తున్నాడు. ఆ క్షణం సీన్ లో అతడిది దిగువ చెయ్యిగా, రౌడీలది పైచేయిగా ఉంది. ప్రేక్షకుల్లో నుండి ఒకతను లేచి భుజమీది కండువా నడుంకి చుట్టుకుంటూ “ఒరే రండిరా! ఒక్కణ్ణి చేసి పదిమంది కొడుతున్నారు. అన్యాయం గదా. రండి. ఆపండి!” అన్నాడట. మిగిలిన వాళ్ళు నవ్వుతూ “నాయనా అది నిజం కాదు. అది సినిమా! అంతా నటన. కెమెరా మాయ. కూర్చో” అని కూర్చోబెట్టారట. ఇది విన్నప్పుడు నాకు “ఎంత నిష్కల్మష హృదయం. ముక్కు ముఖం తెలియని వాణ్ణయినా, ఒక్కణ్ణి చేసి పదిమంది తన్నడమంటే అన్యాయం! జరగనీయకూడదు. ఆపాలి” అన్న ఆలోచన అది. ఇప్పుడో! కళ్ళముందు అంతకంటే ఎన్నోదారుణాలు జరుగుతున్నా స్పందించటం మానేసారు. స్పందించిన వాడు, ఊబిలో పడిన చందం అవుతున్నాడు. సరే, ఈ విషయం వదిలేద్దాం!

అప్పట్లో అయితే, కళా ప్రదర్శనల్లో అంతగా భావోద్రేక పూరిత రసాస్వాదన ఉండేది. అంతేగాక అన్ని కాన్సెప్టులు పురాణాకధలతో, భక్తి భావంతో నిండిఉండేవి. లేదా చారిత్రక కథలతో! జానపదుల ఊహలతో! పక్క ఊళ్ళలో ఎవరైనా ప్రజలకోసం త్యాగనిరతి, ధైర్యసాహసాలు చూపిస్తే, వాళ్ళ కథలు కూడా క్రమంగా ఈ కళాప్రదర్శనల్లో చేరేవి. ఉదాహరణకి, అనంతపురం జిల్లాలో గ్రామదేవతగా రూపాంతరం చెందిన ఊరిపెద్ద కోడలు ముసలమ్మ తల్లి కథ చెప్పుకోవచ్చు. అనంతపురం జిల్లాలో, ఇప్పటికీ, దాన్ని ముసలమ్మ కట్టగా పిలుస్తారట. ఆ పల్లెలో చెరువుకట్టకి గండిపడగా, అర్ధరాత్రివేళ, వర్షపు ఉధృతిలో ఊరు మునిగి పోతుందన్న ఆతృతతో, ఊరివాళ్ళంతా కలిసి, గండిపూడ్చే ప్రయత్నం చేస్తున్నారట. గండిపెద్దది. వీళ్ళు మట్టి, రాళ్ళూ వేసినా నీటి ఒరవడిలో కొట్టుకుపోతున్నాయి. అది చూసిన కొందరు, ‘గండి సరిగ్గా మనిషంత ఉంది. ఎవరైనా అందులో కూర్చుని గట్టిగా పట్టుతో కూరుకుంటే మిగిలిన స్థలాన్ని రాళ్ళు, మట్టి, వాళ్ళ శరీరం ఆధారంగా నింపి గండిపూడ్చ వచ్చన్నా’రట. చూస్తూ చూస్తూ ప్రాణాలెవరు వదులుకుంటారు? కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన ఊరిపెద్ద కోడలు ‘ముసలమ్మ’ అనే యువతి ఊరి బాగుకోసం, పదిమంది ప్రాణాల కోసం తన ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడిందట. ఊరి ప్రజలంతా కన్నీటితో వీడ్కొలివ్వగా ఆమె వరదనీటి ఉధృతికి తన శరీరాన్ని అడ్డుగా పెట్టి గండి పూడ్చడానికి తన ప్రాణాలని బలి ఇచ్చిందట. గండి పూడింది. ఊరు సురక్షితంగా ఉంది. ఇప్పటికీ ఆ ఊరి ప్రజలంతా ముసలమ్మని తమ గ్రామదేవతగా ఆరాధించి, ఆమెని పార్వతీదేవి అవతారంగా కొలుస్తారట. పసుపు కుంకాలిచ్చి పూజిస్తారట. మన్నవ గిరిధర రావు గారి కాంతిరేఖలులో చదివాను. ఇలాంటి పుణ్యమూర్తుల కథలు కూడా ఆనాటి జానపద కళారూపాల్లో కథాంశాలుగా ఉండేవి. [గ్రామదేవతగా ఆమెని పూజించటం మూఢత్వం అనుకునేవారిని మనం ఏమి చేయలేము. ఆమె ఈ గండి ఎలా పూడిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని చర్చకార్యక్రమాలు చేయలేదు. తన పరిధిలో ఏంచేస్తే గ్రామం ఈ కష్టం నుండి బయటపడుతుంది అని ఆలోచించి, తన శరీరాన్ని, ప్రాణాన్ని తృణపాయంగా ఆర్పించింది. తాము చేయలేకపోయిన పని ముసలమ్మ చేసింది కాబట్టి ఆవిడని అందరు దేవతగా పూజించారు.]

అటువంటి కథలని, చక్కని సాహిత్యవిలువలతో కూడిన స్ర్కిప్టుతోనూ, సంగీతంతోనూ అలంకరించి, తమ అభినయాన్ని జోడించి కళాకారులు ప్రజలకి ప్రదర్శించేవారు. వాస్తవానికి కళారూపమేదైనా ఈ అలంకారాలు తప్పనిసరి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

chaala bagundhi

Cheppalanukundi cheppalsindi kaakunda meeru chaala chebuthunnaru. TV serial laaga podiginchatame dhyeyamga vunnatlundi.Vishayaanni sootiga, vivaramga, klupthamga cheppatam ila mathram kaadu. vishayam lo pasa leka pothe interest pothundi.inthakumundula interestingaa vundatam ledu, gamaninchandi.

Anil

yaDla Adi lakshmi gaarU,
sinimaala guriMchi konni nelalanuMDI naakU ivE AlOchanalu !
prEma anE phIliMgunu anubhuuti cheMdaDamu-anE sthaayi atyunnatamainadi.kaanii,nEDu pUrtigaa aa phIliMginu diga jaarchaDamE kaakuMA,paigaa"phIl^ mai lavvaM"TAru,hIrO .
sinimaa pEru gurtu lEdu gaanii,suupar^ hiT^ aina aa sinimaalO naagaarjuna,amala veMTa baDataaDu",viMta paaTa kUDAnu.
eMtani chebutaamu,I naaTi sinii chidvilaasaalanu.

కుసుమ కుమారి గారు,
మీరు చెప్పిన నాగార్జున, అమల సినిమా నిర్ణయం అండి. హలో గురూ ప్రేమకోసమేనోయ్ జీవితం అంటూ పాడుతూ హీరో హీరోయిన్ని ప్రేమించమని వేధిస్తాడు. నేను వ్రాసిన సినిమాల జాబితాలో చేర్చదగిన సినిమానే ఇది కూడా. గుర్తు చేసినందుకు నెనర్లు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu