ముందుగా ఒకటికి రెండు కథలు చెప్పి, వాటి అనువర్తనతో మా బ్లాగు చుట్టాలని అలరించాలని….

కైరో నగరంలో ఉన్న మెహమూద్, జరీనా దంపతులకు ఉన్న ఆస్తంతా ఒక బక్కచిక్కిన గొర్రెపిల్ల మాత్రమే!

ఒకనాడు జరీనా భర్తతో “ఏమండీ! నెలరోజుల్లో వర్షాకాలం రాబోతుంది. అప్పుడు కూలి పనులుండవు. అందుకని ముందుగానే మనగొర్రె పిల్లని అమ్మేసి ఆ డబ్బులు దాచుకుంటే మేలు” అని సలహా ఇచ్చింది.

సరేనని మెహమూద్ గొర్రెపిల్లని సంతలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ బక్కగొర్రెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక వెనుదిరిగి వస్తుంటే దారిలో ఒక శ్మశానం దగ్గర పచ్చిక విస్తారంగా ఉండడం కన్పించింది. ‘గొర్రెనిక్కడ ఎలా గోలా కొన్నాళ్ళు ఉంచితే, పచ్చిక తిని బలంగా తయారవుతుంది. అప్పుడు అమ్మితే మంచి ధర పలుకుతుంది’ అనుకుని ఒక ఉపాయం ఆలోచించాడు.

తిన్నగా కాటికాపరి ఆలీఖాన్ వద్ద కెళ్ళి “ఆలీభాయ్! నీకు ఈ గొర్రెపిల్లను కానుకగా యిద్దామని వచ్చాను” అన్నాడు.

“ఎందుకు?” అనడిగాడు ఆలీఖాన్ ఆశ్చర్యంగా.

“మరేం లేదు భాయ్! నేనా ఒంటరివాడిని. చనిపోతే నన్ను ఎవరు పూడ్చి పెడతారు? అందుకని ముందే సుంకంగా గొర్రెపిల్లని ఇద్దామని వచ్చా” అన్నాడు మెహమూద్. వీడెవడో మూర్ఖుడులా ఉన్నాడనుకున్న ఆలీఖాన్ లోలోపల సంతోషించి “ఓ! నిక్షేపంగా! నీవు చచ్చిన తరువాత నీ శవాన్ని పాతిపెడతానులే!” అంటూ గొర్రెపిల్లను తీసుకున్నాడు.

కొన్నాళ్ళు గడిచేసరికి గొర్రె తెగ బలిసింది. అది గమనించిన మెహమూద్, ఆలీఖాన్ దగ్గరకు వెళ్ళి “భాయ్! నేను మక్కా పోతున్నాను. నువ్వూ మూటాముల్లే సర్ధుకుని బయల్దేరు!” అంటూ తొందర చేశాడు.

“నీకు మతి చలించలేదు కదా? నీతో నేనెందుకు?” అన్నాడు ఆలీఖాన్.

“భలే వాడివే. నేను చస్తే పాతిపెట్టడానికి గొర్రెను తీసుకున్నావుగా? మరి నేను మక్కాలో పోతేనో? కాబట్టి పదపద” అన్నాడు మెహమూద్. ఆలీఖాన్ కి ఆరికాలి మంట నెత్తి కెక్కింది. “ఏంటీ? నీ గొర్రెను తీసుకున్న పాపానికి నీతో ఊరేగాలా? కుదర్దు. కావాలంటే నీ గొర్రె పిల్లని నువ్వే పట్టుకుపో” అంటూ కేకలేశాడు.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మెహమూద్ “సరే… మరి నీ ఇష్టం!” అంటూ గొర్రెను తీసుకుని, తిన్నగా సంతకి వెళ్ళి మంచి ధరకి దాన్ని అమ్మేశాడు. వర్షాకాలంలో ఆ దంపతులకు ఏ లోటూ రాలేదు.

శ్రీపాద సత్యనారాయణ గారు వ్రాయగా, ఈనాడులో నేను చదివిన కథ ఇది. ఇందులో తెలివిగలిగిన మెహమూద్ [పేదవాడే కావచ్చు గాక] తన మేధోబలంతో కాటికాపరి అలీఖాన్ ని మోసగించాడు. ఎక్కడా “నా గొర్రెని నాకు ఇచ్చెయ్!” అన లేదు. కాటికాపరే, తనంతట తానే “గొర్రెని తీసేసుకో!” అనేలా చేసాడు. వెరసి కాటికాపారి కష్టాన్ని, మెహమూద్ దోచుకున్నాడు.

మరో కథ చూద్దాం. ఇది మన పురాణాల్లోని [భాగవతం] కథ. నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉండగా, కార్త్యవీర్యార్జునుడు అనే రాజు, యుద్దకాంక్షతో అన్నిదేశాలూ తిరుగుతూ, ఆయా రాజుల్ని ఓడిస్తూ, యుద్దోన్మాదంతో తిరుగుతూ ఉంటాడు. అతడి యుద్దోన్మాదాన్ని భరించలేక, కొందరతడికి, “ఆశ్రమంలో నరనారాయణులున్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యి! నీ యుద్దకాంక్ష చల్లారుతుంది” అని సలహా ఇస్తారు. కార్తవీర్యార్జునుడికి వేయిభుజాలు[చేతులు] ఉంటాయి. అమిత బలవంతుడు. ఆ బలగర్వంతోనే అందర్నీ యుద్దానికి ఆహ్వానిస్తూ, ఆ గెలుపులలో కలిగిన విజయగర్వంతో మరింత విర్రవీగుతూ, చివరికి యుద్దోన్మాది అయ్యాడు. అలాంటి కార్త్యవీర్యార్జునుడికి పైసలహా నచ్చింది. దాంతో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరాడు. యుద్దఘర్జనలు చేస్తూ వారిరువురినీ యుద్దానికి పిలిచాడు. వారు “ఎందుకయ్యా యుద్దం! మేం ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తున్నాం! మమ్మల్నెందుకు అలజడి చేస్తావు? వెళ్ళు!” అన్నారు. అతడు విన్పించుకోలేదు. ’యుద్ధం చెయ్యడానికి భయం కాబోలు!’ అని వెక్కిరించాడు. చేవలేదని ఛీత్కరించాడు. ఓడిపోతారని సంకోచమంటూ రెచ్చగొట్టాడు. ’యుద్ధం చెయ్యమని తన చేతులు తీటపెడుతున్నాయనీ, యుద్ధం చెయ్యకతప్పదనీ’ అన్నాడు. ’యుద్ధం చేస్తే వాళ్ళ ఓటమి, తన గెలుపూ ఖాయమనీ’ ప్రగల్భాలు పలికాడు.

అతడి గోలతో నరనారాయణుల ప్రశాంతత దెబ్బతింటోంది. చివరికి నారాయణ ప్రేరితుడై, నరుడు కార్త్యవీర్యార్జునుడితో యుద్ధం చేసేటందుకు లేచాడు. ఒక ధర్భను మంత్రించి, అదే శరంగా అంటే ఆయుధంగా సంధించాడు. కార్త్యవీర్యార్జునుడు ఎంతగా పెనుగులాడినా, ప్రతిఘటించ ప్రయత్నించినా నరుడు ప్రయోగించిన ఆయుధంతో యుద్ధం చెయ్యలేకపోయాడు. చివరికది అతడి 998 చేతులనూ ఖండించి, రెండు చేతులను వదలివేసింది. పరాజితుడైన కార్త్యవీర్యార్జునుడు భయంతో, పశ్చాత్తాపంతో నరనారాయణుల కాళ్ళపైబడ్డాడు. అప్పుడు వారిరువురూ “కార్త్యవీర్యార్జునా! బలం ఉన్నది బలహీనులని బాధించేందుకు కాదు. వారిని రక్షించేటందుకు! ఇకనైనా బుద్ధిగా ప్రజలని, బలహీనులని కాపాడుతూ రాజ్యం చేసుకో!” అని చెప్పి పంపారు.

ఆ విధంగా భారతీయ ఇతిహాసాలు ’బలం ఉంటే, అది శారీరక బలం కానివ్వండి, మేధోబలం [తెలివి] కానివ్వండి, ఆ బలంతో బలహీనులని రక్షించాలి గానీ దగా చేయకూడదు, బాధించకూడదు’ అని చెబుతాయి! ఇలాంటి ధర్మాలని ప్రభోదిస్తూ భారతీయ ఇతిహాసాలు ప్రజా దృక్పధాన్ని పాపం, పుణ్యం అని ప్రభావపరుస్తాయి. కాబట్టే హిందూమతాన్ని మతాలకతీతంగా జీవన సరళి అనీ, సనాతన ధర్మమనీ అంటారు.

’నేను తెలివైన వాణ్ణి. చట్టప్రకారం వ్యాపారం చేసాను’ అని తను చేసిన మోసాన్ని సమర్దించుకుంటూ, ఎవరైనా అంటే…. ఏమనగలం? చట్టం మానవనిర్మితం. అది రాజ్యాంగం అనబడే ఓ పుస్తకాన్ని బట్టిఉంటుంది. కాని ధర్మం మానవత్వాన్ని బట్టి ఉంటుంది. దృక్పధాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మతం ప్రబోధిస్తుంది. కాబట్టే ఏకాదశ నాడు ఉపవాసం చేసి [ఫలహారాలు తిని అన్నం తినకపోవటం ఉపవాసం కాదు, అసలు ఆహారమే గ్రహించక పోవటం ఉపవాసం అవుతుంది] ఆకలిని అనుభవపూర్వకంగా గుర్తుచేసుకున్న తర్వాత, ద్వాదశి రోజున అతిధి అభ్యాగతులకు భోజనం పెట్టి, ఆపైన ద్వాదశి పారాయణ చేయటం అన్నది సాంప్రదాయంగా ఉండేది. డబ్బున్నవాడు పేదలకి దానధర్మాలు చేయటం, బలవంతుడు బలహీనుల్ని రక్షించటం అన్న క్షాత్రధర్మాన్ని పాటించటం, పండితుడు శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకి బోధించటం – ఇలాంటి వాటిని తమకు తామే, స్వచ్ఛందంగా, తమ విద్యుక్తధర్మంగా పాటించి ఆచరించటం – ఇలాంటి వాటిని ఏ చట్టమూ ప్రేరేపించలేదు, ప్రజలు పాటించేలా చేయలేదు. వీటిని ఆచరించేలా చేసేది ప్రజల దృక్పధం మాత్రమే. ఆ దృక్పధాన్ని, అంటే ఆలోచనా సరళిని, పాపం పుణ్యం పేరిట ప్రభావ పరిచేది మత విశ్వాసాలే! అలాంటిచోట, మత విశ్వాసాలని ధ్వంసం చేస్తే, ఇక ఆ జాతిని ధ్వంసం చేయటం ప్రాణంలేని కట్టెను తగలబెట్టినంత సులభం! కాబట్టి ప్రతీ మనిషి ఆర్ధికాభివృద్ధితోపాటు, ఆత్మోన్నతి కోసం ప్రయత్నించక తప్పదు. భాగవతంలో – ‘ధర్మమంటే సత్యమూ, భూతదయ, దానము, తపస్సు – ఈ నాలుగూ ధర్మం యొక్క పాదాలు’ అని చెప్పబడుతుంది.

ఈ విషయంలో ఒక అనువర్తన చెప్పి, ఈ టపా ముగిస్తాను. మొదటి కథలో మెహమూద్ లా రాజకీయనాయకులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ తమకు అనుకూలంగా ప్రభుత్వాలను మలుచుకుంటూ, సామాన్యప్రజలను దోచుకుతింటూ, అవి తమ తెలివితేటలుగా చెప్పుకుంటున్నారు. సామాన్య ప్రజలతో పోల్చుకుంటే ప్రభుత్వాలు అన్నిరకాలుగా బలమైనవి. ప్రారబ్ధం ఏమిటంటే ఈనాటి ప్రభుత్వాలన్నీ[ఏపార్టీలయినా ఒకటే] తమకున్న ఆర్ధిక అంగబలాలతో, ప్రజల్ని రక్షించడానికి గాకుండా, ప్రజల్ని దగా చేయడానికి పనిచేస్తున్నాయి. దానాదీనా తేలేది ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా తనకున్న బలాన్ని, బలహీనులైన ప్రజల్ని రక్షించేందుకు గాకుండా భక్షించేందుకు పనిచేస్తుంది అని!

హిందూధర్మాన్ని[ఇది మతధర్మం కాదు, మానవధర్మం] ఆచరించకుండా, ఏ చట్టాలు చేసినా, ఏ రూల్స్ మార్చినా ఉపయోగం లేదు. సంస్కారం, ఇరుగుపొరుగు మధ్య సంబంధాలు, మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధబాంధ్యవాలను [ధర్మాలను] ఏ చట్టం, ఏ రూల్సుతో సరిదిద్దలేము. కాబట్టే, ఒకప్పుడు సత్రాలు కట్టించి బాటసారులకు భోజన, వసతులు కల్పించినా, పేదలకు దానాలు చేసినా, పండుగ నాడు తప్పని సరిగా దానధర్మలు చేసినా పుణ్యం వస్తుందని అనుకునేవారు. ఆ విధంగానైనా ప్రక్కవాడి పట్ల దయతో ఉంటాడు అని ‘పాపం,పుణ్యం’ అన్న కాన్సెప్ట్ పెట్టారు. అంతేగాని ‘ఏది పాపం, పుణ్యం చూపించు’ అంటే ఎవ్వరు చూపించలేరు. అందరు సంతోషంగా ఉంటే తాము సంతోషంగా ఉంటామని అందరి సంతోషంలో తమ సంతోషం వెదుక్కునే వారు. ఆ విధంగా సమాజహితం కోరుతూ ‘సర్వేజన సుఖినో భవంతు’ అంటూ చెప్పారు. వీటిని ఏ చట్టం నిర్దేశించలేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

well said....

రెండు మంచి కధలు (కొత్తవి కూడా) మంచి నీతిని బోధించాయి.

chaalaa chakkani bodha .dhanyavaadamulu

బాగా చెప్పారు.

very nice post on dharma. Dharma is not human creation. Our ancients precieved that existing underlying order. They nurtured and protected it to sustain everything(including the society). For some it may look like a rule book which cannot be meaningfully understood..at least don't know how to read it in modern sense.

చక్కగా చెప్పారు. బావుంది.

చక్కగా చెప్పారు

nice...

Chaala baaga chepparu.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu