పీవీ నరసింహారావుగారు 1920 లో జన్మించారు. నేటి తెలంగాణా, నాటి నిజాం సంస్థానం అయిన భూభాగంలో పుట్టిపెరిగిన ఆయనకి, బ్రిటీష్ రాచరిక వ్యవస్థ, దాని పరిపాలనా తీరు తెలుసు. నిజాం నవాబుల క్రౌర్యం, స్వార్ధం, వారి పరిపాలనా తీరూ తెలుసు. ఎన్నో ఆశలతో, కలలు కన్న స్వరాజ్యం, అందులో ప్రజాస్వామ్యం ఏదో తవ్వితలకెత్తుతుందనుకుంటే, అది అమలులో అతి భయంకరంగా విఫలమవ్వటం తెలుసు. చిత్తశుద్దితో కృషిచేస్తున్న తమలాంటి వారికి ఎంతగా ఎదురుదెబ్బలు తగిలాయో తెలుసు. గురి చూసి బాణాలు కొట్టబడిన పక్షుల్లా, నాటి స్వాతంత్రసమరయోధులు, స్వాతంత్రానంతరం ఎలా గిలగిలలాడారో తెలుసు. తెలివి తేటలూ, జవసత్వాలూ గల నవయువకుడిగా నిజాం నవాబుని ఎదిరించిన పోరాట యోధుడాయన. పరిశీలన, తార్కిక ఆలోచనా, తాత్వికచింతనా గల పండితుడు, జిజ్ఞాసి. గనుకనే బహుభాషలని నేర్చాడు.
ఇక్కడ మీకు కొన్ని గీతా శ్లోకాలని ఉటంకించటం సందర్భోచితంగా ఉంటుంది.

భగవద్గీతలోని కర్మసన్యాస యోగంలోనివీ శ్లోకాలు.

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః

భావం: విద్యావినయాలు గల బ్రాహ్మణుని యందునూ, ఛండాలుడు, గోవు, ఏనుగుల యందునూ, శునకమూ, శునక మాంసము వండుకొని తినువాని యందునూ సమదృష్టిగల వాడే పండితుడు.

పండితుడంటే విశ్వవిద్యాలయాల నుండి ఎం.ఫిల్ లూ, డాక్టరేట్ లూ, గట్రా పట్టాలు పొందిన వాడు కాదు. లేదూ పెక్కు ఉద్గ్రంధాలు చదివిన వాడూ కాదు. మహా అయితే వారు విద్యావంతులు లేదా విద్యావేత్తలూ కావచ్చు. పండితుడంటే అన్నిటి యందు, అందరి యందు, సమబుద్ది కలవాడు.

భగవద్గీత ఎల్లప్పుడూ పాండిత్యం కంటే, కళా నైపుణ్యం, ఇతర నేర్పుల కంటే మంచిబుద్ది, స్థిరబుద్ది కలవాడే గొప్పవాడని చెబుతుంది. స్థిరబుద్దిని సాధించటమే బ్రహ్మవిద్య అంటుంది. సాధన ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది. అదెంత కష్టసాధ్యమో! అయిదు నిముషాల పాటు మనస్సుని నియంత్రించటం సైతం, ఎంతో ఓర్పూ సహనాలతో సాధించాల్సిందే. కాబట్టి పండితుడంటే సమదృష్టి, స్థిరబుద్ది కలవాడు.

అలాగే మరో శ్లోకం:

న ప్రహృష్యే త్ర్పియం ప్రాప్యనో ద్విజేత్ ప్రాప్య చాప్రియం
స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవి ద్ర్బహ్మణి స్థితః

భావం:
సుఖాలలో పొంగక, దుఃఖాలకు క్రుంగక, స్థిరబుద్ది కలవాడే బ్రహ్మవేత్త, బ్రాహ్మణూడూనని తెలుసుకో!

ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రాహ్మణుడంటే ఎవ్వరో తేల్చిచెప్పాడు. జన్మతః శాస్త్రి లేదా శర్మల కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కాదు. అది భగవద్గీత చెప్పే కులవ్యవస్థ కాదు. కాలక్రమంలో రూపుమారి, స్వార్ధపరుల చేతిలో పూర్తిగా రంగుమారి, చివరికి నకిలీ కణికుల ప్రచారంలో సంపూర్తిగా రంగూ రుచీ వాసనా మారి, రాజకీయ క్రీడలో అత్యంత బలమైన ఆయుధంగా మారిన కులవ్యవస్థకీ – భగవద్గీత చెప్పే చాతుర్వర్ణవ్యవస్థకీ అసలు పోలికే లేదు. జన్మతః గాక, గుణాలరీత్యా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర వర్ణాలని భగవద్గీత ప్రవచిస్తుంది. ఇది ఒకవిధంగా గ్రేడ్ సిస్టం వంటిది. మన ’రాజ్యాంగం’ ప్రకారం ప్రతీ దరఖాస్తులో వ్రాయబడే కులం, MRO లు జారీ చేసే కులధృవీకరణ పత్రం, ఆధునికులు అరచి గోలపెట్టే కులగజ్జి, ఇవన్నీ నకిలీ కణికుడి విభజించి పాలించే తంత్రంలోని విభాగాలే! గుణశీలాల రీత్యా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మరింత స్పష్టంగా గుణత్రయ విభాగ యోగం, శ్రద్దాత్రయ విభాగయోగం, దైవాసుర సంపద్విభాగ యోగం, మోక్ష సన్యాస విభాగ యోగంలో భగవద్గీత పూర్తిగా, స్పష్టంగా వివరిస్తుంది. ఇవన్నీ పరిశీలించకుండా, కనీసం గీతలో ఏం వ్రాసి ఉందో కూడా చదవకుండా, చాలామంది ఆధునికులు నకిలీ కణికుల ఏజంట్ల వ్రాతలు చదివి, వారి ఏజంట్లు చిమ్మిన విషం తలకెక్కించుకుని ’కులం’ అన్న మహా కుట్రలో తమ వంతు పాత్ర తాము పోషిస్తూ ఉంటారు. ఇది వారికి తెలిసి చేసినా, తెలియక చేసినా, కుట్రలో తమ పాత్ర తాము నిర్వహించటం మాత్రం పచ్చినిజం!

ఇక మళ్ళీ భగవద్గీత దగ్గరికి వద్దాం. భగవద్గీతలో చెప్పబడిన నిర్వచనం ప్రకారం, అక్షరాలా పండితుడూ, బ్రాహ్మణుడూ పీవీ నరసింహారావు. 72 ఏళ్ళ వయస్సులో ఆయన తాత్వికుడిగా, దార్శనికుడిగా, మేధావిగా ఏ స్థాయికి చేరగలడో, ఆ స్థాయి తాలుకూ పునాదులు, వాసనలూ బాల్యం నుండీ ఆయనలో ఉన్నాయి. యవ్వనంలోనూ అదే దిశలో ప్రయాణించారు. ఈ లక్షణం గొప్పవారిలో సహజ సిద్దమైనది. అందుకేనేమో ’పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్న సామెత చెబుతారు మన పెద్దలు.

ప్రతీ మనిషికి ఉండే బలాలూ, బలహీనతలూ ఆయనకీ ఉన్నప్పటికీ, బలహీనతలు దాటుకుంటూ, బలాలు పెంచుకుంటూ ఆయన సాగించిన జీవన ప్రస్థానం నకిలీ కణిక-6 దృష్టికి రాకుండా పోలేదు. పీవీ సునిశిత దృష్టి, తార్కిక ఆలోచనా, పరిశీలనాపటిమ తమకి ప్రమాదహేతువని నకిలీ కణిక-6 కి పీవీ బాలుడిగా ఉండగానే అన్పించకపోయినా, ఆయన యువకుడిగా ఉండగా అనుమానం కలిగిఉండాలి. అందుకే తన వారసుడైన నకిలీ కణిక-7 కి ఈయన గురించిన ఒక జాగ్రత్త చెప్పబడింది. విశ్వనాధ సత్యనారాయణ, శ్రీశ్రీ… ఇలాంటి వ్యక్తులింకా చాలామందే ఉన్నారు. కాబట్టే ఇలాంటి వారికి జీవితంలో ఎదురుదెబ్బలు ఎక్కువ తగులుతుంటాయి.

అలాగే పీవీజీకి కూడా జీవితం చాలా పాఠాలే నేర్పింది. వాటన్నింటినీ, ఆయన తన వాస్తవ కాల్పనికతల సమ్మిశ్రిత రచన ఆయన తన ’లోపల మనిషి’ లో ఆవిష్కరించాడు.

యువకుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన పీవీజీకీ, నకిలీ కణిక అనువంశీయులకి అంతర్లీనంగా, అనుశృతంగా, నిగూఢంగా ఒక వైరం ఉంది. ఆవిషయం పీవీజీకి తెలియదు. అయితే నకిలీ కణిక-6, నకిలీ కణిక-7లకి తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే నకిలీ కణికులకి పీవీపట్ల, ఆయన మేధావిత్వం పట్లా వైరభావం ఉంది. పీవీజీకి వారి ఉనికి సైతం తెలియనందునా అలాంటి వైరం గురించి ఊహ కూడా లేదు. ఎప్పటికప్పుడు తన జీవితంలోని ఎదురుదెబ్బలకి, సంఘర్షణలకి పైకి కనపడే కారణాలే ఆయనకైనా కనపడేవి. మనిషి మరింత పరిశీలన గలవాడు, వివేచనా, విశ్లేషణా తెలిసినవాడు గనుక, ఆ కారణాల వెనుక అంతర్గతంగా ఉండే మనుషుల అరిషడ్వర్గాలని, తాత్విక ధోరణితో అవగాహన చేసుకునేవాడు. నిజానికి, పీవీజీకి క్రమంగా తనకి కొందరు రాజకీయ శతృవులు ఏర్పడటం తెలుసు. ’అది ప్రతీ రాజకీయ నాయకుడికీ సహజమే గదా!’ అన్నధోరణి ఉన్నాగానీ, అనుభవానికి ఒక శృతీ, లయా తెలుస్తుంది. పైకి కనపడే ఈ సంఘటనల వెనుకా, పైకి కనబడే ఈ శతృవుల వెనుకా, ఏదో తెలీని సంబంధం! ఏదో శృతీ, లయా! అది అనుభవానికి, అనుభూతికి తెలుస్తుంది. చెబితే ఎవరూ నమ్మనిది. నిజానికి ఇది గూఢచర్యంలోని వైచిత్రి.

పీవీజీ పండితుడూ, బ్రాహ్మణుడు. జన్మతః కాదు, భగవద్గీత ఇచ్చిన నిర్వచన ప్రకారం బ్రాహ్మణుడు! మేధావి! భారత రామాయణ, భాగవతాది భారత ఇతిహాసాలే కాదు, ఎన్నో ఉద్గంధాలు చదివి, ఆకళింపు చేసుకున్న మేధావి, జ్ఞాని. కాబట్టే నిరంతర అన్వేషి అయ్యాడు. దేశంలో, సమాజంలో జరుగుతున్న పరిణామాలకి ఏదో కార్యకారణ సంబంధం ఉండితీరాలని అన్వేషించిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆస్థికుడు. భగవంతుణ్ణి నమ్మేవాడు. మనవేదాల్లో భగవంతుడి గురించి తీవ్ర అన్వేషణ ఉంటుంది. ‘యస్యజ్ఞాన దయాసింధో……అంటూ ఎవడైతే జ్ఞానానికి సముద్రం వంటి వాడో అట్టి వానికి నమస్కరిస్తున్నాను’ అనిచెప్పబడుతుంది.

భగవద్గీత విజ్ఞాన యోగంలో,

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో ర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్దార్ధీ జ్ఞానీ చ భరతర్షభ

భావం: భరతశ్రేష్ఠ! [అంటే అర్జునా అనుకోవచ్చు. భారతీయులలో శ్రేష్ఠుడా! అనుకోవచ్చు. ఆవిధంగా గీత ప్రతీ భారతీయుడినీ సత్యం తెలుసుకోమంటుంది] ఆర్తుడు, జిజ్ఞాసీ, అర్థార్థీ, జ్ఞాని, అను ఈ నలుగురు పుణ్యాతులూ నన్ను సేవించుచున్నవారు అనిచెబుతుంది.

అర్ధము అనే పదానికి ఇక్కడ ధనమని భావించలేం. 1) సత్యమేదో తెలుసుకోవాలన్న ఆర్తిగలవాడు, 2) జిజ్ఞాసి, 3) ప్రపంచానికి, జీవితానికి అర్ధం తెలుసుకోవాలన్న కోరికా, 4) జ్ఞానం పట్ల తపన గలవాడైన జ్ఞాని – ఈ నలుగురు, భగవంతుణ్ణి సేవించుచున్నవారు అంటాడు శ్రీకృష్ణుడు. ఆవిధంగా పీవీజీ జిజ్ఞాసీ, జ్ఞాని. కాబట్టే నకిలీకణికుల ప్రచార బ్రహ్మస్త్రం “రోజులు మారిపోయాయి. ఈరోజుల్లో ఇదే అభివృద్ధీ మంత్రం. అందరూ ఇదే నమ్ముతున్నారు. నువ్వొక్కడివే ఉలిపికట్టేవి” అంటూ వ్యక్తుల మీద ప్రయోగించే స్ట్రాటజీ పీవీజీని ప్రభావితం చేయలేకపోయింది.

ఖచ్చితంగా చెప్పాలంటే నకిలీ కణిక-7కి డీవీడీ నిర్మించటం రాదు. కేవలం ప్రయోగించటమే వచ్చు. డీవీడీ తయారు చేయటం రాదు. రిమోట్ కంట్రోలుతో ఆపరేట్ చేయటం వచ్చు. కానీ పీవీజీ పురాణీతి హాసాలు, అందులోని గూఢచార్యం, దార్శినికత, పాజిటివ్ ఆలోచనా ధోరణి ఆకళింపు చేసుకున్న మేధావి. ఆయనే కాదు, ఇప్పటికీ ఎవరైనా భారత రామాయణాది ఇతిహాసాల నుండి, వేద వాజ్ఞ్మాయం నుండి గ్రహించగల సత్యం ఎంతో ఉన్నదన్న పాజిటివ్ ఆలోచనా ధోరణితో చదివితే, ఎంతైనా నేర్చుకోగల అపార జ్ఞానగనులవి.

ఇలాంటి జ్ఞానంతో, తనకు ఎదురైన సంఘటనలతో సంఘర్షిస్తూ, ఆయన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, విలువలకి తిలోదకాలు ఇవ్వకుండా యోధుడిలా పోరాడుతున్నందునే… ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో ఎదుర్కొన్న నాటకీయ జైఆంధ్ర, జై తెలంగాణా ఉద్యమాలు, భూ సంస్కరణలు నిజాయితీగా అమలు జరపాలన్న పట్టుదల కారణంగా ఎదుర్కొన్న వత్తిళ్ళు… అప్పటికే కుట్ర ఉనికి తెలిసిన ఇందిరా గాంధీ దృష్టిని ఆకర్షించాయి. కుట్రదారుల ఉనికి తెలియక పోయినా, దేశమ్మీద కుట్ర జరుగుతుందన్న విషయం ఆవిడకి స్పష్టంగా తెలుసు. చైనా యుద్దపు ఓటమి తర్వాత, ముందటి తరాల నుండి ఇందిరాగాంధీకి సంక్రమించిన ఆస్థి ఈ పోరాటమే.

రాష్ట్రముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పీవీజీ కేంద్రానికి ఆహ్వానించబడ్డాడు. ఇది గమనించినప్పుడు ఖచ్చితంగా ’ఇదంతా భగవంతుని లీల సుమా’ అన్పిస్తుంది. ‘ఇందులో గూఢచర్యమూ, సదరు గూఢచారులూ[ఏజంట్లు], గూఢచార ఏజన్సీలు, నకిలీ కణికులూ వారి వ్యవస్థా కూడా అందులో పావులే సుమా!’ అన్పిస్తుంది.

ఇక ఇందిరాగాంధీ కేబినెట్ లోకి కేంద్రమంత్రిగా వెళ్ళిన తరువాత పీవీజీ అవగాహన మరింత పెరిగింది.

ఈనేపధ్యంలో అసలు నకిలీ కణికులకి, భారతదేశం ఎందుకు కొఱకురాని కొయ్య అయ్యిందో మీకు వివరించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

ఎన్ని చెప్పినా ఈ కాలంలో బ్రాహ్మణత్వం కులసూచకమే. కనుక ఆధ్యాత్మిక విషయాల్లో ఇతర శబ్దాల్ని వాడ్డం మంచిదేమోనని నా భావన. ఎందుకంటే కాలాన్ని బట్టి వెళ్ళాలి. ఇప్పుడున్న బ్రాహ్మణ నామధారులు పెక్కురు పూర్వగ్రంథాల్లో చెప్పిన బ్రాహ్మణ శబ్ద నిర్వచనాలకి సరితూగరు. పైగా వారినుంచి ఇతరులు ఆ ప్రమాణాల్ని ఆశించి భంగపడి ఆ తరువాత ఆ కారణం మీద వారిని ద్వేషించడం మొదలుపెడతారు. కలియుగాంత దశలో - అంటే ఇప్పుడు, శూద్రుల్లో బ్రాహ్మణ ప్రవర్తన, బ్రాహ్మణుల్లో శూద్రప్రవర్తన గోచరిస్తాయని పూర్వగ్రంథాల్లోనే పేర్కొన్నారు. అది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం.

నేను అబ్రాహ్మణుల్లో కూడా పూర్వకాల బ్రాహ్మణ లక్షణాలు గల వ్యక్తుల్ని చాలామందిని చూశాను.

మఱో విషయం. మీ బ్లాగ్ చదవడం ఇబ్బందికరంగా అనిపిస్తోంది. కారణం - దట్టమైన ఆకుపచ్చరంగు బ్యాక్ గ్రౌండ్. ఏదైనా బాగా పల్చటి రంగుని గానీ,తెల్లరంగుని గానీ ఎంచుకొని ఈ సమస్యని పరిష్కరించగలరని ప్రార్థన.

మీరు చెప్పిన "యస్యజ్ఞాన దయాసింధో.." అన్న శ్లోకం, వేదాల్లోది కాదు, అమరకోశం మొదటిశ్లోకం అనుకుంటాను.

ఇది నా చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం. ఈ శ్లోకపు పూర్తి పాఠం మీ దగ్గర ఉంటే చెప్పగలరు. మీ సవరణను పరిశీలిస్తాను. కృతజ్ఞతలు.

రవిగారు,
మన వేదాల్లో, వేదాంతాలుగా వేదాంగాలుగా గుర్తింపబడిన ఉపనిషత్తుల్లో ఉన్న భారతీయుల సత్యాన్వేషణని గురించి నేను నా టపాలో ఉటంకించాను. క్రింది శ్లోకాలని గమనించండి.
కేనోపనిషత్తు ఏనాటిదో తెలియదు గాని, అది వేసే ప్రశ్నలు చూడండి:

కేనేషితం పతతి ప్రేషితం మనః
కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః
కేనేషితం వాచమిమాం వదన్తి
చక్షుశ్ర్శోత్రం క ఉదేదో యునక్తి

"ఎవరి ఆనతి వల్ల ఈ మనస్సు ఆలోచిస్తోంది? ఎవరి వల్ల ఈ ప్రాణం ప్రేరణ పొందుతోంది? ఎవరి ప్రేరణ వల్ల వాక్కు, చక్షువులు, శ్రవణేంద్రియం, ఇవన్నీ పనిచేస్తున్నాయి?"

అలాగే శ్వేతాశ్వతరోపనిషత్తు ఏనాటిదో తెలియదు గాని, అది ప్రశ్నించే తీరు చూడండి:

బ్రహ్మవాదినో వదన్తి
కింకారణం బ్రహ్మ కుతఃస్మజాతాః
జీవామ కేన క్వచ సంప్రతిష్ఠా
అధిష్ఠతాః కేన సుఖేతరేషు
వర్తామహే బ్రహ్మ విద్యో వ్యవస్థాం

"ఈ మహాసృష్టికి కారణం ఏమిటి? ఎక్కడి నుంచి ఎందుకు మనం జన్మించాము? దేనివల్ల మనం జీవిస్తున్నాము? తుదకు మనకు విశ్రాంతి స్థలం ఎక్కడ? మన సుఖ దుఃఖాలన్నీ ఎవరివల్ల, దేనివల్ల నిర్ణయం అవుతున్నాయి? ఏ శాసనాలు మనల్ని నడుపుతున్నాయి? పరబ్రహ్మ అంటే ఏమిటి?"

టపాకన్నా ఆ కారణంగా ప్రస్తావించబడినా ఈ పై వ్యాఖ్యలోని శ్లోకాలకి ధన్యవాదాలు.

జవాబు ఆలస్యానికి మన్నించగలరు.

"యస్యజ్ఞాన దయాసింధో రగాధస్యానఘా గుణాః
సేవ్యతా మక్షయో ధీరాస్సశ్రియై చామృతాయ చ"

ఇది నామలిజ్ఞానుశాసనము, లేదా అమరకోశం లోని మొదటి శ్లోకపు పాఠం.

హే ధీరాః, జ్ఞానదయాసింధోః, అగాధస్య, యస్య గుణాః, అనఘాః, అక్షయః, సః, అమృతాయ చ, శ్రియై చ, సేవ్యతాం - ఇది అన్వయము.

పండితులారా, జ్ఞానము, దయ అనే జలములకు ఆధారభూతుడై, గంభీరుడైన, ఏ పరమాత్మ గుణములు, అనఘములు (పాప/దోష రహితములు), అక్షయములు అగుచున్నవో, అట్టి భగవంతుడు, సంపద (శ్రేయస్సు) కొరకు, అమృతత్వము కొరకు సేవింపబడుగాక!

ఈ శ్లోకానికి నిర్గుణపరంగా, సగుణ పరంగా, ఇంకా అనేక రకాల తాత్పర్యాలు ఉన్నవి. అయితే, అవి వదిలి క్లుప్తంగా అర్థం చెప్పాను. (తప్పులు సవరిస్తే ధన్యుణ్ణి).

మీరన్నట్టు సత్య శోధన ను ప్రేరేపించే ఉపనిషత్తులు చాలా అమూల్యమయినవి. ఆ శ్లోకాల సౌందర్యం అనిర్వచనీయం.

నరసింహా రావు గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఆయన విజ్ఞుడు, పండితుడు కనుకనే, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షం లో కూర్చున్న వాజ్ పేయి ని UNO లో కాశ్మీరు సమస్య కోసం మాట్లాడ్డానికి పంపించాడు. వాజ్ పాయ్ కూడా స్వయంగా పీవీని గురుతుల్యుడు గా భావించాడు.

మీరు అరుణ్ శౌరీ గురించి రాస్తారేమో అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను.

రవిగారు,
శ్లోకం పూర్తిపాఠం ఇచ్చినందుకు నెనర్లు. నాకు చాలా సంతోషం కలిగింది. సమయం వచ్చినప్పుడు అరుణ్ శౌరి గురించి వ్రాస్తానండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu