మే ఎండల్లో రైలు ప్రయాణం. దేవుడి దయవల్ల వడదెబ్బ తీవ్రంగా తగల్లేదు గానీ ఎండకి బాగా బాధపడ్డాము. ఢిల్లీ చేరగానే అక్బర్ రోడ్డులోని AICC భవనానికి వెళ్ళాము. అప్పటికి దిగ్విజయ్ సింగ్ ఇంకా రాలేదు. వేచి ఉండమని చెప్పారు. కాస్సేపటికి అతడు వచ్చాడు. ఇతర సందర్శకులతో పాటు మేమూ అతణ్ణి కలిసి విషయం క్లుప్తంగా చెప్పి, అతడు ఏప్రియల్ 20 న వ్రాసిన లేఖ చూపించాము. అతడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి మా సమస్య పరిష్కరించాల్సిందిగా రికమెండేషన్ లేఖ వ్రాయించి, స్యయంగా సంతకం చేసి ఇచ్చాడు. ఆరోజు మే 17. ఆరోజు ఉదయమే ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ వచ్చాడని పేపరులో చదివాను. వెంటనే మేము ఏ.పి.భవన్ కి వెళ్ళాము. అతడప్పుడే బయటకు వెళ్తున్నాడు. సరేననుకుని మేం మాచేతిలోని లేఖని జిరాక్స్ తీయించుకుని, ఏ.పి.భవన్ లోనే భోజనం చేసి, మళ్ళీ ఏ.పి.భవన్ లో అతడు బసచేసిన విభాగానికి చేరాము. మావారు ‘మీరిద్దరూ వెళ్ళండి’ అంటూ లాంజ్ లో ఉన్నారు. నేనూ, మాపాప హాల్లో అతడున్న చోటున వెళ్ళాము. అతడికి పావుగంటపాటు అన్ని వివరించాను. 1992 లో రామోజీరావు మీద ఫిర్యాదుకు ముందు కడపలో అతణ్ణి కలిసిన సంఘటన కూడా గుర్తు చేసాను. 2001 లో సూర్యాపేటలో వేధింపురీత్యా, బ్రతుకు రోడ్డున పడ్డప్పుడు బంజారాహిల్స్ లోని అతని ఇంట్లో కలిసి చెప్పిన వైనమూ గుర్తు చేసాను. తదుపరి రామోజీరావు గురించిన వేధింపూ, CBCID, IG, C.I. స్టేట్ మెంట్లు, ప్రస్తుతం దేవస్థానం నా రూం కాన్సిల్ చేయటం వరకూ చెప్పాను. దాదాపు 15 నిముషాలు పట్టింది. అతడు ఓపిగ్గా అంతా విన్నాడు. నాచేతిలోని దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఇచ్చాను. అతడంతా విని “ఈ కేసు సంగతి తర్వాతమ్మా! ముందు ఉండటానికి రూము కావాలి గదా! దాన్ని గురించి మళ్ళీ సెపరెట్ గా ఓ Requisation వ్రాసి ఇవ్వండి. చేద్దాం” అన్నాడు. నేను దిగ్విజయ్ సింగ్ కే అడ్రసు చేసిన లెటర్ కాపీ ఇచ్చాను. “ఇది AICC జనరల్ సెక్రటరీకి అడ్రసు చేసిన లెటర్. నాకు అడ్రసు చేస్తూ లెటర్ వ్రాసి ఇవ్వండి” అన్నాడు. నేను వెంటనే కలం, కాగితం తీసుకుని క్లుప్తంగా పదిలైన్లలో వ్రాసి ఇచ్చాను. అప్పటివరకూ అతడు అక్కడే మేడమెట్లు దగ్గర నిలబడి ఉన్నాడు. నేను వ్రాసిన లేఖ చేతికివ్వగానే చదువుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. నేను, మాపాప మధ్య హాల్ దాటి వరండాలోని లాంజ్ లోకి వచ్చేసాము. నేను సి.ఎం.తో మాట్లాడుతుండగా మావారి దగ్గరికి కొందరు వచ్చి “ఎవరావిడ? అంతసేపు మాట్లాడుతుంది? సి.ఎం. రెండు నిముషాల కంటే ఎవరితోనూ మాట్లాడరు. ఎవరావిడ?" అంటూ ఓ అబ్బురంగా అడిగారట. మా వారేం జవాబు చెప్పలేదట. ఇక మేం వెళ్దామని సిద్దమౌతుండగా సి.ఎం. పి.ఏ. పరుగెత్తుకు వచ్చాడు. నేను ఆ లెటర్ లో సెల్ ఫోన్ నెంబరు వ్రాసాను తప్ప అడ్రసు వ్రాయలేదు. ఏ అడ్రసు వ్రాయాలి? ఖాసిం భయ్యా ‘మేము తన ఇంట్లో ఉన్నట్లు ఎవరికీ చెప్పవద్దనీ, చెబితే తనకి ఇబ్బందులు రావచ్చనీ’ అన్నాడు. అంచేత నేను ఏ అడ్రసు వ్రాయలేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి హడావుడిగా “మేడం! ఇందులో మీరు అడ్రసు వ్రాయలేదు. వ్రాసివ్వండి” అన్నాడు. నేను “ప్రస్తుతం మా అడ్రసు కేరాఫ్ ప్లాట్ ఫాం అండీ! అందుకే సెల్ నెంబరు వ్రాసాను” అన్నాను. “అలాక్కాదు మేడం. మా అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కాగితాల మీద పనికదా! మీ స్నేహితుల అడ్రసన్నా వ్రాయండి” అన్నాడు. దాంతో నేను గుంటూరులో మావారి స్నేహితుని అడ్రసు వ్రాసి ఇచ్చాను.

అప్పటికే రాత్రి 7.30 అవుతుంది. వెనుదిరిగి హోటల్ గది చేరుకున్నాము. తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు దొరకలేదు. టిక్కెట్లకి అదనంగా ఖర్చుపెట్టినా, దాదాపు అయిదో ఆరో రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. పొదుపు రీత్యా ఎక్కడకీ వెళ్ళలేదు. మర్నాటి సాయంత్రం శ్రీశైలం నుండి మా విద్యార్ధుల తల్లిదండ్రులలో కొందరు ఫోన్ చేసి “మేడం! మీ రూం పంచనామా చేస్తారట. నోటిసు ఇచ్చారు. ఆరోజు టైం అడగటానికి మేమంతా వచ్చాం కదా! అలావచ్చిన పేరెంట్స్ అందరికీ ఈ.వో. నోటీసులు ఇచ్చాడు” అని చెప్పాడు. అందులో ఒక కానిస్టేబుల్ ని పంచనామా గురించి నేను “పంచనామా అంటే ఏం చేస్తాడు?" అని అడిగాను. “ఏముంది మేడం! మీ సామాన్లన్ని బయట గిరాటు వేస్తారు” అని చెప్పాడు. నేను గతంలో ఐస్ ఫ్యాక్టరీ బహిరంగ వేలంలో APSFC నుండి కొని, బ్యాటరీ ఫ్యాక్టరీగా మార్చుకున్నాను. ఆ పాత ఐస్ ఫ్యాక్టరీ నా ఆధీనం [hand over] చేసేటప్పుడు APSFC బ్రాంచి మేనేజరు, ఎం.ఆర్.ఓ., స్థానిక సి.ఐ., గ్రామ సర్పంచి అంతా వచ్చారు. ఏఏ వస్తువులున్నాయో జాబితా వ్రాసి అవన్నీ అప్పగించినట్లుగా సాక్షిసంతకాలు, కనీసం అయిదుగురి దగ్గర తీసుకుంటారు. అలాగే ఋణం కట్టలేక దివాళా తీసినప్పుడు చేసే పంచనామా కూడా నాకు తెలుసు. ఆస్థులు జప్తు చేసేటప్పుడు చేసే పంచనామాలు కూడా విన్నాను, చదివాను. ఋణ దాత, ఋణ గ్రహీతలతో బాటు అధికారులూ, అక్కడ చుట్టుప్రక్కల గల పెద్దమనుష్యుల్నీ పిలిచి జరిపే కార్యక్రమం పంచనామా. నాకు శవ పంచనామా ఎలా చేస్తారో తెలియదు గానీ, రెవిన్యూ పంచనామా గురించి బాగానే తెలుసు. దాంతో ఆ కానిస్టేబుల్ మమ్మల్ని మానసికంగా భయందోళనలకు గురిచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం అయ్యింది. “నాకు తెలిసి పంచనామా అంటే ఇలాకాదండి. మరి ఈ దేవస్థానం వాళ్ళ పంచనామా ఇలా ఉంటుంది కాబోలు” అన్నాను. ఆ తర్వాత రోజుల్లో వేరొకరు అప్పుడు పంచనామా అవ్వలేదని, మరో రోజు చేస్తారని ఆ డేట్ చెప్పారు. ట్రాకర్లలో సామాన్లు తీసుకెళ్ళి వర్కు షెడ్డులో పారేస్తారట అని చెప్పారు . ఈ ఫోన్లలో నేను స్థిరంగా ఒకటే చెప్పాను. “చెయ్యనివ్వండి. వాళ్ళేం చెయ్యదలుచుకుంటే అది చెయ్యనివ్వండి. గుడిలో మల్లయ్య ఉన్నాడు, మేము ఉన్నాము” అని చెప్పాను. ఈ ప్రక్రియ మేం ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక కూడా నడిచింది. ఢిల్లీ నుండి గుంటూరుకి దాదాపు సి.ఎం.ను కలిసిన తరువాత వారం రోజులకి వచ్చాము. మాదృష్టిలో సి.ఎం. నుండి మాగది ఎలాట్ మెంట్ గురించిన లేఖ ఈపాటికీ వచ్చేసి ఉండాలి. మావారి స్నేహితుడు “ఒకవేళ సీ.ఎం. మరిచిపోతే? మీ రూం కాన్సిల్ ఆర్డర్ ని రీకాల్ చెయ్యకపోతే? అప్పుడెలా” అన్నాడు. అందులో ‘ఒకవేళ అతడు గాని ఇప్పుడప్పడే రీకాల్ ఆర్డర్ పంపకపోతే, నువ్వు అప్పటివరకూ ఇక్కడే, మా ఇంట్లోనే ఉంటావా?’ అన్న అర్ధం స్ఫురించింది మాకు. దాంతో మధ్యాహ్నమే బయలుదేరి నంద్యాల వచ్చేసాము.

ఇక అటు శ్రీశైలంలో మా సామాన్లని, బయటపారేస్తామంటూ మే 21 న, 26 న, 29న పంచనామా నోటిసుల ప్రయత్నాలూ జరిగినట్లు మాకు ఫోనుల పరంపర వస్తూనే ఉన్నాయి. అప్పటికి ఢిల్లీ ఏ.పి. భవన్ లో సి.ఎం.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి వచ్చి 10 రోజులపైన అవుతుంది. మే 28 న రిమైండర్ వ్రాసాము. అందులో పంచనామాల గురించిన ఒత్తిళ్ళ గురించి వ్రాసాము. ’ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా మీరు ఆదేశించినప్పటికీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీశైలదేవస్థానపు ఈ.వో., మీఆదేశాన్ని ధిక్కరించి, మా గది పంచనామా చేస్తానని ఎలా అనగలడు? ఎవరు అతడికి అంతశక్తినీ, మద్దతుని ఇవ్వగలరు? మీరు మాకు గది సమస్యను పరిష్కరిస్తానంటూ ఇచ్చిన హామీ అమలులోకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, ఏస్థాయిలో అడ్డుకుంటున్నారు? ఇది రెడ్ టేపిజమా లేక వేధింపా? ఈ రెడ్ టేపిజం లేదా వేధింపుని నేనైతే ఈనాడు రామోజీరావు అని పిలుస్తాను. ఈవిధంగా సమయం వృధా అయితే, ఇక శ్రీశైలంలో మా స్కూలు కెరీర్ ముగింపుకి వచ్చినట్లే. ఇది మాకు పదేపదే అనుభవంలోకి వచ్చిన వేధింపే. కాలం మారుతుంది, ఊరు మారుతుంది, వేధిస్తున్న వ్యక్తులు మారతారు, అంతే! వేధింపు మాత్రం అనుసృతంగా, నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. వేధించే వ్యక్తులు మారతారు గానీ, వేధించే పద్దతి మాత్రం మారదు. ఎప్పటికప్పుడు కొత్తనటీనటులతో ఇదే సినిమాని మేం సూర్యాపేటలో, హైదరాబాదులో, శ్రీశైలంలో, మళ్ళీమళ్ళీ చూసాము ఎందుకంటే ఈ సినిమా డైరక్టరు ఈనాడు రామోజీరావు కాబట్టి. ఒక దేశభక్తి గల ఫిర్యాదు దారుకి ఇది మీరిచ్చే బహుమతా?[రివార్డా?] రాష్ట్రపతి APJ Abdul Kalam ఈవిషయమై మీకు విషయాన్ని Farward చేశామనీ, మీతో టచ్ లో ఉండాలనీ లేఖ వ్రాసారు. అదీ ఈ లేఖకి జత చేస్తున్నాము” అని వ్రాసాము. ఆ కాపీ Coups on World లో Ref.No. 21 లో చూడగలరు. ఈ ఫిర్యాదుని కొరియర్ లో పంపాము. జవాబుగాని, ప్రతిచర్యగానీ లేవు.

దాంతో 2007, జూన్ 2 వతేదిన పి.ఎం.కీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ కీ మరోసారి reminders [కంప్లైంట్లు] వ్రాసాము. అందులో AICC జనరల్ సెక్రటరీ, దిగ్విజయ్ సింగ్ ని మేము వ్యక్తిగతంగా కలిసిన వైనం, అతడి రికమెండేషన్ లేఖతో సి.ఎం. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని, ఢిల్లీ ఏ.పి.భవన్ లో కలిసిన వైనం వివరించాము. రామోజీరావు కేసు కంటే ముందుగా మా గది [Accommodation] కి సంబంధించిన సమస్య పరిష్కరిస్తానని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మాకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన వైనం, దానిపైన ఇన్నిరోజుల గడిచినా, మేం రిమైండర్లు పంపించినా స్పందించని వైనం కూడా వ్రాసాము.

"ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా, తమ పార్టీ అయిన AICC జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన రికమెండేషన్ లేఖని సైతం పట్టించుకోకుండా, స్యయంగా తాను ఇచ్చిన హామీని తానే నిర్లక్ష్యం [over look] చేయవలసిన అవసరం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఉండదు కదా! మరి అలాంటప్పుడు మాపైన ఈ వేధింపు, అన్నివైపుల నుండీ సహాయ నిరాకరణ నిరవధికంగా, అనుశృతంగా, అంతూదరీ లేకుండా ఎందుకు కొనసాగుతున్నట్లు? ఒక రాష్ట్రముఖ్యమంత్రినీ, అతడి పేషినీ అంతగా ప్రభావపరిచే శక్తి ఏమిటి? వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక చిన్నగది ఎలాట్ మెంటు అన్నది పెద్దవిషయం కాదు. కానీ మా విషయంలో ప్రతిస్వల్ప అంశమూ పెద్దపెనుసమస్య అవుతూ ఉంటుంది. మేం మా జీవితంలో ఈ అసాధారణతనీ, 1992 లో ఎప్పుడైతే రామోజీరావు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న[గూఢచార] కార్యకలాపాల గురించి అప్పటి ప్రధానమంత్రి పీ.వీ.నరసింహారావుకి మేము ఫిర్యాదు చేసామో అప్పటి నుండీ అనుభవిస్తూనే ఉన్నాము. ఈ అసాధారణతని నేను ఈనాడు రామోజీరావు అని పిలుస్తాను. దాన్ని ఇప్పటివరకూ సంఘటనాత్మకంగానూ [Circumstantial], సాక్ష్యాధార పత్రాల సహితంగానూ నిరూపించాను. అదీ మీదృష్టికి తెస్తున్నాను. ఇవన్నీ పరిశీలించి రామోజీరావు మీద చర్య తీసుకుని మమ్మల్ని ఈవేధింపు నుండి కాపాడండి” అని వ్రాసాము.

ఈ ఫిర్యాదుకి ప్రధాని నుండి గానీ, సోనియాగాంధీ నుండి గానీ, దిగ్విజయ్ సింగ్ నుండి గానీ జవాబు/ స్పందన రాలేదు. అయితే రాష్ట్రపతి APJ అబ్ధుల్ కలాం నుండి మాత్రం జవాబు వచ్చింది. అది దాదాపు నెలరోజుల అనంతరం మాచేతి కొచ్చింది. ఆ లేఖలో రాష్ట్రపతి కార్యదర్శి ఆశిష్ కాలియా మా ఫిర్యాదుని Ministery of Home Affairs కి పంపామనీ, మేం డైరెక్టుగా Touch లో ఉండొచ్చని వ్రాసారు.

ఓ ప్రక్క స్కూల్స్ తెరిచే సమయం మించిపోతుంది. అందుచేత మరో వారంరోజులు ఆగి జూన్ 9 వ తేదిన మరో ఫిర్యాదు [Remainders] పి.ఎం.కీ, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి, దిగ్విజయ్ సింగ్ కీ వ్రాసాము. అందులో మరోసారి 1992 ఫిర్యాదునీ, తదుపరి 2005 ఫిర్యాదునీ, దానిపై స్థానిక సి.ఐ. తీసుకున్న స్టేట్ మెంట్ల ప్రకరణనీ, ఆ కారణాన్ని చూపిస్తూ దేవస్థానం నా రూం కాన్సిల్ చేయడాన్ని మరోసారి ప్రస్తావించాను. [నిజానికి ఈ.వో., డి.ఈ.వో. పేపరుమీద గదుల క్రమబద్దీకరణ అన్నకారణాన్ని చెప్పారు, వాస్తవంలో రామోజీరావు మీద ఫిర్యాదు పెట్టానన్న కారణాన్ని మాట్లాడారు. ఈ విషయం కూడా అంతకు ముందు ఫిర్యాదుల్లో పి.ఎం. మొదలైన వారికి వ్రాసాను.] ఈ వేధింపుల పరంపర గురించి పి.ఎం., AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, జిల్లాకలెక్టరు, ఎస్.పి., ఎండోమెంట్సు మంత్రి, కార్యదర్శి, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మానవహక్కుల సంఘం, రాష్ట్రహైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి – ఇలా అందరికీ వ్రాసిన విషయం ప్రస్తావించాను. పోస్టల్ రిమైండ్స్ పంపినా, వ్యక్తిగతంగా కలిసినా ఎవరూ స్పందించని వైనం వ్రాసాను. పైనుండి క్రింది వరకూ, ఢిల్లీ లెవెల్ నుండి శ్రీశైలం గల్లీ లెవల్ వరకూ రాజకీయ నాయకులు, అధికారులు, బ్యూరాక్రాట్లు అందరూ వ్యూహాత్మక మౌనం పాటించటాన్ని ప్రశ్నించాను. ‘నిద్రపోయే వారిని ఎవరమైనా జాగృత పరచగలం గానీ, నిద్రనటించేవారిని ఎలా జాగృత పరచగలం?’ అని సూటిగా ప్రశ్న సంధించాను.

‘2000 సంవత్సరం నుండి నేటి వరకూ, సూర్యాపేట నుండి శ్రీశైలం వరకూ నన్ను వేధించిన వారెవరిపైనా ఏచర్యా తీసుకోకపోవడాన్ని’ ఎత్తి చూపాను. శ్రీశైలంలో మామీద హేయమైన భాషలో తిడుతూ, నీటికి వేధించిన నాల్గవతరగతి కాంట్రాక్టు ఉద్యోగులపైన కూడా ఏచర్యా తీసుకోకపోవటం, అందునా అవి మేం రామోజీరావు విషయాన్ని మిళితం చేయకుండా వ్రాసిన ఫిర్యాదులైనా పట్టించుకోకపోవటం, వాటిని ప్రెట్టీ కేసులుగా కూడా పరిగణించి సదరు వ్యక్తుల పైచర్య తీసుకోకపోవటం వంటి అసాధారణతని’ ప్రశ్నించాము. ‘అంతేకాదు నన్ను వేధించిన వ్యక్తులని, వారు ప్రభుత్వ ఉద్యోగులైతేవారికి ప్రమోషన్లు గట్రా, రాజకీయనాయకులైతే కెరియర్, ఇంకా వ్యాపారలబ్ధి చేకూరటం కూడా ఉంది. ఇలా నన్ను ఎవరైతే వేధిస్తారో, వారిపైన ఇంత కరుణని ఎవరు చూపిస్తున్నారు? ఒక రాష్ట్రప్రభుత్వ ఉద్యోగి, ఈ.వో.కి, ముఖ్యమంత్రి మాగది cancel ని రీకాల్ చేస్తూ ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించే శక్తిని ఎవరిచ్చారు? ఒకవేళ సి.ఎం.రాజశేఖర్ రెడ్డి అలాంటి ఏ ఆదేశాన్ని ఈ.వో.కి ఇవ్వలేదనుకుంటే, తాను స్వయంగా, వ్యక్తిగతంగా, ఏపీభవన్ లో, దిగ్విజయ్ సింగ్ రికమెండేషన్ లేఖతో కలిసినప్పుడు మాకు ఇచ్చిన హామిని గాలికెగర గొట్టాల్సిన అవసరం ఏమెచ్చింది? ఢిల్లీ స్థాయికీ, రాష్ట్రముఖ్యమంత్రి స్థాయికి ఒకగది ఎలాట్ మెంటు, లేదా ఎలాట్ మెంట్ కాన్సిల్ ఆర్డర్ రీకాల్ అన్నవి అతి చిన్న విషయాలు. ఒక చిన్న గదిని ఒక టీచర్ కి కేటాయించినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏదీ లేదు. నేను పంతులమ్మనే గాని అసాంఘిక శక్తినో, నేరస్థురాలినో, ఉగ్రవాదినో కాదు గదా!’ అని వ్రాసాము.

‘ఇంకా, డి.ఈ.వో. కృష్ణయ్య తనమీద ఫిర్యాదు చేసినందుకు మా మీద కోర్టుకి వెళ్తానని ప్రచారిస్తున్నాడు. అందునా అతడిపైనా ఫిర్యాదు ఢిల్లీస్థాయిలో చెయ్యబడి ఉండగా! మేమూ అందుకే ఎదురు చూస్తున్నాము. కోర్టుకి వెళ్తే విషయాలన్నీ బయటికి వస్తాయి. కానిమ్మని చెప్పాము’ అని వ్రాసాము. మరోసారి 1992 నాటి నా ఫిర్యాదు పూర్వ, తదనంతర పరిస్థితుల గుర్తు చేసాను. అప్పటి ప్రధాని పీ.వి.కి వ్రాసిన ఫిర్యాదులో ’ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే మరీ మంచిదని. ఒకవేళ నిజమే అయితే నిర్లక్ష్యం చేయటం ఎంత ప్రమాదకరం’ అని వ్రాసానని, తప్పితే ఆరోజు నాదగ్గర సాక్ష్యాలేవీ లేవనీ, అయితే పీ.వీ., దేశం పట్ల నిబద్దత గలవారు గనుక ఫిర్యాదు పట్ల ప్రతిస్పందించారనీ, అందుచేత మా ఇంటికి ఐ.బి.అధికారులని పంపి నిర్దారణ ఇచ్చారనీ వ్రాసాను. “అదే ఇప్పుడు నేను ఎంసెట్ కుంభకోణం దగ్గరనుండి విద్యాశాఖలో జరుగుతున్న మోసాల గురించి, ఒకదేశం తన శతృదేశం మీద ఇలా కుట్ర చేసే అవకాశం లేదా అంటే ఐ.బి.అధికారి రంగన్న మొదలు అందరూ, దాదాపు రామోజీరావు వ్యక్తిగత కార్యదర్శులో, న్యాయవాదులో అన్నట్లు అతణ్ణి వెనకేసుకు వస్తున్నారు, లేదా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సమాజంలో సామాన్యప్రజలు అవినీతి గురించి, ఎంసెట్ వంటి కుంభకోణాల గురించి ’ఆఁ ఇవాళారేపు ఇవన్నీ మామూలే. ప్రపంచమంతా ఇలాగే ఉంది. మనమేం చేస్తాం?’ అనుకుంటారు. కానీ, ప్రధానమంత్రి పదవిలో ఉండి దేశ భద్రత గురించి, శ్రేయస్సు గురించీ మీరు అలాగే అనుకుంటారా?” అంటూ నిలదీసాను.

"ఈవిధంగా నన్ను వేధించవలసిన అవసరం రామోజీరావుకి తప్ప ఎవరికీ లేదు. 1991 లో రాజీవ్ గాంధీ హత్య వంటి వాటినే ప్రణాళిక రచించి, అమలు చేయగల శక్తి సామర్ధ్యాలు అతడికి ఉన్నాయి గనుకే ఇంత భారీగానూ, ఇంత పకడ్బందీగానూ నన్నువేధించటం, నన్ను వేధించిన వారికి లబ్ధి చేకూర్చటం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే పీ.వి.నరసింహారావు 1992 లోనే రామోజీరావు గూఢచర్యకేసు విషయమై ‘ఏదో’ చేసి ఉండాలని చెప్పగలను. దీనికి నిరూపణ కావాలంటే 1992 కు ముందు, ఆ తర్వాత రామోజీరావు వ్రాతలూ, చేతలూ గమనించండి” అని వ్రాసాను.

షరామామూలుగా దీనికీ జవాబు రాలేదు. ఇక పనిలో పనిగా లోకాయుక్తాకు కూడా ఫిర్యాదు పంపాము. ఒకప్రక్క మేము మా అడ్మినిస్ట్రేషన్ యుద్ధం కొనసాగిస్తుండగా, మరో ప్రక్క మాకు రోజు దాదాపు అయిదారు మంది, పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆతృత వాళ్ళది. ఏం జరిగిందో అన్న కుతుహలం కొందరిదీ, పంచనామాలంటూ ఈ.వో. గొడవపెడుతున్నాడు ఫర్నిచర్ పాడవుతుందేమోనన్న భయమూ, మా పట్ల సానుభూతి కొందరిది, తమ పిల్లలకు మంచి చదువు చెబుతున్నా స్కూలు ఏమవుతుందోనన్న ఆందోళన అందరిదీ. మేము చేసిన అన్ని ప్రయత్నాలు చెప్పి, "ఆఈ.వో., డి.ఈ.వో., సి.ఎం. చెప్పినా వినరటండి. లేదా సి.ఎం. కూడా చెప్పలేదంటే ఇక సి.ఎం.ని కూడా influence చేసింది ఎవరో మీకు అర్ధమైఉండాలి” అన్నాము. “ఈ ఈ.వో. కొన్ని నెలలుంటే బదిలీ మీద పోతాడు. [అప్పటికీ ఆవార్త ప్రచారంలో ఉంది.] డి.ఈ.వో. కృష్ణయ్య వచ్చేనెలలో రిటైర్ అవుతాడు. కానీ ఇలా మీరు భయపడితే మీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. మా ప్రయత్నం మేం చేశాం. ఇక మేం చేయ్యగలిగింది ఏముంది? అంచేత మీరు మరో స్కూలు చూసుకోండి. తర్వాత మేడం మిమ్మల్ని నమ్మి కూర్చొని మోసపోయాం అనవద్దు. అందుకే ముందే చెబుతున్నాను” అన్నాము.

"లేదు మేడం. ఒక నెల లేటైనా మేం మీకోసం ఎదురు చూస్తాం” అన్నారు చాలామంది. “మీ ఇష్టం. మా హెచ్చరిక మేం చెప్పాము. పరిస్థితి చూస్తే రీకాల్ లెటర్ వస్తుందని మాకు అన్పించటం లేదు” అన్నాం. ఇంతలో జూన్ 30 వ తేదిన కృష్ణయ్య రిటైర్ అయ్యాడు. అతడి స్నేహితుడు, మా విద్యార్దిని తండ్రి అయిన కండక్టర్ మల్లిఖార్జున ఫోన్ చేసి “కృష్ణయ్య రిటైర్ అయిపోయాడు. మీరెప్పుడూ వస్తున్నారు శ్రీశైలం?" అన్నాడు ఉత్సాహంగా. నిజంగా! నాకు చిర్రెత్తిపోయింది. అంటే అప్పటివరకూ ఆ కృష్ణయ్యకి భయపడి మేం ఊరు వదిలేసి వచ్చామన్నట్లుంది అతడి ధోరణి. నేను “అతడు రిటైరైతే మాకేమిటి? శ్రీశైలంలో వాళ్ళకి ఎవరికైనా భయమేమో అతడంటే! మాకెందుకు భయం? అయినా శ్రీశైలం వచ్చి మేం మీ పిల్లలకే ఎందుకు చదువు చెప్పాలి? మీరేం చేసారు మాస్కూలుకి?" అని నిలదీసాను. అతడి ఉత్సాహం చప్పన నీరుగారిపోయింది. “కృష్ణయ్య, సి.ఎం. కంటే గొప్పవాడా, అతడి ఆర్డర్ ని కూడా లెక్కచెయ్యకపోవడానికి, రామోజీరావు ఉన్నాడు కాబట్టి మొత్తం అందరు కలిసి నాటకం అడుతున్నారు” అన్నాను. అతడు “మేడం! నేను తెలియక ఏమైనా చేసి ఉంటే క్షమించండి” అన్నాడు. నేను “అయ్యో! అదేమీలేదండి” అన్నాను. స్కూలంటే అది మా ఒక్కరిదేనా? ఇదేం ఉప్పు వ్యాపారమా? పది రూపాయలిచ్చి ఓపాకెట్టు కొనుక్కోని వెళ్ళిపోవటానికి? తల్లిదండ్రులగా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటి లేదా? అందరూ కలిసి వెళ్ళి అడిగితే ఆ ఈ.వో. కూడా దెబ్బకి మారు మాట్లాడకుండా ఐదువారాల గడువు ఇచ్చాడు కదా! అలాగే ఇప్పుడు అందరూ కలిసి స్కూలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఫలించవచ్చు కదా! మా వైపు నుండి మా చేతనైన పోరాటం, ప్రయత్నం మేం చేసాము. అటునుండి వాళ్ళ ప్రయత్నం ఏది?" – ఇదే ఆ తర్వాత ఫోన్ చేసిన ఏ తల్లిదండ్రులకైనా చెప్పాము.

ఈ లోగా మానవహక్కుల సంఘం నుండి మాకు ఏ స్పందనా రాలేదు గానీ, రాష్ట్రప్రధానన్యాయమూర్తి నుండి జవాబువచ్చింది. అది గుంటూరులోని మావారి మిత్రుని అడ్రసుకి వచ్చింది. దాంతో గుంటూరు వెళ్ళి ఆ లెటర్ తీసుకున్నాము. అందులో “With reference to your petition cited, I am directed to advise you to avail appropriate legal remedy in the matter” అని ఉంది. న్యాయ సలహా కోసం మావారి స్నేహితుడికి తెలిసిన లాయర్ దగ్గరకి వెళ్తే, అతడు ఈ లెటర్ చూసి కాస్సేపు తెగ ఆలోచించేసి “బహుశః మిమ్మల్ని పావులా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు” అన్నాడు. [ఎవరు మమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారని అతడంటున్నాడో అస్సలు అతడికేం అర్ధమయిందో, మాకేం అర్ధం కాలేదు.] ఇక లాభంలేదని వివరంగా తెలుసుకునేందుకు హైదరాబాదు వెళ్ళి, హైకోర్టు భవనంలోని న్యాయసేవాసదన్ కి వెళ్ళాము. అక్కడున్నా క్లర్కు స్యయంగా ప్రధానన్యాయమూర్తి సింఘ్వీ సంతకం చేసిన నోట్ చూపించాడు. ఇలాంటి కేసులో నేను లాయర్ ని పెట్టుకుని రామోజీరావు మీద కేసుని పెట్టుకోవాలిట. ఇక లాయర్ తినేయడూ నన్ను? ఎన్నికోట్ల రూపాయలుంటే సరిపోతుంది క్రింది కోర్టు నుండీ పైదాకా కోర్టుల్లో పోరాడటానికి? అయినా ఈ ప్రయత్నం రామోజీరావుని గుర్తించక ముందు, ఆస్థానంలో సూర్యాపేట త్రివేణి కాలేజీ వాళ్ళున్నారని అనుకున్నప్పుడు, 2001 లోనే చేసాను. అక్కడి లాయర్ గతంలో నాకు మిత్రులైనప్పటికీ కుట్రకోణం ఎలా ఉంటుందో చూపించాడు. ఆ వివరాలు గతటపాల్లో వ్రాసాను. అయినా రాష్ట్రముఖ్యమంత్రుల్నీ, ప్రధానమంత్రుల్నీ, ప్రభుత్వ కుర్చీవ్యక్తుల్నీ ప్రభావపరచగల, ప్రలోభపరచగల రామోజీరావుకి – లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఓలెక్కా? న్యాయమూర్తులు కూడా లెక్కకాదని సింఘ్వీ నిరూపించాడు. తర్వాత అనతి కాలంలోనే ఇతడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఢిల్లీ వెళ్ళిపోయాడు.

నిజానికి 2006 లోనో[?] ఓవ్యక్తి తనజీవితం అధ్వాన్నం కావటానికి, తను అసమర్ధుడిగా తయారుకావడానికి కారణం, తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాల లేనని, అందుకవే బాధ్యత వహించాలనీ ఆరోపిస్తే, దాన్ని ఈనాడు తొలిపేజీ వార్తగా వ్రాసింది. [తేదీ గుర్తు లేనందుకు క్షంతవ్వురాలిని] దాన్నే ‘సుమోటా’గా కోర్టు స్వీకరించిందని కూడా ఆ మర్నాడు వ్రాసింది. ఇదేగాక కొన్ని కేసుల విషయంలో వార్తాపత్రిక వార్తల్ని సైతం కోర్టు సుమోటాగా స్వీకరించిందని చదువుతూ ఉంటాం. అలాంటిది – దేశం మీద జరుగుతున్న కుట్రని, విద్యారంగం వేదికగా నిరూపిస్తూ, ఆపైన మాపైన వ్యవస్థీకృతవేధింపు గురించి సాక్ష్యాధార పత్రాలతో సహా, దృష్టాంతాలతో [Circumstantial] సహా, అందుకు కారణాలనీ రామోజీరావుకి గల మోటివ్స్ నీ కూడా వివరిస్తూ, నేను పెట్టుకున్న పిటీషన్ కి, న్యాయమూర్తి స్పందన అది! అందునా ఈ వేధింపుల నేపధ్యంలో బాధితులమైన నేనూ, నాకుటుంబం స్నేహుతుల ఇళ్ళల్లో ఆశ్రయం పొందుతూ పెట్టుకున్న పిటిషన్ కి అదీ స్పందన!

అందుకే గత టపాల్లో ఠాగూర్ లో చిరంజీవి, శివాజీలో రజనీకాంత్ ల డైలాగ్ “ఈదేశంలో ఏమూలనైనా, ఏకొంచెమైనా న్యాయం ఉండకపోదు. దాన్ని వెలికి తీస్తా” అన్నమాటని రిఫర్ చేశాను. ఈవిధంగా ఈ దేశంలో ఏమూలన కూడా, ఏకొంచెం కూడా న్యాయం లేదని నిరూపించబడింది. కావాలంటే మీరు పరిశీలించి చూడండి. ముంబాయి పైముట్టడి జరిపి, దాదాపు 200 మందికి పైగా జనాలని చంపిన ముష్కరుడు అజ్మల్ కసబ్ ను న్యాయవ్యవస్థ ఎంత చక్కగా కాపాడుతుందో? ‘అప్పటికి నాకింకా మైనారిటీ తీరలేదని, కాబట్టి బాలనేరస్తుల కోర్టులో తనని విచారించమని’ కసబ్ అంటే, ‘మైనారిటీ కూడా తీరని వయస్సులోనే ఇంత దారుణానికి ఒడిగట్టిన నువ్వు ఇంకా పెద్దెతై ఇంకేం చేస్తావో’ నంటూ చావతన్నకుండా [శిక్షించకుండా] బుద్దిగా న్యాయవ్యవస్థ అతడికి వయో నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. “నాకు అత్తరు, వార్తాపత్రికలు కావాలి. నాగది ముందు నడవాలనుంది. అందుకు అనుమతి కావాలి. ఇలాగే ఉంటే నా మానసిక ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి [ఈనాడు April 30, 2009 వార్త]” అంటూ కసబ్ అల్టిమేటమ్ ఇస్తున్నాడంటే, అతడికి భారతదేశపు కోర్టులు, చట్టాలు, పాకిస్తానీనైన, నేరస్తుడైన తనని ఎంతగా రక్షిస్తాయో, రక్షిస్తున్నాయో ఎంత అవగాహన ఉన్నట్లు? ఇంకా అతడి గదికి ఏసీ, వాటర్ కూలర్ గట్రా సౌకర్యాలు సమకూర్చనున్నారని పదిరోజుల క్రితం ఈనాడు వ్రాసింది. దీన్ని బట్టి చెప్పవచ్చు భారతదేశంలో చట్టాలున్నది నేరస్తుల్ని కాపాడటానికి మాత్రమేననీ, సామాన్యుణ్ణి కాపాడటానికి ఎంతమాత్రం కాదని. న్యాయవ్యవస్థలోని కుట్రకోణాన్ని Coups on World లోని Coup on Law and Justice లో వివరించాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

మార్పుని నాతో మొదలుపెట్టగలిగే నాడు
నాలో ధైర్యానికి సంకల్పమనే ఖడ్గాన్ని ఇవ్వగలగిన నాడు
సత్యాన్ని వెలికి తీసి సత్యపు మంటలో నన్ను కాల్చుకున్న వేళ
నేను ఆ జగన్నాధ రధ చక్రపు ఇరుసునవుతా
నిమిత్త మాత్రుడిని కాను నేను (అర్జునుడి బాణాలు నుండి)

మీరు మొదలు పెట్టారు మాకందరికీ స్పూర్తినిస్తున్నారు....

oka alpajivi meeda anta drusti petta valasinanta samayam gaani avasaram gani ramojirao ki vundani na viswasham . miku ramojirao ante asuya la vundy oka pakka mi telivitakkuva panulato miru jivanopadhi kolipote daniki ramoji rao badyudani kutra ani tokka ani time waste chesaru pedda vallavi .malli roju aa eenade chaduvutu kasabh ki yemi kavalo gurtu pettu kuntaru.nijam ga miku vunna jabbu peru scizophinia lenidi vuhinchukuni tama cheta kani tanannanni kappi puchhu kovadam .idi prachurinche anta amma manasu miku ledu gaani miranna chaduvukuni panikochhe panulu chesu kondy .

ప్రచురించారు కదా ఇప్పుడేమంటారు?
రామోజీరావు అంటే అసూయ పడడానికి వాళ్ళిద్దరూ సేమ్ ఫీల్డ్ కాదు కదా.
పబ్లిసిటీ అనుకోవడానికి , లైఫ్ ఇంత మిసరబుల్ అవుతుందని తెలిసీ ఎవరూ రిస్క్ చెయ్యరు కదా.

@Anonymous,
ఆదర్శాలను అమ్ముకునే వ్యర్థజీవి గురించి చాలా గొప్ప వ్యక్తి గా ఆయనకు సమయం లేదు అని మీరు అంటె నాకు నావు వస్తున్నాది మీ అజ్ఞానం చూసి. ఆయనకు నీ బొటి అనామకులు మద్దతు ఇవ్వటానికి కుల పిచ్చి తప్పితె నాకు వెరే కారణాం కనపడటం లేదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu