మార్చి 3 వ తేది 2009 తో మొదలైన ఎన్నికల ప్రక్రియ మే 16, 2009 తో పూర్తయ్యింది. ఈ లోపులో ఊహలు కొందరివి, ఆశలు కొందరివి, అంచనాలు కొందరివి, నమ్మకాలు కొందరివి, ‘వేచి చూద్దాం’ అన్న ధోరణులు మరికొందరివి. ఫలితాలు వచ్చాయి. మీడియా కథనం ప్రకారం అనూహ్య ఫలితాలు ఇవి. ఈ నేపధ్యంలో ఎన్నికలలో ఎన్నిలీలలో విశ్లేషణకు ముందుగా ఓచిన్న వివరణ –

వాస్తవానికి, నేను రామోజీరావు, అతడి గూఢచార కలాపాలకు సంబంధించి 1992 లో నాటి ప్రధాని పీవీ జీ కి ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన నాకథను 2007 వరకూ నడిచిన అడ్మినిస్ట్రేషన్ యుద్దాన్ని వివరించాక, ఈ 17 ఏళ్ళుగా నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థ, రామోజీరావూ, అతడి మద్దతుదారుల పరిస్థితి ఏమిటో వివరించాలను కున్నాను. ఆ వ్యాస పరంపర ప్రారంభించబోతూ, అసలు ముందుగా అంతర్జాతీయంగా నకిలీ కణిక వ్యవస్థ యొక్క దాదాపు 7 తరాల గురించీ, ప్రారంభం నుండి, గూఢచర్యంలో పరిణితి సాధించేవరకూ, ఆపైన పెర్వెర్షన్స్ అమలుచేసే ఏకచక్రాధిపత్యం వరకూ, వివరించాలని ‘నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్నిప్రతిపాదనలు’ అన్న వ్యాస పరంపర ప్రారంభించాను. అయితే ఇది విద్యాసంవత్సరపు ప్రారంభ దినాలు గనుకా, నేను ఉద్యోగాన్వేషణలో పడినందునా, ఇంతకు ముందులా ప్రతీరోజూ టపాలు పెట్టలేక, కొంత అంతరాయంతో పెడుతున్నాను.

సరే! ఇక ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా! అందుచేత నా పరిశీలన, విశ్లేషణా వ్రాస్తున్నాను. వాస్తవ సంఘటనలకు, దృష్టాంతాలకు సరిపోల్చుకుని మీరు మీ విశ్లేషణలు, పరిశీలనలు చేసుకోవడానికి, ఆలోచనలకి పదును పెట్టుకోవడానికి ఇది కొంత పనికి వస్తుందనుకుంటాను. ఇక 2009 సార్వత్రిక ఎన్నికల ఫలితాల విషయానికి వద్దాం.

ఫలితాల గణాంక వివరాలు నేను చెప్పనవసరం లేదు. ఈనాటికే అందరికీ తెలుసు. ఇక అందులోని అద్భుతాలే మనం పరిశీలించవలసింది, విశ్లేషించవలసింది.

1]. ‘ప్రధాని పదవికి రేసులో ఉన్నాను’ అన్న ఒక్కో అభ్యర్ధికీ టెంకజెల్ల లేచిపోయింది ఈ ఎన్నికల ఫలితాలతో. ‘నేనేందుకు ప్రధానిని కాకూడదు?’ అంటూ హూంకరించిన మాయావతి! రైలు వ్యాగన్ల ఫ్యాక్టరీ శంకుస్థాపన విషయంలో సోనియాగాంధీని అడుగుపెట్టకుండా అడ్డగించిన మాయావతి! తర్వాత ఆమె అనుయాయూడు, ఆమె పుట్టినరోజు వేడుకల కోసం, 50 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వ ఇంజనీరుని కొట్టి చంపిన కేసుతో వివాదం పాలయ్యింది. అప్పుడు ప్రారంభమైన ఇబ్బందుల పరంపర పరాకాష్టకు చేరి 2009 సార్వత్రిక ఎన్నికల్లో 80 పైచిలుకు ఎం.పీ. సీట్లున్న యూపీలో కేవలం 21 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకెక్కడి ప్రధాని పదవి? వీలయినన్ని ఎక్కువ ఎం.పీ. సీట్లు 40 నుండి 80 దాకా. పాపం మరీ దురాశేమో కదా!] సంపాదించి ప్రధాని పదవికి తనను ప్రతిపాదించవలసిందిగా తృతీయ ఫ్రంటుని ఒత్తిడి చేయాలని కలలు కన్న మాయావతి! అసలు ప్రధాని అభ్యర్ధిగా తనని ప్రకటిస్తే గానీ, తృతీయ ఫ్రంటులోకి చేరనన్న మాయావతి! దెబ్బకి కుదేలై కూర్చుంది. ఇక్కడ గమనార్హం ఏమిటంటే, మాయావతి ప్రధాని పదవికి పోటీ పడటమే కాదు, సోనియాగాంధీ పట్ల ధిక్కార ధోరణిని చూపిస్తూ తలెగరేసింది.

2]. ఇక ఇదే కోవకు చెందుతారు ఎన్.సి.పి. శరద్ పవార్. పాపం! గమ్మున గళం మార్చేసి ‘సింగే మా కింగ్’ అనక తప్పలేదు. ప్రధాని మంత్రి రేసులో ఉన్నానన్న మాటతో కాంగ్రెస్ పట్ల, సోనియా పట్ల ధిక్కారధోరణే. అందుకే కాబోలు, సోనియాగాంధీ ‘ప్రధానిని అవుతాననడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్ అయ్యింది’ అన్నది! మరీ తన కూతురు ప్రియంకా వాద్రా, ‘తన అన్న రాహుల్ కి ప్రధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి’ అన్నది. కూతురు అంటే తప్పులేదు కాబోలు.

3]. ఇక రైల్వే మంత్రిగా సంస్థల్ని లాభాల్లో ఎలా నడపాలో దేశ విదేశీయులకి పాఠాలు చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్. మార్చి 19 వతేదీ 2009 లో సి.ఐ.ఏ. ఛీఫ్ భారత సందర్శన తర్వాత అనూహ్యంగా మారిన సమీకరణాల్లో భాగంగా, సోనియాగాంధీ పట్ల వీర ధిక్కార ధోరణి కనబరిచి, బీహార్ లో సీట్ల బేరంలో ‘ఛల్ పొమ్మన్నాడు’. ఇక సోనియా కుమారుడు [రాకుమారుడు?] రాహుల్ గాంధీ, నితీష్ ని పొగిడినందుకు కారాలు మిరియాలూ నూరాడు. అంతే! గల్లంతై పోయాడు. నాలుగు సీట్లు. ఇంకా ఘోరం ఏమిటంటే, తాను కూడా స్వయంగా ఓడిపోవటం.[ఒకచోట ఓడి మరో చోట గెలిచాడట. ఎందుకైనా మంచిదని రెండుచోట్ల పోటీ చేసాడు మరి] ఇక్కడకూడా గమనించాల్సింది లాలూ సోనియా పట్ల చూపిన ధిక్కారమే.

4]. ఇక దేశంలో ఇలాంటి వ్యక్తులు మరికొందరున్నారు. వారిలో రాం విలాస్ పాశ్వన్ ఒకడు. సీట్ల విషయంలో కాంగ్రెసుకు కేటాయించడానికి తిరస్కరిస్తూ సోనియాపట్ల ధిక్కార ధోరణి చూపెట్టాడు. ఫలితం తన స్వంత నియోజక వర్గంలో కూడా గెలవలేదు.

5]. మరో కేసు అన్బుమణి రాందాస్ ది. ఎన్నికలకు ముందు రాందాస్ నేతృత్వంలోని పి.ఎం.కె. పార్టీ, సోనియాగాంధీ పై తమకి గౌరవం ఉన్నాయనీ,[ముందు జాగ్రత్త అన్నమాట. పాపం! అయినా ఫలితం దక్కలేదు లెండి] అయినా యూ.పి.ఏ. భాగస్వామ్య పార్టీ అయిన డి.ఎం.కె.తోనూ, కరుణానిధి తోనూ తాము కొనసాగలేమనీ, అందుచేత జయలలిత అధినాయకత్వంలోని AIDMK తో పొత్తుపెట్టుకుంది. అంతే! ఎన్నికల్లో ఎలా గల్లంతయ్యారో అంతుపట్టక తలపట్టుకు కూర్చున్నారట.

6]. అణు ఒప్పందం వ్యవహారంలో, ఎర్రపార్టీ వాళ్ళు సోనియా నాయకత్వంలోని యూ.పి.ఏ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.[ఎంత ధిక్కారం?] అవిశ్వాస తీర్మానం ప్రభుత్వం ఎదుర్కోవలసి వచ్చింది. ఎలాగో నోట్లు, టిటిడి పదవి, జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి గట్రాలు, పంచిపెట్టి ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత ఆరోపణల్ని గాలి కెగరకొట్టింది. అయితే ఎర్రపార్టీ వాళ్ళు మాత్రం తమ ధిక్కారానికి మూల్యం చెల్లించుకున్నారు. పైకారణంగా మమతాబెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, నందిగ్రామ్ సంచలనం, టాటాల నానో కార్ల ఫ్యాక్టరీ తరలింపు ఉపయోగపడ్డాయి. ఎర్రపార్టీవాళ్ళు మాత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా కూడా మరగుజ్జులై పోయారు.

7]. జార్ఖండ్ లోని శిబూసోరెన్ దీనికి పాత ఉదాహరణ. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాన్ని గట్టెక్కించాక, యూపిఏ ప్రభుత్వాన్ని, నాయకురాలు సోనియాగాంధీ తనకిచ్చిన హామీలు నిలబెట్టుకోనందుకు నానా బెదిరింపులూ, గోలా చేసి మరీ, ముఖ్యమంత్రి పదవి పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఎన్నికకు నిలబడి నియోజక వర్గంలో ఓడిపోయాడు. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయాలు శిబూసోరెన్ సోనియాగాంధీ పట్ల చూపిన అసహనం, నిరసన, ధిక్కారమే.

8]. ఇక రాష్ట్రంలో సైతం – జూలై 22, 2008 న పార్లమెంట్ లో బలపరీక్ష సమయంలో ఎక్కువ హడావుడి చేసిన ఎర్రనాయుడు, అసెంబ్లికి పోటీ చేసిన అతడి తమ్ముడు ఓడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం సోనియాపట్ల వాళ్ళకున్న ధిక్కార ధోరణియే.

9]. స్వంత పార్టీ లోనూ, తనని ధిక్కరించిన జాఫర్ షరీఫ్, మార్గరెట్ ఆల్వా ఇద్దరూ ఓడిపోయారు. పిసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పట్ల, అధిష్టానం పట్లా విధేయత చూపినా, తెలంగాణా విషయంలో, అప్పడప్పుడూ నసగటం, నిరసన గళం వినిపించటం చేయకుండా ఉండలేకపోయాడు. ఫలితం స్వంత నియోజక వర్గంలో కూడా ఓటమి పాలవటం. ఇది రాజకీయ నాయకుడికి అత్యంత అవమానకరమైన స్థితి. అంతగా ఉతకబడ్డాడు డి.ఎస్.

10]. రాష్ట్రంలో జి.వెంకటస్వామి, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో, ఆ పదవి తనకి ఇవ్వనందుకు నిరసన ధ్వనులు, ధిక్కార గళమూ [బలహీనమైనదే అనుకోండి] వినిపించాడు. ఆ పదవిని ఆశించిన తన సీనియారిటీని కాదని, ఎవరో ముక్కూముఖం తెలియని ప్రతిభాదేవీ సింగ్ పాటిల్ ని తెచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారని దెప్పాడు. ఇక చూస్కోండి, అప్పటి నుండి అతడి గ్రేడ్ దిగజారుతూ వచ్చింది. చివరికి అతడు ‘తెలంగాణా గురించి, వై.ఎస్. గురించి నేను ఏమీ మాట్లాడను’ అన్నాడు. నిన్నటి ఎన్నికలలో ఒక కుమారుడు గెలిచాడు. మరొకడు ఓడిపోయాడు. మరి? సోనియాగాంధీనే ధిక్కరిస్తాడా ఎంత సీనియర్ అయితే మాత్రం? ’ఎన్నికలలో గెలుపోటములకీ, సోనియాగాంధీ ని ధిక్కరించడానికీ ఏమిటీ సంబంధం’ అంటారా? తప్పకుండా జవాబు చెబుతాను.

11]. ఇక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాకనే జగదీష్ టైట్లర్ కి 1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం, సిక్కుల ఊచకోత విషయంలో సి.బి.ఐ. క్లీన్ చిట్ ఇచ్చింది. సి.బి.ఐ. ఎవరు అధికారంలో ఉంటే వారి చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తుందని గతంలోనే నిరూపించబడింది. ఇటీవల ఇటలీ ఆయుధవ్యాపారి ఖత్రోచినీ నిర్ధోషిగా ప్రకటించి, ప్రస్తుతం సోనియాగాంధీ చేతిలో సి.ఐ.బి. రిమోట్ కంట్రోలు ఉందని వర్తమానం నిరూపించింది. అయితే జగదీష్ టైట్లర్ కి క్లీన్ చిట్ ఇచ్చినందుకు సిక్కులు ఎంత ఆగ్రహావేశాలకీ, ఆక్రోశానికి గురయ్యారో, హోం మంత్రి చిదంబరం పై బూట్ విసిరిన సిక్కు విలేఖరి, అతడికి మద్దతిచ్చి అభినందించి సిక్కూలూ నిర్ధ్వంద్వంగా నిరూపించారు. అలాంటిది, పంజాబ్ లో కాంగ్రెస్ హోరాహోరీ పోరాడి, సగం కంటే ఎక్కువ సీట్లు[8/13] గెలుచుకోగలగటం ఎంతటి అద్భుతం? ఎంత అనూహ్యం? పాతికేళ్ళుగా సిక్కులు నాటి గాయాలు మరిచిపోలేక పోతున్నారనీ, వారి మనోభావాలు దెబ్బతిన్నాయనీ, వారం వారం, క్రమం తప్పకుండా, విడిచిపెట్టకుండా, ఉపసంపాదకీయాలు వ్రాసే కులదీప్ నయ్యర్ కిమ్మనడు. ప్రచురించే ఈనాడు రామోజీరావు, ఈ విషయంపై సిక్కులు దెబ్బతిన్న ఆ మనోభావాలనీ, గాయపడిన విషాద ఙ్ఞాపకాలనీ మరచిపోయి, దేశ సుస్థిరత కోసం కాంగ్రెస్ కి ఓటేసారని సమీక్షలు వ్రాస్తున్నాడు.

12]. అదే సోనియాగాంధీ కి దాసోహం అనే రాజకీయ పక్షులూ, వారి కుటుంబసభ్యులూ నల్లేరు బండిమీద నడకలా గెలిచి కూర్చున్నారు. ‘సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం’ అన్న బొత్స [ఒక్స్ వ్యాగన్ కేసులో] కుటుంబీకులు నలుగురు ఏ ఇబ్బందీ లేకుండా, ఏ అడ్డంకీ లేకుండా గెలిచేసారు. అదే కోవకి చెందుతారు దగ్గుబాటి పురంధేశ్వరిలు, కాసు కృష్ణారెడ్డిది కూడా అలాంటి ’అద్భుత’ అనూహ్య విజయమే. ఇలాంటి అసమదీయులు మరికొందరున్నారు. ధిక్కరించి మట్టికరిచిన తసమదీయులు మరికొందరున్నారు.

13]. ఎన్నికల ప్రచార సభలకే, జనం, రోజు కూలి [దాదాపు 150 నుండి 250 రూ. వరకూ] బిరియాని, సారా పాకెట్టులు తీసుకుని గానీ రావటం లేదని సాక్షాత్తూ ఈనాడు పత్రిక వ్రాసింది. అన్ని పత్రికలూ, టివీలూ అదే అన్నాయి. అలాంటిది, ప్రజలు పెరిగిన నిత్యావసర ధరలూ, బయటపడుతున్న అవినీతి భాగోతాలూ, భీం రావ్ బాడ వంటి అమానుష కృత్యాలూ, సెజ్ బాధితుల ఆత్మహత్యలూ, నేతన్న, రైతన్నల బలవన్మరణాలూ, విరిగిన లాఠీలు, దిగిన తూటాలు, పేలిన బాంబులు మరిచిపోయి ‘దేశ సుస్థిరత’ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కి ఓటేసారని ఈనాడు సమీక్ష.
[క్రింది వార్త చూడండి]
>>హస్తవాసి అదిరింది. హస్తినలో దుమ్మురేపింది. తెలుగుగడ్డపై సత్తాచాటింది. రెండు చోట్లా కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. యూపిఏ తిరిగి హ్యాపీయే. ఇంకో డజను మంది ఎంపీల మద్దతు లభిస్తే – మళ్ళీ ‘సింగ్ ఈజ్ కింగ్’. విపక్ష ఎన్డీయే చావు దెబ్బతింది. అద్వానీ ప్రధాని ఆశలు గల్లంతయ్యాయి. కామ్రేడ్ల కళ్లు బైర్లు కమ్మాయి. తెలుగోడు చెయ్యెత్తి జైకొట్టాడు. రాష్ట్రంలో ’రాజ’శేఖర చరితం పునరావృతమైంది. 157 సీట్లు గెలుచుకుని, వై.ఎస్. మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ఫలితాల దగ్గర మహాకూటమి మహా బోల్తా కొట్టింది. చిరంజీవి ప్రజారాజ్యానికి చావుతప్పి కన్నులొట్టబోయింది. మొత్తం మీద ఇటు ఆంధ్రలో, అటు హస్తినలో ప్రజలు కాంగ్రెస్ కు ’జయహో’ అన్నారు. సోనియా, మన్మోహన్ , వై.ఎస్. నాయకత్వాలకు జే కొట్టారు. అభివృద్ధి, సుస్థిరత నినాదాలకు పట్టంకట్టారు. [Enaadu 17/05/09]

డబ్బివ్వనిదే ప్రచార సభలకీ రాని జనాలకి దేశం, దాని సుస్థిరత పట్టింది. డబ్బివ్వన్నదే తెల్లకార్డు నుండి ఏకార్డు రాదన్న విషయం తెలిసి, కళ్ళముందున్న నిత్యావసర సరుకుల ధరలూ, దోపిడి కంటే ‘కాంగ్రెస్ కి ఓటెయ్యక పోతే ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోతుంది. నీళ్ళురావు’ అని భయపడి, భవిష్యత్తు గురించి బాధ్యతగా ఆలోచించి కాంగ్రెస్ కి ఓటువేసి గెలిపించారని ఈనాడు వ్రాసింది. ఇదే ఈనాడు ‘వీచేది ఎదురుగాలే’ అంటూ ఎంత వ్యతిరేకంగా కాంగ్రెస్ కి [అదీ మార్చి 19, 2009 న సి.ఐ.ఏ. ఛీఫ్ భారత్ వచ్చివెళ్ళాకే లెండి] వ్రాసిందో అందరికీ తెలిసిందే. డబ్బుకు ఆశపడే ఓటర్లని వదిలేసి, బాధ్యతాయుత ఓటర్లని పరిగణనలోకి తీసుకున్నా, జేబులు ఊడగొడుతున్న ధరల మంటని మరిచి, రాబోయో నీటిని తలచి, ఓటేసారనడం ఎంత వరకూ నిజం? అదీ కాంగ్రెస్ పట్ల ప్రజా వ్యతిరేకత ఎంతగా ఉందో సభలకీ రాని జనం, వెలవెలబోతున్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మీటింగులూ, పత్రికల్లో ఫోటోలతో సహా ప్రచురింపబడ్డాక!

ఇది ఫలితాల సరళి. ఇక ప్రచార సరళిలో అయితే……

పోలింగ్ కి ముందే ప్రతిపక్షాలన్నీ బిజెపి తో సహా, వ్వూహాత్మక తప్పిదాలు, తాత్సారాలు చేసాయి. మహాకూటమి నేతలూ అవే పాఠాలు చదివారు. తర్వాత అనూహ్యంగా మీడియా కవరేజ్, కాంగ్రెస్ పట్ల ఇతరుల ధిక్కార ధోరణి తెరపైకి వచ్చాయి. దాని కార్యకారణ సంబంధాలు గత టపాలో [భారత ఎన్నికల ఫలితాలను నిర్ధేశిస్తున్నది ఎవరూ?] వివరించాను. దెబ్బతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈనాడు భుజాన కెత్తుకుని తెగ ఊదరపెట్టింది. కుర్రాడు ఆదరగొట్టేసాడంది. తాతని చూసి మురిసిపోయినట్లే జనం, ఈ మనవణ్ణి చూసి పరవశించి పోయారంది. ఈరోజు ’ఆది పనికిరాలేదు?’ అంటోంది లెండి. ఏమయినా, మహా కూటమిని మహా భారీగా మట్టికలిపేసింది. అందుకే ఆ స్ట్రాటజీ గురించి వ్రాసినప్పుడే ఆ టపాలలో ‘వేచిచూడవలసిందే’ అన్న మాట వ్రాసాను. ఎందుకంటే రామోజీరావు, సి.ఐ.ఏ.ల స్ట్రాటజీల గురించి అంత తేలికగా ఒక అంచనాకు రాలేము. సరికదా అంత వెంటనే, అంటే తక్కువ వ్యవధిలోనూ, ఒక అంచనాకు రాలేము. చాలాసార్లు వేచిచూడక తప్పదు.

నిజానికి ప్రచార ఘట్టాల్లో చాలాసార్లు కాంగ్రెస్ కీ తన గెలుపు మీద నమ్మకం లేనితనం, జనం రానందుకు బెంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ఫలితాలను కాంగ్రెస్సే ఊహించలేదని మీడియా చెబుతుంది. ఒకరిద్దరు ముందే వూహించారు లెండి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తాను ఈ ఫలితాలను ముందే ఊహించానని ప్రకటించాడు. ఇది గెలిచిన తరువాత చెప్పే మాటే. విజయవాడ ఎం.పీ లగడపాటి రాజగోపాల్ [ఇతడు ఇప్పటికి పలు పార్టీలు మార్చిన ఉపేంద్రకు అల్లుడు] దాదాపు ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలనూ 15/05/09 నాటి ఈనాడు పేపరులోనే రాష్ట్రంలో 155 అసెంబ్లీ సీట్లు వస్తాయనీ, 33 ఎం.పి. సీట్లు వస్తాయనీ, ప్రరాపా కి 20 సీట్లకి అటుఇటుగా వస్తాయనీ, తెదేపా రెండోస్థానంలో ఉంటుందనీ తను చేయించిన సర్వే అని చెప్పాడు. అసెంబ్లీసీట్లు 157, 33 ఎం.పి.సీట్లు వచ్చాయి. ప్రరాపా కి 18 సీట్లు వచ్చాయి. తెదేపా రెండోస్థానంలో ఉంది. ఎంత ఖచ్చితమైన అంచనా కదా? మరి మీడియా ప్రజల నాడి ఎవ్వరు పట్టుకోలేకపోయిందని అంటారేమిటబ్బా? ఎన్నికల ఫలితాల కంటే ఇలాంటి ముందుస్తుగా తెలిసిన అంచనాలు మరింత అద్భుతంగా, అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంత ఖచ్చితంగా అంచనా వేయగలిగిన ఆయా వ్యక్తుల ప్రతిభ అద్భుతంగా తోస్తుంది. ప్రరాపా తొలి సభ తిరుపతిలో ప్రారంభించే ముందురోజే, చిరంజీవి తమపార్టీకి ప్రజారాజ్యం పేరు పెట్టవచ్చని జోస్యం చెప్పిన బొత్స సత్యనారాయణదీ ఇదే అద్భుతమైన ప్రతిభ. ఎలా వచ్చాయబ్బా అలాంటి నైపుణ్యాలు! బొత్స విషయమైతే అల్లు అరవింద్ అనుమానిస్తున్నట్లు, ఆరోపిస్తూన్నట్లు ‘కోవర్టు’ల ప్రమేయం ఉండవచ్చు. మరి ఎన్నికల ఫలితాలను కడుపులో దాచుకున్న EVM ల విషయంలో ఏ కోవర్టులు ఉంటాయి? [ముగింపు వచ్చే టపాలో]

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

neenu konni chotla chadivanu andi.. ee evm la vishyam. inka ninne kada ayyindi.. koddi roojulo emaina bayataki vastundemo chudali.
mee next tapa kosam waiting.

బాగా చెప్పారు...తదుపరి టపా కోసం ఎదురుచూస్తుంటాము

Technical gaa telusu kaabatti chebuthunnanu. EVMs are foolproof systems. Nobody can do anything with them. Counting chese vaarandaru kalisi mookummadiga emaina cheste tappa. Adi kooda lekkalalone. Machine lo kaadu.

I was expecting this. thanks for writing

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu