సార్వత్రిక ఎన్నికల నేపధ్యం. రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలన్నీ సునిశితంగా పరిశీలిస్తే ఎన్నో వింతలు, విడ్డూరాలు! సామాన్యంగా కంటబడని అసాధారణాలు ఎన్నో! ఏ వెండి తెరమీద, ఏ దర్శకుడూ చూపలేని అద్భుత విన్యాసాన్ని, రాజకీయ దర్శకుడు చూపిస్తున్నాడు. ఈ ఉపోద్ఘాతం ఇంతటితో ఆపి ఆ విన్యాసాలేమిటో వివరిస్తాను. మీరు మరోమారు పరిశీలించి విశ్లేషించుకోగలరు.

ఒక్కసారి మీదగ్గర ఈనాడు పత్రికలు ఉంటే Feb.19, 2009 నాటి ఈనాడు దినపత్రిక తిరగేయండి. ‘కొనసాగుతున్న ప్రాజెక్టుల పరంపర’ పేరుతో, ఈనాడు తొలిపేజీలో, దాదాపు ప్రధాన శీర్షికేమో అన్న భ్రమ కల్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఉంటుంది. ఆ మర్నాడు Feb.20, 2009 వ తేదిన ‘ఆరోగ్యానికి ‘రాజ’మార్గం ఆరోగ్యశ్రీ’, ‘అందరికీ ఈనాడు అరోగ్యం’ పేరిట 1 ½ పేజీల ప్రకటన ఉంటుంది. ఇదీ అంతే! కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులిచ్చి వేయించుకున్న ప్రకటనో, ఈనాడు పత్రికే అది వార్తగా ప్రచురించిందో, సాధారణ పాఠకుడికి ఓ పట్టాన అర్ధం కానట్లుగా ఉంటుంది. ఈ విషయమై ‘డబ్బేవరికి చేదు? ప్రకటన వేస్తే డబ్బులొస్తాయి గనుక రామోజీరావు కూడా ప్రకటన వేసాడు’ అనుకున్నాడు అనుకుందాం. కానీ వార్తాపత్రిక, అందునా విలువలకీ నిలువెత్తు నిజరూపమైన అధినేత నడుపుతున్న పత్రిక, తమ వార్తాశీర్షిక కంటే కూడా ప్రముఖంగా ఓ ప్రకటన వేయడం అంటే విలువలు తుంగలో తొక్కటమే కదా! సరే, డబ్బెవరికి చేదు అంటున్నారంటేనే సదరు ఈనాడు పత్రికకీ, పత్రికాధిపతికీ కూడా విలువలు లేవని అనటమే కాబట్టి అదీ వదిలేద్దాం. ఎందుకంటే – ఇటీవల, ఇదే పత్రిక తమ తొలిపేజీలో తొలివార్త కంటే కూడా సంతూర్ సబ్బుల వంటి వాణిజ్యప్రకటనలు వేయటం ద్వారా ఈ ‘విలువలు లేని తనాన్ని’ 70MM లో చూపెట్టుకుంటోంది కనుక.

ఇక ఈ కోవలోకి చెందినదే Feb.23, 2009న మహాశివరాత్రి పర్వదినాన ‘నా మనసే మహాశివుడు’ అంటూ వేసిన 1 ½ పేజీల ప్రకటన, Feb. 27, 2009 న ‘అభయహస్తం’ అంటూ ప్రచురించిన 2 పేజీల ప్రకటన కూడా. అందులో వింతేం లేదు. డబ్బు ఎవరికీ చేదు కాకపోవటం తప్పితే.

అయితే అసలు వింత ఎక్కడుందంటే Feb. 28, 2009 తేదిన, ఇదే ఈనాడు పత్రిక ‘మా హస్తం పేదల నేస్తం’ పేరిట వ్రాసిన వార్తలో ఉంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆంధ్రపర్యటన సందర్భంగా వ్రాసిన వార్త అది. మీరు గమనించి చూడండి ఈ వార్తకీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలకి [ఫిబ్రవరి 23, 27 తేదిల్లో] ఏమాత్రం తేడా ఉండదు. ఇదీప్రకటన లాగే ఉంటుంది, లేదా అవీ ఈ వార్తాలాగే ఉంటాయి. ఈవార్త క్రింద, 2 వ ప్రాధాన్య వార్తగా ‘అవినీతిలో ఆంధ్ర ప్రధమం’ అంటూ అద్వానీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన విజయసంకల్ప యాత్ర సందర్భంగా వ్యాఖ్యానించిన వార్తా ఉంటుంది. ఈనాడు అధిపతి రామోజీరావు, తాను కాంగ్రెస్ కి వ్యతిరేకినని, స్యయంగా కోర్టుకి లిఖితపూర్వకంగా ఆఫిడవిట్ సమర్పించాడు.

అంతేకాదు, తాను స్యయంగా అద్వానీ ఆత్మకథని ఆవిష్కరిస్తూ ఆద్వానీని రామోజీరావు, రామోజీరావుని అద్వానీ పరస్పరం ప్రశంసించుకుంటూ, తమ మధ్య సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. మార్గదర్శి వివాదంలో ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, రామోజీరావుని వేధించడం మానుకోవాలంటూ అద్వానీ, రామోజీరావుకు మద్దతు ప్రకటించాడు.

వార్తల ప్రచురణలో మాత్రం ఈనాడు చూపించే ఈ పోకడ మాత్రం పరమవిచిత్రమైనది. ఈ నేపధ్యంలో మార్చి 3వ తేదిన ఎన్నికల సంఘం షేడ్యూల్ ప్రకటించింది. కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుండీ కూడా ఈనాడు వార్తా ప్రచురణ[News Coverage] ఏ హెడ్డింగ్ పెట్టనివ్వండి లోపల వార్తమాత్రం వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పార్టీ మీద ఉన్నపట్టునీ, అతడి బలాన్ని పాఠకుల్లో ఇంజెక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. ఎప్పటివరకూ అంటే మార్చి 19 వ తేది వరకూ. ఆతేది ప్రాముఖ్యత ఏమిటో, ఆ రోజు తర్వాత ఎందుకు స్ట్రాటజీ మారిపోయిందో ఈ టపాలోనే తదుపరి పేరాలలో వివరిస్తాను.

ఎన్నికల షెడ్యూల్ మార్చి 3 వ తేదిన ప్రకటించిబడింది. కోడ్ అమల్లోకీ వచ్చింది. ఇవి సార్వత్రిక ఎన్నికలు + రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా! అందునా మధ్యంతరంగా రాలేదు. లెక్కప్రకారమే అయిదేళ్ళు గడిచాకే వచ్చాయి. అదేం చిత్రమో గానీ ప్రతిపక్షాలు సంసిద్ధంగాలేవు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కూడా! తెదేపా, తెరాస, వామపక్షాల మహాకూటమి పొత్తులు కుదరక మార్చి మూడవతేదీనే, 9వ తేదిన జరగాల్సిన మహాగర్జన రద్దు చేసుకున్నారు. అంటే అప్పటికీ పొత్తులు కుదరవన్న ముందస్తు అంచనా, అవగాహన లేదా నిర్ధిష్టమైన ప్రణాళిక ఉన్నాయి. అది నిజమే అన్నట్లు దాదాపు నామినేషన్ల గడువు ముగిసేరోజున వారి మధ్య పొత్తులు ఖరారయ్యాయి[ట]. ఓ ప్రక్క నసుగుతూనే ఈవిషయం చెప్పారు. ఈవిధంగా ప్రతిపక్షాలు వ్యూహాత్మక తప్పిదాలు, తాత్సారాలు చేస్తూ మార్చి నెలలో రోజులు గడిపాయి. ఎం.ఐ.ఎం. కు అనుకూలంగా బలహీనమైన అభ్యర్ధుల్ని నిలబెట్టారన్న వార్తలు చదివాం. తెరాస అధినేత ‘అయోమయంలో ఉన్నాడా?’ అని సందేహిస్తు ప్రశ్నిస్తున్న హెడ్డింగులతో వార్తలూ చదివాం. నిజానికి ఇవి పాజిటివ్ కాప్షన్లు. వాస్తవానికి టికెట్లు అమ్ముకోవడంలో బేరాలు తెగని అమోమయం అదని మిగిలిన పత్రికలు వ్రాసాయి. ఏకంగా ఓ అభ్యర్ధి 10 కోట్లకి టిక్కెట్టు కొన్నానని దెబ్బలు తిన్నాడట. ఆపైన ఈసీ నుండి తాఖీదులు పొందాడట. ప్రతిపక్షాల్లోని ఆయా పార్టీల నాయకులు ప్రభుత్వవైఫల్యాలని ప్రజల్లోకి తీసికెళ్ళటంలో విఫలమవుతున్నారని వార్తలు [జాతీయ స్థాయిలో]. ఎందుకు విఫలమౌతున్నట్లు? ఇవి మధ్యంతర ఎన్నికలు కావే. ముందుగా అంచనా వేసుకోలేదు, సంసిద్దంగా లేవు అనుకోవడానికి? సంవత్సరం ముందునుండే కసరత్తూ ప్రారంభించటం ఇప్పటికి ఎన్ని ఎన్నికలలో చూడలేదు? మరి ఇప్పుడు ఈ 2009 ఎన్నికలకి ఏమయ్యింది?

రాష్ట్రంలోనే కాదు, జాతీయస్థాయి లోనూ ఇదేపరిస్థితి.

మార్చి మూడో తేదిన ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక అన్నిపార్టీలలోనూ టికెట్లు పంపిణీ ప్రకరణం ప్రారంభమయ్యింది. అప్పుడూ ఈనాడు వరస అదే. అటు AICC భవనం దగ్గరగానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా నివాసం 10, జనపధ్ దగ్గరగానీ అభ్యర్ధులు ఎంతవరకూ బారులు తీరారో గానీ, ఢిల్లీ ఏపి భవన్ లోనూ, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం, నివాసం దగ్గర మాత్రం టికెట్ ఆశిస్తున్న ఆశవహుల క్యూలెన్ల ఫోటోలు, [అదీ రెండు మూడుకు తక్కువ గాకుండా] వార్తలు ప్రముఖంగా ప్రతిరోజూ ప్రచారించింది. గాంధీభవన్ దగ్గరగానీ, PCC అధ్యక్షుడు డి.ఎస్. గృహ కార్యాలయాల దగ్గరగానీ అంతటి బారులు తీరిన వార్తలు, ఫోటోలు ఒకటో అరావేసినా అధిక ప్రాధాన్యం మాత్రం వై.ఎస్.రాజశేఖర రెడ్డికీ, అతడు తిప్పుతున్న ‘చక్రం’ లేదా ‘చాణిక్యం’ కే ఇవ్వబడింది.

మార్చినెలలో 19 వతేది వరకూ ఇదే వార్తల తీరు ఈనాడులో వ్రాయబడింది. అన్నిపార్టీలని [తెదేపా గురించి బాలకృష్ణ తొడగొట్టడాలు, మీసం మెలేయడాలు, జూనియర్ ఎన్టీఆర్ కుర్రాడు అదరగొట్టేయటాలు, జనహృదయ విజేత అవ్వడం, గట్రా వార్తలతో, ప్రరాపా గురించి అప్పడప్పుడు పెద్దఫోటోలు, తరచుగా చిన్నఫోటోలతో, ఎర్రపార్టీలకీ, తెరాసకీ ఏదో ’చోచో’ అన్నవిధంగా] బ్యాలెన్స్ చేస్తూ ఈనాడు వార్తలు ప్రచురించింది.

మార్చి 19 వ తేది తర్వాత ఒక్కసారిగా వార్తలు వ్రాయటంలో స్ట్రాటజీ మారిపోయింది. 1992 లో నా ఈనాడు మిత్రురాలు ‘ఇకచూస్కో, వచ్చేవారం పేపర్ వ్రాత తీరు మొత్తం మారిపోతుంది’ అన్నట్లుగానే….. ఇప్పుడు గమనించి చూడండి. మార్చి 19 తరువాత నుండి వరుసగా, స్పష్టంగా ఈనాడు వై.ఎస్.రాజశేఖర రెడ్దికి వ్యతిరేకంగా వ్రాయటం మొదలుపెట్టింది. వార్త శీర్షిక పేరు సైతం నెగిటివ్ గానే పెడుతోంది. ఇక వార్త సేకరణ, ప్రచురణ అయితే పూర్తి వ్యతిరేకమే! ‘నాడు మోగిన చప్పట్లేవి’ అంటోంది. చివరికి పులివెందులలో కూడా సభలకి జనం కరువు అంటోంది. ఫోటోలలోనూ అదే కన్పిస్తోంది లెండి. కానీ, కావాలనుకుంటే కొద్దిపాటి జనాలే వచ్చినా జనం వైపు నుండి కెమెరా పట్టేంత వరకూ వేసి ‘జనం బాగానే వచ్చారు’ అన్న భావనా పాఠకుల్లో సృష్టించగలరు. కావాలనుకుంటే జనం ఉన్న దిశకు వ్యతిరేకదిశలోనుండి కెమెరా సంధించి, ఫోటోలో సింహా భాగం ఖాళీ స్థలాన్నీ చూపిస్తూ ‘చూడండి జనం ఎంత పల్చగా ఉన్నారో’ అన్న భావన వచ్చేలాగానూ వార్తలు ప్రచురించగలరు. ఇలా కాంగ్రెస్ కు ఎదురుగాలి రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ ఉంది. March 24, 2009 తేదిన ఈనాడు ‘వీచేది ఎదురుగాలే’ అంటూ ఈ ఊదర ముమ్మరం చేసింది. మార్చి పందొమ్మిదో తేదీ వరకూ ఉండనా ఊడనా అన్నట్లున్న యూ.పి.ఏ. భాగస్వామ్య పార్టీలన్నీ క్రమంగా అలయన్స్ ని తన్నేసాయి. కాంగ్రెస్ ని ఏకాకిని చేసాయి. లాలూ, రాంవిలాస్ పాశ్వాన్, ఇప్పుడు పవార్ [?] కూడా…… ఇలా. తమిళనాడులో పి.ఎం.కె., అన్నాడిఎంకె తో పొత్తుపెట్టుకుంది. మళ్ళీ కాంగ్రెస్ తో చెలిమేనంటూ, స్నేహపూర్వక పోటీలు. ఇలా దేశ రాజకీయ వేదిక మీద సమీకరణాలన్ని వేగంగా మారిపోయాయి. ‘ఎన్నికల సమయంలో ఇది సహజమే’ అనటం కేవలం పైకారణం మాత్రమే [over leaf reason]. మార్చి 19 వతేదిన సి.ఐ.ఏ. అధినేత ఢిల్లీ వచ్చివెళ్ళాడు. చిదంబరంతో నవంబరు 26, 2008 న జరిగిన ముంబైదాడి పర్యవసానాలని చర్చించడానికి వచ్చాడట. ఈ పైకారణం[over leaf reason] చెప్పబడింది. ఈ వార్త ‘ఈనాడు’ అసలు ప్రచురించలేదు. సాక్షిపత్రిక పాక్షికంగా, అప్రాధాన్య వార్తాగా వ్రాసింది. చివరికి డి.డి. జాతీయ వార్తల్లో కూడా ప్రసారం చెయ్యలేదు. సాధరణంగా అమెరికా నుండి ఓ చిన్నమంత్రి [వాళ్ళ భాషలో సెక్రటరీ] వచ్చినా, ప్రముఖంగా వీడియో విజ్యువల్ తో సహా ప్రసారం చేసే డి.డి. కూడా మౌనంగా ఉంది. కేవలం హైదరాబాద్ సప్తగిరి ఛానెల్ వార్తల్లో చెప్పబడింది. అప్పటివరకూ ఈనాడు ప్రచార సరళి, వార్తాసరళి ఏవిధంగా ఉందో, ఆ తర్వాత ఎలా మారిపోయిందో పైన వివరించాను.

సి.ఐ.ఏ.అధిపతి భారత్ వచ్చి మరీ చర్చించి వెళ్ళాలా, మరోమార్గమే లేదా అంటే దానివెనుక ఉన్న కార్యకారణ సంబంధాలు ఇప్పటికి తెలియక పోవచ్చు గానీ, సి.ఐ.ఏ. అధిపతి స్యయంగా భారత్ సందర్శనకు రావటం, ఆ తదుపరి భారత రాజకీయరంగం మీది చిత్రం మారిపోవటమే ఇక్కడ ప్రధానం. అయితే ప్రతీ వార్తని అందరికంటే ముందుగా వ్రాసి తాను ‘మీడియాలో ట్రెండ్ సెట్టర్’ అన్న బిరుదుని స్యయంగా, సగర్వంగా ప్రకటించుకున్న ఈనాడు యాజమాన్యం ఇలాంటి వార్తలు ప్రచురించటం లో ఇటీవల మరింత వెనుకబడటం ఇక్కడ గమనార్హం. అలానే సి.ఐ.ఏ. అధిపతి మార్చి 19 న ఢిల్లీ సందర్శించి వెళ్ళిక, పరిస్థితులన్నీ అతివేగంగా మారిపోవడం మరింత గమనార్హం.

ఈ నేపధ్యంలో భారత్ లో అమెరికా రాయబార కార్యలయం, సదరు రాయబారి ముస్లిం మతపెద్దలతో లాబీయింగ్ చేస్తూ తమని ఓడించేందుకు చూస్తోందని తాజాగా బెంగాల్ ఎర్రపార్టీ వాళ్ళు ప్రకటించడం ఇక్కడ గమనించవలసి ఉంది. అలాగే ఈనాడు, సి.ఐ.ఏ.అధిపతి రాక తర్వాత తన ప్రచారబాణీ, వార్తాప్రచురణ శైలి పూర్తిగా మార్చివేయడం కూడా పరిశీలించదగినది. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూడా హంగ్ వస్తుందని సర్వేలు, ముందస్తు అంచనాలు ఎలుగెత్తి అరుస్తున్నాయి. పత్రికల్లో సమీక్షలు, జాతీయ నాయకుల ప్రకటనలలో పదేపదే అదే చెబుతున్నారు. నిజానికి హంగ్ అసెంబ్లీ, హంగ్ పార్లమెంట్ వస్తాయో, ఏంజరుగబోతుందో వేచి చూడాల్సిందే.

ఇక్కడ ఈనాడు స్ట్రాటజీ నొకదాన్ని నిశితంగా పరిశీలించాలి. ఎటూ ఈనాడు ఏ స్ట్రాటజీని అనుసరిస్తుందో దాన్ని బట్టే మిగిలిన మీడియా, రాజకీయ నాయకుల స్ట్రాటజీ ఉంటుంది. ఈనాడు కవరేజ్ ఎలా ఉంటుందంటే – ఒక విషయంలో అప్పటి వరకూ ఫలానా వారికి లేదా ఫలానా పార్టీకి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని తెగప్రచారం చేస్తుంది. సరిగ్గా చివరి రోజుకు ముందు, లేదా రెండుమూడు రోజుల ముందు, రాత్రికి రాత్రి అద్భుతం జరిగి పోయిందని, ఫలానా వారు హఠాత్తుగా చక్రం తిప్పారనీ, లేదా చివరి క్షణంలో ఫలానా వారు చాణిక్యం ప్రదర్శించారు, దాంతో అప్పటిదాకా ఉన్న అందరి అంచనాలు తల్లక్రిందులై విపర్యయ ఫలితం వచ్చిందని మహా గొప్పగా వ్రాసేస్తుంది.

ఈ స్ట్రాటజీకి చక్కని ఉదాహరణ చూడాలంటే – అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడురోజుల ముందు ప్రచారింపబడిన పత్రికల్లోని వార్తా వ్యాసమో లేక టీవీ ఛానెల్లో ప్రసారమైన ఓ సమీక్షా కార్యక్రమమో పరిస్థితుల్ని అనూహ్యంగా మార్చేసింది అని చెప్పబడుతుంది. అప్పటివరకూ ఆశాజనకంగా ఉన్న అభ్యర్ధి ఓడిపోయి అతడి ప్రత్యర్ధి గెలిచి కూర్చొంటాడు. అలాగన్నమాట. ఈ సందర్భంలో 2008 లోని అమెరికా అధ్యక్షఎన్నికల్లో హిల్లరిని త్రోసి రాజని ఒబామా తెరమీదకి రాగానే ఆనల్ల వజ్రాన్ని అర్జంటుగా భుజాల మీద మోసేసిన ఈనాడు ప్రచారం, ఓ స్థానిక పత్రికగా ఈనాడు చూపిన అత్యుత్సాహం గుర్తుతెచ్చుకోవటం సమయోచితమే.

ఏది ఏమైనా మార్చి 19 న సి.ఐ.ఏ. అధిపతి ఢిల్లీ సందర్శించి వెళ్ళాక భారత రాజకీయ అవనిక మారిపోయిందన్నదే నా పరిశీలన, నా విశ్లేషణ. అప్పటి వరకూ రాష్ట్రంలో అన్నిపార్టీలనీ, సమతుల్యంగా వ్రాస్తూనే, ఒకరోజు తెదేపా కరపత్రం లాగా, ఒకరోజు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని తిడితూనే అతడి పట్టూ, సామర్ధ్యాలని ఎత్తి చూపుతూ వ్రాసిన ఈనాడు, సి.ఐ.ఏ.అధిపతి రాక తర్వాత మాత్రం వై.ఎస్.కీ, కాంగ్రెస్ కీ ఎదురుగాలి బాగా వీస్తోందని రాస్తోంది. ఈ విధంగా, అప్పటివరకూ రాష్ట్రస్థాయిలో అన్నిపార్టీలని బ్యాలెన్స్ చేస్తున్నట్లుగా వ్రాసిన తీరు కాస్తా మారిపోవటం కన్పిస్తుంది. అలాగే జాతీయ రాజకీయ రంగంలో సైతం అతివేగంగా మార్పులు వచ్చాయి. దీన్ని బట్టే తెలియటం లేదా భారత రాజకీయరంగం మొత్తం ఒకే వ్యవస్థ గుప్పిటిలో నడుస్తోందని!

దీనికి మరో తార్కణమే స్విస్, మరియు విదేశీ బ్యాంకుల రహస్యఖాతాల్లో మూలుగుతున్న 73 లక్షల కోట్లరూపాయలు. ఎందుకంటే పార్టీలు ఏవైనా, రాజకీయ నాయకులంతా చేస్తోంది దోపిడియే. అవసరం అయినప్పుడు రాజకీయ సమీకరణాలు మార్చేస్తుంటారు. అలా దోపిడి చేసి దాచిన సొమ్మే స్విస్, మరియు విదేశీ బ్యాంకు రహస్యఖాతాల్లో ఉందట. స్వయంగా స్విస్ బ్యాంకుల సంఘం కూడా ఆ విషయాన్ని ధృవపరస్తూ అలా నల్లడబ్బు దాచిన వారిలో భారతీయులే టాప్ ర్యాంకర్స్ అని, మొత్తంగా భారత్ ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు [బ్యూరోక్రాట్లు], రాజకీయనాయకులు, బడా పారిశ్రామిక వేత్తలూ నల్లడబ్బు అక్కడ దాచారట. నిజానికి వీళ్ళుగాక సామాన్యులు దాచగలరా ఏమిటి? అందుకే కాబోలు విహార యాత్రలకీ, పుట్టినరోజు పండగలు జరుపుకోవడానికి, విశ్రాంతిదినాలు గడపటానికి తరచుగా మన రాజకీయనాయకులు స్విస్ సందర్శించి వస్తుంటారు. పనిలో పనిగా బ్యాంకు అకౌంట్లు సరిచూసుకుని వస్తుంటారేమో!

ఏది ఏమైనా అన్నిరాజకీయపార్టీలని నడుపుతోంది ఒకటే వ్యవస్థ అన్నవిషయం మాత్రం ‘ఒక్కసంఘటన’ తర్వాత పరిస్థితులన్నీ మారిపోవటంతో మరింత స్పష్టంగా కన్పిస్తోందన్నది నా అభిప్రాయం.

మొత్తానికి జరగబోయేదేమిటో నడిపిస్తున్న రాజకీయసినిమా దర్శకుడికి తప్ప మనకి తెలియదు. అయితే జరిగిపోయింది, జరుగుతున్నది పరిశీలించవచ్చు, విశ్లేషించవచ్చు. ఇది నా పరిశీలన, విశ్లేషణ. మీరూ పరిశీలించి, మేలైన విశ్లేషణ చేస్తారని ఆశిస్తాను.

చూద్దాం ఏంజరగబోతోందో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

మీకిన్న వార్తలు ఎలాగుర్తుంటాయబ్బా తేదీలతో సహా ? విశ్లేషణ బాగుంది. అయితే హంగ్ గురించి నాకనిపిస్తున్న మాట . మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ హంగ్ లేదు. ఇప్పుడు కూడా రాదని నా నమ్మకం. ఆంధ్రలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన ఒక నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర మంతా వ్యాపించి ఒక పార్టి పూర్తి మెజారిటి సాధిస్తుంది. ఇంకో నాలుగు పార్టీలున్నా సరే.

naaku same doubt vachindi but nannu nene impossible ani saripettukunna...,
next post gurunchi waiting

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu