దీంతో మేం బాగా ఆలోచించాము. 2001, మార్చి 20 న, నాటి సి.ఎం. చంద్రబాబు నాయుడుని సెక్రటేరియట్ లో కలిసి, సూర్యాపేటలోని వ్యవస్థీకృత వేధింపు గురించి, సాక్ష్యాధార పత్రాలతో సహా వివరించబోతే, ఎంతో క్రోధపూరిత కంఠంతో, దాదాపు కళ్ళల్లో నిప్పులురాలుస్తూ ‘ఎందుకు, ఎందుకు వేధిస్తారు?’ అని ఎందుకన్నాడో ఆర్ధంకాకపోయినా, దాని వెనుక ఎవరున్నారో అప్పుడు అర్ధం అయ్యింది.

నా తమ్ముళ్ళతో చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్, వాళ్ళు పనిచేస్తున్న గ్యారేజ్ కెళ్ళి మరీ స్నేహం ఎందుకు చేసుకున్నాడో అర్ధంకాకపోయినా, దానివెనుక ఎవరున్నారో అప్పుడు అర్ధం అయ్యింది. వీళ్ళు పనిచేస్తున్న షాపు ఓనరే నా తమ్ముళ్ళని ప్రోత్సహించిమరీ, లోకేష్ ని షాపు పెట్టుకోవడానికి సహాయం అడగమని [తనకి పోటీ షాపు అయినా ఫర్వాలేదని మరీ] ఎందుకు చెప్పాడో ఇప్పుడు బాగా అర్ధమవుతుంది.

ఎందుకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అనివార్యంగా ఊరు మారవలసివస్తుందో అర్ధం అయ్యింది. ఊరురా మారటం వలన మాస్నేహితులలో, ‘మేము ఎక్కడా స్థిరంగా ఉండమన్న’ చులకన భావం కలగటానికి కారణం ఎందుకో అర్ధం అయ్యింది. ఎందుకు మేమెంత జాగ్రత్తగా డబ్బులు ఆదా చేద్దామన్నా అనివార్యఖర్చు వచ్చి చేతుల్లో డబ్బులు ఉండకపోవటానికి కారణం అర్ధం అయ్యింది. ఒకవేళ ఖర్చు లేకపోతే ఉద్యోగం పోయి, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి.

నా తమ్ముళ్ళ మీద అంత అవ్యాజానురాగం ఉండటంలోనూ, నామీద అంత అకారణ ద్వేషం ఉండటంలోనూ ఉన్న సారూప్యత ఒక్కటే – అది మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం కావటం! ఏ కుటుంబమైతే రామోజీరావు మీద 1992 లో, నాటి ప్రధాని పీ.వి.నరసింహారావుకి ఫిర్యాదు చేసిందో, ఆ కుటుంబానికి చెందిన వాళ్ళం కావటం!

అంతేకాదు, 2001 మార్చి 21 వతేదీన, అప్పటికి సి.ఎల్.పి. లీడర్ గా ఉన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకు అతడు, అదేదో రహస్యం నాదగ్గర ఉందన్నట్లుగా లోపలి గదుల్లోకి తీసుకువెళ్ళాడో, అప్పుడు అర్ధం కాలేదుగానీ, ఇప్పుడు అర్ధమయ్యింది.

దాంతో అప్పటివరకూ ఉన్న చాలా సందేహాలు మంచువిడినట్లు విడిపోయాయి. నా తమ్ముళ్ళు, బంధువుల ప్రవర్తనలోని చాలా వైరుధ్యాలకు నాకు కారణాలు అర్ధమయ్యాయి. ముఖ్యంగా నాతమ్ముళ్ళు, తల్లి నన్ను అంతగా ఎందుకు avoid చేసారో, అవమానించారో అర్ధమయ్యింది. వీటన్నింటి వెనుకా రామోజీరావు ఉన్నాడన్న విషయం మాకు స్పష్టపడింది. 2001 లో సూర్యాపేటలో మా ఇంటి ఓనరు, మా ఇంటికి తాళం వేసి, మమ్మల్ని రోడ్డుమీదకి వెళ్ళగొట్టినప్పుడు సహాయం కోసం మేం స్నేహితుల్నీ, బంధువుల్నీ ఆశ్రయించాము. అందరి ప్రవర్తనలోనూ ఒక కామన్ పాయింట్ ఉండేది. ఎక్కడ మేం ఆశ్రయం పొందినా, అక్కడ మా చుట్టూ ఉన్నవారందరూ అదేదో రహస్యం మాదగ్గర ఉన్నట్లు మమ్మల్ని నిశితంగా పరిశీలించేవాళ్ళు. నిజానికి మా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. అందరూ బ్రతికినట్లే మేమూ బ్రతుకుతాం. కాకపోతే అబద్ధాలు చెప్పకూడదని, చేతనైతే ఎవరికైనా మేలే చెయ్యాలిగాని కీడు చెయ్యకూడదని……. ఇలాంటి కొన్ని విలువలతో బ్రతుకుతాం. అంతే! అందరూ తినే తిండే తింటాం. అందరూ చూసే టీవీనే చూస్తాం. అందరూ చదివే పేపర్లే చదువుతాం. అందరూ చూసే సినిమాలే చూస్తాం. అందరూ మాట్లాడినట్లే మేమూ మాట్లాడతాం. అయినా రామోజీరావు గురించి, నాటి ప్రధానికి, భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటంతో పౌరులుగా మా బాధ్యత అయిపోయిదన్నది మా భావన. ఇక ఆ పైన మేమేదీ పట్టించుకోలేదు. 1995 నుండి 2005 వరకూ, మా కెరీర్, మా జీవితం, మా పాప. ఇంతే మా పరిధి. సమస్యలు ఎదురయితే ఎదుర్కోటం, అంతే!

అయితే, 2005 లో మాపాప పైన ఆత్మహత్య స్ట్రాటజీ ప్రయోగింపబడ్డాక మాత్రం, మేం తీవ్రంగా ఆలోచించాము. 1992 తర్వాత మా జీవితంలో అసాధారణత ప్రవేశించింది అన్న విషయం మాకు స్పష్టపడింది. ఏ క్షణాన ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషి ‘జీవితం miserable అయిపోతుంది’ అన్నదో గానీ, ఆ క్షణం నుండీ అంతే అయ్యింది. ఇదంతా పీ.వి.నరసింహారావు జీవించి ఉన్నప్పుడే అనుమానించి ఉంటే, ఖచ్చితంగా నేను ఆయన్నీ కలిసి నిలదీసి ఉండేదాన్ని. 2005 నాటికి ఆయన మరణించాడు.

ఆ తర్వాత మనస్సు స్థిరపరుచుకుని, 1992 నుండి 2005 వరకూ దాదాపు 13 ఏళ్ళపాటు నా జీవితంలో జరిగినవీ, 1992 నాటి నా ఫిర్యాదు, దాని తదనంతర పరిస్థితుల గురించిన నా పరిశీలన కలిపి, వివరంగా చేతివ్రాతతో 8 పేజీల రిపోర్టు/ఫిర్యాదు తయారు చేసాను. మా స్కూలు పిల్లలకి త్రైమాసిక పరీక్షలు నిర్వహించి, దసరా సెలవులు ఇచ్చాక, ఢిల్లీ వెళ్ళాము. ప్రధాని ఇంటికి [రేస్ కోర్సు రోడ్ లోని హైదరాబాదు హౌస్] వెళ్ళాము. ఆరోజు రామలీల సెలవు కావటంతో ప్రధాని ఇంటిదగ్గర సెక్యూరిటీ అవుట్ పోస్ట్ దగ్గరే మమ్మల్ని ఆపేశారు. రిసెప్షన్ కార్యాలయం కూడా పని చేయటం లేదని, ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాకుకి వెళ్ళమని చెప్పారు. మేం సౌత్ బ్లాకులోని డాక్ సెక్షన్ ని చేరి, మా ఫిర్యాదు నకలు [జిరాక్స్ కాపీ] మీద, వారి రసీదు స్టాంపు వేయించుకుని, మా ఫిర్యాదు ఉంచిన సీల్డ్ కవర్ ని అక్కడ ఫైల్ చేశాము. ఆ ఫిర్యాదు కాపీ [స్కాన్డ్] Fire Pot లో ఉంచాను.

ఆ ఫిర్యాదులో ‘ఒకవేళ పీ.వి.నరసింహారావు గానీ నాచుట్టూ ఏదైనా మ్యాజిక్ సర్కిల్ సృష్టించి ఉంటే, దానికి నేను responsible గానీ, liable గానీ కాదని, ఎందుకు నన్ను రామోజీరావు వేధిస్తున్నాడో అతడికే తెలియాలనీ వ్రాసాను. పీ.వి.నరసింహారావుకి నేను ఫిర్యాదు చేసేనాడు నాదగ్గర ఉన్నవి తార్కిక ఆధారాలు [logical proofs] మాత్రమే. అయితే ఇప్పుడు సాక్ష్యాధార పత్రాలేగాక, దృష్టాంతపూరిత, సంఘటానాత్మక [circumstantial Proofs] ఋజువులు ఉండటం గురించి కూడా వివరించాను.


ఆ ఫిర్యాదు చివరిలో మా శ్రీశైలం చిరునామా, అప్పుడు ఢిల్లీలో బసచేసిన, హోటల్ చిరునామా, మా సెల్ ఫోన్ నెంబరుతో సహా వ్రాసాను. తర్వాత దాదాపు వారంరోజుల పాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి ప్రదేశాలు తిరిగి చూసి, వచ్చేసాము. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల నుండి స్పందన కోసం ఎదురుచూశాము. అధమ పక్షం, 1992 లో మాదిరిగా ఐ.బి. అధికారులన్నా వస్తారని ఊహించాము. ఏదీ లేదు గాని, మేం ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన మర్నాడు 18 Oct.,2005 న [ఆరోజు దసరా సెలవులు అయిపోయి స్కూలు Reopen కూడా] ఉదయాన్నే, ఒకరికి ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ వచ్చి “మీరు సి.ఎం.కి ఏదో కంప్లైట్ ఇచ్చారట గదా! దాని గురించి మా స్టేషన్ కి follow up వచ్చింది. మా సి.ఐ.సార్ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు” అంటూ కబురు తెచ్చారు. అందులో ఒకరు మా విద్యార్ధుల తండ్రి. మేము ఢిల్లీలో పెట్టిన ఫిర్యాదు తాలూకూ ఏదైనా వచ్చిందేమో అనుకున్నాము. ఎందుకంటే – అప్పటికే సి.ఎం. రాజశేఖర్ రెడ్డికి, అతడు ముఖ్యమంత్రి అయినది మొదలుకొని, అంటే 2004 నుండి, కొనసాగుతున్న వేధింపు గురించి, [మా విద్యార్ధుల మార్కులు కొట్టి వేయించటం, కరెంటు ఛార్జీలు అందరి కంటే ఎక్కువగా విధించటం, బిల్లులు అసాధారణ తేదీలలో జారీ చేయటం, నీళ్ళు ఇవ్వకుండా వేధించటం, మొదలైన] వరుసగా ఫిర్యాదులు పంపుతూనే ఉన్నాము. అతడి నుండి ఏ స్పందనా రానందునా, పైపెచ్చు అతడికి ఫిర్యాదు వ్రాసిన తర్వాత వేధింపు స్థాయి పెరగుతున్నందునా, అప్పటికే అతడిమీద నమ్మకం సడలిన స్థితిలో ఉన్నాము.

అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి గానీ, సోనియాగాంధీ గురించి గానీ మాకు అప్పటికి ఇంకా ఏ అభిప్రాయము లేకుండింది. అప్పటికి దాదాపు 10 ఏళ్ళుగా [1995 నుండి 2005 వరకూ] మేం పెద్దగా ఏవీ పట్టించుకోనందున, కనీసం సోనియాగాంధీ ఎప్పుడు క్రియశీల రాజకీయాల్లోకి వచ్చిందో, ఆ సంవత్సరం గురించి కూడా, మాకు సరిగా తెలియని స్థితిలో ఉన్నాము.

అందుచేత ఢిల్లీలో 08,Oct.2005, ప్రధాని మన్మోహన్ సింగ్ కు రామోజీరావు గురించి పెట్టిన ఫిర్యాదుకే స్పందన వచ్చి ఉంటుందని అనుకున్నాము. వెంటనే నేను మాపాపని వెంట బెట్టుకుని సి.ఐ. ఇంటికి వెళ్ళాను. ఆయన నివాసం మా సత్రానికి ఎదురుగానే ఉండేది.[అప్పటికి ఆయనకి టెంపరరీగా ఇచ్చారు.] అంటే, ప్రతీ రోజూ రెండుపూటలా వాళ్ళ OH ట్యాంకుతో సహా చుట్టుప్రక్కల అందరి ట్యాంకులూ పొర్లుతుండగా, ఒక్క మా సత్రంలో మాత్రం నీటికి కటకటగా ఉండటం ఆయనకి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తే. ఆయన ఇంటి ఎదురుగానే మా విద్యార్ధుల [కానిస్టేబుల్స్ పిల్లలు] ఇళ్ళు ఉండేవి. పోలీసు సి.ఐ.కరుణాకర్ నా చేతికి సీ.ఎం. రాజశేఖర్ రెడ్డికి నేను వ్రాసిన ఫిర్యాదుని ఇచ్చాడు. అది సెక్రటేరియట్ నుండి శ్రీశైలం సి.ఐ.కి forward చేసినట్లు దానిపైన స్టాంప్ వేసి ఉంది. దానిని Fire Pot లో ఉంచాను. చూస్తే అది 12, Sep.2005 న మేము సి.ఎం.కి వ్రాసిన ఫిర్యాదు. అందులో కరెంటు, నీటి సమస్యలతో పాటు మా పాపపై నడిచిన ఆత్మహత్య స్ట్రాటజీ గురించి కూడా ఫిర్యాదు వ్రాసాను. సి.ఎం. రాజశేఖర్ రెడ్డి దానికి స్పందించాడు. అప్పటికి సంవత్సరం ఐదు నెలలుగా[మే 22, 2004 నుండి సెప్టెంబరు12,2005 వరకూ] మేము పెట్టిన ఏ ఫిర్యాదుకీ స్పందించని వాడు దీనికి స్పందించాడు. అందునా మాపాప విషయంలో, నేను సమస్య పరిష్కరించుకున్నాక, ఆ ఫిర్యాదుని స్థానిక స్టేషన్ కి పంపడం ద్వారా మమ్మల్ని మరింత అల్లరిపాలు, అగౌరవం పాలు చేయడానికి కాకపోతే మరెందుకు పంపినట్లు? అప్పటికి మేం మా స్కూలు విద్యార్ధులనీ, మాపాపనీ కౌన్సిల్ చేసుకుని తిరిగి ఆరోగ్యకర చదువు వాతావరణాన్ని సృష్టించుకొని, కొన్నిరోజులు గడిచాయి. నడిచిన వ్యవహారంలో మేం ఎవరినీ claim చెయ్యలేదు. ఇంటి చుట్టుప్రక్కల వారితో ఎవరితోనూ ఏదీ మాట్లాడలేదు. వయస్సుకి మించిన ఆలోచనలు ఉన్నాయన్న పిల్లలిద్దరినీ కూడా, వాళ్ళ తల్లిని పిలిపించి “మీ పిల్లలకి మాస్కూలు సరైన చోటు కాదండి. అదీగాక ఇదే అంతస్థులోని బ్రహ్మచారి పోలీసు కానిస్టేబుల్ గదిలోకి, కిటికీ రంధ్రాలలో నుండి చూస్తున్నారట. ఎందుకు చూస్తార్రా అంటే అతడు అమ్మాయిలని తెచ్చుకున్నాడని చెబుతున్నారు. ఇలా వయస్సుకి మించిన ఊహాలున్నాయి మీ పిల్లలకి. మాదగ్గరంతా చిన్నపిల్లలున్నారు. అంచేత మీ వాళ్ళని ఏదైనా ట్యూటోరియల్స్ లో చేర్చుకొండి. లేదా మరో స్కూలులో చేర్చుకొండి. నేను మాత్రం చెప్పలేను” అని చెప్పాను. ఆవిడా మరేం తర్కించకుండా, గమ్మున పిల్లల్ని తీసికెళ్ళిపోయింది. అలాంటి నేపధ్యంలో సీ.ఎం. ఇలా స్థానిక స్టేషన్ కి ఆ ఫిర్యాదు కాపీ పంపటం ‘మాకు మేలు చెయ్యటానికా కీడు చెయ్యటానికా’ అన్పించింది.

ఇలా నేను ఆలోచిస్తుండగానే, సి.ఐ. “చూడండమ్మా! దీనికి జవాబుగా మీరు స్టేట్ మెంట్ వ్రాసి ఇవ్వండి” అని చెప్పాడు. ఆ లెటర్ కాపీ కూడా ఇచ్చాడు. తీసుకుని ఇంటికి వచ్చి నేనూ, మావారు బాగా ఆలోచించి, సాయంత్రానికి జవాబు స్టేట్ మెంట్ వ్రాసి, జిరాక్స్ కాపీ ఉంచుకుని, అసలు ప్రతిని సి.ఐ.కి ఇచ్చాము. అందులో – స్పష్టంగా 17 నెలల తర్వాత స్పందించిన సీ.ఎం.కి కృతఙ్ఞతలు తెలుపుకుని, మాపాప సమస్య మేమే పరిష్కరించుకున్నామనీ, సూర్యాపేటలో మమ్మల్ని వేధించిన మా పూర్వపు ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి, పోలీసు సి.ఐ.ఖాన్, ఎస్.ఐ.రాములు నాయక్, ఎస్.పి.శివధర్ రెడ్డి ఇత్యాది వారి దగ్గరనుండి, శ్రీశైలంలో ప్రస్తుతం వేధిస్తున్న AP Transco A.E., దేవస్థానపు రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ ఫణీధర ప్రసాద్ వరకూ ఉటంకించి, ఈ వేధింపుల నుండి మమ్మల్ని రక్షించమని వ్రాసాము. తరువాతకాలంలో ఫణీధర ప్రసాద్ తన రెండవభార్య[?] నడుపుతున్న భ్రామరీ స్కూలుకు మా సత్రపు ఆవరణలో, విడిగా ఉన్న కాటేజ్ నెం.69 ని, ఎలాట్ చేయించుకున్నాడు. దేవస్థానపు క్యూలైన్లకు వాడే ఇనుప ఫెన్సింగ్, సిమెంట్ గట్రాలతో కాటేజ్ చుట్టుగల స్థలాన్ని ఆక్రమించి స్కూలుకోసం నిర్మాణాలు చేయిస్తున్నాడు. దీన్ని గురించి, ఫణిధర ప్రసాద్ మమ్మల్ని వేధిస్తున్నా వివరాలన్నింటిని గురించి సీ.ఎం.కి వివరిస్తూ 28 Feb. 2006 న, అంటే, సి.ఐ.ద్వారా జవాబు స్టేట్ మెంట్ పంపిన నాలుగునెలల తర్వాత మరో వివరాణాత్మక ఫిర్యాదు తెలుగులో వ్రాసాము. అందులో అన్ని వివరాలు పొందుపరిచాము. మొత్తంగా రాజశేఖర్ రెడ్డికి ఎన్ని ఫిర్యాదులు వ్రాసినా, ఒక్క మా పాప వ్యవహారం ఉన్న ఫిర్యాదుకి తప్ప, మరిదేనికి ప్రతిస్పందించ లేదు. అందులోని స్ట్రాటజీ మాకు స్పష్టంగానే అర్ధం అయ్యింది. దానితో, ఒక్క చంద్రబాబు వెనుకే కాదు, రాజశేఖర్ రెడ్డి వెనుక ఉన్నదీ రామోజీరావే అన్న విషయం మాకు స్పష్టపడింది. ఫిర్యాదులో ఏవయితే సమస్యలని నేను అంటానో, వాటిని మరింత ఎక్కువ చేయటం జరిగింది. నెలలు గడుస్తున్నా ప్రధానమంత్రి నుండి గానీ, ముఖ్యమంత్రి నుండి గాని స్పందన లేదు.

మరోవైపు మా నీటి సమస్య అంతకంతకూ పెరిగి పోయి, 2006 మార్చి నాటికి చుక్కనీరు రాని స్థితికి వచ్చింది. ప్రతీరోజూ పైఅంతస్థు వారూ, క్రింది అంతస్థు వారూ నీటి యుద్ధాలు చేసుకునేదాకా వచ్చింది. క్రింది అంతస్థు వాళ్ళు స్టాండు పంపులు తమ పరపతి ఉపయోగించి వేయించుకున్నాం అంటారు. ‘అదే పరపతి ఉపయోగించి అసలు 2 ట్యాంకులకీ నీళ్ళు ఎక్కేలా, ప్రెషర్ పెంచిపిస్తే, అందరం మీ పేరు చెప్పుకుని హాయిగా నీళ్ళు పట్టుకుంటాం కదా!’ అంటే కిమ్మనరు. పోనీ అందరం కలిసి నీళ్ళు రావటం లేదని వాటర్ వర్క్సు వాళ్ళకి ఫిర్యాదు చేద్దామంటే, రారు. ఈ నేపధ్యంలో ఓరోజు ఉదయం రెండు అంతస్థుల వారికీ భారీగా గొడవయ్యింది. మా అంతస్థులో ఉన్న పరిషత్ స్కూల్ ఇన్ ఛార్జి ప్రిన్స్ పాల్, పోస్ట్ ఆఫీసు ఉద్యోగి, అందరూ క్రింది వాళ్ళతో వాగ్యుద్ధానికి దిగారు. నేను ఉదయపు ట్యూషన్ క్లాసులో ఉన్నాను. అంతా అయ్యాక నేను “సార్! మనం ఏమన్నా వాళ్ళు చేసేది చేస్తున్నారు. మనం వాళ్ళ స్థాయికి దిగి పోట్లాటకు దిగలేం. చూశారు కదా! వాళ్ళ నోటి భాష! మన ప్లోరు మీద అందరం కలిసి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం. నేను వ్రాస్తాను. అందరూ సంతకాలు పెట్టండి” అన్నాను. అంతే! క్రింది అంతస్థులోని నాలుగు కుటుంబాల వాళ్ళు రయ్యిన బయటకు వచ్చి మమ్మల్ని నానా తిట్లూ తిట్టారు. ‘నీ స్కూలు మూయించకపోతే చూస్కో’ అన్నారు. నీటి సమస్య అందరిదీ. పై అంతస్థులోని అందరం కలిసే గొడవ పడుతున్నాం. క్రింది అంతస్థులోని వారితో సహా అందరం కలిసే ఫిర్యాదు చేద్దాం రమ్మన్నాను. రాలేదు. ఇప్పుడూ పైఅంతస్థులోని ‘అందరం కలిసి ఫిర్యాదు వ్రాసుకుందాం, నీళ్ళు సరిగా రావడం లేదని, అంతేగానీ ఒకేచోట ఉంటూ అసహ్యంగా దెబ్బలాడు కోవటం ఎందుకని’ నేను ఓప్రక్క చెబుతుంటే, వాళ్ళంతా వచ్చి ఎందుకు నన్నే టార్గెట్ చేసుకుని తిడుతున్నారో అప్పుడు నాకు విస్పష్టమైన పిక్చర్ వచ్చేసింది. అంతకు ముందు ఇలాంటివి నాదృష్టికి వింతగా అన్పించినా కారణం అర్ధం అయ్యేది కాదు.

అయినా నేనిదంతా ఏమీ బయటపడలేదు. ఎందుకంటే దేవస్థానపు ఈ.వో., ఇ.ఇ.ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించుకొనేందుకు రామోజీరావు ప్రసక్తి ఎత్తడం అనుచితంగానూ, అసంబద్ధంగానూ ఉంటుంది. అదీగాక నీటి సమస్య మా ఒక్కరిదే కాదు. మొత్తం మా అంతస్థులో ఉన్న 9 కుటుంబాలది కూడా! దాంతో నేను ఈ.వో.పేరిట 9 కుటుంబాల తరుపునా ఫిర్యాదు వ్రాసాను. దానికి శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర నుండి చల్లా వెంకయ్య సత్రం, దాని ప్రక్క, ఎదురు వీధుల కాటేజీల బొమ్మలతో సహా [Topography] చిత్రించి జోడించాను. ఆ Topography లో 2 ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో, వాటి వాల్వులూ, వాటికి నీటిని సరఫరా చేసే గొట్టాలపై ఎక్కడెక్కడ స్టాండ్ పంపులు వేసారో, చిత్రించి, దానితో pressure పడిపోయి నీళ్ళు పైకి ఎక్కకపోవడం అన్న సమస్యని వివరించాను. Fire Pot లో చూడగలరు.

అదే కాపీని వాటర్ వర్క్సు ఇ.ఇ. రామిరెడ్డికి కూడా ఇచ్చాము. దాదాపు 7 గురు ఆడవాళ్ళం, ఉదయాన్నే ఇ.ఇ. ఇంటికి వెళ్ళి మా ఫిర్యాదు కమ్ అభ్యర్ధనని పెట్టుకున్నాము. ఆయన అప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్ పంపారు. త్వరలో అక్కడి గొట్టాల మార్పించి ప్రెషర్ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చాడు. వెంటనే స్టాండు పంపులు పీకేయించి డమ్మీ చేయించాడు. ఇంతలో ఒక్కసారిగా, శ్రీశైలంలో భారీఎత్తున ఉద్యోగుల బదిలీలు జరిగాయి. దాదాపు 80 మందిదాకా బదిలీ అయ్యారు. అందులో మాకు గది ఎలాట్ చెయ్యించిన రాధిక, ఆమె భర్తా కూడా ఉన్నారు. అప్పటికే ఆ అమ్మాయికి క్యాన్సర్ సోకింది. అది మాకు చాలా బాధ కలిగించింది. ఆమె కిమో ధెరపీకి హైదరాబాద్ ఆసుపత్రిలో చేరినప్పుడు వారి అబ్బాయి గురించి మేము బాగా శ్రద్ద తీసుకున్నాము. అదే నేపధ్యంలో వాటర్ వర్క్సులో ఏ.ఇ.నీ, ఇ.ఇ.నీ కూడా బదిలీ అయ్యారు.

కొత్తగా బదిలీపై ఆయా స్థానల్లోకి వచ్చిన వారు కాంట్రాక్టు ఉద్యోగులు. వారిలో ఏ.ఇ.స్థానంలోకి వచ్చిన వ్యక్తి రాజేష్ అని చిన్నవయస్సు వాడు. అతడు ఓరోజు మరికొందరు వాటర్ వర్క్సు పనివారిని తీసుకుని వచ్చి, మళ్ళీ క్రింద యధావిధిగా ఒకస్టాండ్ పంపు బిగించి వెళ్ళిపోతున్నాడు. దాంతో మా అంతస్థులోని వారు [ప్రిన్స్ పాల్, కానిస్టేబుల్, పోస్టల్ ఉద్యోగితో సహా] ఆ ఎ.ఇ.ని ఆపి, పై అంతస్ధులోని ట్యాంకుల పరిస్థితి గమనించమని పైకి తీసుకొచ్చారు. అప్పటికి మేం కూడా వెళ్ళాము. అందరం కలిసి కొత్త ఏ.ఇ.కి సమస్య వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అంతలో ఆ ఎ.ఇ., రమణయ్య సెల్ ఫోన్ నాచేతికి ఇచ్చి “మాట్లాడండి. మా డి.ఈ.వో. లైన్ లో ఉన్నారు” అన్నాడు. ఒక్కక్షణం నాకేమీ అర్ధంకాలేదు. ఎందుకంటే విద్యారంగంలో ఉండి డి.ఈ.వో. అనగానే నా ఆలోచన, జిల్లా విద్యాశాధికారి దగ్గరికి పోయిందిగానీ స్థానిక డిప్యూటి ఈ.వో. కృష్ణయ్య అన్న స్ఫురణకి రాలేదు. నేను ఈ అయోమయంలో ఉండగానే, అటునుండి ఓ కంఠం “ఏంటీ! మాటికి ఈ.వో.కి కంప్లైట్, ఈ.వో.కి కంప్లైట్ అంటూ అందరి మీదా జులుం చేస్తున్నావట? ఏదో పాపం అని దయతలచి నీకు రూమ్ ఇచ్చిన! ఏంటి నీగొడవ? ఎవరికి నీళ్ళొస్తే వాళ్ళు పట్టుకుంటారు. నీకేం నొప్పి” అంటున్నాడు. నాకు విషయం బోధపడటానికి కొద్దిక్షణాలు పట్టింది. ఫోన్ లో మాట్లాడుతుంది డి.ఇ.వో. కృష్ణయ్య అని అర్ధం కాగానే నేను “లేదు సార్! రెండేళ్ళుగా మా 1st floor లోని ఎవరికీ నీళ్ళు రావటం లేదు. అందరం కలిసే రిక్వెస్ట్ చేస్తున్నాం” అంటూ ఇంకా చెప్పబోయినా, అతడదేం పట్టించుకోకుండా ఫోన్ లో ముందుఅన్నమాటలే అంటూ కొనసాగిస్తున్నాడు. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. అంతలో నాప్రక్కనే నిలబడి ఉన్న పరిషత్ స్కూల్ ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ పూర్ణ చంద్రమాచారికి ఫోన్ ఇచ్చి “వినండి సార్! కృష్ణయ్యసార్ లైన్ లో ఉన్నారు” అన్నాను. అతడు ఫోన్ తీసుకుని అటునుండి వినబడుతున్న మాటలకు నిర్ఘాంతపోయాడు. ఓ నిముషం తర్వాత జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఒక్క అంగలో రాజేష్, రమణయ్యా వచ్చి సెల్ ఫోన్ పూర్ణచంద్రమాచారి చేతినుండి లాక్కున్నట్లుగా తీసేసుకుని, తాము మాట్లాడి పెట్టేసారు. ఆ తర్వాత గబగబా అక్కడి వ్యవహారం తెంచేసుకుని వెళ్ళిపోయారు. అనంతరం కొద్దిసేపు మా ఫోర్లుమీద అందరం అదే విషయం చర్చించుకున్నాం. నేను ఫోన్ లో నడిచిదంతా చెప్పాను. పూర్ణచంద్రమాచారి కూడా ఆశ్చర్యంగా “అదేమిటి మేడం! ఆ కృష్ణయ్యా సార్ అలా మాట్లాడతాడేమిటి?" అంటూ తను విన్నమాటలు చెప్పాడు. అప్పటికి టైమ్ చాలా అవటంతో ఎవరి పనుల నిమిత్తం వాళ్ళం వెళ్ళిపోయాము. ఆ రాత్రి భోజనాంతరం నడుస్తూ నేనూ, మావారు ఈ విషయమై చాలా తర్కించుకున్నాము. ఎంత ఆలోచించినా కృష్ణయ్య వంటి ఉన్నతాధికారికి మాతో అలా మాట్లాడవలసిన అవసరం ఏమిటో మాకేమీ అర్ధం కాలేదు. ఒక అధికారిగా అందరికీ నీటి వసతి కల్పించటం వారి బాధ్యత కూడాను. అందుకోసం ప్రతినెల అందరి నుండి రుసుము వసూలు చేస్తారు. మావంటి ప్రైవేట్ వారు నెలకు 80/-Rs. కడితే, దేవస్థానపు ఉద్యోగులు 30/-Rs. లు కడతారు. అటువంటి నేపధ్యంలో కొందరిని నీటికి ఇబ్బంది పడమనీ, ఏకపక్షంగా ఒక వర్గాన్ని సమర్ధిస్తూ, మా అంతస్థులోని 9 కుటుంబాలని నీటిబాధలు పడమనవలసిన అవసరం, ఒక ఉన్నతాధికారిగా అతడి కెంత మాత్రం లేదు. 9 కుటుంబాల వారు నీళ్ళకోసం బాధలు పడితే అతడికొచ్చే లాభంగానీ, పడకపోతే వచ్చే నష్టంగానీ లేదు. మీదు మిక్కిలి నీటి సమస్యలు పరిష్కరించకపోతే చెడ్డపేరు వస్తుంది. అదీగాక ‘ఎవరికి నీళ్ళు వస్తే వాళ్ళు పట్టుకుంటారు. నీకేం నొప్పి?’ వంటి భాష, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నోటరాదు. నేను అంతకు ముందు, మా గది ఎలాట్ మెంట్ ఇచ్చిన సందర్భంలో అతణ్ణి కలిసాను. అతడి మాటతీరు అదికాదు. గొంతు సరిగా గుర్తులేదు. అందుచేత చాలా సందేహపడ్డాము. చివరికి రమణయ్య, తాను కృష్ణయ్యకి వంటవాడు గనుక, ఆ పరపతితో మమ్మల్ని బెదిరించేందుకు, ఎవరిచేతనో దొంగఫోన్ కొట్టించి ‘తానే కృష్ణయ్య’ నంటూ మాట్లాడించాడేమో నన్న నిర్దారణకు వచ్చాము. ఇప్పుడు దీనికి వెనక్కి తగ్గితే, రేపు మరెవరి చేతో ఫోన్ చేయించి “నేనే కృష్ణయ్యని. ఓ పదివేలు మా వంటవాడి చేత పంపించు” అన్నా ఏం చెయ్యగలం? అనిపించింది.

దాంతో మర్నాడు పొద్దున్నే ఫిర్యాదు వ్రాసుకుని పోలీసు సి.ఐ.కరుణాకర్ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి ఈ సి.ఐ. మాఇంటి ముందున్న కాటేజ్ నుండి దేవాలయానికి దగ్గరలోని మరో పెద్ద కాటేజ్ లోనికి మారాడు. అతణ్ణి కలిసి వివరాలన్నీ ముఖతః వివరించాము. ఫిర్యాదులో కూడా రమణయ్య, రాజేష్ లు నాకుఫోన్ ఇచ్చిన విషయం, దాన్ని నేను పూర్ణచంద్రమాచారికి కూడా ఇచ్చిన విషయం వ్రాసి, కావాలంటే ఎంక్వయిరీ చేసుకొమ్మని చెప్పాను. రమణయ్యది క్రిమినల్ బ్రెయిన్ కాదా అని వ్రాసాము. ఇప్పుడు మేము ఊరుకుంటే రేపు కృష్ణయ్య పేరిట ఫోన్ చేసి డబ్బో, మరొకటో fulfill చెయ్యమంటే ఏం చెయ్యగలం అని ప్రశ్నించాము. 9 కుటుంబాల వారము కలిసి ఫిర్యాదు చేస్తే, కేవలం నామీదే ఎందుకు గురి పెట్టినట్లు అని కూడా ప్రశ్నించాము.

అలాగ్గాక, ఒకవేళ కృష్ణయ్యే ఆఫోన్ చేసి ఉంటే, ఒక అధికారికి అంత అవసరం ఏమిటని ప్రశ్నించాము. నీటి సమస్య గురించి అడ్మిషస్ట్రేషన్ ప్రకారం అభ్యర్ధించటం, ఫిర్యాదు చేయటం ‘జులుం’ గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించాము. చివరలో రమణయ్య మీద చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ముగించాము. ఆ కాపీ Fire Pot లో చూడవచ్చు. సి.ఐ. తాను ఎంక్వయిరీ చేస్తానని హామీ ఇచ్చాడు. మేం సెలవు తీసుకుని వచ్చేసాము. ఆ తర్వాత కొన్నిరోజులకి మా సత్రం పైనున్న రెండు ట్యాంకులలో మాట్యాంకుని డమ్మీ చేసి, రెండు అంతస్థుల వారికీ ఒకే ట్యాంకుతో నీటి సరఫరా చేయటం మొదలు పెట్టారు. అంతేగాని ప్రెషర్ పెంచటం మాత్రం చెయ్యలేదు.

దాంతో నీటి సరఫరా గొప్పగా మెరుగుపడకపోయినా, సమస్య కొంత వరకూ సమసిపోయింది. ముఖ్యంగా నీటిపంపు దగ్గర, బస్తీ జనాలు పోట్లాడుకున్నట్లు గొడవలు పడే స్థితి లేదు. అప్పటికి అది ఎంతో హాయిగా తోచింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

వై.స్. రెస్పాన్స్ లెటర్ లో PTO అన్నారు కదా, ఆ రెండో భాగం లింక్ కూడా ఇవ్వగలరు.

మనోహర్ గారు,

వెనక పేజీలో మా అడ్రసు వ్రాసాము. అందుకే స్కాన్ చెయ్యలేదండి.

no problem

పరవాలేదండి

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu