మెల్లిగా మా స్కూలు పుంజుకుంది. విద్యార్ధులు పెరిగారు. దాంతో క్రమంగా ట్యూషన్లు తగ్గించి, స్కూలు మీదే దృష్టి కేంద్రీకరించాలనుకున్నాము. చిన్నపిల్లలు కూర్చొనే ప్లాస్టిక్ కుర్చీలతో మా క్లాసు రూమ్స్ రెండూ చూడటానికి అందంగా ఉండేవి. ఇరుకే అయినా శుభ్రంగా ఉండేవి. కె.జీ. క్లాసులు మూడు మావారు చూసుకునేవారు. ’౦’ క్లాసులనే మాటేగానీ మొత్తం కలిపినా తొలిసంవత్సరంలో పదిమంది ఉండేవాళ్ళు. మిగిలిన క్లాసుపిల్లలను[15మంది] నేను తీసుకునేదాన్ని. అది చాలా చిన్న ఊరైనందునా, మేం కొత్తగా వచ్చినందునా తొలిసంవత్సరాల్లో ఒకోక్లాసుకి నలుగుదైరుగురు విద్యార్ధులే ఉండేవారు. ఒకో క్లాసుకి అసలు విద్యార్ధులే లేరు. మొదటి సంవత్సరం దాదాపు 25 మంది విద్యార్ధులతోనే నడిపాము. అయితే ఆ ఊళ్ళో నర్సరీ, కె.జీ. క్లాసులకు ఫీజు 50/- రూ. ఉంటే మా స్కూల్లో 200/- రూ. ఉండేది.

తొలిసంవత్సరంలో ఏడో తరగతికి ఒక విద్యార్ధిని ప్రైవేటుగా వ్రాయించేందుకు తయారుచేశాము. ఈ పిల్లవాడి తండ్రే ఈ.వో. డ్రైవర్ కావటంతో, మాకు ప్రస్తుతం మేం ఉన్నగదిని ఇప్పించినవాడు. ఈ పిల్లవాడు చాలా తెలివైనవాడు. కానీ శ్రీశైలంలోని చాలామంది పిల్లల్లాగే ఆ తెలివితేటల్ని చదువులో గాకుండా ఇతరత్రా ఉపయోగించేవాడు. చివరికి తల్లిదండ్రులకి మస్కా కొట్టేందుకు కూడా! తండ్రి ఈ.వో. డ్రైవర్ అయినందున ఎక్కువగా క్యాంప్ లు పోయేవాడు. దాంతో ఈ పిల్లవాడు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేవాడు. మేం శ్రీశైలం వెళ్ళెటానికి ముందు వీణ్ణి సున్నిపెంటలో చేర్చారు. వీడు స్కూలు టైముకి వెళ్ళి, శుభ్రంగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడేసుకొని, స్కూలు అయిపోయే సమయానికి మళ్ళా ఇల్లు చేరేవాడు. పిల్లవాణ్ణి నియంత్రించటం తల్లిదండ్రులకి పెద్ద సమస్యగా మారిన సమయంలో మేం శ్రీశైలం చేరాము. అతడి తండ్రి ప్రత్యేకశ్రద్ద తీసుకుని మాకు సత్రంలో గది ఇప్పించటానికి, ఇది కూడా ఒక ప్రత్యేక కారణం. చల్లా వెంకయ్య సత్రంలోని మాగదిలో ఇల్లు/ ఇంటిలోనే స్కూలు నడుపుతుండేవాళ్ళం. మా ఇంటికి రెండు నిముషాల నడకదూరంలో వాళ్ళ ఇల్లు ఉండేది. దాంతో ఈ చిన్నవాడు ఇంకే వేషాలు వెయ్యడానికి వీలులేక పోయింది. సహజంగానే తెలివైన కుర్రాడు కావటంతో, నేను పాఠం అర్ధమయ్యేటట్లు చెప్పటంతో వాడి దృష్టి ఆటల మీద నుండి చదువు మీదకి బాగానే మళ్ళింది. ఆటలూ, సినిమాలూ తగ్గించి బాగా చదవటం మొదలు పెట్టాడు. పాఠం చెప్పి, బిట్స్ అన్నీ ఆన్సర్ చేయమంటే పదినిముషాల్లో చేసేసేవాడు. ఇలాంటి పిల్లవాణ్ణి 2004, మార్చికి ఏడో తరగతికి తయారుచేశాము. పరీక్షలు బాగానే వ్రాసాడు. తీరా రిజల్ట్స్ వచ్చాక చూస్తే వాడికి 350 మార్కులు వచ్చాయి. గతంలో నేను పనిచేసిన స్కూల్లో నా పూర్వవిద్యార్ధి ఒకడు ఉండేవాడు. వాడికి అప్పటికే 13 ఏళ్ళు ఉండేవి. అప్పటికి [2003] ఆరో తరగతి చదువుతుండేవాడు. అంటే 2004 లో వాడూ ఏడోతరగతి పరీక్షలు వ్రాసాడు. ఆ పిల్ల వాడికి Mother అన్న spelling కూడా రాదు. ‘The’ వ్రాయమంటే ‘Teh’ వ్రాసేవాడు. అంతగా percept అయ్యేవాడు. ఇక మ్యాధ్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. అలాంటి వాడికి 365 మార్కులు వచ్చాయి. అంతేగాక మొదట్లో మాదగ్గర ట్యూషన్ చదివి తరువాత మానేసిన విద్యార్ధులకి 400+ లు అలా మార్కులు వచ్చాయి. వాళ్ళ స్టాండర్డ్స్ మాకు తెలుసు. మాకు విషయం వెంటనే అర్ధమైపొయింది. సూర్యాపేట వంటి ప్రాంతాల్లో ఇంటర్ పేపర్లు లీకులవుతాయి. ఇక్కడ పేపర్ లీకులు ఒక్కటే చాలవు. జవాబు పత్రాలు దిద్దేచోట మతలబులు చేసి మార్కులు వేయించుకుంటారు. ఈ అవినీతి రాష్ట్రమంతట [దేశమంతట కూడా] ఉంది. ఎక్కడి కక్కడ ప్రైవేటు స్కూళ్ళ మేనేజ్ మెంట్లు వ్యవస్థీకృతంగా జరిపించుకుంటున్న వ్వవహారం ఇది. ఈ వ్యవహారం మొత్తం తరువాత కాలంలో నంద్యాలలో పాంప్లేట్స్ లో వేసుకుని మరీ కొట్టుకున్నారు. ఇది పరాకాష్టకు చేరుకుని ప్రభుత్వం, మొత్తంగా 7th కామన్ ఎగ్జామ్స్ ఎత్తివేసింది. హాజరుతోనే ఇప్పుడు ఎనిమిదవ తరగతిలోకి వెళ్ళవచ్చు. అయితే మాకు ఒక విషయం చిక్కుముడిగా అన్పించింది. వేరే విద్యార్ధులకి [చదవని పిల్లలకైనా సరే] మంచిమార్కులు వచ్చాయంటే, ఆయా విద్యార్ధులకి, ఆయా స్కూల్స్ యాజమాన్యాలు మార్కులు వేయించుకుంటాయి. [అసలు శ్రీశైలంలో పరీక్షా కేంద్రంలోనే సబ్జెక్ట్ కి వందరూపాయలు ఇస్తే ఎంచక్కా కాపీ కొట్టుకోవచ్చన్నది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడి ఇంగ్లీషు మీడియం స్కూల్స్ తమ పిల్లలకి జవాబులు నేర్పలేక కొన్ని జవాబులు నేర్పి ‘ 7th కామన్ ఎగ్జామ్ లో ఏప్రశ్న వచ్చినా ఈ జవాబులేవ్రాయి. లేకపోతే మార్కులు వేయించటానికి ఆన్సర్ పేపర్ లో ఏమీ ఉండదు కదా’ అని చెప్పి మరీ, పిల్లలచేత వాళ్ళ ఇష్టం వచ్చిన జవాబులు వ్రాయిస్తారు.] అలాంటి నేపధ్యంలో మా విద్యార్ధికి మార్కులు తక్కువ వచ్చేట్లు చేయవలసిన అవసరం ఎవరికి ఏముంది? ఎంత ఆలోచించినా ఇది మాకు అర్ధంకాలేదు. అప్పటికి పోటీ స్కూల్స్ ని మాత్రమే చూడగలిగాము. అప్పటికే అక్కడ మాకు మంచి పేరువచ్చింది. దానికి తోడు మంచి ఫలితాలోస్తే, మా విద్యార్ధులకి మంచి మార్కులు వస్తే భవిష్యత్తులో ప్రమాదం అనుకుని ఉంటారని మేము అభిప్రాయపడ్డాము. ఇది జరిగేటప్పటికి మే 2004 వచ్చింది. అప్పుడే తెలుగుదేశం ఓడిపోయి, మేలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మేం మే 22 న అతణ్ణి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో వ్యక్తిగతంగా కలిసి, ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం మీద మేం చేసిన ఫిర్యాదు, దాని పర్యవసానంగా మాపై జరిగిన వేధింపు నేపధ్యంలో, 2001 మార్చిలో సి.ఎల్.పి. లీడర్ గా ఉన్న తనని కలిసిన విషయం గుర్తుచేసి, ప్రస్తుతం [అంటే2004] ఏడోతరగతి ఫలితాల విషయమై మావిద్యార్ధికి జరిగిన అన్యాయం గురించి వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాము. నేను సీ.ఎం.తో మాట్లాడటం మొదలుపెట్టి ఎంసెట్ విషయం చెప్పగానే అక్కడున్న పత్రికా రిపోర్టర్లు ఒక్కసారిగా నిశ్శబ్ధం అయ్యారు. రాజశేఖర్ రెడ్డి “నేను ఎంక్వయిరీ చేస్తానమ్మా!” అన్నాడు. మేం వెనుదిరిగి శ్రీశైలం వచ్చేసాము. ఆ తర్వాతి సంవత్సరం సైతం, మా ఏడో తరగతి విద్యార్ధులకి తక్కువ మార్కులు రావటంతో, ఇక మేం ఏడోతరగతి విద్యార్దులకి చెప్పటం మానుకున్నాం. అంటే మెల్లిగా ఎంసెట్, ఇంటర్ విద్యార్ధులకి చెప్పే లెక్చరర్ స్థాయి నుండి ఏడోతరగతి కూడా చెప్పలేని స్థితికి కుదించబడ్డాము. ఆరో తరగతి ప్రవేశానికి నవోదయ విద్యార్ధులకి శిక్షణ ఇచ్చాను. అక్కడా ఫలితాలు సాధించలేకపోయాము. దాంతో కేవలం నర్సరీ నుండి 5వ తరగతి వరకూ కుదించుకున్నాము.

అయితే మాదగ్గర చదువుకున్న చిన్నపిల్లల దగ్గర, ప్రభుత్వపరీక్షలతో నిమిత్తం లేకుండా, మార్పు, క్రమ శిక్షణ, చదువు వచ్చినతనం, కనిపించటంతో, మాకు, మా స్కూల్ కీ బాగా పేరు వచ్చింది. విద్యార్ధులూ పెరిగారు. ఓ రోజు ఏపీ ట్రాన్స్ కో ఎ.ఇ. మా స్కూలుకు వచ్చాడు. మేము సాదరంగా అహ్వానించాం. తన పేరు వివేకానంద అని పరిచయం చేసుకున్నాడు. ఇక మాస్కూలు గురించి వివరాలు అడగటం మొదలుపెట్టాడు. ఏక్లాసుకి ఎందరు విద్యార్ధులున్నారు, 10th క్లాసు విద్యార్ధులున్నారా అంటూ ఏవేవో పొంతన లేని ప్రశ్నలు వేస్తున్నాడు. నేను “సర్! మీకు ఏంకావాలి? ఏదైనా సూటిగా అడగండి” అన్నాను.

"ఇక్కడ మీరు స్కూల్ నడుపుతున్నరని మాకు information వచ్చింది. మీరిప్పుడు మాట్లాడినవన్నీ ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ చేశాను” అంటూ జేబులో పెట్టుకొచ్చిన చిన్న వాక్ మెన్ లాంటి సెట్ చూపించాడు. నాకు విషయం అర్ధం కాలేదు. మేం నడుపుతున్నది స్కూలే. జూదగృహమో మరేదో నేరగృహమో కాదు గదా! అయినా శాంతంగా “అయితే ఏమిటి చెప్పండి” అన్నాను. “అలాక్కాదు. మీ స్కూల్ కి పర్మిషన్ లేదు. ఎలా నడుపుతున్నారు?" అంటూ ప్రశ్నించాడు. నిజానికి అది ఏ విద్యాశాఖ అధికారులో అడగాలి. అదీగాక నిండా 25 మంది విద్యార్ధులు కూడా లేని స్కూల్ మాది [అప్పటికి అంతమందే]. అందునా అందులో సగంమంది జీరో క్లాసు పిల్లలే. వారికి చదువు చెప్పేందుకు ఏపర్మిషన్లు అఖర్లేదు. అయినా కరెంట్ డిపార్ట్ మెంట్ వారికి ఇవన్నీ ఎందుకు? అదే అడిగాను అతణ్ణి. అంతేగాక ఏదైనా administration గా proceed అవ్వమని చెప్పాను. దాంతో అతడు వెనక్కి తగ్గి “ఫణీధరప్రసాద్ వత్తిడి చేశాడమ్మా. ఈ టేప్ రికార్డర్ కూడా అతడిదే. అతడి బండి మీద తెచ్చి మీ సత్రం గేట్ ముందు దింపి పోయాడు. రోజూ మీస్కూల్ మీద కంప్లయింట్ చెయ్యమని నన్ను పోరు పెడుతున్నాడు” అన్నాడు. ‘ఏమని కంప్లయింట్ చెయ్యటం, ఎవరికి కంప్లయింట్ చేయటం’ మాకేమీ అర్ధంకాలేదు. మరోసారి వివరం అడిగినా, అతడు పైన చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి, “మీకు ఇకనుండి కరెంట్ ధర యూనిట్ 4/- రూ. పడుతుందండి” అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

ఈ ఫణీధర్ ప్రసాద్ అనే అతడు శ్రీశైలం దేవస్థానంలో 4th క్లాసు ఉద్యోగి. నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి సెక్రటరీ [అనుకుంటా] కూడాను. అతడి వరుసకి వదినగారికి [ఈవిడ ఇతడి రెండో భార్య] శ్రీశైలంలో ఓ స్కూలుంది. ఆవిడ పేరు మాధవి. ఆ పోటీ రీత్యా అతడు మామీద దృష్టి పెట్టాడనీ, అతడు చాలా పలుకుబడి ఉన్నవాడని తర్వాత వాళ్ళు, వీళ్ళు చెప్పగా తెలుసుకున్నాము. మేం శ్రీశైలం వచ్చేటప్పటికి వారి స్కూలు తెరచి ఒక సంవత్సరం అయ్యిందట. అయితే విద్యార్ధులంతగా రాలేదట. సరే, ‘ఇలాంటి పోటీలు ఎక్కడైనా ఉంటాయి’ అని మేం పెద్దగా పట్టించుకోలేదు. అదీగాక ప్రపంచం అంతచిన్నది కాదని, ఎవరి పనితీరుని బట్టి వారి కొచ్చే ఫలితం ఉంటుందనీ, మనం ఎంత తాపత్రయపడినా ఏదీ జరగాలో అది జరిగే తీరు తుందని మా అనుభవం, నమ్మకం కూడాను. దాంతో మాస్కూలు, మా విద్యార్ధులు, రాత్రికి ఓసారి గుడికి వెళ్ళి మల్లయ్య స్వామిని, భైరమ్మ తల్లిని దర్శించుకోవటం……. ఇలా రోజులు గడిపేస్తున్నాము.

నిజానికి శ్రీశైలం మాకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఆ కొండలు, లోయలు, నది, గుడి, నిరంతరం విన్పించే పంచాక్షరి! నిజంగా కైలాసం అన్నట్లుంటుంది మాకు. అయితే అక్కడ చాలామందిలో అది పవిత్ర పుణ్యక్షేత్రం అన్న ధ్యాస ఉండకపోవటం మేం చూశాము. ‘చేసిన పాపాలు తొలిగిపోవాలని పుణ్యక్షేత్రాలు దర్శిస్తారట. మరి పుణ్యక్షేత్రంలో ఉంటూ పాపం చేస్తే అది పోగొట్టుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి?’ – అన్న సూక్తి ఒకసారి గుడిలో పురాణ ప్రవచనంలో విన్నగుర్తు. ఎక్కడో చదివాను కూడా. అది గుర్తు చేసుకుని నేనూ, మావారు చర్చించుకునేవాళ్ళం. అయితే ఎవరితోనూ పెద్దగా ఏవీ అనేవాళ్ళం కాదు. ఎవరితో మాట్లాడినా విద్యార్ధులు, వాళ్ళ తీరు తెన్నులు గురించే. మహా అయితే సినిమాలు, వాతావరణం, భక్తుల గురించి, అక్కడి పరిస్థితుల గురించి ఇలాంటి పిచ్చాపాటి మాత్రమే. రాజకీయాలు గానీ, ఊళ్ళో పెద్దవాళ్ళ వ్యవహారాలుగానీ ఏవీ పట్టించుకునేవాళ్ళమూ కాదు, ఎవరితోనూ మాట్లాడేవాళ్ళమూ కాదు.

ఆ తరువాతి నెలలో మాకు కరెంట్ బిల్లు ఇస్తూ కేటగిరి 2 క్రింద యూనిట్ దరిదాపుగా 7/- రూ. ఛార్జి చేసారు. అదేమంటే మేం ఇంట్లో స్కూలు నడుపుతున్నామని, అది వ్యాపారం గనుక కేటగిరి రెండు క్రింద వేసామని చెప్పారు. ‘మీ ఎ.ఇ. మాది విద్యాసంస్ధ కాబట్టి యూనిట్ 4/- రూ. వేస్తానని అన్నాడు గదా’ అంటే సమాధానం లేదు. అప్పటికి మేం కొత్తగా ఇంటి సామాగ్రి Fridge, T.V., mixie [మిక్సీ] , Washing machine గట్రా కొన్నాము. అవేవీ స్కూల్ కి వాడము గదా, ఒక్క ఫ్యాన్, లైటే గదా అని అభ్యర్ధించినా వినలేదు. ఆ ఊళ్ళో ఇళ్ళల్లోనే బ్యూటీ పార్లర్లు నడుస్తాయి. కుట్టు మీషన్లకి మోటార్లు బిగించి టైలరింగ్ షాపులు నడుస్తాయి. మోటార్, మిక్సీ, రిపేరింగ్ షాపులు నడుస్తాయి. చిన్నపాటి బట్టలషాపులూ ఇళ్ళల్లోనే నడుస్తాయి. పైపెచ్చు మా స్కూల్ గాక మరో రెండుస్కూళ్ళు కూడా ఇళ్ళలోనే అంటే దేవస్థానం allot చేసిన cottage లోనే నడుస్తాయి. వాళ్ళందరకీ వెయ్యని కేటగిరి రెండు మాకే ఎందుకు వేస్తున్నారని అడిగితే “మా ఎ.ఇ. గారితో పెట్టుకున్నారు మరి!” అన్న సమాధానం వచ్చింది. అతడితో మేమేం తగాదా పెట్టుకున్నామో అతడికే తెలియాలి.[తర్వాత్తర్వాత వేధించడానికి అదో పైకారణం అని అర్ధమయ్యింది.] దాంతో మాకు యూనిట్ ధర దరిదాపుగా 7/-రూ. కట్టక తప్పలేదు. అదీ కూడా బిల్లు చివరి తేదిన ఇచ్చి, ఆత్మకూరులో కట్టి రావాల్సిందిగా చెప్పారు. లేదంటే కనెక్షన్ కట్ చేస్తాము అని చెప్పారు. అప్పటికప్పుడు 115 కిలో మీటర్ల దూరంలోని ఆత్మకూరు వెళ్ళి ఆరోజు శనివారం గనుక 12 గంటలకే ఆఫీసు మూసేస్తారని తెలిసింది. ఇక చేసేది లేక కనెక్షన్ కట్ చేస్తే చేసుకోమన్నాం. సోమవారం మళ్ళా వెళ్ళి బిల్లు కట్టి వచ్చాం.

అప్పటికి మేం చల్లా వెంకయ్య సత్రంలోకి మారి సంవత్సరం దాటింది. ఆ పూజారికి గది అవసరమనీ, ఖాళీ చెయ్యమని అడగటం మొదలు పెట్టారు. మేం దేవస్థానానికి ఒకగది ఎలాట్ చెయ్యవలసిందిగా పెట్టుకున్న requisition కదలటం లేదు. తెలిసిన వారిద్వారా, మా విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా ప్రయత్నించసాగాము. ఈ.వో. డ్రైవర్ కుమారుడు 7th తర్వాత మా స్కూల్ మానేసి శ్రీశైలం ప్రాజెక్ట్ లోని డి.ఏ.వి. స్కూల్లో చేరాడు. కొన్నాళ్ళు ట్యూషన్ కి వచ్చాడు. తర్వాత టైమింగ్స్ కుదరటం లేదని మానేసాడు. ఆపిల్లవాడి అక్క కూడా మానేసింది. ఈ అమ్మాయి శ్రీశైలంలోనే పరిషత్ స్కూల్లో చదివేది. అయితే ఈ.వో. డ్రైవర్ తోనూ, అతడి భార్య తోనూ మాకు మంచి స్నేహమే ఉన్నకారణంగా, మేము వారి ఇంటికి రాకపోకలు మానేయలేదు. ఓరోజు అతడు “నేను మీతో స్నేహంగా ఉంటున్నానని ఫణీధర ప్రసాదుకి చాలా కోపంగా ఉంది. మీకు తెలుసు గదా అతడిప్పుడు రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా ఉన్నాడు. మీకు పూజారి శ్రీధర్ నాధ్ గది ఇప్పించానన్న కోపంతోనూ, మీతో స్నేహంగా ఉంటున్నాను అన్న కోపంతోనూ నాకు షాపు పెట్టుకోవటానికి టెండర్ రాకుండా అడ్డంపడ్డాడు. దాంతో నాకు సంవత్సరానికి 25,000/-రూ. నష్టం వచ్చినట్లే” అన్నాడు. అది మాకు చాలా బాధనిపించింది. ‘సరే మనమూలంగా అతడెందుకు నష్టపోవాలి. బహుశః అందుకే avoid చేస్తున్నాడు కాబోలు’ అనుకొని మేం కూడా రాకపోకలు ఆపేసాము.

ఈ దశలో గది ఖాళీ చేయమన్న ఒత్తిడి పెరిగింది. సరిగ్గా అప్పుడు మరొక విద్యార్ధి తల్లిదండ్రులు బాగాపట్టుబట్టి మాకు గది ఎలాట్ చేయించారు. వీరి కుటుంబంతో మాకు వ్యక్తిగత స్నేహం కూడా ఉండేది. ముఖ్యంగా మా విద్యార్ధి [ఈ బుజ్జిగాడు మా దగ్గర అప్పటికి జీరో క్లాసుల్లో చదువుతున్నాడు.] తల్లి రాధిక బాగా శ్రమ తీసుకుంది. మూడునెలల పాటు మా ఫైలు పుచ్చుకొని ఈ.వో. చుట్టు, డి.ఈ.వో. చుట్టు తిరిగిందని తర్వాత మాకు చాలా మంది దేవస్థాన ఉద్యోగులు చెప్పారు. రాధిక పట్ల మాకు చాలా కృతఙ్ఞత కలిగింది. విచారం ఏమిటంటే ఆమె ఆ తర్వాత మూడేళ్ళకి కేన్సర్ తో మరణించింది.

మాకు ఎలాట్ అయిన రూం నెం.10 లోకి మారితే అక్కడి మీటర్ పాడైపోయిందనీ మాకు చైనా మీటర్ వేసారు. అంతేగాక ఆ ఎ.ఇ. రూం నెం.18 మీటర్ నంబరు మీద బిల్లు ఇచ్చాడు. కరెంట్ మీటర్ సర్వీసు నెంబరు, ప్రదేశానికి [Premises] సంబంధించి ఉంటుందా లేక ఆ ప్రదేశంలో నివసించే వ్యక్తికి[resident] సంబంధించి ఉంటుందా అని వ్రాతపూర్వకంగా నిలదీస్తే గానీ, మాకు రూం నెం.10 కి గల మీటర్ నంబరుతో బిల్లు ఇవ్వలేదు. శ్రీశైలంలో ఉన్నన్ని రోజులూ యూనిట్ ధర దరిదాపుగా 7/- రూ. కట్టాము. మామూలుగా అయితే యూనిట్ ధర దరిదాపుగా 1.50 నుండి 3/- మాత్రమే.

రాధిక గారి భర్త ఈ.వో.కి సి.సి.గా పనిచేస్తుండగా కూడా, మాకు రూమ్ ఎలాట్ చేయించటానికి వారిద్దరూ చాలా ప్రయత్నం చేయవలసివచ్చింది. రాధిక తల్లిగారితో మాకు మంచి స్నేహసంబంధాలుండేవి. ఆవిడని మేం ఆంటీ అని పిలిచేవాళ్ళం. మా పాప ఆవిడని అమ్మమ్మ అనేది. ఆవిడా మమ్మల్ని పెద్దదిక్కులాగానే ఆదరించేది. ఆ కుటుంబపు మద్దతుతో ఎలాగైతేనేం మాకు గది ఎలాట్ అయ్యింది. అయితే ఆదే చల్లా వెంకయ్య సత్రంలోని మొదటి అంతస్థులోని రూం నెంబరు 10 కావటంతో మాకు 18 కీ 10 కి తేడా లేకపోయింది. ఏది ఏమైనా మనకంటూ ఎలాట్ అయిన గది గనుక మేమెంతో సంతోషించాము. ఆ సత్రంలో క్రింది అంతస్థులో [గ్రౌండ్ ప్లోరు] 9 గదులు, మొదటి అంతస్థులో 9 గదులు ఉండేవి. మాది ఒక చివరగా ఉన్నగది. ఇరుగుపొరుగులంతా మాతో చాలా సఖ్యంగా, స్నేహంగా ఉండేవాళ్ళు.

మా పద్దతి ‘సెమీ రెసిడెన్షియల్’ అన్నట్లుగా ఉండేది. ఉదయం 6 నుండి 7:30AM దాకా స్టడీ పిరియడ్ నిర్వహించేవాళ్ళం. మళ్ళీ 9:30 నుండి 12:30 దాకా క్లాసులు. 12:30 నుండి 1:30 దాకా లంచ్ బ్రేక్. 1:30 నుండి 2 దాకా ఒరల్ డ్రిల్ క్లాస్. [టేబుల్స్ గానీ, హిందీ వర్ణమాల గానీ, జి.కె. గానీ వల్లెవేసేవారు.] 2 నుండి 4PM దాకా క్లాసులు. మళ్ళీ 5:30 నుండి 7PM వరకూ స్టడీ పీరియడ్ నడిచేది. 7 నుండి 7:30 వరకూ టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ గానీ, రైమ్స్ గానీ, తెలుగు రైమ్స్ గానీ, తెలుగు కథలు గానీ సి.డి.లు వేసేవాళ్ళం. ఆరోజు వర్కు మొత్తం అయిన వాళ్ళకే అనుమతి ఉండేది. నాలుగు గంటలకి పిల్లల్ని ఇంటికి పంపిస్తే, వాళ్ళు అరగంటలో తిరిగి వచ్చేసేవాళ్ళు. 4:30PM నుండి 5:30 దాకా ఆడుకునేందుకు వాలీబాల్, క్రికెట్ కిట్టు గట్రా ఉండేవి. స్కూలు అంటే వాళ్ళకది చక్కని ఙ్ఞాపకంగా ఉండాలన్నది మా లక్ష్యం.

ఎందుకంటే – నేను గుంటూరులో స్టాల్ గాళ్స్ హైస్కూల్ లో చదువుకున్నాను. 2000 మంది పిల్లలతో, 200 మంది టీచర్లతో, విశాలమైన [ఎకరాల కొద్దీ స్థలం ఉండేది] ప్రాంగణం లో ఉన్న స్కూలు మాది. అది నాకు అమ్మఒడి లాంటిదే. మనకి స్వాతంత్రం రాక పూర్వం స్థాపించబడిన స్కూలు. తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసి, దాని మీద అభిరుచిని నేర్పిన మా ఎలిజబెత్ టీచర్, తోటివారిని ప్రేమించడం నేర్పిన రాజేశ్వరి మాధ్యుస్, క్రమశిక్షణ నేర్పిన ఫ్లారెన్స్ ప్రకాశం, ఆల్ జీబ్రా నేర్పిన విమల నందిని, విజయ భారతి….. ఏ పంతులమ్మని మరిచిపోగలను? చివరికి, ఆడపిల్ల బయట, రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా సుద్ధులు నేర్పిన సావిత్రి టీచర్, వసంతకుమారి టీచర్! మా తెలుగు టీచర్ ఎలిజబెత్ గారు క్రిస్టియన్ అయినా హిందూ పురాణాలని విడమరిచి చెప్పి, వాటి నుండి ఎలా నీతిని గ్రహించాలో నేర్పింది. బైబిలు కథలూ చెప్పేవాళ్ళు. ప్రతీరోజూ ప్రార్ధనలో ఓ కథ చెప్పటం అక్కడ సాంప్రదాయంగా ఉండేది. చిన్నప్పుడు నేను చదువుకున్న స్టాల్ గళ్స్ పాఠశాల గురించి వ్రాసుకోవాలంటే ఏకంగా ఓ చక్కని పుస్తకమే వ్రాసుకోవచ్చు. చరిత్ర – రాజకీయం, డాన్సులు, డ్రామాలు, ఎన్ని నేర్పారో! మాకు ప్రతీరోజూ సాయంత్రం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉండేది. సోమవారం తెలుగు లిటరరీ అసోసియేషన్ ప్రోగ్రాం, మంగళ ఇంగ్లీషు, బుధ హిందీ, గురువారం, శుక్రవారం ఎక్సర్ సైజులు చేయించేవారు. తర్వాత మళ్ళీ గేమ్సు పీరియడ్ ఉండేది. ఇవిగాక ప్రతీరోజూ లైబ్రరీ పిరియడ్, కుట్టు క్లాస్, డ్రాయింగ్, సంగీతం క్లాసుల్లో ఏదో ఒకటి ఉండేది. మాక్ పార్లమెంట్ నడిచేది. నేనెప్పుడు ప్రతిపక్షనాయకురాలిని. టీచర్స్ డే [సెప్టెంబరు 5] రోజు మేం టీచర్ల సాయం లేకుండా మా అంతట మేం నేర్చుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. ఎవరి క్లాసు విద్యార్ధులు గొప్పగా ప్రోగ్రాం ఇస్తే, ఆ టీచర్ కి అది అంత గొప్పగా ఉండేది. మా టీచర్ ని గెలిపించాలని, గొప్ప అన్పించాలి అన్న లక్ష్యంతో పోటాపోటీగా, రహస్యంగా నేర్చుకుని మరీ చేసేవాళ్ళం. ఆ రోజు ఉదయం గురు పూజ నిర్వహించేవాళ్ళం. ఎక్కడా డబ్బు ప్రసక్తీ లేదు. పువ్వులూ, పళ్ళు తప్ప బహుమతుల ఆర్భాటం పెద్దగా ఉండేది కాదు.

అలాగే బాలల దినోత్సవం నవంబరు 14 నాడు, టీచర్స్ మాకోసం సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎంతో ఎంగ్జయిటింగ్ గా ఉండేది. మాకోసం మా టీచర్స్ పాటలు పాడటం, వేషం వేసుకొని డ్రామాలు వేయటం, మాకెంతో ఉత్కంఠగా, ఉత్సాహంగా ఉండేది. ఓసారి బాలల దినోత్సవం రోజుకైతే మాడ్రిల్లు టీచర్స్ నలుగురు కలిసి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో ‘అదిరే…. అదిరే….’ అన్నపాటలో ప్రభుదేవా చిత్రించినట్లు ఆవు వేషం వేసి నాట్యం చేసారు. అది మమ్మల్ని ఎంతగా ఉత్తేజపరిచిందో!

అలాగే స్కూల్ డే రోజు మాచేత ఎన్నో కార్యక్రమాలు చేయించేవాళ్ళు. సైన్స్ ఫెయిర్, ఆటలపోటీలు, వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిత్యం స్కూలులో ఓ ఉత్సవం లా ఉండేది. మాకు మంచి లైబ్రరీ ఉండేది. చాలా పెద్ద ఆటస్థలాలు, valley ball, Basket ball కోర్టులు ఉండేవి. ఇక చదువు విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. అంత నాణ్యమైన, క్రమశిక్షణాయుతమైన చదువు ఉండేది. వీటన్నింటితో స్కూలు జీవితం నా జీవితంలో ఓ అపురూపమైన అధ్యాయం. అది నాకు అద్భుతమైన వరం. తీయని ఙ్ఞాపకం. అందులో కొసమెరుపు ఏమిటంటే సంవత్సరానికి 9/-రూ. నుండి 18/- రూ. ఫీజుతో మేమివన్నీ పొందాము.

అదంతా ఇప్పుడు మా స్కూలు విద్యార్ధులకి ఉండాలన్నది మా ఆకాంక్ష. చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు లోలాగా 2000 మంది విద్యార్ధులు, 200 మంది పంతులమ్మలు, విశాలమైన ప్రాంగణం లేకపోయినా, మాకు సాధ్యమైనంతగా ఇప్పటి మా విద్యార్ధులూ, నా పాపా కూడా, చిన్నప్పుడు నాకు తెలిసిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో మా గీతా పబ్లిక్ స్కూలులో కూడా ప్రతీరోజూ చదువుతోపాటు ఓ ప్రత్యేక కార్యక్రమం ఉండేటట్లుగా ప్రణాళిక వేసి అమలు చేసాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

>> శ్రీశైలంలో ఉన్నన్ని రోజులూ యూనిట్ ధర దరిదాపుగా 7/- రూ. కట్టాము.

ఆదిలక్ష్మి గారు, అంటే మీరిప్పుడు శ్రీశైలం లో లేరా? Story Suspense thriller సినిమా లాగుంది. త్వరగా చెప్పండి ఉత్కంఠత భరించలేకున్నాము.

మీ కష్టాలను తక్కువచేసి మాట్లాడటము లేదని గమనించగలరు.

ఒక్కసారి మా స్కూల్ ని గుర్తు చేసారు.. నేను చదివింది నిర్మలా స్కూల్.. మీ స్కూల్ లో ఉన్నవన్నీ మాకు కూడా ఉన్నాయి.. నిజంగా అలాంటి స్కూల్ లో చదవగలగడం అదృష్టం.. ఇప్పటి పిల్లలకి, ఇవన్నీ ఏమీ తెలియకుండానే,ఏవేవో సాధిస్తున్నాము అనే భ్రమలో ఉండిపోతున్నారు..!

భాస్కర రామి రెడ్డి,
మమ్మల్ని శ్రీశైలం నుండి వెళ్ళగొట్టి రెండు సంవత్సరాలౌతుంది.

మేధ గారు,
అవునండీ, మీరన్నది నిజమే!

చిన్నప్పటి స్కూలు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. మా స్కూలు చిన్నదే కానీ బాగుండేది. పిల్లలంతా కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడెవరెక్కడున్నారో కూడా తెలియదు.

Madam,

Then where are you now? How is your financial status? How is your family.

Rgds,

This comment has been removed by the author.

శ్రీకర్ గారు,

మీ వ్యాఖ్యని నేను Remove చేయలేదు. అది Remove ఎలాగయ్యిందో నాకు అర్ధం కావటం లేదు.

శ్రీకర్ గారు,

ప్రస్తుత నివాసం నంద్యాల. మిగిలిన వివరాలు తరువాత టపాలో చెబుతాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu