మాపై జరిగిన వేధింపు, గొడవలు వీలయినంత వరకు భరించాం. ఇక సాధ్యం కాదు అనుకున్నవాటినే ఫిర్యాదులలోకి ఎక్కించాం. ఆ ఫిర్యాదులలోని విషయాలని టూకీగా ఇప్పుడు వివరిస్తున్నాను.

సూర్యాపేటలో మామీద జరిగిన వ్యవస్థీకృత వేధింపు ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే ఎటు నుండీ ఏ సహాయమూ వచ్చేదికాదు. మా ఇంటి యాజమానురాలు మా పాలవాడిని కూడా మేడమీదకి రానివ్వకుండా తరిమివేసేది. అప్పటికి మా పాపకి అయిదేళ్ళు నిండి ఆరు నడుస్తోంది. మేం SEB వాళ్ళతో పడుతున్న గొడవలు గాక ఇంటి ఓనర్ కరెంటు బోర్డు మీద నుండి fuse తీసుకొని వెళ్ళిపోయేది. ఈ గొడవల్లో ఫిర్యాదులు కొరియర్ లో వేసినా తస్కరింపబడేవి. ఈ విషయమై అనుమానించి, వివరాలు సేకరించి మరీ ఫిర్యాదు చేయవలసి వచ్చింది. Received receipt ఇవ్వమంటే ANL Curriers శాఖ వారు concern clerk తిరుపతి పోయాడనీ, 15 రోజుల వరకూ రాడనీ, అతడికి తప్ప ఇతరులకి వివరాలు తెలియవనీ, ప్రైవేటు సంస్థ కూడా రెడ్ టేపిజం చూపింది. [ఇది ఇక్కడితో అయిపోలేదు. చాలా సార్లు కేవలం కొరియర్ లేదా రిజిస్టర్/ స్పీడ్ పోస్టులో ఫిర్యాదు పంపడానికి వేరే వూరు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే లోకల్ గ్రిప్ తో ఫిర్యాదు తస్కరిస్తారన్నది అనుమానం, అనుభవం కూడా.] ఈ నేపధ్యంలో నవంబరు 15, 2000 న మా ఐఐటి బేసిక్స్ విద్యార్ధులందరూ ఒక్కసారిగా క్లాసులకు రావటం మానేసారు. ఆ ముందురోజు సాయంత్రం క్లాసు మేము మిస్ చేసి నల్గొండ [సూర్యాపేట నుండి దాదాపు 30 కిలోమీటర్లుపైనే దూరం ఉంటుంది.] ఎస్.పి.కి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాము. ఇది కారణంగా చూపెడుతూ రంజిత్ రెడ్డి అనే 9 వ తరగతి విద్యార్ధి తండ్రి వచ్చి, "ఇలా మీరు చెప్పాపెట్టకుండా సెలవు పెట్టి ఊళ్ళకు వెళ్తే మా పిల్లల చదువు ఏంకావాలి? అదీగాక అందరూ మానేసారు. కాబట్టి మేమూ మానేస్తాం. మా ఫీజు వాపసు చెయ్యండి” అని అడిగాడు. ఇలాగే మీకు కరెంటు కూడా సరిగా ఉండటం లేదు. ఇక క్లాసులెలా తీసుకుంటారని మరికొందరు ఎంసెట్ విద్యార్ధుల తల్లితండ్రులు అన్నారు. మేము సదరు విద్యార్ధి రంజిత్ రెడ్డి తల్లికి ఫీజు వాపసు చేసి, అదేవిషయం రసీదు వ్రాయించుకున్నాము. ఈ వివరాలన్నింటితో నల్గొండ ఎస్.పి.ని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించాము. దాదాపు మద్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకూ వేచి ఉండవలసి వచ్చింది. గంట ఆగండి, అరగంట ఆగండి అంటూ కూర్చోబెట్టారు. ఉదయం అల్పాహారం తప్ప మా పాపకి సైతం ఆరోజు భోజనం లేదు. మంచి నీళ్ళతో కడుపు నింపాము. చివరికి సాయంత్రం మేము అక్కడ ఉన్న సి.సి.సెల్ యస్.ఐ. ని వత్తిడి చేస్తే, అప్పడు ముందు సి.ఐ., యస్.ఐ.ల మీద కేసు రిజిస్టర్ చేసాడు. రాత్రి 8 గంటలకు ఎ.ఎస్.పి. శివానందరెడ్డిని కలవాల్సిందని ఎస్.పి.శివధర్ రెడ్డి సూచించాడని అతడి వ్యక్తిగత కార్యదర్శి చెప్పాడు. అప్పటివరకూ వేచిఉన్న అలసటతోనే వెళ్ళి ఎ.ఎస్.పి.శివానందరెడ్డిని అతడి కార్యాలయంలోనే కలవటానికి ప్రయత్నించాము. అతను మమ్మల్ని కలవటానికి ఒప్పుకోలేదు. మళ్ళీ యస్.పి.ని కలవగా యస్.పి. శివధర్ రెడ్డి మాకు “పోనీ మీ ఇంటి ఓనర్ మీద consumer forumకి వెళ్ళండి” అని సలహా ఇచ్చాడు. నేను “ సర్! నేను పెట్టిందే ఇంటి ఓనర్ వెనుక త్రివేణి కాలేజీ వాళ్ళు ఉండి మమ్మల్ని organized గా వేధిస్తున్నారని. అలాంటిది అందులో భాగమైన ఇంటి ఓనర్ కేసుని విడదీసి consumer forum లో వేయటమంటే కేసుని బలహీనపరుచుకోవటమే గదా?” అన్నాను. దానికతడు “చూడండమ్మా. నేను IPS కు సెలక్ట్ అవ్వకముందు లాయర్ గా కొన్నాళ్ళు ప్రాక్టీసు కూడా చేసాను. ఆ అనుభవంతో, ఒకశ్రేయోభిలాషిగా చెబుతున్నాను. మీకు స్థానికంగా ఎవరైనా పెద్దమనుష్యులు తెలిస్తే, అక్కడ ఈ కేసుపరిష్కరించుకొండి” అని చెప్పాడు.

అయినా మేము ఎవరిదగ్గరికీ వెళ్ళలేదు. మళ్ళీ యస్.పి.నే కలిసేందుకే ప్రయత్నించాం. ఈ నేపధ్యంలో [Jan.05, 2001] ఎ.యస్.పి.శివనందరెడ్డిని కలవమని యస్.పి. సలహా ఇచ్చాడు. ఎ.యస్.పి. నాటకీయంగా “నేను మీ మాటనే ఎందుకు నమ్మాలి? ఏమీ, మీరు మీ ఇంటి ఓనర్స్ ని వేధిస్తుండవచ్చు గదా?" అంటూ ప్రశ్నించాడు. మేమే వేధిస్తూ, మేమే వచ్చి ఫిర్యాదు చేయడమేమిటో, ఎలాగో… మాకు అర్ధం కాలేదు, మేం మావాదన చెప్పేలోగానే అతడు ఫోన్ అందుకుని సూర్యాపేట సి.ఐ.ని అడిగాడు. “అతడు మేం ఎంక్వయిరీ చేశాం సార్. అది కేవలం ప్రొఫెషనల్ జలసీ” అని చెప్పాడు. వెంటనే ఎ.యస్.పి., ఫోన్ లోనే సి.ఐ.కి “ఈ లెక్చరర్ ఆదిలక్ష్మి అన్న ఆవిడ ఏదైనా తప్పు చేసుంటే కేసు బుక్ చెయ్యండి” అంటూ చెప్పాడు. నిజానికి అదంతా సహించడానికి చాలానే కష్టపడ్డాము. కోపాన్ని నియంత్రించుకుంటూ, కూల్ గా “Well Sir ! I got it. Thank you very much” అని చెప్పి కుర్చోలోంచి లేచాము. అతడు ఓ క్షణం ఏదీ అర్ధంకానట్లు అయోమయంగా చూస్తూ “మరి ఈ complaint ఏం చెయ్యాలి?" అనిఅడిగాడు. “You can use it as you like” అన్నాను. ‘బహుశః ప్రైవేటు కాలేజీల యాజమాన్యం, త్రివేణి కాలేజీ వారు ఎంసెట్ ర్యాంకులు అమ్మిన సొమ్ములో భారీ భాగం యస్.పి.కీ, ఎ.యస్.పి.లకీ ఇతర అధికారులకీ ఇచ్చి ఉంటారు’ అనుకున్నాము. ఇక చేసేది లేక నిస్సహాయంగా వారంరోజులు గడిపాము. ఈవత్తిడిలో మాపాపను స్కూలుకు పంపటం మానేసాము. అప్పటికే నేను ఎంసెట్ ఫిజిక్స్ సూత్రాలు, short cuts తో ఒక పుస్తకం వ్రాసాను. అది పబ్లిష్ చేశాము. మార్కెటింగ్ కోసం మా వారు మమ్మల్ని వంటరిగా వదలివెళ్ళడానికి సెక్యూర్డ్ గా అన్పించలేదు. ఆ సంవత్సరం బిజినెస్ చెయ్యకుండా అలా గడిచిపోయింది.

ఈ పరిస్థితుల్లో, ఆలోచించి చివరికి ఆ ఊళ్ళో పెద్దమనిషిగా పేరున్న మీలా సత్యనారాయణ అనే స్థానిక రాజకీయనాయకుణ్ణి కలిసాము. ఇతడు అక్కడ ప్రముఖ పారిశ్రామిక వేత్త. కోటిశ్వరుడుగా పేరుంది. సుధా పి.వి.సి.పైపులు, బ్యాంకు, స్కూలు ఇంకా ఇతర వ్యాపారసంస్థలున్నాయి. అతడు ఒక వర్గానికి నాయకుడు. కాని ఊరిమొత్తంమీద అతడిదే ఆర్ధికంగా పైచేయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి తిరుగుబాటు అభ్యర్ధిని నిలబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించగల సత్తా ఉన్నవ్యక్తి. ఇతడి సహకారంతోనే అప్పటి సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏ. దోసపాటి గోపాల్ గెలిచాడు. అయితే సదరు దోసపాటి గోపాల్ కి ఎమ్.ఎల్.ఏ. అయిన తర్వాత స్థానిక కాలేజీల వారు బాగా దగ్గరయ్యారు. ఇంటర్ పేపర్ లీకులకు వచ్చేది, విద్యార్ధుల స్కాలర్ షిప్పుల సొమ్మే. అయితే ఎంసెట్ ర్యాంకుల అమ్మకంతో భారీగానే సొమ్ము చేరటంతో స్థానిక ఆర్.కె.ఎల్.కె. కాలేజీ అధినేత తదుపరి సూర్యాపేట మునిసిపాలిటి ఛైర్మన్ పదవికి పోటిలో నిలబడ్డాడు. అప్పటికి ఆ మునిసిపాలిటి బి.జే.పి. కైవసంలో ఉంది. జుట్టుకొండ సత్యనారాయణ ఛైర్మన్ గా ఉండేవాడు. 2000 లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, [అప్పటికి కనీసం కాంగ్రెస్ సభ్యత్వం లేకపోయినా] ఆర్.కె.ఎల్.కె. కాలేజీ అధిపతికి ఎమ్.ఎల్.ఏ. దోసపాటి గోపాల్ అధికారిక పత్రాన్ని సంపాదించిపెట్టాడు. దాంతో మీలా సత్యనారాయణ కర్పూరపు నిరంజన్ అనీ ఆర్.యం.పి. డాక్టర్ ని [తిరుగుబాటు] స్వతంత్ర అభ్యర్ధిగా నిలబెట్టాడు. నిరంజన్ గారు మాకు వ్యక్తిగతంగా తెలుసు. వైద్య సహాయం కోసం మేం ఆయన్నే సంప్రదించేవాళ్ళం. హస్తవాసి మంచిదిగా, మంచివ్యక్తిగా ఆయనకి ఆఊళ్ళో పేరుంది. ఆయన తండ్రి కూడా ఇలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నాడట. చాలా ఏళ్ళ క్రితం సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేసాడట. అప్పటికి అతడు కీర్తిశేషుడు. నిరంజన్ గారు లయన్స్ క్లబ్ వారి ఆసుపత్రిలో పేదలకి ఉచిత వైద్యం చేయటం, తన డిస్పెన్సరీ లో కూడా పేదలకి ఉచితంగా మందులివ్వటం మేం స్వయంగా చూశాము. ఈ నేపధ్యంలోని వివరాలలో కొన్ని స్వయంగా ఆయన చెప్పినవే. నిరంజన్ గారు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయగా, స్వల్పమెజారిటీ తో భా.జ.పా. అభ్యర్ధిగెలుపొందాడు. అతడికీ, అతడి సమీప అభ్యర్ధి నిరంజన్ గారికి చాలా తక్కువ [వెయ్యిలోపలే అన్నట్లు గుర్తు] ఓట్లు తేడా వచ్చింది. అలాగాక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవాడని స్థానికులు, స్థానిక సిటీకేబుల్ వార్తాలలో విశ్లేషించారు. ఈ సిటికేబుల్ అధినేత ఉప్పల. రాజేంద్రప్రసాద్ మాకు బాగా పరిచయమే. వాళ్ళ అబ్బాయి విజయవాడలో చదివేవాడు. ఫిజిక్స్ లో ఎంసెట్ ఛాప్టర్లు చెప్పమని సెలవులకి వచ్చినప్పుడు అడగగా, వారి అభ్యర్ధన కాదన లేక చెప్పాను. ఆ సందర్భంలో ఆయన మా ఇంటికి వచ్చి, మా ఇంటి ఓనర్ గురించి, "ఇదే మొదటిసారి ఈ ఇంటికి రావటం. మీ ఇంటి ఓనర్, ఆమె అత్త ఒకప్పుడు మా ఇంట్లో పనిచేసేవారు” అన్నాడు. మేం ఉన్న ఇల్లు చాలా పెద్దది. రెండతస్థుల మేడ. అలాంటి ఇంటి యజమానురాలు ఒకప్పుడు పాచిపని చేసిందంటే నాకు నమ్మశక్యంగాక వివరంగా అడిగాను. ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఆమె, ఆమె అత్త తమ ఇంట్లో పాచిపని చేసారని, ఓ అయిదారేళ్ళ క్రితం ఈ ఇల్లు కట్టారని చెప్పాడు. అతడికి మర్యాదాపూర్యకంగా వీడ్కొలు ఇస్తూ మెట్లదాకా వచ్చాము మేము. అతడు మా ఇంటి యజమానురాలిని ‘పెద్ద ఇల్లే కట్టావే’ అంటూ పలకరించాడు. ఆవిడ ’ఆ. అవును” అంటూ గొణిగింది. అప్పటికే ఆవిడ భర్త రత్నం గబగబా లోపలి గదిలోకి తప్పుకున్నాడు. అప్పట్లో అది మేము పెద్దగా పట్టించుకోలేదు. అయితే మా మధ్య వివాదం ముదిరినప్పుడు ఇవన్నీ స్పురణకువచ్చాయి. అదీగాక మా ఇంటి ఆవరణలో చిన్నగుడి ఉండేది. అందులో ఉప్పలమ్మ అని గ్రామదేవత ఉండేది. సూర్యాపేటలో శ్రావణ మాసంలో గ్రామదేవత ముత్యాలమ్మతల్లికీ, ఇతరగ్రామదేవతలకీ బలులు ఇవ్వటం రివాజు. ఒకసారి ఇంటిలోని గ్రామదేవత ఉప్పలమ్మకి టెంకాయ కొట్టబోగా మా ఇంటి ఓనర్ పరిగెత్తుకొనివచ్చి, "కోణ్ణి బలిస్తున్నారా?" అంది. “లేదాంటీ! కొబ్బరి కాయకొడుతున్నాం” అన్నాను. ఆవిడ “ఈ తల్లీ పాల ఉప్పలమ్మ. టెంకాయ, పళ్ళు, పొంగలి పెట్టాలిగాని, కోళ్ళని బలులివ్వకుండదు. మీకు తెలియక బలులిస్తారేమో అని చెప్తున్నాను” అంది. “అలాగే అంటీ” అని చెప్పాను. మా ఇంటి ఓనర్ ‘పద్మశాలి’ కులస్థులు. మాంసం తింటారు. స్యయంగా చికెన్ కొట్టు నడుపుతారు. వారింటి దేవత పాల ఉప్పలమ్మ ఏమిటి అనుకున్నాగానీ పట్టించుకోలేదు. అయితే ఉప్పల రాజేంద్రప్రసాద్ చెప్పిన సమాచారం గుర్తుకువచ్చి విచారించగా చాలా ఏళ్ళ క్రితం మా ఇంటి ఓనర్ [ఆవిడ చాలా అందంగా ఉంటుంది. 55 ఏళ్ళ వయస్సులో కూడా తెల్లగా చూడచక్కని మనిషి.] ఉప్పల రాజేంద్రప్రసాద్ గారి తండ్రిగారి ఇంట పాచిపని చేసిందనీ, ఏదో వివాదం [?] జరిగి, అతణ్ణి బ్లాక్ మెయిల్ చేసి పొలం వ్రాయించుకుందనీ, అది అమ్మి ఇల్లు కట్టిందనీ తెలిసింది. “పొలంలోని ఉప్పలమ్మతల్లిని పొలం అమ్మేటప్పుడు ఇంటికి తెచ్చి గుడికట్టుకున్నాం” అని మా ఇంటావిడ చెప్పటం నాకు తెలుసు. దాంతో వ్యవహారం కొంత అర్ధమయ్యింది. అయితే ఇంట్లో అద్దెకు దిగేటప్పుడు ఈ వివరాలన్నీ ఎవరం, ఎవర్నీ అడగం కదా! అడిగినా ఎవరూ చెప్పరు. అయినా ఎవరిగొడవ ఎవరికి ఎందుకు పడుతుంది? ‘మనం అద్దె ఇస్తాం. వాళ్ళు ఇల్లు అద్దెకి ఇస్తారు. ఇంతేగదా!’ అనుకుంటాం. ఏదయినా వివాదం జరిగినప్పుడు కదా ఎవరు ఎటువంటి వారో అన్న ప్రశ్న వస్తుంది?

ఈ నేపధ్యంలో ఓ రోజావిడ టైర్ రిబటన్ షాపు ఓనర్ [స్కూటర్లు, కార్లు, లారీలకు గాలి పెట్టడం, పంచర్లు వేయటం లాంటివి చేస్తారు], మరిఇద్దరు పనిమనుష్యుల్ని[మా ఇంటి ఓనర్ దృష్టిలో వాళ్ళలో ఒకరు ట్రాక్టర్ ఓనర్, ఒకరు మహిళా మండలి తాలుకూ] తీసికొచ్చి వాళ్ళు తన తరుపు పెద్దమనుష్యులనీ, యస్.పి.తమకి ఏదో కాగితం వ్రాసి ఇచ్చాడనీ, తక్షణం ఇల్లు ఖాళీ చేసి, ఆమె మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలనీ డిమాండ్ చేసింది. అప్పటికి కేసు విషయమై మీలా సత్యనారాయణని కలిసాము. దాంతో అక్కడికే వెళ్థాం పదమన్నాం. ఆ వచ్చిన రిబటన్ షాపు ఓనర్, పనిమనుష్యులు, వెంటనే వెళ్ళిపోయారు. అయితే మా ఇంటి ఓనర్ మా మెట్ల మీద కూర్చొని సరిగ్గా గంటపాటు మా అమ్మనాన్నలని, మా వారి అమ్మానాన్నలని బండబూతులు తిట్టింది. మాకు మా తల్లితండ్రులంటే చాలా గౌరవం. చాలా కోపం, దుఃఖం , బాధ కలిగాయి. నిజానికి మేం 1993 నుండి 1995 వరకూ దాదాపు రెండు సంవత్సరాలకుపైగా శ్రీశైలంలో గుడిసెలో ఉన్నాము. అక్కడి బెస్తవాళ్ళు [వాళ్ళే పర్యాటకులకు గైడ్లు కూడా] తమలో తాము బండబూతులు తిట్టుకునేవారు, కొట్టుకునేవారు. అయినా మా జోలికి వచ్చేవారు కాదు. అలాంటి అక్షరఙ్ఞానశూన్యులు కూడా, సూర్యాపేటలో ఈ ఇంటి ఓనర్ ఉపయోగించినంతటి బూతులు ఉపయోగించలేదు. అయినా సహించుకొని ఊరుకున్నాము. సహించకపోతే మరుక్షణం పోలీసులు రెడీగా ఉన్నారు మామీద కేసులు బుక్ చెయ్యాటానికి. అది మాకు బాగానే అర్ధం అయ్యింది. ఆ రోజు మొదలు దాదాపు నాలుగైదు రోజులు షెడ్యూల్ పెట్టుకున్నట్లుగా గంటపాటు బూతులు తిట్టింది. మా కోచింగ్ సెంటర్ బోర్డుని విరగగొట్టి పడేసింది.

ఇటు ఈ వేధింపు నడుస్తుండగా మేం మీలా సత్యనారాయణని కలిసి మొత్తం వ్యవహారం వివరించి చెప్పాము, సంవత్సరం పూర్తయితే [అప్పటికి అది జనవరి నెల. మేలో ఎంసెట్ అయిపోతుంది] ఎంసెట్ పరీక్ష అయిపోగానే మేం మా ఊరు వెళ్ళిపోతామనీ, అప్పటివరకూ ఇంటి ఓనర్ ని ఆగమని చెప్పమనీ అడిగాము. అలాగే అసలీ గొడవంతటి వెనుకా త్రివేణి కాలేజీ ఉంది గనుకా, విచారించమనీ, ఇలాంటి వేధింపులన్నీ మానుకొమ్మని రాజీ చెయ్యమని ప్రపోజల్ పెట్టాము. మీలా సత్యనారాయణ తన అల్లుడు కోటగిరి రాధాకృష్ణకి ఈ పని అప్పజెప్పుతూ మమ్మల్ని అతడికి డైరెక్ట్ చేశాడు. అప్పట్నుంచి తరచుగా అతణ్ణి కలిసి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ‘త్రివేణి కాలేజీ వారిని పిలిపించగా, ఆ డైరెక్టర్లలో ఒకడైన అప్పారావు [ఇతడు త్రివేణి కాలేజీ ప్రిన్సిపాల్ కూడా] వచ్చి కలిసాడని, విచారించి అడగగా “ఆవిడ ఇంకా సూర్యాపేటలోనే ఉందా? మాకు తెలియదే. సంవత్సరం క్రితం మాదగ్గర జాబ్ చేసింది. అంతే మాకు తెలుసు. మేమే వేధిస్తున్నామని నిరూపిస్తే మేం ౨౦ లక్షల పరిహారం ఇస్తామని” అన్నాడని’ చెప్పాడు. కరెంట్ వాళ్ళు 48,300/- రూ.లకు బిల్లు ఇస్తూ కరెంటు కట్ చేసారని చెప్పినప్పుడు అకౌంట్స్ ఆఫీసర్ ని చూడకూడదా అని సలహా ఇచ్చాడు మీలా సత్యనారాయణ గారి అల్లుడు కోటగిరి రాధాకృష్ణ. అలాగేనని వెళ్ళినప్పుడే అకౌంట్స్ ఆఫీసర్ తో పెద్ద వివాదం జరిగింది. “ఎస్.ఇ.కి మీరు కంప్లెయింట్ ఇచ్చినట్లు మీదగ్గర ఫ్రూఫ్ ఉందా?" అంటూ ఏవేవో వాదించారు వాళ్ళు. నేను “అన్నిటికీ నా దగ్గర ఫ్రూఫ్ ఉన్నాయి. Under certificate of posting పంపాను. బిల్లు సరిచేసి 815/- రూపాయలు కట్టమంటే నేను కట్టేసాను. ఆ రసీదు కూడా ఉంది. అంతేకాదు, ఈ జరుగుతున్న వ్యవహారాలన్నీ అటు నల్గొండ ఎస్.పి.కీ, ఇటు రాష్ట్ర సి.యం.కీ కూడా parallal గా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. సిబిసిఐడి ఎంక్వయిరీ జరుగుతుంది లెండి. అప్పుడు వస్తాయి అన్నీ బయటికి” అంటూ గట్టిగా వాదించాను. దాంతో అకౌంట్స్ అధికారి వెనక్కి తగ్గుతూ ‘రికార్డు ఇక్కడే ఉండాలనుకుంటా’ అంటూ కాస్సేపు వెదికినట్లు ‘నటించి’ తర్వాత 93/-Rs. లకు బిల్లు ఇచ్చాడు. అప్పటికి ఈ గొడవలు మాపాపకి ఎంతగా అలవాటయి పోయాయంటే “మమ్మీ! మీరిప్పుడు లోపలికెళ్ళి ఆ అంకుల్ వాళ్ళతో దెబ్బలాడి వస్తారు కదా! అప్పటివరకూ నేను స్కూటర్ దగ్గర ఆడుకుంటాను” అంటూ కరెంట్ ఆఫీసు ఆవరణలోని తురాయి చెట్టు క్రింద పువ్వులు ఏరుకున్నది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

అమ్మా.. మీరు నిజంగా చాలా చాలా గొప్పవాళ్ళు. ఇన్ని కష్టాలు పడి ఇంతమందికి ఎరురీది గెలుచుకున్న మీకు సత సహస్ర వందనాలు. అమ్మ ఒడిలో తలపెట్టుకొని అమ్మ చెప్తున్న తన కష్టాల గురించి వింటూనట్టూగా ఉంటుంది.

“మమ్మీ! మీరిప్పుడు లోపలికెళ్ళి ఆ అంకుల్ వాళ్ళతో దెబ్బలాడి వస్తారు కదా! అప్పటివరకూ నేను స్కూటర్ దగ్గర ఆడుకుంటాను”

పాప కూడా మీలాగే మంచి ఘటికురాలు లాగా వుంది :)

శంశాక్ గారు,

మీ వ్యాఖ్యకి నా మనస్సంతా ఆర్ధ్రమయ్యింది. ఇంతకంటే ఏమీ చెప్పలేకున్నాను.

భాస్కర్ రామిరెడ్డి,

తనపేరు గీత. పేరుకు తగ్గట్టే నేను నిరాశకు గురైనప్పుడు, తనే మాకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. అందుకే తనని మా లిటిల్ సోల్జర్ అని పిలుచుకుంటూ ఉంటాం.

ఇది జనజీవనస్రవంతితొ పోరాటం.
మనిషిగా బతకాలంటె పోరాటం తప్పదు ఈ విద్యా మాఫియా, మెడికల్ మాఫియా, రాజకీయ మాఫియా,______, ________________, ______________, _________________, ఇలాంటి లెక్కలేనన్ని వ్యాపార మాఫియాల రాజ్యంలో.
లేకపోతె అన్ని చంపుకొని బతకాలి
హుందాగా, స్వేచ్చగా బతికే అవకాశం ఈ జనజీవనస్రవంతిలో లేదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu