గతనెల [మార్చి] 3వ తేదిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. తొలివిడిత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో మలివిడిత పోలింగ్ కి ఇంకా అయిదు రోజుల వ్యవధి ఉంది.

ఈ నేపధ్యంలో, గడిచిన నెలన్నర రోజుల్లో, ఎన్నికల ప్రచార సరళిలో ఎన్ని వ్యూహాలో! ఎన్ని ఎత్తుగడలో…. అన్నీకాదు గానీ, వరుసగా కొన్నిటిని పరిశీలిద్దాం. ముందుగా ‘ఓట్లు కొనటం’ గురించి.

ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే మెల్లిగా ఓ కలకలం. ఎవరి హడావుడి వారిది. టిక్కెట్ల గురించి కోటీశ్వరులది ఒక యావ అయితే, సభకి జనాలని సమీకరించే ఛోటా నాయకులది మరో యావ. ఇక ఓటర్లలో ఓట్లు అమ్ముకునే వారి యావ మరోరకం. ఓటు అమ్ముకునేందుకు అలవాటుపడి ఉన్న కొందరు ఓటర్లు ‘యధారాజా తధాప్రజా’ అన్న నానుడి ప్రకారం, సాక్షాత్తు పార్లమెంటులో…. జూలై 22, 2008 నాటి విశ్వాస పరీక్షలో ఓకో ఎం.పి. ఓటుకు కోట్లు పలికాయని విన్నప్పటి నుండీ, నోట్ల కట్టల్ని టీవిల్లో చూసినప్పుడు నుండి [దాని మీద నియమింపబడిన ఎంక్వయిరీ కమిటీ అధ్యక్షుడి హోదాలో కిశోర్ చంద్రదేవ్ ఏ తీర్పు ఇచ్చినా, దానితో ముందే నిమిత్తం లేకుండా]మరింత ఉత్సహపడి పోయారు. అప్పటివరకూ అనవసరంగా తమ ఓటు నూరూ, నూటయాభైకి అమ్ముకున్నందుకు తెగ చింతించారు. వంద,రెండొందలతో తమ దగ్గర కొన్న ఓట్లతో గెలిచిన ఎం.పి.లు తమ ఓటును కోట్లకు అమ్ముకున్నతీరు చూసి, అయ్యో మనకంతగా వ్యాపార మెళకువలు తెలియలేదే అనుకున్నారో, అన్నిరేట్లు పెరిగాయి కాబట్టి ఓటు రేటు కూడా పెరిగింది అనుకున్నారో గానీ ఈసారి మాత్రం ఓటు 5,000/-Rs. దాకా పలకవచ్చనీ సమాయత్తం అయ్యారు. గత ఎన్నికలలో తమిళనాడులో 5 వేల నుండి 7 వేల దాకా పలికిందనీ, Z.P.T.C. ఎన్నికలలో ఆళ్ళగడ్డలో ఓటు 2 నుండి 5 వేలు పలికిందనీ అడపాదడపా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి.

ఇక చూస్కో అన్నట్లు ఓటు రేటు వెలుగులోకి వచ్చింది. దెబ్బతో ఓటు నమోదు కార్యక్రమం జోరందుకుంది. 20 ఏళ్ళ క్రితం ఓటరు ఇంటికి వచ్చి ఓటు స్లిప్పులని ఇచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తల్ని చూసి ఉన్నాను. ఇప్పడది మారిపోయింది. MRO ఆఫీసులకి ఓటర్లే పరుగున పోయి జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొని, లేకపోతే ఓటు నమోదు చేయించుకునే పనిలో చాలామంది పడ్డారు. ‘ఓటు పుడితే 5 వేలు పుట్టినట్లే. ఇంట్లో నలుగురు ఓటర్లుంటే 20 వేల రూపాయలు, ఏం చేదా?’ అన్నట్లు పరిస్థితి తయారయ్యింది. మిగతాప్రాంతాలలో ఈ స్థితి నిగూఢంగా ఉందో బాహటంగా ఉందో, అసలు లేదో నాకు తెలియదు గాని, మా చుట్టుప్రక్కల పల్లెల్లోనూ, మా పట్టణంలోనూ నేను ఈ స్థితిని ఈ నెలన్నరలోనే బాగా దగ్గరగా చూశాను. తీరా MRO ఆఫీసుకి వెళ్తే ఓటు వ్రాయించుకోవటం నీ అవసరం అన్నట్లు అక్కడి గుమాస్తాలు జనాలని డీల్ చెయ్యటం కూడా విన్నాను, చూశాను. ఆప్లికేషన్లు కూడా బయట జిరాక్స్ షాపులో కొనుక్కోవాలని జనాలే చెబుతున్నారు. అక్కడ ఏ సమాచారం చెప్పే వాళ్ళు లేరు. అలాగని ఉద్యోగులు లేరని కాదు, వారు జవాబు చెప్పటం లేదు అంతే. పోస్ట్ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులో ఓటర్లు ఓట్లు వ్రాయించుకుంటే [పోస్ట్ మేన్ కయితే అడ్రసులు తెలుస్తాయి కదా అని] MRO ఆఫీసు వాళ్ళు దానిని ఒప్పుకోకుండా, వాటిని అవతల పడేసారట. సాక్షాత్తూ పోస్ట్ ఆఫీసులోనే ఈమాట చెప్పారు. చివరికి ఓటు పుట్టించుకోవటానికి కూడా లంచం పెట్టుకోవాల్సిన పరిణామాలు…. ఎంత వింత!

సరే, ఓటుకు వేలు పలుకుతున్నాయన్న వార్తల నేపధ్యంలో, కొందరు ఓటర్లు ‘రెడీ ఒన్ టూ త్రీ’ అనుకుంటున్న తరుణంలో ….. ఎంతో నాటకీయంగా నోరు పారేసుకున్న డి.జి.పి. యాదవ్! ఫలితంగా అనూహ్యంగా సీట్ లోకి వచ్చిన మహంతి! ఇతడికి నిజాయితీ పరుడిగా పేరుంది. [ఇలాంటి నిజాయితీ పరులని, తమకి కావలసిన తరుణంలో ఉపయోగించుకునేందుకే ఎప్పటికప్పుడు ఓ ప్రక్కన కొనసాగిస్తారు] ఇంకే ముంది? మహంతి నాయకత్వాన పోలీసులు నడుం బిగించారు. ఎక్కడికక్కడ డబ్బు సంచుల్ని పట్టుకున్నారు. లక్షలకీ లక్షలు, ఒక్కోసారి కోట్లరూపాయలు పట్టుబడ్డాయి. దాంతో రాజకీయనాయకులంతా [ఏపార్టీ అయినా ఒకటే] చాలా చక్కని పైకారణంతో[over leaf reason], క్షమార్హత గల కారణంతో ఓటు అమ్మాలనుకునే ఓటర్ల డిమాండ్ ను అడ్డుకున్నారు. పోలీసుల దెబ్బకి డబ్బు బయటకు తేలేకపోతున్నామనే కారణంతో, రెండు వందలో మూడొందలో తీసుకుని ఓటు వెయ్యాలనే పరిస్థితి కల్పించారు. ఏంచేస్తారు పాపం ఓటర్లు? పొలంలో పంట ఉన్నంత కాలం కిలో టమోటా 40/- రూపాయలు, కిలో ఉల్లిపాయలు 20/- రూపాయలు పలికి, తీరా తమ పంటకోసి, మార్కెట్టుకు తెచ్చేటప్పటికి పావలా అర్ధ ఉంటే తెల్లమోహం వేసిన రైతుల్లా, పాపం ఓటమ్ముకుందామనుకున్న ఓటరూ కుదేలైపోయాడు. వేలల్లో అమ్ముకుందామనుకున్నా ఓటు, ఐదేళ్ళ క్రితం మాదిరే ఇప్పుడూ, వంద నుండి ఐదువందల లోపునే అమ్ముకున్నాడు. ఎంపీలు, ఎం.ఎల్.ఏ.లు మాత్రం రాజ్యాంగబద్దంగా, రాజ్యాంగ సవరణలు చేసి మరీ, తమ జీతాభత్యాలు పెంచుకున్నారు. అక్రమ ఆదాయాలకి ఆకాశపు హద్దుని కూడా దాటేసారు. కోట్లు పెట్టి పార్టీ టిక్కెట్లు కొన్నారు. రాజకీయ వ్యాపారం చెయ్యటానికి గాకపోతే, ప్రజాసేవ చేయటానికి ఎవరు కోట్లరూపాయలు పెట్టుబడి పెట్టి టిక్కెట్లు కొంటారు? చాలా మామూలుగా మీడియా సాయంతో ఓటు రేటు మాత్రం పడేశారు.

వ్యవస్థీకృత జరిగే రాజకీయ వ్యాపారానికి మీడియానే పునాది అన్నది ఇక్కడ బాగా స్పష్టంగా కన్పిస్తోంది. ఓటర్లలో కొందరు తమ ఓటుకి వేల రూపాయల రేటు అడిగితే ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా నష్టమే. అందుకే పకడ్పందీగా, పద్దతి ప్రకారం రేటు పడేసారు. ఇక్కడా Exploitation నే. డబ్బుపంచకుండా ఓటు వేయించుకొండి చూద్దాం అని లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ సవాలు విసిరిన నేపధ్యం ఇక్కడ గమనార్హం. ఓటు పవిత్రమైనదనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిజాయితీగా ఆలోచించి ఓటు వేసే బాధ్యతాయుతమైన ఓటరు గురించి ఇక్కడ నేను మాట్లాడటం లేదు. ఓటు అమ్ముకోవడానికి అలవాటుపడ్డ, వందకీ, మందుకీ ప్రలోభ పడి ఓటు వేసే ఓటర్ల గురించి మాత్రమే చెప్పాను. ఆరుగాలం కష్టించి పండించిన పంటని అమ్ముకోబోయి రైతు దగా పడుతున్నాడు. తమ ఓట్ల మీద పార్లమెంటుకీ, అసెంబ్లీలకీ పోయి కోట్లు దండుకుంటున్న రాజకీయ నాయకులకి ఓట్లు అమ్ముకోబోయి కొందరు ఓటర్లు దగా పడ్డారు. అదీ మీడియాకి ఉన్న బలం! అది ఒక్కసారిగా పరిస్థితిని మార్చేయగలదు. లేకపోతే మరి డబ్బుపంపిణీ అయ్యేచోట అయ్యింది, మందుఏరులై పారిన చోట పారిందేం? ఎక్కడ డబ్బు పంపిణీ కావాలో, అక్కడ అప్పుడు వ్వూహాత్మకంగా అవినీతి పరులైన పోలీసు అధికారులు డ్యూటిలో ఉంటారు, ఎక్కడ డబ్బు పంపిణీ కాకూడదో అక్కడ, ఎక్కడ మందు వరద రాకూడదో అక్కడ నీతిపరులైన పోలీసు అధికారులు డ్యూటిలో ఉంటారు. మీడియా నంది అంటే నంది, పంది అంటే పంది లాగే ఇది కూడా!

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

Well explained the 'other side'..!

అప్పుడే ఏమైంది, పూర్తిగా ఎలక్షన్ అయ్యేంతవరకూ మనకు ప్రతి వార్తాపత్రికలో చిత్రాతిచిత్ర వార్తలు కనిపిస్తాయి చూడండి. దీనికి మొన్ననే తెరలేపారు. ఏ పార్టీ పేపరు ఆ పార్టీ కి మద్దత్తుగా, ఇంకేముంది గెలుపు మాదే కాబట్టి మీ ఓటు ( రెండో విడత ఓటర్లు ) మాకే !

ఎలక్షన్ అయిపోనివ్వండి, ఓడిన పార్టీల విశ్లేషణ మరీ చిత్రంగా ఎవరికి తోచింది వారు రాస్తారు. గెలిచిన పార్టీనీ ఇది అప్రజాస్వామ్య గెలుపు అని అనడమేకాదు, నైతిక గెలుపు మాదేఅని కూడా... ఎన్ని వార్తలు చదవచ్చో.

అప్పుడే ఏమైంది, పూర్తిగా ఎలక్షన్ అయ్యేంతవరకూ మనకు ప్రతి వార్తాపత్రికలో చిత్రాతిచిత్ర వార్తలు కనిపిస్తాయి చూడండి.
అవును నిజం

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu