నిజానికి గౌతమ మహర్షి అహల్య పట్ల చూపిన ఆదరణలాంటి సంఘటనలు ఇతిహాసాల్లో చాలా ఉన్నాయి. విష్ణువు దశావతారాల్లో ఒకటిగా మనం చెప్పుకోనే జమదగ్ని, రేణుకాదేవిల కధ కూడా ఇలాంటిదే. తాను విలువిద్యా అభ్యాసం చేస్తుంటే, బాణాలు అందిస్తున్న భార్య ఎండకు వాడి పోతోందని సూర్యుణ్ణి అధిక్షేపించిన ప్రేమ జమదగ్ని మహర్షిది. అలాంటి ఆయన భార్య, రేణుకా దేవి ఎంతో తపస్సంపన్నురాలు, మనోనిగ్రహం కలిగిన ఇల్లాలు. ఆవిడ ప్రతీరోజూ నదికి వెళ్ళి తడి ఇసుకతో కుండ చేసి, దానిలో నీళ్ళు నింపుకొని దైవ పూజకోసం తెచ్చేది. ఆ నీటితోనే రోజూ జమదగ్ని మహర్షి దైవపూజ నిర్వహించేవాడు.

ఓ రోజు ఆవిడ నదిలో స్నానం చేస్తుండగా గగనమార్గంలో వెళుతున్న గంధర్వుణ్ణి చూసింది. అతడి అందం పట్ల ఆవిడ మనస్సు ఒక్కక్షణం చలించింది. మనోనిగ్రహం సడలిన రీత్యా ఆ రోజావిడ తడి ఇసుకతో కుండ చేయలేక ఉత్త చేతులతో తిరిగి వచ్చింది. ఉత్త చేతులతో వచ్చిన భార్యనిచూసి, విషయం తెలుసుకున్న జమదగ్ని మహర్షి, రేణుకా దేవి తల నరకమని కొడుకుల్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు నిరాకరించారు. సమిధల కోసం అడవికి వెళ్ళిన పరశురాముడు అప్పుడే ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి ఆజ్ఞానుసారం తల్లినీ, సోదరుల్నీ సంహరించాడు. తండ్రివరం కోరుకోమంటే వారిని పునర్జీవుల్ని చేయమన్నాడు. మళ్ళీ బ్రతికిన రేణుకని జమదగ్ని పరిత్యజించ లేదు. అంతటి క్షమా, ఔదార్యం అక్కడున్నాయి.

ఇవేవీ ఈ ఆధునిక రంగనాయకమ్మలకి, హేతువాద సంఘాలకీ అర్ధం కావు. ఎందుకంటే ఈనాటి ఆధునిక సమాజంలో, అతివేగానికి అలవాటు పడ్డ చాలామంది వ్యక్తులకి అంతమానసిక స్థాయి లేదు. పైగా నకిలీ కణికుడూ, అతని వ్యవస్థా తమ కిచ్చే ‘కెరీర్’, పేరుప్రఖ్యాతలు వగైరా వగైరా లాభాల కోసం, అసలే పదార్ధవాదులయిన ఈ విషవృక్ష సాగుదార్లు అంతటి నైతిక విలువల్ని అర్ధంచేసుకోవటం చాలా కష్టమే. ఎందుకంటే వీరిలో చాలామందికి బంధాల మీద, అనుబంధాలమీద, ప్రేమా, ఆత్మీయతల్లాంటి మానవతా విలువల మీద పెద్దగా నమ్మకాలుండవు. అలాంటి వారికి సీతారాముల బాంధవ్యం, సౌశీల్యం అర్ధం కావటం చాలా కష్టమే.

ఎందుకంటే ఈ రోజు ఒకరితో డేటింగ్ చేసి, రేపు పెళ్ళిచేసుకొని, ఎల్లుండి విడాకులు తీసుకొని, ఆవలెల్లుండి వేరొకరితో డేటింగ్ కి తయారయ్యే సంస్కృతికి వాళ్ళు స్వాగతం చెప్పే స్ధితిలో ఉన్నారు గనుక.

కాని భారతదేశంలోకోట్లాది గ్రామీణులు, మధ్యతరగతి ప్రజలూ, పేదలూ, సామాన్య భారతీయులు ఇంకా విలువల్ని మరిచి పోలేదు. ఆచరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ నాటికీ, 2 శతాబ్దాలుగా కుట్రలు పన్నుతున్నా, మన సంస్కృతిని ఎన్ని వ్యంగ్యాలూ, విమర్శలూ, జోకులూ వేసి అగౌరవపరచినా, సమూలంగా మాత్రం నాశనం చేయలేక పోయారు నకిలీ కణికుడూ అతని వ్యవస్థ. నకిలీ కణికుడూ, అతడి ఏజంట్లు కలిసి ప్రజల దృక్పధాన్ని కలుషితం చేసిన మాట నిజమే. కానీ భారతీయులు తమమీద జరుగుతున్న కుట్రని అర్ధం చేసుకున్న మరుక్షణమే ఈ కాలుష్యమంతా కరిగిపోతుందన్న విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు.

ఇది నా నమ్మకం మాత్రమే కాదు.

ఇది భారతీయుల మీద ఉన్న నమ్మకం.

ఇది మనుష్యులమీద ఉన్న నమ్మకం.

ఇది మంచి మీద ఉన్న నమ్మకం.

ఖచ్చితంగా చెప్పాలంటే

ఇది భగవంతుని మీద ఉన్న నమ్మకం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

11 comments:

>> "ఎందుకంటే ఈ రోజు ఒకరితో డేటింగ్ చేసి, రేపు పెళ్ళిచేసుకొని, ఎల్లుండి విడాకులు తీసుకొని, ఆవలెల్లుండి వేరొకరితో డేటింగ్ కి తయారయ్యే సంస్కృతికి వాళ్ళు స్వాగతం చెప్పే స్ధితిలో ఉన్నారు గనుక"

నేను ఇటువంటి డేటింగ్ సంస్కృతికి బద్ధ విరోధిని. అయినా ఒక ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. క్షణకాలం మనసు చలించిందని భార్యని, మాట వినలేదని కుమారుల్నీ చంపమన్న జమదగ్ని ఆవేశాన్ని ప్రశ్నించటం నేరమా? 'మళ్లీ బ్రతికిన రేణుకని జమదగ్ని పరిత్యజించలేదు' అన్నారు. ఆయన క్షమ, ఔదార్యాలకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. బాగుంది.

తను ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందనో, మరెవరిపైనో మనసు పడిందనో ఆసిడ్ పోసేవాళ్లూ, పీకలు కోసేవాళ్లలోనూ జమదగ్నికున్నంత క్షమ దాగుండొచ్చు కదా. శిక్షించకుండా వాళ్లకీ ఓ అవకాశమిస్తేనే కదా ఆ సంగతి తెలిసేది. వీళ్ల గురించి ఏమంటారు?

మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్లుందా? ఓ సారి ఆలోచించి చూడండి. ఆనాటికీ ఈనాటికీ ఆడది మగాడి దయాగుణం మీదనే ఆధారపడి ఉండాలనే భావజాలం మన సంస్కృతిలో మమేకమైపోయుంది. రంగనాయకమ్మలూ, మీరనే నకిలీ కణికులూ (ఈయనెవరో నాకు తెలీదు) దాన్నే ఎత్తిచూపుతున్నారేమో?

జమదగ్ని చంపమన్నది, మనసు చలించినందుకా లేక పరపురుషునిపై మనసు లగ్నమైందనా అని ఆలోచించాలని నా అభిప్రాయం.
ఇప్పుడు మీరంటున్న ఈ ఆసిడ్ వాదులు చంపుతున్నదీ అందుకేనంటారా? లేక తమకు దక్కలేదన్న అక్కసు తోనా? వీళ్ళని వదిలితే ఇంకో నలుగురిని ప్రేమించామంటూ చంపేస్తారు.

ఇంకొక విషయం, వాళ్ళకు ప్రాణశక్తి మీద అధికారం ఉంది కాబట్టే అలా చేసారని కూడా అనుకోవచ్చు కదా ? ఒక రకమైన ప్రక్షాళన అనుకోవచ్చు కదా!

@అబ్రకదబ్ర గారు
నేను సమాధానం ఇచ్చేంత గొప్పదాన్ని కాదు గాని, నాకు అర్ధమయ్యింది ఇక్కడ వివరించ యత్నిస్తాను.

ఇక్కడ జమదగ్ని వంటి మునులు మనో వాక్కాయ కర్మలను అధీనం లో వుంచుకుంటూ, పవిత్ర జీవన విధానాన్ని ఆచరిస్తూ జ్ఞాన సముపార్జన కై నిరంతరం యత్నిస్తూ వుంటారు. ఒక వేళ ఏ దుర్ముహూర్తం లో ఐనా వారి కి సేవ చేసే వాళ్ళు చిన్న తప్పిదం చేసినా, వారి ఏకాగ్రత, ధర్మ నిష్ట భంగపడతాయి కనక వెంటనే వారికి ఆగ్రహం వచ్చి దండనగా శాపం పెట్టేవాళ్ళు. మరి అరిషడ్వర్గాలని జయించిన వాళ్ళకి కోపం ఏమిటీ అంటే, దానిని ధర్మాగ్రహం అంటారు. ధర్మానికి నష్టం వాటిల్లినప్పుడు ఆగ్రహం రావడం లో తప్పు లేదు.
ఐనా కూడా ఆగ్రహం అన్నది -ve emotion కాబట్టి కొంత తపస్సు నష్టం అవుతుంది. ఇక శాపం పె ట్టడం వల్ల వారి తపస్సు భంగపడింది. ఏ రకం గా చూసినా, జమదగ్ని మహర్షి కి కూడా ఈ కథ లో నష్టం వాటిల్లింది.
ఇక ఇలాంటీ కథలు ఎందుకు ప్రాచుర్యం పొందాయి అంటే, మహాత్ముల సేవ లో ఎంత జాగరూకులమై వుండాలొ తెల్పటం వీటి ముఖ్యోద్దేశం. జన బాహుళ్యానికి జమదగ్ని వంటీ తపస్వి ని సేవించే విధం తెలిసింది.
చివరగా, ఎవరి తప్పు కి తగిన దండన వారు అనుభవించాక అందరు మరలా జీవితాన్ని కొనసాగించడం. పరిపూర్ణత కోసం యత్నించడం అనేవి, జమదగ్ని మహర్షి చివరికి తన భార్య ని తిరిగి స్వీకరించారు అని చెప్పడం లో అసలు వుద్దేశం.
ఇంకో విషయం ఏమిటి అంటే, తన శక్తి ద్వారా తిరిగి పునర్జీవులను చెయ్యగలిగిన సత్తా వున్నవారు కనుక జమదగ్ని మహర్షి భార్య ని నరకమని ఆజ్ఞాపించినా చెల్లింది. యాసిడ్ పోసిన వాళ్ళు, బాధితులని తిరిగి మామూలుగా చెయ్యగలరా? పిల్లలు తప్పు చేస్తే తల్లి దండిస్తుంది. వెంటనే దగ్గరికి తీసుకు లాలిస్తుంది. ఇక్కడ మహర్షి భావం కూడా అలానే అనిపించటం లేదూ? కత్తి తీసుకు కోసి సర్జరీ చేసేవాణ్ణి, కత్తి తో పీక కోసి చంపేవాణ్ణి ఒకే గాటన కడితే ఎలాగ?

excellent blog. highly informative. keep blogging.

exactly nenu cheppalanukunnade aruna garu chepparu, naakante baga chepparu.

@అరుణ:

వివరంగా సమాధానమిచ్చినందుకు ధన్యవాదాలు. నేను ప్రేమోన్మాదులనీ జమదగ్ని వంటి మునులనీ ఒకే గాట కట్టటం లేదండీ. అధికారం ఉందికదా అని ఆవేశపడటం ఎంత న్యాయమని ప్రశ్నిస్తున్నానంతే. రేణుకని చంపి బ్రతికించటం వల్ల జమదగ్ని ఏమి సాధించినట్లు? బ్రతికించగలిగే శక్తి ఉంది కాబట్టి చంపేసే అధికారం ఉందని మీరనటం ఆశ్చర్యకరం. పరశురాముడు ఏమడిగినా తీరుస్తా అని కమిటైపోయాడు కనక ఆయన కొడుకు కోరిక ప్రకారం రేణుకని బ్రతికించాడే కానీ పరశురాముడు మరేదో కోరుంటే?

ఈ వాదాలు తెగవు లెండి. కాసేపు కాలక్షేపం :-)

అధికారం ఉంది కదా అని ఆవేశపడ్డాడు అనేకంటే, శిక్షించే విచక్షణ ఉంది కాబట్టే చేశాడు అనుకోవచ్చేమో?
తన రాజ్యంలో తప్పు జరిగితే శిక్షించే అధికారం,బాధ్యత రాజుకు ఉన్నట్టే , ఆశ్రమంలో తప్పు జరిగితే ఆ మునే కదా బాధ్యత వహించాలి. "బతికించగలడు కాబట్టే" అంటే చావు కూడా అప్పుడు మామూలు శిక్షే అవుతుంది కదా!
"చంపి బ్రతికించటం వల్ల జమదగ్ని ఏమి సాధించినట్లు?"
ఆమె మనోవికారాన్ని దూరం చేయడానికేమో?

@అబ్రకదబ్ర గారు
"పరశురాముడు ఏమడిగినా తీరుస్తా అని కమిటైపోయాడు కనక ఆయన కొడుకు కోరిక ప్రకారం రేణుకని బ్రతికించాడే కానీ పరశురాముడు మరేదో కోరుంటే?"
I expected that you ask this question. నా దగ్గర కూడా ఈ ప్రశ్న కి సమాధానం లేదు. నా రీజనింగ్ కి కూడా అందలేదు. :) ఇంకా ఈ విషయాల గురించి వివరం గా తెల్సిన వాళ్ళు సమాధానం చెప్పగలరేమో మరి. అప్పటివరకు ఈ కథ ను అంగీకరించకపోవడం కన్నా, ఇందులోని మంచి ని తీస్కుని, నా సందేహం తీర్చేవాళ్ళ కోసం వెతుక్కుంటాను నేను.

ఔను, మంచి కాలక్షేపం!! బట్టతలకీ మోకాలికీ ముడిపెట్టడం అనే సామెత బాగా అర్థమయ్యేలా వివరించబడిందిక్కడి వ్యాఖ్యలో. పైగా సామెత కూడా పాతబడిపోయిందేమో... దానికి కొత్త సొబగులూ అద్దారు. ఇప్పుడు మనం దాన్ని మునికీ కామునికీ పోలిక తెచ్చినట్టు అనో, మరోలాగానో అనుకోవచ్చన్నమాట!

అబ్రకదబ్ర ఇక్కడ రాసిన రెండో వ్యాఖ్యలో "అధికారం ఉందికదా అని ఆవేశపడటం ఎంత న్యాయమని ప్రశ్నిస్తున్నానంతే..." అన్నారు. ఆ ముక్క లేదా ఆ అర్థం వచ్చే ముక్క నాకు మొదటి వ్యాఖ్యలో కనబడలేదు. నేనేదైనా మిస్సయ్యానా!?

జమదగ్ని మహర్షి అశ్రమంలో ఆతిథ్యం పొంది ఆ ఆతిథ్యాన్నంతటినీ సమకూర్చి పెట్టిన హోమధేనువును కార్తవీర్యార్జును డనబడే రాజు బలవంతంగా తీసుకుపోతే పరశురాముడు అది తెలుసుకొని మాహిష్మతీ పురానికి వెళ్ళి ఆ వేయి బాహువులు గల రాజును, అతని పుత్రులనందరినీ కూడా చంపి తండ్రికి ఆ విషయం తెలియజేస్తాడు.
అప్పుడాయన కొడుకుతో....
క.
కల వేల్పులెల్లఁ దమతమ, చెలువంబులు దెచ్చి రాజుఁ జేయుదు రకటా!
బలువేల్పు రాజు వానిం, జలమున నిట్లేల పోయి చంపితి పుత్రా!
క.
తాలిమి మనకును ధర్మము,తాలిమి మూలంబు ధర్మ తత్త్వంబునకున్
దాలిమి గల దని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్.
క.
క్షమ గలిగిన సిరి గలుగును, క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమగలుగఁ దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
క.
పట్టపురాజును జంపుట, గట్టలుకన్ విప్రుఁ జంపు కంటెను పాపం
బట్టిట్టనకుము నీ వీ, చెట్ట సెడన్ దీర్థసేవ సేయుము తనయా!
అని అనగా పరశురాముడు ఓ ఏడాదిపాటు తీర్థములన్నీ సేవించుకుని వస్తాడు.
తరువాత కథలో జమదగ్ని మహర్షి రేణుకాదేవిని చంపమన్నప్పుడు పరశురాముడు
క.
కడుకొని పెండ్లముఁ జంపని,కొడుకులఁ బెండ్లాముఁ జంప గురుఁ డానతి యీ
నడుగులకు నెఱఁగి రాముం,డడు గిడకుండగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్.
శా.
తల్లిన్ భ్రాతల నెల్ల జంపు మనుచోఁ దాఁ జంపి రాకున్న బెం
పెల్లన్ బోవ శపించుఁ దండ్రి తన పంపేఁ జేయుడున్ మెచ్చి నా
తల్లిన్ భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుం డంచు వే
తల్లిన్ భ్రాతలఁ జంపె భార్గవుఁడు లేదా చంపఁ జేయాడునే.
అని అంటారు పోతనగారు తన భాగవతంలో.అంతే కాదు ఇంకా..
ఆ.
పడినవారి మరల బ్రతికింప నోపును
జనకుఁ డనుచుఁ జంపె జామదగ్న్యుఁ
డతఁడు సంపె ననుచు నన్నలఁ దల్లిని
జనకు నాజ్ఞ నైనఁ జంపఁ దగదు. అని కూడా అంటారు పోతన గారు.
సంస్కృత భాగవతం లో ఈ కథ ఎలా వుందో నాకు తెలియదు.
ఇదంతా ఎందుకు వ్రాసేనంటే పరశురామునికి తండ్రి ఆజ్ఞ పరిపాలిస్తే ఏం జరుగుతుందో వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో ముందే తెలుసునని చెప్పటానికి మాత్రమే.

భవతా యథావద్బాఢముక్తమ్.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu