ఇక రామాయణం దగ్గర కొస్తే - విశ్వామిత్ర మహర్షి దశరధుణ్ణి, తన యాగ రక్షణ నిమిత్తం శ్రీరాముణ్ణి పంపమని అర్ధించినప్పడు, దశరధ మహారాజు పుత్రవాత్సల్యం కొద్దీ సందేహించినప్పుడు, దశరధుని కుల గురువు వశిష్ట మహర్షి “దశరధ మహారాజా! విశ్వామిత్రమహర్షి శక్తిని తక్కువ అనుకోకండి. ఆయన తలుచుకుంటే తాటకాది రాక్షస వర్గాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలడు. అట్లాంటిది రాముణ్ణి తన వెంట పంపమని అడుగుతున్నాడంటే అందుకు ప్రత్యేక కారణం ఉండి ఉంటుంది. ఆయన రాముణ్ణి మరింతగా తీర్చిదిద్దగలడు. సందేహించకుండా రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పెళ్ళికి పంపుతున్నట్లుగా పంపు” అంటాడు.

నిజానికి విశ్వామిత్రుడు పూర్వాశ్రమంలో గాధేయుడన్నరాజు. వేటకెళ్ళి తిరిగి వస్తూ కామధేనువు గురించి వశిష్టని మీద వైరం పూనుతాడు. రాజు యొక్క ఆర్ధిక శక్తి, మహర్షి యొక్క తపస్సు తాలుకూ ఆత్మశక్తి ముందు ఎందుకూ కొరగాదని తెలుసుకొని, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి పోయి తపస్సు చేస్తాడు. అంచెలంచెలుగా అహంకారాన్ని వదలి బ్రహ్మర్షి అవుతాడు. అలాంటి వీరిద్దరూ ఆ వైషమ్యాన్ని దాటి, అరిషడ్వర్గాలేవి లేకుండా ఒకరి కొకరు గౌరవించుకొంటారు. [పురాణాలని, పతివత్రలుకధల్ని, వ్రతకధల్ని ఇక్కడ నేను ఉటంకించటం లేదు. ఆ కథల్లో దేవతలకి గ్రీకు దేవతా కథ ఇవయాడ్ లో లాగా సకల అరిషడ్వర్గాలు ఉంటాయి] నిజానికి ఇతిహాసాలు అంటే భారత రామాయణాలు భారతీయులకి ఈ ఆత్మసంయమనాన్ని సాధించమనే బోధిస్తాయి. ఆ కథల్లోని ఎన్నో పాత్రలు ప్రజలు అరిషడ్వర్గాలని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్ని జయించి, మానసికంగా పరిపక్వత [బ్యాలెన్స్ అఫ్ మైండ్] పొందేందుకు ప్రోత్సహిస్తాయి.

విశ్వామిత్రుడిలోని ఈ సుగుణాలని, ఆయన కథలోని విశిష్టతనీ వదిలేసి కుట్రదారులు అంటే నకిలీ కణికుడూ అతడి వ్యవస్థా, సినిమాల్లోనూ, వ్యంగ్యరచనల్లోనూ, సాహిత్యంలోనూ విశ్వామిత్రడన గానే, మేనకా విశ్వామిత్రం మాత్రమే మాట్లాడతారు. వారి పుత్రిక శకుంతల, ఆమె పుత్రుడు భరతుడు - ఆయన పేరిట భారతదేశం వెరసి భారతదేశానికి ఆ పేరు ఎవరిమూలంగా వచ్చిందో ఆ భరతుడు మేనకా విశ్వామిత్రుల మనుమడు. [శకుంతల వారి అక్రమ సంతానం, సక్రమ సంతానం కాదు అన్న విధంగా వారి ప్రచారం ఉంటుంది] నిజానికి భారత దేశానికి కాపేరు శకుంతల దుష్యంతల పుత్రుడైన భరతుడి మూలంగా కలిగింది కాదు. అల్లసాని పెద్దన గారి స్వారోచిష మనుచరిత్రలో చెప్పబడిన మనోరమా పౌత్రుడయిన భరతుడు.

నిజానికి గాధేయుడు విశ్వామిత్రుడుగా పరిణమించే కథ భారతీయులకి ఎంతో నీతిని, అహం ప్రభావం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది.

తమ మనస్సుని నిగ్రహించి చేసిన తమస్సు యొక్క తీవ్రతని బట్టి వ్యక్తులు శక్తులు పొందుతారు. ఆ శక్తిని బట్టి వారిని మునులనీ, ఋషులనీ, మహా మునులనీ, మహర్షులనీ, బ్రహ్మర్షులనీ పిలుస్తారు. వశిష్టనిపై కినుక తోనూ, ఈర్షతోనూ, తపస్సు ప్రారంభించిన గాధేయుడు కొన్నాళ్ళ తపస్సుకి కొంత శక్తివంతుడైనాడు. మేనక చేసిన తపోభంగం తో మళ్ళీ ఆయన తపస్సు మొదటికొచ్చింది. ఈ కథని కాళిదాసు తన అభిఙ్ఞాన శాకుంతలం లో మనోహరంగా వర్ణించాడు. ఇదేకథని సినిమా పండితులూ, టీవి పండితులూ ‘మేనక శృంగారం’ అనే మసాలాని దట్టించి, విశ్వామిత్రుడి సౌశీల్యాలని, విశ్వశ్రేయస్సు పట్ల ఆయన కున్న కమిట్ మెంట్[నిబద్దత]నీ ప్రక్క దారి పట్టించి ఎన్నో సినిమాలు, సీరియళ్ళు తీసారు.

ఒకసారి తపోభంగం కాగానే విశ్వామిత్రుడు మనస్సుని నిగ్రహించడం ఎంతో కష్టమో తెలుసుకున్నాడు. ఇక తర్వాత ఆయన ఏ శృంగార భావనకీ లొంగలేదు. మళ్ళీ తపస్సు చేశాడు. త్రిశంకుడనీ రాజు సశరీరంగా స్వర్గానికెళ్ళదలచి ఎవ్వరూ తన కోరిక తీర్చ లేకపోయారన్న బాధని విశ్వామిత్రుడికి చెప్పుకున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాని పని తను చేయాలని, తద్వారా తన గొప్పదనాన్ని అందరికీ తెలియజేప్పాలనే అతిశయం ఆయన్ని మరోసారి ఓడించింది. విశ్వామిత్ర సృష్టి అయిన త్రిశంకు స్వర్గం తర్వాత ఆయనకి తాను మరోసారి తపోనష్టం పొందిన విషయం అర్ధమైంది.

ఈ సారి మరింత తీవ్రతపస్సు చేశాడు. ఆత్మఙ్ఞానం పొందాలని, తర్వాత బ్రహ్మర్షి అనిపించుకోవాలన్నది కోరిక. కోరికలు విడిచి పెట్టందే ఆత్మఙ్ఞానం పొందలేనని అప్పటికి ఆయనకి తెలియదు. ఆత్మఙ్ఞానం బోధించగల గురువుని వెదికాడు. యముణ్ణి అడిగితే ఆయన తీరిక లేదన్నాడు. సూర్యుణ్ణి అడిగితే ఆయన మండిపోతున్నాను కుదరదన్నాడు. ఆదిశేషుని అడగమన్నాడు. ఆదిశేషుని అడిగితే ఆయన తన తలమీద మోస్తున్న భూమిని చూపిస్తూ “ఎలా కుదురుతుంది? భుమిని నాతలపై నుంచి దించితే తీరిగ్గా బోధిస్తాను” అన్నాడు.

“సరే! నాతపశ్శక్తితో భూమిని నిలువరిస్తాను. తలపై నుంచి దించు” అన్నాడు విశ్వామిత్రుడు.

సరేనని దించేసాడు ఆదిశేషువు. భూమి విపరీత వేగంతో జారిపోతుంది. “నా తపశ్శక్తిలో ఘడియకాలాన్ని ధారపోస్తున్నాను. భూమి ఆగు” అన్నాడు విశ్వామిత్రుడు.

భూమి ఆగలేదు. “ఒకరోజు తపస్సు ధారపోస్తున్నాను, ఆగు” అన్నాడు విశ్వామిత్రుడు.

ఉహూ! భూమి ఆగలేదు.

"సగం తపస్సు ధారపోస్తున్నాను” లాభంలేదు.

"మొత్తం తపస్సు ధారపోస్తున్నాను.”

ఒక్క క్షణం ఆగి, మళ్ళీ జారిపోవడం మొదలు పెట్టింది భూమి.

బుడుగు భాషలో చెప్పాలంటే హడ్డిలి పోయాడు విశ్వామిత్రుడు.

చిరునవ్వు నవ్వాడు ఆదిశేషువు.

భూమిని తీసి తిరిగి తన పైన పెట్టుకొని “ఈ అహాన్ని జయించడమే బ్రహ్మవిద్య. ఇదే ఆత్మజ్ణానం. అహం వెనుకే అరిషడ్వార్గాలుంటాయి. అహం పారదోలితే అంతా ఙ్ఞానమే” అన్నాడు.

అర్ధమయ్యింది విశ్వామిత్రుడికి.

ఆ తర్వాత ఆయన తపస్సు బ్రహ్మదేవునితోపాటు, వశిష్ట మహర్షి కూడా వచ్చి బ్రహ్మర్షి అని పిలిచే వరకూ నిరాటంకంగా సాగింది. ఆ తర్వాత లోకహితం కోసం విశ్వామిత్రుడి తపస్సు ఉంటుంది. ఈ కథని గురించి రంగనాయకమ్మలూ, నాస్తిక సమాజ సభ్యులూ, హేతువాద సంఘాలూ ఎన్ని వ్యంగ్యాలు పోయారో? ఆదిశేషువు తలపైన భూమి ఉంటే మిగిలిన గ్రహాలెవరి నెత్తినున్నాయనీ, మరప్పడు విశ్వామిత్రుడెక్కడ నిలబడి మాట్లాడాడనీ ... ఇలా రకరకాలుగా అన్నమాట.

ఇప్పడున్నట్లు ఉపగ్రహాలు, స్పేస్ వాక్ లు అప్పడున్నయో లేదో అన్నది హైజాక్ కాదా?

విస్తరాకులెత్తరా అంటే జనాభా లెక్కపెట్టాట్టా వెనకటికో ప్రబుద్దుడు. [విందులో అతిధులు భోజనాలయ్యాక ఆ విస్తళ్ళు తీసెయ్యరా అంటే – ‘ఎంత మంది విందుకొచ్చారూ? ఎందరు తిన్నారూ? ఇంకా ఎందరు తినాలి? తనెన్ని విస్తళ్ళు ఎత్తాలి?’ అని లెక్కలు వేసాట్ట ఈ మేధావి. అంతేగాని అసలు పని మాత్రం చెయ్యలేదు. ఇప్పడూ మనకి అలాంటి మేధావులు కనబడుతూ ఉంటారు. నిజానికి వీళ్ళు మేధావులు కారు. తమని తాము మేధావులనుకొంటారు. ఇంట్లో అమ్మ గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ ఏ ప్రిన్స్ పల్ మీద ఆధారపడి పనిచేస్తాయో చెప్పి, అన్నం పప్పు మాత్రం వండలేదనుకోండి. మన ఆకలి తీరుతుందా? అలాంటిదే ఇది.] ఇంతకీ ఈ హైజాక్ ఏమటంటారా?

విశ్వామిత్రుడు ఎక్కడ నిలబడి ఆదిశేషువుతో మాట్లాడాడు అన్న చర్చహైజాక్.

ఎందుకంటే ఈ కథ మనకి ఙ్ఞానమంటే ఏవిటి, అహం అంటే ఏమిటి? అది కలిగించే నష్టం ఏమిటి? అన్నది చెబుతుంది. మనస్సుని నియంత్రించటం ఎంత కష్టమో, నియంత్రిస్తే ఎంత శాంతి కలుగుతుందో చెబుతుంది. ఇదంతా ప్రక్కదారి పట్టించి సైన్సుని ఇతిహాసంలో వెదకడం హైజాక్ కాదా?

ఇలా ఇతిహాసాల్లో సమయ సందర్భాల జౌచిత్యాన్ని, పాత్రల ప్రవర్తనల్లోనూ, సంఘటనల్లోనూ ఉన్న సైన్సు వ్వతిరేక విషయాన్ని ఎండగట్టిన రంగనాయకమ్మలు, ఒంటి చేత్తో 100 మందిని కొట్టే హీరోల పాత్రల్నీ, నేల మీద నుండి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతానికి వ్యతిరేకంగా భూమ్మీద నుండి ఐదంతస్తుల మేడ మీదికి జంప్ చేయడాలనీ, వళ్ళంతా తూట్లు పడినా, లేదా కడుపులో కత్తులు దిగబడి, బ్యారెళ్ళ కొద్దీ రక్తం కారినా ఆపకుండా ఫైటింగ్ చేయడంలలోని ఔచిత్యాలని గానీ, సైన్సు వ్యతిరేకతని గానీ ఏమాత్రం పట్టించుకోలేదు.

పైగా “అవి సినిమాలు. వినోదం కోసం. అంతే! వాటిలో అసహజాలు పట్టించుకోకూడదు” అన్నారు.

మరి “ఇవి ఇతిహాసాలు. కొన్ని అసహజాలు సహజం. మౌలికంగా ఆ కథలు ఏ మంచి నేర్చుకొమ్మంటున్నాయి” అన్నది ఎందుకు పట్టించుకోలేదు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

ఎందుకో అబ్బూరి వారి పదాలు గుర్తుకొస్తున్నాయి... :).. :)..

నగ్నంగా విహరిస్తున్న చీకటిని
ఆందోళన పరిచింది నా అగ్గిపుల్ల వెలుగు
అంతర రహస్యాలను వెలికి లాగింది
చీకటి ఏనుగులకు
కొరడా యైనది చిన్న వెలుగు

మీ పోస్టులు చాలా బాగుంటున్నాయి. వాటికోసం ఎదురు చూస్తూ ఉంటాం.

బావుంది. ఆదిశేషుడు తన తల మీద భూమి ని పెట్టుకోవడం అనేదాని మీద శాస్త్రీయo గా వివరణ ని నేను చదివాను. వివరాలు సరిగ్గా గుర్తు లేవు. ఇక నుండి ఇతిహాసాల మీద ఏదైనా శాస్త్రీయ నిరూపణలను చదివినప్పుడు పుస్తకాల రెఫరెన్సులు ఇచ్చి మరీ బ్లాగస్థం చేస్తాను. కొద్దిమంది జిజ్ఞాసులకు ఐనా ఉపయోగపడతాయి.

మీ బ్లాగ్ ని నేను కొంచెం లేటుగా ఫాలో అవ్వడం మొదలుపెట్టా. ఇంత అర్ధవంతమైన రచన బ్లాగ్లోకంలో రావడం నిజంగానే అధ్భుతం.

మీరు రాస్తున్న ఈవరుస టపలన్నిటిని ఒక ఇ బుక్ గా వుంచండి. అది చాలా అవసరమవుతుంది తరువాత చాలామందికి. వీలైతే అన్నీ పూర్తయ్యాక నాకు మెయిల్ లో మొత్తమ్ ఒకే టపాగా పంపించగలరు. ధన్యవాదములు

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.
ఇ బుక్ గురించి నాకు పెద్దగా తెలియదు, వివరాలు మీకు తెలిస్తే చెప్పగలరు.

ఈబుక్ ఆలోచన నాకూ వచ్చింది. మీరు రాయడం అయిన తర్వాత pdf తయారు చేయడం సులభం. I will do it.

వంశిగారూ, మీరు ఉటంకించిన పదం అద్భుతంగా ఉంది. అబ్బూరి వారి పదాలు మాగంటి సైటులో ఉన్నాయా?

the best ever telugu blog

--sk

బుక్ రూపం లోకి తేవటం చాలా మంచి ఆలోచన, కానీ ఈ-బుక్ వృధా, మీ బ్లోగ్ ఉందిగా, ప్రస్తుతం యూనికోడ్ ఫాంట్స్ .pdf కన్వర్షన్ కష్టం గా ఉంది, మొత్తం మళ్లీ అను ఫాంట్స్ ఉపయోగించి రి టైప్ చేయాలి. ప్రస్తుతం నేను కథలు-వ్యాఖ్యానాలు విడిగా సేవ్ చేసుకుని , ప్రింట్ చేసి పెట్టుకుంటున్నాను (ఫైల్) . మీరు కొన్ని భాగాలుగా పబ్లిష్ చేయగలిగితే బాగుంటుంది కానీ, చట్టపరమయిన సమస్యలు మళ్లీ మీకు వస్తాయి ( నేరుగా పేర్లు వాడుతున్నాము కాబట్టి) బ్లోగ్ అనేది మీ అభిప్రాయం కిందికి వస్తుంది కాబట్టి పర్వాలేది. మళ్లీ మిమ్మలిని శ్రీశైలం పొణిచ్చే ప్రసక్తే లేదు ( దేవుని దర్శనానికి తప్ప) .....

శ్రీకాంత్

శ్రీకాంత్ రెడ్డిగారు,
పిడిఎఫ్ చేయటానికి ఇవీ ఇంకా పూర్తి కాలేదండి. అదీగాక ఇవి ఒక దానికి మరొకటి అంతర లింకు ఉన్నవి. అందుకని కూడా దీనిని ఎలా చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానండి! నెనర్లు!
~~~~~
శ్రీకాంత్ రెడ్డి గారు,
అంతా బాగానే ఉంది గానీ, మమ్మల్ని శ్రీశైలం ఎందుకు పోనివ్వరూ?:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu