ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధులు నాతో పాటు సత్యాన్వేషణ చేయాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా ...

ఒకసారి నలుగురు గ్రుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నారట. నలుగురు ఏనుగుని చేరారు.

ఒకడు దాని కాళ్ళని తడిమాడు “ఒరేయ్! ఏనుగు స్తంభంలా ఉంటుందిరా. మాఇంటి వసారాలో స్తంభాలిలాగే ఉంటాయి” అన్నాడు.

మరొకడు దాని చెవులు తడిమాడు. “కాదురా! ఏనుగు చేటలా ఉంటుంది. మా అమ్మ రోజూ బియ్యం చెరిగే చేట నాకు బాగా తెలుసు. ఏనుగు చేటలా ఉంది” అన్నాడు.

ఇంకొకడు దాని కడుపు తడిమాడు. “ఛస్! నోరు ముయ్యండిరా! మీకేం తెలీదు. ఏనుగు పెద్ద బాన లాగా ఉంటుంది. మాదొడ్లో బాన కన్నా కూడా పెద్దది” అన్నాడు.

నాలుగో వాడు దాని తోక తడిమాడు. నెత్తి నోరూ కొట్టుకుంటూ “అయ్యయ్యో! కాదర్రా. మీరలా పొరపాటు పడుతున్నారు. ఏనుగు బారెడు తాడులా ఉంటుంది. మీకర్ధం కావటం లేదు” అన్నాడు

ఇదీ కథ!

మనకి బాగా తెలిసిన, మన పెద్దలు చెప్పిన పాచి పాత కథ. మన వాళ్ళు ఈ కథలో ఏనుగుని ‘బ్రహ్మ పదార్ధం’తో పోలుస్తారు అది భారతీయ తత్త్వ శాస్త్రం. మన కథలో ఏనుగు, నకిలీ కణికుడి గూఢచార తంత్రం వంటింది. ఆ గుడ్డివాళ్ళం మనమే.

మీడియా తన మాయాజాలంతో, నకిలీ కణికుడి వంశం ప్రయోగిస్తోన్న విభజించు - ప్రచారించు అన్న తంత్రంతో మనకీ గుడ్డితనం కలుగుతోంది.

వాస్తవంగా కూడా - ప్రపంచ విస్తారత రీత్యా, మనకున్న పరిమిత వనరులరీత్యా, మన రోజు వారి బ్రతుకు పోరాటం రీత్యా ఈ గుడ్డితనం అనివార్యమైనది.

నిజానికి పత్రికలు, మీడియా నిజాయితీగా ఉంటే ప్రజలకి అవి మనోనేత్రాలుగా మారి సత్యాన్వేషణ చేసేవి, దారి చూపేవి, గుడ్డితనాన్ని తొలిగించేవి.

అలాంటి నిజాయితీ స్వాతంత్ర సమర కాలంలోని పత్రికల్లో ఉండింది. ఇంతకు ముందు టపా మాలిక ’మీడియా మాయాజాలం’ లో ఇంతకు ముందే వ్రాసినట్లు, ఎక్కడ తమ కుట్ర ఓడిపోయిందో అక్కడినుండే మళ్ళీ ప్రారంభించిన ఈ నకిలీ కణిక వంశం ఈసారి పత్రికల్ని, మీడియానీ తమకు పైకవచంగా వాడుకొంటోంది.

ఇందుకు మీకు మరొక చిన్న ఉదాహరణ ఇస్తాను.

కొంతమంది చిత్రకారులున్నారనుకొండి. అందరూ కలిసి ఓ బ్రహ్మండమైన పెద్దవర్ణచిత్రాన్ని చిత్రించాలను కొన్నారనుకొండి. దానికి కాలవ్యవధి కూడా ఎక్కువ నిర్ణయించుకున్నారనుకొండి. ఆ చిత్రాన్ని 100 భాగాలు చేసికొన్నారను కొండి. ఒకొక్కొడూ ఒకో భాగాన్ని ఒకో ప్రాంతంలో ఒకో సమయంలో అందులో వరసక్రమాన్ని కూడా మార్చి చిత్రించారను కొండి. మనకి ఆచిత్రం ఏమిటో అర్ధం కావాలంటే వారి కాలవ్యవధి పూర్తయ్యకా, వారిని నియోగించిన ఆ చిత్రకారుల గుంపు లీడర్, అన్ని బొమ్మల భాగాల్ని ఒక పద్దతిలో పేర్చి చూపెట్టినప్పడు మాత్రమే అందులో ఏం చిత్రించారో మనకి అర్ధం అవుతుంది.

ఇదికూడా ఒకరకంగా కణిక నీతిలోని విభజించి - జయించడం లాంటిదే. ఇదే ఈ నకిలీ కణిక వంశీయుడు లేదా నకిలీ కణిక వంశీయుల నాయకుడు అఙ్ఞాతంగా ఉండి, నిగూఢంగా మానవ సమాజం మీద ప్రయోగిస్తున్న ’విభజించు - ప్రచారించు’అన్న స్ట్రాటజీ.

దీనికి ఒక సజీవ దృష్టాంతం పరిశీలించండి.

మన చిన్నప్పడు అంటే దాదాపు ౩౦ ఏళ్ళ క్రితం, మనలో చాలా మందిమి బడికి సెలవు లొస్తే అమ్మమ్మా తాతయ్యల ఇంటికి పరిగెట్టే వాళ్ళం. అక్కడ రాత్రి అన్నంతినేసి, ఆరుబయట నులక మంచం వేసుకొని తాతయ్య చెప్పే కథలు వింటూ నిద్రపోయే వాళ్ళం. ప్రక్కనే పశువులకొట్టం ఉండేది. మరోప్రక్క నైదిబ్బ [ఎరువు దిబ్బ] ఉండేది. అయినా ఇప్పడున్నన్ని దోమలు మాత్రం ఉండేవి కావు. సుఖంగా చందమామనీ, చుక్కల్నీ చూస్తూ, అమ్మమ్మ తాతయ్యల కథలు వింటూ నిద్రపోయే వాళ్ళం.

మరి ఇప్పడో? ఆరు బయట కాస్సేపు నిలబడితే కాళ్ళను బండకుట్టే దోమలు. వాటి కాట్లకు వచ్చే క్రొత్త రోగాలు. పర్యవసానంగా, విపరీతంగా అమ్ముడుపోతున్న జెట్ లూ, ఆల్ అవుట్లూ, మస్కిటో రిపెల్లంట్లు, మస్కిటో కాయల్స్! కోటాను కోట్ల రూపాయల వ్యాపరం.

మరొక సారి అదే ౩౦ ఏళ్ళ క్రితం నాటి ఓ వార్త ప్రభంజనాన్ని మీకు గుర్తు చేస్తాను. అప్పట్లో అంటే 1975 లనుండి 1980 లల్లో ఓ పుకారు/వార్త విపరీతంగా ప్రచారమయ్యింది.

అదేమిటంటే - చైనా వాళ్ళు కప్పకాళ్ళని తింటారనీ, మనదేశం నుండి లారీల కొద్దీ కప్పకాళ్ళు దొంగ రవాణా అవుతున్నాయనీ. మధ్యమధ్యలో అక్కడో లారీ, ఇక్కడో లారీ పట్టుబడిందని కూడా వార్తలొచ్చాయి. గ్రామీణులు కప్పల్ని చంపి, కాళ్ళు సేకరిస్తే చాలనీ, దళారులు వాళ్ళ గ్రామాల్ని అప్రోచ్ అయి కొనుగోళ్ళు చేస్తూన్నారనీ, ఒకోసారి ఇవే పత్రికల్లో అదంతా వదంతులేనని, గ్రామీణులు కప్పల్ని చంపేస్తున్నారనీ వార్తలొచ్చాయి. ఒకోసారి ఇవే పత్రికల్లో ఫలానా గ్రామంలో కొందరు కప్ప కాళ్ళమ్మి లక్షాధికారి అయ్యారని వార్తలొచ్చాయి. కొన్నాళ్ళవి పుకార్లనీ, కాదు నిజమేనని సంచలనాలు రేగాయి. కొన్నాళ్ళకి అంతా చప్పబడిపోయింది.[నల్గొండ జిల్లా సూర్యపేటలో ఒకతను ఇలా కప్పకాళ్ళ వ్వాపారం చేసి బాగా సంపాదించాడనీ, అయితే చనిపోయే ముందు అతడు చాలాకాలం మంచాన పడ్డాడనీ, అప్పుడతని శరీరం కప్పలాగా ఆకుపచ్చగా మారి, కప్ప ఆకృతిలోకి వచ్చిందనీ, 1999 లో అక్కడి సి.ఐ. చెప్పగా విన్నాను].

ఇవన్నీ ఇప్పట్లాగే అప్పడూ అందరం, ఉదయాన్నే కాఫీ కప్పుతో పాటు, అలవోకగా పేపరు చదువుతూ క్యాజువల్ గా చదివారు. కానీ ఎవరూ, క్రమంగా భారతదేశపు గడ్డ మీద జీవ సమతుల్యత దెబ్బతిందనీ, కప్పలు సంఖ్య భయకరంగా తరిగి పోయిందనీ గమనించలేదు. వాటి చప్పడు మీద అసహ్యం వేసి కొందరు నీటి గుంటల్లో, మురికి గుంటల్లో యాసిడ్ పోసి కప్పల్ని చంపారని కూడా మరికొన్ని వార్త లొచ్చాయి.

కాని ౩౦ ఏళ్ళ తర్వాత ఇప్పడు జరుగుతున్న కోట్లాది రూపాయల మస్కిటో రిపెల్లంట్ల వ్వాపారానికి, అది ఆనాడు ఆధారపేఠిక [బేస్ మెంట్] నిర్మించిందని ఉహించగలమా? ఇదే ఉహించలేని చోట మొన్నామధ్య కళ్యాణ్ రామ్ సినిమా ’హరే రామ్’లో చూపినట్లుగా రోగమూ, మందు కూడా వాళ్ళే సృష్టించి డిమాండ్ గా అమ్ముకొనే వ్వాపార కణిక నీతిని అసలు తెలుసుకోగలమా?

ఇప్పటికి దోమల రోగనిరోధక శక్తి ఎక్కువ అంటూ దానికి శాశ్వత పరిష్కారం చూపటం లేదు.

అమాయకంగా, మనం “రోజులు మారి పోయాయి. కాలుష్యం పెరిగి పోయింది. వాటితో పాటే దోమలూ, వాటి ఇమ్యూనిటీ కూడా పెరిగిపోయింది” అనుకొంటూ మన నెల వారీ సరుకుల బడ్జెట్ లో మరి 100 రూపాయలు అదనంగా మస్కిటో రిపెల్లంట్లు ను కొనడానికి కేటాయించుకొంటాం. అంతే!

ఇంత పకడ్బందీగా, ఒక్క ఆర్ధిక రంగంలో ఒక్క అంశం మీదే ప్రయోగింపబడే, నకిలీ కణిక వంశీయుల గూఢచార నైపుణ్యం, ఇక అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటే దానికి చాలా లోతైన పరిశీలన కావాలి. మనం అంతలోతుగా పరిశీలించ కూడదు. పరిశీలిస్తే ఒక నాటికి కాకపోతే మరో నాటికైనా తాము చేస్తూన్న కుట్రని కనిపెడతాం. అప్పడు దగా పడం. కనుక మన జీవితాల్లో బిజీ పేరిట పరుగు సృష్టింప బడుతోంది. ఇదంతా మారిన కాల మని మనం నమ్ముతున్నాం.

ఇక్కడ మరోసారి ‘గుడ్డివాళ్ళు ఏనుగు తడుముడు’ కథ దగ్గరికి వద్దాం.

ఏనుగు ఒకోభాగాన్ని తడిమిన వాడు ఏనుగుని ఒకోరకంగా నిర్వచించినట్లుగా - మనలో కొంతమంది ఈ సుదీర్ఘ కుట్రని కుల గజ్జిగానూ, మరికొంత మంది మత మౌఢ్యంగా, మరికొందరు మతోన్మాదం, ఇంకొందరు టెర్రరిజంగా, ఇంకొందరు రాజకీయ కుళ్ళుగా, మరికొందరు పెరిగిన అవినీతిగా, ఇంకా కొందరు వ్వాపారుల స్వార్ధంగా, ఇంకొందరు కాలం మారిపోవడంగా నిర్వచిస్తూన్నారు. నిజానికి గుడ్డివాళ్ళూ గుర్తించింది విడివిడిగా ఏనుగు దేహాన్నే. కాగా మొత్తంగా ఏనుగుని కాదు. అలాంటిదే పైన వివరించిన నిర్వచనాలు కూడా. ఇవన్నీ దండలోని పూసల్లాంటివే. ఇవన్నీ కుట్రకు పైన వేయబడిన పైపూతలే.

ఈ నకిలీ కణిక వంశీయులూ, వారి నాయకుడూ కలిసి చేస్తున్న సుదీర్ఘ కుట్ర ఈ పూసల్ని గుచ్చేదారం లాంటిది.

ఈ అంతస్సూత్రం అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో పనిచేస్తూంది.

ఈ నకిలీ కణికుడెవరో, ఎక్కడి నుండి పని చేస్తున్నాడో, దేని కోసం ఇదంతా చేస్తూన్నాడో అర్ధం చేసుకోవాలంటే ఇంకొంచెం సమయాన్నీ కేటాయించాల్సి ఉంది.

అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర, భారత దేశం మీద కేంద్రీకృతమైంది.

ఎలా?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకొనే ముందు మరో కోణాన్ని పరిశీలించండి.

మనమంతా .....

ముంబాయి ముట్టడిలో పట్టుబడ్డ తీవ్రవాది ’కసవ్’ తను లక్షన్నర రూపాయలకు ఒప్పకొని, ఈ నరమేధం సృష్టంచడానికి ముంబాయికి మరో పదిమందితో కలిసి వచ్చాననీ, తాను చదువుకోలేక, కూలీకి వెళ్ళి, చిన్నచిన్న దొంగతనాలు చేసి ఆకలి తీరక, దారిద్ర్యానికి లొంగి, తీవ్రవాది అయితే కెరియర్ బాగుంటుందని ఇందులో చేరాననీ, ఈ ఆపరేషన్ చేస్తే తమ కుటుంబానికి డబ్బూ, ఇల్లూ ఇస్తామన్నారనీ, తనని చంపెయ్యమనీ లేకపోతే లష్కరే తోయిబా తమ కుటుంబసభ్యుల్ని చంపేస్తుందని వేడుకొంటున్నాడనీ మనమంతా మీడియాలో చదివాం, చూశాము. [నేనైతే డిసెంబర్ 3, 2008, ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ ఎడిషన్ లో ఇది చదివాను] రేపు ఈ తీవ్రవాదే మాటమార్చనీయండి లేదా మీడియానే మాట మార్చనీయండి. టెర్రరిజం వైపు పాక్ ముస్లిం యువత అడుగులు వేయడానికి కారణం దారిద్రమేనన్నది పచ్చినిజం. ఒక్క పాకిస్తాన్ లోనేకాదు, ఆఫ్గానిస్తాన్ అయినా, సిరియా అయినా, లిబియా అయినా, సోమాలియా అయినా, ఇండియా అయినా, బాంగ్లాదేశ్ అయినా మానవబాంబుగానో ఆత్మాహుతి దాడికో పాల్పడిన ప్రతి ఉన్మాద తీవ్రవాది - అంతకు ముందు దారిద్ర బాధితుడూ, ఆకలి బాధితుడూ లేదా చిన్నతనంలోనే అంటే ఏ ఐదారేళ్ళ వయస్సులోనో తల్లితండ్రుల దారిద్ర్యం రీత్యా రోడ్డున బడి ఉగ్రవాద సంస్ధల చేత ఉన్మాదులుగా పెంచబడిన 23 ఏళ్ళ లోపు యువకులే! ఇది చెప్పడం లేదూ వీళ్ళు మరెవ్వరి చేతిలోనో ఉన్న రిమోట్ కంట్రోల్డ్ బొమ్మలని?

నిజానికి ఇప్పడు భారత్ లో నడుస్తున్న చేపలు పట్టడం నేర్పకుండా చేపలిస్తున్న సంక్షేమ పధకాలు, నకిలీ పురుగు మందులు, ఎరువులూ, విత్తనాలూ, దళారులతో నాశనం చేయబడుతున్న వ్యవసాయాలతో ఆర్ధిక స్వావలంబన నశించాక భారతదేశమైనా పాకిస్తాన్ లాగే మారుతుంది.

ఎందుకంటే అది ఆకలి బాధ. ప్రాణికి ఆకలి బాధ భరింపరానిది. అది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తూంది.

సాక్షాత్తూ వ్యాస భగవానుడు, గీతని గ్రంధస్ధం చేసిన ఙ్ఞాని, అష్టాదశ పురాణాన్ని గ్రంధస్ధం చేసిన యోగి, భారత భాగవతాన్ని రచించిన మహామునీ, అపర ఈశ్వరుడని మనం నమ్మే మహానుభావుడు. అంతటి వ్యాసమహార్షే క్షామం వారణాసిని పట్టి పీడించినప్పడు కుక్కని చంపి తిన్నాడనీ, కాశీ నగరంలో తనకి భిక్ష దొరకనందున నగరాన్నే శపింపబోయి, కాశీ అన్నపూర్ణ శాపానికి గురై నగర బహిష్కారం పొంది వ్యాసకాశిలో నివసించాడనీ మనం పురాణాల్లో చదివాం. కాశీ వెళ్ళినప్పడు అంతే భక్తిగా వ్వాసకాశీని కూడా దర్శించి వస్తాం.

అంతటి వాణ్ణే నైచ్యానికి పురికొల్పిన ఆకలి ముందు సామాన్య మానవులం, మనం ఎంత?

ఆకలంటే దేవుడి పేరిట ఉపవాసం అంటూ ఫలహారం తినటం కాదు.

ఆకలంటే అమ్మమీదో, ఇతర కుటుంబ సభ్యుల మీదో అలిగి అన్నం మానేసినప్పడు కలిగే బాధ కాదు. అప్పడు కోపం, పంతమో ఎక్కువ. అదీగాక అలిగినప్పడు అమ్మో, మరోకరో బ్రతిమిలాడాక పోతారా అన్న ఆలోచన చుట్టు తిరుగుతుంది మనస్సు. ఇంకా చెప్పాలంటే మరీ ఆకలికి వేగలేక పోతే తినడానికైతే సిద్ధంగా తిండి ఉంది అన్న భరోసా నిజమైన ఆకలి బాధేమిటో అనుభవానికి రానివ్వదు.

నిజమైన ఆకలి దారిద్ర్యంలో వస్తుంది. ఆకలేసినా, తినడానికి తిండి లేదు, కోనడానికి డబ్బులేదు అన్నభావన, వాస్తవం భయోత్పాతం కలిగిస్తుంది.

ఆకలి నిజంగా భయంకరమైనది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాంటి ఆకలి ముందు, అలాంటి దారిద్ర్యం ముందు ఎవరైనా ఓడిపోతారు. అది ఈనాడు పాక్, అఫ్గాన్, సోమాలియా ల్లాంటి దేశాల్లోని ముస్లిం యువకుల రూపంలో కన్పిస్తున్నాయి.

ఇలాగే చూస్తూ ఉంటే ఈనాడు పాక్ ఉన్న స్ధితిలో రేపు ఇండియా ఉంటుంది, ఎల్లుండి అమెరికా ఉంటుంది, ఆ మర్నాడు మరో దేశం ఉంటుంది.

ఎందుకంటే 102 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఏ అంబానీ సోదరులో, రతన్ టాటాలో భాగ్యవంతులౌతున్నారు. 2600 కోట్ల నుండీ 4500 కోట్లదాకా ఖర్చుపెట్టీ 6 గురి కోసం విలాసవంతమైన నివాస మందిరాల్ని కట్టించుకోగల ధనవంతులు ముఖేష్ అంబానీ లాంటి కొద్దిమందే. ఇప్పటికే దోపిడి కేంద్రీకృతమై, దరిద్రుల సంఖ్య పెరుగుతోంది.

ఈ స్ధితి పాక్ లో మనకంటే ముందు జరిగింది.

మన భారతదేశపు గడ్డమీద భారతీయులం దగా పడ్డాం.

కానీ మననుండి విడిపోయిన పాకిస్థాన్ గడ్డమీద మొత్తంగా మానవత్వమే దగా పడ్డది.

వాస్తవానికి పాకిస్తాన్ ఓ బలి పీఠం.

దరిద్రం, ఆకలి కోరల్లో చిక్కిన అక్కడి యువత ఒకొక్కరూ ఒక్కో సమిధ. అంతే!

నేను వీళ్ళను చూసి జాలి పడమని చెప్పడం లేదు. వెనుక నున్న కారణాలు చూడమంటున్నాను.

నిజానికి మనమంతా అనుకొంటున్నాం, ఈ నర మేధమంతా పాకిస్తాన్ చేయిస్తోందనీ, ముస్లిం టెర్రరిస్టులు చేస్తున్నారనీ,
కానీ ఒక్కసారి రెప్పలెత్తి చూస్తే ...

పాక్ మాత్రం బావుకున్నదేముందనీ?

అక్కడా సామాన్య ప్రజలు దారిద్ర్యంతోనూ, అవిద్యతోనూ, ఆకలితోనూ, హింసతోనూ జీవితాలు అల్లకల్లోలమై ’దినదిన గండం నూరేళ్ళాయుష్షు’లాంటి బ్రతుకులు వెళ్ళతీస్తున్నారు.

ఎందుకంటే పాక్ లోనూ కొద్దిమందే ముఖేష్ అంబానీలు. వారిలో ఎక్కువమంది మాజీ సైనికాధికారులు, వారి గూఢచార సంస్ధ ఐన ఐ.ఎస్.ఐ. మాజీ అధికారులు. పాక్ లో ఉన్న పారిశ్రామిక సంస్థలో, వ్వాపార సంస్థలో ఎక్కువ భాగం వారివే నని ముషారప్ పదవిచ్యుతుడైన జూలై, 2008 వార్తపత్రికల్లో చదివాను. [జూలై 8 నుండి 15 వతేదీలోపుల అన్నట్లుగా నాకు గుర్తు]

కాబట్టి పాక్ లో ఉన్న 28కోట్ల మందిలో కొన్ని వేలమంది మాత్రమే ధనికులు. మిగిలిన వారిలో మధ్యతరగతి ప్రజలూ, కనీసం తిండి తినగల వారూ పోతే ఎక్కువ మంది ఆకలికి అలమటించే కటిక పేదవారే.

ఇప్పడు అర్ధం చేసుకోగలం కదా మానవ ప్రాణం ఎందుకు, ఎలా చౌక అయిపోయిందో?

ఎవరు మానవ బాంబులై ’రెడీ టూ యూజ్’ గా ఉన్నారో?

మనం ఓ హింస చెలరేగినప్పడు, ఓ వరుస బాంబు దాడి జరిగినప్పడు ఆవేశపడి, ఆక్రోశపడి, ఆపైన చల్లబడి మళ్ళీ మన దైనందిన జీవన వ్వాపారాల్లో చొరబడి పోయేంత తేలికైన విషయం కాదిది.

ఇలాగే వ్యవసాయం, ఆర్ధికాభివృద్దిని నిర్లక్యం చేస్తే మన కాలనీలో, ప్రక్కనున్న బస్తీల్లోంచో ఓ టీనేజర్ ఓ ఎకె 47 తో మన ఇంట్లోకే చొరబడే రోజు సమీప భవిష్యత్తులోనో మన ఇంటి తలుపుతడుతుంది.

కాబట్టి ప్రక్క మతం వాడినో, ప్రక్క దేశం వాడినో తిట్టుడం కాదు, మనం చేయవలసినది. రాజకీయం చేస్తోన్న వాళ్ళని, కుట్రలు చేస్తూన్న వాళ్ళని, వాళ్ళు చేస్తూన్నా కుట్రనీ కనిపెట్టడం.

ఎందుకంటే సమస్య ఎక్కడుందో, ఏమిటో తెలుసుకుంటే పరిష్కారం ఏమిటో, ఎలాగో తెలుస్తుంది.

ఎందుకంటే ఎక్కడ మనం వస్తువుని పారేసుకున్నామో తెలిస్తే, అక్కడే వెదక గలం. కాబట్టి మనం పోగొట్టుకున్న వస్తువు తిరిగి మనకు దొరుకుతుంది.

కాబట్టి మనం, మన మానవత్వాన్ని ఎక్కడ పారేసుకున్నమో ఆలోచించండి. ఎవరో తీయిస్తున్న పరుగులో మనమూ తెలియకుండానే ఎందుకు పరుగుపెడుతున్నామో తెలుసుకోవాలి.

ఈ సమస్యని పరిష్కరించడానికి మనం రోడ్లెక్కనక్కర లేదు.

ధర్నాలు చేయక్కర్లేదు. దిష్టిబొమ్మలు కాల్చక్కర్లేదు.

కానీ ఆలోచించాలి. మోసం ఎక్కడుందో తెలిస్తే మోసపోం కదా?

అందుకు ఆలోచించాలి. తార్కికంగా ఆలోచించాలి.

ఈ నేపధ్యంలో ఆలోచిస్తే ఈ స్వార్ధ మీడియా అంతా, ఎవరికి అంతిమ లబ్ది చేకూర్చడానికి కణిక నీతిని అంటే విభజించి - ప్రచారించు అన్న తంత్రన్ని ప్రయోగిస్తోంది?

1990 లో రష్యా కూలిపోయేదాకా అమెరికా, రష్యాలు ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో ఆయుధాలు, ఇంధనమూ ఇబ్బడిముబ్బడిగా అమ్మి వ్వాపారం చేసుకున్నారు. ఆరోజు కుట్రకు అది పైకి చెప్పబడిన కారణం.

1991 లష్కరే తోయిబా ల్లాంటి సంస్థలు ఇస్లాం మతం, జీహద్ అన్న పైకారణాన్ని బయటకు తీసాయి. నిజానికి అంతర్గత కుట్రకూ, దోపిడికి ఇవి పైపూత మాత్రమే.

నిజానికి అఖండ భారతదేశం మూడు ముక్కలు[ఇండియా, పాక్, బంగ్లాదేశ్] కావడం వెనుక ఇప్పడు ఇండో పాక్ దేశాల మధ్య నెలకొంటున్న ద్వేషం వెనుకా ఉన్నది కణిక నీతే [విభజించు - పాలించు అన్న తంత్రమే]. ఇక్కడ నేను పాకిస్తాన్ అంటోంది అక్కడి జర్దారీ ప్రభుత్వాన్ని లేక ముషారప్ ప్రభుత్వాన్ని కాదు. పాక్ గడ్డనీ, పాక్ ప్రజలనీ. పాక్ పూర్వ లేదా ప్రస్తుత ప్రభుత్వాలకీ భారత్ లోని ఎన్.డి.ఏ. లేదా యూ.పి.ఏ.ప్రభుత్వాలకీ తేడాలేదు. దొందు దొందే. ఈ రెండు ప్రభుత్వాలూ నకిలీ కణికుడి [కింగ్ మేకర్ల] చేతిలోని బొమ్మలే. కాకపోతే ఇందులో ఓ బొమ్మ ‘కీ’ మరో బొమ్మ చేతిలో ఉంటుంది. భారతదేశపు ప్రస్తుత సీ.ఈ.వో.లాంటి ప్రధానమంత్రి ‘కీ’ కుర్చీ వ్యక్తి చేతిలో ఉన్నట్లన్న మాట.

అలాంటప్పడు ఈ కుట్ర ద్వారా ఎవరు అంతిమ లబ్ది పొందుతున్నారు?

ఒకప్పడు బ్రిటన్, రష్యా, అమెరికా లాంటి దేశాలు, కె.జి.బి., సి.ఐ.ఏ. ల్లాంటి సంస్థలూ ప్రపంచాధిపత్యం చూపించాయి. లబ్ధి పొందినట్లు కన్పించాయి. ముస్లిం ఉగ్రవాద సంస్థలు, పెట్రో డాలర్లు ఆ స్థానంలోకి వచ్చిందన్న వాదన ఒ ప్రక్క విన్పిస్తోంది. మెల్లిగా దేశాలూ, నిఘా సంస్థలు ఫేడవుట్ అయిపోయి బిన్ లాడెన్ లూ, దావూద్ ఇబ్రహీముల్లాంటి వ్యక్తులు రంగం మీది కొస్తున్నాయి. దేశాలూ, సంస్థల మాదిరిగానే ఈ వ్యక్తులు కూడా నకిలీ కణికుడి చేతిలోని కీలు బొమ్మలు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అతిముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ప్రపంచాన్ని వణికించగలడనీ, నడిపించగలడనీ.

ఆ వ్యక్తిగా సెప్టెంబర్ 11, 2001 అమెరికాపై ఉగ్రవాది దాడి ‘బిన్ లాడెన్’ ను చూపించింది.

కాని బిన్ లాడెన్ నకిలీ కణికుడి చేతిలోని మరబొమ్మ.

మరయితే ఎవరీ నకిలీ కణికుడు? ఎక్కడనుండి ఇదంతా నడుపుతున్నాడు?

ఈ ప్రశ్న చిన్నది. జవాబు సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది.

టపా నిడివి రీత్యా ఆపక తప్పడం లేదు.

దీన్ని మరింత విపులంగా చర్చించాలన్నా, సమగ్రంగా వివరించాలన్నా మరికొన్ని టపాలు అవసరం.

తదుపరి టపాలలో ఈ ప్రయత్నాన్ని మరింత కొనసాగిస్తాను.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

you are not an ordinary lady (if your profile says truth-because here in blogworld everyone is someone else usually)

excellent analysis
awaiting continuation

excellent analysis

బొల్లోజు బాబా గారు:
నేను చాలా సాధారణ పంతులమ్మ నండి. కాకపోతే జీవిత పోరాటం నాకు మరింత Tougfnessను, నిశిత పరిశీలననీ నేర్పింది. నా బ్లాగులోనూ, నా profile లోను వ్రాసిన ప్రతి అక్షరం నిజం. నిజం. ఈ టపా మాలికలు పూర్తయ్యేలోగా మీ సందేహాలు అన్ని తీరుస్తాను.

"ఏనుగు ఒకోభాగాన్ని తడిమిన వాడు ఏనుగుని ఒకోరకంగా నిర్వచించినట్లుగా - మనలో కొంతమంది ఈ సుదీర్ఘ కుట్రని కుల గజ్జిగానూ, మరికొంత మంది మత మౌఢ్యంగా, మరికొందరు మతోన్మాదం, ఇంకొందరు టెర్రరిజంగా, ఇంకొందరు రాజకీయ కుళ్ళుగా, మరికొందరు పెరిగిన అవినీతిగా, ఇంకా కొందరు వ్వాపారుల స్వార్ధంగా, ఇంకొందరు కాలం మారిపోవడంగా నిర్వచిస్తూన్నారు. నిజానికి గుడ్డివాళ్ళూ గుర్తించింది విడివిడిగా ఏనుగు దేహాన్నే. కాగా మొత్తంగా ఏనుగుని కాదు. అలాంటిదే పైన వివరించిన నిర్వచనాలు కూడా. ఇవన్నీ దండలోని పూసల్లాంటివే. ఇవన్నీ కుట్రకు పైన వేయబడిన పైపూతలే"

ఏనుగు కథ అద్దిరింది :)

మీరు టీచరన్నమాట! నేను సదువుకునేరోజుల్లో మీలాంటి టేచర్లుంటే చాలా బాగుండేది!!

నేను మీ బ్లాగు ప్రొఫైల్ చూడలేదు సుమండీ, ఇప్పటి దాకా.
Kudos to you Ma'am.

తొందరగా చెప్పేయండి ఆ కణిక నీతేంటో మరి? అది ఎవరో?

కొంపతీసి అదంతా western world కుట్ర అంటారా ఏంటి?

పంతులమ్మ గారూ,
మీ మనసులో ఒక అగ్నిపర్వతం (knowledge bank) ఉన్నట్లు ఉంది .మీ స్టూడెంట్స్ కు ఇలాంటి విషయాలు చెప్తుంటారా?
నాకైతే ఒక మంచి టిచర్ దొరికిందని పిస్తుంది.
మీ బ్లాగ్ పేరు అమ్మ బడి ఐతే బాగుంటుంది .

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

What ever you said is correct, but no one is not in a position to understand or think about the future, because no one is considering the fact "Dharmo rakshitha rakshithaha:"

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu