ఈ టపాకి నిజానికి మంగలి వాని బంగారం-రాజకీయాధికారం అని అచ్చ తెలుగులోనే శీర్షిక పెట్టాలనుకున్నాను. కాని ఎక్కడ మంగలి వారి మనోభావాలు దెబ్బతింటాయో, ఎక్కడ మంద కృష్ణమాదిగలాగా ఏ గుంపురామమంగలి గారి కులసంఘ సభ్యులంతా కలిసి బ్లాగు లోకమ్మీద దాడి కొస్తారోనని భయపడి ఆంగ్లాన్ని ఆశ్రయించి బార్బరు అంటు ప్రయోగించాను.

ఇక విషయంలోకి వస్తాను.

ఒకప్పుడు అక్బర్ ఆస్థానంలో ఓ ఆస్థాన మంగలి ఉండేవాడు. అతడు తన వృత్తిలో చాలా నేర్పరి. అతడు గడ్డం గీస్తే అక్బరుకి మల్లెపూల చెండుతో చెంపలు తడిమినట్లుంటుంది. అతడు తలపైన ॒క్షౌరం చేస్తే ప్రేమగా తన మనమరాలు తన జుట్టుతో ఆడుకున్నంత హాయిగా ఉంటుంది. అతడు తైలమర్దనా చేసి ఒళ్ళంతా మాలీషు చేస్తే ఏదో లోకంలో విహరించినట్లుంటుంది. అందుచేత అక్బరుకి ఈ మంగలంటే కాస్త అభిమానం పెచ్చు. దానితో మంగలికి కూడా పాదూషా దగ్గర కాస్త చనువు ఉండేది.
ప్రతి రోజూ మంగలి ॒క్షుర కర్మ చేసేటప్పుడు పాదుషా యధాలాపంగా ఏదో మాట్లాడుతుండేవాడు. పాదుషా తనపాలన గురించి ప్రజలేం అనుకొంటున్నారని అంటే మంగలి పాదుషాని ప్రజలు దేవుడంటున్నారని, ఆయన పాలన అంతనీ ఇంతనీ పాదుషాని ఆకాశాని కెత్తేసేవాడు. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారని అక్బరు అడగటం ఆలస్యం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనీ, సిరిసంపదలతో తులతూగు తున్నారనీ చెప్పేవాడు. అందులో కొంత నిజం, మరికొంత ఎక్కువ అతిశయోక్తులు ఉండేవి.

ఇదంతా గమనిస్తున్న బీర్బలు మంత్రి వ్యవహరాన్ని ఇలాగే వదిలేస్తే ॒క్షేమం కాదనుకొన్నాడు. మంగలి, పాదుషా గారి శరీరానికి తైలం వేస్తే ఫరవాలేదు. మనస్సుకి వేస్తున్నాడు. అది పరిమితి దాటితే ప్రమాద హేతువే. ఏ శతృరాజైనా ఈ మంగలినే వేగుగా ప్రయోగిస్తే?
అందుచేత బీర్బలు మరునాడు నుండి పాదుషా క్షురకర్మ చేయుంచు కొనేటప్పడు తానూ పాదుషా ప్రక్కనే ఉంటూ పిచ్చాపాటి మాట్లాడసాగాడు. ఓ రోజు అలాగే పిచ్చాపాటి మాట్లాడతుండగా, తరచుగా పాదుషా అడిగే ప్రశ్నను ఈ సారి బీర్బల్ అడిగాడు, అక్బరు వారి పాలనలో ప్రజలెలా ఉన్నారని. మామూలుకంటే ఎక్కువ హుషారుగా మంగలి ప్రజలంతా భోగభాగ్యలతో తులతూగుతున్నారనీ, హాయిగా ఏ కష్టమూ లేకుండా ఉన్నారనీ, అంతా పాదుషా వారి చలవేననీ తెగతైలం వేసేశాడు.

ఇంతలో పాదుషాకి ॒క్షురకర్మ చేయటం పూర్తయింది. మంగలి కత్తి గట్రా శుభ్రం చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళాడు. బీర్బలు మంగలి పొదిని తెరిచాడు. అక్బరు, బీర్బల్ చర్యల్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. బీర్బల్ మంగలి పొది వెదుకుతున్నాడు. ఆశ్చర్యం! ఆ మంగలి వాని పెట్టెలో [పొది] లో కోడి గ్రుడ్డంత బంగారం ముద్ద ఉంది. గప్ చుప్ గా బీర్బల్ దాన్ని తీసి దాచేసాడు. ఏ పనీ బీర్బల్ వృధాగా చేయడనీ తేలిసిన అక్బర్ ఏం జరుగుతుందో చూడదలిచి ఏమి అనలేదు.

ఇంతలో మంగలి వచ్చి తన పెట్టి అడుగున బంగారం పోయిన సంగతి తెలియదుగనుక మామూలుగా కత్తి గట్రా సర్దుకొని పాదుషా దగ్గర సెలవు తీసికొన్నాడు.

మరునాడు మంగలి ముఖం వాడి పోయి ఉంది. ప్రపంచంలోని కష్టమంతా తనకే వచ్చినట్లున్నాడు. అతడి ముఖంలో దిగులూ, దుఃఖమూను.

చాలా నీరసంగా, నిస్తేజంగా పాదుషా వారికి గడ్డం గీస్తున్నాడు. నిన్నటి ప్రశ్ననే బీర్బల్ మళ్ళీ మంగలిని అడిగాడు. మంగలి నిట్టూరుస్తూ "ఏం చేప్పను హుజూర్! ప్రజలంతా నానా ఈతి బాధలతో సతమతమౌతున్నారు. దరిద్రం, అనారోగ్యం వారిని కుదిపెస్తున్నాయి. ఎటు చూసినా బాధార్తులే!" అన్నాడు.

అక్బరు కూ చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఈ రోజు మంగలి కత్తి కడగటానికి వెళ్ళినప్పడు బీర్బల్ మంగలి పొదిలో బంగారాన్ని యధాతధంగా పెట్టెసాడు. ఇదేమీ తెలియని మంగలి అదే దుఃఖభారంతో పాదుషా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

మరునాడు మంగలి ముఖం వెలిగిపోతుంది. హుషారుగా, ఆనందంగా పాదుషా వారికి క్షురకర్మ చేస్తున్నాడు. బీర్బల్ యధాలాపంగా అడిగినట్లు రోజుటి ప్రశ్నను వేశాడు. మంగలి ఎంతో ఆనందంగా "ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తున్నంత హయిగా జీవిస్తున్నారు" అంటూ వెనకటి జవాబే చెప్పాడు. ఇందతా చూస్తూన్నా అక్బర్ ఫకాలుమని నవ్వాడు. మంగలికేమీ అర్దంకాలేదు. పాదుషా చిరునవ్వుతో "పోయిన నీ బంగారం తిరిగి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు" అన్నాడు. మంగలి మ్రాన్పడి పోయాడు. "హుజూర్! నా బంగారం పోయి దొరికినట్లు తమరికెలా తెలుసు?" అన్నాడు.

అక్బర్ మాట్లాడకుండా చిరునవ్వుతో అతడికి బహుమతి ఇచ్చి పంపేశాడు. బీర్బల్ వైపు సహేతుకంగా చూశాడు.

బీర్బల్ చిరునవ్వునవ్వి "హుజూర్! తనపెళ్ళి విశ్వకళ్యాణం అనీ, తన చావు జగత్ర్పళయమనీ కొందరనుకొంటారు. పచ్చిస్వార్దం తప్ప అందులో మరేమి ఉండదు. అలాంటి వాళ్ళా మాటల్లో విశ్వసనీయత ఉండదు. అలాంటి వారి నివేదీకల్ని నమ్మరాదు" అన్నాడు.

అక్బర్, బీర్బల్ సునిశిత ఆలోచనా పటిమని మెచ్చుకొన్నాడు.

ఇదీ కథ!

విశేషమేమంటే ఈనాటి రాజకీయనాయకులంతా అలాంటి మంగలి వారే! కోడిగ్రుడ్డంతా బంగారం ఏమిటంటే అధికారం. తాము అధికారంలో ఉంటే ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉన్నారనీ, కిలో రెండు రూపాయిల బియ్యమో, జన్మభూమో, జలయఙ్ఞమో, రాజీవ్ ఆరోగ్యశ్రీయో లేదా భారత్ వెలిగిపోతుందనో లేదా సెన్సెక్స్ ర్యాలీతో భారత్ బలియశక్తిగా మారిందనో తొక్కో తోలో ప్రజల్ని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నట్లు, సుఖలెక్కువై ప్రజలు మత్తెక్కి పోయరనీ అంటారు. అదే బంగారం అంటే అధికారం పోయిందనుకోండి. ఈ రాజకీయ నాయకులంతా అచ్చంగా మంగలివాడి లాగానే ప్రజలు నానా బాధలూ పడుతున్నారని, దారిద్ర్యంతో నానాయాతనలు పడుచున్నారనీ, ఆకలి చావులు ఛస్తున్నారనీ అంటారు. అప్పడు పాదయాత్రలూ, ప్రజాఅంకిత యాత్రలూ, మీకోసం యాత్రలూ చేస్తూ గర్జనలూ, ఘోషలూ పెడుతుంటారు.

ఆంధ్రప్రదేశ్ నుండీ అమెరికా దాకా, చిరంజీవిలాంటి రాబోయే రాజకీయ నాయకుల దగ్గరి నుండీ ఒబామాలాంటి అయిపోయిన రాజకీయ నాయకుల దాకా అందరిదీ ఇదే బాట.

ఒక రాజకీయ గుంపు [అంటే పార్టీలన్నమాట] సెజ్ లతో అభివృద్ధి, సెన్సెక్స్ తో, జలయఙ్ఞంతో అభివృద్ధి అంటుంది. మరో గుంపు ఒకసారి ఐటి తోను, యూజర్ చార్జిల తోను, లేదా అన్ని ఉచితం తోను అభివృద్ధి అంటుంది. మరో గుంపు హిందూ ఉగ్రవాదమే అభివృద్ధి అంటుంది. మరో గుంపు ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజలకి పంచి పెడ్తే చాలు ప్రజలంతా అభివృద్ధి సాధిస్తారు అంటుంది. ఇంక అలా ఇలా కాదని మరో గుంపు ఏకంగా జిహదీతో సర్వనాశనమే సమస్తం అంటుంది. ఇప్పడు క్రొత్త సినిమా గుంపు అన్నింటి మేదా అవగాహన ఉంది అది ఏంటో చెప్పను చేసిచూపిస్తా అంటుంది. పళ్ళూడాక కదా ప్రజలకి అర్ధమౌతుంది, ఏ రాయ అయినా ఒకటే పళ్ళూడడానికి అని?

ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా రాజకీయనాయకులంతా ఇంతే! కిలో రెండు రూపాయిల బియ్యం కాకపోతే, సబ్ ప్రైమ్ లూ. ఇక్కడ ఆంధ్రాలో బియ్యం ప్రజావసరమూ, ఆకర్షణీయ పధకమూ అయితే అమెరికాలో స్వంత ఇల్లు ప్రజావసరమూ, ఆకర్షణీయము అయ్యింది. కాకపోతే చేపలు పట్టడం నేర్పడం వదిలిపెట్టి చేపలిచ్చే సంక్షేమ పధకాలు స్వంత ఇంటి నుండి కడుపుకింత తిండి ఉంటే చాలు అనే దగ్గరకి ఎవ్వరినైనా తిరోగతి పట్టిస్తాయి. వ్యవసాయాన్ని, వస్తూత్పత్తిని అభివృద్ధి కాదంటూ, అప్పులు తెచ్చి రోడ్లూ, సిలికాన్ పార్కులూ చూపి అదే అభివృద్ధి అంటూ రాజకీయ మాంత్రికులు మనల్ని ద్వంద్వంలో ముంచి తమ పబ్బం గడుపుకొంటున్నారు.

అవునా, కాదా! ఆలోచించండి!

చివరగా ఒక చెణుకు!

దూరదర్శన్లో జనంతో ముఖ్యమంత్రి దగ్గరనుండి చేయూత, ప్రగతి, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోని ’తైలమర్దనం’[స్వంత గోకుడు] ను చూసిన స్ఫూర్తితో ఈ చెణుకు విసురుతున్నాను. బాగుంటే నవ్వుకోండి, లేకుంటే మరింత మంచి చెణుకు మీరు విసరండి.

మణెమ్మ లేదా మునెమ్మ లేదంటే వీరమ్మ, కాకుంటే పేరమ్మ నోరంతా తెరచి ఇలా చెపుతుంది. "ఇంతకు ముందు రోగమెస్తుందని భయమయ్యెడిది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డిచ్చిండ్రు. భయం లేకుండా ఉన్నాం. కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తూన్నారు, హాయిగా ఉన్నాం."

ఇక చెణుకు ఏమిటంటే ...
సుబ్బమ్మ ప్రకటనలో అంటుంది "ఇంతకు ముందు చావోస్తుందని భయం వేసేది. ఇప్పుడు మెగాస్టార్ రాజచంద్రన్న పాడెశ్రీ కార్డిచ్చిండ్రు. భయం లేకుండా హాయిగా ఉన్నాం." [ఈ మధ్య ఓ ఊరిలో సెజ్ పేరుతో శ్మశాన భూమిని కూడా లాగేసుకున్నారని, శవంతో రోడ్డుపై బైఠాయించారనీ వార్త చదివిన స్ఫూర్తితో ఇది వ్రాసాను. ఇలాగే సెజ్ లతో, అభివృద్ధి చెస్తే రాను రాను శవం కాల్చాడానికీ, పూడ్చడానికి కూడా చోటు దొరక్కపోవచ్చు. అప్పడు పాడిశ్రీ కార్డు ఎంతో ఆకర్షణీయ పధకం అవుతుంది. బహుశ రాబోయె ప్రభుత్వం [ఏ పార్టీ అయినా ఒకటే] ఇదే పధకం తలకెత్తుకున్నా మనం ఆశ్చర్యపోకూడదు సుమా!]

6 comments:

చాలా బాగా చెప్పారు. ఇప్పటి రాజకీయ పరిస్థితికి మంగలి కథ పోలిక బాగా కుదురింది.

సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు..
పేరుకు ప్రజలదే రాజ్యం..పెత్తందార్లదే భోజ్యం..
అన్నాడు శ్రీశ్రీ ఎప్పుడో..దాన్ని వీళ్ళు నిజం చేస్తున్నారు..
మనం చూస్తున్నాము..అంతే తేడా

చదివి వదిలేయకుండా వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు

చాలా బాగా రాశారు
ఎవరు మారిన ప్రజల కష్టలు మారవు,
ఈ మధ్య బ్లాగ్ లొ క్రితం ప్రభుత్వం వల్ల చాలా అభివృద్ధి జరిగింది.ఇప్పడు జరగడం లేదు అని రాస్తున్నారు. అలాంటివారు, ఎవరి వల్ల ఒరిగింది ఏమి లేదు అని తెలుసు కుంటే బాగుటుంది.
http://max6167132.blogspot.com/2008/11/blog-post_20.html

చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

Great comparision andee

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu