గణతంత్ర దినోత్సవ కానుకగా… ఈ చిన్న కల్పిత కథ… మీ కోసం!
~~~~~~~

జనవరి 26,

గణతంత్ర దినోత్సవం.

ఉదయం ఎనిమిది గంటలయ్యింది. ఢిల్లీ చలి! చల్లటి గాలి!

పెరేడ్ కెళ్ళాలి. జండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది.

ప్రధానమంత్రి నివాసంలో, దైనందిన కార్యక్రమాలన్నీ టైమ్ ప్రకారం జరిగి పోతున్నాయి.

అదే స్థితి రాష్ట్రముఖ్యమంత్రుల, మంత్రుల నివాసాల్లోనూ!

కొంచెం భిన్నంగా ఉన్నా…చాలామంది పార్లమెంటు సభ్యుల, శాసన సభ్యుల, బ్యూరోక్రాట్ల నివాసాల్లోనూ… రిపబ్లిక్ డే ఉత్సవాలకి హాజరయ్యేందుకు ఉద్యుక్తులౌతున్న వాతావరణమే నెలకొని ఉంది.

ప్రధాని నివాసంలో…

రాజ్ పథ్ కి బయలు దేరబోతున్న ప్రధానమంత్రికి ఎదురుగా, పార్సెల్ పట్టుకుని నిలబడ్డాడు సహాయకాధికారి.

“ఏమిటిది?” ప్రధాని ప్రశ్న!

“పార్శెల్ సర్! ఒకటి పాక్ సరిహద్దుల్లో కావలి కాస్తున్న సైనికుల దగ్గరి నుండి! మరొకటి ఈ దేశపు మారుమూల పల్లెలోని రైతుల నుండి!”

“ఏముంది వాటిల్లో!”

“విప్పి చూడలేదు సర్!”

‘కానీయ్’ మన్నట్లుగా ప్రధాని సైగ!

విధేయత ప్రకటిస్తూ తల ఊపిన అధికారి పార్సెల్ విప్పాడు.

మొదటి పార్సెల్ లో చిన్నపెట్టె!

అందులో మట్టి ఉంది!

రక్తంతో తడిసిన మట్టి!

చిన్న నోట్ కూడా ఉంది!

అందులో…

“గౌరవనీయులైన నాయకమ్మన్యులకు!

చలిలో, ఎండల్లో, వానల్లో…దేశపు సరిహద్దుల్లో…కుటుంబాలకి దూరంగా… దేశపు భద్రతను నిర్వహిస్తున్నామనే తృప్తితో, నిరంతర అప్రమత్తతలో కావలి కాసే సైనికులం మేం!

యుద్దాలంత పెద్ద కారణాలు అక్కర్లేదు. ఏదో కారణాన కాల్పులకి పాల్పడే శతృమూకల తూటాలు చాలు! శతృదాడిని తిప్పికొడుతూ, నేలకొరిగిన తోటి సైనికులకి కన్నీటి నివాళులర్పించిన వాళ్ళం మేం!

అయినా మాకు బాధలేదు. దేశపు పరువునీ, ప్రతిష్ఠనీ కాపాడుతున్నామన్న తృప్తి ముందు ‘బాధ’ మాసిపోయింది.

ఎందుకంటే – తోటి సైనికుల రక్తంతో తడిసిన ఈ దేశపు మట్టి వాసన, మా ఊపిరిలో ఉంది.

అది మమ్మల్ని నిరంతర కర్తవ్య దీక్ష వైపు నడిపిస్తోంది.

ఈ మట్టి స్పర్శ… ఈ దేశం,

అవినీతిమయ రాజకీయుల నుండి,

అక్రమాల పరిపాలనా విభాగం నుండి,

విఫలమౌతున్న రాజ్యాంగపు అమలు నుండి… రక్షింపబడి తీరుతుందన్న ‘నమ్మకం’ మాలో నింపుతోంది.

అందుకే…

సైనికుల రక్తంతో తడిసిన ఈ మట్టి, మీకూ ‘ఏమైనా…’ గుర్తు చేయగలదేమోనని, ఆశిస్తూ…

ఈ కానుక మీకు!

జై జవాన్!”

అని వ్రాసి ఉంది!

అది చదివిన ప్రధానమంత్రి ముఖం పాలిపోయింది.

కార్పోరేట్ కంపెనీల వత్తిడిని తల్చుకుని, అంతలోనే తేరుకొని “రెండవ పార్సెల్ విప్పు” అన్నాడు.

“యస్ సార్!” అంటూనే అధికారి రెండో పార్సెల్ విప్పాడు.

అందులోనూ ఓ పెట్టె!

దాన్లోనూ మట్టే ఉంది.

చమటతో తడిసిన మట్టి!

అందులోనూ చిన్న చీటీ ఉంది.

వణుకుతున్న చేతుల్తో, అది అందుకుని చదవటం మొదలెట్టాడు.

అందులో

“గౌరవనీయుడైన దేశ నాయకుడా!

చలిలో, ఎండల్లో, వానల్లో… ఆరుగాలం పాటు కురిసే వానలకీ, కాలువల్లోంచి పొలాల్లోకి పారే నీళ్ళకీ మా చెమటని కూడా కలగలిపి, తిండి పండించే రైతులం మేం!

పండిన పంట చేతి కొచ్చే లోపున…విత్తన కంపెనీల చేతుల్లో బాలరిష్టాలు దాటుకొని, మందుల కంపెనీల చేతుల్లో కుదేలై…కూలీల డిమాండ్లలో కునారిల్లి…ఎలాగోలాగ…పండించిన పంట మార్కెట్లకి తెచ్చుకొని అమ్మేవేళ, నేల చూపులు చూసే ధరల్ని చూసి బిక్కమొఖం వేస్తున్నాం.

ఏదైనా అమ్మేవేళకి అడవి ధరలు,

కొనేవేళకి కొరివి ధరలు!

అన్నివేళలా రాజకీయ నాయకుల ఉపన్యాసాల హోరులు!

ధర్నాల దరువులు!

మరో ప్రక్క సెజ్ ల ఆక్రమణలని చూస్తూ నిట్టూర్పులు!

ఇన్ని ఈతి బాధలనూ సహనంగా భరిస్తూ, మేం చిందించిన చమటతో తడిసిన మట్టి ఇది!

బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న తోటి రైతుల భార్యబిడ్డల కార్చిన కన్నీళ్ళు కూడా, మా చెమటలో ఇంకి పోయాయి. ఈ మట్టిలో కలిసి పోయాయి.

అందుకే… ఇప్పటికీ వానలు కురుస్తున్నాయి. నీళ్ళు పారుతున్నాయి. పొలాల్లోని మట్టి మా చెమటతో తడిచి, అన్నం పప్పుగా ఆకృతి తాలుస్తోంది.

అందుకే…మేం చెమటకార్చటం ఆపలేదు, శ్రమించటమూ ఆపలేదు.

ఎందుకంటే – మా చెమటతో తడిసిన ఈ మట్టి మా తరతరాలది.

వేల సంవత్సరాలుగా మా పూర్వీకులు నేర్పిన శ్రమ సంస్కృతిది.

ఆ సంస్కృతే ఇన్ని కష్టనష్టాలకి ఓర్చి నిలబడటం మాకు నేర్పింది.

సహనంగా సమస్యల పరిష్కారం కోసం వేచి ఉండే నిబ్బరాన్ని నేర్పింది.

అందుకే…

మా రైతుల చెమటతో తడిసిన ఈ మట్టి, మీకూ ‘ఏమైనా’ గుర్తుకు తెస్తుందేమోనని ఆశిస్తూ…

ఈ కానుక మీకు.

జై కిసాన్”

అని వ్రాసి ఉంది.

తర్వాత విచారిస్తే… ఒక్క ప్రధానమంత్రికే కాదు, కేంద్రమంత్రులకీ, రాష్ట్రముఖ్యమంత్రులకీ, మంత్రులకీ, పార్లమెంటు సభ్యులకీ, శాసన సభ్యులకీ, ప్రతి పక్ష నాయకులకీ, బ్యూరోక్రాట్లకీ కూడా ఇలాంటి పార్సెల్స్ అందాయని తెలిసింది.

సైనికుల రక్తంతో తడిసిన మట్టి!

రైతుల చమటతో తడిసిన మట్టి!!

‘వీళ్ళల్లో ఏ కొంచెం మార్పునైనా తెస్తుందా లేదా?’ అనే ఉత్సుకతతో, ఆసక్తితో… వందకోట్లకు పైగా భారతీయుల చూపు వాళ్ళపై నిలిచి ఉంది!

జవాబింకా రాలేదు!

4 comments:

మీ రెండు కానుకలు చదివి వచ్చిన ఆలోచన నాతో ఒక చిన్న టపా రాయించింది ధన్యవాదములు

hmm. As usual one more great post from you.

చాలా మంచి కధ.

ఆత్రేయ గారు:చక్కని టపా వ్రాసారు. బాగుంది.

లక్ష్మణ్ గారు: మీ అభిమానానికి నెనర్లండి.

ప్రసూన గారు: నెనర్లు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu