నిన్నటి టపా: సుదర్శన్ వ్యాఖ్య ‘కన్ను’ రాడియా టేపులు ‘కాలు’ [నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు[Circumstantial] – 18]


అనగా అనగా…

ఓ పల్లెటూర్లో సుందరయ్య అనే రైతు ఉండేవాడు. అతడికున్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ, కాలం వెళ్ళదీసేవాడు. అతడికున్నదల్లా ఓ చిన్న ఆవుదూడ మాత్రమే!

ఆ లేగదూడంటే సుందరయ్యకి చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికినా దాన్ని నిమురుతూ, పచ్చిక మేపుతూ గడిపేవాడు. పిల్లాజెల్లా లేని సుందరయ్యకి ఆ దూడంటే అమిత ప్రేమ. ‘ఎంతో ముద్దుగా ఉన్న ఆ లేగ దూడకి మాటలు కూడా వస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది కదా?’ అనుకునేవాడు.

ఇలా ఉండగా… ఓ రోజు ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. అతడు కన్యాకుమారి నుండి హిమాలయాలకు వెళ్తూ, మార్గవశంలో తమ ఊరిలో బస చేసాడనీ, అతడికి చాలా మహిమలున్నాయనీ ఊళ్ళో అందరూ చెప్పుకోసాగారు. రోజూ సాయంత్రం అతడికి పళ్ళూ ఫలాలు సమర్పించుకుని, అతడు చెప్పే నాలుగు మంచి మాటలు విని, వస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుని, ఏదైనా మార్గం చూపమని ప్రాధేయ పడుతున్నారు కొందరు.

ఇదంతా చూసిన సుందరయ్య ఎలాగైనా తన దూడకి మాటలొచ్చేలా చెయ్యాలనుకున్నాడు. సాధువు కాళ్ళ మీద పడి “అయ్యా! నాకున్నదొకే ఆవు దూడ. ఎంతో అమాయకంగా ముద్దుగా ఉంటుంది. అదే నాకు కొడుకూ, కూతురూ కూడా! దానికి గానీ మాటలు వస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో! తమరే ఎలాగైనా దానికి మాటలొచ్చేలా చెయ్యాలి. ఏ మందో, మూలికో ఇవ్వండి” అని బ్రతిమిలాడాడు.

“నాయనా! అది ప్రకృతి విరుద్దం. మరేదైనా… నీ కోసం, కోరుకో” అని ఎంత నచ్చజెప్పినా ‘ససేమిరా’ అన్నాడు.

చివరికి సాధువు ఓ మూలిక ఇచ్చి “దీన్ని సాది దూడగొంతులో పొయ్యి. ఇక అది వసపోసిన పిట్టలా గలగలా మాట్లాడేయగలదు” అని తన దారిన తాను పోయాడు.

ఏనుగెక్కినంత సంబర పడుతూ సుందరయ్య ఇంటికి వచ్చాడు. ఆ మూలికని సాది, రసం తీసి దూడ గొంతులో పోసాడు.

ఆశ్చర్యం!

ఆవు దూడ ‘అంబా అంబా’ అనటం మానేసి, కబుర్లు చెప్పటం మొదలెట్టింది. సుందరయ్య మురిసి పోయాడు. రెండు రోజుల పాటు పనీపాటా మానేసి, దూడ కబుర్లు వింటూ గడిపేసాడు.

మూడో రోజు రాత్రి, ఉరుములూ మెరుపులతో వాన మొదలయ్యింది. అప్పటికే సుందరయ్య అన్నం తినేసి, దూడకి గడ్డి వేసి, దీపం ఆర్పేసి ముసుగు తన్ని నిద్దర పోయాడు.

పాకలో దూడకి చలిగాలి వీస్తోంది. సన్నగా వాన జల్లూ మీద పడుతుంది. దాంతో సుందరయ్యని పిలిచింది. తననీ ఇంట్లో పడుకోనివ్వమంది. మాంఛి నిద్రలో ఉన్న సుందరయ్య ఇవేవీ వినలేదు. దాంతో దూడకి వళ్ళు మండి పోయింది. తటాలున అది తిట్లు లంకించు కుంది.

పెద్దగా పిడుగు పడిన ధ్వనికి సుందరయ్యకి మెలకువ వచ్చింది. అప్పటికే దూడ…
“ఓ సుందరయ్యా! నీ మొహం మండా! నువ్వేమో వెచ్చగా ఇంట్లో పడుకుంటావా? నన్నీ పాకలో పారేస్తావా? సన్న జల్లుకి వళ్ళు తడిచి పోతోంది. చలికి వణుకు పుడుతోంది. నువ్వు మాత్రం దుప్పటి గప్పుకు హాయిగా పడుకుంటావా? నన్నూ లోపల పడుకోనివ్వరా దేభ్యం మొహమా?” అంటోంది.

సుందరయ్యకి ఓ క్షణం ఏదీ అర్ధం కాలేదు. దూడ తనని తిడుతోందని అర్ధమయ్యాక… “నిన్ను ఇంట్లోకి తీసికెళ్తే ఎలా? ఇల్లంతా పేడ కంపు రాదూ?” అన్నాడు.

దూడ “మా జాతి ఇచ్చే పాలూ పెరుగులు ఇంట్లో పెట్టుకుంటావు గానీ, మా పేడ మాత్రం నీకు కంపు కొడుతోందేం?...” అంటూ తర్కాలు తీసి, శాపనార్ధాలు పెట్టసాగింది.

అది మొదలు సుందరయ్య ఇంట్లో నిశ్శబ్దం చచ్చిపోయింది. ప్రతీక్షణం దూడ సుందరయ్యని ఎందుకో ఒకందుకు తిట్టి పోస్తూనే ఉంది.

దెబ్బకి సుందరయ్యకి దూడ మీద మోహం కాస్తా నశించి పోయింది. ఉరుక్కుంటూ ఊళ్ళోకి పోయి, సాధువు గురించి వాకబు చేసాడు. అప్పటికే సాధువు ప్రక్కనున్న ఊళ్ళు దాటి, ఉత్తర దిశగా హిమాలయాల కేసి సాగిపోయాడని తెలిసింది.

పడుతూ లేస్తూ, సాధువుని వెదుక్కుంటూ పరుగెత్తాడు సుందరయ్య. చివరికి ఓ ఊళ్ళో సాధువుని కలిసి, విషయమంతా చెప్పి, దూడకి మాట్లాడే శక్తి పోయి, యధావిధిగా…పూర్వపు దూడలా మారేందుకు మరో మందో మాకో ఇమ్మని బ్రతిమాలాడు.

అతడి గోడంతా విన్న సాధువు, ఎంత దయగా చిరునవ్వు నవ్వుతూ “చూశావా నాయనా! నేను చెబితే విన్నావు గాదు” అంటూ మరో మూలిక ఇచ్చాడు. “దీన్ని సాది దూడకి తాగించు. వచ్చిన మాటలు వచ్చినట్లే పోతాయి” అన్నాడు.

సుందరయ్య సాధువు కాళ్ళ మీద పడి పదేపదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

సాధువు నవ్వుతూ “చూడు నాయనా! ప్రకృతిలో ఒదిగిపో! సంతోషంగా బ్రతికేస్తావు. ప్రకృతిని నీకు అనుకూలంగా ఉపయోగించుకో! సౌకర్యంగా సుఖంగా బ్రతికేస్తావు. కానీ, ప్రకృతిని ధిక్కరించకు. అతిక్రమించకు. అష్టకష్టాలూ పడతావు. అది ప్రకృతి స్వభావం” అన్నాడు.

సుందరయ్య బుద్ధిగా తలూపాడు.

అనుభవంతో తత్త్వం బోధపడింది మరి!

అదండీ కథ!

2011 అందరికీ ఆనందాన్నివ్వాలనీ, నిజాలని దర్శింప చేయాలనీ కోరుతూ…

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

4 comments:

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఎంతచక్కటి కథలు చెప్తారండి మీరు. ఇలాగే ఎన్నైనా వినేయాలనిపిస్తుంది. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీ కథలో లోపాలున్నాయి. విన్న ఎవరైనా పిల్లలో, ఆ దూడనో ఇలా ప్రశ్నిస్తే మీరేం జవాబు చెబుతారు? :ఆ రైతుది కపట ప్రేమ. అంతలా ప్రేమించే దూడను చలిగాలి నుండి రక్షించే ప్రయత్నం నోరిప్పి అడిగినా చేయలేదు. పసికందులు కూడా మల, మూత్రాదులు పక్కమీదనే చేసేస్తారు, వాటికన్నా పేడ దుర్వాసన ఏమీ కాదే? మరి మీ పిల్లలను గొడ్ల చావడిలో తోలేస్తారా?! నీతి: అమ్మో! అనుకున్న ప్రతిది జరిగిపోతేనో?
కాబట్టి: " అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషిపని" :)
ఇంకా ఆంగ్ల సంవత్సరమేనా? వాళ్ళ చేయిదాటి, అంతర్జాతీయమైంది. మీకు అంతర్జాతీయ కొత్త వుగాది శభాకాంక్షలు. :)

When I see Snkr's comments. It seems he doesn't know that shoes must be kept in their place but not beside god.
Forgetting the truth in it, seeking logic out of it mechanically is, not wisdom.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu